Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

90వ ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం


కేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగి శ్రీ అమిత్ షా,  ఇంటర్‌ పోల్ అధ్యక్షుడు శ్రీ అహ్మద్ నాజర్ అల్-రైసీ,  ఇంటర్‌ పోల్ సెక్రటరీ జనరల్ శ్రీ జుర్గెన్ స్టాక్, సి.బి.ఐ. డైరెక్టర్ శ్రీ ఎస్.కె. జైస్వాల్,  విశిష్ట ప్రతినిధులతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ,  90వ ఇంటర్‌ పోల్ సర్వసభ్య సమావేశానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

భారతదేశం మరియు ఇంటర్‌ పోల్ రెండింటికీ ముఖ్యమైన ఈ సమయంలో మీరు ఇక్కడకు రావడం చాలా గొప్ప విషయం.   భారతదేశం 2022 లో 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటోంది.   ఇది మన ప్రజలు, సంస్కృతి, విజయాల వేడుక.  ఎక్కడి నుంచి వచ్చామో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన సమయం ఇది.  అదేవిధంగా, మనం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నామో కూడా చూసుకోవాల్సిన సమయం.  ఇంటర్‌ పోల్ కూడా చారిత్రక మైలురాయిని చేరుకుంటోంది.  2023 లో, ఇంటర్ పోల్ స్థాపించి, 100 సంవత్సరాల పండుగను జరుపుకోనుంది.   ఆనందించడానికి, ప్రతిబింబించడానికి ఇది ఒక మంచి సమయం.  పరాజయాల నుంచి నేర్చుకోండి, విజయాలను జరుపుకోండి, ఆపై భవిష్యత్తును ఆశతో చూడండి.

మిత్రులారా, 

ఇంటర్ పోల్ భావన భారతీయ తత్వశాస్త్రంలోని వివిధ అంశాలతో అనుసంధానాన్ని కలిగిఉంది.   ఇంటర్ పోల్ నినాదం: సురక్షితమైన ప్రపంచం కోసం పోలీసులను అనుసంధానం చేయడం.  ప్రపంచంలోని పురాతన గ్రంథాలలో ఒకటిగా వేదాలను గురించి మీలో చాలా మంది విని ఉండవచ్చు.  వేదాలలోని ఒక శ్లోకం ఇలా చెబుతోంది: “ నో భద్రః క్రతవో యంతు విశ్వతః  అంటే, అన్ని దిశల నుండి గొప్ప ఆలోచనలు రావాలి. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సార్వత్రిక సహకారం కోసం ఇది ఒక పిలుపు.  భారతదేశ ఆత్మలో ఒక ప్రత్యేకమైన ప్రపంచ దృక్పథం ఉంది.  అందుకే, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలకు ధైర్యవంతులైన పురుషులు, మహిళలను పంపడంలో భారతదేశం అగ్రగామిగా ఉంది.  మాకు స్వాతంత్య్రం రాకముందే, ప్రపంచాన్ని ఒక అనువైన ప్రదేశంగా మార్చడానికి మేము త్యాగాలు చేసాము.  ప్రపంచ యుద్ధాల్లో వేలాది మంది భారతీయులు పోరాడి, వీర మరణం పొందారు.  వాతావరణ లక్ష్యాల నుండి కోవిడ్ టీకాల వరకు, ఎలాంటి సంక్షోభంలోనైనా నాయకత్వం వహించడానికి భారతదేశం సుముఖత చూపింది.  దేశాలు, సమాజాలు అంతర్గతంగా చూస్తున్న తరుణంలో, ఇప్పడు, భారతదేశం అంతర్జాతీయ సహకారం కోసం మరింత ఎక్కువగా కృషి చేస్తోంది.  స్థానిక సంక్షేమానికి ప్రపంచ సహకారం అనేది మా పిలుపు.

మిత్రులారా, 

ప్రాచీన భారతీయ తత్వవేత్త అయిన చాణక్యుడు చట్టాన్ని అమలు చేసే తత్వ శాస్త్రాన్ని ఉత్తమంగా వివరించాడు.   आन्वीक्षकी त्रयी वार्तानां योग-क्षेम साधनो दण्डः। तस्य नीतिः दण्डनीतिः; अलब्धलाभार्था, लब्धपरिरक्षणी, रक्षितविवर्धनी, वृद्धस्य तीर्थेषु प्रतिपादनी च ।  దీని అర్థం, చట్టాన్ని అమలు చేయడం ద్వారా సమాజం యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక సంక్షేమాన్ని పరిరక్షించాలి.   చాణక్యుడు ప్రకారం చట్టం అమలు అంటే – మనకు లేని వాటిని పొందడంలో, మనకు ఉన్నదాన్ని రక్షించడంలో, మనం రక్షించిన వాటిని పెంచడంలో అదేవిధంగా అత్యంత అర్హులైన వారికి పంపిణీ చేయడంలో చట్టం సహాయపడుతుంది.  ఇది చట్టం అమలు యొక్క సమగ్ర వీక్షణగా పరిగణించాలి.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలు ప్రజలను రక్షించడంతో పాటు, సామాజిక సంక్షేమాన్ని కూడా చూడాలి.  ఏదైనా సంక్షోభ పరిష్కారం విషయంలో సమాజ ప్రతిస్పందనలో వారు కూడా ముందు వరుసలో ఉంటారు.  కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇది ఎక్కువగా అవగతమయ్యింది.   ప్రపంచవ్యాప్తంగా, ప్రజలకు సహాయం చేయడానికి పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.  వారిలో చాలా మంది ప్రజల సేవలో అంతిమ త్యాగం కూడా చేశారు.  వారికి నా నివాళులర్పిస్తున్నాను.  ప్రపంచం స్తంభించి పోయినా, దాన్ని కాపాడే బాధ్యత మాత్రం పోదు.  మహమ్మారి సమయంలో కూడా  ఇంటర్ పోల్ నిర్విరామంగా సేవలందిస్తూనే ఉంది.

మిత్రులారా, 

భారతదేశ వైవిధ్యం మరియు స్థాయిని అనుభవించని వారికి ఊహించడం కష్టం.  ఎత్తైన పర్వత శ్రేణులు, ఎడారులు, దట్టమైన అడవులతో పాటు ప్రపంచంలోని అత్యంత జనసాంద్రత కలిగిన అనేక నగరాలకు భారతదేశం నిలయం.  భారతదేశం అంటే, అనేక ఖండాల లక్షణాలను కలిగిఉన్న ఒక దేశం.   ఉదాహరణకు, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, బ్రెజిల్ జనాభాకు దగ్గరగా ఉంది.  మన రాజధాని ఢిల్లీలో మొత్తం స్వీడన్ కంటే ఎక్కువ మంది ఉన్నారు.

మిత్రులారా, 

సమాఖ్య మరియు రాష్ట్ర స్థాయిలలోని భారతీయ పోలీసులు 900 కంటే ఎక్కువ జాతీయ మరియు దాదాపు పది వేల రాష్ట్ర చట్టాలను అమలు చేయడానికి సహకరిస్తారు.  దీనికి తోడు, భారతదేశ సమాజంలోని వైవిధ్యం.   ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.  వందలాది భాషలు, మాండలికాలు మాట్లాడతారు.  భారీ ఉత్సవాలు లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద, భారీ ఆధ్యాత్మిక సామూహిక సమావేశానికి 240 మిలియన్ల మంది యాత్రికులు పాల్గొనే కుంభమేళాను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  వీటన్నింటితో, రాజ్యాంగం వాగ్దానం చేసిన ప్రజల వైవిధ్యాన్నీ, హక్కులను గౌరవిస్తూ మన పోలీసు బలగాలు పనిచేస్తున్నాయి.   వారు ప్రజలను రక్షించడంతో పాటు, మన ప్రజాస్వామ్యానికి కూడా సేవ చేస్తున్నారు.  భారతదేశ ఉచిత, న్యాయమైన, భారీ ఎన్నికల స్థాయిని తీసుకోండి.  ఎన్నికలలో దాదాపు 900 మిలియన్ల ఓటర్లకు ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది.  ఇది ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల జనాభాకు దగ్గరగా ఉంటుంది.  దాదాపు 2.3 మిలియన్ల మంది పోలీసులను ఎన్నికల సహాయం కోసం మోహరించారు.  వైవిధ్యాన్నీ, ప్రజాస్వామ్యాన్ని సమర్థించడంలో, భారతదేశం ప్రపంచానికి ఒక అధ్యయన అంశంగా ఉంది. 

మిత్రులారా, 

చట్టపరమైన విధివిధానాలు, భాషలలో తేడాలు ఉన్నప్పటికీ, గత 99 సంవత్సరాలుగా, ఇంటర్ పోల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలలో పోలీసు సంస్థలను అనుసంధానిస్తోంది.   దీనికి గుర్తుగా, ఈరోజు ఒక స్మారక తపాలా బిళ్ళను, నాణెన్నీ విడుదల చేశారు.

మిత్రులారా,

గత విజయాలతో పాటు, ఈ రోజు నేను కొన్ని విషయాలను ప్రపంచానికి గుర్తు చేయాలని అనుకుంటున్నాను.  ఉగ్రవాదం, అవినీతి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వేటాడటం, వ్యవస్థీకృత నేరాల వంటి అనేక హానికరమైన ప్రపంచీకరణ బెదిరింపులను ప్రపంచం  ఎదుర్కొంటోంది.   ఈ ప్రమాదాల మార్పు వేగం మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది.  బెదిరింపులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పుడు, ప్రతిస్పందన కేవలం స్థానికంగా ఉంటే సరిపోదు.   ఈ బెదిరింపులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు ప్రపంచం మొత్తం ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమయ్యింది. 

మిత్రులారా,

భారతదేశం అనేక దశాబ్దాలుగా జాతీయాంతర ఉగ్రవాదంపై పోరాడుతోంది.  ప్రపంచం దాని గురించి మేల్కొలపడానికి చాలా కాలం ముందు, సురక్షితం, భద్రత యొక్క విలువ మాకు తెలుసు.  ఈ పోరాటంలో వేలాదిగా మన ప్రజలు ప్రాణత్యాగం చేశారు.  అయితే, ఇకపై తీవ్రవాదానికి వ్యతిరేకంగా భౌతిక ప్రదేశంలో మాత్రమే పోరాడితే సరిపోదు.  ఇది ఇప్పుడు ఆన్‌ లైన్ రాడికలైజేషన్ , సైబర్ బెదిరింపుల ద్వారా తన ఉనికిని చాటుతోంది.  ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా, దాడి చేయవచ్చు లేదా సిస్టమ్‌ లను పనిచేయకుండా చేయవచ్చు.  ప్రతి దేశం వారికి వ్యతిరేకంగా వ్యూహాలు పన్నుతోంది.  అయితే, మన సరిహద్దుల్లో మనం చేసేది చాలదు.  అంతర్జాతీయ వ్యూహాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.  ముందస్తు గుర్తింపు, హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు,  రవాణా సేవలను రక్షించడం,  కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల భద్రత, కీలకమైన మౌలిక సదుపాయాలకు భద్రత,  సాంకేతికత, సాంకేతిక సహాయం, మేధస్సు మార్పిడి,  వంటి అనేక అంశాలను కొత్త స్థాయికి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. 

మిత్రులారా,

అవినీతిని ప్రమాదకరమైన ముప్పుగా నేను ఎందుకు ప్రస్తావించానా, అని మీలో కొందరు ఆలోచిస్తూ ఉండవచ్చు.  అవినీతి, ఆర్థిక నేరాలు అనేక దేశాల పౌరుల సంక్షేమాన్ని దెబ్బతీశాయి.  ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నేరాల ద్వారా సమకూరిన ఆదాయాన్ని దాచుకునేందుకు అవినీతిపరులు ఒక మార్గాన్ని కనుగొంటారు.  ఈ డబ్బు వారు దోచుకున్న దేశ పౌరులకు చెందినది.  తరచుగా, ఇది ప్రపంచంలోని అత్యంత పేద వ్యక్తుల నుండి దోచుకోబడింది.   కాగా, అటువంటి డబ్బు దుష్ట కార్యకలాపాలకు వినియోగించబడుతోంది.   తీవ్రవాదుల నిధుల సమీకరణకు అందుబాటులో ఉన్న ప్రధాన వనరులలో ఇది ఒకటి.  యువ జీవితాలను నాశనం చేసే అక్రమ మాదకద్రవ్యాల నుండి మానవ అక్రమ రవాణా వరకు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచడం నుండి అక్రమ ఆయుధాల అమ్మకం వరకు, ఈ మురికి డబ్బు అనేక విధ్వంసక సంస్థలకు నిధులు సమకూరుస్తోంది.  అవును, వాటిని ఎదుర్కోడానికి విభిన్న చట్టపరమైన, విధానపరమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి.  ఏది ఏమైనప్పటికీ, ఇటువంటి సురక్షితమైన స్థావరాలను తొలగించడానికి ప్రపంచ సమాజం మరింత వేగంగా పని చేయాల్సిన అవసరం ఉంది.  అవినీతిపరులు, ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల కార్టెల్స్, వేట ముఠాలు లేదా వ్యవస్థీకృత నేరాలకు సురక్షితమైన స్థావరాలు ఉండకూడదు.   ఒక చోట వ్యక్తులు చేసే ఇటువంటి నేరాల ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతుంది, మానవత్వానికి తీరని మచ్చలు గా పరిణమిస్తాయి.   ఇంకా, ఇవి మన వర్తమానానికి హాని చేయడంతో పాటు, మన భవిష్యత్ తరాలను కూడా ప్రభావితం చేస్తాయి.  పోలీసులు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు సహకారాన్ని పెంచుకోవడానికి విధానాలు, ప్రోటో కాల్‌ లను రూపొందించాల్సిన అవసరం ఉంది.  పరారైన నేరస్థుల కోసం రెడ్ కార్నర్ నోటీసులను వేగవంతం చేయడం ద్వారా ఇంటర్ పోల్ సహాయపడుతుంది. 

మిత్రులారా, 

సురక్షితమైన, భద్రమైన ప్రపంచం మన భాగస్వామ్య బాధ్యత.  మంచి శక్తులు సహకరించినప్పుడు, నేర శక్తులు పనిచేయలేవు. 

మిత్రులారా, 

నా ప్రసంగాన్ని ముగించే ముందు, అతిథులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.  న్యూ ఢిల్లీ లోని నేషనల్ పోలీస్ మెమోరియల్ మరియు నేషనల్ వార్ మెమోరియల్‌ ని సందర్శించవలసిందిగా కోరుతున్నాను.  భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడానికి తమ ప్రాణాలను అర్పించిన వీరులకు మీరు నివాళులర్పించవచ్చు.  మీలో చాలా మందిలాగే వీరు కూడా తమ దేశం కోసం ఏదైనా చేయడానికి సంసిద్ధులైన పురుషులు మరియు మహిళలు.

మిత్రులారా,

కమ్యూనికేషన్, భాగస్వామ్యం, సహకారం అన్నీ కలిసి నేరం, అవినీతి, ఉగ్రవాదాన్ని ఓడించనివ్వండి.  90వ ఇంటర్‌ పోల్ జనరల్ అసంబ్లీ దీనికి సమర్థవంతమైన, విజయవంతమైన వేదికగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను.  ఈ ముఖ్యమైన కార్యక్రమానికి నేను మరోసారి, మీ అందరినీ స్వాగతిస్తున్నాను.

ధన్యవాదములు. 

*****