Search

పిఎంఇండియాపిఎంఇండియా

వ్య‌క్తిగ‌త జీవితం


భార‌త ప్ర‌జ‌ల చ‌రిత్రాత్మ‌క తీర్పుతో దేశ ప్ర‌ధానిగా న‌రేంద్రమోదీ 2014, మే 26వ తేదీ సాయంత్రం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డంతో రాష్ట్రప‌తి భ‌వ‌న్ చ‌రిత్ర పుట‌ల్లో కొత్త అధ్యాయం అవిష్కృత‌మైంది. న‌రేంద్ర‌మోదీలో ప్ర‌జ‌లు ఒక విశిష్ట‌మైన, నిర్ణ‌యాత్మ‌క‌మైన, అభివృద్ధిప‌ట్ల స్ప‌ష్ట‌మైన దృక్ప‌థం క‌లిగిన నాయ‌కుని చూశారు. కోట్లాది మంది భార‌తీయులు క‌ల‌ల‌కు, ఆకాంక్ష‌ల‌కు ఆయ‌న ఆశాకిర‌ణం అయ్యారు. అభివృద్ధిపై దృష్టి, నిరుపేద‌ల జీవితాల్లో మెరుగైన మార్పు తీసుకురావాల‌న్న‌ దృక్ప‌థం న‌రేంద్ర‌మోదీని యావ‌త్ భార‌తావ‌నికి ప్ర‌జాధ‌ర‌ణ క‌లిగిన, గౌర‌వప్ర‌ద‌మైన నేత‌గా నిల‌బెట్టాయి.

న‌రేంద్ర‌మోదీ జీవ‌న ప్ర‌స్థానం ధైర్య‌సాహ‌సాలు, ద‌య‌, నిరంత‌ర శ్ర‌మ‌తో సాగింది. ప్ర‌జాసేవ‌కు జీవితాన్ని అంకితం చేయాల‌ని ఆయ‌న చాలా చిన్న వ‌య‌సులోనే నిర్ణ‌యం తీసుకున్నారు. అట్ట‌డుగు స్థాయి కార్మికునిగా, ఒక నిర్వాహ‌కునిగా, ఒక ప‌రిపాల‌కునిగా ఆయ‌న త‌న నైపుణ్యాల‌ను చాటుకున్నారు. స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌కు 13 ఏళ్ళ‌పాటు ముఖ్య‌మంత్రిగా ప్ర‌జానుకూల విధానాల‌తో చురుకైన సుప‌రిపాల‌న అందించి ప్ర‌జ్ఞా పాట‌వాల‌ను చాటుకున్నారు.

తొలినాళ్ళ‌లో….

ప్ర‌ధాన‌మంత్రి పీఠంవైపు సాగిన న‌రేంద్ర‌మోదీ స్ఫూర్తిదాయ‌క జీవితం ఉత్త‌ర గుజ‌రాత్ మెహ్‌స‌నా జిల్లాలోని చిన్న ప‌ట్ట‌ణం వ‌డ్‌న‌గ‌ర్‌లో ప్రారంభ‌మైంది. 1950, సెప్టెంబ‌ర్ 17న అంటే, భార‌త్‌కు స్వాతంత్య్రం వ‌చ్చిన మూడేళ్ళ త‌రువాత మోదీ జ‌న్మించారు. స్వ‌తంత్ర భార‌తావ‌నికి తొలి ప్ర‌ధాని జ‌న‌నంగా ఇది భావించ‌ద‌గింది. దామోద‌ర్‌దాస్ మోదీ, హీరాబా మోదీ దంప‌తుల‌కు మూడో సంతానంగా మోదీ జ‌న్మించారు. గౌర‌వ‌నీయ‌మైన‌, ఆద‌ర్శ‌వంత‌మైన కుటుంబం నుంచి మోదీ ఆవిర్భ‌వించారు. మొత్తం కుటుంబం సుమారు 40/12 అడుగుల ఒకే అంత‌స్తు గ‌ల చిన్న ఇంట్లో నివ‌సించేవారు.

న‌రేంద్ర‌మోదీకి బాల్యం చేదు పాఠాలు నేర్పింది. ఆయ‌న చ‌దువుకు ఇబ్బందులు ఎదుర‌య్యేవి. కుటుంబ జీవ‌నం సాగ‌డం కోసం వారికి గ‌ల టీ దుకాణంలో న‌రేంద్ర‌మోదీ ప‌నిచేయాల్సి వ‌చ్చేది. బాలునిగా కూడా ఆయ‌న చాలా శ్ర‌మించేవాడ‌ని, చ‌ర్చా గోష్ఠులంటే ఇష్ట‌ప‌డేవాడ‌ని, పుస్త‌కాలు చ‌ద‌వ‌డానికి ఆస‌క్తి చూపేవాడ‌ని ఆయ‌న స్కూల్ స్నేహితులు చెబుతారు. స్థానిక గ్రంథాల‌యంలో పుస్త‌క ప‌ఠ‌నంతో మోదీ గంట‌ల త‌ర‌బ‌డి గ‌డిపేవార‌ని స్కూల్ మాస్ట‌ర్లు గుర్తు చేస్తారు. ఈత కొట్ట‌డం చిన్న‌త‌నం నుంచే ఆయ‌న‌కు చాలా ఇష్టం.

బాల్యంలో మోదీ ఆలోచన‌లు, క‌ల‌లు ఆయ‌న‌లో వ‌య‌సులో ఉన్న చాలా మంది పిల్ల‌ల‌తో పోలిస్తే భిన్నంగా ఉండేవి. బ‌హుశా ఇందుకు ఒక‌ప్పుడు ప్ర‌ముఖ బౌద్ధ కేంద్రంగా ఉన్న వ‌డ్‌న‌గ‌ర్ ప్ర‌భావం కావ‌చ్చు. స‌మాజం మారాల‌ని ఆయ‌న ఆకాంక్షించేవారు. ఆధ్యాత్మికత‌ దిశ‌గా ఆయ‌న యాత్ర‌కు స్వామీ వివేకానంద స్ఫూర్తి ప్ర‌దాత‌. వివేకానందుని జీవితం ఆయ‌న‌ను చాలా ప్ర‌భావితం చేసింది. భార‌త్‌ను జ‌గ‌ద్గురుగా – అంటే ప్ర‌పంచానికి సార‌ధిగా మార్చాల‌న్న స్వామీజీ క‌ల‌ను నెర‌వేర్చే ల‌క్ష్యం కూడా ఆయ‌న‌కు స్ఫూర్తిదాయ‌క‌మైంది.

17 ఏళ్ళ వ‌య‌సులో మోదీ ఇల్లు విడిచి దేశ‌మంతా తిరిగారు. రెండేళ్ళ‌పాటు వివిధ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి వివిధ సంస్కృతుల‌ను అధ్య‌యనం చేశారు. పూర్తి ప‌రిణతితో, మార్పుతో ఇంటికి తిరిగివ‌చ్చారు. అప్ప‌టికీ జీవితంలో ఏం సాధించాల‌నుకుంటున్నార‌న్న ల‌క్ష్యం ఆయ‌న‌లో క‌నిపించింది. అహ్మ‌దాబాద్ వెళ్ళి రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్‌)లో చేరారు. ఆర్.ఎస్‌.ఎస్‌. ఒక సామాజిక‌, సాంస్కృతిక సంస్థ‌. దేశంలో సామాజిక, సాంస్కృతిక పున‌రుజ్జీవ‌నం కోసం ప‌నిచేస్తున్న సంస్థ‌. 1972లో ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్ర‌చార‌కునిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిననాటి నుంచి న‌రేంద్ర‌మోదీ నిత్య జీవితం సంక్లిష్టంగా మారింది. తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు మొద‌ల‌య్యే ఆయ‌న జీవితం రాత్రి బాగా పొద్దుపోయే వ‌ర‌కు హ‌డావుడిగా సాగేది. 1970 ద‌శ‌కం చివ‌రి భాగంలో కూడా యువ న‌రేంద్ర‌మోదీ జీవితం – ఎమ‌ర్జ‌న్సీలో మ‌గ్గిన ఇండియాలో ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణ ఉద్య‌మంలో తీరిక లేకుండా సాగింది.

1980 ద‌శ‌కంలో సంఘ్‌లో వివిధ బాధ్య‌త‌ల‌ను త‌న భుజ‌స్కందాల‌పై మోస్తూ న‌రేంద్ర‌మోదీ త‌న నిర్వ‌హ‌ణా నైపుణ్యాల‌తో ఆర్గ‌నైజ‌ర్ స్థాయికి ఎదిగారు. 1987లో న‌రేంద్ర‌మోదీ జీవితంలో మ‌రో భిన్న‌మైన అధ్యాయం మొద‌లైంది. గుజ‌రాత్‌లో బిజెపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. తొలిసారిగా జ‌రిగిన అహ్మ‌దాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో బిజెపిని విజ‌య‌ప‌థంలో న‌డిపించారు. 1990 గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు అతి చేరువ‌గా బిజెపికి రెండ‌వ స్థానం సాధించిపెట్టారు. 1990 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోదీ నిర్వ‌హ‌ణప‌ర‌మైన నైపుణ్యాలు బిజెపి ఓట్ల‌ను గ‌ణ‌నీయంగా పెంచాయి. ఆ పార్టీ అసెంబ్లీలో 121 స్థానాలు గెలుచుకుంది.

1995 నుంచి న‌రేంద్ర‌మోదీ బిజెపి జాతీయ కార్య‌ద‌ర్శిగా హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో పార్టీ బాధ్య‌త‌ల‌ను భుజాల‌కు ఎత్తుకున్నారు. బిజెపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా 1998 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బిజెపి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. 2001, సెప్టెంబ‌ర్‌లో ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయి నుంచి అందిన ఫోన్‌కాల్ తో న‌రేంద్ర‌మోదీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి గంద‌ర‌గోళ‌ప‌రిచే సంస్థాగ‌త రాజ‌కీయాల‌ నుంచి ప‌రిపాల‌నా ప్ర‌పంచంలోకి మోదీ అడుగుపెట్టారు. న‌రేంద్ర‌మోదీ వ్య‌క్తిగ‌త జీవితంపై మ‌రిన్ని వివ‌రాల కోసం చూడండి. http://www.narendramodi.in/humble-beginnings-the-early-years/

ప‌రిపాల‌నా కాలం

భార‌తీయ జ‌న‌తా పార్టీకి అత్యంత అవ‌స‌ర‌మైన సంస్థాగ‌త వ్య‌క్తి స్థాయి నుంచి భార‌త‌దేశానికి అత్యంత సుప‌రిచిత నేత‌ల్లో ఒక‌రిగా న‌రేంద్ర‌మోదీ గుర్తింపు పొంద‌డానికి ద‌శాబ్దంపాటు సాగిన‌ ఆయ‌న సుప‌రిపాల‌నే కార‌ణం. తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల మ‌ధ్య ఆయ‌న దృఢ‌మైన, ప‌టిష్ట‌మైన నాయ‌క‌త్వ ప‌టిమ దేశానికి ప్ర‌ద‌ర్శిత‌మైంది. పార్టీ రాజ‌కీయాల ప్ర‌పంచం నుంచి పాల‌న దిశ‌గా న‌రేంద్రమోదీ ప్ర‌స్థానానికి స‌మ‌యం లేదా శిక్ష‌ణ ప్ర‌మేయం లేదు. ప‌ద‌విలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే ఆయ‌న పాల‌న ప‌ద్ధ‌తుల‌ను అవ‌గ‌తం చేసుకున్నారు. ప‌ద‌విలో గ‌డిచిన తొలి 100 రోజుల్లోనే మోదీ వ్య‌క్తిగ‌త ప్ర‌తిభ‌ను చాట‌డంతోపాటు కాలం చెల్లిన పాత ఆలోచ‌న‌ల‌కు తెరదించి పాల‌న‌లో కొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టారు.. సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లికారు.

అభివృద్ధి, సుప‌రిపాల‌న‌కు సంబంధించి ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నంగా ఉజ్వ‌ల గుజ‌రాత్‌ను ఏర్ప‌రిచే దిశ‌గా న‌రేంద్ర‌మోదీ ఎంచుకున్న బాట సుల‌భ‌మైంది కాదు. అనేక ప్ర‌తికూల‌త‌లు, స‌వాళ్ళు ఆ మార్గానికి ప్ర‌తిబంధ‌క‌మ‌య్యాయి. గ‌త ద‌శాబ్ద కాల‌మంతా న‌రేంద్ర‌మోదీ నాయ‌క‌త్వానికి తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. ప‌రిపాల‌న విష‌యంలో ఆయ‌న అనుస‌రించిన విధానాలు రాజ‌కీయాల‌కు పూర్తిగా అతీత‌మైన‌వి. అభివృద్ధి స‌వాళ్ళ‌ను ప‌రిష్క‌రించుకోవ‌డంలో రాజ‌కీయ విభేదాల‌కు మోదీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. భార‌త ప్ర‌ధాని ప‌ద‌విని చేప‌ట్ట‌డానికి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు కూడా న‌రేంద్ర‌మోదీ ఆలోచ‌నా ధోర‌ణి రాజ‌కీయాల‌కు అతీతంగానే సాగింది. అభివృద్ధి, సుప‌రిపాల‌నే ఆయ‌న అంతిమ ల‌క్ష్యాల‌య్యాయి. ఆయ‌న న‌మ్మిన ‘క‌నీస ప్ర‌భుత్వం – గ‌రిష్ఠ పాల‌న’ సూత్రాన్నే ఆయ‌న “పంచ్‌ – అమృత్” ప‌త్రంలో పొందుప‌రిచారు.

మోదీ ప్ర‌భుత్వం జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియాల నుంచి అందుకున్న అనేక అవార్డుల‌లో ఆయ‌న ప‌నితీరు ప్ర‌తిఫ‌లించింది. భార‌తదేశ‌పు అత్యంత విజ‌య‌వంత‌మైన ముఖ్య‌మంత్రుల్లో ఒక‌రుగా, గొప్ప ప‌రిపాల‌నా ద‌క్ష‌త క‌లిగిన‌వారిలో ఒక‌రుగా న‌రేంద్ర‌మోదీ సుసంప‌న్నమైన అనుభ‌వంతో భార‌త ప్ర‌ధాని ప‌గ్గాలు చేప‌ట్టారు.

లోడ్ అవుతోంది... Loading