ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రెసిడెంట్ ఎన్ కె సింగ్ గారు, ఈ సమ్మేళనంలో పాల్గొంటున్న దేశవిదేశాలకు చెందిన ఇతర విశిష్ట అతిథులు, మహిళలు, పెద్దలు!
ఇది కౌటిల్య సమ్మేళనం మూడో సంచిక. మీ అందరినీ కలిసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. వచ్చే మూడు రోజుల పాటు వివిధ ఆర్థిక అంశాలపై చర్చించేందుకు ఇక్కడ పలు సమావేశాలు జరగనున్నాయి. ఈ చర్చలు భారత్ వృద్ధిని వేగవంతం చేయడానికి దోహదం చేస్తాయని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
ప్రపంచంలోని రెండు ప్రధాన ప్రాంతాలు యుద్ధ వాతావరణంలో ఉన్న సమయంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఇంధన భద్రత పరంగా ఈ ప్రాంతాలు కీలకం. ఇంత తీవ్రమైన అంతర్జాతీయ అనిశ్చితి మధ్య, ‘భారతీయ శకం‘ గురించి చర్చించడానికి మనం ఇక్కడ సమావేశమవుతున్నాం. ఈ రోజు భారత్ పై ఉన్న నమ్మకం అద్వితీయమైనదని దీన్ని బట్టి అర్థమవుతోంది. భారత్ ఆత్మవిశ్వాసం అసాధారణమని ఇది రుజువు చేస్తోంది.
మిత్రులారా,
నేడు, భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. భారత్ ప్రస్తుతం జిడిపి పరంగా అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. గ్లోబల్ ఫిన్ టెక్ అడాప్షన్ రేట్ల పరంగా మనం నంబర్ వన్ గా ఉన్నాం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో మనం నెంబర్ వన్ గా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగ వ్యవస్థ మనదే. ప్రపంచంలోని వాస్తవ డిజిటల్ లావాదేవీల్లో సగానికిపైగా భారత్ లోనే జరుగుతున్నాయి. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థను కలిగి ఉంది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. తయారీ విషయానికి వస్తే, భారత్ రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. అంతే కాదు, భారత్ ప్రపంచంలోనే అతి పిన్న దేశం. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల వనరులున్న మూడో అతి పెద్ద దేశం కూడా మనదే. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఏదైనా సరే భారత్ స్పష్టంగా ఒక అనుకూల స్థానంలో ఉంది.
మిత్రులారా,
‘సంస్కరణ, పనితీరు, పరివర్తన‘ అనే మంత్రాన్ని అనుసరిస్తూ దేశాన్ని శరవేగంగా ముందుకు నడిపించేందుకు నిరంతరం నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రభావమే 60 ఏళ్ల తర్వాత భారత ప్రజలు వరుసగా మూడోసారి ఒకే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి దారితీసింది. ప్రజల జీవితాలు మారినప్పుడు, దేశం సరైన మార్గంలో పయనిస్తోందనే నమ్మకం వారిలో కలుగుతుంది. ఈ భావన భారత ప్రజల తీర్పులో ప్రతిబింబించింది. 140 కోట్ల మంది పౌరుల విశ్వాసం ఈ ప్రభుత్వానికి గొప్ప ఆస్తి.
భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం మా నిబద్ధత. మా మూడో పదవీ కాలం మొదటి మూడు నెలల్లో మేం చేసిన పనిలో మీరు ఈ నిబద్ధతను చూడవచ్చు. సాహసోపేతమైన విధాన మార్పులు, ఉద్యోగాలు , నైపుణ్యాల పట్ల బలమైన నిబద్ధత, సుస్థిర వృద్ధి , ఆవిష్కరణలపై దృష్టి, ఆధునిక మౌలిక సదుపాయాలు, జీవన నాణ్యత , వేగవంతమైన వృద్ధి కొనసాగింపు మా మొదటి మూడు నెలల విధానాలలో ప్రతిబింబిస్తాయి. ఈ కాలంలో 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన నిర్ణయాలు తీసుకున్నాం. ఈ మూడు నెలల్లోనే భారత్ లో అనేక భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక కేంద్రాలు (ఇండస్ట్రియల్ నోడ్స్ ) ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అదనంగా 3 కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపాం.
మిత్రులారా,
భారతదేశం వృద్ధి కథలో మరొక ముఖ్యమైన అంశం దాని సమ్మిళిత స్ఫూర్తి. ఒకప్పుడు వృద్ధితో పాటు అసమానతలు వస్తాయని భావించేవారు. కానీ భారత్ లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. వృద్ధితో పాటు భారత్ లో సమ్మిళిత కూడా చోటు చేసుకుంటోంది. ఫలితంగా గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. భారత్ శరవేగంగా పురోగమించడంతో పాటు అసమానతలు తగ్గి అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తున్నాం.
మిత్రులారా,
భారత్ వృద్ధి అంచనాలపై విశ్వాసం కూడా మనం ఏ దిశలో పయనిస్తున్నామో తెలియజేస్తుంది. ఇటీవలి వారాలు, నెలల డేటాలో మీరు దీనిని చూడవచ్చు. గత ఏడాది మన ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రపంచ బ్యాంకు అయినా, ఐఎంఎఫ్ అయినా, మూడీస్ అయినా భారత్ పై తమ అంచనాలను నవీకరించాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ భారత్ 7+ రేటుతో వృద్ధి చెందుతుందని ఈ సంస్థలన్నీ చెబుతున్నాయి. అంతకంటే మెరుగ్గా రాణిస్తామనే నమ్మకం మన భారతీయులకు ఉంది.
మిత్రులారా,
భారత్ పై ఈ నమ్మకం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఉత్పాదక రంగం అయినా, సేవారంగమైనా నేడు ప్రపంచం భారత్ ను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా చూస్తోంది. ఇది యాదృచ్ఛికం కాదు, గత పదేళ్లలో అమలు చేసిన పెద్ద సంస్కరణల ఫలితమే. ఈ సంస్కరణలు భారత్ స్థూల ఆర్థిక మౌలికాంశాలను మార్చివేశాయి. భారత్ బ్యాంకింగ్ సంస్కరణలు కేవలం బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను బలపరచడమే కాకుండా, వాటి రుణాల మంజూరు సామర్థ్యాన్ని కూడా పెంచడం ఇందుకు ఉదాహరణ. అదేవిధంగా, జీఎస్టీ వివిధ కేంద్ర , రాష్ట్ర పరోక్ష పన్నులను ఏకీకృతం చేసింది. దివాలా చట్టం (ఐబిసి) బాధ్యత, రికవరీ , పరిష్కారాల కొత్త క్రెడిట్ సంస్కృతిని అభివృద్ధి చేసింది. గనులు, రక్షణ, అంతరిక్షం వంటి రంగాలు ప్రైవేటు సంస్థలకు, మన యువ పారిశ్రామికవేత్తలకు ద్వారాలు తెరిచాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఎఫ్డీఐ విధానాన్ని సరళీకరించాం. రవాణా ఖర్చులు , సమయాన్ని తగ్గించడానికి మేం ఆధునిక మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతున్నాం. గత దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను గణనీయంగా పెంచాం.
మిత్రులారా,
భారత్ ప్రభుత్వంలో కొనసాగుతున్న కార్యక్రమాల్లో సంస్కరణల ప్రక్రియను సమగ్రంగా చేర్చాం. 40,000కి పైగా నిర్బంధ షరతులను తొలగించాం. కంపెనీల చట్టాన్ని నేరరహితం చేశాం. గతంలో వ్యాపార కార్యకలాపాలను క్లిష్టతరం చేసిన అనేక నిబంధనలను సవరించాం. కంపెనీలకు అనుమతులు పొందడం, ప్రారంభించడం, మూసివేయడం వంటి ప్రక్రియలను సులభతరం చేయడానికి జాతీయ సింగిల్ విండో వ్యవస్థ అందుబాటులో ఉంది. ఇప్పుడు, రాష్ట్ర స్థాయిలో సంస్కరణల ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నాం.
మిత్రులారా,
తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ – పిఎల్ ఐ) ను ప్రవేశ పెట్టాం. దీని ప్రభావం ఇప్పుడు అనేక రంగాల్లో కనిపిస్తోంది. గత మూడేళ్లలో పీఎల్ఐ సుమారు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ఉత్పత్తి, విక్రయాలు సుమారు రూ.11 లక్షల కోట్లు పెరిగాయి. అంతరిక్షం, రక్షణ రంగాల్లోనూ భారత్ గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ రంగాలలో అవకాశాలు ఇటీవలే వచ్చినప్పటికీ అంతరిక్ష రంగంలో ఇప్పటికే 200కు పైగా స్టార్టప్ లు ఆవిర్భవించాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం రక్షణ ఉత్పత్తుల్లో మన ప్రైవేటు రక్షణ సంస్థల వాటా 20 శాతంగా ఉంది.
మిత్రులారా,
ఎలక్ట్రానిక్స్ రంగం వృద్ధి మరింత చెప్పుకోదగినది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం, భారత్ మొబైల్ ఫోన్లను ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం భారత్ లో 33 కోట్లకుపైగా మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయి. నిజానికి మీరు ఏ రంగాన్ని చూసినా భారత్ లో పెట్టుబడులు పెట్టేవారు అధిక రాబడులు పొందడానికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి.
మిత్రులారా,
భారత్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్ వంటి కీలక టెక్నాలజీలపై కూడా దృష్టి సారించింది. ఈ రంగాల్లో గణనీయంగా పెట్టుబడులు పెడుతున్నాం. మా ఎఐ మిషన్ ఆ రంగంలో పరిశోధన, నైపుణ్యాల అభివృద్ధి రెండింటినీ మెరుగు పరుస్తుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద మొత్తం రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. త్వరలో భారత్ లోని ఐదు సెమీకండక్టర్ ప్లాంట్లు ‘మేడ్ ఇన్ ఇండియా‘ చిప్ లను ప్రపంచంలోని ప్రతి మూలకు అందించడం ప్రారంభిస్తాయి.
మిత్రులారా,
మీ అందరికి తెలిసిందే, భారత్ సులభంగా అందుబాటులో ఉండే మేధోశక్తికి ప్రధాన వనరుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,700కు పైగా కంపెనీల సామర్థ్య కేంద్రాలు నేడు భారత్ లో పనిచేయడమే ఇందుకు నిదర్శనం. ఈ కేంద్రాలు ప్రపంచానికి అత్యంత నైపుణ్యం కలిగిన సేవలను అందిస్తున్న 20 లక్షల మంది భారతీయ యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి. నేడు, భారత్ ఈ యువత ప్రాతినిధ్యాన్ని గరిష్టంగా పెంచడంపై మరింత దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఇందుకోసం విద్య, ఆవిష్కరణలు, నైపుణ్యాలు, పరిశోధనలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నూతన జాతీయ విద్యావిధానం అమలుతో ఈ రంగంలో గణనీయమైన సంస్కరణను ప్రవేశపెట్టాం. గత పదేళ్లలో ప్రతి వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం, ప్రతిరోజూ రెండు కొత్త కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఇదే కాలంలో మన దేశంలో వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపు అయింది.
ఇంకా మిత్రులారా
విద్యను అందుబాటులోకి తేవడమే కాకుండా నాణ్యతను మెరుగుపర్చడంపై దృష్టి సారిస్తున్నాం. ఫలితంగా గత దశాబ్ద కాలంలో క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ లో భారతీయ సంస్థల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ ఏడాది బడ్జెట్ లో లక్షలాది మంది యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్ కింద తొలిరోజే 111 కంపెనీలు పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్నాయి. ఈ పథకం ద్వారా కోటి మంది యువతకు ప్రధాన కంపెనీల్లో ఇంటర్న్ షిప్ లు ఇస్తున్నాం.
మిత్రులారా,
గత పదేళ్లలో భారత పరిశోధనా ఫలితాలు, పేటెంట్ కోసం దరఖాస్తులు కూడా వేగంగా పెరిగాయి. దశాబ్ద కాలంలోనే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో భారత్ 81వ స్థానం నుంచి 39వ స్థానానికి ఎగబాకింది. ఇంకా ముందుకు సాగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పరిశోధనలకు అనుకూల వ్యవస్థను బలోపేతం చేయడానికి భారతదేశం ఒక ట్రిలియన్ రూపాయల విలువైన పరిశోధన నిధిని కూడా సృష్టించింది.
మిత్రులారా,
నేడు, హరిత (గ్రీన్) భవిష్యత్తు , హరిత ఉద్యోగాల విషయం లో ప్రపంచం భారతదేశం పై ఎన్నో అంచనాలను కలిగి ఉంది. ఈ రంగంలో మీకు కూడా సమానంగా గణనీయమైన అవకాశాలు ఉన్నాయి. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సును మీరంతా గమనించారు. ఈ సదస్సులోని అనేక విజయాలలో ఒకటి హరిత మార్పు కోసం పునరుద్ధరించిన ఉత్సాహం. జి20 సదస్సులో, భారత్ చొరవతో గ్లోబల్ బయోఫ్యూల్ అలయన్స్ ప్రారంభమయింది. జి20 సభ్య దేశాలు భారత్ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన అభివృద్ధికి గట్టి మద్దతు ఇచ్చాయి. భారత్లో, ఈ దశాబ్దం ముగిసే నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాం. మైక్రో స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తిని కూడా అభివృద్ధి చేస్తున్నాం.
భారత ప్రభుత్వం పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది, ఇది ఒక భారీ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు, సోలార్ మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించేందుకు ప్రతి ఇంటికీ నిధులు సమకూరుస్తున్నాం. ఇప్పటివరకు 13 మిలియన్లకు పైగా అంటే కోటి 30 లక్షల కుటుంబాలు ఈ పథకానికి నమోదు చేసుకున్నాయి, అంటే ఈ కుటుంబాలు సౌర విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారాయి. దీనివల్ల ఒక్కో కుటుంబానికి సగటున రూ.25,000 ఆదా అవుతుంది. ఉత్పత్తి అయ్యే ప్రతి మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ కు 50-60 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించనున్నారు. ఈ పథకం సుమారు 17 లక్షలఃఉద్యోగాలను సృష్టిస్తుంది, నైపుణ్యం కలిగిన యువతతో విస్తారమైన శ్రామిక శక్తిని తయారు చేస్తుంది. అందువల్ల, ఈ రంగంలో కూడా మీకు అనేక కొత్త పెట్టుబడి అవకాశాలు పుట్టుకొస్తున్నాయి.
మిత్రులారా,
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం గణనీయమైన మార్పు కు లోనవుతోంది. బలమైన ఆర్థిక మూలాలతో, భారతదేశం స్థిరమైన అధిక వృద్ధి మార్గంలో ఉంది. ప్రస్తుతం భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి మాత్రమే కాకుండా అక్కడే స్థిరంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నేడు ప్రపంచం అన్ని రంగాల్లో అపారమైన అవకాశాలను అందిస్తోంది. ఈ సమ్మేళనం లో మీ చర్చలు రాబోయే రోజుల్లో అనేక విలువైన దృక్కోణాలు అందిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ ప్రయత్నానికి నేను నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ఇది మనకు చర్చా వేదిక మాత్రమే కాదు. ఇక్కడ జరిగే చర్చలు, ప్రస్తావించే అంశాలు, చేయవలసినవి, చేయకూడనివి– ప్రయోజనకరమైనవి– మా ప్రభుత్వ వ్యవస్థలో కచ్చితంగా అన్వయింపచేసుకుంటాం. ఈ మథన ప్రక్రియలో మీరు అందించే విజ్ఞానాన్ని మా దేశానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించడానికి మేము ఉపయోగిస్తాము. అందువల్ల మీ భాగస్వామ్యం మాకు చాలా ముఖ్యమైనది. మీరు ఇచ్చే ప్రతి సలహాకు విలువ ఉంటుంది. మీ ఆలోచనలు, మీ అనుభవం–అవి మా ఆస్తులు. మీ అందరి సహకారానికి మరోసారి ధన్యవాదాలు. ప్రశంసనీయమైన ప్రయత్నాలకు గానూ ఎన్.కె. సింగ్ ను , ఆయన బృందాన్ని నేను అభినందిస్తున్నాను.
హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలతో.
ధన్యవాదాలు!
***
Addressing the Kautilya Economic Conclave. https://t.co/sWmC6iHAyZ
— Narendra Modi (@narendramodi) October 4, 2024
Today, India is the fastest growing major economy. pic.twitter.com/uRcQPPNG5X
— PMO India (@PMOIndia) October 4, 2024
Reform, Perform & Transform. pic.twitter.com/UlsZ5LA8p6
— PMO India (@PMOIndia) October 4, 2024
Commitment to carry out structural reforms to make India developed. pic.twitter.com/41VG83RZFN
— PMO India (@PMOIndia) October 4, 2024
भारत में growth के साथ inclusion भी हो रहा है। pic.twitter.com/o9ZYz9zDAW
— PMO India (@PMOIndia) October 4, 2024
India has made 'process reforms' a part of the continuing activities of the government. pic.twitter.com/581cAat1vV
— PMO India (@PMOIndia) October 4, 2024
Today India's focus is on critical technologies like AI and semiconductors. pic.twitter.com/FlrdGxd7Ut
— PMO India (@PMOIndia) October 4, 2024
Special package for skilling and internship of youth. pic.twitter.com/5yUMwhcPeD
— PMO India (@PMOIndia) October 4, 2024
India is on the rise and this is seen in diverse sectors like science, technology and innovation. pic.twitter.com/gjHHmhmfU5
— Narendra Modi (@narendramodi) October 4, 2024
India’s growth story is based on the mantra of Reform, Perform and Transform. In just three months after assuming office for the third term, we have made bold policy changes and launched mega infrastructure projects that have significantly benefited countless citizens. pic.twitter.com/mNKEvE6Srb
— Narendra Modi (@narendramodi) October 4, 2024
Reforms in banking, GST, IBC and FDI have transformed our economy.
— Narendra Modi (@narendramodi) October 4, 2024
We are now among the world’s top investment destinations. pic.twitter.com/E8QCFDh6YA
India’s manufacturing sector is thriving. We are witnessing growth in sectors like electronics production, defence, space, AI and semiconductors. Soon, Indian-made chips will power the world! pic.twitter.com/SkYeqxXSDZ
— Narendra Modi (@narendramodi) October 4, 2024
Our government’s commitment to education and research has led to a significant rise in the number of Indian institutions gaining global recognition. We are also implementing initiatives to support internships and skill development for our youth. pic.twitter.com/7b4T6YLvmG
— Narendra Modi (@narendramodi) October 4, 2024