ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అబుధాబి యువరాజు షేక్ ఖాలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారత్ పర్యటనకు వచ్చారు. ఈ హోదాలో ఆయన భారత్ సందర్శనకు రావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సోమవారం న్యూఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయనను గౌరవ వందనంతో ఘనంగా ఆహ్వానించారు. యువరాజు వెంట అబుధాబి మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు పలువురు వాణిజ్యవేత్తలతో కూడిన బృందం కూడా ఉంది.
అనంతరం యువరాజు ఇవాళ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘యుఎఇ’ అధ్యక్షుడైన గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి, గౌరవం ప్రకటించారు. భారత్-‘యుఎఇ’ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి కాలంలో గణనీయంగా పురోగమించడంపై నాయకులిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం, విస్తృతం చేయడానికిగల మార్గాలపైనా వారు చర్చించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) విజయవంతంగా అమలు కావడంతోపాటు ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బిఐటి) ఇటీవలే అమల్లోకి వచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య ఇప్పటికేగల బలమైన ఆర్థిక-వాణిజ్య భాగస్వామ్యానికి మరింత ఉత్తేజం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అణుశక్తి, కీలక ఖనిజాలు, హరిత ఉదజని, కృత్రిమ మేధ, అత్యాధునిక సాంకేతికతల సంబంధిత కొత్త రంగాల్లోనూ సామర్థ్య సద్వినియోగం అవసరాన్ని కూడా వారు ప్రధానంగా ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో కింది అవగాహన ఒప్పందాలు/ఒడంబడికలపై ఉభయ పక్షాలూ సంతకం చేశాయి. ఇప్పటికే సహకార రంగం /సరికొత్త రంగాలుసహా సంప్రదాయ రంగాల్లోనూ సహకార విస్తృతికి ఇవి ఒక వేదికను ఏర్పరుస్తాయి:-
· అణుశక్తి రంగంలో సహకారంపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎన్‌పిసిఐఎల్), ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ (ఇఎన్ఇసి) మధ్య అవగాహన ఒప్పందం.
· ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్‌జి) దీర్ఘకాలిక సరఫరాపై అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఎడిఎన్ఒసి), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఒఎల్) మధ్య ఒడంబడిక.
· ‘ఎడిఎన్ఒసి’, ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ (ఐఎస్‌పిఆర్ఎల్) మధ్య అవగాహన ఒప్పందం.
· అబుధాబి ఆన్‌షోర్ బ్లాక్-1పై ఉత్పత్తి రాయితీకి సంబంధించి ‘ఎడిఎన్ఒసి’, ‘ఊర్జా భారత్’ల మధ్య ఒడంబడిక
· భారత్‌లో ఆహార తయారీ పార్కుల నిర్మాణంపై గుజరాత్ ప్రభుత్వం-అబుధాబి డెవలప్‌మెంటల్ హోల్డింగ్ కంపెనీ ‘పిజెఎస్‌సి’ (ఎడిక్యు) మధ్య అవగాహన ఒప్పందం.
అణు సహకారంపై అవగాహన ఒప్పందంతో అణు విద్యుత్ ప్లాంట్ల కార్యకలాపాలు/ యాజమాన్యం, భారత్ నుంచి అణు సామగ్రి-సేవల ప్రదానం, పరస్పర పెట్టుబడి అవకాశాల అన్వేషణ, సామర్థ్య వికాసంపై సహకారం మెరుగుదల తదితర ప్రయోజనాలు ఉంటాయని అంచనా.
‘ఎల్‌ఎన్‌జి’ దీర్ఘకాలిక సరఫరా ఒడంబడిక కింద ఏటా మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటిపిఎ) ద్రవీకృత సహజ వాయువు సరఫరా అవుతుంది. ఇది ఏడాది వ్యవధిలో మూడో ఒడంబడిక కావడం గమనార్హం. ఇంతకుముందు భారత సంస్థలు ‘ఐఒసిఎల్’, ‘జిఎఐఎల్’ రెండూ ‘ఎడిఎన్ఒసి’తో వరుసగా 1.2, 0.5 ‘ఎంఎంటిపిఎ’ల వంతున సరఫరా కోసం దీర్ఘకాలిక ఒడంబడికలపై సంతకాలు చేశాయి. ఈ కాంట్రాక్టుల ద్వారా ‘ఎల్‌ఎన్‌జి’ వనరుల వైవిధ్యీకరణతో భారత్ ఇంధన భద్రత బలోపేతమవుతుంది.
‘ఎడిఎన్ఒసి’, ‘ఐఎస్‌పిఆర్ఎల్’ మధ్య అవగాహన ఒప్పందం వల్ల భారత్‌లో ‘ఎడిఎన్ఒసి’ భాగస్వామ్యంతో అదనంగా ముడిచమురు నిల్వకు గల అవకాశాలను అన్వేషించే వీలు కలుగుతుంది. అంతేకాకుండా పరస్పర ఆమోదయోగ్య నిబంధనలు-షరతులతో నిల్వ, నిర్వహణ ఒప్పందాల పునరుద్ధరణకూ వెసులుబాటు లభిస్తుంది. కాగా, ‘ఐఎస్‌పిఆర్ఎల్’కు మంగళూరులోగల భాండాగారంలో 2018 నుంచి కొనసాగుతున్న ‘ఎడిఎన్ఒసి’ ముడిచమురు నిల్వ భాగస్వామ్యం ప్రాతిపదికగా ఈ అవగాహన ఒప్పందం ఖరారైంది.
ఇక అబుధాబి ఆన్‌షోర్ బ్లాక్-1పై ఉత్పత్తి రాయితీకి సంబంధించి ‘ఎడిఎన్ఒసి’, ‘ఊర్జా భారత్’ (ఐఒసిఎల్-భారత్ పెట్రో రిసోర్స్ లిమిటెడ్ సంయుక్త సంస్థ) ఒడంబడిక ‘యుఎఇ’లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలకు సంబంధించి మొదటిది. ఈ రాయితీ ద్వారా భారత్‌కు ముడి చమురు తరలించే హక్కు ‘ఊర్జా భారత్’కు దక్కుతుంది. తద్వారా దేశ ఇంధన భద్రతకు ఇది దోహదం చేస్తుంది.
భారత్‌లో 2025 రెండో త్రైమాసికంలో ఆహార తయారీ పార్కుల ప్రాజెక్టును ప్రారంభించడం ప్రధాన లక్ష్యంగా ఆహార తయారీ పార్కుల నిర్మాణంపై గుజరాత్ ప్రభుత్వం-అబుధాబి డెవలప్‌మెంటల్ హోల్డింగ్ కంపెనీ ‘పిజెఎస్‌సి’ (ఎడిక్యు) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిమిత్తం గుండన్‌పడా, బావ్లా, అహ్మదాబాద్‌లను అత్యంత సౌలభ్యం ప్రాంగణాలుగా రూపొందించడంలో ‘ఎడిక్యు’కుగల అమితాసక్తికి ఇది నిదర్శనం. దీనికింద గుజరాత్ ప్రభుత్వం ‘ఎడిక్యు’, ‘ఎడి’ పోర్టులలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తుంది. అలాగే ఈ ప్రాంగణాల సంబంధిత సమగ్ర సమాచారం పొందడంతోపాటు అవసరమైన అనుమతులు లభించేలా సాయపడుతుంది.
‘యుఎఇ’ యువరాజు షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరోవైపు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతోనూ రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సౌహార్ద్ర, చారిత్రక, సమగ్ర సంబంధాలు సహా ఇటీవలి కాలంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను స్పృశిస్తూ వారిద్దరి మధ్య చర్చలు సాగాయి. ‘యుఎఇ’లో 35 లక్షల మందికిపైగా భారతీయుల శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడంపై రాష్ట్రపతి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా యువరాజు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడొక మొక్కను నాటారు. తద్వారా 1992లో ‘యుఎఇ’ మాజీ అధ్యక్షుడు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్, 2016లో అధ్యక్షుడైన గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తర్వాత మొక్క నాటిన మూడో తరం నాయకుడయ్యారు; కాగా, రెండు దేశాల మధ్య బలమైన సంబంధాల నేపథ్యంలో వరుసగా ప్రతి తరంలో ఈ సంప్రదాయం కొనసాగడం అరుదైన సందర్భం. ఈ క్రమంలో ఏదైనా దేశానికి చెందిన మూడు తరాల నాయకులు మహాత్ముని గౌరవార్థం మొక్కలు నాటడం రాజ్‌ఘాట్ చరిత్రలో ఇదే తొలిసారి.
ఢిల్లీలో పర్యటన అనంతరం షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం (10న) ముంబయి నగరానికి వెళ్తారు. అక్కడ భారత్-‘యుఎఇ’ బిజినెస్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వివిధ రంగాల్లో భవిష్యత్ సహకారంపై రెండు పక్షాల వాణిజ్యవేత్తలు, అధికారుల మేధో మథనానికి ఇది వేదిక కానుంది. మరోవైపు భారత్-‘యుఎఇ’ వర్చువల్ ట్రేడ్ కారిడార్ (విటిసి)తోపాటు దీనికి అవసరమైన సదుపాయాల దిశగా ‘మైత్రి (ఎంఎఐటిఆర్ఐ) ఇంటర్‌ఫేస్’ నమూనా ప్రారంభ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు.
****