Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ, మరాఠీ భాషకు సంబంధించి రాజధానిలో ఏర్పాటు చేసిన అద్భుతమైన కార్యక్రమంలో మారాఠీ వారందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ఒక భాషకి  లేదా ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదని, స్వాతంత్య్ర పోరాట సారాన్ని, మహారాష్ట్ర, దేశ సంస్కృతీ వారసత్వాన్ని కలబోసుకున్నదని అన్నారు.

1878లో ఏర్పాటైన మొదటి సమ్మేళనం నుండీ ఇప్పటి వరకు 147 సంవత్సరాల దేశ చరిత్రకు అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం సాక్షిగా నిలిచిందని శ్రీ మోదీ అన్నారు. గతంలో జరిగిన సమ్మేళనాలకి  శ్రీ మహాదేవ్ గోవింద్ రనడే, హరి నారాయణ ఆప్టే, మాధవ్ శ్రీహరి అణె, శివరామ్ పరాంజపే, వీర సావర్కర్  వంటి మహనీయులు అధ్యక్షత వహించారని తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక ఉత్సవానికి తనను ఆహ్వానించిన శ్రీ శరద్ పవార్ కు  కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరాఠీ అభిమానులకు అభినందనలు తెలిపారు.

ఈ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవమని గుర్తు చేసిన ప్రధాని, మరాఠీ భాషను తలుచుకోగానే సహజంగానే సంత్ ధ్యానేశ్వర్  పద్యాలు గుర్తుకొస్తాయన్నారు. సంత్ ధ్యానేశ్వర్ శ్లోకాన్ని ఆలపించిన శ్రీ మోదీ, మరాఠీ భాష తేనెకన్నా మధురంగా ఉంటుందని, అందుకే మరాఠీ భాష సంస్కృతుల పట్ల తనకు అపరిమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని  చెప్పారు. కార్యక్రమంలో పాల్గొంటున్న భాషావేత్తలు, పండితులతో పోలిస్తే,  మరాఠీ భాషలో వారికి గల  సాధికారత తనకు లేదని, అయితే మరాఠీ నేర్చుకునేందుకు తన ప్రయత్నం కొనసాగుతోందని ప్రధానమంత్రి అన్నారు.

దేశం చత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవాన్ని వేడుక చేసుకుంటున్న సందర్భం… పుణ్యశ్లోక అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి, బాబాసాహెబ్ అంబేడ్కర్ మొక్కవోని కృషి  వల్ల సాకారమైన మన రాజ్యాంగం 75వ వార్షికోత్సవాలు జరుగుతున్న వేళ… ఈ సమ్మేళనం ఏర్పాటుకావ‌డం మోదాన్ని కలిగిస్తోందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.  శతాబ్దం క్రితం మహారాష్ట్ర నేలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం (ఆర్ ఎస్ ఎస్) విత్తనాన్ని ఒక మహానుభావుడు నాటారని, నేడు ఆర్ ఎస్ ఎస్ శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమై శతాబ్ది వేడుకలని జరుపుకుంటోందని ఆనందం వ్యక్తం చేశారు. గత 100 సంవత్సరాలుగా వేదాల నుంచి వివేకానందుడి వరకూ భారతదేశపు గొప్ప సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షిస్తూ, ఆర్ ఎస్ ఎస్ ఆ వారసత్వాన్ని కొత్త తరాలకు పరిచయం చేస్తోందని అన్నారు.  దేశం కోసం బతకాలన్న స్ఫూర్తి లక్షలాది మందితో పాటు తనకు కూడా ఆర్ ఎస్ ఎస్ ద్వారానే లభించిందని, మరాఠీ భాష,  సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశాన్ని సంస్థే కలిగించిందని అన్నారు. కొన్ని నెలల క్రితమే మరాఠీ భాషకు  ప్రాచీన భాష హోదా లభించిందని గుర్తు చేస్తూ, ఈ గుర్తింపు కోసం ప్రపంచవ్యాప్తంగా గల 12 కోట్లకు పైగా మరాఠీ మాట్లాడేవారు అనేక దశాబ్దాల పాటు నిరీక్షించారని అన్నారు.  వారి కల‌ను సాకారం చేసే అపురూపమైన అవకాశం తనకు లభించడం  అదృష్టంగా భావిస్తున్నానని శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.

“భాష కేవలం ఒకరితో ఒకరు సంభాషించుకునే మాధ్యమం మాత్రమే కాదు. మన భాషే మన సాంస్కృతిక దూత” అని ప్రధాని అన్నారు. భాషలు సమాజంలో జన్మించినప్పటికీ సమాజాన్ని తీర్చిదిద్దడంలో అవి ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పారు.  మరాఠీ భాష  మహారాష్ట్రలో అనేక గొప్ప వ్యక్తుల ఆలోచనలకు రూపం ఇచ్చి మన సంస్కృతి అభివృద్ధికి దోహదపడిందని  శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సమర్థ్  రాందాస్ మాటలను ఉటంకిస్తూ, “మరాఠీ పరిపూర్ణమైన భాష..  శౌర్యం, అందం, సున్నితత్వం, సమానత్వం, సమగ్రత, ఆధ్యాత్మికత, ఆధునికతలను పొదువుకున్న భాష ..” అన్నారు. మరాఠీ భాష భక్తి, బలం, మేధలను కూడా ప్రతిబింబిస్తుందని  ప్రధానమంత్రి చెప్పారు.

దేశానికి ఆధ్యాత్మిక బలం అవసరమైనప్పుడు రాష్ట్రానికి చెందిన మహాత్ముల, రుషుల విజ్ఞానం మరాఠీ భాష ద్వారా ప్రజలకు అందిందని అన్నారు. సంత్ జ్ఞానేశ్వర్, సంత్ తుకారాం, సంత్ రామదాస్, సంత్ నామదేవ్, సంత్ తుకడోజీ మహరాజ్, గాడ్గే బాబా, గోరా కుంభార్, బహీనాబాయి వంటి ఉత్తములు భక్తి ఉద్యమం ద్వారా సమాజానికి కొత్త బాటను చూపారని అన్నారు. ఆధునిక కాలంలో శ్రీ గజానన్ దిగంబర్ మాడ్గుల్కర్, శ్రీ సుధీర్ ఫడ్కే గార్ల గీత రామాయణం ఎంతో ప్రభావం చూపిందని ప్రధానమంత్రి తెలిపారు.  

శతాబ్దాల పాటు సాగిన అణచివేతలో, మరాఠీ భాష ఆక్రమణదారుల నుండి విముక్తి పొందే ప్రకటనగా మారిందని చెబుతూ, శత్రువులతో వీరోచితంగా పోరాడిన ఛత్రపతి శివాజీ మహారాజ్, శంభాజీ మహారాజ్,  బాజీరావ్ పేష్వా వంటి మరాఠా యోధుల పరాక్రమాన్ని ప్రధాని ప్రస్తావించారు.

స్వాతంత్య్ర పోరాటంలో వాసుదేవ్ బలవంత్ ఫడ్కే, లోకమాన్య తిలక్, వీర సావర్కర్ వంటి వీరులు బ్రిటీషు వారి కార్యకలాపాలకు ఆటంకం కలిగించారని గుర్తు చేశారు. వారి చేపట్టిన పనుల్లో మరాఠీ భాష, సాహిత్యాలు కీలక పాత్ర పోషించాయన్నారు. కేసరి, మరాఠా వంటి పత్రికలు, గోవిందాగ్రజ్ కవితలు,  రామగణేశ్ గడ్కరీ నాటకాలు జాతీయతా భావానికి ప్రాణం పోశాయన్నారు. లోకమాన్య తిలక్ గీత రహస్యాన్ని మారాఠీలోనే రచించారని, అది దేశంలో నూతనోత్తేజానికి కారణమయ్యిందని అన్నారు.

“సమాజంలోని అణగారిన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం మరాఠీ భాష, సాహిత్యం అందించిన తోడ్పాటు మరవలేనిది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మరాఠీలో ఆధునిక ఆలోచనలకు బీజం వేసిన జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, మహర్షి కార్వే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి గొప్ప సామాజిక సంస్కర్తల కృషిని ఆయన శ్లాఘించారు. మరాఠీ భాష దేశానికి గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆధునిక ఆలోచనా ధోరణి కారణంగా, మరాఠీ సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్‌ కూడా భాగమైందన్నారు. గతంలో ఆయుర్వేదం, సైన్స్, తర్కంలో మహారాష్ట్ర ప్రజల అసాధారణ సహకారాన్ని ప్రశంసించిన శ్రీ మోదీ, ఈ సంస్కృతి ఎల్లప్పుడూ కొత్త ఆలోచనలను, ప్రతిభను స్వాగతిస్తూ మహారాష్ట్ర పురోగతికి ఊతమిచ్చిందని పేర్కొన్నారు. మహారాష్ట్రకే కాకుండా మొత్తం దేశానికి ముంబయి ఆర్థిక రాజధానిగా అవతరించిందన్నారు. ముంబయి గురించి మాట్లాడే ప్రతి సందర్భంలో సినిమాల ప్రస్తావన లేకుండా సాహిత్య చర్చ ఏదీ పరిపూర్ణం కాలేదని ప్రధాని వ్యాఖ్యానించారు. మరాఠీ, హిందీ సినిమాలు రెండింటినీ ముంబయి, మహారాష్ట్ర ఎంతగానో ఆదరించాయన్నారు. శివాజీ సావంత్ మరాఠీ నవల ద్వారా శంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని పరిచయం చేస్తూ రూపొందించిన ఇటీవలి చిత్రం ‘ఛావా’ విశేష జనాదరణ పొందుతున్నదని గుర్తుచేశారు.

కవి కేశవసుత్‌ గురించి ఉటంకిస్తూ, మనం పాత ఆలోచనలకే పరిమితమై ఉండలేమని, మానవ నాగరికత, ఆలోచనలు, భాష నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉన్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతరం అభివృద్ధి చెందుతూ, కొత్త ఆలోచనలను స్వీకరిస్తూ, మార్పులను స్వాగతిస్తూ భారత్ ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన దేశాల్లో ముందువరుసలో నిలిచిందని ప్రధానమంత్రి తెలిపారు. విస్తృత భాషా వైవిధ్యం ఈ పరిణామానికి నిదర్శనమన్న ఆయన, మన ఐక్యతకు ఇది ప్రాథమిక ఆధారంగా ఉందన్నారు. ఈ వైవిధ్యానికి మరాఠీ భాష చక్కని ఉదాహరణగా నిలుస్తుందన్న ప్రధానమంత్రి, వివక్షత లేకుండా తన పిల్లలకు సరికొత్త, విస్తారమైన జ్ఞానాన్ని పంచే తల్లి వంటిదే భాష అని వ్యాఖ్యానించారు. భాష ప్రతి ఆలోచనను, ప్రతి అభివృద్ధిని స్వీకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. మరాఠీ భాష సంస్కృతం నుంచి ఉద్భవించిందనీ, ప్రాకృత భాషా ప్రభావం ఈ భాషపై గణనీయంగా ఉందని శ్రీ మోదీ తెలిపారు. మానవ ఆలోచనల పరిధిని విస్తృతం చేసిన గొప్ప ఆలోచనాపరులు, రచయితల సహకారాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. సంస్కృత గీతను చక్కగా వివరించి, మరాఠీ భాషలో దానిని మరింత అందుబాటులోకి తెచ్చిన లోకమాన్య తిలక్ గీతా రహస్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంస్కృతంలోని జ్ఞానేశ్వరి గీతకు అందించిన మరాఠీ వ్యాఖ్యానంతో అది పండితులు, సాధువులు సులువుగా అర్థం చేసుకోగల ఒక ప్రామాణిక గ్రంథంగా మారిందన్నారు. మరాఠీ ఇతర భారతీయ భాషల ద్వారా సుసంపన్నమైందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘ఆనంద్‌మఠ్’ వంటి రచనకు భార్గవ్‌రామ్ విఠల్ వారేకర్ అందించిన మరాఠీ అనువాదం, అలాగే పన్నా ధాయ్, దుర్గావతి, రాణి పద్మిని జీవితాల ఆధారంగా రాసిన విందా కరాండికర్ రచనలు అనేక భాషల్లోకి అనువాదమైన ఉదాహరణలను ప్రధానమంత్రి ఉటంకించారు. “భారతీయ భాషలకు ఎప్పుడూ పరస్పర శత్రుత్వం లేదు; బదులుగా, అవి ఎల్లప్పుడూ ఒకదాని గొప్పతనాన్ని మరొకటి స్వీకరించుకుంటూ సుసంపన్నం అయ్యాయి” అని ఆయన వ్యాఖ్యానించారు.

భాష పేరుతో జరుగుతున్న విభజనను ప్రయత్నాలను మన భాషల ఉమ్మడి వారసత్వం ప్రతిఘటిస్తుందన్న ప్రధానమంత్రి, అలాంటి కుట్రలకు దూరంగా ఉంటూ మన భాషలను సుసంపన్నం చేసుకుని, స్వీకరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు. నేడు దేశంలోని అన్ని భాషలకు సమాన గౌరవం లభిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మరాఠీ సహా అన్ని ప్రధాన భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో యువతకు మరాఠీలోనే ఉన్నత విద్య, ఇంజనీరింగ్, వైద్య విద్యలను అభ్యసించే అవకాశం లభించిందని శ్రీ మోదీ తెలిపారు. ఆంగ్లభాషలో ప్రావీణ్యం లేని కారణంగా ప్రతిభను విస్మరించే ధోరణి నేడు పూర్తిగా మారిందని ఆయన స్పష్టం చేశారు.

“సాహిత్యం సమాజానికి దర్పణం లాంటిది, మార్గదర్శి లాంటిది” అని శ్రీ మోదీ అన్నారు. దేశంలో సాహిత్య సమ్మేళన్, సంబంధిత సంస్థల కీలక పాత్ర గురించి వ్యాఖ్యానిస్తూ. గోవింద్ రనడే, హరినారాయణ్ ఆప్టే, ఆచార్య ఆత్రే, వీర్ సావర్కర్ వంటి గొప్ప వ్యక్తులు అందించిన ఆదర్శాలను అఖిల భారత మరాఠీ సాహిత్య మహామండలి కొనసాగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2027లో 150 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సాహిత్య సమ్మేళన్ సంప్రదాయాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, అది 100వ సాహిత్య సమ్మేళన్ కానుందని తెలిపారు. ఈ ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి ఇప్పుడే సన్నాహాలు ప్రారంభించాలని ఆయన కోరారు. సోషల్ మీడియా ద్వారా మరాఠీ సాహిత్యానికి సేవలందిస్తున్న చాలా మంది యువత కృషిని ఆయన ప్రశంసించారు. వారి ప్రతిభను గుర్తించే ఒక వేదికను ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, భాషిణి వంటి కార్యక్రమాల ద్వారా మరాఠీ అభ్యాసాన్ని ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. యువతలో మరాఠీ భాష, సాహిత్యానికి సంబంధించిన పోటీలు నిర్వహించాలని ఆయన సూచించారు. మరాఠీ సాహిత్యం నుంచి వచ్చే ఈ ప్రయత్నాలు, ప్రేరణలు 140 కోట్ల మంది పౌరులను వికసిత్ భారత్ సాధన కోసం శక్తిమంతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహాదేవ్ గోవింద్ రనడే, హరినారాయణ్ ఆప్టే, మాధవ్ శ్రీహరి ఆనే, శివరామ్ పరంజపే వంటి విశిష్ట వ్యక్తుల గొప్ప సంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రతి ఒక్కరినీ కోరుతూ తన ప్రసంగాన్ని ముగించిన ప్రధానమంత్రి, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్యసభ సభ్యులు శ్రీ శరద్ పవార్, 98వ సమ్మేళన్ అధ్యక్షులు డాక్టర్ తారా భావల్కర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

నేపథ్యం

98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళన్ ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరగనుంది. ప్రముఖ సాహిత్యవేత్తలతో వివిధ అంశాలపై ప్యానెల్ చర్చలు, పుస్తక ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ సెషన్‌లను ఈ సమ్మేళన్ నిర్వహిస్తుంది. ఈ సమ్మేళన్ మరాఠీ సాహిత్య కాలాతీత ఔచిత్యాన్ని చాటుతూ, భాషా పరిరక్షణ, అనువాదం, సాహిత్య రచనలపై డిజిటలైజేషన్ ప్రభావం వంటి ఇతివృత్తాలు సహా సమకాలీన చర్చలో దాని పాత్రను తెలియజెప్పనుంది.

71 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో జరుగుతున్న మరాఠీ సాహిత్య సమావేశంలో, సాహిత్య ఏకీకరణ స్ఫూర్తిని చాటుతూ పూణే నుంచి ఢిల్లీ వరకు పన్నెండు వందల మందితో సాగిన ఒక సాహిత్య రైలు ప్రయాణం కూడా భాగంగా ఉంది. ఈ సమావేశాల్లో 2,600లకి పైగా కవితా సమర్పణలు, 50 పుస్తక ఆవిష్కరణలు, 100 పుస్తక దుకాణాలు మొదలైనవి ఉంటాయి. దేశం నలుమూలల నుంచి ప్రముఖ పండితులు, రచయితలు, కవులు, సాహిత్య ఔత్సాహికులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు.