Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2024 వ సంవత్సరం ఫిబ్రవరి 25 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క 110 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్‌కి స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీనుండి పెద్ద సంఖ్యలో వచ్చిన  సూచనలు, స్పందనలు,  వ్యాఖ్యలను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్‌లో ఏ అంశాలను చేర్చాలనేదే సవాలు. నేను సానుకూల వైఖరితో నిండిన అనేక స్పందనలను అందుకున్నాను. ఇతరులకు ఆశాకిరణంగా మారడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి.

మిత్రులారా! కొన్ని రోజుల తర్వాత మార్చి 8వ తేదీన ‘మహిళా దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ప్రత్యేకమైన ఈ రోజు దేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళా శక్తి  సహకారానికి వందనాలు సమర్పించేందుకు  ఒక అవకాశం. మహిళలకు సమాన అవకాశాలు లభించినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని మహాకవి భారతియార్ అన్నారు. నేడు భారత మహిళా శక్తి ప్రతి రంగంలోనూ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. మన దేశంలో గ్రామాల్లో నివసించే మహిళలు కూడా డ్రోన్లను ఎగురవేస్తారని కొన్నేళ్ల క్రితం వరకు ఎవరైనా ఊహించారా? కానీ నేడు ఇది సాధ్యమవుతోంది. ఈరోజు ప్రతి ఊరిలో డ్రోన్ దీదీ గురించే చాలా చర్చ జరుగుతోంది. “నమో డ్రోన్ దీదీ, నమో డ్రోన్ దీదీ” అంటూ అందరి నోళ్లలో నానుతున్నారు. అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.  అందుకే ఈసారి ‘మన్ కీ బాత్’లో నమో డ్రోన్ దీదీతో ఎందుకు మాట్లాడకూడదని నేను కూడా అనుకున్నాను. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కి చెందిన నమో డ్రోన్ దీదీ సునీత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడుదాం.

మోదీ గారు: సునీతా దేవి గారూ.. మీకు నమస్కారం.

సునీతా దేవి: నమస్కారం సార్.

మోదీగారు: సునీత గారూ… ముందుగా నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ కుటుంబం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి.

సునీతాదేవి: సార్. మా కుటుంబంలో ఇద్దరు పిల్లలు, మేము ఉన్నాం. భర్త, మా  అమ్మ ఉన్నారు.

మోదీ గారు: సునీత గారూ… మీరేం చదువుకున్నారు?

సునీతా దేవి: సార్. నేను బి. ఏ. ఫైనల్ సార్.

మోదీగారు: మరి ఇల్లెలా గడుస్తుంది?

సునీతా దేవి: వ్యవసాయ పనులు చేస్తాం సార్.

మోదీగారు: సరే సునీత గారూ… ఈ డ్రోన్ దీదీగా మారే మీ ప్రయాణం ఎలా మొదలైంది? మీరు ఎక్కడ శిక్షణ పొందారు? ఎలాంటి మార్పులు జరిగాయి? ఏం  జరిగింది? నేను మొదటి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను.

సునీతా దేవి: సార్. అలహాబాద్‌లోని ఫుల్‌పూర్ ఇఫ్కో కంపెనీలో మా శిక్షణ జరిగింది. మేం అక్కడి నుండి శిక్షణ పొందాం సార్.

మోదీగారు: అప్పటివరకు మీరు డ్రోన్ల గురించి ఎప్పుడైనా విన్నారా?

సునీతా దేవి: సార్. గతంలో ఎప్పుడూ వినలేదు. ఒక్కసారి అలా చూశాం సీతాపూర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో.  మేం  మొదటిసారి డ్రోన్ ను అక్కడ చూశాం.

మోదీగారు: సునీత గారూ… మీరు మొదటి రోజు వెళ్ళినప్పటి అనుభూతిని నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను.

సునీతా దేవి: సార్..

మోదీగారు: మీకు డ్రోన్ ను మొదటి రోజు చూపించి ఉంటారు. అప్పుడు బోర్డు మీద ఏదో నేర్పించి ఉంటారు.  కాగితంపై నేర్పించి ఉంటారు. ఆపై మైదానానికి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించి ఉంటారు. ఇలా అన్ని విషయాలను మీరు నాకు పూర్తిగా చెప్పగలరా!

సునీతా దేవి: అవును సార్. మేం అక్కడికి వెళ్ళిన రెండో రోజు నుండి మా శిక్షణ మొదలైంది. ముందుగా థియరీ బోధించి ఆ తర్వాత రెండు రోజుల పాటు క్లాస్ నిర్వహించారు. క్లాస్‌లో డ్రోన్‌లోని భాగాలు, మేం చేయాల్సిందేమిటి, ఎలా చేయాలి, – ఇలా అన్నీ థియరీలో బోధించారు. మూడో రోజు మాకు పేపర్ పై పరీక్ష పెట్టారు. ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా కూడా పరీక్ష పెట్టారు. అంటే ముందుగా క్లాస్ నిర్వహించి తర్వాత పరీక్ష పెట్టారు. ఆ తర్వాత ప్రాక్టికల్ జరిపారు. డ్రోన్ ను ఎలా ఎగరేయాలి.. ఎలా కంట్రోల్ చేయాలి.. ఇలా ప్రతిదీ ప్రాక్టికల్ గా నేర్పించారు.

మోదీ గారు: డ్రోన్ పనితీరును ఎలా నేర్పించారు?

సునీతాదేవి: సార్…. వ్యవసాయంలో కూడా డ్రోన్ పని చేస్తుంది. వానాకాలం లేక ఇతర కాలాల్లో అయినా వానలు కురవడం వల్ల పంటలు కోసేందుకు పొలాల్లోకి వెళ్లలేకపోతున్నాం. అప్పుడు కూలీలు పొలాలకు ఎలా వెళ్తారు? అప్పుడు డ్రోన్  ఉపయోగం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. పొలాల్లోకి కూడా ప్రవేశించాల్సిన అవసరం లేదు. కూలీలను పెట్టుకుని పనులు చేసుకున్నట్టు గట్టుపై నిలబడి డ్రోన్‌తో పనులు చేసుకోవచ్చు. పొలం లోపల పురుగుల నుండి కూడా రక్షణ లభిస్తుంది. ఇబ్బందులు ఉండవు. రైతులకు కూడా చాలా మంచిది. ఇప్పటి వరకు 35 ఎకరాల్లో పిచికారీ చేశాం సార్‌.

మోదీగారు: అంటే దీనివల్ల రైతులు తమకు లాభాలు ఉన్నాయని అర్థం చేసుకున్నారా?

సునీతాదేవి: అవును సార్. రైతులు చాలా సంతృప్తిగా ఉన్నారు. చాలా బాగుందని చెప్తున్నారు. సమయం కూడా ఆదా అవుతుంది. అన్ని సౌకర్యాలూ అదే చూసుకుంటుంది. నీళ్ళు, మందులు- అన్నీ అదే కలుపుకుంటుంది. రైతులు తమ పొలం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో చెప్తే చాలు. అరగంటలో పని మొత్తం అయిపోతుంది. డ్రోన్ అన్నీ చూసుకుంటుంది.

మోదీ గారు: అయితే ఈ డ్రోన్‌ని చూడటానికి వేరే వాళ్ళు కూడా వస్తుండవచ్చు.

సునీతా దేవి: సార్… చాలా మంది గుమిగూడతారు. డ్రోన్ చూడటానికి చాలా మంది వస్తారు. పెద్ద రైతులు పిచికారీ కోసం పిలుస్తామని నంబర్ కూడా తీసుకుంటారు.

మోదీ గారు: సరే. లక్షాధికారి దీదీని తయారు చేయాలనే లక్ష్యం నాకు ఉంది. కాబట్టి, డ్రోన్ దీదీ నాతో మొదటిసారి మాట్లాడుతున్న విషయాలను ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న సోదరీమణులు వింటూ ఉంటే, మీరు వారికి ఏమి చెప్పాలనుకుంటున్నారు?

సునీతా దేవి: ఈ రోజు నేనొక్కదాన్నే డ్రోన్ దీదీని. అలాంటి వేలాది మంది సోదరీమణులు నాలా డ్రోన్ దీదీలుగా మారడానికి ముందుకు వస్తే నేను చాలా సంతోషిస్తాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు వేల మంది నాతో పాటు నిలబడితే ఆనందంగా ఉంటుంది. ఒంటరిగా లేమని, చాలా మంది డ్రోన్ దీదీ  అనే గుర్తింపుతో మాతో ఉన్నారని సంతోషంగా ఉంటుంది.

మోదీ గారు: సునీత గారూ… నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. నమో డ్రోన్ దీదీ దేశంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి గొప్ప మాధ్యమంగా మారుతోంది. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.

సునీతా దేవి: ధన్యవాదాలు, ధన్యవాదాలు సార్.

మోదీగారు: ధన్యవాదాలు!

మిత్రులారా! ఈ రోజు దేశంలో మహిళా శక్తి వెనుకబడిన ప్రాంతం లేదు. మహిళలు తమ నాయకత్వ సామర్థ్యాలను ప్రదర్శించిన మరికొన్ని రంగాలు ప్రాకృతిక  వ్యవసాయం, నీటి సంరక్షణ, పారిశుద్ధ్యం. రసాయనాల వల్ల మన భూమి పడుతున్న కష్టాలు, బాధలు, వేదనల నుండి మన మాతృభూమిని రక్షించడంలో దేశ మాతృశక్తి పెద్ద పాత్ర పోషిస్తోంది. మహిళలు ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో ప్రాకృతిక వ్యవసాయాన్ని విస్తరిస్తున్నారు. నేడు దేశంలో ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కింద ఇంత పని జరుగుతుంటే అందులో నీటి సంఘాలదే పెద్ద పాత్ర. ఈ నీటి సంఘాల నాయకత్వం మహిళలతోనే ఉంది. అంతే కాకుండా నీటి సంరక్షణ కోసం మహిళలు అన్ని విధాలా కృషి చేస్తున్నారు. అలాంటి ఒక మహిళ కళ్యాణి ప్రఫుల్ల పాటిల్ గారు ఇప్పుడు నాతో ఫోన్ లైన్‌లో ఉన్నారు. ఆమె మహారాష్ట్ర నివాసి. రండి.. కళ్యాణి ప్రఫుల్ల పాటిల్‌తో మాట్లాడుదాం. ఆమె అనుభవాన్ని తెలుసుకుందాం.

ప్రధాన మంత్రి గారు: కళ్యాణి గారూ.. నమస్కారం

కళ్యాణి గారు: నమస్కారం సార్, నమస్కారం.

ప్రధానమంత్రి గారు: కళ్యాణి గారూ… ముందుగా మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ పని గురించి చెప్పండి.

కళ్యాణి గారు:  సార్… నేను ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చదివాను. మా ఇంట్లో నా భర్త, మా అత్తగారు, నా ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను గ్రామ పంచాయతీలో మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నాను.

ప్రధాన మంత్రి గారు: అయితే ఆపై ఊళ్ళో వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారా? మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంది. ఈ రంగంలోనే చదివారు. ఇప్పుడు వ్యవసాయంలో చేరారు.  కాబట్టి కొత్తగా ఏ ప్రయోగాలు చేశారు?

కళ్యాణి గారు: సార్… మన దగ్గర ఉన్న పది రకాల వృక్ష సంపద నుండి ఆర్గానిక్ స్ప్రే తయారుచేశాం. మనం పురుగుమందులు పిచికారీ చేస్తే మనకు మంచి చేసే  స్నేహపూర్వక కీటకాలు కూడా నాశనం అవుతాయి. నేల కాలుష్యం వల్ల నీళ్లలో రసాయనాలు కలిపితే మన శరీరంపై హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. అందువల్ల మేం కనీసస్థాయిలో పురుగుమందులను ఉపయోగించాం.

ప్రధానమంత్రి గారు: కాబట్టి మీరు ఒక విధంగా పూర్తిగా ప్రాకృతిక వ్యవసాయం వైపు వెళ్తున్నారు.

కళ్యాణి గారు: అవును సార్. ఇది మా సాంప్రదాయిక వ్యవసాయం సార్. మేం గత ఏడాది అలాగే చేశాం.

ప్రధానమంత్రి గారు: ప్రాకృతిక వ్యవసాయంలో మీకు ఎలాంటి అనుభవం ఉంది?

కళ్యాణి గారు: సార్. మా ఆడవాళ్ళకి అయ్యే ఖర్చులు తక్కువయ్యాయి. ఆ పరిష్కారం వచ్చాక ఆ ఉత్పత్తులను పురుగుమందులు లేకుండా తయారు చేశాం.  ఎందుకంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి దానికి తగ్గట్టుగా భావి కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఈ మార్గాన్ని అవలంబించాల్సిందే. అందుకు అనుగుణంగా ఆఅ మహిళలు కూడా ఇందులో చురుగ్గా పాల్గొంటున్నారు.

ప్రధానమంత్రి గారు: సరే కళ్యాణి గారూ…  మీరు కూడా నీటి సంరక్షణలో కొంత కృషి చేశారా? అందులో మీరేం చేశారు?

కళ్యాణి గారు: సార్… మన ప్రభుత్వ భవనాలైన ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ, మా గ్రామపంచాయతీ భవనం- వీటి దగ్గర ఉన్న వర్షపు నీరంతా ఒకే చోట సేకరిం చాం సార్. రీఛార్జ్ షాఫ్ట్ అంటే వాన నీరు- భూమి లోపలికి చొచ్చుకుపోవాలి. కాబట్టి మేం మా గ్రామంలో 20 రీఛార్జ్ షాఫ్ట్‌లను తయారు చేశాం. మరో 50 రీఛార్జ్ షాఫ్ట్‌లు మంజూరయ్యాయి. ఇప్పుడు ఆ పని కూడా త్వరలో ప్రారంభం అవుతుంది.

ప్రధానమంత్రి గారు:  కళ్యాణి గారూ… మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.

కళ్యాణి గారు: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నా జీవితం సంపూర్ణంగా సార్థకమయింది.

ప్రధాన మంత్రి గారు:  కేవలం సేవ చేయండి. చాలు.

ప్రధానమంత్రి గారు:  మీ పేరు కళ్యాణి కాబట్టి మీరు కళ్యాణకార్యాలు ఎలాగూ చేయాలి. ధన్యవాదాలండీ. నమస్కారం.

కళ్యాణి గారు: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు

 

మిత్రులారా! సునీత గారైనా, కళ్యాణి గారైనా, వివిధ రంగాలలో స్త్రీ శక్తి సాధించిన విజయం చాలా స్ఫూర్తిదాయకం. మన మహిళా శక్తి అందించే ఈ స్ఫూర్తిని నేను మరోసారి మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా! నేడు మనందరి జీవితాల్లో సాంకేతికత  ప్రాముఖ్యత చాలా పెరిగింది. మొబైల్ ఫోన్లు, డిజిటల్ పరికరాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. కానీ ఇప్పుడు అడవి జంతువులతో సమన్వయంలో డిజిటల్ పరికరాలు మనకు సహాయపడతాయని మీరు ఊహించగలరా! కొన్ని రోజుల తర్వాత మార్చి 3వ తేదీన ‘ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం’ జరుపుకుంటున్నాం. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం థీమ్‌లో డిజిటల్ ఇన్నొవేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. మన దేశంలోని వివిధ ప్రాంతాలలో వన్యప్రాణుల సంరక్షణ కోసం సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారని తెలిస్తే మీరు సంతోషిస్తారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రయత్నాల వల్ల దేశంలో పులుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య 250కి పైగా పెరిగింది. చంద్రాపూర్ జిల్లాలో మనుషులు, పులుల మధ్య ఘర్షణను తగ్గించడానికి కృత్రిమ మేధ సహాయం తీసుకున్నారు. ఇక్కడ గ్రామ, అటవీ సరిహద్దుల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి గ్రామ సమీపంలోకి వచ్చినప్పుడల్లా కృత్రిమ మేధ సహాయంతో స్థానిక ప్రజలు వారి మొబైల్‌లో హెచ్చరిక పొందుతారు. నేడు ఈ వ్యవస్థ ఈ టైగర్ రిజర్వ్ చుట్టూ ఉన్న 13 గ్రామాల ప్రజలకు చాలా సౌకర్యాన్ని అందించింది. పులులకు కూడా రక్షణ లభించింది.

మిత్రులారా! నేడు యువ పారిశ్రామికవేత్తలు వన్యప్రాణుల సంరక్షణ, ఎకో టూరిజం కోసం కొత్త ఆవిష్కరణలను కూడా తీసుకువస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో కెన్ నదిలో మొసళ్లపై నిఘా ఉంచడంలో సహాయపడే డ్రోన్‌ను రోటార్ ప్రెసిషన్ గ్రూప్స్ అభివృద్ధి చేసింది. అదేవిధంగా బెంగళూరులోని ఓ కంపెనీ ‘బఘీరా’, ‘గరుడ’ పేర్లతో యాప్‌లను సిద్ధం చేసింది. బఘీరా ​​యాప్‌తో అడవిలో సఫారీ సమయంలో వాహనం వేగం, ఇతర కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చు. దేశంలోని అనేక టైగర్ రిజర్వ్‌లలో దీనిని ఉపయోగిస్తున్నారు. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లపై ఆధారపడే గరుడ యాప్ ను ఏదైనా సీసీటీవీకి అనుసంధానించడం ద్వారా నిజ సమయ హెచ్చరికలను పొందడం ప్రారంభిస్తుంది. వన్యప్రాణుల పరిరక్షణ కోసం చేసే ఇటువంటి ప్రతి ప్రయత్నంతో మన దేశంలోని జీవవైవిధ్యం మరింత సుసంపన్నమవుతోంది.

మిత్రులారా! భారతదేశంలో ప్రకృతితో సమన్వయం మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉంది. వేల సంవత్సరాలుగా ప్రకృతితో, వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ జీవిస్తున్నాం. మీరు ఎప్పుడైనా మహారాష్ట్రలోని మేల్‌ఘాట్ టైగర్ రిజర్వ్‌కి వెళ్తే, మీరు దాన్ని స్వయంగా అనుభూతి చెందవచ్చు. ఈ టైగర్ రిజర్వ్ సమీపంలోని ఖట్కలి గ్రామంలో నివసిస్తున్న ఆదివాసీ కుటుంబాలు ప్రభుత్వ సహాయంతో తమ ఇళ్లను హోమ్ స్టేలుగా మార్చుకున్నాయి. ఇది వారికి భారీ ఆదాయ వనరుగా మారుతోంది. అదే గ్రామంలో నివాసముంటున్న కోర్కు తెగకు చెందిన ప్రకాశ్ జామ్‌కార్‌ గారు తన రెండు హెక్టార్ల భూమిలో ఏడు గదుల హోమ్‌ స్టేను సిద్ధం చేశారు. ఆయన కుటుంబం ఆ స్థలంలో బస చేసే పర్యాటకులకు ఆహారం, పానీయాల ఏర్పాట్లు చేస్తుంది. ఆయన తన ఇంటి చుట్టూ ఔషధ మొక్కలతో పాటు మామిడి, కాఫీ చెట్లను కూడా నాటారు. ఇది పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా ఇతర వ్యక్తులకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టించింది.

నా ప్రియమైన దేశప్రజలారా! మనం పశుపోషణ గురించి మాట్లాడేటప్పుడు, మనం తరచుగా ఆవులు, గేదెల వద్ద మాత్రమే ఆగిపోతాం. కానీ మేక కూడా ఒక ముఖ్యమైన జంతువు. దీనిపై ఎక్కువగా చర్చ  జరగలేదు. దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా మంది ప్రజలు మేకల పెంపకంతో సంబంధం కలిగి ఉన్నారు. ఒడిషాలోని కలహండిలో మేకల పెంపకం గ్రామ ప్రజల జీవనోపాధితో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రధాన సాధనంగా మారుతోంది. ఈ ప్రయత్నం వెనుక జయంతి మహాపాత్ర గారు, ఆమె భర్త బీరెన్ సాహు గారి పెద్ద స్థాయి నిర్ణయం ఉంది. వారిద్దరూ బెంగుళూరులో మేనేజ్‌మెంట్ నిపుణులు. అయితే వారు కొంత విరామం తీసుకుని కలహండిలోని సాలెభాటా గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడి గ్రామస్తుల సమస్యలను పరిష్కరించడంతోపాటు వారికి సాధికారత కల్పించే విధంగా ఏదైనా మంచి చేయాలని వారు భావించారు. సేవాభావం, అంకితభావంతో కూడిన ఈ ఆలోచనతో మాణికాస్తు ఆగ్రోను స్థాపించి రైతులతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. జయంతి గారు, బీరేన్ గారు ఇక్కడ ఆసక్తికరమైన మాణికాస్తు గోట్ బ్యాంక్‌ను కూడా ప్రారంభించారు. వారు సామాజిక స్థాయిలో మేకల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వారి మేకల ఫారంలో డజన్ల కొద్ది మేకలు ఉన్నాయి. మాణికాస్తు మేకల బ్యాంకు రైతులకు పూర్తి వ్యవస్థను సిద్ధం చేసింది. దీని ద్వారా రైతులకు 24 నెలల కాలానికి రెండు మేకలను అందజేస్తారు. మేకలు 2 సంవత్సరాల్లో 9 నుండి 10 పిల్లలకు జన్మనిస్తాయి. వాటిలో 6 పిల్లలను బ్యాంకులో ఉంచుతారు. మిగిలిన వాటిని మేకలను పెంచే కుటుంబానికి ఇస్తారు. అంతే కాదు మేకల సంరక్షణకు అవసరమైన సేవలు కూడా వారు అందిస్తున్నారు. నేడు 50 గ్రామాలకు చెందిన 1000 మందికి పైగా రైతులు ఈ జంటతో అనుబంధం కలిగి ఉన్నారు. వారి సహకారంతో గ్రామ ప్రజలు పశుపోషణ రంగంలో స్వావలంబన దిశగా పయనిస్తున్నారు. విభిన్న రంగాల్లో విజయవంతమైన నిపుణులు చిన్న రైతులు సాధికారత, స్వావలంబన పొందేందుకు కొత్త పద్ధతులను అవలంబించడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారి కృషి అందరికీ స్ఫూర్తినిస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! మన సంస్కృతి చెప్పే పాఠం ఏమిటంటే – ‘పరమార్థ పరమో ధర్మః’ అంటే ఇతరులకు సహాయం చేయడం అతి పెద్ద కర్తవ్యం. ఈ భావనను అనుసరించి మన దేశంలో లెక్కలేనంత మంది ప్రజలు నిస్వార్థంగా ఇతరులకు సేవ చేయడానికి తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు – బీహార్‌లోని భోజ్‌పూర్‌కు చెందిన భీమ్ సింగ్ భవేష్ గారు. ఆయన పని గురించి ఆయన ప్రాంతంలోని ముసహర్ సామాజిక వర్గం వారిలో చాలా చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజు ఈ విషయం కూడా మీతో ఎందుకు మాట్లాడకూడదని అనుకున్నాను. ముసహర్ బీహార్‌లో చాలా వెనుకబడిన సామాజిక వర్గం. చాలా పేద సమాజం. భీమ్ సింగ్ భవేష్ గారు ఈ సమాజంలోని పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు వారి విద్యపై దృష్టి పెట్టారు. దాదాపు 8 వేల మంది ముసహర్ సామాజిక వర్గ పిల్లలను పాఠశాలలో చేర్పించారు. ఆయన ఒక పెద్ద గ్రంథాలయాన్ని కూడా కట్టించారు. దాని వల్ల పిల్లలకు చదువులో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయి. భీమ్ సింగ్ గారు తన సామాజికవర్గ  సభ్యులకు అవసరమైన పత్రాలను తయారు చేయడంలో, వారి దరఖాస్తులను  పూరించడంలో కూడా సహాయం చేస్తారు. ఇది గ్రామ ప్రజలకు అవసరమైన వనరులను మరింత మెరుగుపరిచింది. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆయన 100 కు పైగా వైద్య శిబిరాలను నిర్వహించారు. కరోనా సంక్షోభం పెద్దదవుతున్నప్పుడు భీమ్ సింగ్ గారు తన ప్రాంతంలోని ప్రజలను టీకాలు వేసుకోవాలని ప్రోత్సహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో భీమ్ సింగ్ భవేష్ జీ వంటి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. వారు సమాజంలో ఇటువంటి అనేక ఉదాత్తమైన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బాధ్యతాయుతమైన పౌరులుగా మనం మన విధులను నిర్వర్తిస్తే, అది బలమైన దేశాన్ని నిర్మించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! దేశ వైవిధ్యం, మన సంస్కృతుల విభిన్న వర్ణాల్లో భారతదేశ సౌందర్యం ఉంది. భారతీయ  సంస్కృతిని పరిరక్షించడానికి, అందంగా తీర్చిదిద్దడానికి ఎంత మంది నిస్వార్థంగా కృషి చేస్తున్నారో చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. భారతదేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి వ్యక్తులు కనిపిస్తారు. వీరిలో భాషా రంగంలో పనిచేస్తున్న వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్‌కు చెందిన మహ్మద్ మాన్షా గారు గత మూడు దశాబ్దాలుగా గోజ్రీ భాషను పరిరక్షించే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఆదివాసీ సమాజమైన గుజ్జర్ బకర్వాల్ సామాజిక వర్గానికి చెందినవారు. చిన్నతనంలో చదువు కోసం కష్టపడేవారు. రోజూ 20 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లేవారు. అటువంటి సవాళ్ల మధ్య ఆయన మాస్టర్స్ డిగ్రీని పొందారు. తన భాషను కాపాడుకోవాలనే ఆయన సంకల్పం దాంతో మరింత బలపడింది. సాహిత్యరంగంలో మాన్షా గారి పని పరిధి చాలా పెద్దది. ఈ కృషిని దాదాపు 50 సంపుటాల్లో భద్రపర్చారు. వీటిలో పద్యాలు, జానపద గేయాలు కూడా ఉన్నాయి. ఆయన అనేక గ్రంథాలను గోజ్రీ భాషలోకి అనువదించారు.

మిత్రులారా! అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్‌కు చెందిన బన్వంగ్ లోసు గారు  ఉపాధ్యాయులు. వాంచో భాష వ్యాప్తిలో ఆయన అత్యంత విలువైన కృషి చేశారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ భాషలో  మాట్లాడుతారు. భాషా పాఠశాల నిర్మాణానికి ఆయన కృషి చేశారు. వాంచో భాషకు సంబంధించిన లిపి కూడా సిద్ధమైంది. రాబోయే తరాలకు వాంచో భాషను నేర్పిస్తున్నారు. తద్వారా ఆ భాష అంతరించిపోకుండా కాపాడుతున్నారు.

మిత్రులారా! పాటలు, నృత్యాల ద్వారా తమ సంస్కృతిని, భాషను కాపాడుకోవడంలో నిమగ్నమై ఉన్నవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. కర్ణాటకకు చెందిన వెంకప్ప అంబాజీ సుగేత్కర్ జీవితం కూడా ఈ విషయంలో చాలా స్ఫూర్తిదాయకం. ఇక్కడి బాగల్‌కోట్ నివాసి సుగేత్కర్ గారు జానపద గాయకులు. ఆయన 1000 కంటే ఎక్కువ గోంధలీ పాటలు పాడారు. ఈ భాషలో కథలను కూడా ప్రచారం చేశారు. వందలాది విద్యార్థులకు ఫీజు లేకుండా శిక్షణ కూడా ఇచ్చారు. భారతదేశంలో నిరంతరం మన సంస్కృతిని సుసంపన్నం చేస్తున్న- ప్రగాఢ ఆసక్తి, ఉత్సాహంతో నిండిన అటువంటి వ్యక్తులకు కొరత లేదు. మీరు కూడా వారి నుండి స్ఫూర్తి పొందండి. మీ స్వంతంగా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. మీరు చాలా సంతృప్తిని అనుభవిస్తారు.

నా ప్రియమైన దేశవాసులారా! రెండు రోజుల క్రితం నేను వారణాసిలో ఉన్నాను. అక్కడ చాలా అద్భుతమైన ఫోటో ఎగ్జిబిషన్ చూశాను. కాశీ, పరిసర ప్రాంతాల యువత కెమెరాలో బంధించిన క్షణాలు అద్భుతంగా ఉన్నాయి. అందులో మొబైల్ కెమెరాతో తీసిన ఫోటోలు చాలా ఉన్నాయి. నిజానికి నేడు మొబైల్ ఉన్నవారు కంటెంట్ సృష్టికర్తలుగా మారారు. సామాజిక మాధ్యమాలు కూడా ప్రజలకు వారి నైపుణ్యాలు, ప్రతిభను చూపించడంలో చాలా సహాయపడ్డాయి. భారతదేశంలోని మన యువ స్నేహితులు కంటెంట్ సృష్టి రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. ఇది ఏ సామాజిక మాధ్యమ వేదిక అయినా కానివ్వండి. ఖచ్చితంగా మన యువ స్నేహితులు వేర్వేరు విషయాలపై విభిన్న అంశాలను  పంచుకుంటారు. అది పర్యాటక రంగం కావచ్చు. సామాజిక మార్పు కారకాలు కావచ్చు. ప్రజా భాగస్వామ్యం కావచ్చు. లేదా స్పూర్తిదాయకమైన జీవిత ప్రయాణం కావచ్చు. వీటికి సంబంధించిన వివిధ రకాల కంటెంట్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. కంటెంట్‌ని క్రియేట్ చేస్తున్న దేశ యువత గొంతు నేడు చాలా ప్రభావశీలంగా మారింది. వారి ప్రతిభను గౌరవించేందుకు, దేశంలో నేషనల్ క్రియేటర్స్ అవార్డు ప్రారంభమైంది. దీని కింద వివిధ కేటగిరీల్లో సామాజిక మార్పు విషయంలో ప్రభావశీలమైన గొంతుకగా మారేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్న వారిని సత్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పోటీని మై గవ్ లో నిర్వహిస్తున్నారు. కంటెంట్ సృష్టికర్తలు ఇందులో చేరవలసిందిగా నేను కోరుతున్నాను. మీకు అలాంటి ఆసక్తికరమైన కంటెంట్ క్రియేటర్లు తెలిస్తే, ఖచ్చితంగా వారిని నేషనల్ క్రియేటర్స్ అవార్డుకు నామినేట్ చేయండి.

నా ప్రియమైన దేశప్రజలారా! కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం ‘మేరా పెహ్లా ఓట్ – దేశ్ కే లియే’ అనే పేరుతో మరో ప్రచారాన్ని ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. దీని ద్వారా మొదటి సారి ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఓటు వేయాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఉత్సాహం, శక్తితో నిండిన యువశక్తి పట్ల  భారతదేశం గర్విస్తోంది. ఎన్నికల ప్రక్రియలో యువత అధిక సంఖ్యలో పాల్గొంటే దాని ఫలితాలు దేశానికి అంతే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. మొదటి సారి ఓటర్లు కూడా రికార్డు సంఖ్యలో ఓటు వేయాలని నేను కోరుతున్నాను. 18 ఏళ్లు నిండిన తర్వాత 18వ లోక్‌సభకు సభ్యుడిని ఎన్నుకునే అవకాశం మీకు లభిస్తుంది. అంటే ఈ 18వ లోక్ సభ కూడా యువత ఆకాంక్షకు ప్రతీక అవుతుంది. అందుకే మీ ఓటు ప్రాధాన్యత మరింత పెరిగింది. సార్వత్రిక ఎన్నికల హడావుడి మధ్య యువత, కేవలం రాజకీయ కార్యకలాపాల్లో భాగం కావడమే కాకుండా ఈ కాలంలో జరిగే చర్చలు, వాదనల గురించి కూడా తెలుసుకోవాలి. గుర్తుంచుకోండి- ‘మేరా పెహ్లా ఓట్ – దేశ్ కే లియే’- ‘నా మొదటి ఓటు – దేశం కోసం’. క్రీడా ప్రపంచం, చలనచిత్ర పరిశ్రమ, సాహిత్య ప్రపంచం, ఇతర నిపుణులు, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో సహా దేశంలోని ప్రభావశీలురు ఈ ప్రచారంలో పాల్గొనాలి. ఏ రంగానికి చెందిన ప్రభావశీలురైనా ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొని, మొదటిసారిగా ఓటు వేస్తున్న ఓటర్లను ప్రోత్సహించడానికి మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నాను.

మిత్రులారా! ఈ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో ఇంతే. దేశంలో లోక్‌సభ ఎన్నికల వాతావరణం నెలకొనడంతో గత సారి మాదిరిగానే మార్చి నెలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గత 110 ఎపిసోడ్‌లలో ప్రభుత్వ నీడకు దూరంగా ఉంచడం ‘మన్ కీ బాత్’  భారీ విజయం. ‘మన్ కీ బాత్’లో దేశ సామూహిక శక్తి గురించి, దేశం సాధించిన విజయాల గురించి చర్చ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజలకు చెందిన, ప్రజల కోసం, ప్రజలే  సిద్ధం చేసిన కార్యక్రమం. అయినప్పటికీ రాజకీయ సంప్రదాయాలను అనుసరించి, లోక్‌సభ ఎన్నికల ఈ రోజుల్లో ‘మన్ కీ బాత్’ వచ్చే మూడు నెలల పాటు ప్రసారం కాదు. తర్వాతిసారి మనం ‘మన్ కీ బాత్’లో కలుసుకున్నప్పుడు అది 111వ ఎపిసోడ్ అవుతుంది. తర్వాతిసారి ‘మన్ కీ బాత్’ శుభసంఖ్య 111తో మొదలవుతుంది. ఇంతకంటే ఏది మంచిది! కానీ, మిత్రులారా! మీరు నా కోసం ఒక పని చేస్తూనే ఉండాలి. ‘మన్ కీ బాత్’ మూడు నెలలు ఆగిపోవచ్చు. కానీ దేశ విజయాలు కొంతకాలం ఆగవు. కాబట్టి సమాజం, దేశం సాధించిన విజయాలను ‘మన్ కీ బాత్’ హ్యాష్‌ట్యాగ్ (#)తో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉండండి. | కొంతకాలం క్రితం ఒక యువకుడు నాకు మంచి సలహా ఇచ్చారు. ‘మన్ కీ బాత్’లో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్‌లలోని చిన్న చిన్న వీడియోలను యూట్యూబ్ షార్ట్‌ల రూపంలో షేర్ చేయాలనేది ఆ సూచన. అందువల్ల, అటువంటి లఘు చిత్రాలను విస్తృతంగా పంచుకోవాలని ‘మన్ కీ బాత్’ శ్రోతలను నేను కోరుతున్నాను.

మిత్రులారా! నేను మీతో తర్వాతిసారి సంభాషించేటప్పుడు కొత్త శక్తితో, కొత్త సమాచారంతో మిమ్మల్ని కలుస్తాను. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

 

***