Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2023 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన జరిగిన మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమం 100వ భాగంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం


 

    నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు ‘మన్ కీ బాత్’ వందో ఎపిసోడ్. నాకు మీ అందరి నుండి వేల ఉత్తరాలొచ్చాయి. లక్షల సందేశాలొచ్చాయి. వీలైనన్ని ఎక్కువ ఉత్తరాలు చదవడానికి, చూడడానికి  ప్రయత్నించాను. సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మీ ఉత్తరాలు చదువుతున్నప్పుడు చాలా సార్లు ఉద్వేగానికి గురయ్యాను. భావోద్వేగాలతో నిండిపోయాను. భావోద్వేగాల్లో మునిగిపోయాను. నన్ను నేను సంబాళించుకున్నాను. ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్‌ సందర్భంగా మీరు నన్ను అభినందించారు. కానీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. వాస్తవానికి అభినందనలకు అర్హులు మీరు- మన్ కీ బాత్ శ్రోతలు- మన దేశ వాసులు. ‘మన్ కీ బాత్’ కోట్లాది భారతీయుల ‘మన్ కీ బాత్’. వారందరి భావాల వ్యక్తీకరణ.

మిత్రులారా! 2014 అక్టోబర్ 3న  విజయ దశమి పండుగ. మనం అందరం కలిసి ఆ విజయ దశమి రోజున ‘మన్ కీ బాత్’ యాత్రను ప్రారంభించాం. విజయ దశమి అంటే చెడుపై మంచి- విజయం సాధించిన పండుగ. ‘మన్ కీ బాత్’ కూడా దేశప్రజల ఉత్తమ కార్యాలు, సకారాత్మకతల  ప్రత్యేకమైన పండుగగా మారింది. ప్రతి నెలా వచ్చే పండుగ. దాని కోసం అందరం ఎదురుచూస్తాం. మనం ఇందులో సకారాత్మకతను, ప్రజల భాగస్వామ్యాన్ని ఉత్సవంగా జరుపుకుంటాం. ‘మన్ కీ బాత్’ ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే కొన్నిసార్లు నమ్మడం కష్టం. ప్రతి ఎపిసోడ్ ఒక ప్రత్యేకమైందిగా మారింది. ప్రతిసారీ కొత్త ఉదాహరణల నూతనత్వం.  ప్రతిసారీ దేశవాసుల కొత్త విజయాల విస్తరణ. ‘మన్ కీ బాత్’లో దేశంలోని నలుమూలల ప్రజలు, అన్ని వయసుల వారు చేరారు. బేటీ బచావో- బేటీ బచావో అంశం కానివ్వండి.  స్వచ్ఛ భారత్ ఉద్యమం కానివ్వండి.   ఖాదీపై ప్రేమ లేదా ప్రకృతిపై  ప్రేమ కానివ్వండి. స్వాతంత్ర్య అమృత మహోత్సవం లేదా అమృత సరోవర్ కానివ్వండి. ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన ఏ అంశమైనా, ప్రజా ఉద్యమంగా మారింది. మీరు అలా చేశారు. నేను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విషయాన్ని  ‘మన్ కీ బాత్’లో పంచుకున్నప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మిత్రులారా! ‘మన్ కీ బాత్’ నాకు ఇతరుల ఉత్తమ గుణాలను  ఆరాధించడం లాంటిది. నాకు ఒక మార్గదర్శకులుండేవారు. ఆయన శ్రీ లక్ష్మణరావు జీ ఇనామ్‌దార్. మేం ఆయన్నివకీల్ సాహెబ్ అని పిలిచేవాళ్ళం. ఎదుటివారి గుణాలను పూజించాలని ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు.  ఎదుటి వారెవరైనా సరే-  మీ మిత్రులైనా సరే,  మీ ప్రత్యర్థులైనా సరే. వారి మంచి గుణాలను తెలుసుకుని వారి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఆయన చెప్పిన ఈ విషయం నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది. ఇతరుల గుణాల నుంచి నేర్చుకునేందుకు ‘మన్ కీ బాత్’ గొప్ప మాధ్యమంగా మారింది.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈ కార్యక్రమం నన్ను మీ నుండి ఎప్పుడూ  దూరం కానివ్వలేదు. నాకు గుర్తుంది- నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి సామాన్య ప్రజలను కలవడం, వారితో మమేకం కావడం సహజంగా జరిగేది. ముఖ్యమంత్రి పని తీరు, పదవీకాలం ఇలాగే ఉండే  అవకాశాలున్నాయి. కానీ 2014లో ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇక్కడి జీవితం చాలా భిన్నంగా ఉంటుందని తెలుసుకున్నాను. పని స్వభావం వేరు. బాధ్యత వేరు.  పరిస్థితుల బంధనాలు. భద్రతా కవచాలు. కాలపరిమితులు. తొలి రోజుల్లో ఏదో భిన్నంగా అనిపించింది. వెలితిగా అనిపించింది. ఏదో ఒకరోజు నా స్వదేశంలోని ప్రజలతో మైత్రి దొరకడం కష్టం అవుతుంది కాబట్టి యాభయ్యేళ్ల కిందట నేను నా ఇంటిని వదిలి వెళ్ళలేదు. నా సర్వస్వం అయిన దేశప్రజల నుండి వేరుగా  జీవించలేను. ‘మన్ కీ బాత్’ ఈ సవాలుకు ఒక పరిష్కారాన్ని అందించింది.  సామాన్యులతో అనుసంధానమయ్యే మార్గం చూపింది. కార్యాలయ భారాలు, ప్రోటోకాల్ వ్యవస్థకే పరిమితమయ్యాయి. ప్రజల ఉద్వేగాలు, కోట్లాది మందితో పాటు నా మనోభావాలు ప్రపంచంలో విడదీయరాని భాగాలయ్యాయి. ప్రతి నెలా నేను దేశ ప్రజల నుండి వేలకొద్దీ సందేశాలను చదువుతాను. ప్రతి నెలా నేను దేశవాసుల  ఒక అద్భుతమైన స్వరూపాన్ని చూస్తాను. దేశప్రజల తపస్సు, త్యాగాల్లోని పతాకస్థాయిని నేను చూస్తున్నాను. అనుభూతి చెందుతున్నాను. నేను మీకు కొద్దిగా కూడా దూరంగా ఉన్నాననే భావన నాలో ఏమాత్రం లేదు. నా దృష్టిలో ‘మన్ కీ బాత్’ కేవలం ఒక కార్యక్రమం కాదు. నాకు ఇది విశ్వాసం, ఆరాధన, వ్రతం. దైవ పూజకు వెళ్లినప్పుడు ప్రజలు ప్రసాదం పళ్లెం తెస్తారు. అలాగే నా దృష్టిలో ‘మన్ కీ బాత్’ ప్రజా దేవుళ్ల చరణ ప్రసాదం లాంటిది. ‘మన్ కీ బాత్’ నా మనసులోని ఆధ్యాత్మిక యాత్రగా మారింది.

‘మన్ కీ బాత్’ వ్యక్తి నుండి సమష్టి దశకు ప్రయాణం.

‘మన్ కీ బాత్’ అహం నుండి సామూహిక చేతనకు ప్రయాణం.

ఇదే ‘నేను కాదు-మీరు’ అనే సంస్కార సాధన.

మీరు ఊహించండి. నా దేశవాసులు కొందరు 40-40 సంవత్సరాలుగా జనావాసం లేని కొండలపై, బంజరు భూముల్లో ​​చెట్లను నాటుతున్నారు. చాలా మంది ప్రజలు 30-30 సంవత్సరాలుగా నీటి సంరక్షణ కోసం మెట్ల బావులను, చెరువులను తవ్విస్తున్నారు, వాటిని శుభ్రం చేస్తున్నారు. కొందరు 25-30 ఏళ్లుగా పేద పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. మరికొందరు పేదల చికిత్సలో సహాయం చేస్తున్నారు. ‘మన్ కీ బాత్’లో చాలాసార్లు ఈ విషయాలను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యాను. ఆకాశవాణి సహచరులు దీన్ని చాలాసార్లు మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఈరోజు గతం కళ్ల ముందు కనిపిస్తోంది.  దేశప్రజల ఈ ప్రయత్నాలు నన్ను నిరంతరం శ్రమించేలా ప్రేరేపించాయి.

మిత్రులారా! ‘మన్ కీ బాత్’లో మనం ప్రస్తావించే వ్యక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సజీవంగా మార్చిన మన హీరోలు. ఈ రోజు మనం వందవ  ఎపిసోడ్  మైలురాయిని చేరుకున్న సందర్భంలో ఈ హీరోల ప్రయాణం గురించి తెలుసుకోవడానికి మనం మరోసారి వారి దగ్గరికి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మనం కొంతమంది మిత్రులతో మాట్లాడేందుకు  కూడా ప్రయత్నిద్దాం. హర్యానాకు చెందిన సోదరుడు సునీల్ జగ్లాన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. హర్యానాలో లింగ నిష్పత్తిపై చాలా చర్చ జరిగింది. నేను కూడా ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారాన్ని హర్యానా నుండే ప్రారంభించాను. అందువల్లే సునీల్ జగ్లాన్ గారు నా మనస్సుపై ఎంతో ప్రభావం చూపారు. సునీల్ గారి ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రచారాన్ని చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నేను కూడా ఆయన దగ్గర నేర్చుకుని ‘మన్ కీ బాత్’లో చేర్చాను. కూతురితో సెల్ఫీ ప్రపంచ ప్రచారంగా మారింది. ఇందులో ముఖ్య విషయం సెల్ఫీ కాదు, సాంకేతికత కాదు. ఈ ప్రచారంలో కూతురికి ప్రాధాన్యత ఇచ్చారు. జీవితంలో కూతురి ప్రాముఖ్యత కూడా ఈ ప్రచారం ద్వారా వెల్లడైంది. ఇటువంటి అనేక ప్రయత్నాల ఫలితంగా నేడు హర్యానాలో లింగ నిష్పత్తి మెరుగుపడింది. ఈరోజు సునీల్ గారితో మాట్లాడదాం.

 

ప్రధానమంత్రి గారు: నమస్కారం సునీల్ గారూ…

 

సునీల్ గారు: నమస్కారం సార్. మీ మాట విన్న తర్వాత నా ఆనందం చాలా పెరిగింది సార్.

 

ప్రధానమంత్రి గారు:  సునీల్ గారూ… ‘సెల్ఫీ విత్ డాటర్’ అందరికీ గుర్తుంది. ఇప్పుడు మళ్లీ దాని గురించి చర్చిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది?

 

సునీల్ గారు: ప్రధానమంత్రి గారూ… నిజానికి అమ్మాయిల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు మా రాష్ట్రం హర్యానా నుండి ప్రారంభించి, దేశం అంతటికీ విస్తరించిన  నాలుగో పానిపట్టు  యుద్ధం నాతోపాటు  ప్రతి ఒక్క ఆడపిల్లల తండ్రికీ చాలా ముఖ్యమైంది. కూతుళ్లను ప్రేమించే తండ్రులకు ఇది పెద్ద విషయం.

ప్రధానమంత్రి గారు:  సునీల్ గారూ.. మీ కూతురు ఇప్పుడు ఎలా ఉంది? ఈ రోజుల్లో ఏం చేస్తోంది?

 

సునీల్ గారు: సార్. నా కూతుళ్లు నందిని, యాచిక. ఒకరు 7వ తరగతి, ఒకరు 4వ తరగతి చదువుతున్నారు. మీకు వీరాభిమానులు సార్. ‘థాంక్యూ ప్రైమ్ మినిస్టర్’ అంటూ తమ క్లాస్ మేట్స్ తో మీకు లేఖలు కూడా వాళ్ళు రాయించారు సార్.

 

ప్రధానమంత్రి గారు: వహ్వా! మీ అమ్మాయిలకు మా తరఫున, మన్ కీ బాత్ శ్రోతల తరఫున చాలా ఆశీర్వాదాలు అందించండి.

సునీల్ గారు: చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ వల్ల దేశంలోని ఆడపిల్లల ముఖాల్లో చిరునవ్వులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

 

ప్రధానమంత్రి గారు: చాలా ధన్యవాదాలు సునీల్ గారూ…

 

సునీల్ గారు:  ధన్యవాదాలు సార్.

 

మిత్రులారా! ‘మన్ కీ బాత్’లో దేశంలోని మహిళా శక్తికి సంబంధించిన వందలాది స్పూర్తిదాయకమైన కథనాలను ప్రస్తావించినందుకు నేను చాలా సంతృప్తి చెందాను. మనం  ఛత్తీస్‌గఢ్‌లోని దేవుర్ గ్రామ మహిళల గురించి చర్చించినట్టుగానే మన సైన్యమైనా, క్రీడా ప్రపంచమైనా -నేను మహిళల విజయాల గురించి మాట్లాడినప్పుడల్లా అనేక ప్రశంసలు వచ్చాయి. ఈ దేవుర్ గ్రామ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామ కూడళ్లు, రోడ్లు, దేవాలయాలను శుభ్రం చేయడానికి ప్రచారాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా వేలాది పర్యావరణ హిత టెర్రకోట కప్పులను ఎగుమతి చేసిన తమిళనాడు గిరిజన మహిళల నుండి దేశం చాలా స్ఫూర్తిని పొందింది. తమిళనాడులోనే 20 వేల మంది మహిళలు ఏకమై వేలూరులోని నాగా నదిని పునరుజ్జీవింపజేశారు. ఇలాంటి అనేక ప్రచారాలకు మన మహిళా శక్తి నాయకత్వం వహించింది.  వారి ప్రయత్నాలను తెరపైకి తీసుకురావడానికి ‘మన్ కీ బాత్’ వేదికగా మారింది.

 

మిత్రులారా! ఇప్పుడు మనకు ఫోన్ లైన్‌లో మరో ఉత్తములు ఉన్నారు. ఆయన పేరు మంజూర్ అహ్మద్. ‘మన్ కీ బాత్’లో  జమ్మూ కాశ్మీర్ పెన్సిల్ స్లేట్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మంజూర్ అహ్మద్ గారి ప్రస్తావన వచ్చింది.

 

ప్రధాన మంత్రి గారు: మంజూర్ గారూ… ఎలా ఉన్నారు?

మంజూర్ గారు: థాంక్యూ సార్… చాలా బాగున్నాం సార్.

ప్రధాన మంత్రి గారు:  ఈ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది.

 

మంజూర్ గారు: థాంక్యూ సార్.

 

ప్రధాన మంత్రి గారు: పెన్సిల్-స్లేట్‌ల  పని ఎలా జరుగుతోంది?

 

మంజూర్ గారు: ఇది చాలా బాగా జరుగుతోంది సార్.  మీరు మన ‘మన్ కీ బాత్’ ప్రసంగంలో చెప్పినప్పటి నుండి పని చాలా పెరిగింది సార్. ఈ పనిలో ఇతరులకు ఉపాధి కూడా చాలా పెరిగింది.

 

ప్రధాన మంత్రి గారు: ఇప్పుడు ఎంత మందికి ఉపాధి లభిస్తుంది?

మంజూర్ గారు: ఇప్పుడు నా దగ్గర రెండు వందల మందికి పైగా ఉన్నారు సార్.

ప్రధాన మంత్రి గారు: ఓహో! నాకు చాలా సంతోషంగా ఉంది.

 

మంజూర్ గారు: అవును సార్..అవును సార్…ఇప్పుడు నేను దీన్ని రెండు నెలల్లో విస్తరిస్తున్నాను. మరో 200 మందికి ఉపాధి పెరుగుతుంది సార్.

 

ప్రధాన మంత్రి గారు: వావ్! మంజూర్ గారూ… చూడండి…

మంజూర్ గారు: సార్..

ప్రధానమంత్రి గారు: దీనివల్ల మీ పనికిగానీ మీకు గానీ  ఎలాంటి గుర్తింపూ లేదని మీరు చెప్పడం నాకు బాగా గుర్తుంది. మీరు చాలా బాధలు, ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు గుర్తింపు కూడా వచ్చింది. రెండు వందల మందికి  పైగా ఉపాధి దొరుకుతోంది.

మంజూర్ గారు:  అవును సార్… అవును సార్.

 

ప్రధాన మంత్రి గారు: మీరు కొత్త విస్తరణలతో, 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎంతో  గొప్ప సంతోషకరమైన వార్తను అందించారు మీరు.

మంజూర్ గారు: ఇక్కడ ఉన్న రైతులకు కూడా అప్పటి నుండి చాలా ప్రయోజనం కలిగింది సార్. ఒకప్పుడు 2000 రూపాయలు విలువ చేసే చెట్టు విలువ ఇప్పుడు 5000 రూపాయలకి చేరింది సార్. అప్పటి నుండి ఇందులో చాలా డిమాండ్ పెరిగింది. ఇది దాని స్వంత గుర్తింపుగా కూడా మారింది సార్. ఇప్పుడు నాకు చాలా ఆర్డర్‌లు ఉన్నాయి సార్. ఇప్పుడు నేను ఒకటి, రెండు నెలల్లో మరింత విస్తరిస్తున్నాను. ఇక్కడి రెండు నుండి నాలుగు ఊళ్ళలో రెండొందల నుండి రెండున్నర వందల మంది యువతీ యువకులకు జీవనోపాధి కూడా కల్పించవచ్చు సార్.

ప్రధాన మంత్రి గారు: మంజూర్ గారూ… చూడండి.. వోకల్ ఫర్ లోకల్ ప్రచారంలోని శక్తి ఎంత అద్భుతమైందో మీరు నిరూపించారు.

మంజూర్ గారు: సార్.

ప్రధాన మంత్రి గారు: మీకు, గ్రామంలోని రైతులందరికీ, మీతో పని చేస్తున్న మిత్రులందరికీ అనేక అభినందనలు. ధన్యవాదాలు సోదరా!

మంజూర్ గారు: ధన్యవాదాలు సార్.

మిత్రులారా! మన దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులు తమ శ్రమ శక్తితో విజయ శిఖరాలకు చేరుకున్నారు. నాకు గుర్తుంది- విశాఖపట్నం నుండి వెంకట్ మురళీ ప్రసాద్ గారు ఆత్మ నిర్భర భారత్ చార్ట్‌ను పంచుకున్నారు. ఆయన భారతీయ ఉత్పత్తులను మాత్రమే ఎలా గరిష్టంగా ఉపయోగిస్తారో చెప్పారు. బేతియాకు చెందిన ప్రమోద్ గారు ఎల్‌ఈడీ బల్బుల తయారీకి చిన్న యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు, గఢ్ ముక్తేశ్వర్‌కు చెందిన సంతోష్ గారు చాపలను తయారు చేయడం ప్రారంభించినప్పుడు వారి ఉత్పత్తులను అందరి ముందుకు తీసుకురావడానికి ‘మన్ కీ బాత్’ మాధ్యమంగా మారింది. మేక్ ఇన్ ఇండియా నుండి స్పేస్ స్టార్టప్‌ల వరకు చాలా ఉదాహరణలను ‘మన్ కీ బాత్’లో చర్చించాం.

మిత్రులారా! మణిపూర్ సోదరి విజయశాంతి దేవి గారి గురించి కూడా నేను కొన్ని ఎపిసోడ్‌ల కిందట ప్రస్తావించడం మీకు గుర్తుండే ఉంటుంది. విజయశాంతి గారు తామర పీచులతో బట్టలు తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన పర్యావరణ అనుకూల ఆలోచనను ‘మన్ కీ బాత్’లో చర్చించాం. దాంతో వారి పని మరింత ప్రజాదరణ పొందింది. ఈరోజు విజయశాంతి గారు ఫోన్‌లో మనతో ఉన్నారు.

ప్రధానమంత్రి గారు: నమస్తే విజయశాంతి గారూ…! మీరు ఎలా ఉన్నారు?

విజయశాంతి గారు: సార్..  నేను బాగున్నాను.

ప్రధానమంత్రి గారు: మీ పని ఎలా జరుగుతోంది?

విజయశాంతి గారు: సార్… ఇప్పటికీ 30 మంది మహిళలతో కలిసి పనిచేస్తున్నాను.

ప్రధానమంత్రి గారు: ఇంత తక్కువ సమయంలో మీరు 30 మంది వ్యక్తుల బృంద స్థాయికి చేరుకున్నారు.

విజయశాంతి గారు: అవును సార్. ఈ సంవత్సరం కూడా మా ప్రాంతంలో 100 మంది మహిళలతో మరింత విస్తరిస్తున్నాను.

ప్రధానమంత్రి గారు: కాబట్టి మీ లక్ష్యం 100 మంది మహిళలన్నమాట

విజయశాంతి గారు: అవును సార్! 100 మంది మహిళలు

ప్రధానమంత్రి గారు: ఇప్పుడు ప్రజలకు ఈ తామర కాండం ఫైబర్ గురించి బాగా తెలుసు

విజయశాంతి గారు: అవును సార్. భారతదేశం అంతటా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా అందరికీ తెలుసు.

ప్రధానమంత్రి గారు: ఇప్పుడు ఇది బాగా ప్రాచుర్యం పొందింది

విజయశాంతి గారు: అవును సార్..  ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లోటస్ ఫైబర్ గురించి తెలుసు

ప్రధానమంత్రి గారు: ఇప్పుడు మీకు మార్కెట్ కూడా ఏర్పడిందా?

విజయశాంతి గారు: అవును సార్. నాకు యు. ఎస్. ఏ. నుండి మార్కెట్ వచ్చింది. వారు పెద్దమొత్తంలో, చాలా పరిమాణంలో కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అమెరికాకు కూడా పంపడానికి నేను ఈ సంవత్సరం నుండి ఇవ్వాలనుకుంటున్నాను.

ప్రధానమంత్రి గారు: కాబట్టి ఇప్పుడు మీరు ఎగుమతిదారులన్నమాట?

విజయశాంతి గారు: అవును సార్. ఈ సంవత్సరం నుండి నేను భారతదేశంలో తయారు చేసిన లోటస్ ఫైబర్ ఉత్పత్తిని ఎగుమతి చేస్తాను.

ప్రధానమంత్రి గారు: కాబట్టి నేను వోకల్ ఫర్ లోకల్  అన్నప్పుడు  ఇప్పుడు లోకల్ ఫర్ గ్లోబల్ అన్నట్టు

విజయశాంతి గారు: అవును సార్. నేను నా ఉత్పత్తితో ప్రపంచమంతటా చేరుకోవాలనుకుంటున్నాను.

ప్రధానమంత్రి గారు: అభినందనలు. విష్ యూ బెస్టాఫ్ లక్.

విజయశాంతి గారు:  ధన్యవాదాలు సార్

ప్రధానమంత్రి గారు: ధన్యవాదాలు, ధన్యవాదాలు విజయశాంతి గారూ..

విజయశాంతి గారు: థాంక్యూ సార్

మిత్రులారా! ‘మన్ కీ బాత్’కి మరో ప్రత్యేకత ఉంది. ‘మన్ కీ బాత్’ ద్వారా అనేక ప్రజా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి, ఊపందుకున్నాయి. ఉదాహరణకు మన బొమ్మల పరిశ్రమను తిరిగి ఉన్నత స్థాయిలో స్థాపించే లక్ష్యం ‘మన్ కీ బాత్’తో మాత్రమే ప్రారంభమైంది. భారతీయ జాతి శునకాలు, మన దేశీయ కుక్కల గురించి అవగాహన కల్పించడం కూడా ‘మన్ కీ బాత్’తో ప్రారంభమైంది. నిరుపేద చిన్న దుకాణదారులతో బేరాలాడమని, గొడవలు పెట్టుకోమని మరో ప్రచారం మొదలుపెట్టాం. ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారం ప్రారంభమైనప్పుడు కూడా ఈ నినాదంతో  దేశప్రజలను అనుసంధానించడంలో ‘మన్ కీ బాత్’ పెద్ద పాత్ర పోషించింది. ఇలాంటి ప్రతి ఉదాహరణ సమాజంలో మార్పుకు కారణమైంది. ఇలాగే సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిని ప్రదీప్ సాంగ్వాన్ గారు కూడా చేపట్టారు. ‘మన్ కీ బాత్’లో ప్రదీప్ సాంగ్వాన్ గారి ‘హీలింగ్ హిమాలయాస్’ ప్రచారం గురించి చర్చించాం. ఆయన ఇప్పుడు ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు.

మోదీ గారు: ప్రదీప్ గారూ… నమస్కారం!

ప్రదీప్ గారు: సార్ జై హింద్ |

మోదీ గారు: జై హింద్, జై హింద్, సోదరా! మీరు ఎలా ఉన్నారు ?

ప్రదీప్ గారు: చాలా బాగున్నాను సార్. మీ మాటలు విని, ఇంకా బాగున్నా సార్.  మోదీ గారు: మీరు హిమాలయాలను బాగు చేయాలని భావించారు.

ప్రదీప్ గారు: అవును సార్.

మోదీ గారు: ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఈ రోజుల్లో మీ ఉద్యమం ఎలా సాగుతోంది?

ప్రదీప్ గారు: సార్… చాలా బాగా జరుగుతోంది. మనం గతంలో ఐదేళ్లలో చేసే పని 2020 నుండి ఒక సంవత్సరంలో పూర్తవుతోంది సార్.

మోదీ గారు: వాహ్!

ప్రదీప్ గారు: అవును…  అవును సార్. మొదట్లో నేను చాలా కంగారు పడ్డాను.  జీవితాంతం ఇలా చేయగలనా లేదా అని చాలా భయపడ్డాను. కానీ కొంత సహకారం లభించింది. 2020 వరకు చాలా కష్టపడ్డాం.  ప్రజలు చాలా తక్కువగా చేరారు. సహకరించని వారు చాలా మంది ఉన్నారు. వారు కూడా మా ప్రచారంపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ 2020లో ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు ఏడాదికి 6-7 క్లీనింగ్ డ్రైవ్‌లు చేసేవాళ్లం.  10 క్లీనింగ్ డ్రైవ్‌లు చేసేవాళ్లం. ఇప్పుడు మేం ప్రతిరోజూ వేర్వేరు ప్రదేశాల నుండి ఐదు టన్నుల చెత్తను సేకరిస్తున్నాం.

మోదీ గారు: వాహ్!

ప్రదీప్ గారు: సార్.. నేను ఒకానొక సమయంలో దాదాపు ఈ పనిని వదులుకునే దశలో ఉన్నానంటే నమ్మండి సార్.  ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఊహించనంత వేగంగా మార్పులు జరిగాయి. మీరు మాలాంటి వ్యక్తులను ఎలా కనుగొంటారో తెలియదు.  నేను నిజంగా కృతజ్ఞుడిని. ఇంత మారుమూల ప్రాంతంలో ఎవరు పనిచేస్తారు?  మేం హిమాలయ ప్రాంతంలో పనిచేస్తున్నాం. ఇంత ఎత్తైన ప్రాంతంలో పని చేస్తున్నాం. అయినా మీరు మమ్మల్ని అక్కడ కనుగొన్నారు. మన పనిని ప్రపంచం ముందుంచారు. మన దేశ ప్రథమ సేవకులతో మాట్లాడగలగడం ఆరోజు, ఈరోజు కూడా ఉద్వేగభరిత క్షణాలే.  ఇంతకు మించిన అదృష్టం నాకు మరొకటి ఉండదు.

మోదీ గారు: ప్రదీప్ గారూ…! మీరు వాస్తవమైన అర్థంలో హిమాలయాల శిఖరాలపై సాధన చేస్తున్నారు. ఇప్పుడు మీ పేరు వినగానే పర్వతాల పరిశుభ్రత ప్రచారంలో మీరు ఎలా పాల్గొంటున్నారో ప్రజలు గుర్తుంచుకుంటారని నాకు ఖచ్చితంగా తెలుసు.

ప్రదీప్ గారు: అవును సార్.

మోదీ గారు: మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఒక పెద్ద  బృందం ఏర్పడుతోంది.  మీరు ప్రతిరోజూ ఇంత భారీ స్థాయిలో పని చేస్తున్నారు.

ప్రదీప్ గారు: అవును సార్.

మోదీ గారు: మీ ప్రయత్నాలు, వాటిపై చర్చల కారణంగా ఇప్పుడు చాలా మంది పర్వతారోహకులు పరిశుభ్రతకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేయడం ప్రారంభించారని నాకు పూర్తి నమ్మకం ఉంది.

ప్రదీప్ గారు: అవును సార్! చాలా…

మోదీ గారు: మీలాంటి మిత్రుల కృషి వల్ల వ్యర్థాలు కూడా ఉపయోగకరమేనన్న సందేశం ఇప్పుడు ప్రజల మనస్సుల్లో నాటుకు పోవడం మంచి విషయం.  పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతోంది. మనం గర్వించే హిమాలయాలు కూడా ఇప్పుడు రక్షణ పొందుతున్నాయి. ఇందులో సామాన్యులు కూడా అనుసంధానమవుతున్నారు.  ప్రదీప్ గారూ.. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు సోదరా!

ప్రదీప్ గారు: ధన్యవాదాలు సార్. థాంక్యూ సోమచ్. జై హింద్!

మిత్రులారా! దేశంలో పర్యాటకం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన సహజ వనరులు కావచ్చు, నదులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, చెరువులు కావచ్చు లేదా మన పుణ్యక్షేత్రాలు కావచ్చు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది పర్యాటక రంగానికి ఎంతగానో దోహదపడుతుంది. టూరిజంలో పరిశుభ్రతతో పాటు ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఉద్యమం గురించి కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. ఈ ఉద్యమం కారణంగా ప్రజలు తమ చుట్టూ ఉన్న ఎన్నో ప్రదేశాల గురించి మొదటిసారిగా తెలుసుకున్నారు. విదేశాల్లో పర్యటనకు వెళ్లేముందు మన దేశంలోని కనీసం 15 పర్యాటక ప్రాంతాలను తప్పక సందర్శించాలని నేను ఎప్పుడూ చెప్తుంటాను.  ఈ ప్రాంతాలు మీరు నివసించే రాష్ట్రంలోవి కాకూడదు. మీ రాష్ట్రం వెలుపల ఏ ఇతర ప్రాంతంలో అయినా ఉండాలి. అదేవిధంగా స్వచ్చ సియాచిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇ-వేస్ట్ వంటి ముఖ్యమైన అంశాల గురించి మనం నిరంతరం మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ప్రపంచం యావత్తూ ఆందోళన చెందుతున్న పర్యావరణ సమస్యను పరిష్కరించడంలో ‘మన్ కీ బాత్’  చేసిన ఈ ప్రయత్నం చాలా ముఖ్యమైంది.

మిత్రులారా! ఈసారి యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజూలే గారి నుండి ‘మన్ కీ బాత్’పై నాకు మరో ప్రత్యేక సందేశం వచ్చింది. వంద ఎపిసోడ్‌ల ఈ అద్భుతమైన ప్రయాణంపై దేశప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ముందుగా యునెస్కో డైరెక్టర్ జనరల్ గారి మనసులోని మాటను విందాం.

#ఆడియో (యునెస్కో డైరెక్టర్ జనరల్)#

డైరెక్టర్ జనరల్, యునెస్కో: నమస్తే ఎక్స్ లెన్సీ..  ప్రియమైన ప్రధాన మంత్రిగారూ..!  ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారం వందవ ఎపిసోడ్‌లో భాగంపొందే అవకాశం కల్పించినందుకు యునెస్కో తరపున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యునెస్కోకు, భారతదేశానికి సుదీర్ఘమైన ఉమ్మడి చరిత్ర ఉంది. విద్య, విజ్ఞాన శాస్త్రం, సంస్కృతి, సమాచార రంగాల్లో యునెస్కోకు, భారతదేశానికి బలమైన భాగస్వామ్యం ఉంది.  విద్య ప్రాముఖ్యత గురించి మాట్లాడటానికి నేను ఈ రోజు ఈ అవకాశాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. 2030 నాటికి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా యునెస్కో తన సభ్య దేశాలతో కలిసి పనిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నందువల్ల ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారత దేశం అనుసరిస్తున్న మార్గాన్ని దయచేసి వివరించగలరా? సంస్కృతిలో సహకారానికి, వారసత్వ పరిరక్షణకు కూడా  యునెస్కో పని చేస్తుంది. ఈ సంవత్సరం జి-20కి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ నేతలు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ లెన్సీ!  అంతర్జాతీయ ఎజెండాలో సంస్కృతిని, విద్యను భారతదేశం ఎలా అగ్రస్థానంలో ఉంచాలని కోరుకుంటోంది? ఈ అవకాశానికి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ ప్రజలకు మీ ద్వారా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్వరలో కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు.

ప్రధానమంత్రి మోదీ: ధన్యవాదాలు ఎక్స్‌లెన్సీ. 100వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మీతో సంభాషించడం నాకు సంతోషంగా ఉంది. మీరు విద్యకు, సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావించినందుకు నేను కూడా సంతోషిస్తున్నాను.

మిత్రులారా! యునెస్కో డైరెక్టర్ జనరల్ గారు విద్య, సాంస్కృతిక పరిరక్షణకు సంబంధించి భారతదేశ కృషి గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఈ రెండు అంశాలు ‘మన్ కీ బాత్’లో ఇష్టమైన అంశాలు.

విషయం విద్యకు సంబంధించినది కావచ్చు. లేదా సంస్కృతికి సంబంధించిన విషయం కావచ్చు. పరిరక్షణ కావచ్చు. లేదా ఉన్నతీకరించడం కావచ్చు. ఇది భారతదేశ  పురాతన సంప్రదాయం. నేడు దేశం ఈ దిశగా చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. జాతీయ విద్యా విధానం కావచ్చు. లేదా ప్రాంతీయ భాషలో చదివే ఎంపిక కావచ్చు.  విద్యలో సాంకేతికత అనుసంధానం కావచ్చు.  మీరు ఇలాంటి అనేక ప్రయత్నాలను చూస్తారు. కొన్ని సంవత్సరాల కిందట గుజరాత్ లో ‘గుణోత్సవ్’, ‘శాలా ప్రవేశోత్సవ్’ వంటి కార్యక్రమాలు మెరుగైన విద్యను అందించడంలో, డ్రాపౌట్ రేట్లను తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యానికి అద్భుతమైన ఉదాహరణలుగా మారాయి. విద్య కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న చాలా మంది వ్యక్తుల ప్రయత్నాలకు ‘మన్ కీ బాత్’లో మనం ప్రాధాన్యత ఇచ్చాం. ఒడిషాలో బండిపై టీ అమ్మే దివంగత డి. ప్రకాశరావు గురించి మనం ఒకసారి చర్చించుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. పేద పిల్లలకు చదువు చెప్పడంలో ఆయన కృషి ప్రత్యేకంగా ప్రస్తావించదగింది. 

జార్ఖండ్‌లోని గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలను నిర్వహిస్తున్న సంజయ్ కశ్యప్ కావచ్చు, కోవిడ్ సమయంలో చాలా మంది పిల్లలకు ఇ-లర్నింగ్ ద్వారా సహాయం చేసిన హేమలత ఎన్‌కె కావచ్చు, ఇలాంటి చాలా మంది ఉపాధ్యాయుల ఉదాహరణలను మనం ‘మన్ కీ బాత్’లో తీసుకున్నాం. సాంస్కృతిక పరిరక్షణ ప్రయత్నాలకు కూడా ‘మన్ కీ బాత్’లో ప్రాముఖ్యత ఇచ్చాం. లక్షద్వీప్ కు చెందిన కుమ్మెల్ బ్రదర్స్ ఛాలెంజర్స్ క్లబ్ కావచ్చు, లేదా కర్ణాటక కు చెందిన  ‘క్వెమ్‌శ్రీ’ గారి  ‘కళా చేతన’ వంటి వేదిక కావచ్చు. దేశంలోని ప్రతి మూల నుండి ప్రజలు లేఖల్లో నాకు అలాంటి ఉదాహరణలను పంపారు. దేశభక్తిపై ‘గీత్’, ‘లోరీ’ , ‘రంగోలి’కి సంబంధించిన మూడు పోటీల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మీకు గుర్తుండవచ్చు. ఒకసారి మనం భారతీయ విద్యా విధానంలో కథాకథన మాధ్యమ వినియోగంపై దేశవ్యాప్తంగా ఉన్న కథకులతో చర్చించాం. సమష్టి కృషితో అతిపెద్ద మార్పు తీసుకురాగలమని నాకు అచంచలమైన నమ్మకం ఉంది. స్వాతంత్ర్య స్వర్ణయుగంలో ముందుకు సాగుతున్న ఈ సంవత్సరం మనం జి-20కి కూడా అధ్యక్షత వహిస్తున్నాం.  విద్యతో పాటు విభిన్న ప్రపంచ సంస్కృతులను సుసంపన్నం చేయాలనే మన  సంకల్పం మరింత దృఢంగా మారడానికి ఇది కూడా ఒక కారణం.

నా ప్రియమైన దేశవాసులారా! మన ఉపనిషత్తుల నుండి ఒక మంత్రం శతాబ్దాలుగా మన మనస్సులకు ప్రేరణ అందిస్తోంది.

చరైవేతి చరైవేతి చరైవేతి

కొనసాగించు – కొనసాగించు – కొనసాగించు

ఈ రోజు మనం చరైవేతి చరైవేతి స్ఫూర్తితో ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్‌ని పూర్తి చేస్తున్నాం. ప్రతి పూసను ఒకదానితో ఒకటి అంటిపెట్టుకునే పూల  దారం లాగే భారతదేశ  సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ‘మన్ కీ బాత్’ ప్రతి మనస్సును అనుసంధానిస్తోంది. ప్రతి ఎపిసోడ్‌లో దేశవాసుల సేవ, సామర్థ్యం ఇతరులకు స్ఫూర్తినిచ్చాయి. ఈ కార్యక్రమంలో ప్రతి దేశస్థుడు ఇతర దేశస్థులకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే మన్ కీ బాత్‌లోని ప్రతి ఎపిసోడ్ తర్వాతి ఎపిసోడ్‌కు రంగం సిద్ధం చేస్తుంది. ‘మన్ కీ బాత్’ ఎల్లప్పుడూ సద్భావన, సేవాభావం, కర్తవ్య భావనతో ముందుకు సాగింది. ఈ సానుకూలత స్వాతంత్ర్య అమృతకాలంలో  దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కొత్త శిఖరాలకు  తీసుకెళ్తుంది.  ‘మన్ కీ బాత్’తో ప్రారంభమైన ఈ కృషి నేడు దేశంలో ఒక కొత్త సంప్రదాయంగా మారుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రయత్నాల స్ఫూర్తిని మనం చూసే సంప్రదాయమిది.

మిత్రులారా! ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎంతో ఓపికతో రికార్డ్ చేసే ఆకాశవాణి సహచరులకు కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘మన్ కీ బాత్’ని చాలా తక్కువ సమయంలో చాలా వేగంతో వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించే అనువాదకులకు కూడా నేను కృతజ్ఞుడిని. దూరదర్శన్, మై గవ్ సహచరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమర్షియల్ బ్రేక్స్ లేకుండా ‘మన్ కీ బాత్’ చూపించే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీ ఛానళ్లు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరగా ‘మన్ కీ బాత్’పై ఆసక్తి చూపిన దేశప్రజలకు, భారతదేశంపై విశ్వాసం ఉన్న ప్రజలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ స్ఫూర్తి, శక్తి వల్లే ఇదంతా సాధ్యమైంది.

మిత్రులారా! ఈ రోజు నేను చాలా చెప్పవలసి ఉంది. కానీ సమయం తక్కువుంది. మాటలు తక్కువ పడుతున్నాయి. మీరందరూ నా భావాలను అర్థం చేసుకుంటారని, నా భావనలను అర్థం చేసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యుడిగా, ‘మన్ కీ బాత్’ సహాయంతో నేను మీ మధ్యలో ఉన్నాను, మీ మధ్యలో ఉంటాను. వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. కొత్త విషయాలతో, కొత్త సమాచారంతో దేశప్రజల విజయాలను మళ్లీ ఉత్సవంగా జరుపుకుందాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

****