Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

30 మార్చి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 120 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఈరోజు- ఈ పవిత్రమైన రోజున మీతో ‘మన్ కీ బాత్’ పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈరోజు చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి. నేటి నుండి చైత్ర నవరాత్రి ప్రారంభమవుతుంది. భారతీయ నూతన సంవత్సరం కూడా నేటి నుంచే ప్రారంభమవుతోంది. ఈసారి విక్రమ సంవత్సరం  2082 ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మీరు రాసిన చాలా ఉత్తరాలు నా ముందు ఉన్నాయి. కొందరు బీహార్ నుండి, కొందరు బెంగాల్ నుండి, కొందరు తమిళనాడు నుండి, కొందరు గుజరాత్ నుండి ఈ లేఖలు రాశారు. వీటిలో ప్రజలు తమ ఆలోచనలను చాలా ఆసక్తికరమైన రీతిలో రాశారు. చాలా లేఖలలో శుభాకాంక్షలు, అభినందన సందేశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు మీతో కొన్ని సందేశాలు పంచుకోవాలనిపిస్తోంది-

ప్రధానమంత్రి (కన్నడలో) అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.

తదుపరి సందేశం-

ప్రధానమంత్రి (తెలుగులో) అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.

మరొక లేఖలో ఇలా రాశారు.

ప్రధానమంత్రి (కొంకణిలో) – సంసార్ పర్వ శుభాకాంక్షలు

మరో సందేశం ఇలా ఉంది-

ప్రధానమంత్రి (మరాఠీలో) – గుడి పడ్వా సందర్భంగా

హృదయపూర్వక శుభాకాంక్షలు

మన మిత్రుడొకరు  ఇలా రాశారు:

ప్రధానమంత్రి (మలయాళంలో) అందరికీ విషు పండుగ శుభాకాంక్షలు.

ఇంకో సందేశం ఉంది-

ప్రధానమంత్రి (తమిళంలో) అందరికీ పుత్తాండు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మిత్రులారా! ఇవి వేర్వేరు భాషలలో వచ్చిన సందేశాలు అని మీరు అర్థం చేసుకుని ఉండాలి. కానీ దీని వెనుక ఉన్న కారణం మీకు తెలుసా? ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న ప్రత్యేక విషయం ఇది. ఈరోజుతో పాటు వచ్చే కొద్ది రోజుల్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో నూతన సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ సందేశాలన్నీ నూతన సంవత్సర శుభాకాంక్షలకు సంబంధించినవి. ప్రజలు నాకు వివిధ భాషలలో శుభాకాంక్షలు పంపారు.

మిత్రులారా! ఈ రోజు ఉగాది పండుగను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మహారాష్ట్రలో ఈరోజు గుడి పడ్వ జరుపుకుంటున్నారు. వైవిధ్యభరితమైన మన దేశంలో వచ్చే కొద్ది రోజుల్లో అస్సాం ‘రోంగాలి బిహు’, బెంగాల్‌ ‘పొయిలా బోయిషాఖ్’, కాశ్మీర్‌ ‘నవ్రేహ్’ జరుపుకుంటాయి. అదేవిధంగా ఏప్రిల్ 13- 15 తేదీల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాలలో పండుగల వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటి కారణంగా దేశమంతటా ఉత్సాహభరిత వాతావరణం ఉంది. ఈద్ పండుగ కూడా వస్తోంది. అంటే ఈ నెల మొత్తం పండుగలు, వేడుకలతో నిండి ఉంటుంది. ఈ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఈ పండుగలు వేర్వేరు ప్రాంతాలలో ఉండవచ్చు. కానీ అవి భారతదేశ వైవిధ్యంలో ఐక్యత ఎలా అల్లుకుపోయిందో చూపిస్తాయి. ఈ ఐక్యతా భావాన్ని మనం నిరంతరం బలోపేతం చేసుకోవాలి.

మిత్రులారా! పరీక్షలు వచ్చినప్పుడు, నేను నా యువ స్నేహితులతో పరీక్షల గురించి చర్చిస్తాను. ఇప్పుడు పరీక్షలు అయిపోయాయి. చాలా పాఠశాలల్లో తరగతులను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీని తరువాత వేసవి సెలవుల సమయం కూడా వస్తుంది. పిల్లలు సంవత్సరంలో ఈ సమయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. నేను, నా స్నేహితులు రోజంతా ఏదో ఒక అల్లరి చేసేవాళ్ళం.  కానీ అదే సమయంలో మేం నిర్మాణాత్మకమైన పనులు కూడా చేసేవాళ్ళం. నేర్చుకునేవాళ్ళం. వేసవి రోజులు ఎక్కువ ఉంటాయి. పిల్లలు చేయాల్సింది చాలా ఉంటుంది. కొత్త అభిరుచిని చేపట్టడానికి, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఇదే సమయం. ఈరోజుల్లో పిల్లలు నేర్చుకునేందుకు వేదికల కొరత లేదు. ఉదాహరణకు ఏదైనా సంస్థ టెక్నాలజీ క్యాంప్ నిర్వహిస్తే పిల్లలు అక్కడ యాప్‌లను తయారు చేయడంతో పాటు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ గురించి కూడా తెలుసుకోవచ్చు. పర్యావరణం, నాటక రంగం లేదా నాయకత్వం వంటి వివిధ విషయాలపై కోర్సులు ఉంటే, వాటిలో కూడా చేరవచ్చు. ఉపన్యాసం లేదా నాటకం నేర్పే పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇవి పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటన్నింటితో పాటు ఈ సెలవు దినాలలో అనేక చోట్ల జరిగే స్వచ్ఛంద కార్యకలాపాలు, సేవా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా మీకు ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రత్యేక అభ్యర్థన చేస్తున్నాను. ఏదైనా సంస్థ, పాఠశాల, సామాజిక సంస్థ లేదా సైన్స్ సెంటర్ ఇలాంటి వేసవి కార్యకలాపాలను నిర్వహిస్తుంటే, దాన్ని #MyHolidays తో షేర్ చేయండి. దీనితో దేశవ్యాప్తంగా పిల్లలు, వారి తల్లిదండ్రులు వీటి గురించి సమాచారాన్ని సులభంగా పొందగలుగుతారు.

నా యువ మిత్రులారా! ఈ వేసవి సెలవుల కోసం సిద్ధం చేసిన మై-భారత్  ప్రత్యేక క్యాలెండర్ గురించి ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. ఈ క్యాలెండర్ ప్రతి ఇప్పుడు నా ముందు ఉంది. ఈ క్యాలెండర్ నుండి కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాలను నేను పంచుకోవాలనుకుంటున్నాను. MY-భారత్ అధ్యయన పర్యటనలో మన ‘జన్ ఔషధి కేంద్రాలు’ ఎలా పనిచేస్తాయో మీరు తెలుసుకోవచ్చు. వైబ్రంట్ విలేజ్ ప్రచారంలో భాగం కావడం ద్వారా సరిహద్దు గ్రామాల్లో మీరు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని పొందవచ్చు. దీనితో పాటు మీరు ఖచ్చితంగా అక్కడి సాంస్కృతిక, క్రీడా కార్యకలాపాల్లో భాగం కావచ్చు. అంబేద్కర్ జయంతి నాడు జరిగే మార్చ్‌లో పాల్గొనడం ద్వారా మీరు రాజ్యాంగ విలువల గురించి అవగాహన పెంచుకోవచ్చు. #HolidayMemories తో వారి సెలవు అనుభవాలను పంచుకోవాలని పిల్లలు, వారి తల్లిదండ్రులకు నా ప్రత్యేక అభ్యర్థన. వచ్చే ‘మన్ కీ బాత్’ లో మీ అనుభవాలను చేర్చడానికి ప్రయత్నిస్తాను.

నా ప్రియమైన దేశప్రజలారా! వేసవి కాలం ప్రారంభమైన వెంటనే ప్రతి నగరం, గ్రామంలో నీటిని ఆదా చేయడానికి సన్నాహాలు ప్రారంభమవుతాయి. అనేక రాష్ట్రాల్లో నీటి సేకరణ, నీటి సంరక్షణకు సంబంధించిన పనులు కొత్త ఊపును పొందాయి. జలశక్తి మంత్రిత్వ శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ దిశలో పనిచేస్తున్నాయి. దేశంలో వేలాది కృత్రిమ చెరువులు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీఛార్జ్, కమ్యూనిటీ సోక్ పిట్‌లు నిర్మిస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ‘catch the rain’ ప్రచారానికి సన్నాహాలు జరిగాయి. ఈ ప్రచారం ప్రభుత్వానికి సంబంధించినది కాదు- సమాజానికి సంబంధించినది, సామాన్య ప్రజలకు సంబంధించినది. నీటి సంరక్షణతో మరింత ఎక్కువ మందిని అనుసంధానించడానికి, నీటి సంరక్షణపై ప్రజా భాగస్వామ్య ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. మనకు లభించిన సహజ వనరులను తర్వాతి తరానికి సురక్షితంగా అందించడమే మన ప్రయత్నం.

మిత్రులారా! వర్షపు చినుకులను సంరక్షించడం ద్వారా మనం చాలా నీటిని వృధా కాకుండా ఆదా చేయవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రచారం కింద దేశంలోని అనేక ప్రాంతాలలో అపూర్వమైన నీటి సంరక్షణ పనులు జరిగాయి. మీకు కొన్ని ఆసక్తికరమైన గణాంకాలు చెబుతాను. గత 7-8 సంవత్సరాలలో కొత్తగా నిర్మించిన ట్యాంకులు, చెరువులు, ఇతర నీటి రీఛార్జ్ నిర్మాణాల ద్వారా 11 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పైగా నీటిని సంరక్షించడం జరిగింది. ఇప్పుడు మీరు 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి పరిమాణం ఎంత అని ఆలోచిస్తారు.

మిత్రులారా! భాక్రానంగల్ ఆనకట్టలో పేరుకుపోయిన నీటి చిత్రాలను మీరు చూసి ఉంటారు. ఈ నీరు గోవింద్ సాగర్ సరస్సును ఏర్పరుస్తుంది. ఈ సరస్సు పొడవు 90 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఈ సరస్సులో కూడా 9-10 బిలియన్ క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ నీటిని సంరక్షించలేం. కేవలం 9-10 బిలియన్ క్యూబిక్ మీటర్లు! వారి చిన్న ప్రయత్నాల ద్వారా దేశవాసులు దేశంలోని వివిధ ప్రాంతాలలో 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సంరక్షించగలిగారు – ఇది గొప్ప ప్రయత్నం కదా!

మిత్రులారా! కర్ణాటకలోని గడగ్ జిల్లా ప్రజలు కూడా ఈ దిశలో ఒక ఉదాహరణగా నిలిచారు. కొన్ని సంవత్సరాల కిందట ఇక్కడ రెండు గ్రామాల సరస్సులు పూర్తిగా ఎండిపోయాయి. జంతువులు తాగడానికి కూడా నీరు లేని సమయం వచ్చింది. క్రమంగా సరస్సులు గడ్డి, పొదలతో నిండిపోయాయి. గ్రామాల్లోని కొంతమంది సరస్సును పునరుద్ధరించాలని నిర్ణయించుకుని పనిలోకి దిగారు. “మనసుంటే మార్గం ఉంటుంది” అంటారు కదా! ఈ గ్రామాల ప్రజల ప్రయత్నాలను చూసి, సమీపంలోని సామాజిక సంస్థలు కూడా వారితో చేరాయి. ప్రజలందరూ కలిసి చెత్తను, బురదను శుభ్రం చేశారు. కొంత కాలానికి సరస్సు ప్రాంతం పూర్తిగా శుభ్రంగా మారింది. ఇప్పుడు ప్రజలు వర్షాకాలం కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా ఇది ‘క్యాచ్ ద రెయిన్’ ప్రచారానికి గొప్ప ఉదాహరణ. మిత్రులారా! మీరు కూడా సమాజ స్థాయిలో ఇటువంటి ప్రయత్నాలలో చేరవచ్చు. ఈ సామూహిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఇప్పుడే ప్రణాళిక ప్రారంభించాలి. మీరు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి – వీలైతే వేసవిలో మీ ఇంటి ముందు ఒక కుండ చల్లటి నీటిని ఉంచండి. మీ ఇంటి పైకప్పు లేదా వరండాలో పక్షులకు నీరు ఉంచండి. ఈ మంచి పని చేసిన తర్వాత మీకు ఎంత సంతృప్తికరంగా అనిపిస్తుందో చూడండి.

మిత్రులారా! ఇప్పుడు ‘మన్ కీ బాత్’ లో ధైర్యంగా ఎదగడం గురించి మాట్లాడుకుందాం! సవాళ్లను ఎదుర్కొంటూ ఉత్సాహాన్ని ప్రదర్శించడం గురించి చర్చించుకుందాం. కొన్ని రోజుల కిందట ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఆటగాళ్లు మరోసారి తమ అంకితభావం, ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి ఈ ఆటలలో గతంలో కంటే ఎక్కువ మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు. పారా స్పోర్ట్స్ ఎంత ప్రజాదరణ పొందుతున్నాయో దీన్ని బట్టి తెలుస్తుంది. ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో పాల్గొన్న అందరు ఆటగాళ్లను వారి గొప్ప కృషికి నేను అభినందిస్తున్నాను. మొదటి, రెండవ, మూడవ స్థానాలు సాధించిన హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ క్రీడాకారులను నేను అభినందిస్తున్నాను. ఈ ఆటలలో మన దివ్యాంగ క్రీడాకారులు 18 జాతీయ రికార్డులను కూడా సృష్టించారు. అందులో 12 మన మహిళా క్రీడాకారుల రికార్డులు. ఈ సంవత్సరం ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న ఆర్మ్ రెజ్లర్ జాబీ మాథ్యూ నాకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ నుండి కొంత భాగాన్ని నేను చదవాలనుకుంటున్నాను. ఆ లేఖలో ఇలా ఉంది.

“పతకం గెలవడం చాలా ప్రత్యేకమైనది. కానీ మా పోరాటం కేవలం పోడియంపై నిలబడటానికి మాత్రమే పరిమితం కాదు. మేం ప్రతిరోజూ ఒక యుద్ధం చేస్తాం.  జీవితం అనేక విధాలుగా పరీక్షిస్తుంది. చాలా తక్కువ మంది మాత్రమే మా పోరాటాన్ని అర్థం చేసుకుంటారు. అయినప్పటికీ మేం ధైర్యంగా ముందుకు వెళ్తాం. మా కలలను నెరవేర్చుకోవడానికి మేము కష్టపడి పనిచేస్తాం. మేం ఎవరికీ తక్కువ కాదని నమ్ముతాం.”

వావ్! జాబీ మాథ్యూ… మీరు చాలా బాగా, అద్భుతంగా రాశారు. ఈ లేఖకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జాబీ మాథ్యూతో పాటు ఇతర దివ్యాంగ క్రీడాకారులు చేసే ప్రయత్నాలు మనకు గొప్ప ప్రేరణ అని వారికి నేను చెప్పాలనుకుంటున్నాను.

మిత్రులారా! ఢిల్లీలో జరిగిన మరో గొప్ప కార్యక్రమం ప్రజలను ఎంతో ప్రేరేపించింది. వారిలో ఉత్సాహాన్ని నింపింది. ఫిట్ ఇండియా కార్నివాల్ మొదటిసారిగా ఒక వినూత్న ఆలోచనగా జరిగింది. వివిధ ప్రాంతాల నుండి సుమారు 25 వేల మంది ఇందులో పాల్గొన్నారు. వారందరిదీ ఒకే లక్ష్యం – ఫిట్‌గా ఉండటం, ఫిట్‌నెస్ గురించి అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తమ ఆరోగ్యంతో పాటు పోషకాహారానికి సంబంధించిన సమాచారాన్ని పొందారు. మీ ప్రాంతాలలో కూడా ఇలాంటి కార్నివాల్‌లను నిర్వహించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఈ చొరవలో MY-భారత్ మీకు చాలా సహాయకారిగా ఉంటుంది.

మిత్రులారా! మన దేశీయ క్రీడలు ఇప్పుడు జనరంజక సంస్కృతిలో భాగమవుతున్నాయి. మీ అందరికీ ప్రముఖ రాపర్ హనుమాన్‌ కైండ్ గురించి తెలిసి ఉంటుంది. ఈ రోజుల్లో ఆయన కొత్త పాట “రన్ ఇట్ అప్” చాలా ప్రసిద్ధి చెందింది. ఇందులో కలరిపయట్టు, గత్ కా, థాంగ్-తా వంటి మన సాంప్రదాయిక యుద్ధ కళలు ఉన్నాయి. హనుమాన్ కైండ్ ప్రయత్నాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన సాంప్రదాయిక యుద్ధ కళల గురించి తెలుసుకోగలుగుతున్నందుకు నేను ఆయనను అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! ప్రతి నెలా MyGov, NaMo యాప్ ల ద్వారా మీ నుండి నాకు చాలా సందేశాలు వస్తాయి. చాలా సందేశాలు నా హృదయాన్ని స్పృశిస్తాయి. కొన్ని నన్ను గర్వంతో నింపుతాయి. చాలా సార్లు ఈ సందేశాలు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రత్యేకమైన సమాచారంతో ఉంటాయి. ఈసారి నా దృష్టిని ఆకర్షించిన సందేశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వారణాసి నుండి అథర్వ కపూర్, ముంబై నుండి ఆర్యశ్ లీఖా, ఆత్రేయ్ మాన్ నా ఇటీవలి మారిషస్ పర్యటనపై వారి అభిప్రాయాలను రాసి పంపారు. ఈ పర్యటనలో తాము  గీత్ గవాయ్ ప్రదర్శనను ఎంతగానో ఆస్వాదించామని వారు రాశారు. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ నుండి వచ్చిన అనేక లేఖలలో నేను ఇలాంటి భావాలను చూశాను. మారిషస్‌లో గీత్ గవాయ్ అద్భుతమైన ప్రదర్శన సమయంలో నేను అనుభవించిన అనుభూతి నిజంగా అద్భుతం.

మిత్రులారా! మనం మన మూలాలతో అనుసంధానమైనప్పుడు ఎంత పెద్ద తుఫాను వచ్చినా మనల్ని పెకిలించలేదు. ఊహించుకోండి దాదాపు 200 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి చాలా మంది ఒప్పంద కార్మికులుగా మారిషస్‌కు వెళ్లారు. తరువాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కానీ కాలక్రమేణా వారు అక్కడే స్థిరపడ్డారు. మారిషస్‌లో తమకంటూ పెద్ద పేరు సంపాదించుకున్నారు. అయినా వారు తమ వారసత్వాన్ని కాపాడుకున్నారు. తమ  మూలాలతో అనుసంధానమై ఉన్నారు. మారిషస్ ఒక్కటే దీనికి ఉదాహరణ కాదు. గత సంవత్సరం నేను గయానా వెళ్ళినప్పుడు, అక్కడి చౌతాల్ ప్రదర్శన నన్ను చాలా ఆకట్టుకుంది.

మిత్రులారా! ఇప్పుడు మీ కోసం ఒక ఆడియో వినిపిస్తాను.

#(ఆడియో క్లిప్ ఫిజీ)#

ఇది మన దేశంలోని ఏదో ఒక ప్రాంతం గురించి అని మీరు అనుకుంటున్నారు. కానీ అది ఫిజీకి సంబంధించినదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఫిజీలో బాగా ప్రాచుర్యం పొందిన ‘ఫగ్వా చౌతాల్’. ఈ పాటలు, సంగీతం అందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతాయి. మీ కోసం ఇంకో ఆడియో వినిపిస్తాను.

#(ఆడియో క్లిప్ సురినామ్)#

ఈ ఆడియో సురినామ్ కు చెందిన చౌతాల్’. ఈ కార్యక్రమాన్ని టీవీలో చూసే   దేశవాసులు సురినామ్ అధ్యక్షుడు, నా స్నేహితుడు చాన్ సంతోఖి గారు దీన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు. సమావేశాలు, పాటల ఈ సంప్రదాయం ట్రినిడాడ్, టొబాగోలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ దేశాలన్నిటిలోనూ ప్రజలు రామాయణం ఎక్కువగా చదువుతారు. ఫగ్వా అక్కడ చాలా ప్రాచుర్యం పొందింది. అన్ని భారతీయ పండుగలను అక్కడ పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు. వారి చాలా పాటలు భోజ్‌పురి, అవధి లేదా మిశ్రమ భాషలో ఉన్నాయి. అప్పుడప్పుడు బ్రజ్, మైథిలిని కూడా ఉపయోగిస్తారు. ఈ దేశాలలో మన సంప్రదాయాలను పరిరక్షించే వారందరూ ప్రశంసలకు అర్హులు.

మిత్రులారా! భారతీయ సంస్కృతిని పరిరక్షించడానికి సంవత్సరాలుగా పనిచేస్తున్న ఇలాంటి సంస్థలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అలాంటి ఒక సంస్థ – ‘సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ’. భారతీయ నృత్య సంగీత సంస్కృతులను  పరిరక్షించడంలో నిమగ్నమై ఉన్న ఈ సంస్థ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం గారు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సంస్థ ప్రయత్నాలను ఆయన ఎంతో అభినందించారు. ఈ బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా! ‘మన్ కీ బాత్’ లో మనం తరచుగా దేశప్రజల విజయాలతో పాటు, సామాజిక సమస్యలను కూడా ప్రస్తావిస్తాం. కొన్నిసార్లు సవాళ్లను కూడా చర్చిస్తాం. ఈసారి ‘మన్ కీ బాత్’ లో మనందరికీ నేరుగా సంబంధించిన ఒక సవాలు గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇది ‘వస్త్ర వ్యర్థాల’ సవాలు. ఈ వస్త్ర వ్యర్థాల నుండి ఏ కొత్త సమస్య తలెత్తిందోనని మీరు ఆలోచిస్తూ ఉండాలి. నిజానికి, వస్త్ర వ్యర్థాలు యావత్  ప్రపంచానికి ఆందోళన కలిగించే ప్రధాన కారణంగా మారాయి.  ఈ రోజుల్లో పాత దుస్తులను వీలైనంత త్వరగా పారవేసి కొత్తవి కొనుక్కోవడం అనే ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మీరు ఇకపై ధరించని పాత బట్టలు ఏమవుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవి వస్త్ర వ్యర్థాలుగా మారుతున్నాయి. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక పరిశోధన ప్రకారం వస్త్ర వ్యర్థాలలో ఒక శాతం కంటే తక్కువ మాత్రమే కొత్త దుస్తులలో రీసైకిల్ అవుతున్నాయి. ఇది ఒక శాతం కంటే తక్కువ! ప్రపంచంలో అత్యధిక వస్త్ర వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే దేశాలలో భారతదేశం మూడవది. దీని అర్థం మనం కూడా ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాం. కానీ ఈ సవాలును ఎదుర్కోవడానికి మన దేశంలో అనేక ప్రశంసనీయమైన ప్రయత్నాలు జరుగుతున్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. అనేక భారతీయ స్టార్టప్‌లు వస్త్ర రికవరీ సౌకర్యాలపై పనిచేయడం ప్రారంభించాయి. చెత్తను ఏరుకునే మన సోదర సోదరీమణుల సాధికారత కోసం పనిచేస్తున్న బృందాలు చాలా ఉన్నాయి. చాలా మంది యువ స్నేహితులు సస్టైనబుల్ ఫ్యాషన్ దిశగా జరుగుతున్న ప్రయత్నాలలో పాలుపంచుకుంటున్నారు. వారు పాత బట్టలు, బూట్లను రీసైకిల్ చేసి అవసరమైన వారికి అందజేస్తారు. అలంకార వస్తువులు, హ్యాండ్‌బ్యాగులు, స్టేషనరీ, బొమ్మలు వంటి అనేక వస్తువులను వస్త్ర వ్యర్థాలతో తయారు చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలా సంస్థలు ‘సర్క్యులర్ ఫ్యాషన్ బ్రాండ్’కు ప్రాచుర్యం కల్పించడంలో నిమగ్నమై ఉన్నాయి. కొత్తగా రెంటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా తెరుచుకుంటున్నాయి. ఇక్కడ డిజైనర్ దుస్తులు అద్దెకు లభిస్తాయి. కొన్ని సంస్థలు పాత దుస్తులను సేకరించి, వాటిని పునర్వినియోగించగలిగేలా చేసి పేదలకు పంపిణీ చేస్తాయి.

మిత్రులారా! కొన్ని నగరాలు వస్త్ర వ్యర్థాలను పరిష్కరించడంలో కూడా కొత్త గుర్తింపును పొందుతున్నాయి. హర్యానాలోని పానిపట్ వస్త్ర రీసైక్లింగ్‌కు ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. బెంగుళూరు కూడా వినూత్న సాంకేతిక పరిష్కారాలతో తనదైన ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తోంది. సగానికి పైగా వస్త్ర వ్యర్థాలు అక్కడే సేకరిస్తారు. ఇది మన ఇతర నగరాలకు కూడా ఆదర్శం. అదేవిధంగా తమిళనాడులో తిరుపూర్ వ్యర్థ జల శుద్ధి, పునరుత్పాదక శక్తి ద్వారా వస్త్ర వ్యర్థాల నిర్వహణలో నిమగ్నమై ఉంది.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈరోజుల్లో ఫిట్‌నెస్‌తో పాటు లెక్కింపు కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది. ఒక రోజులో ఎన్ని అడుగులు నడిచామో, ఎన్ని కేలరీలు తిన్నామో, ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయో లెక్కింపు. ఇన్ని లెక్కల మధ్య మరో కౌంట్‌డౌన్ ప్రారంభమవుతోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కౌంట్‌డౌన్! ఇప్పుడు యోగా దినోత్సవానికి 100 రోజుల కన్నా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉంది. మీరు ఇప్పటివరకు మీ జీవితంలో యోగాను భాగం చేసుకోకపోతే ఇప్పుడే చేయండి. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 10 సంవత్సరాల క్రితం 2015 జూన్ 21వ తేదీన జరుపుకున్నాం. ఇప్పుడు ఈ దినోత్సవం ఒక భారీ స్థాయి యోగా పర్వదిన రూపాన్ని సంతరించుకుంది. ఇది భారతదేశం నుండి మానవాళికి లభించిన ఒక విలువైన బహుమతి. ఇది భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2025 యోగా దినోత్సవ ఇతివృత్తంగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్- వన్ హెల్త్ ‘ అనే అంశాన్ని నిర్ణయించారు. అంటే మనం యోగా ద్వారా యావత్ ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలనుకుంటున్నాం.

మిత్రులారా! నేడు ప్రపంచవ్యాప్తంగా మన యోగా, సాంప్రదాయిక వైద్యాల పట్ల ఆసక్తి పెరుగుతుండటం మనందరికీ గర్వకారణం. యోగా, ఆయుర్వేదాలను  అద్భుతమైన ఆరోగ్య మాధ్యమంగా భావించి పెద్ద సంఖ్యలో యువత వాటిని అవలంబిస్తున్నారు. దక్షిణ అమెరికా దేశం చిలీ లాగా. అక్కడ ఆయుర్వేదం బాగా ప్రాచుర్యం పొందుతోంది. గత సంవత్సరం నేను బ్రెజిల్ పర్యటన సందర్భంగా చిలీ అధ్యక్షుడిని కలిశాను. ఆయుర్వేదానికి ఉన్న ఈ ప్రజాదరణ గురించి మా మధ్య చాలా చర్చ జరిగింది. నాకు సోమోస్ ఇండియా అనే జట్టు గురించి తెలిసింది. స్పానిష్‌లో దీని అర్థం ‘మేం భారత దేశం’ అని. ఈ బృందం దాదాపు దశాబ్ద కాలంగా యోగా, ఆయుర్వేదాలను ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉంది. వారి దృష్టి చికిత్సతో పాటు విద్యా కార్యక్రమాలపై కూడా ఉంది. వారు ఆయుర్వేదం, యోగాలకు సంబంధించిన సమాచారాన్ని స్పానిష్ భాషలోకి అనువదిస్తున్నారు. గత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే దాదాపు 9 వేల మంది వారి వివిధ కార్యక్రమాలు, కోర్సులలో పాల్గొన్నారు. ఈ బృందంతో అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరినీ వారి ప్రయత్నాలకు నేను అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పుడు ‘మన్ కీ బాత్’ లో ఒక సరసమైన,  వింత ప్రశ్న! మీరు ఎప్పుడైనా పూల యాత్ర గురించి ఆలోచించారా! చెట్లు, మొక్కల నుండి పెరిగే కొన్ని పువ్వులు దేవాలయాలకు ప్రయాణిస్తాయి. కొన్ని పువ్వులు ఇంటిని అందంగా చేస్తాయి. కొన్ని సుగంధ ద్రవ్యాలలో కరిగిపోయి ప్రతిచోటా సువాసనను వ్యాపింపజేస్తాయి. కానీ ఈ రోజు నేను మీకు మరో పువ్వుల ప్రయాణం గురించి చెబుతాను. మీరు మహువా పువ్వుల గురించి వినే ఉంటారు. మన గ్రామాల ప్రజలకు- ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి దాని ప్రాముఖ్యత గురించి బాగా తెలుసు. దేశంలోని అనేక ప్రాంతాలలో మహువా పువ్వుల ప్రయాణం ఇప్పుడు కొత్త మార్గంలో ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో మహువా పువ్వులతో కుకీస్ తయారు చేస్తున్నారు. రాజాఖోహ్ గ్రామానికి చెందిన నలుగురు సోదరీమణుల కృషి కారణంగా ఈ కుకీస్ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ మహిళల ఉత్సాహాన్ని చూసి ఒక పెద్ద కంపెనీ వారికి ఫ్యాక్టరీలో పనిచేయడానికి శిక్షణ ఇచ్చింది. ఈ ప్రేరణతో గ్రామంలోని అనేక మంది మహిళలు వారితో చేరారు. వారు తయారు చేసే మహువా కుకీస్ కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇద్దరు సోదరీమణులు మహువా పువ్వులతో కొత్త ప్రయోగం చేశారు. వారు వీటితో వివిధ రకాల వంటకాలు చేస్తారు. వీటిని ప్రజలు చాలా ఇష్టపడతారు. వారి వంటలలో ఆదివాసీ సంస్కృతి మాధుర్యం కూడా ఉంది.

మిత్రులారా! నేను మీకు మరో అద్భుతమైన పువ్వు గురించి చెప్పాలనుకుంటున్నాను. దాని పేరు ‘కృష్ణ కమలం’. గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీని మీరు సందర్శించారా? స్టాట్యూ ఆఫ్ యూనిటీ చుట్టూ మీరు ఈ కృష్ణ కమలాలను పెద్ద సంఖ్యలో చూస్తారు. ఈ పూలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ కృష్ణ కమలాలు ఏక్తా నగర్ లోని ఆరోగ్య వనం, ఏక్తా నర్సరీ, విశ్వ వనం, మియావాకి అడవి ప్రాంతాల్లో ఆకర్షణ కేంద్రంగా మారాయి. ఇక్కడ లక్షలాది కృష్ణ కమల మొక్కలను ప్రణాళికాబద్ధంగా నాటారు. మీరు మీ చుట్టూ చూస్తే మీకు ఆసక్తికరమైన పువ్వుల ప్రయాణాలు కనిపిస్తాయి. మీ ప్రాంతంలో పువ్వుల  ప్రత్యేకమైన ప్రయాణం గురించి దయచేసి నాకు రాయండి.

నా ప్రియమైన మిత్రులారా! మీ ఆలోచనలు, అనుభవాలు, సమాచారాలను ఎప్పటిలాగే నాతో పంచుకుంటూ ఉండండి. మీ చుట్టూ జరిగే విషయం మీకు సాధారణమైనదిగా అనిపించవచ్చు. కానీ ఇతరులకు ఆ అంశం చాలా ఆసక్తికరంగా, కొత్తగా ఉండవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. మన దేశప్రజల గురించి మనకు స్ఫూర్తినిచ్చే విషయాలను చర్చిద్దాం. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

***