Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2023 వ సంవత్సరం మే 28 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 101 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి ‘మన్ కీ బాత్’లోకి  మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈసారి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్ 2వ సెంచరీ ప్రారంభం. గత నెలలో మనమందరం ప్రత్యేక సెంచరీ కార్యక్రమాన్ని  జరుపుకున్నాం. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమానికి అతిపెద్ద బలం. 100వ ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయానికిఒక విధంగా దేశం మొత్తం ఒక సూత్రంతో అనుసంధానమై ఉంది. పరిశుభ్రతా కార్మికులైన సోదర సోదరీమణులు కావచ్చు.  లేదా వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు కావచ్చు. ‘మన్ కీ బాత్’ అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసింది. ‘మన్ కీ బాత్’పై మీరందరూ ప్రదర్శించిన ఆత్మీయత, స్నేహభావం అపూర్వమైనవి. అవి భావోద్వేగానికి గురి చేస్తాయి. ‘మన్ కీ బాత్’ ప్రసారమైనప్పుడుఆ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో, వివిధ టైమ్ జోన్లలో ఒకచోట సాయంత్రం, మరోచోట అర్థరాత్రి అయినప్పటికీ 100వ ఎపిసోడ్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. వినేందుకు సమయం కేటాయించారు. వేల మైళ్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుండి వచ్చిన ఒక వీడియోను కూడా నేను చూశాను. అందులో వందేళ్ల ఒక అమ్మ తన ఆశీస్సులు ఇస్తోంది. భారతదేశంతో పాటు ఇతర నుండి కూడా ప్రజలు ‘మన్ కీ బాత్’పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలా మంది నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారు. ‘మన్ కీ బాత్’లో దేశం,  దేశప్రజలు సాధించిన విజయాల గురించి మాత్రమే చర్చించడాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ ఆశీర్వాదానికి నేను మీ అందరికీ గౌరవంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా! గతంలో మనం ‘మన్ కీ బాత్’లో కాశీ-తమిళ సంగమం గురించి, సౌరాష్ట్ర-తమిళ సంగమం గురించి మాట్లాడుకున్నాం. కాశీ-తెలుగు సంగమం కూడా ఎప్పుడో వారణాసిలో జరిగింది. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి బలం చేకూర్చేందుకు ఒక అపూర్వ ప్రయత్నం దేశంలో జరిగింది. ఇది  యువసంగమం కృషి. ఈ విశిష్ట ప్రయత్నంలో భాగస్వాములైన వ్యక్తుల నుండి దీని గురించి ఎందుకు వివరంగా అడగకూడదని నేను అనుకున్నాను. అందుకే ప్రస్తుతం ఇద్దరు యువకులు నాతో ఫోన్‌లో కనెక్ట్ అయ్యారు. ఒకరు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన గ్యామర్ న్యోకుమ్ గారు, మరొకరు బీహార్‌కి చెందిన అమ్మాయి విశాఖ సింగ్ గారు. మనం ముందు గ్యామర్ న్యోకుమ్‌ గారితో మాట్లాడదాం.

 

ప్రధానమంత్రి గారు: గ్యామర్ గారూ.. నమస్కారం.

 

గ్యామర్ గారు: నమస్కారం మోదీ గారూ!

 

ప్రధానమంత్రి గారు: గ్యామర్  గారూ.. మీ గురించి తెలుసుకోవాలని ముందుగా నేను కోరుకుంటున్నాను.

గ్యామర్ గారు – మోదీ గారూ… చాలా విలువైన సమయాన్ని వెచ్చించి నాతో మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు ముందుగా నేను మీకు,  ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను అరుణాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్‌  మొదటి సంవత్సరం  చదువుతున్నాను.

ప్రధానమంత్రి గారు: మీ నాన్న గారు, ఇంకా మీ కుటుంబంలోని వారు ఏం చేస్తారు?

 

గ్యామర్ గారు: మా నాన్న చిన్న వ్యాపారం చేస్తారు. మా కుటుంబసభ్యులందరూ  వ్యవసాయం చేస్తారు.

 

ప్రధానమంత్రి గారు: యువ సంగమం గురించి మీకు ఎలా తెలుసు? యువ

సంగమానికి ఎక్కడికి వెళ్ళారు? ఎలా వెళ్ళారు, ఏమైంది?

గ్యామర్ గారు:  మోదీ గారూ.. నాకు యువ సంగమం అంటే ఇష్టం.

యువ సంగమంలో పాల్గొనవచ్చని మా విద్యాసంస్థ ఎన్‌ఐటీలో చెప్పారు.  నేను మళ్ళీ ఇంటర్నెట్‌లో వెతికాను. ఇది చాలా మంచి కార్యక్రమమని నేను తెలుసుకున్నాను. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌లో ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది.  నాకు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి వెంటనేనేనువెబ్‌సైట్‌కి వెళ్ళి అందులో నమోదు చేసుకున్నాను. నా అనుభవం చాలా సరదాగా ఉంది. చాలా బాగుంది.

ప్రధానమంత్రి గారు: మీరు ఏదైనా ఎంపిక చేసుకోవాల్సివచ్చిందా?

గ్యామర్ గారు: మోదీ గారూ.. వెబ్‌సైట్‌ లో అరుణాచల్ ప్రజల కోసం రెండు ఎంపికలు ఉన్నాయి. మొదటిది ఐఐటి తిరుపతి ఉన్న ఆంధ్రప్రదేశ్. రెండవది సెంట్రల్ యూనివర్శిటీ, రాజస్థాన్. నేను నా మొదటి ప్రాధాన్యత రాజస్థాన్‌కు ఇచ్చాను. రెండవ ప్రాధాన్యత ఐఐటి తిరుపతికి ఇచ్చాను. అలా రాజస్థాన్‌కు ఎంపికయ్యాను. అందుకే రాజస్థాన్ వెళ్లాను.

ప్రధానమంత్రి గారు: మీ రాజస్థాన్ పర్యటన ఎలా ఉంది? మీరు మొదటిసారి

రాజస్థాన్ వెళ్లారా?

గ్యామర్ గారు: అవును సార్. నేను మొదటిసారి అరుణాచల్ నుండి బయటికి  వెళ్ళాను. నేను ఈ రాజస్థాన్ లోని కోటలూ ఇవన్నీ సినిమాల్లో,  ఫోన్‌లో మాత్రమే చూశాను. కాబట్టినేను మొదటిసారి వెళ్ళినప్పుడునా అనుభవం చాలా బాగుంది. అక్కడి ప్రజలు చాలా మంచివారు.  మాతో వారు వ్యవహరించిన  తీరు కూడా చాలా బాగుంది. అక్కడ మనం నేర్చుకునేందుకు కొత్త కొత్త  విషయాలున్నాయి. రాజస్థాన్‌లోని పెద్ద సరస్సుల గురించి,  అక్కడి ప్రజల గురించి తెలుసుకున్నాను. నాకు అసలే  తెలియని వర్షపు నీటి సంరక్షణ వంటి అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం- రాజస్థాన్ సందర్శన- నాకు చాలా బాగుంది.

ప్రధానమంత్రి గారు: చూడండి. మీకు లభించిన అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే-

అరుణాచల్ హీరోల నేల. రాజస్థాన్ కూడా హీరోల నేల.  సైన్యంలో రాజస్థాన్ నుండి చాలా మంది ఉన్నారు.  అరుణాచల్‌లోని సరిహద్దులో ఉన్న సైనికుల మధ్య మీరు రాజస్థాన్ సైనికులను కలిసినప్పుడు మీరు ఖచ్చితంగా వారితో మాట్లాడతారు. మీరు రాజస్థాన్ వెళ్ళినట్టుగా, రాజస్థాన్ లో కొన్ని అనుభవాలు కలిగినట్టుగా వారికి చెప్తే మీ సాన్నిహిత్యం వెంటనే పెరుగుతుంది. సరే.. మీరు అక్కడ కూడా అరుణాచల్‌లో ఉండేలాంటి కొన్ని సారూప్యతలను గమనించి ఉంటారు.

గ్యామర్ గారు: మోదీ గారూ…నాకు కనిపించిన ఒకే ఒక్క సారూప్యత దేశంపై  ప్రేమ,  ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్  దృక్పథం,  అనుభూతి. ఎందుకంటే అరుణాచల్‌లో కూడా ప్రజలు తాము భారతీయులమని చాలా గర్వంగా భావిస్తారు. రాజస్థాన్‌లోని ప్రజలు కూడా తమ మాతృభూమిని ప్రేమిస్తారు. ఇదే అక్కడ- ముఖ్యంగా యువ తరంలో కనబడింది.  ఎందుకంటే నేను అక్కడ చాలా మంది యువకులతో సంభాషించాను. వారి మధ్య చాలా సారూప్యతను నేను చూశాను. వారు భారతదేశం కోసం ఏం చేయాలనుకుంటున్నారు, దేశంపై ప్రేమ- ఈ రెండు  విషయాల్లో నాకు చాలా పోలికలు కనబడ్డాయి. 

ప్రధానమంత్రి గారు: అక్కడ పరిచయమైన స్నేహితులతో పరిచయం పెంచుకున్నారా? లేదా వచ్చిన తర్వాత మరిచిపోయారా?

గ్యామర్ గారు: లేదు సార్. మేం పరిచయాన్ని పెంచుకున్నాం.

ప్రధాని గారు: అవునా…! మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా?

గ్యామర్ గారు: అవును మోదీ గారూ… నేను సోషల్ మీడియాలో  చురుకుగా ఉన్నాను.

ప్రధానమంత్రి గారు: అలాంటప్పుడు మీరు బ్లాగ్ లో రాయాలి. యువ సంగమం అనుభవాన్ని, అందులో మీరెలా నమోదు చేసుకున్నారు, రాజస్థాన్‌లో మీ అనుభవం ఎలా ఉంది అనే విషయాలను రాయాలి. దేశంలోని యువతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గొప్పతనం, ఈ పథకం వివరాలు తెలిసేలా రాయాలి. యువత దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీ అనుభవాలతో బ్లాగ్ రాయాలి. అప్పుడు చాలా మందికి ఉపయోగపడుతుంది.

గ్యామర్ గారు: సరే సార్. నేను ఖచ్చితంగా రాస్తాను.

ప్రధానమంత్రి గారు: గ్యామర్ గారూ… మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఈ 25 సంవత్సరాలు మీ జీవితానికి, అలాగే దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. అందుకే యువత దేశం కోసం, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలి. నేను మీకు చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ధన్యవాదాలు.

గ్యామర్ గారు: మోదీ గారూ… మీకు కూడా ధన్యవాదాలు.

ప్రధానమంత్రి గారు: నమస్కారం సోదరా!

మిత్రులారా!అరుణాచల్ ప్రజలు చాలా ఆత్మీయంగా ఉంటారు. వారితో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. యువ సంగమంలో గ్యామర్ గారి అనుభవం అద్భుతం. రండి… ఇప్పుడు బీహార్ అమ్మాయి విశాఖ సింగ్ గారితో మాట్లాడదాం.

ప్రధాన మంత్రి గారు: విశాఖ గారూ… నమస్కారం.

విశాఖ గారు: ముందుగా, గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి గారికి నా నమస్కారాలు.  నాతో పాటు ప్రతినిధులందరి తరపున మీకు ప్రణామాలు.

ప్రధానమంత్రి గారు: సరే విశాఖ గారూ.. . ముందుగా మీ గురించి చెప్పండి. యువ సంగమం గురించి కూడా తెలుసుకోవాలని ఉంది.

విశాఖ గారు: నేను బీహార్‌లోని సాసారాం పట్టణ నివాసిని. మా కాలేజీ వాట్సాప్ గ్రూప్ సందేశం ద్వారా యువ సంగమం గురించి మొదట తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకున్నాను. ప్రధానమంత్రి పథకం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’లో భాగమే యువ సంగమం అని తెలుసుకున్నాను. అలా ఆ తర్వాత అందులో జాయిన్ అవ్వాలని ఉత్సాహంతో దరఖాస్తు చేశాను.  అక్కడి నుంచి తమిళనాడు ప్రయాణం చేసి తిరిగి వచ్చాను. అలా నేను పొందిన ఎక్స్ పోజర్ తర్వాత ఈ కార్యక్రమంలో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది.  భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతికి అనుగుణంగా మాలాంటి యువత కోసం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించినందుకు హృదయపూర్వకంగా మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..

ప్రధానమంత్రి గారు: విశాఖ గారూ.. మీరేం చదువుతున్నారు?

విశాఖ గారు: నేను కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాను సార్ .

ప్రధానమంత్రి గారు: సరే విశాఖ గారూ..మీరు ఏ రాష్ట్రానికి వెళ్లాలి, ఎక్కడ చేరాలి? అనే  నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు?

విశాఖ గారు: నేను ఈ యువ సంగమం గురించి గూగుల్‌లో వెతకడం ప్రారంభించినప్పుడుబీహార్‌కు చెందిన ప్రతినిధులు తమిళనాడు నుండి వచ్చిన ప్రతినిధులతో పరస్పర మార్పిడి చేసుకుంటున్నారని నాకు తెలిసింది. తమిళనాడు మన దేశంలో చాలా గొప్ప సాంస్కృతిక రాష్ట్రం. కాబట్టి బీహార్ నుండి తమిళనాడుకు ప్రతినిధులను పంపడం చూసినప్పుడు ఫామ్ నింపాలా వద్దా, అక్కడికి వెళ్ళాలా వద్దా అనే విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి ఇది నాకు చాలా సహాయపడింది. నేను అందులో పాల్గొన్నందుకు ఈరోజు చాలా గర్వపడుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది.

ప్రధానమంత్రి గారు: ఇదే మీ మొదటి తమిళనాడు పర్యటనా?

విశాఖ గారు: అవును సార్. నేను మొదటిసారి వెళ్ళాను.

ప్రధానమంత్రి గారు: సరే, మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోదగింది ఏదైనా చెప్పాలనుకుంటే, మీరు ఏం చెప్తారు? దేశ యువత మీ మాట వింటోంది.

విశాఖ గారు: సార్. మొత్తం ప్రయాణాన్ని పరిశీలిస్తేఅది నాకు చాలా అద్భుతంగా ఉంది. ఒక్కో దశలో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. తమిళనాడు వెళ్ళి అక్కడ మంచి స్నేహితులను పొందాను. అక్కడి సంస్కృతిని అలవర్చుకున్నాను.  అక్కడి ప్రజలను కలిశాను. కానీ అక్కడ నేను అనుభవించిన గొప్ప విషయం ఏమిటంటే ఇస్రోకి వెళ్లే అవకాశం ఎవరికీ ఉండదు.  మేం ప్రతినిధులం కాబట్టి ఇస్రోకి వెళ్లే అవకాశం మాకు లభించింది. రెండవది మేం  రాజ్‌భవన్‌కు వెళ్లినప్పుడు తమిళనాడు గవర్నర్‌ను కలిశాం. కాబట్టి ఆ రెండు క్షణాలు నాకు చాలా గొప్పవి.  యువతగా మాకు లభించని అవకాశాలు యువ సంగమం ద్వారా దొరికాయి. కాబట్టి ఇది నాకు పరిపూర్ణమైన,  మరపురాని క్షణం.

ప్రధానమంత్రి గారు: బీహార్‌లో తినే విధానం వేరు, తమిళనాడులో తినే విధానం వేరు.

విశాఖ గారు: అవును సార్.

ప్రధానమంత్రి గారు: అంటే పూర్తిగా అన్ని విధాలుగా సెట్ చేశారా?

విశాఖ గారు: మేము అక్కడికి వెళ్లినప్పుడు, తమిళనాడులో దక్షిణ భారత వంటకాలు ఉన్నాయి. అందుకే అక్కడికి వెళ్లగానే దోశ, ఇడ్లీ, సాంబార్, ఊతప్పం, వడ, ఉప్మా వడ్డించారు. మేం మొదట ప్రయత్నించినప్పుడుఅది చాలా బాగుంది! అక్కడి ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. చాలా రుచిగా ఉంటుంది. ఉత్తరాది ఆహారానికి చాలా భిన్నంగా ఉంటుంది.కాబట్టి నాకు అక్కడి ఆహారం నచ్చింది.  అక్కడి ప్రజలు కూడా చాలా మంచివారు.

ప్రధానమంత్రి గారు: అంటే ఇప్పుడు మీకు తమిళనాడులో కూడా కొత్తగా స్నేహితులయ్యారు కదా?

విశాఖ గారు: సార్! అవును, మేం అక్కడ NIT తిరుచ్చిలో ఉన్నాం. ఆ తర్వాత IIT మద్రాస్‌లో ఉన్నాం. ఆ రెండు ప్రాంతాల విద్యార్థులతో నేను స్నేహం చేశాను. దానికి తోడు మధ్యలో CII స్వాగతోత్సవం ఉండడంతో దగ్గర్లోని కాలేజీల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు అక్కడికి వచ్చారు. అక్కడ మేం ఆ విద్యార్థులతో కూడా సంభాషించాం. వారిని కలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. వారిలో చాలా మంది నా స్నేహితులు కూడా. తమిళనాడు నుండి బీహార్ వస్తున్న కొంతమంది ప్రతినిధులను కూడా కలిశాం. కాబట్టి మేం వారితో కూడా మాట్లాడాం. మేం ఇప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం.. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను.

ప్రధానమంత్రి గారు: అయితే విశాఖ గారూ…. మీరు ఈ అనుభవాన్ని బ్లాగ్ లో రాయండి.  సోషల్ మీడియాలో పంచుకోండి. ముందుగా ఈ యువ సంగమం గురించి, ఆ తర్వాత ‘ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్’ గురించి రాయండి. ఆపై తమిళనాడులో మీకు లభించిన పరిచయం, స్వాగతం,  పొందిన ఆతిథ్యం, తమిళ ప్రజల ప్రేమ- ఈ విషయాలన్నీ దేశానికి చెప్పండి. అయితే రాస్తారు మీరు.

విశాఖ గారు: అవును, తప్పకుండా!

ప్రధానమంత్రి గారు: నేను మీకు చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు.

విశాఖ గారు: థాంక్యూ సోమచ్ సార్. నమస్కారం.

గ్యామర్ గారు, విశాఖ గారు- మీకు  చాలా చాలా శుభాకాంక్షలు. యువ సంగమంలో మీరు నేర్చుకున్నది జీవితాంతం మీతో ఉండనివ్వండి. మీ అందరికీ ఇవే నా శుభాకాంక్షలు.

మిత్రులారా!భారతదేశం బలం వైవిధ్యంలో ఉంది. మన దేశంలో చూడవలసినవి చాలా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా మంత్రిత్వ శాఖ ‘యువసంగమం’ పేరుతో అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల  మధ్య అనుసంధానాన్ని పెంచడంతోపాటు దేశంలోని యువత ఒకరితో ఒకరు కలిసిపోయే అవకాశాన్ని కల్పించడం ఈ చొరవ  లక్ష్యం. వివిధ రాష్ట్రాల ఉన్నత విద్యాసంస్థలను దీనికి అనుసంధానించారు. ‘యువసంగమం’లో యువత ఇతర రాష్ట్రాల నగరాలు, గ్రామాలను సందర్శిస్తుంది. వివిధ రకాల వ్యక్తులను కలుసుకునే అవకాశం వారికి లభిస్తుంది. యువసంగమం తొలి దశలో దేశంలోని 22 రాష్ట్రాల్లో సుమారు 1200 మంది యువకులు పర్యటించారు. అందులో భాగమైన యువకులంతా జీవితాంతం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇలాంటి జ్ఞాపకాలతో తిరిగి వస్తున్నారు. చాలా పెద్ద కంపెనీల సీఈవోలు, బిజినెస్ లీడర్లు భారతదేశంలో యాత్రికులుగా గడిపినట్టు మనం చూశాం. నేను ఇతర దేశాల నాయకులను కలిసినప్పుడు వారు తమ యవ్వనంలో భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినట్టు చాలాసార్లు చెప్పారు. చూసిన ప్రతిసారీ మన ఉత్సాహం పెంచేలా మన భారతదేశంలో తెలుసుకోవలసినవి,  చూడవలసినవి చాలా ఉన్నాయి. ఈ ఉత్తేజకరమైన అనుభవాలను తెలుసుకున్న తర్వాతమీరు కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఖచ్చితంగా స్ఫూర్తిని పొందుతారని నాకు నమ్మకం ఉంది.

నా ప్రియమైన దేశవాసులారా!కొద్ది రోజుల క్రితం నేను జపాన్‌లోని హిరోషిమాకు వెళ్ళాను. అక్కడ నాకు హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించే అవకాశం వచ్చింది. అది ఒక భావోద్వేగ అనుభవం. మనం చరిత్ర జ్ఞాపకాలను స్మరించుకుంటే అది రాబోయే తరాలకు ఎంతగానో ఉపకరిస్తుంది. కొన్నిసార్లు మనం మ్యూజియంలో కొత్త పాఠాలు నేర్చుకుంటాం.  కొన్నిసార్లు మనం నేర్చుకోవడానికి చాలా విషయాలుంటాయి. కొద్ది రోజుల కిందట భారతదేశంలో ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్‌పో జరిగింది. ఇది ప్రపంచంలోని 1200 కంటే ఎక్కువ మ్యూజియాల ప్రత్యేకతలను ప్రదర్శించింది.  భారతదేశంలో మనకు అనేక రకాలైన ప్రదర్శనశాలలు ఉన్నాయి. అవి మన గతానికి సంబంధించిన అనేక అంశాలను ప్రదర్శిస్తాయి. గురుగ్రామ్‌లో మ్యూజియో కెమెరా అనే ఒక ప్రత్యేకమైన మ్యూజియం ఉంది. 1860 వ సంవత్సరం తర్వాత వచ్చిన 8 వేల కంటే ఎక్కువ కెమెరాల సేకరణ ఈ మ్యూజియంలో ఉంది. తమిళనాడులో మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్ ను దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.  ముంబాయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయంలో 70 వేలకు పైగా వస్తువులను భద్రపర్చారు. 2010వ  సంవత్సరంలో స్థాపించిన ఇండియన్ మెమరీ ప్రాజెక్ట్ ఒక రకమైన ఆన్‌లైన్ మ్యూజియం. ప్రపంచం నలుమూలల నుండి పంపిన చిత్రాలు,  కథల ద్వారా భారతదేశ  అద్భుతమైన చరిత్ర  లింక్‌లను అనుసంధానించడంలో ఇది నిమగ్నమై ఉంది. విభజన భయాందోళనలతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ముందుకు తెచ్చే ప్రయత్నం కూడా జరిగింది. గత సంవత్సరాల్లో కూడాభారతదేశంలో కొత్త రకాల మ్యూజియాలు,  స్మారక చిహ్నాలు నిర్మించడం మనం చూశాం. స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన సోదరులు,  సోదరీమణుల కృషికి అంకితమిచ్చిన పది కొత్త మ్యూజియాలు ఏర్పాటవుతున్నాయి. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌ లోని బిప్లోబీ భారత్ గ్యాలరీ అయినా జలియన్‌వాలాబాగ్ మెమోరియల్ పునరుద్ధరణ అయినాదేశంలోని మాజీ ప్రధానులందరికీ అంకితం చేసిన పీఏం మ్యూజియం కూడా ఈ రోజు ఢిల్లీ కీర్తిని పెంచుతున్నాయి. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్,  పోలీస్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు ప్రతిరోజూ చాలా మంది వస్తుంటారు. చరిత్రాత్మక దండి మార్చ్ కు అంకితమిచ్చిన దండి స్మారక చిహ్నం కావచ్చు.  లేదా స్టాట్యూ ఆఫ్ యూనిటీ మ్యూజియం కావచ్చు. సరే. నేను ఇక్కడితో ఆగాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియాల జాబితా చాలా పెద్దది.  దేశంలోని అన్ని మ్యూజియాల గురించి అవసరమైన సమాచారం కూడా సంకలనం చేశారు. మ్యూజియం ఏ థీమ్ ఆధారంగా ఉంది, అక్కడ ఎలాంటి వస్తువులున్నాయి, అక్కడి వారిని సంప్రదించేందుకు వివరాలు – ఇవన్నీ ఆన్‌లైన్ డైరెక్టరీలో ఉంటాయి. మీకు అవకాశం దొరికినప్పుడల్లాదేశంలోని ఈ మ్యూజియాలను తప్పక సందర్శించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అక్కడ ఉన్న ఆకర్షణీయమైన చిత్రాలను #(హ్యాష్‌ట్యాగ్) మ్యూజియం మెమోరీస్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది మన అద్భుతమైన సంస్కృతితో భారతీయుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! మనమందరం ఒక లోకోక్తిని చాలాసార్లు విని ఉంటాం. పదే పదే విని ఉంటాం. నీళ్లు లేకుంటే జీవం లేదని. నీళ్లు లేకుంటే జీవితంలో ఎప్పుడూ సంక్షోభం ఉంటుంది. వ్యక్తి వికాసం, దేశాభివృద్ధి కూడా నిలిచిపోతాయి. ఈ భవిష్యత్ సవాలును దృష్టిలో ఉంచుకునినేడు దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలను నిర్మిస్తున్నారు. మన అమృత సరోవరాలు  ప్రత్యేకమైనవి. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన అమృత కాలంలో నిర్మితమవుతున్నాయి కాబట్టి. ఇందులో ప్రజల అమృతం కృషి కూడా ఉంది కాబట్టి. ఇప్పటి వరకు 50 వేలకు పైగా అమృత సరోవరాలను నిర్మించారని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. నీటి సంరక్షణ దిశగా ఇదొక పెద్ద ముందడుగు.

మిత్రులారా!ప్రతి వేసవిలో నీటికి సంబంధించిన సవాళ్ల గురించి మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. ఈసారి కూడా మనం ఈ అంశాన్ని తీసుకుంటాం. అయితే ఈసారి మనం నీటి సంరక్షణకు సంబంధించిన స్టార్టప్‌ల గురించి చర్చిస్తాం. ఫ్లక్స్‌జెన్ అనే స్టార్ట్-అప్ IOT ఎనేబుల్డ్ టెక్నాలజీ ద్వారా నీటి నిర్వహణ కోసం ఎంపికలను అందిస్తుంది. ఈ సాంకేతికత నీటి వినియోగం  నమూనాలను తెలియజేస్తుంది. నీటిని సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. మరో స్టార్టప్ LivNSense. ఇది కృత్రిమ మేధ,  మెషిన్ లెర్నింగ్ ఆధారంగా రూపొందించిన వేదిక. దాని సహాయంతోనీటి పంపిణీని సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చు. దీన్ని బట్టి ఎక్కడెక్కడ ఎంత నీరు వృథా అవుతుందో కూడా తెలిసిపోతుంది. మరో స్టార్టప్ ‘కుంభీ కాగజ్’. ఈ కుంభీ కాగజ్ మీకు కూడా చాలా నచ్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కుంభీ కాగజ్ స్టార్ట్-అప్ ఒక ప్రత్యేక పనిని ప్రారంభించింది. ఒకప్పుడు నీటి వనరులకు ఇబ్బందిగా భావించిన గుర్రం డెక్కతో కాగితాన్ని తయారు చేసే పని చేస్తోంది.

మిత్రులారా!చాలా మంది యువకులు నవకల్పన, సాంకేతికతల ద్వారా పని చేస్తుంటే, ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లా యువతలా సమాజానికి అవగాహన కల్పించే లక్ష్యంలో నిమగ్నమై ఉన్న యువకులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడి యువకులు నీటిని పొదుపు చేసేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా పెళ్లి లాంటి కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్లి నీటి దుర్వినియోగాన్ని ఎలా అరికట్టవచ్చో తెలియజేస్తున్నారు. జార్ఖండ్‌లోని ఖూంటి జిల్లాలో నీటి సమర్ధవంతమైన వినియోగానికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం జరుగుతోంది. నీటి సంక్షోభం నుండి బయటపడేందుకు ఖూంటిలోని ప్రజలు బోరి డ్యామ్ సహకారం కనుగొన్నారు. బోరి డ్యామ్ నుండి నీరు చేరడం వల్ల ఇక్కడ ఆకుకూరలు ,  కూరగాయలు కూడా పెరగడం ప్రారంభించాయి. దీని వల్ల ప్రజల ఆదాయం కూడా పెరుగుతోంది, ఈ ప్రాంత అవసరాలు కూడా నెరవేరుతున్నాయి. ఏ ప్రజా భాగస్వామ్య ప్రయత్నమైనా దానితో పాటు అనేక మార్పులను ఎలా తీసుకువస్తుందనేందుకు ఖూంటి ఒక ఆకర్షణీయమైన ఉదాహరణగా మారింది. ఈ కృషికి ఇక్కడి ప్రజలను అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా! 1965 యుద్ధ సమయంలో మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు  జై జవాన్- జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. తర్వాత అటల్ జీ జై విజ్ఞాన్‌ని జోడించారు. కొన్నేళ్ల క్రితం దేశంలోని శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు జై అనుసంధాన్ గురించి మాట్లాడాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ ఈ నాలుగింటికి అద్దం పట్టే ‘మన్ కీ బాత్’లో ఈరోజు చర్చ అలాంటి వ్యక్తి గురించే, అలాంటి సంస్థ గురించే. ఆ సత్పురుషులు మహారాష్ట్రకు చెందిన శివాజీ శ్యాంరావ్ డోలే గారు.  శివాజీ డోలే నాసిక్ జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందినవారు. ఆయన పేద ఆదివాసీ రైతు కుటుంబం నుండి వచ్చారు.  మాజీ సైనికుడు కూడా. సైన్యంలో ఉంటూ దేశం కోసం కృషి చేశారు. ఉద్యోగ  విరమణ తర్వాత కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని నిర్ణయించుకుని అగ్రికల్చర్ డిప్లొమా చేశారు. అంటే జై జవాన్ నుండి జై కిసాన్ వైపు మళ్లారు. ఇప్పుడు ప్రతి క్షణం ఆయన ప్రయత్నం వ్యవసాయ రంగంలో గరిష్టంగా ఎలా కృషి చేయాలనేదే. ఈ చొరవలో శివాజీ డోలే గారు 20 మందితో ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో కొంతమంది మాజీ సైనికులను చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన బృందం వెంకటేశ్వర కో-ఆపరేటివ్ పవర్ &ఆగ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ అనే సహకార సంఘ నిర్వహణను చేపట్టింది. ఈ సహకార సంస్థ గతంలో నిష్క్రియంగా ఉండేది. ఆయన దాన్ని పునరుద్ధరించేందుకు చొరవ తీసుకున్నారు. ఇప్పుడు  వెంకటేశ్వర కో-ఆపరేటివ్ కొద్దికాలంలోనే అనేక జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ బృందం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పని చేస్తోంది. దాదాపు 18 వేల మంది దీనితో అనుసంధానమై  ఉన్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు కూడా ఉన్నారు. ఈ బృందంలోని సభ్యులు నాసిక్‌లోని మాలేగావ్‌లో 500 ఎకరాలకు పైగా భూమిలో ఆగ్రో ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ బృందం నీటి సంరక్షణ కోసం అనేక చెరువులను నిర్మించడంలో నిమగ్నమై ఉంది. విశేషమేమిటంటే వారు ఆర్గానిక్ ఫార్మింగ్ ను,  డైరీని కూడా ప్రారంభించారు. ఇప్పుడు వారు పండించిన ద్రాక్షను యూరప్‌కు కూడా ఎగుమతి చేస్తున్నారు. నా దృష్టిని ఆకర్షించిన ఈ టీమ్‌లోని రెండు గొప్ప లక్షణాలు జై విజ్ఞాన్,  జై అనుసంధాన్. దీని సభ్యులు సాంకేతికతను, ఆధునిక వ్యవసాయ పద్ధతులను గరిష్టంగా ఉపయోగిస్తున్నారు. ఎగుమతులకు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలపై కూడా దృష్టి పెట్టడం రెండో విశేషం. ‘సహకారంతో సమృద్ధి’ అనే స్ఫూర్తితో పని చేస్తున్న ఈ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం పెద్ద సంఖ్యలో ప్రజలను శక్తిమంతం చేయడమే కాకుండాఅనేక జీవనోపాధి మార్గాలను కూడా సృష్టించింది. ఈ ప్రయత్నం ‘మన్ కీ బాత్’ వింటున్న ప్రతి శ్రోతకి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! ఈరోజు మే 28న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ జయంతి. ఆయన త్యాగం, ధైర్యం,  సంకల్ప శక్తికి సంబంధించిన కథలు నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తాయి. అండమాన్‌లో వీర సావర్కర్‌ కాలాపానీ శిక్ష అనుభవించిన  గదికి వెళ్లిన రోజును నేను మర్చిపోలేను. వీర సావర్కర్ వ్యక్తిత్వం దృఢత్వం,  గొప్పతనాలతో తో కూడి ఉంది. ఆయన నిర్భయ, ఆత్మగౌరవ స్వభావానికి బానిస మనస్తత్వం పూర్తిగా  నచ్చలేదు. స్వాతంత్య్రోద్యమం కోసం మాత్రమే కాదు- సామాజిక సమానత్వం,  సామాజిక న్యాయం కోసం వీర్ సావర్కర్ చేసిన కృషి ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తుంది.

మిత్రులారా!కొన్ని రోజుల తర్వాత జూన్ 4వ తేదీన సంత్ కబీర్‌దాస్ జీ జయంతి. కబీర్‌దాస్ జీ చూపిన మార్గం నేటికీ ప్రాసంగికత కలిగి ఉంది.

“కబీరా కువా ఏక్ హై – పానీ భరే అనేక్

బర్తన్ మే హీ భేద్ హై, పానీ సబ్ మే ఏక్”

అని కబీర్‌దాస్‌ చెప్పేవారు. అంటేబావి దగ్గరకు రకరకాల వ్యక్తులు నీళ్లు తోడుకోవడానికి వచ్చినాఆ బావి ఎవరికీ తేడా లేకుండాఅన్ని పాత్రల్లోనూ నీరు ఒకేలా ఉంటుంది. సమాజాన్ని విభజించేందుకు యత్నించే ప్రతి చెడు ఆచారాన్ని సంత్ కబీర్ వ్యతిరేకించారు. సమాజాన్ని మేల్కొల్పడానికి కృషి చేశారు. ప్రస్తుతం దేశం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నప్పుడు సంత్ కబీర్‌ను స్ఫూర్తిగా తీసుకొని సమాజాన్ని శక్తిమంతం చేయడానికి మన ప్రయత్నాలను పెంచాలి.

నా ప్రియమైన దేశప్రజలారా!రాజకీయాలలో, చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు నేను మీతో చర్చించబోతున్నాను. ఆ మహనీయుని పేరు ఎన్.టి. రామారావు. ఆయన మనందరికీ ఎన్టీఆర్ అనే పేరుతో కూడా తెలుసు. ఈరోజు ఎన్టీఆర్ 100వ జయంతి. ఆయన తన బహుముఖ ప్రజ్ఞతో తెలుగు చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా నిలవడమే కాకుండా కోట్లాది ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నారు. ఆయన 300కి పైగా సినిమాల్లో నటించిన సంగతి మీకు తెలుసా? ఆయన తన నటన ఆధారంగా అనేక చారిత్రక పాత్రలకు జీవం పోశారు. భగవాన్ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి అనేక పాత్రలలో ఎన్టీఆర్ నటనని ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారు. ప్రజలు ఇప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటారు. ఎన్టీఆర్ సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా ఆయన ప్రజల నుండి చాలా ప్రేమ,  ఆశీర్వాదాలు పొందారు. దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ లక్షలాది  ప్రజల హృదయాలను ఏలిన ఎన్. టి. రామారావు గారికి నా వినమ్రపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా! ఈసారి ‘మన్ కీ బాత్’లో ఇంతే. వచ్చేసారి మరికొన్ని కొత్త అంశాలతో మీ మధ్యకి వస్తాను. అప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మరింత పెరగవచ్చు. కొన్ని చోట్ల వర్షాలు కూడా ప్రారంభమవుతాయి. ప్రతి వాతావరణ పరిస్థితుల్లోనూ మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ 21న ‘ప్రపంచ యోగా దినోత్సవం’ కూడా జరుపుకుంటాం. దేశ విదేశాల్లో అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సన్నాహాల గురించి కూడా మీరు మీ ‘మన్ కీ బాత్’ని నాకు రాస్తూ ఉండండి. మీ దగ్గర మరేదైనా అంశంపై మరింత సమాచారం ఉంటే, అది కూడా నాకు చెప్పండి. ‘మన్ కీ బాత్’లో అత్యధికంగా సూచనలు తీసుకునేందుకే నేను ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ మరోసారి చాలా చాలా ధన్యవాదాలు. వచ్చే నెల మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. నమస్కారం!

 

***