Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2023 వ సంవత్సరం డిసెంబర్ 31 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క 108వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. మిమ్మల్ని కలిసేందుకు ఒక శుభ అవకాశం ‘మన్ కీ బాత్’. మీతో, మీ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో కలిసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా, సంతృప్తికరంగా ఉంటుంది. ‘మన్ కీ బాత్’ ద్వారా మిమ్మల్ని కలుస్తుంటే నా అనుభూతి ఇలాగే ఉంటుంది. ఈ రోజు మనం  కలిసి చేస్తున్న ఈ ప్రయాణంలో 108వ భాగం. 108 సంఖ్య  ప్రాముఖ్యత, పవిత్రత ఇక్కడ లోతైన అధ్యయనాంశం. జపమాలలోని 108 పూసలు, 108 సార్లు జపం, 108 దివ్య క్షేత్రాలు, ఆలయాల్లో 108 మెట్లు, 108 గంటలు…ఈ 108 సంఖ్య అపారమైన విశ్వాసంతో ముడిపడి ఉంది. అందుకే ‘మన్ కీ బాత్’ 108వ భాగం నాకు మరింత ప్రత్యేకంగా మారింది. ఈ 108 భాగాల్లో ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన అనేక ఉదాహరణలను మనం చూశాం. వారి నుండి ప్రేరణ పొందాం. ఇప్పుడు ఈ మైలురాయిని చేరుకున్న తర్వాత కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో, వేగంగా ముందుకు వెళ్లాలని మనం నిర్ణయించుకోవాలి. సంతోషకరమైన యాదృచ్ఛిక విషయం ఏమిటంటే రేపటి సూర్యోదయం 2024 సంవత్సరంలో మొదటి సూర్యోదయం కావడం. రేపు మనం 2024 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. మీ అందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మిత్రులారా! ‘మన్ కీ బాత్’ శ్రోతలు వ్యక్తులు నాకు లేఖలు రాశారు. వారి చిరస్మరణీయ క్షణాలను పంచుకున్నారు. ఈ ఏడాది మన దేశం ఎన్నో ప్రత్యేక విజయాలు సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఇదే సంవత్సరంలో ఆమోదం పొందింది. భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమైన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. మిత్రులారా! ఈ రోజు భారతదేశంలోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. అభివృద్ధి చెందిన భారతదేశ స్ఫూర్తితో, స్వావలంబన స్ఫూర్తితో నిండి ఉంది. అదే స్ఫూర్తిని, ఊపును 2024లో కూడా మనం కొనసాగించాలి. ప్రతి భారతీయుడు ‘వోకల్ ఫర్ లోకల్’ అనే మంత్రానికి ప్రాముఖ్యత ఇస్తున్నారని దీపావళి రోజున రికార్డు స్థాయిలో జరిగిన  వ్యాపార లావాదేవీలు నిరూపించాయి. 

మిత్రులారా! నేటికీ చాలా మంది చంద్రయాన్-3 విజయానికి సంబంధించి నాకు సందేశాలు పంపుతున్నారు. నాలాగే మీరు కూడా మన శాస్త్రవేత్తల విషయంలో, ముఖ్యంగా మహిళా శాస్త్రవేత్తల విషయంలో గర్వపడుతున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మిత్రులారా! ‘నాటు-నాటు’ పాటకు ఆస్కార్‌ పురస్కారం లభించినప్పుడు దేశం మొత్తం సంతోషంతో ఉప్పొంగిపోయింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కి ఇచ్చిన గౌరవం గురించి విన్నప్పుడు ఎవరైనా సంతోషించకుండా ఉండగలరా! వీటి ద్వారా భారతదేశ సృజనాత్మకతను ప్రపంచం దర్శించింది. పర్యావరణంతో మనకున్న అనుబంధాన్ని అర్థం చేసుకుంది.

ఈ ఏడాది క్రీడల్లో కూడా మన అథ్లెట్లు అద్భుతంగా రాణించారు. మన క్రీడాకారులు ఆసియా క్రీడల్లో 107 పతకాలు, ఆసియా పారా గేమ్స్‌లో 111 పతకాలు సాధించారు. క్రికెట్ ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్లు తమ ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. అండర్-19 టీ-20 ప్రపంచకప్‌లో మన మహిళా క్రికెట్ జట్టు విజయం ఎంతో స్ఫూర్తిదాయకం. అనేక క్రీడల్లో భారతీయులు సాధించిన విజయాలు దేశానికి కీర్తిని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు 2024లో పారిస్ ఒలింపిక్స్ జరుగుతాయి. దీని కోసం యావద్దేశం మన  ఆటగాళ్లను ప్రోత్సహిస్తోంది.

మిత్రులారా! మనం కలిసి ప్రయత్నాలు చేసినప్పుడల్లా అది మన దేశ అభివృద్ధి ప్రయాణంపై చాలా సానుకూల ప్రభావం చూపింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’, ‘మేరీ మాటీ మేరా దేశ్’ వంటి విజయవంతమైన ప్రచారాలు మనం అనుభవం లోకి వచ్చాయి. ఇందులో కోట్లాది ప్రజల భాగస్వామ్యానికి మనమంతా సాక్షులం. 70 వేల అమృత సరోవరాల నిర్మాణం కూడా మన సాంవహిక విజయం.

మిత్రులారా! ఆవిష్కరణలకు ప్రాముఖ్యత ఇవ్వని దేశ అభివృద్ధి ఆగిపోతుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. భారతదేశం  ఇన్నోవేషన్ హబ్‌గా మారడం మన ప్రగతి ప్రయాణం ఆగబోదనే విషయానికి ప్రతీక. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 2015లో మనం 81వ స్థానంలో ఉన్నాం. ఈ రోజు ఈ ఇండెక్స్ లో మన ర్యాంక్ 40.

ఈ సంవత్సరం భారతదేశంలో దాఖలు చేసిన పేటెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. వీటిలో దాదాపు 60% దేశీయ నిధులకు సంబంధించినవే. ఈసారి క్యూఎస్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక సంఖ్యలో భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. మీరు ఈ విజయాల జాబితాను రూపొందించడం ప్రారంభిస్తే అది ఎప్పటికీ పూర్తి కాదు. భారతదేశ సామర్థ్య ప్రభావానికి ఇది కేవలం ఒక సంగ్రహావలోకనం మాత్రమే. మన దేశం సాధించిన  ఈ విజయాల నుండి, దేశ ప్రజల ఈ సాఫల్యాల నుండి మనం ప్రేరణ పొందాలి.  వారి విషయంలో గర్వపడాలి. కొత్త తీర్మానాలు తీసుకోవాలి. మరోసారి మీ అందరికీ 2024 శుభాకాంక్షలు.

నా కుటుంబ సభ్యులారా! భారతదేశం విషయంలో ప్రతిచోటా ఉన్న ఆశ, ఉత్సాహం గురించి మనం చర్చించాం. ఈ ఆశ, నమ్మకం చాలా బాగున్నాయి.  భారతదేశం అభివృద్ధి చెందితే యువతకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. కానీ యువత దృఢంగా ఉన్నప్పుడే దాని వల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.

ఈ రోజుల్లో జీవన విధానాలకు సంబంధించిన వ్యాధుల గురించి ఎంత చర్చ జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇది మనందరికీ- ముఖ్యంగా యువతకు చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ ‘మన్ కీ బాత్’ కోసం ఫిట్ ఇండియాకు సంబంధించిన అంశాలను పంపాల్సిందిగా మీ అందరినీ కోరాను. మీ స్పందన నాలో ఉత్సాహాన్ని నింపింది. పెద్ద సంఖ్యలో స్టార్టప్‌లు కూడా నమో యాప్‌పై తమ సూచనలను నాకు పంపాయి. తమ అనేక ప్రత్యేక ప్రయత్నాలను స్టార్టప్ సంస్థలు చర్చించాయి.

మిత్రులారా! భారతదేశం చేసిన ప్రయత్నాల కారణంగా 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకున్నాం. ఇది ఈ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లకు చాలా అవకాశాలను అందించింది. వీటిలో లక్నోలో ప్రారంభమైన ‘కిరోజ్ ఫుడ్స్’, ప్రయాగ్‌రాజ్‌కి చెందిన ‘గ్రాండ్-మా మిల్స్’, ‘న్యూట్రాస్యూటికల్ రిచ్ ఆర్గానిక్ ఇండియా’ వంటి అనేక స్టార్టప్‌లు ఉన్నాయి. ఆల్పినో హెల్త్ ఫుడ్స్, అర్బోరియల్ , కీరోస్ ఫుడ్‌లతో అనుసంధానమైన యువతీ యువకులు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. బెంగుళూరులోని అన్‌బాక్స్ హెల్త్‌తో అనుసంధానమైన యువతీ యువకులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకోవడంలో ప్రజలకు తాము ఎలా సహాయం చేస్తున్నారో కూడా చెప్పారు. శారీరక ఆరోగ్యంపై ఆసక్తి పెరుగుతుండటంతో ఈ రంగానికి సంబంధించిన కోచ్‌లు, శిక్షకుల డిమాండు  కూడా పెరుగుతోంది. ‘జోగో టెక్నాలజీస్’ వంటి స్టార్టప్‌లు ఈ డిమాండును తీర్చడంలో సహాయపడుతున్నాయి.

మిత్రులారా! ఈ రోజు శారీరక ఆరోగ్యం, శ్రేయస్సు గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ దానితో సంబంధం ఉన్న మరో ముఖ్యమైన అంశం మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి ముంబాయికి చెందిన ‘ఇన్ఫీ-హీల్’, ‘యువర్‌దోస్త్’ వంటి స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని తెలిసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతే కాదు. నేడు కృత్రిమ మేధ వంటి సాంకేతికతను కూడా దీని కోసం ఉపయోగిస్తున్నారు. మిత్రులారా! స్టార్టప్ ల జాబితా చాలా పెద్దది. అందువల్ల నేను ఇక్కడ కొన్ని స్టార్టప్‌ల పేరు మాత్రమే చెప్పగలను. ఫిట్ ఇండియా కలను సాకారం చేసే దిశగా వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ స్టార్టప్‌ల గురించి నాకు రాస్తూ ఉండాలని మీ అందరినీ కోరుతున్నాను. శారీరక, మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడే ప్రసిద్ధ వ్యక్తుల అనుభవాలను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఈ మొదటి సందేశం సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి నుండి వినండి. దృఢత్వం- ముఖ్యంగా మానసిక దృఢత్వం- అంటే మానసిక ఆరోగ్యం గురించి వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు.

***ఆడియో***

ఈ ‘మన్ కీ బాత్‌’ కార్యక్రమంలో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం నా అదృష్టం. మానసిక అనారోగ్యాలు, మన నాడీ వ్యవస్థను మనం చూసుకునే విధానం నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. నాడీ వ్యవస్థను మనం ఎంత అప్రమత్తంగా, చంచల రహితంగా, అలజడుల్లేకుండా ఉంచుతామనే విషయంపై మనలో మనం ఎంత ఆహ్లాదకరంగా ఉంటామనే అంశం ఆధారపడుతుంది. మనం శాంతి, ప్రేమ, ఆనందం, ప్రసన్నత, వేదన, నిస్పృహ, పారవశ్యం అని పిలిచేవాటికి రసాయన, నాడీ సంబంధిత మూలం ఉంటుంది. ఫార్మకాలజీ తప్పనిసరిగా బయటి నుండి రసాయనాలను జోడించడం ద్వారా శరీరంలోని రసాయన అసమతుల్యతను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. మానసిక అనారోగ్యాలను  ఈ విధంగా నియంత్రించగలుగుతున్నాం. అయితే తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు బయటి నుండి రసాయనాలను మందుల రూపంలో తీసుకోవడం అవసరమని మనం గ్రహించాలి. అంతర్గత మానసిక ఆరోగ్య పరిస్థితి కోసం పనిచేయడం లేదా మనలో ఒక సమతుల్య రసాయన స్థితి కోసం పనిచేయడం;  శాంతి, ఆనందం, సంతోషాల కోసం రసాయనాలను ప్రతి వ్యక్తి జీవితంలోకి తీసుకురావాలి. సమాజ సాంస్కృతిక జీవితంలోకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లోకి, మొత్తం మానవాళికి తీసుకురావాలి. మన మానసిక ఆరోగ్యాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన చిత్తశుద్ధి అనేది సున్నితమైన ప్రత్యేకత. మనం దాన్ని రక్షించాలి. దాన్ని పెంపొందించుకోవాలి. దీని కోసం యోగ వ్యవస్థలో అనేక స్థాయిల అభ్యాసాలు ఉన్నాయి. ఇవి సాధారణ అభ్యాసాలుగా పూర్తిగా అంతర్గతీకరించగలిగేవి. వీటితో ప్రజలు తమలో తాము రసాయనిక సమతాస్థితి పొందవచ్చు. తమ నాడీ వ్యవస్థకు కొంత ప్రశాంతతను తీసుకురావచ్చు. అంతర్గత శ్రేయస్సు కల్పించే సాంకేతికతలను మనం యోగిక్ శాస్త్రాలు అని పిలుస్తాం. అది జరిగేలా చూద్దాం.

 

సద్గురు జీ తన అభిప్రాయాలను ఇంత సులభగ్రాహ్యశైలిలో, అద్భుతమైన విధానంలో అందించడంలో ప్రసిద్ధి చెందారు.

రండి… ఇప్పుడు మనం ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి హర్మన్‌ప్రీత్ కౌర్ జీ మాటలు విందాం.

 

***ఆడియో***

నమస్కారం! ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా నా దేశప్రజలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి ఫిట్ ఇండియా చొరవ నా ఫిట్‌నెస్ మంత్రాన్ని మీ అందరితో పంచుకునేలా నన్ను ప్రోత్సహించింది. మీ అందరికీ నా మొదటి సూచన ఏమిటంటే, ‘చెడు ఆహారం తీసుకుంటూ ఉత్తమ శిక్షణ పొందలేరు. అంటే మీరు ఎప్పుడు తింటారు, ఏం తింటారు అనే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల గౌరవనీయులైన ప్రధానమంత్రి మోదీ గారు ప్రతి ఒక్కరినీ చిరుధాన్యాలు తినమని ప్రోత్సహించారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. స్థిరమైన కృషి చేసేలా సహాయపడతాయి.  సులభంగా జీర్ణమవుతాయి. క్రమబద్ధమైన వ్యాయామం, 7 గంటల పూర్తి నిద్ర శరీరానికి చాలా ముఖ్యం.  ఇవి ఫిట్‌గా ఉండటానికి సహాయపడతాయి. దీనికోసం చాలా క్రమశిక్షణ, స్థిరత్వం అవసరం. మీరు దీని నుండి ఫలితాలను పొందితే  ప్రతిరోజూ వ్యాయామం చేయడం ప్రారంభిస్తారు. మీ అందరితో మాట్లాడటానికి, నా ఫిట్‌నెస్ మంత్రాన్ని పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయ ప్రధానమంత్రి గారికి చాలా ధన్యవాదాలు.

హర్మన్‌ప్రీత్ గారి వంటి ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి మాటలు ఖచ్చితంగా మీ అందరికీ స్ఫూర్తినిస్తాయి.

రండి…  గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్  గారి మాటలను వినండి. ఆయన ఆడే ‘చదరంగం’ ఆటకు మానసిక దృఢత్వం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు.

 

***ఆడియో***

 

నమస్తే. నేను విశ్వనాథన్ ఆనంద్‌ని. నేను చదరంగం ఆడడాన్ని మీరు చూశారు. నా ఫిట్‌నెస్ కారణాన్ని చాలా తరచుగా అడుగుతుంటారు. చదరంగం ఆడేందుకు చాలా శ్రద్ధ, సహనం అవసరం.  కాబట్టి నేను ఇప్పుడు చెప్పే వాటిని చేస్తాను. అవి నన్ను ఫిట్‌గా, చురుగ్గా ఉంచుతాయి. నేను వారానికి రెండు సార్లు యోగా చేస్తాను. వారానికి రెండు సార్లు కార్డియో వ్యాయామాలు చేస్తాను. ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్, వెయిట్ ట్రైనింగ్‌పై వారానికి రెండు సార్లు దృష్టి పెడతాను. వారానికి ఒక రోజు సెలవు తీసుకుంటాను. చదరంగానికి ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. మీరు 6 లేదా 7 గంటలపాటు తీవ్రమైన మానసిక శ్రమను కొనసాగించే శక్తిని కలిగి ఉండాలి. మీరు హాయిగా, సౌకర్యవంతంగా కూర్చోగలగాలి. మీరు చదరంగం లాంటి ఆటలో ఏదైనా సమస్యపై దృష్టి పెట్టాలనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండడానికి మీ శ్వాస నియంత్రణ సామర్థ్యం సహాయపడుతుంది. మన్ కీ బాత్శ్రోతలందరికీ నా ఫిట్‌నెస్ చిట్కా ఏమిటంటే ప్రశాంతంగా ఉండి లక్ష్యంపై దృష్టి పెట్టాలి.  నా విషయంలో మంచి ఫిట్‌నెస్ చిట్కా- ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైన ఫిట్‌నెస్ చిట్కా- సుఖవంతమైన రాత్రి నిద్ర. రాత్రికి కేవలం నాలుగైదు గంటలు నిద్రపోవడం సరికాదు. కనీసం ఏడెనిమిది గంటలు ఉత్తమమని నేను భావిస్తున్నాను.  కాబట్టి మనం రాత్రిపూట మంచి నిద్ర పొందడానికి వీలైనంత ప్రయత్నించాలి. అలా నిద్ర పోతేనే మరుసటి రోజు మీరు ప్రశాంతంగా పగటిపూట గడపగలుగుతారు. అలా నిద్ర పోతేనే మీరు అనాలోచిత నిర్ణయాలు తీసుకోరు. మీ భావోద్వేగాలను నియంత్రించగలుగుతారు. నా దృష్టిలో నిద్ర అత్యంత ముఖ్యమైన ఫిట్‌నెస్ చిట్కా.

 

రండి… ఇప్పుడు మనం అక్షయ్ కుమార్ గారి మాటలు విందాం.

 

***ఆడియో***

 

నమస్కారం. నేను అక్షయ్ కుమార్‌ని. ముందుగా మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన మన్ కీ బాత్లో నా మన్ కీ బాత్ని మీకు చెప్పే చిన్న అవకాశం నాకు లభించింది. నేను ఫిట్‌నెస్‌పై ఎంత ఆసక్తి ఉందో అంతకంటే ఎక్కువగా సహజంగా ఫిట్‌గా ఉండేందుకు ఆసక్తి చూపుతానని మీకు తెలుసు. ఫ్యాన్సీ జిమ్ కంటే ఎక్కువగా నాకు నచ్చేది బయట స్విమ్మింగ్ చేయడం, బ్యాడ్మింటన్ ఆడడం, మెట్లు ఎక్కడం, ముగ్దర్ తో కసరత్తులు చేయడం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినడం.  స్వచ్ఛమైన నెయ్యి సరైన పరిమాణంలో తింటే మేలు జరుగుతుందని నేను నమ్ముతాను. కానీ చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు లావు అవుతామని భయపడి నెయ్యి తినకుండా ఉండడం నేను చూస్తున్నాను. మన ఫిట్‌నెస్‌కు ఏది మంచిదో, ఏది చెడ్డదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సినీ నటుల శరీరాన్ని చూసి కాకుండా వైద్యుల సలహా మేరకు జీవనశైలిని మార్చుకోవాలి. నటీనటులు తరచుగా తెరపై కనిపించేలా ఉండరు. అనేక రకాల ఫిల్టర్లు, స్పెషల్ ఎఫెక్ట్‌లను ఉపయోగిస్తారు. వాటిని చూసిన తర్వాత మన శరీరాన్ని మార్చుకోవడానికి తప్పుడు అడ్డదారులను ఉపయోగించడం ప్రారంభిస్తాం. ఈ రోజుల్లో చాలా మంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. ఈ సిక్స్ ప్యాక్ లేదా యైట్ ప్యాక్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. మిత్రులారా! అటువంటి అడ్డదారులతో శరీరం బయటి నుండి చూడడానికి ఉబ్బుతుంది. కానీ లోపల డొల్లగా ఉంటుంది. సత్వరమార్గం మీ జీవిత కాలాన్ని చిన్నదిగా మారుస్తుందని  మీరు గుర్తుంచుకోవాలి. మీకు అడ్డదారులు వద్దు. దీర్ఘకాలం ఉండే ఫిట్‌నెస్ కావాలి. మిత్రులారా! ఫిట్‌నెస్ ఒక రకమైన తపస్సు. ఇన్ స్టాంట్ కాఫీనో, రెండు నిమిషాల్లో తయారయ్యే నూడుల్సో కాదు. రసాయనాలను ఉపయోగించబోమని,  సత్వర మార్గాల వ్యాయామం చేయబోమని; యోగా, మంచి ఆహారం, సమయానికి నిద్రపోవడం, కొంత ధ్యానం చేయడంతో పాటు  ముఖ్యంగా మీరు కనిపించే తీరును సంతోషంగా అంగీకరించడం వంటివి చేస్తామని ఈ కొత్త సంవత్సరంలో వాగ్దానం చేసుకోండి. ఇప్పటి నుండి ఫిల్టర్ జీవితాన్ని గడపకండి. ఫిట్టర్ జీవితాన్ని గడపండి. సురక్షితంగా ఉండండి. జై మహాకాల్!

 

ఈ రంగంలో అనేక ఇతర స్టార్టప్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ రంగంలో అద్భుతమైన పని చేస్తున్న యువ స్టార్టప్ వ్యవస్థాపకుడితో చర్చించాలని అనుకున్నాను.

 

***ఆడియో***

నమస్కారం. నా పేరు రిషభ్ మల్హోత్రా. నేను బెంగళూరులో ఉంటాను. ‘మన్ కీ బాత్’లో ఫిట్‌నెస్ గురించి చర్చ జరుగుతోందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. నేనే ఫిట్‌నెస్ ప్రపంచానికి చెందినవాడిని.  బెంగుళూరులో మాకు ‘తగడా రహో’ పేరుతో స్టార్టప్‌ ఉంది. భారతదేశ సాంప్రదాయిక వ్యాయామానికి ప్రాధాన్యత కల్పించేందుకు మా స్టార్టప్ ను ప్రారంభించాం. భారతదేశ  సాంప్రదాయిక వ్యాయామం గదా వ్యాయామంలో చాలా అద్భుతమైన వ్యాయామం ఉంది.  మా దృష్టి మొత్తం గద, ముగ్దర్ వ్యాయామంపై మాత్రమే ఉంది. గదతో శిక్షణ ఎలా చేస్తారో తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గద వ్యాయామం వేల సంవత్సరాల నాటిదని, భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఇది ఆచరణలో ఉందని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు దీన్ని వివిధ స్థాయిల్లో ఉన్న వ్యాయామశాలల్లో తప్పక చూసి ఉంటారు. మా స్టార్టప్ ద్వారా దాన్ని ఆధునిక రూపంలో తిరిగి తీసుకువచ్చాం. దేశం మొత్తం నుండి మాకు చాలా ఆప్యాయత, చక్కటి స్పందన లభించాయి. ఇది మాత్రమే కాకుండా భారతదేశంలో అనేక పురాతన వ్యాయామాలు; ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పద్ధతులు ఉన్నాయని మన్ కీ బాత్ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. వీటిని మనం స్వీకరించి, ప్రపంచానికి నేర్పించాలి. నేను ఫిట్‌నెస్ ప్రపంచానికి చెందినవాడిని. కాబట్టి నేను మీకు వ్యక్తిగత చిట్కా ఇవ్వాలనుకుంటున్నాను. గద వ్యాయామంతో మీరు మీ బలం, శక్తి, భంగిమ, శ్వాసలను కూడా మెరుగుపరచవచ్చు. కాబట్టి గద వ్యాయామాన్ని అనుసరించండి. దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. జై హింద్!

 

మిత్రులారా! ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ అందరిదీ ఒకే మంత్రం- ‘ఆరోగ్యంగా ఉండండి, ఫిట్‌గా ఉండండి’. కొత్త సంవత్సరం 2024ను ప్రారంభించడానికి మీ ఫిట్‌నెస్ కంటే పెద్ద సంకల్పం ఏముంటుంది?

నా కుటుంబ సభ్యులారా! కొన్ని రోజుల క్రితం కాశీలో ఒక ప్రయోగం జరిగింది.  దాని గురించి నేను ‘మన్ కీ బాత్’ శ్రోతలకు చెప్పాలనుకుంటున్నాను. కాశీ-తమిళ సంగమంలో పాల్గొనేందుకు తమిళనాడు నుండి వేలాది మంది ప్రజలు కాశీకి చేరుకున్నారని మీకు తెలుసు. అక్కడ నేను వారితో సంభాషించేందుకు కృత్రిమ మేధకు చెందిన ఏ ఐ టూల్ ‘భాషిణి’ని మొదటిసారిగా ఉపయోగించాను. నేను వేదికపై నుండి హిందీలో ప్రసంగించాను. కానీ ఏ ఐ  సాధనం భాషిణి కారణంగా అక్కడ ఉన్న తమిళనాడు ప్రజలు అదే సమయంలో తమిళ భాషలో నా ప్రసంగాన్ని విన్నారు. కాశీ-తమిళ సంగమానికి వచ్చిన ప్రజలు ఈ ప్రయోగం పట్ల చాలా ఉత్సాహంగా కనిపించారు. ఒక భాషలో మాట్లాడి, అదే ప్రసంగాన్ని ప్రజలు తమ భాషలో ఏకకాలంలో వినే రోజు ఎంతో దూరంలో లేదు. సినిమాల విషయంలో కూడా అదే జరుగుతుంది. సినిమా హాల్లో కృత్రిమ మేధ సహాయంతో ఏక కాలంలో అనువాదాన్ని ప్రజలు వినగలుగుతారు.  ఈ సాంకేతికత మన పాఠశాలలు, ఆసుపత్రులు, న్యాయస్థానాల్లో విస్తృతంగా ఉపయోగించడం ప్రారంభించినప్పుడు ఎంత పెద్ద మార్పు జరుగుతుందో మీరు ఊహించవచ్చు. ఏకకాల అనువాదాలకు సంబంధించిన కృత్రిమ మేధా సాధనాలను మరింత అన్వేషించాలని, వాటిని 100% సామర్థ్యంతో  తీర్చిదిద్దాలని  నేను నేటి యువతరాన్ని కోరుతున్నాను.

మిత్రులారా! మారుతున్న కాలంలో మనం మన భాషలను కాపాడుకోవడంతోపాటు వాటిని ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు జార్ఖండ్‌లోని ఒక ఆదివాసీ గ్రామం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గ్రామం అక్కడి పిల్లలకు వారి మాతృభాషలో విద్యను అందించడానికి ఒక ప్రత్యేక చొరవ తీసుకుంది. గఢ్వా జిల్లా మంగళో గ్రామంలో కుడుఖ్ భాషలో పిల్లలకు విద్యను అందిస్తున్నారు. ఈ పాఠశాల పేరు ‘కార్తిక్ ఉరాంవ్ ఆదివాసీ కుడుఖ్ స్కూల్’. ఈ పాఠశాలలో 300 మంది ఆదివాసీ పిల్లలు చదువుతున్నారు. ఉరాంవ్ ఆదివాసీల మాతృభాష కుడుఖ్. ఈ భాషకు లిపి కూడా ఉంది. దీన్ని ‘తోలంగ్ సికీ’ అని పిలుస్తారు. ఈ భాష క్రమంగా అంతరించిపోతోంది. దాన్ని కాపాడడానికి ఈ సమాజం వారి స్వంత భాషలో పిల్లలకు విద్యను అందించాలని నిర్ణయించుకుంది. ఆదివాసీ పిల్లలకు ఇంగ్లీషు భాష కష్టమని, అందుకే ఆ ఊరి  పిల్లలకు మాతృభాషలో పాఠాలు చెప్పడం మొదలుపెట్టామని ఈ పాఠశాలను ప్రారంభించిన అరవింద్ ఉరాంవ్ అంటారు. ఆయన ప్రయత్నాలు మెరుగైన ఫలితాలను ఇవ్వడం ప్రారంభించినప్పుడు గ్రామస్థులు కూడా ఆయనతో చేరారు.  వారి స్వంత భాషలో చదువుకోవడం వల్ల పిల్లల అభ్యసన వేగం కూడా పెరిగింది. మన దేశంలో చాలా మంది పిల్లలు భాషా సమస్యతో చదువును మధ్యలోనే వదిలేసేవారు. నూతన జాతీయ విద్యా విధానం అటువంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఏ పిల్లల చదువుకూ, ప్రగతికీ భాష ఆటంకం కాకూడదనేది మన ప్రయత్నం.

మిత్రులారా! దేశంలోని అద్భుతమైన స్త్రీమూర్తుల  ద్వారా మన భారతదేశం ప్రతి కాలంలో గర్వంతో నిండిపోయింది. సావిత్రీబాయి ఫూలే జీ, రాణి వేలు నాచియార్ జీ దేశానికి చెందిన ఇద్దరు మహిళామణులు.  వారి వ్యక్తిత్వం దీప స్తంభం లాంటిది. ఇది ప్రతి యుగంలో మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని చూపుతూనే ఉంటుంది. నేటి నుండి కొన్ని రోజుల తర్వాత- అంటే జనవరి మూడో తేదీన మనం ఈ ఇద్దరి జయంతి వేడుకలు జరుపుకుంటాం. సావిత్రీబాయి ఫూలే జీ అనే పేరు మన మనసులోకి రాగానే మనకు గుర్తొచ్చేది  విద్య, సామాజిక సంస్కరణల రంగంలో ఆమె చేసిన కృషి. మహిళలు, అణగారిన వర్గాల విద్య కోసం ఆమె ఎప్పుడూ తన గొంతును బలంగా వినిపించారు. ఆమె తన కాలం కంటే చాలా ముందున్నారు. తప్పుడు పద్ధతులను వ్యతిరేకించడంలో ఎప్పుడూ గొంతు విప్పేవారు. విద్య ద్వారా సమాజ సాధికారతపై ఆమెకు లోతైన విశ్వాసం ఉంది. మహాత్మా ఫూలే జీతో కలిసి ఆమె బాలికల కోసం అనేక పాఠశాలలను ప్రారంభించారు. ఆమె కవితలు ప్రజల్లో చైతన్యాన్ని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని నింపేవి. అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ప్రకృతికి అనుగుణంగా జీవించాలని ఆమె ఎల్లప్పుడూ ప్రజలను కోరేవారు. ఆమె ఎంత దయగలవారో మాటల్లో చెప్పలేం. మహారాష్ట్రలో కరువు ఏర్పడినప్పుడు సావిత్రీబాయి, మహాత్మా ఫూలే పేదలకు సహాయం చేయడానికి తమ ఇంటి తలుపులు తెరిచారు. సామాజిక న్యాయం విషయంలో అటువంటి ఉదాహరణ చాలా అరుదుగా కనిపిస్తుంది. అక్కడ ప్లేగు భయం ఏర్పడినప్పుడు ఆమె ప్రజల సేవలో మునిగిపోయారు. ఆ సమయంలో ఆమె స్వయంగా ఈ వ్యాధి బారిన పడ్డారు. మానవతకు అంకితమైన ఆమె జీవితం ఇప్పటికీ మనందరికీ స్ఫూర్తిదాయకం.

మిత్రులారా! పరాయి పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దేశంలోని ఎందరో మహానుభావుల్లో రాణి వేలు నాచియార్ ఒకరు. తమిళనాడులోని నా సోదర  సోదరీమణులు ఇప్పటికీ ఆమెను ‘వీర మంగై’ అంటే  వీరనారి అనే పేరుతో గుర్తుంచుకుంటారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాణి వేలు నాచియార్ ధైర్యసాహసాలు, ఆమె పరాక్రమం చాలా స్ఫూర్తిదాయకం. అక్కడ రాజుగా ఉన్న ఆమె భర్త శివగంగై రాజ్యంపై బ్రిటిష్ వారు చేసిన దాడిలో మరణించారు. రాణి వేలు నాచియార్, ఆమె కుమార్తె శత్రువుల నుండి ఎలాగోలా తప్పించుకున్నారు. ఆమె మరుదు బ్రదర్స్ అంటే తన కమాండర్లతో కలిసి సేనను ఏర్పాటు చేయడంలో, సైన్యాన్ని సిద్ధం చేయడంలో చాలా సంవత్సరాలు నిమగ్నమై ఉన్నారు. పూర్తి సన్నద్ధతతో బ్రిటీష్ వారిపై యుద్ధం మొదలుపెట్టారు. చాలా ధైర్యసాహసాలు, దృఢ సంకల్పంతో పోరాటం చేశారు. సైన్యంలో పూర్తిగా మహిళలతో తొలిసారిగా సమూహాన్ని ఏర్పాటు చేసిన వారిలో రాణి వేలు నాచియార్ పేరు ఉంటుంది. ఈ ఇద్దరు వీర మహిళలకు నా నివాళులర్పిస్తున్నాను.

నా కుటుంబ సభ్యులారా! గుజరాత్‌లో డాయరా సంప్రదాయం ఉంది. రాత్రంతా వేలాది మంది డాయరాలో చేరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందుతున్నారు. ఈ డాయరాలో జానపద సంగీతం, జానపద సాహిత్యం, హాస్యంల త్రివేణీ సంగమం అందరి మదిలో ఆనందాన్ని నింపుతోంది. సోదరుడు జగదీష్ త్రివేదీ గారు ఈ డాయరాకు చెందిన ప్రముఖ కళాకారులు. హాస్యనటుడిగా సోదరుడు జగదీష్ త్రివేదీ గారు 30 సంవత్సరాలకు పైగా తన ప్రభావాన్ని కొనసాగించారు. ఇటీవల నాకు ఆయన నుండి ఒక లేఖ వచ్చింది.  దాంతో పాటు ఆయన తన గ్రంథమొకటి పంపారు. ఆ గ్రంథం పేరు  ‘సోషల్ ఆడిట్ ఆఫ్ సోషల్ సర్వీస్’. ఆ గ్రంథం చాలా విశిష్టమైంది. అందులో అకౌంటింగ్ బుక్ ఉంది. అది ఒక రకమైన బ్యాలెన్స్ షీట్. సోదరుడు జగదీష్ త్రివేదీ గారు గత ఆరేళ్లలో వివిధ కార్యక్రమాల నుండి పొందిన ఆదాయం, ఖర్చుకు సంబంధించిన  పూర్తి వివరాలు గ్రంథంలో ఇచ్చారు. ఈ బ్యాలెన్స్ షీట్ ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన తన మొత్తం ఆదాయాన్ని, ప్రతి ఒక్క రూపాయిని సమాజం కోసం ఖర్చు చేశారు. పాఠశాల, ఆసుపత్రి, గ్రంథాలయం, వికలాంగులకు సంబంధించిన సంస్థలు మొదలైనవాటికోసం సమాజ సేవలోనే పూర్తిగా ఆరేళ్ల ఆదాయాన్ని ఖర్చు పెట్టారు. గ్రంథంలో ఒక చోట రాసినట్టు 2022లో ఆయన తన కార్యక్రమాల ద్వారా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు సంపాదించారు. పాఠశాల, ఆసుపత్రి, గ్రంథాలయం కోసం రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఖర్చు చేశారు. తన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు. నిజానికి దీని వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా ఉంది. తనకు 2017లో 50  ఏళ్లు నిండినప్పుడు  తన కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా సమాజానికి ఖర్చు చేస్తానని సోదరుడు జగదీష్ త్రివేది గారు ఒక సందర్భంలో ప్రకటించారు. వివిధ సామాజిక కార్యక్రమాల కోసం 2017 నుండి ఆయన సుమారు 8కోట్ల 75 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఒక హాస్యనటుడు తన మాటలతో అందరినీ నవ్వించేలా చేస్తాడు. అయితే లోలోపల ఎంత సున్నితత్వం ఉంటుందో సోదరుడు జగదీష్ త్రివేదీ గారి జీవితం నుండి చూడవచ్చు. ఆయనకు మూడు పీహెచ్‌డీ డిగ్రీలు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 75 గ్రంథాలు రాశారు. వాటిలో చాలా గ్రంథాలకు పురస్కారాలు కూడా వచ్చాయి. సామాజిక సేవకు కూడా ఎన్నో పురస్కారాలు స్వీకరించారు. సోదరుడు జగదీష్ త్రివేదీ గారి సామాజిక సేవకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

నా కుటుంబ సభ్యులారా! అయోధ్యలో రామమందిరం విషయంలో దేశవ్యాప్తంగా ఆసక్తి, ఉత్సాహం ఉన్నాయి. ప్రజలు తమ భావాలను రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడు, అయోధ్యకు సంబంధించి అనేక కొత్త పాటలు, కొత్త భజనలు స్వరపరచడం మీరు తప్పక చూసి ఉంటారు. చాలా మంది కొత్త కవితలు కూడా రాస్తున్నారు. ఇందులో చాలా మంది అనుభవజ్ఞులైన కళాకారులు ఉన్నారు. కొత్త వర్ధమాన యువ కళాకారులు కూడా మనసుకు హత్తుకునే భజనలను స్వరపరిచారు. నేను నా సోషల్ మీడియాలో కొన్ని పాటలు, భజనలను కూడా పంచుకున్నాను. ఈ చారిత్రక ఘట్టంలో కళారంగం తనదైన ప్రత్యేక శైలిలో భాగస్వామి అవుతోందని తెలుస్తోంది. అలాంటి మొత్తం రచనలను మనమందరం ఉమ్మడి హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకోవాలని నా భావన.  #shriRamBhajan అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో మీ రచనలను పంచుకోవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. భావోద్వేగాలు, భక్తితో కూడిన ఈ సమాహారం సర్వం రామ మయం అయ్యేలా ఒక ప్రవాహంగా మారుతుంది. 

నా ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజు ‘మన్ కీ బాత్’లో ఇంతే! 2024కి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. భారతదేశం సాధించిన విజయాలు ప్రతి భారతీయుడి విజయాలు. పంచ ప్రాణ సూత్రాలను దృష్టిలో ఉంచుకుని భారతదేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి. మనం ఏ పని చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, దాని వల్ల  దేశానికి లభించే ప్రయోజనమే మన మొదటి ప్రమాణం కావాలి.  దేశానికే మొదటి ప్రాధాన్యం. నేషన్ ఫస్ట్ – ఇంతకంటే గొప్ప మంత్రం లేదు. ఈ మంత్రాన్ని అనుసరించి, భారతీయులమైన మనం మన దేశాన్ని అభివృద్ధి, స్వావలంబనలతో తీర్చిదిద్దుదాం. మీరందరూ 2024లో విజయాల కొత్త శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఫిట్‌గా ఉండాలని, పూర్తి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే నా ప్రార్థన. దేశ ప్రజల కొత్త విజయాల గురించి 2024లో మరోసారి చర్చిద్దాం. చాలా చాలా ధన్యవాదాలు.

 

***