ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వంటనూనెలు–నూనెగింజలపై జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ద్వారా దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు వంటనూనెల ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధించేలా చేసే (ఆత్మనిర్భర్ భారత్) లక్ష్యంతో ఈ మిషన్ ను రూపొందించారు. రూ.10,103 కోట్ల వ్యయంతో 2024-25 నుంచి 2030-31వరకు ఏడేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
తాజాగా ఆమోదం పొందిన ఎన్ఎమ్ఈఓ– నూనెగింజల కార్యక్రమం ఆవ, వేరుశనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి నూనె గింజల ఉత్పత్తిని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. అలాగే పత్తిగింజలు, రైస్ బ్రాన్, వృక్ష సంబంధ నూనెల వంటి ద్వితీయ వ్యవసాయ వనరుల నుంచి నూనెల సేకరణ, సంగ్రహణ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది. ప్రధాన నూనెగింజల ఉత్పత్తిని (2022-23లో) 39 మిలియన్ టన్నుల నుంచి 2030-31 నాటికి 69.7 మిలియన్ టన్నులకు పెంచే లక్ష్యంతో ఈ మిషన్ పనిచేస్తుంది. ఎన్ఎంఈవో–ఓపీ (ఆయిల్ పామ్)తో కలిసి, దేశీయ వంటనూనెల ఉత్పత్తిని 2030-31 నాటికి 25.45 మిలియన్ టన్నులకు పెంచడం ద్వారా 72% దేశీయ అవసరాలను తీర్చడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అధిక దిగుబడినిచ్చే అధిక నూనె కలిగిన వంగడాలను ఉపయోగించడం, వరిసాగు చేయలేని భూముల్లో నూనెగింజల సాగును విస్తరించడం, అంతరపంటల సాగును ప్రోత్సహించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. దీని కోసం జన్యు మార్పిడి వంటి అత్యాధునిక గ్లోబల్ సాంకేతికతలతో అభివృద్ధి చేసిన అత్యంత నాణ్యమైన విత్తనాలను మిషన్ ఉపయోగించుకుంటుంది.
నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందుబాటులో ఉంచడం కోసం ‘సీడ్ అథెంటికేషన్, ట్రేసబిలిటీ & హోలిస్టిక్ ఇన్వెంటరీ (సాథీ)’ ద్వారా ఈ మిషన్ 5 సంవత్సరాల ఆన్‌లైన్ విత్తన ప్రణాళికను ప్రవేశపెడుతుంది. సహకార సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్‌పీఓలు), ప్రభుత్వ, ప్రైవేట్ విత్తన కార్పొరేషన్లు సహా విత్తనోత్పత్తి సంస్థలతో రాష్ట్రాలు ముందస్తు ఒప్పందాలు చేసుకోవడానికి ఇది వీలుకల్పిస్తుంది. విత్తనోత్పత్తి మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కొత్తగా 65 విత్తన కేంద్రాలు, 50 విత్తన నిల్వ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
వీటికి అదనంగా, ఏడాదికి 10 లక్షలకు పైగా హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్ చేస్తూ 347 జిల్లాల వ్యాప్తంగా 600లకు పైగా వాల్యూ చైన్ క్లస్టర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎఫ్‌పీఓలు, సహకార సంఘాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల వంటి వాల్యూ చైన్ భాగస్వాములు ఈ క్లస్టర్ల నిర్వహణ చూసుకోనున్నారు. ఈ క్లస్టర్ల రైతులకు అత్యంత నాణ్యమైన విత్తనాలు, ఉత్తమ వ్యవసాయ పద్ధతుల (జీఏపీ)పై శిక్షణ, వాతావరణ, తెగులు నిర్వహణ పద్ధతుల గురించి సూచనలు అందుబాటులో ఉంటాయి.
అంతరపంటల సాగును, పంటల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తూ వరి, బంగాళాదుంప సాగుకు వీలులేని మరో 40 లక్షల హెక్టార్లలో అదనంగా నూనెగింజల సాగును విస్తరించడానికి మిషన్ ప్రయత్నిస్తోంది.
పత్తి గింజలు, రైస్ బ్రాన్, మొక్కజొన్న, వృక్ష సంబంధ నూనెలు (టీబీఓలు) వంటి మూలాల నుంచి సేకరణను పెంపొందించడానికి, పంట అనంతర యూనిట్లను స్థాపించడానికి, అప్గ్రేడ్ చేయడానికి ఎఫ్‌పీఓలు, సహకార సంస్థలు, పారిశ్రామికవేత్తలకు సహాయం అందించనున్నారు.
ఇంకా, సమాచారం, అవగాహన, కమ్యూనికేషన్ (ఐఈసీ) ప్రచారం ద్వారా వంట నూనెల కోసం సిఫార్సు చేసే ఆహారపరమైన మార్గదర్శకాల గురించి అవగాహనను ఇది ప్రోత్సహిస్తుంది.
దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం, వంటనూనెల విషయంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం (స్వావలంబన) సాధించడం తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, అలాగే రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు విదేశీమారక ద్రవ్యాన్ని ఆదా చేయడం లక్ష్యంగా మిషన్ పనిచేస్తుంది. ఈ మిషన్ ద్వారా తక్కువ నీటి వినియోగం, మెరుగైన భూసారం, బీడు భూములను ఉత్పాదకంగా ఉపయోగించడం వంటి ముఖ్యమైన పర్యావరణ ప్రయోజనాలను కూడా ఉంటాయి.
నేపథ్యం:
దేశీయంగా వంటనూనెల అవసరాల్లో 57%గా ఉన్న దిగుమతులపై దేశం ఎక్కువగా ఆధారపడి ఉంది. దీనిని పరిష్కరిస్తూ స్వావలంబనను ప్రోత్సహించడం కోసం భారత ప్రభుత్వం దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 2021లో ఆయిల్ పామ్ సాగును పెంచడం కోసం రూ.11,040 కోట్ల వ్యయంతో వంటనూనెలు–ఆయిల్ పామ్ (ఎన్ఈఎమ్ఓ–ఓపీ) జాతీయ మిషన్‌ను ప్రారంభించింది.
దీనికి అదనంగా ముఖ్యమైన నూనె గింజలను సాగు చేసే రైతులకు లాభదాయక ఆదాయం అందించేందుకు కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పీ)ని ప్రభుత్వం పెంచింది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎం–ఆశా) కొనసాగింపు ద్వారా రైతులకు ధర మద్దతు పథకం, ధర లోపం చెల్లింపు పథకం ద్వారా మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, చౌక దిగుమతుల నుంచి దేశీయ ఉత్పత్తిదారులను రక్షించడానికి, స్థానికంగా సాగును ప్రోత్సహించడానికి వంట నూనెలపై 20% దిగుమతి సుంకం విధించారు.
***
The Cabinet’s approval for a National Mission on Edible Oils – Oilseeds (NMEO-Oilseeds) is a major step towards Atmanirbharta. This mission will boost domestic oilseed production, support hardworking farmers and encourage sustainable agricultural practices.…
— Narendra Modi (@narendramodi) October 3, 2024