భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, ఇండోర్, జోధ్‌పూర్, మండీ, పాట్నా, రోపడ్ లలో కొత్తగా 8 ఐ ఐ టి లను నెలకొల్పడానికిగాను సవరించిన వ్యయ అంచనాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. 2008-09 సంవత్సరం నుండి 2018-19 మధ్య 11 సంవత్సరాల కాలంలో ఎనిమిది నూతన ఐ ఐ టి లను ఏర్పాటు చేయడానికి సవరించిన అంచనా ప్రకారం రూ.13,9990 కోట్ల వ్యయం కాగలదు. తొలుత ఇందుకు రూ.6,080 కోట్లు వ్యయం కావచ్చని అంచనా వేశారు. సమయం గడచిపోతుండడం, ధరలు పెరగడంతో ఈ వ్యయం మరొక రూ.7,910 కోట్ల మేర పెరిగిపోయింది.
ప్రాజెక్టు ముగిశాక ప్రతి ఒక్క ఐ ఐ టి లోను 2,360 మంది విద్యార్థులు ఉంటారు. 11వ సంవత్సరం ఆఖరుకు అంటే, 2019 మార్చి నాటికి ఈ ఎనిమిది ఐ ఐ టి ల మొత్తం విద్యార్థుల సంఖ్య 12,880 కి చేరుకొంటుంది.
ప్రత్యక్షంగా 12880 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగినా, పరోక్షంగా ఈ 8 ఐ ఐ టి లు పరిశోధనలు, పుస్తకాల ప్రచురణ, పరిశోధన పత్రాల ప్రచురణ, , రిజిస్టర్ డ్ పేటెంట్లు/ ట్రేడ్‌మార్క్‌లు/ డిజైన్లు, నాణ్యత మెరుగుదల కార్యక్రమాల వంటి వాటిలో రాశిపరమైన, వాసి పరమైన వృద్ధి ఉండగలదని భావిస్తున్నారు. అంతే కాకుండా, ఈ సంస్థలు పరిశ్రమల రంగంలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండే అవసరాలను, ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలను కూడా తీర్చగలవని భావిస్తున్నారు. ఈ కొత్త సంస్థల లోని సుశిక్షిత సిబ్బంది ప్రతిభాప్రజ్ఞలు నైపుణ్యం గల మానవ శక్తిని సమకూర్చగలుగుతాయి. ఐ ఐ టి లు వాటి పరిశోధన మరియు అభివృద్ధి, సాంకేతిక విజ్ఞాన సంబంధి నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికుల స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడుతాయి.
పూర్వ రంగం :
మంత్రిమండలి 2008 జులై లో సమావేశమై డి పి ఆర్ మేరకు కొత్తగా 8 ఐ ఐ టి లను భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, ఇండోర్, జోధ్‌పూర్, మండీ, పాట్నా మరియు రోపడ్ లలో నెలకొల్పాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. మంత్రిమండలి ఆమోదానికి అనుగుణంగా ఒక్కొక్క విద్యాసంస్థను రూ.760 కోట్ల వ్యయం వంతున ఏర్పాటు చేయవలసివుంది. ఈ లెక్కన 8 ఐ ఐ టి ల స్థాపనకు రూ.6,080 కోట్ల వ్యయం కాగలదనుకున్నారు.