దేశ సరిహద్దు గ్రామాల కోసం ‘వైబ్రంట్ విలేజ్’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూదిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట పైనుంచి జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. సరిహద్దు గ్రామాలను దేశంలోని చివరి గ్రామాలుగా ఒకప్పుడు భావించేవారని, ఆ అభిప్రాయం ఇప్పుడు మారిందని అన్నారు. ఆ గ్రామాలు చివరి గ్రామాలు కాదని, సరిహద్దులో మొదటి గ్రామాలు అని అన్నారు. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడి తొలి కిరణం సరిహద్దు గ్రామాన్ని తాకుతుందని, సూర్యుడు అస్తమించేటప్పుడు మరో వైపున ఉన్న గ్రామం చివరి కిరణం ప్రయోజనాన్ని పొందుతుందని ప్రధాని చెప్పారు.
దిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు సరిహద్దు గ్రామాలకు చెందిన దాదాపు 600 మంది గ్రామ పెద్దలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం పట్ల ప్రధాన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. నవ సంకల్పం, శక్తితో తొలిసారిగా ఆ ప్రత్యేక అతిథులు ఇంత దూరం వచ్చారని చెప్పారు.
*****