77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ సాంకేతిక రంగంలో దేశం సాధించిన గణనీయమైన విజయాలను ప్రస్తావించడంతో పాటు డిజిటల్ గా భారతదేశం సాధించిన సాధికారత ప్రాధాన్యతను వివరించారు.
1. భారతదేశం డిజిల్ రంగంలో సాధించిన అద్భుత పరివర్తనను ప్రధానమంత్రి వివరించారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అనుసంధానత విస్తరింపచేయడంలోను, ప్రతీ ఒక్క గ్రామానికి ఇంటర్నెట్ అనుసంధానత కల్పించడంలోను, డిజిటల్ పరివర్తన ప్రయోజనాలు ప్రతీ ఒక్క భారతీయునికి అందించడంలోను దేశం సాధించిన విజయాలను సవివరంగా తెలియచేశారు.
2. దేశంలో 2014 సంవత్సరానికి ముందు సగటు జీవికి అందుబాటులో లేనంత స్థాయిలో ఉన్న ఇంటర్నెట్ డేటా టారిఫ్ లు ఇప్పుడు ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా చౌకగా మారాయన్నారు. ఈ వ్యయాల తగ్గుదల ప్రభావంతో ప్రతీ కుటుంబానికి భారీగా సొమ్ము పొదుపు అయింది.
3. దేశంలో 5జి త్వరితగతిన విస్తరించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. 5జి విస్తరణ అమిత వేగంగా జరిగి ప్రస్తుతం 700 పైగా జిల్లాలను కవర్ చేస్తోందన్నారు.
4. దేశం 6జి టెక్నాలజీ దిశగా కూడా వేగంగా అడుగులు వేస్తున్నదని ప్రధానమంత్రి వివరించారు. ఇందు కోసం అంకిత భావంతో పని చేసే టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని చెప్పారు.
పూర్వాపరాలు
· ప్రపంచంలోనే అమిత వేగంగా 5జి సేవలు విస్తరించారు. ప్రస్తుతం 700 పైగా జిల్లాలకు 5జి సేవలు అందుబాటులో ఉన్నాయి. 2014 నుంచి రోజుకి 500 బిటిఎస్ లను ఏర్పాటు చేశారు. నేడు రోజుకి 1000 5జి సైట్లు ఏర్పాటవుతున్నాయి.
· ఆధునిక 5జి టెక్నాలజీ నెట్ వర్క్ లను అమిత వేగంగా ప్రవేశపెట్టడం వల్ల హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు గణనీయంగా అందుబాటులోకి వచ్చాయి.
· దేశం 6జి ప్రమాణాల అభివృద్ధిలో ముందువరుసలో నిలిచేందుకు చొరవలు తీసుకున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘భారత్ 6జి విజన్’’ డాక్యుమెంట్ ను విడుదల చేశారు. టెలీకమ్యూనికేషన్ల శాఖ (డిఓటి) ‘‘భారత్ 6జి అలయెన్స్’’ను ఏర్పాటు చేసింది.
· భారతదేశం 4జి విషయంలో ప్రపంచాన్ని అనుసరించగా 5జి విషయంలో ప్రపంచంతో కలిసి అడుగేసింది. 6జిలో ప్రపంచంలోనే ముందువరుసలో ఉండాలని భావిస్తోంది.
· మొబైల్ డేటా టారిఫ్ లు రూ.269/జిబి (2014) నుంచి రూ.10.1/జిబికి (2023) దిగి వచ్చాయి. మొబైల్ సర్వీస్ చార్జీలు కూడా గణనీయంగా తగ్గాయి.
· దేశంలో డేటా టారిఫ్ ల సగటు (ఒక్కో జిబికి) మూడో స్థాయిలో ఉంది.
· నాణ్యమైన టెలికాం అనుసంధానత, దీవుల్లో మౌలిక వసతుల విస్తరణకు చేస్తున్న ప్రత్యేక ప్రయత్నాల్లో భాగంగా ఈశాన్య రాష్ర్టాలు, సరిహద్దు ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, ఆకాంక్షాపూరిత జిల్లాలు, ఇతర మారుమూల ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది.
· రూ.1224 కోట్లతో చెన్నై-అండమాన్, నికోబార్ (కాని) అండర్ సీ కేబుల్ ప్రారంభమయింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 10వ తేదీన ఆ కేబుల్ ను జాతికి అంకితం చేశారు.
· ఉపగ్రహ బ్యాండ్ విడ్త్ అందుబాటులోకి రావడంతో అండమాన్, నికోబార్ దీవుల్లో టెలికాం నెట్ వర్క్ ను మరింత వేగంగా విస్తరిస్తున్నారు.
· రూ.1072 కోట్ల వ్యయంతో కోచి-లక్షద్వీప్ అండర్ సీ ఒఎఫ్ సి లింక్ నిర్మాణం పూర్తయింది. ప్రయోగాత్మకంగా కోసం ట్రాఫిక్ ప్రారంభించారు. ఇది పూర్తయితే కోచికి, ఇతర దీవులకు మధ్యన 100 జిబిపిఎస్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది.
· ఇంతవరకు 4జి సర్వీసులు అందుబాటులో లేని గ్రామాలకు కూడా రూ.26,316 కోట్ల మొత్తం వ్యయంతో ఒక ప్రాజెక్టు అమలుపరుస్తున్నారు.
· ఈ ప్రాజెక్టుతో 24,680 మారుమూల గ్రామలు, చేరుకోవడానికి కష్టతరమైన గ్రామాలకు 4జి సేవలు అందుబాటులోకి వస్తాయి.
***