Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

23 ఫిబ్రవరి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 119 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతిచోటా క్రికెట్ వాతావరణం ఉంది. క్రికెట్‌లో సెంచరీ థ్రిల్ ఏమిటో మనందరికీ బాగా తెలుసు. ఈ రోజు నేను మీతో క్రికెట్ గురించి మాట్లాడను. కానీ భారతదేశం అంతరిక్షంలో చేసిన అద్భుతమైన సెంచరీ గురించి మాట్లాడతాను. గత నెలలో ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని దేశం యావత్తూ తిలకించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు. అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలను చేరుకోవాలనే మన సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మన అంతరిక్ష రంగ ప్రయాణం చాలా సాధారణ రీతిలో ప్రారంభమైంది. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. అయినా మన శాస్త్రవేత్తలు ముందుకు సాగుతూ, విజయం సాధించారు. కాలక్రమేణా అంతరిక్ష రంగ ప్రయాణంలో మన విజయాల జాబితా చాలా పెద్దదిగా మారింది. అది ప్రయోగ వాహన తయారీ కావచ్చు. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఎల్-1 విజయం కావచ్చు. ఒకే రాకెట్‌తో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అపూర్వమైన కృషి కావచ్చు. ఏదైనా ఇస్రో విజయాల పరిధి చాలా పెద్దది. గత 10 సంవత్సరాలలోనే దాదాపు 460 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇందులో ఇతర దేశాలకు చెందిన అనేక ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో మనం గమనిస్తోన్న  ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో మహిళా శక్తి భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ఈ రోజు అంతరిక్ష రంగం మన యువతకు ఇష్టమైనదిగా మారడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రాంతంలో స్టార్టప్‌లు, ప్రైవేట్ రంగ అంతరిక్ష సంస్థల సంఖ్య వందలకు చేరుకుంటుందని కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉంటారు! జీవితంలో ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన పని ఏదైనా చేయాలనుకునే మన యువతకు అంతరిక్ష రంగం ఒక అద్భుతమైన ఎంపికగా మారుతోంది.

మిత్రులారా! రాబోయే కొద్ది రోజుల్లో మనం ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ జరుపుకోబోతున్నాం. మన పిల్లలు, యువత సైన్స్ పట్ల ఆసక్తి, ఇష్టం కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీని గురించి నాకు ఒక ఆలోచన ఉంది. ఈ ఆలోచనను మీరు ‘శాస్త్రవేత్తగా ఒక రోజు’ అని పిలుస్తారు. అంటే మీరు ఒక రోజు శాస్త్రవేత్తగా గడపడానికి ప్రయత్నించాలి. మీ సౌలభ్యం, మీ కోరిక ప్రకారం మీరు ఏ రోజునైనా ఎంచుకోవచ్చు. ఆ రోజున మీరు పరిశోధనా ప్రయోగశాల, ప్లానిటోరియం లేదా స్పేస్ సెంటర్ వంటి ప్రదేశాలను సందర్శించాలి. ఇది సైన్స్ పట్ల మీ ఉత్సుకతను మరింత పెంచుతుంది. అంతరిక్షం, విజ్ఞాన శాస్త్రం లాగే భారతదేశం తన బలమైన గుర్తింపును వేగంగా ఏర్పరుచుకుంటున్న మరొక రంగం ఉంది- ఈ రంగం AI. అంటే కృత్రిమ మేధ. ఇటీవల నేను ఒక భారీ స్థాయి AI సమావేశానికి హాజరు కావడానికి పారిస్ వెళ్ళాను. ఈ రంగంలో భారతదేశం సాధించిన పురోగతిని అక్కడ ప్రపంచం ఎంతో ప్రశంసించింది.   మన దేశంలో ప్రజలు నేడు AIని వివిధ మార్గాల్లో ఉపయోగిస్తున్న ఉదాహరణలను కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణకు తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో థోడాసం కైలాశ్ గారు అనే ఉపాధ్యాయుడు ఉన్నారు. డిజిటల్ పాటలు, సంగీతం పట్ల ఆయనకున్న ఆసక్తి మన ఆదివాసీ భాషలను కాపాడటంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఆయన కృత్రిమ మేధ సాధనాల సహాయంతో కొలామి భాషలో పాటను కంపోజ్ చేయడం ద్వారా అద్భుతాలు చేశారు. ఆయన కొలామి భాషలోనే కాకుండా అనేక ఇతర భాషలలో పాటలను రూపొందించడానికి AIని ఉపయోగిస్తున్నారు. మన ఆదివాసీ సోదర సోదరీమణులు సామాజిక మాధ్యమాల్లో ఆయన ట్రాక్‌లను చాలా ఇష్టపడుతున్నారు. అంతరిక్ష రంగమైనా, కృత్రిమ మేధ అయినా మన యువత భాగస్వామ్యం పెరుగుతోంది. ఒక కొత్త విప్లవానికి జన్మనిస్తోంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను స్వీకరించడంలో, ప్రయత్నించడంలో భారతదేశ ప్రజలు ఎవరికీ తీసిపోరు.

నా ప్రియమైన దేశవాసులారా! వచ్చే నెల మార్చి 8వ తేదీ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. మన మహిళా శక్తికి జోహార్లు అర్పించడానికి ఇది ఒక ప్రత్యేక సందర్భం. దేవీ మహాత్మ్యంలో ఇలా ఉంది.-

విద్యా: సమస్తా: తవ దేవి భేదా:

స్త్రీ: సమస్తా: సకలా జగత్సు|

అంటే విద్యలన్నీ దైవం  వివిధ రూపాల వ్యక్తీకరణ. ప్రపంచంలోని సమస్త స్త్రీ శక్తిలో దైవం ప్రతిబింబిస్తుంది. మన సంస్కృతిలో, ఆడపిల్లల పట్ల గౌరవం అత్యంత ముఖ్యమైనది. మన స్వాతంత్ర్య పోరాటంలో, రాజ్యాంగ రూపకల్పనలో దేశ మాతృశక్తి కూడా పెద్ద పాత్ర పోషించింది. రాజ్యాంగ సభలో మన జాతీయ జెండాను ప్రస్తుతిస్తూ హంసా మెహతా గారు చెప్పిన విషయాలను నేను ఆమె స్వరంలో మీ అందరితో పంచుకుంటున్నాను.

 

# ఆడియో:

ఈ మహోన్నతమైన ఇంటిపై ఎగురుతున్న ఈ మొదటి జెండా భారత మహిళల బహుమతిగా ఉండాలని అనడంలో వస్తువుల నాణ్యతాపరమైన ఔచిత్యం ఉంది. కాషాయ రంగు ఉదయించింది. మన దేశ స్వాతంత్ర్యం కోసం మనం పోరాడాం. బాధపడ్డాం. త్యాగం చేశాం. ఈ రోజు మనం మన లక్ష్యాన్ని సాధించాం. మన స్వేచ్ఛకు గుర్తుగా ఉండే దీన్ని ప్రదర్శించడం ద్వారా మనం దేశానికి మన సేవలను అందించేందుకు పునరంకితం అవుతున్నాం. గొప్ప భారతదేశం కోసం, దేశాల మధ్య ఒక దేశంగా ఉండే ఉత్తమ దేశ నిర్మాణానికి మనం ప్రతిజ్ఞ చేస్తాం. మనం సాధించిన స్వేచ్ఛను కొనసాగించే విధంగా గొప్ప లక్ష్యం కోసం పనిచేయడానికి మనం ప్రతిజ్ఞ చేస్తాం.

మిత్రులారా! హంసా మెహతా గారు మన జాతీయ జెండాను సృష్టించినప్పటి నుండి దాని కోసం జరిగిన త్యాగాల వరకు దేశవ్యాప్తంగా మహిళల సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. మన త్రివర్ణ పతాకంలోని కాషాయ రంగులో కూడా ఈ భావన ప్రతిబింబిస్తుందని నమ్మారు. భారతదేశాన్ని బలంగా, సంపన్నంగా మార్చడంలో మన మహిళా శక్తి తన విలువైన సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నేడు ఈ మాటలు నిజమవుతున్నాయి. మీరు ఏ రంగాన్ని చూసినా, మహిళల సహకారం ఎంత విస్తృతంగా ఉందో మీకు తెలుస్తుంది. మిత్రులారా! ఈసారి మహిళా దినోత్సవం నాడు నేను మన మహిళా శక్తికి అంకితం చేసే ఒక చొరవ తీసుకుంటున్నాను. ఈ ప్రత్యేక సందర్భంగా నేను నా సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాలను వారికి ఒకరోజు  అప్పగించాలనుకుంటున్నాను. దేశంలోని కొన్ని నేను దానిని ఒక రోజు స్ఫూర్తిదాయక మహిళలకు అప్పగిస్తున్నాను. వివిధ రంగాలలో విజయం సాధించిన, వివిధ రంగాలలో నూతన ఆవిష్కరణలు చేసి, తమ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్న మహిళలకు నా సామాజిక మాధ్యమ ఖాతాలను ఒకరోజు కోసం అప్పగిస్తాను. మార్చి 8వ తేదీన ఆ మహిళలు తమ పనుల వివరాలను,  అనుభవాలను దేశ ప్రజలతో పంచుకుంటారు. వేదిక నాది కావచ్చు. కానీ వారి అనుభవాలు, సవాళ్లు, విజయాల గురించి ఉంటుంది. ఈ అవకాశాన్ని పొందాలనుకుంటే నమో యాప్‌లో ప్రత్యేక ఫోరమ్ ద్వారా ఈ ప్రయోగంలో భాగం కావచ్చు. నా ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా మీ సందేశాన్ని మొత్తం ప్రపంచానికి తెలియజేయండి. ఈసారి మహిళా దినోత్సవం నాడు మనమందరం ఆ అజేయమైన మహిళా శక్తిని ఉత్సవంగా జరుపుకుందాం. గౌరవిద్దాం. నమస్కరిద్దాం.

నా ప్రియమైన దేశప్రజలారా! ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ క్రీడల ఉత్సాహాన్ని ఆస్వాదించినవారు మీలో చాలా మంది ఉంటారు. దేశవ్యాప్తంగా 11 వేల మందికి పైగా అథ్లెట్లు ఇందులో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. ఈ సంఘటన దేవభూమి  కొత్త రూపాన్ని ప్రదర్శించింది. ఉత్తరాఖండ్ ఇప్పుడు దేశంలో బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోంది. ఉత్తరాఖండ్ ఆటగాళ్ళు కూడా అద్భుతంగా రాణించారు. ఈసారి ఉత్తరాఖండ్ 7వ స్థానంలో నిలిచింది. ఇదే క్రీడా శక్తి. ఇది వ్యక్తులు, సమాజాలతో పాటు యావత్ రాష్ట్రాన్ని కూడా మారుస్తుంది. ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే శ్రేష్ఠమైన సంస్కృతిని కూడా ప్రోత్సహిస్తుంది.

మిత్రులారా! ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ ఆటల్లో  కొన్ని బాగా గుర్తుండిపోయే ప్రదర్శనల గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రీడల్లో అత్యధిక సంఖ్యలో బంగారు పతకాలు గెలుచుకున్నందుకు సర్వీసెస్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. జాతీయ క్రీడలలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడిని నేను అభినందిస్తున్నాను. మన ఆటగాళ్లలో చాలా మంది ‘ఖేలో-ఇండియా’ ప్రచారం ఫలితంగానే బయటి ప్రపంచానికి తెలిశారు. హిమాచల్ ప్రదేశ్ నుండి సావన్ బర్వాల్, మహారాష్ట్ర నుండి కిరణ్ మాత్రే, తేజస్ షిర్సే, ఆంధ్రప్రదేశ్ నుండి జ్యోతి యారాజీ-  అందరూ దేశానికి కొత్త ఆశలను ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్, హర్యానాకు చెందిన హైజంపర్ పూజ, కర్ణాటకకు చెందిన స్విమ్మర్  ధినిధి దేసింధు దేశప్రజల హృదయాలను గెలుచుకున్నారు. వారు మూడు కొత్త జాతీయ రికార్డులను సృష్టించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సంవత్సరం జాతీయ క్రీడలలో టీనేజ్ ఛాంపియన్ల సంఖ్య ఆశ్చర్యకరంగా ఉంది. పదిహేనేళ్ల షూటర్ గెవిన్ ఆంటోనీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పదహారేళ్ల హ్యామర్ త్రో క్రీడాకారిణి అనుష్క యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన 19 సంవత్సరాల పోల్ వాల్టర్ దేవ్ కుమార్ మీనా భారతదేశ క్రీడా భవిష్యత్తు చాలా ప్రతిభావంతమైన నవతరం చేతుల్లో ఉందని నిరూపించారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన జాతీయ క్రీడలు ఓటమిని ఎప్పుడూ అంగీకరించని వారు ఖచ్చితంగా ‘గెలుస్తారు’ అని కూడా నిరూపించాయి. సుఖాలతో ఎవరూ ఛాంపియన్‌గా మారలేరు. మన యువ అథ్లెట్ల దృఢ సంకల్పం, క్రమశిక్షణతో భారతదేశం నేడు ప్రపంచ క్రీడా శక్తి కేంద్రంగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.  ఈ విషయంలో నేను సంతోషిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! డెహ్రాడూన్‌లో జాతీయ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా నేను చాలా ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించాను. ఇది దేశంలో కొత్త చర్చకు నాంది పలికింది. ఆ అంశం ‘ఊబకాయం’. ఆరోగ్యవంతమైన, దృఢమైన దేశంగా మారాలంటే మనం ఊబకాయం సమస్యను ఎదుర్కోవాలి. ఒక అధ్యయనం ప్రకారం ప్రస్తుతం ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలలో ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయి. పిల్లల్లో ఊబకాయం సమస్య కూడా నాలుగు రెట్లు పెరగడం మరింత ఆందోళన కలిగించే విషయం. 2022లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు.హెచ్.ఓ. గణాంకాలు చూపిస్తున్నాయి. అంటే వారు ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు ఉన్నారన్నమాట. ఈ గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందని మనందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అధిక బరువు లేదా ఊబకాయం అనేక రకాల సమస్యలు, వ్యాధులకు దారితీస్తుంది. మనమందరం కలిసి చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా ఈ సవాలును ఎదుర్కోవచ్చు. నేను సూచించిన ఒక పద్ధతి వంట నూనె వినియోగాన్ని పది శాతం (10%) తగ్గించడం. మీరు ప్రతి నెలా 10% తక్కువ నూనె వాడాలని నిర్ణయించుకుంటారు. తినడానికి నూనె కొంటున్నప్పుడు దానిలో 10% తక్కువ కొనుక్కోవాలని మీరు నిర్ణయించుకోవచ్చు. ఇది ఊబకాయాన్ని తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అవుతుంది. ఈరోజు ‘మన్ కీ బాత్’ లో ఈ అంశంపై కొన్ని ప్రత్యేక సందేశాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. స్థూలకాయాన్ని విజయవంతంగా అధిగమించడం ద్వారా తనను తాను నిరూపించుకున్న ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాతో ప్రారంభిద్దాం:

 

# ఆడియో

అందరికీ నమస్కారం. నేను నీరజ్ చోప్రాని మాట్లాడుతున్నాను. మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈసారి ‘మన్ కీ బాత్’ లో ఊబకాయం గురించి చర్చించడం దేశానికి చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంతో నాకు కూడా  సంబంధం ఉంది. ఎందుకంటే నేను గ్రౌండ్‌కి వెళ్లడం ప్రారంభించినప్పుడు- ఆ సమయంలో – నేను కూడా చాలా అధిక బరువుతో ఉన్నాను. నేను శిక్షణ ప్రారంభించి సరైన ఆహారం తినడం ప్రారంభించినప్పుడు నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. ఆ తర్వాత నేను ప్రొఫెషనల్ అథ్లెట్ అయినప్పుడు నాకు ఇది నాకు ఉపకరించింది. తల్లిదండ్రులు కూడా ఏవైనా అవుట్ డోర్ క్రీడలు ఆడాలని నేను చెప్పాలనుకుంటున్నాను. వారి పిల్లలను కూడా= తీసుకెళ్ళాలి. మంచి ఆరోగ్యకరమైన జీవనశైలితో నడిపించాలి. సరైన విధంగా తినాలి. వ్యాయామం కోసం ఒక గంట లేదా ఎక్కువ సమయం కేటాయించాలి. నేను ఇంకొక విషయం జోడించాలనుకుంటున్నాను. ఆహారంలో ఉపయోగించే నూనెను 10% తగ్గించాలని మన ప్రధాన మంత్రి చెప్తున్నారు. ఎందుకంటే మనం చాలాసార్లు వేపుడు  వస్తువులను తింటాం. ఇవి ఊబకాయంపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి నేను ప్రతి ఒక్కరికీ చెప్పాలనుకుంటున్నది – ఈ విషయాలను నివారించి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇదే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సామూహిక కృషి ద్వారా మనం మన దేశాన్నిఉన్నత స్థాయికి తీసుకెళ్ళవచ్చు. ధన్యవాదాలు.

నీరజ్ గారూ.. చాలా చాలా ధన్యవాదాలు. ఈ విషయంపై ప్రముఖ అథ్లెట్ నిఖత్ జరీన్ గారు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు:

 

# ఆడియో

హాయ్… నా పేరు నిఖత్ జరీన్. నేను రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ని. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ‘మన్ కీ బాత్’లో ఊబకాయం గురించి ప్రస్తావించారు. దేశం మొత్తం దృష్టి పెట్టాల్సిన విషయమిది. భారతదేశంలో ఊబకాయం చాలా వేగంగా వ్యాపిస్తున్నందు వల్ల మనం మన ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ఊబకాయాన్ని మనం నివారించాలి. సాధ్యమైనంతవరకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ప్రయత్నించాలి. నేను కూడా ఒక అథ్లెట్ కాబట్టి నేను ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను అనుసరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను అనుకోకుండా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటే లేదా నూనె పదార్థాలు తింటే అది నా పనితీరుపై ప్రభావం చూపుతుంది. నేను రింగ్‌లో త్వరగా అలసిపోతాను. నేను వంట నూనెలను వీలైనంత తక్కువగా ఉపయోగించటానికి ప్రయత్నిస్తాను. బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించి రోజువారీ శారీరక శ్రమ చేస్తాను. అందుకే నేను ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉంటాను. మనలా రోజూ ఉద్యోగానికి, పనికి వెళ్ళే సాధారణ ప్రజలు అందరూ ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచించాలి. రోజువారీ శారీరక శ్రమ చేయాలి. దీని వలన మనం గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు దూరంగా ఉంటాం. మనల్ని మనం ఫిట్‌గా ఉంచుకుంటాం. ‘ఎందుకంటే మనం ఫిట్‌గా ఉంటే భారతదేశం ఫిట్‌గా ఉంటుంది’.

నిఖత్ గారు కొన్ని మంచి విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు డాక్టర్ దేవి శెట్టి ఏమి చెబుతున్నారో విందాం. ఆయన చాలా గౌరవనీయమైన వైద్యుడని మీ అందరికీ తెలుసు. ఆయన ఈ విషయంపై నిరంతరం కృషి చేస్తున్నారు:

 

# ఆడియో

అత్యంత ప్రజాదరణ పొందిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఊబకాయం గురించి అవగాహన కల్పించినందుకు మన గౌరవనీయ ప్రధానమంత్రికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేడు ఊబకాయం కాస్మెటిక్ సమస్య కాదు. ఇది చాలా తీవ్రమైన వైద్య సమస్య. భారతదేశంలోని చాలా మంది యువకులు ఊబకాయంతో బాధపడుతున్నారు. నేటి ఊబకాయానికి ప్రధాన కారణం తక్కువ నాణ్యత ఉండే  ఆహారం తీసుకోవడం. ముఖ్యంగా బియ్యం, చపాతీ, చక్కెర వంటి కార్బోహైడ్రేట్లను అధికంగా తీసుకోవడం, నూనెను ఎక్కువగా తీసుకోవడం. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఫ్యాటీ లివర్ మొదలైన అనేక ఇతర సమస్యలకు ఊబకాయం దారితీస్తుంది. కాబట్టి యువకులందరికీ నా సలహా. వ్యాయామం ప్రారంభించండి. మీ ఆహారాన్ని నియంత్రించండి. చాలా చురుకుగా ఉండండి. మీ బరువును జాగ్రత్తగా చూసుకోండి. మరోసారి మీ అందరికీ చాలా సంతోషకరమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.  మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.

 

మిత్రులారా! ఆహారంలో నూనె తక్కువగా వాడటం, ఊబకాయాన్ని ఎదుర్కోవడం అనేది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే కాదు. కుటుంబం పట్ల మన బాధ్యత కూడా. ఆహారంలో నూనెను అధికంగా వాడటం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి అనేక వ్యాధులు వస్తాయి. మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన భవిష్యత్తును మరింత బలంగా, ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా మార్చుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ దిశలో మన ప్రయత్నాలను పెంచాలి. మన జీవితాల్లో అమలు చేయాలి. మనమందరం కలిసి దీన్ని చాలా సమర్థవంతంగా ఆడుతూ పాడుతూ చేయగలం. ఉదాహరణకు నేను 10 మందిని వారి ఆహారంలో నూనెను 10% తగ్గించగలరా అని ఈరోజు మన్ కీ బాత్ ఎపిసోడ్ తర్వాత అభ్యర్థిస్తాను. సవాలు చేస్తాను. మరో 10 మంది కొత్త వ్యక్తులకు ఇదే సవాలును ఇవ్వమని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. ఇది ఊబకాయంతో పోరాడటానికి చాలా సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను.

మిత్రులారా! ఆసియా సింహం, హాంగుల్, పిగ్మీ హాగ్స్, సింహం తోక ఉండే  మకాక్ మధ్య సారూప్యత ఏమిటో మీకు తెలుసా? దీనికి సమాధానం ఏమిటంటే ఇవన్నీ ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. అవి మన దేశంలో మాత్రమే కనిపిస్తాయి. మనకు వృక్షజాలం, జంతుజాలంతో కూడిన చాలా శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఉంది. ఈ వన్యప్రాణులు మన చరిత్ర, సంస్కృతిలో లోతుగా ఉన్నాయి. అనేక జంతువులను మన దేవుళ్ల వాహనాలుగా కూడా చూస్తారు. మధ్య భారతదేశంలోని అనేక తెగల ప్రజలు భాగేశ్వరుడిని పూజిస్తారు.  మహారాష్ట్రలో వాఘోబాను పూజించే సంప్రదాయం ఉంది. అయ్యప్ప స్వామికి కూడా పులితో చాలా గాఢమైన సంబంధం ఉంది. సుందర్బన్స్‌లో పులి వాహనంగా ఉండే బోన్‌బీబీని పూజిస్తారు. కర్ణాటకలో హులి వేష, తమిళనాడులో పులి, కేరళలో పులికలి వంటి అనేక సాంస్కృతిక నృత్యాలు మనకు ఉన్నాయి.  ఇవి ప్రకృతి, వన్యప్రాణులకు సంబంధించినవి. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నందుకు నా ఆదివాసీ సోదర సోదరీమణులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్ణాటకలోని బిఆర్‌టి టైగర్ రిజర్వ్‌లో పులుల జనాభాలో స్థిరమైన పెరుగుదల ఉంది. దీనికి ప్రధాన కారణం పులిని పూజించే సోలిగా తెగ ప్రజలే. వీరి కారణంగా ఈ ప్రాంతంలో మనిషి-జంతు సంఘర్షణ దాదాపుగా తక్కువగా ఉంది. గుజరాత్ ప్రజలు గిర్ లోని ఆసియా సింహాల రక్షణ, సంరక్షణలో కూడా గణనీయంగా దోహదపడ్డారు. ప్రకృతితో సహజీవనం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించారు. మిత్రులారా! ఈ ప్రయత్నాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పులులు, చిరుతలు, ఆసియా సింహాలు, ఖడ్గమృగాలు, జింకల జనాభా వేగంగా పెరుగుతోంది. భారతదేశంలోని వన్యప్రాణుల వైవిధ్యం ఎంత అందంగా ఉందో గమనించడం కూడా విలువైనది. ఆసియా సింహాలు దేశంలోని పశ్చిమ భాగంలో కనిపిస్తాయి. పులుల శ్రేణి తూర్పు, మధ్య, దక్షిణ భారతదేశంలో ఉంటుంది. ఖడ్గమృగాలు ఈశాన్య భారతదేశంలో కనిపిస్తాయి. భారతదేశంలోని ప్రతి ప్రాంతం ప్రకృతి పట్ల స్పందించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు కూడా కట్టుబడి ఉంది. అండమాన్-నికోబార్ దీవులతో అనేక తరాల అనుబంధం ఉన్న అనురాధా రావు గారి గురించి నాకు తెలిసింది. అనురాధ గారు చిన్న వయసులోనే జంతు సంక్షేమానికి తనను తాను అంకితం చేసుకున్నారు. మూడు దశాబ్దాలుగా జింకలు, నెమళ్ల రక్షణను తన ధ్యేయంగా చేసుకున్నారు. అక్కడి ప్రజలు ఆమెను ‘డీర్ ఉమన్’ అని పిలుస్తారు. మనం వచ్చే నెల ప్రారంభంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటాం.  వన్యప్రాణుల రక్షణలో పాల్గొనే వ్యక్తులను ప్రోత్సహించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ రంగంలో అనేక స్టార్టప్‌లు కూడా ఏర్పాటు కావడం నాకు చాలా సంతృప్తినిచ్చే విషయం.

మిత్రులారా! ఇది బోర్డు పరీక్షల సీజన్. నా యువ మిత్రులకు అంటే పరీక్షల యోధులకు వారి పరీక్షల సందర్భంగా శుభాకాంక్షలు. ఎటువంటి ఒత్తిడి లేకుండా పూర్తి సానుకూల స్ఫూర్తితో మీరు మీ జవాబుపత్రాలను సమర్పించాలి. ప్రతి సంవత్సరం ‘పరీక్ష పే చర్చ’లో పరీక్షా యోధులతో పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం సంస్థాగత రూపాన్ని పొందుతోంది. ఈ కార్యక్రమం ఈ రూపానికి చేరడం నాకు సంతోషం కలిగిస్తోంది. కొత్త నిపుణులు కూడా ఇందులో చేరుతున్నారు. ఈ సంవత్సరం ‘పరీక్షా పే చర్చ’ను కొత్త విధానంలో నిర్వహించడానికి ప్రయత్నించాం. నిపుణులు చేరారు. ఎనిమిది వేర్వేరు ఎపిసోడ్‌లు కూడా చేర్చడం జరిగింది. ఆహారం, పానీయాల విషయాలను కూడా ప్రస్తావించాం. మొత్తం పరీక్షల నుండి మొదలుకుని ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్యం వరకు వివిధ అంశాలను పొందుపరిచాం. మునుపటి టాపర్లు కూడా తమ ఆలోచనలను, అనుభవాలను అందరితో పంచుకున్నారు. దీని గురించి చాలా మంది యువకులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నాకు లేఖలు రాశారు. ప్రతి అంశాన్ని ఇందులో వివరంగా చర్చించడం వల్ల ఈ విధానం తమకు చాలా నచ్చిందని వారు రాశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన యువ స్నేహితులు ఈ ఎపిసోడ్‌లను పెద్ద సంఖ్యలో వీక్షించారు. ఈ కార్యక్రమం ఢిల్లీలోని సుందర్ నర్సరీలో నిర్వహించటం మీలో చాలా మందికి నచ్చింది. ఇప్పటివరకు ‘పరీక్ష పే చర్చ’ ఎపిసోడ్‌లను చూడలేకపోయిన మన యువ స్నేహితులు వీటిని తప్పక చూడాలి. ఈ ఎపిసోడ్‌లన్నీ నమో యాప్ లో అందుబాటులో ఉన్నాయి. మరోసారి పరీక్షా యోధులకు నా సందేశం “సంతోషంగా ఉండండి. ఒత్తిడి లేకుండా ఉండండి”.

నా ప్రియమైన మిత్రులారా! ఈసారి మన్ కీ బాత్ లో విషయాలింతే! వచ్చే నెలలో కొత్త అంశాలతో మనం మళ్ళీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుకుందాం. మీరు మీ ఉత్తరాలు, సందేశాలు నాకు పంపుతూనే ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

 

*****