Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సుని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సుని ప్రారంభించిన  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సును ప్రారంభించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ, భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టోబ్‌గే, ఫిజీ ఉప ప్రధాన మంత్రి శ్రీ మనోవా కమికామికా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ షోంబీ షార్ప్, అంతర్జాతీయ సహకార సమితి అధ్యక్షుడు శ్రీ ఏరియల్ గార్కో, విదేశీ ప్రముఖులు తదితరులకు శ్రీ మోదీ స్వాగతం పలికారు.

 

స్వాగతం పలుకుతున్నది తానొక్కడినే కాదని, వేలాది మంది రైతులు, పశువుల పెంపకందారులు, మత్స్యకారులు, 8 లక్షలకు పైగా సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలతో అనుబంధం గల 10 కోట్ల మంది మహిళలు, సహకార సంఘాలకు సాంకేతికతను సమకూర్చడంలో నిమగ్నమైన యువకుల తరఫున ఈ స్వాగతం పలుకుతున్నానని శ్రీ మోదీ అన్నారు. భారతదేశంలో సహకార ఉద్యమం విస్తృతమవడాన్ని గుర్తించి, అంతర్జాతీయ సహకార కూటమి అంతర్జాతీయ సహకార సదస్సును తొలిసారిగా భారత్ లో నిర్వహిస్తోందన్నారు. సహకార ప్రయాణానికి సంబంధించి ఈ సదస్సు నుంచి భారతదేశం అనేక విషయాలను గ్రహించగలదన్న విశ్వాసాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు. బదులుగా సహకార రంగంలో ఎంతో అనుభవం వల్ల భారత్ గడించిన ఇరవై ఒకటో శతాబ్దపు నవీన పద్ధతులు, ఉత్సాహాన్ని సదస్సు పొందగలదని శ్రీ మోదీ చెప్పారు. 2025ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించినందుకు ఐక్యరాజ్యసమితికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

 

శతాబ్దాల నాటి దేశ సహకార సంస్కృతిని గురించి తెలియజేస్తూ “ప్రపంచానికి సహకార సంఘాలనేవి ఒక నమూనావంటివైతే, భారతదేశానికి అవి సంస్కృతిలో అంతర్భాగం, జీవన విధానంతో విడదీయరాని భాగం” అని అన్నారు. ఈ సందర్భంగా కొన్ని శ్లోకాలను పఠిస్తూ, అందరూ కలిసి నడవాలని, ఏక కంఠంతో మాట్లాడాలని వేదాలు చెబుతాయని, ఇక ఉపనిషత్తులు శాంతియుతంగా జీవించమని చెబుతాయని, సహజీవనం ప్రాముఖ్యాన్ని అవి మనకు బోధిస్తున్నాయని, ఈ సూత్రాలన్నీ భారత దేశ కుటుంబ వ్యవస్థలో అంతర్భాగమని శ్రీ మోదీ అన్నారు. సహకార సంఘాల ఉనికికి భారతీయ కుటుంబ వ్యవస్థే మూలమని ప్రధాని అన్నారు.

 

భారతదేశ స్వాతంత్ర్య పోరాటం కూడా సహకార సంఘాల ద్వారానే స్ఫూర్తి పొందిందనీ, ఇది ఆర్థిక సాధికారతను అందించడమే కాకుండా స్వాతంత్ర్య సమరయోధులకు సామాజిక వేదికను కూడా కల్పించిందని ప్రధాని వ్యాఖ్యానించారు. గాంధీజీ గ్రామస్వరాజ్య ఉద్యమం సమాజ భాగస్వామ్యానికి కొత్త ప్రేరణనిచ్చిందని, ఖాదీ, గ్రామ పరిశ్రమల సహకార సంఘాల సహాయంతో కొత్త విప్లవానికి నాంది పలికిందన్నారు. నేడు పెద్ద బ్రాండ్లతో పోటీ పడుతున్న ఖాదీ, గ్రామ పరిశ్రమలు, వాటికన్నా ముందంజలో ఉండేందుకు సహకార సంఘాలే కారణమని శ్రీ మోదీ వివరించారు. సర్దార్ పటేల్ పాల సహకార సంఘాల ద్వారా రైతులను ఏకం చేసి, స్వాతంత్య్ర పోరాటానికి కొత్త దిశను చూపారని అన్నారు. “నేడు ప్రపంచ అగ్రశ్రేణి ఆహార బ్రాండ్లలో ఒకటైన అమూల్, భారత స్వాతంత్ర్య సమరంవల్ల ఉద్భవించిందే” అని శ్రీ మోదీ తెలియజేశారు. సహకార సంస్థల పరిణామక్రమాన్ని విశ్లేషిస్తూ, భారతదేశంలోని సహకార సంఘాలు ఆలోచన నుంచి ఉద్యమం, ఉద్యమ స్థాయి నుంచి విప్లవం, అటుపై సాధికారత వైపు ప్రయాణించాయని అన్నారు.

 

స‌హ‌కారంతో కూడిన ప‌రిపాల‌న‌ ద్వారా భార‌త‌దేశాన్ని అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామని శ్రీ మోదీ అన్నారు. గణాంకాలను ఉటంకిస్తూ,”ఈరోజున భారతదేశంలో 8 లక్షల సహకార కమిటీలున్నాయి, అంటే ప్రపంచంలోని ప్రతి నాలుగో కమిటీ భారతదేశంలోనే ఉంది” అని అన్నారు. వాటి పరిధి కూడా విభిన్నంగా, విస్తృతంగా ఉందన్నారు. భారతదేశంలోని దాదాపు 98 శాతం గ్రామాలు సహకార సంఘాలను కలిగి ఉన్నాయని శ్రీ మోదీ వెల్లడించారు. “సుమారు 30 కోట్ల ప్రజలు, అంటే ప్రతి అయిదుగురు భారతీయులలో ఒకరు సహకార రంగంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు” అని ప్రధాని చెప్పారు. భారతదేశంలో పట్టణ, గృహనిర్మాణ సహకార సంఘాలు ఎంతో విస్తరించాయని, చక్కెర, ఎరువులు, మత్స్య, పాల ఉత్పత్తి పరిశ్రమల్లో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని, దేశంలో దాదాపు 2 లక్షల గృహనిర్మాణ సహకార సంఘాలున్నాయని శ్రీ మోదీ అన్నారు. సహకార బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడంలో దేశం సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల్లో రూ. 12 లక్షల కోట్లకు పైగా సొమ్ము డిపాజిట్ల రూపంలో ఉందని, ఈ సంస్థలపై పెరుగుతున్న నమ్మకాన్ని ఈ సంఖ్య ప్రతిబింబిస్తోందని శ్రీ మోదీ అన్నారు. “సహకార బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. ఈ సంస్థలను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పరిధిలోకి తీసుకువచ్చాం. ప్రతి డిపాజిటర్‌కు బీమా కవరేజీని రూ. 5 లక్షలకు పెంచాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారతీయ సహకార బ్యాంకుల మధ్య పోటీతత్వం, పారదర్శకత పెరిగిందని చెబుతూ, ఈ సంస్కరణలు ఆయా బ్యాంకులను సురక్షితమైన, సమర్థవంతమైన ఆర్థిక సంస్థలుగా నిలబెట్టడంలో సహాయపడ్డాయన్నారు.

 

“భారతదేశ భవిష్య వృద్ధిలో సహకార సంస్థలు భారీ పాత్రను పోషిస్తాయి” అని ప్రధాన మంత్రి అన్నారు. అందువల్ల సహకార సంఘాల వ్యవస్థల్లో సమూలమైన మార్పులు తెచ్చేందుకు గత కొద్ది సంవత్సరాల్లో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టామని శ్రీ మోదీ తెలిపారు. సహకార సంఘాలను బహుళార్ధ సాధకాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ప్రత్యేకమైన సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని శ్రీ మోదీ వెల్లడించారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బహుళార్ధ సాధకంగా తీర్చిదిద్దేందుకు కొత్త తరహా ఉప చట్టాలను రూపొందించామని తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో సహకార బ్యాంకింగ్ సంస్థలతో సహకార సంఘాలను అనుసంధానించేందుకు వీలుగా, సహకార సంఘాలను ఐటి-ఆధారిత పర్యావరణ వ్యవస్థతో అనుసంధానించామని ఆయన అన్నారు. ఈ సహకార సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు స్థానిక పరిష్కారాలను సూచించే కేంద్రాలుగా, పెట్రోల్, డీజిల్ రీటైల్ అవుట్‌లెట్ల నిర్వహణ, నీటి నిర్వహణ, సోలార్ ప్యానెళ్ళ ఏర్పాటు వంటి అనేక పనులలో పాలుపంచుకున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ‘వేస్ట్ టు ఎనర్జీ’– వ్యర్థాల నుంచి సంపద సృష్టి అనే మంత్రంతో సహకార సంఘాలు ‘గోబర్ధన్ స్కీమ్‌’లో కూడా సహాయపడుతున్నాయని, ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా గ్రామాలకు డిజిటల్ సేవలను కూడా అందిస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడించారు. కో-ఆపరేటివ్‌ సంఘాల బలోపేతం ద్వారా సభ్యుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి తెలియజేశారు.

 

ప్రస్తుతం సొసైటీలు లేని 2 లక్షల గ్రామాల్లో ప్రభుత్వం బహుళప్రయోజన సహకార కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, సహకార సంఘాల పరిధిని తయారీ రంగం నుంచి సేవా రంగం వరకూ విస్తరిస్తున్నట్లు శ్రీ మోదీ తెలియజేశారు. “సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ వ్యవస్థను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాం” అని ప్రధాని వెల్లడించారు. సహకార సంఘాలు అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా గోదాముల నిర్మాణం కొనసాగుతోందని, వీటిల్లో రైతులు తమ పంటలను నిల్వ చేసుకుంటారని, చిన్న రైతులకు వీటి వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు.

 

రైతు ఉత్పత్తి కేంద్రాల (ఎఫ్‌పిఓ) ఏర్పాటు ద్వారా చిన్న రైతులను ఆదుకుంటున్నామన్న ప్రధాని,”చిన్న రైతులను ఎఫ్‌పిఓ బృందాలుగా ఏర్పాటు చేసి, సంస్థల బలోపేతం కోసం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం” అని అన్నారు. పంట ఉత్పత్తులను పొలం నుంచి నేరుగా వంటగదికి, మార్కెట్ కి చేరవేసేందుకు, వ్యవసాయ సహకార సంఘాల బలమైన సరఫరా వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంతో దాదాపు 9,000 ఎఫ్‌పిఓల స్థాపన పూర్తైందని శ్రీ మోదీ వెల్లడించారు. “ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా సమర్ధమైన వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం..” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. డిజిటల్ వేదికలు సహకార సంఘాల పరిధిని గణనీయంగా పెంచాయని, ‘ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్’(ఓఎన్డీసీ) వంటి పబ్లిక్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు సహకార సంస్థలను అనుమతులిచ్చామని చెప్పారు. దరిమిలా వినియోగదారులకు తక్కువ ధరలకే ఆయా ఉత్పత్తులు లభిస్తున్నాయని వివరించారు. సహకార సంఘాలు విపణిలో తమ ఉనికిని విస్తరించుకునేందుకు ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జెమ్)లు దోహదపడుతున్నాయని తెలియజేశారు. “పోటీతత్వంతో కూడిన డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రైతులు నిలదొక్కుకునేందుకు, వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు అనువైన సాధనాలను ఈ కార్యక్రమాలు అందిస్తాయి” అని శ్రీ మోదీ తెలిపారు.

 

ఈ శతాబ్దపు వృద్ధిలో మహిళల భాగస్వామ్యం ప్రధానంగా ఉండబోతోందన్న శ్రీ మోదీ, మహిళలకు పెద్దయెత్తున భాగస్వామ్యాన్ని కల్పించే సమాజాలు, దేశాలూ వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. భారతదేశంలో ఇది మహిళా నాయకత్వ అభివృద్ధి యుగమని, సహకార రంగంలో కూడా మహిళల పాత్ర కీలకమని అన్నారు. భారతదేశ సహకార రంగ శక్తిగా నేడు మహిళలు 60 శాతం కంటే ఎక్కువగా సహకార సంస్థల్లో సేవలందిస్తున్నారని, మహిళల నేతృత్వంలోని సహకార సంఘాల వల్ల దేశ సహకార రంగం శక్తిని సంతరించుకుంటోందని శ్రీ మోదీ చెప్పారు.

 

“సహకార సంస్థల నిర్వహణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే మా ధ్యేయం ” అని శ్రీ మోదీ అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ చట్టాన్ని సవరించిందని, ఆయా సంఘాల బోర్డుల్లో మహిళా డైరెక్టర్ల భాగస్వామ్యం తప్పనిసరి చేసిందని తెలిపారు. ఈ సంఘాలు సమ్మిళిత స్ఫూర్తితో అణగారిన వర్గాల భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉండే విధంగా రిజర్వేషన్లను కల్పించామని శ్రీ మోదీ తెలిపారు.

 

స్వయం సహాయక బృందాల రూపంలో ‘మహిళా భాగస్వామ్యం ద్వారా మహిళలకు సాధికారత’ అనే ఉద్యమాన్ని గురించి తెలుపుతూ, భారతదేశంలోని 10 కోట్ల (100 మిలియన్ల) మంది మహిళలు స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా ఉన్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. గత దశాబ్దంలో ఈ స్వయం సహాయక బృందాలకు రూ. 9 లక్షల కోట్లను (9 ట్రిలియన్) అతి తక్కువ వడ్డీకి అందించామని చెప్పారు. ఇందువల్ల గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు భారీగా సంపదను సృష్టించాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. మహిళా సాధికారత మెగా మోడల్‌గా దీనిని ప్రపంచ దేశాలు అనుసరించవచ్చని అన్నారు.

 

21వ శతాబ్దంలో ప్రపంచ సహకార ఉద్యమం దిశను నిర్ణయించవలసిన అవసరాన్ని ప్రస్తావించిన ప్రధాన మంత్రి, “సహకార సంస్థలకు సులభమైన, పారదర్శకమైన ఫైనాన్సింగ్‌ అందేందుకు సహకార పద్ధతిలో పనిచేసే ఆర్థిక నమూనా రూపొందిచవలసి ఉంది” అని అన్నారు. ఆర్థికంగా బలహీనమైన చిన్నసహకార సంఘాలను ఆదుకునేందుకు ఆర్థిక వనరులను సమీకరించడం ముఖ్యమని శ్రీ మోదీ చెప్పారు. ఇటువంటి భాగస్వామ్య ఆర్థిక వేదికలు పెద్ద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో, సహకార సంస్థలకు రుణాలు అందించడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయన్నారు. సేకరణ, ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా సరఫరా వ్యవస్థను పెంపొందించడంలో సహకార సంఘాలకు గల అవకాశాలను ప్రధాని ప్రస్తావించారు.

 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంస్థలకు ఆర్థిక చేయూతనందించగల ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థలను సృష్టించవలసిన అవసరాన్ని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, ఐసీఏ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అయితే భవిష్యత్తులో మరిన్ని సంస్థల అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు సహకార ఉద్యమానికి ఎంతో అనువుగా ఉన్నాయని అన్నారు. స‌హ‌కార సంఘ‌ల‌ను నిజాయితీ, ప‌ర‌స్ప‌ర గౌర‌వాలకు మారుపేరుగా తీర్చిదిద్దవలసిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా వినూత్న విధానాలను ఆవిష్కరించవలసిన అవసరం ఉందన్నారు. సహకార సంస్థలను సమస్యలను అధిగమించే విధంగా దృఢంగా తయారు చేయాలని, వాటిని సర్క్యులర్ ఎకానమీ (పునరుపయోగ ఆర్థిక వ్యవస్థ) కు అనుసంధానించాలని అంటూ, సహకార రంగంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం తక్షణ అవసరం అని అన్నారు.

 

“సహకార సంఘాలు అంతర్జాతీయ సహకారానికి కొత్త శక్తిని అందించగలవని భారతదేశం విశ్వసిస్తోంది” అని ప్రధాన మంత్రి అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాలకు వాటికి అవసరాలకు తగిన వృద్ధిని సాధించడంలో సహాయపడతాయని ఆయన అన్నారు. అందువల్ల, సహకార రంగంలో అంతర్జాతీయ సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలను అన్వేషించవలసిన అవసరం ఉందని, నేటి సదస్సు ఇందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని ఆయన అన్నారు.

 

భారతదేశం సమ్మిళిత వృద్ధికి ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తోందన్న ప్రధాన మంత్రి, “ఆర్థికరంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం, వృద్ధి ఫలాలు అత్యంత నిరుపేదలకు చేరవేయాలన్న లక్ష్యాన్ని కలిగి ఉంది” అని అన్నారు. అభివృద్ధిని మానవులకు ప్రయోజనం అందించే దృక్కోణం నుంచి చూడాలనీ “మనం చేపట్టే పనులన్నింటిలో మానవ సంక్షేమమే ప్రధానాంశంగా ఉండాలి” అని శ్రీ మోదీ అన్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారతదేశం స్పందించిన తీరును గుర్తుచేస్తూ, అవసరమైన మందులు, టీకాలను పంచుకోవడం ద్వారా భారతదేశం ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. సంక్షోభ సమయాల్లో సానుభూతి, సంఘీభావాం చూపాలని భారత్ విశ్వసిస్తుందని, “ఆర్థిక లాభమే ప్రధానమనుకుని తదనుగుణంగా ప్రవర్తించి ఉండచ్చు, అయితే మానవతే ముఖ్యమనుకున్న మేం సేవా మార్గాన్ని ఎంచుకున్నాం” అని శ్రీ మోదీ వివరించారు.

 

సహకార సంఘాలు కేవలం నిర్మాణం, నియమ నిబంధనల పరంగా మాత్రమే ముఖ్యమైనవి కావని, వాటి నుంచి ఇతర సంస్థలను ఏర్పాటు చేయవచ్చని, అవి మరింత విస్తరించి అభివృద్ధి చెందగలవని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సహకార సంఘాల స్ఫూర్తి అత్యంత ముఖ్యమైనదని, ఈ సహకార స్ఫూర్తి ఉద్యమానికి ప్రాణమని, సహకార సంస్కృతి నుంచి సహకార స్ఫూర్తి అభివృద్ధి చెందిందని అన్నారు. సహకార సంఘాల విజయం వాటి సంఖ్యపై కాక సభ్యుల నైతికతపై ఆధారపడి ఉంటుందని మహాత్మా గాంధీ అనేవారని, నైతికత ఉన్నప్పుడే మానవాళి ప్రయోజనాల కోసం సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని అన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరంలో ఈ భావాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ శ్రీ మోదీ తమ ప్రసంగాన్ని ముగించారు.

 

నేపథ్యం

 

ప్రపంచ సహకార ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించే ‘ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్’-ఐసీఏ, 130 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో మొదటిసారిగా భారతదేశంలో ప్రపంచ సహకార సదస్సు, ఐసీఏ సర్వప్రతినిధి సభలను నిర్వహిస్తోంది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో), అమూల్, క్రిభ్కో సంస్థల సహకారంతో ఐసీఏ, భారత ప్రభుత్వాలు ఈ సదస్సును నవంబర్ 25 నుండి 30 వరకూ నిర్వహిస్తున్నాయి.

 

“సహకార సంస్థలు ప్రజల శ్రేయస్సును పెంపొందిస్తాయి” అన్న సదస్సు ఇతివృత్తం, “సహకార్ సే సమృద్ధి” (సహకారం ద్వారా శ్రేయస్సు) అనే భారత ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఉంది. ఐక్యరాజ్యసమితి ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ … ముఖ్యంగా పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, స్థిరమైన ఆర్థిక వృద్ధి ఆశయాల సాధనలో సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి గల అవకాశాల గురించి చర్చలు, సమావేశాలు, కార్యశాలలు సదస్సులో ఏర్పాటయ్యాయి.

 

“సహకారాలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి” అన్న ఇతివృత్తం గల ‘2025-ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంస్థల సంవత్సరాన్ని’ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. సామాజిక సార్వజనీనత, ఆర్థిక సాధికారత, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహకార సంస్థలు పోషించే పరివర్తనాత్మక పాత్రను ఈ సంవత్సర ఇతివృత్తం తెలియజేస్తోంది. అసమానతలను తగ్గించడం, గౌరవనీయ పనిని ప్రోత్సహించడం, పేదరికాన్ని నిర్మూలించడంలో సహకార సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని ఐరాస ఎస్డీజీలు గుర్తించాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడంలో సహకార సంస్థల శక్తిని చాటాలని ఈ సహకార సదస్సు ఆశిస్తోంది.

 

సహకార ఉద్యమం పట్ల భారతదేశ నిబద్ధతకు ప్రతీకగా ప్రధాన మంత్రి స్మారక తపాలా బిళ్ళను ఆవిష్కరించారు. స్టాంపు పైన ముద్రించిన కమలం శాంతి, బలం, దృఢత్వం, అభివృద్ధిలకు సూచకంగా నిలుస్తూ, సహకార విలువలైన పరస్పర అనుకూలత, సమాజ అభివృద్ధిలను ప్రతిబింబిస్తుంది. తామరపువ్వులోని ఐదు రేకులు ప్రకృతిలోని ఐదు అంశాలను (పంచతత్వం) సూచిస్తాయి – పర్యావరణ, సామాజిక, ఆర్థిక స్థిరత్వం పట్ల సహకార సంఘాల నిబద్ధతను చాటుతాయి. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత పాత్రను సూచించే డ్రోన్‌ సహా వ్యవసాయం, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ, వినియోగదారుల సహకార సంఘాలు, గృహనిర్మాణం వంటి రంగాలను కూడా డిజైన్‌లో పొందుపరిచారు.