Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. మరోసారి మీ అందరినీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రతి నెలా చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం ఒకవారం ముందుగానే జరుగుతోంది. మీకు తెలుసు- నేను వచ్చే వారం అమెరికాలో ఉంటాను. అక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంది. కాబట్టి నేను అక్కడికి వెళ్ళే ముందే మీతో   మాట్లాడాలని అనుకున్నాను. ఇంతకంటే ఉత్తమ మార్గం ఏముంటుంది? నర నారాయణుల  ఆశీస్సులు, మీరిచ్చే స్ఫూర్తి, నా శక్తి కూడా పెరుగుతూనే ఉంటాయి.

మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది ‘మన్ కీ బాత్’ శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు.  కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి  శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ  పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు.  నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది.  అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్‌జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మిత్రులారా!ప్రకృతి వైపరీత్యాల గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ, భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన విపత్తు నిర్వహణ బలం నేడు ఒక ఉదాహరణగా మారుతోంది. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఒక గొప్ప మార్గం ఉంది. అదే ప్రకృతి పరిరక్షణ. వర్షాకాలంలోఈ దిశలోమన బాధ్యత మరింత పెరుగుతుంది. అందుకే నేడు దేశం ‘క్యాచ్ ద రెయిన్’ వంటి ప్రచారాల ద్వారా సామూహిక ప్రయత్నాలను చేస్తోంది. గత నెల ‘మన్ కీ బాత్’లో నీటి సంరక్షణకు సంబంధించిన స్టార్టప్‌ల గురించి చర్చించాం. ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు తమ శక్తిమేరకు కృషి చేస్తున్న ఎందరో వ్యక్తుల గురించి కొందరు తమ లేఖల్లో తెలియజేశారు. అలాంటి మిత్రుడే యూపీలోని బాందా జిల్లాకు చెందిన తులసీరామ్ యాదవ్ గారు. తులసీరామ్ యాదవ్ గారు లుకత్రా గ్రామ పంచాయతీ సర్పంచిగా ఉన్నారు. బాందా, బుందేల్‌ఖండ్‌ ప్రాంతాల్లో నీటి కోసం ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి మీకు తెలుసు. ఈ సవాలును అధిగమించేందుకు తులసీరాం గారు గ్రామ ప్రజల సహకారంతో ఆ ప్రాంతంలో 40కి పైగా చెరువులను నిర్మించారు. ‘చేను నీరు చేనులో- ఊరి నీరు ఊళ్లో’ అనే నినాదాన్ని తులసీరామ్ గారు తన ప్రచారానికి ప్రాతిపదికగా చేసుకున్నారు. ఈరోజు ఆయన కృషి ఫలితంగానే  ఆ గ్రామంలో భూగర్భ జలాల మట్టం మెరుగవుతోంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లా ప్రజలు సమష్టి కృషితో అంతరించిపోయిన నదిని పునరుద్ధరించారు. చాలా కాలం క్రితం అక్కడ ‘నీమ్’ అనే నది ఉండేది. ఆ నది కాలక్రమేణా కనుమరుగైంది. కానీ స్థానిక ప్రజల జ్ఞాపకాల్లో, జానపద కథల్లో ఎప్పుడూ దాన్ని ప్రస్తావించేవారు. చివరికిప్రజలు తమ ఈ సహజ వారసత్వాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. ప్రజల సమష్టి కృషి వల్ల ఇప్పుడు ‘నీమ్’ నదిమళ్లీ జీవం పోసుకోవడం ప్రారంభించింది. నదీ  మూల ప్రాంతాన్ని అమృత్ సరోవర్‌గా అభివృద్ధి చేస్తున్నారు. 

మిత్రులారా!ఈ నదులు, కాలువలు, సరస్సులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. జీవితంలోని వర్ణాలు, భావోద్వేగాలు కూడా వాటితో ముడిపడి ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలో ఇలాంటి దృశ్యమే కనిపించింది. ఈ ప్రాంతం ఎక్కువగా కరువు కోరల్లో చిక్కుకుంది. ఐదు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇక్కడ నీల్వండే డ్యామ్ కాలువ పనులు పూర్తవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం పరీక్షించేందుకు కాలువలో నీటిని విడుదల చేశారు. ఈ స‌మ‌యంలో వ‌చ్చిన చిత్రాలు భావోద్వేగభరితంగా ఉన్నాయి. హోలీ-దీపావళి పండుగల సందర్భాల్లో చేసినట్టు ఊరి జనం నృత్యాలు చేశారు.

మిత్రులారా!పరిపాలన విషయానికి వస్తేఈ రోజు నేను ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని కూడా గుర్తు తెచ్చుకుంటాను. ఛత్రపతి శివాజీ మహారాజ్  ధైర్యసాహసాలతో పాటు ఆయన పరిపాలన, నిర్వహణ నైపుణ్యాల నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగానీటి నిర్వహణ, నౌకాదళం విషయాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన పనులు ఇప్పటికీ భారతదేశ చరిత్ర  గౌరవాన్ని పెంచుతాయి. ఆయన కట్టిన జలదుర్గాలు ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా సముద్రం మధ్యలో సగర్వంగా నిలుస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోటలో దీనికి సంబంధించిన భారీ కార్యక్రమాలు నిర్వహించారు. నాకు గుర్తుంది- చాలా సంవత్సరాల క్రితం 2014లోఆ పుణ్యభూమికి నమస్కరించడానికి రాయగఢ్ వెళ్లే అవకాశం నాకు లభించింది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్వహణా నైపుణ్యాలను తెలుసుకోవడం, వాటి నుండి ఎన్నో విషయాలను నేర్చుకోవడం మనందరి కర్తవ్యం. ఇది మన వారసత్వం పట్ల మనలో గర్వాన్ని నింపుతుంది. భవిష్యత్తు కోసం మన కర్తవ్యాలను నిర్వర్తించడానికి కూడా మనల్ని ప్రేరేపిస్తుంది.

నా ప్రియమైన దేశవాసులారా!రామాయణంలో రామసేతు నిర్మాణంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన చిన్న ఉడుత గురించి మీరు తప్పక విని ఉంటారు. ఉద్దేశ్యం సుస్పష్టంగా ఉండి ప్రయత్నాలలో నిజాయితీ ఉన్నప్పుడు ఏ లక్ష్యం కష్టంగా ఉండదని ఉడుత సహాయం చెప్తుంది. భారతదేశం కూడాఈ ఉదాత్తమైన ఉద్దేశ్యంతో నేడుభారీ సవాలును ఎదుర్కొంటోంది. ఈ సవాలు  టి.బి. దీన్నే ‘క్షయవ్యాధి’ అని కూడా అంటారు. 2025 నాటికి టీబీ లేని భారతదేశాన్ని తయారు చేయాలనే లక్ష్యం ఖచ్చితంగా చాలా పెద్దది. ఒకప్పుడు, టీబీ గురించి తెలిసిన తర్వాతకుటుంబ సభ్యులు కూడా దూరమయ్యేవారు. కానీ ఇప్పుడు టీబీ రోగులను తమ కుటుంబంలోనే సభ్యునిగా చూస్తూ సహకరిస్తున్నారు. ఈ క్షయ వ్యాధిని మూలాల నుండి తొలగించడానికినిక్షయ మిత్రులు ముందుకొచ్చారు. దేశంలో పెద్ద సంఖ్యలో వివిధ సామాజిక సంస్థలు నిక్షయ మిత్రగా మారాయి. వేలాది మంది ముందుకు వచ్చి టి.బి. రోగులను దత్తత తీసుకున్నారు. టిబి రోగులకు సహాయం చేయడానికి చాలా మంది పిల్లలు ముందుకు వచ్చారు.  ఈ ప్రజా భాగస్వామ్యమే ఈ ప్రచారానికి అతిపెద్ద బలం. ఈ భాగస్వామ్యం కారణంగానేడు దేశంలో 10 లక్షలకు పైగా టీబీ రోగులను దత్తత తీసుకున్నారు. సుమారు 85 వేల మంది నిక్షయ మిత్రులు ఈ స్వచ్ఛంద సేవ చేశారు. దేశంలోని ఎందరో సర్పంచులు, గ్రామపెద్దలు తమ గ్రామంలో టీబీ వ్యాధి అంతరించాలని ఈ కార్యక్రమం చేపట్టడం నాకు సంతోషంగా ఉంది.

నైనిటాల్‌లోని ఒక గ్రామానికి చెందిన నిక్షయ మిత్ర దీకర్ సింగ్ మేవారీ గారు ఆరుగురు టీబీ రోగులను దత్తత తీసుకున్నారు. కిన్నౌర్ గ్రామ పంచాయితీ అధినేత, నిక్షయ మిత్ర జ్ఞాన్ సింగ్ గారు తమ బ్లాక్‌లో టీబీ రోగులకు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడంలో నిమగ్నమై ఉన్నారు. భారతదేశాన్ని టీబీ రహితంగా చేసే ప్రచారంలో పిల్లలు, యువ స్నేహితులు కూడా వెనుకబడిలేరు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఊనాకు చెందిన ఏడేళ్ల చిన్నారి నళిని సింగ్ చేసిన  అద్భుతమైన పని చూడండి. చిన్నారి నళిని తన పాకెట్ మనీ నుండిటి.బి. రోగులకు సహాయం చేస్తోంది.  పిల్లలు డబ్బును పొదుపు చేసుకోవడంలో ఉపయోగించే పిగ్గీ బ్యాంకులను ఎంతగా ఇష్టపడతారో మీకు తెలుసు. మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లాకు చెందిన పదమూడేళ్ల మీనాక్షి, పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్‌కు చెందిన పదకొండేళ్ల బష్వర్ ముఖర్జీ – ఈ ఇద్దరూ  ఈ విషయంలో మిగతావారికి భిన్నంగా ఉండే పిల్లలు. ఈ పిల్లలిద్దరూ తమ పిగ్గీ బ్యాంకు డబ్బును కూడా టీబీముక్త భారత్ ప్రచారానికి అందజేశారు.  ఈ ఉదాహరణలన్నీ భావోద్వేగాలతో నిండి ఉండడమే కాకుండా, చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. చిన్న వయసులో పెద్దగా ఆలోచిస్తున్న ఈ పిల్లలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా!కొత్త ఆలోచనలను స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం భారతీయులమైన మన స్వభావం. మనం మన  వస్తువులను ప్రేమిస్తాం. కొత్త విషయాలను కూడా స్వీకరిస్తాం. కలుపుకుంటాం. దీనికి ఉదాహరణ జపాన్ టెక్నిక్ మియావాకీ. కొన్ని చోట్ల మట్టి సారవంతంగా లేకపోతే ఆ ప్రాంతాన్నిమళ్ళీ సస్యశ్యామలం చేయడానికి మియావాకీ టెక్నిక్ చాలా మంచి మార్గం. మియావాకీ సాంకేతికతను ఉపయోగించే అడవులు వేగంగా విస్తరించి, రెండు మూడు దశాబ్దాల్లో జీవవైవిధ్యానికి కేంద్రంగా మారతాయి. ఇప్పుడు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇది చాలా వేగంగా విస్తరిస్తోంది. కేరళకు చెందిన రాఫీ రామ్‌నాథ్ అనే ఉపాధ్యాయుడు ఈ టెక్నిక్‌తో ఒక ప్రాంత రూపురేఖలను మార్చారు. నిజానికిరామ్‌నాథ్ గారు తన విద్యార్థులకు ప్రకృతి, పర్యావరణం గురించి లోతుగా వివరించాలనుకున్నారు. అందుకోసం ఒక మూలికల తోటను తయారు చేశారు. ఆయన తోట ఇప్పుడు బయోడైవర్సిటీ జోన్‌గా మారింది. ఈ విజయం ఆయనలో మరింత స్ఫూర్తి నింపింది. దీని తర్వాత రాఫీ గారు మియావాకీ టెక్నిక్‌తో చిన్నపాటి అడవిని రూపొందించారు. దానికి ‘విద్యావనం’ అని పేరు పెట్టారు. ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఇంత అందమైన ‘విద్యావనం’ అనే పేరును పెట్టగలడు. రాంనాథ్‌ గారికి చెందిన ఈ ‘విద్యావనం’లో తక్కువ స్థలంలో 115 రకాలకు చెందిన 450కి పైగా మొక్కలను నాటారు. ఆయన విద్యార్థులు కూడా వాటి నిర్వహణలో ఆయనకు  సహాయం చేస్తారు. సమీపంలోని పాఠశాలల పిల్లలు, సాధారణ పౌరులు ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. మియావాకీ అడవులను నగరాలతో సహా ఎక్కడైనా సులభంగా పెంచవచ్చు. కొంతకాలం క్రితం నేను గుజరాత్‌లోని ఏకతా నగరం కేవడియాలో మియావాకీ అడవులను ప్రారంభించాను. కచ్‌లో కూడా 2001 భూకంపం వల్ల మరణించిన వారి జ్ఞాపకార్థం మియావాకీ శైలిలో స్మృతి వనాన్ని నిర్మించారు. కచ్ వంటి ప్రదేశంలో దీని విజయం అత్యంత కఠినమైన సహజ వాతావరణంలో కూడా ఈ సాంకేతికత ఎంత ప్రభావవంతంగా ఉందో చూపిస్తుంది. అదేవిధంగా అంబాజీ, పావాగఢ్ లలో కూడా మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటారు. లక్నోలోని అలీగంజ్‌లో కూడా మియావాకీ తోటను తయారుచేస్తున్నట్టు నాకు తెలిసింది. గత నాలుగేళ్లలో  ముంబైలోనూ, ఆ నగర పరిసర ప్రాంతాలలోనూ ఇటువంటి 60 కంటే ఎక్కువ అడవులపై కృషి జరిగింది. ఇప్పుడు ఈ సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతున్నారు. సింగపూర్, ప్యారిస్, ఆస్ట్రేలియా, మలేసియా వంటి అనేక దేశాల్లో దీన్ని విరివిగా వాడుతున్నారు. మియావాకీ పద్ధతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలని నేను దేశప్రజలను-ముఖ్యంగా నగరాల్లో నివసించేవారిని కోరుతున్నాను. దీని ద్వారామీరు మన భూమిని, ప్రకృతిని పచ్చగా, పరిశుభ్రంగా మార్చడంలో అమూల్యమైన సహకారం అందించవచ్చు.

నా ప్రియమైన దేశవాసులారా!ఈ రోజుల్లో మన దేశంలో జమ్మూ కాశ్మీర్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు పెరుగుతున్న పర్యాటకం కారణంగా, కొన్నిసార్లు జీ-20లో భాగంగా జరుగుతున్న  అద్భుతమైన సదస్సుల కారణంగా. కాశ్మీర్‌లోని ‘నాదరూ’నుదేశం వెలుపల కూడా ఎలా ఇష్టపడుతున్నారో కొంతకాలం క్రితం నేను మీకు ‘మన్ కీ బాత్’లో చెప్పాను. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ప్రజలు అద్భుతమైన పని చేసి చూపించారు. బారాముల్లాలో చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఇక్కడ పాల కొరత ఉండేది. బారాముల్లా ప్రజలు ఈ సవాలును అవకాశంగా తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ డైరీ పనులను ప్రారంభించారు. ఇక్కడి మహిళలు ఈ పనిలో ముందంజలో ఉన్నారు. ఉదాహరణకు ఇష్రత్ నబీ అనే ఒక సోదరి. గ్రాడ్యుయేట్ అయిన ఇష్రత్ ‘మీర్ సిస్టర్స్ డైరీ ఫామ్‌’ను ప్రారంభించారు. ఆమె డైరీ ఫాం నుండి ప్రతిరోజూ దాదాపు 150 లీటర్ల పాలు అమ్ముడవుతున్నాయి. సోపోర్ లో అలాంటి మరో మిత్రుడు వసీం అనాయత్ ఉన్నారు. వసీంకు రెండు డజన్లకు పైగా పశువులు ఉన్నాయి. ఆయన ప్రతిరోజూ రెండు వందల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తాడు. మరో యువకుడు ఆబిద్ హుస్సేన్ కూడా డైరీ పనులు చేస్తున్నారు. ఆయన పని కూడా చాలా ముందుకు సాగుతోంది. అలాంటి వారి కృషి వల్ల బారాముల్లాలో రోజుకు ఐదున్నర లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు యావత్ బారాముల్లా కొత్త శ్వేత విప్లవానికి చిహ్నంగా మారుతోంది. గత రెండున్నర- మూడేళ్లలో ఐదు వందలకు పైగా డైరీ యూనిట్లు ఇక్కడికి వచ్చాయి. మన దేశంలోని ప్రతి ప్రాంతం అవకాశాలతో నిండి ఉందనడానికి బారాముల్లాలోని పాడి పరిశ్రమ నిదర్శనం. ఒక ప్రాంత ప్రజల సమిష్టి సంకల్పం ఏదైనా లక్ష్యాన్ని సాధించి చూపిస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా!ఈ నెలలో భారతదేశానికి క్రీడా ప్రపంచం నుండి చాలా గొప్ప వార్తలు వచ్చాయి. మహిళల జూనియర్ ఆసియా కప్‌ను తొలిసారిగా గెలిచిన భారత జట్టు త్రివర్ణ పతాక వైభవాన్ని పెంచింది. ఈ నెలలో మన పురుషుల హాకీ జట్టు జూనియర్ ఆసియా కప్‌ను కూడా గెలుచుకుంది. దీంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా కూడా నిలిచాం. జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో కూడా మన జూనియర్ జట్టు అద్భుతాలు చేసింది. ఈ టోర్నీలో భారత జట్టు మొదటి స్థానాన్ని సాధించింది. ఈ టోర్నీలో మొత్తం బంగారు పతకాలలో 20% భారత్ ఖాతాలోనే చేరాయి. ఈ జూన్‌లో ఆసియా అండర్ ట్వంటీ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కూడా జరిగింది. ఇందులో 45 దేశాల్లో భారతదేశం పతకాల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.

మిత్రులారా!గతంలో మనం అంతర్జాతీయ పోటీల గురించి తెలుసుకునేవాళ్ళం. కానీ వాటిలో భారతదేశం భాగస్వామ్యం ఉండేది కాదు. కానీఈ రోజునేను గత కొన్ని వారాల విజయాలను మాత్రమే ప్రస్తావిస్తున్నాను. అయినా కూడా జాబితా చాలా పొడవుగా ఉంటుంది. ఇదే మన యువత అసలైన బలం. భారతదేశం మొదటిసారిగా తన ఉనికిని చాటుతున్న ఇటువంటి అనేక క్రీడలు, పోటీలు ఉన్నాయి. ఉదాహరణకులాంగ్ జంప్‌లోశ్రీశంకర్ మురళి ప్యారిస్ డైమండ్ లీగ్ వంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో దేశం కోసం కాంస్యం సాధించారు. ఈ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి పతకం. కిర్గిస్థాన్‌లో మన అండర్ 17  ఉమెన్ రెజ్లింగ్ టీమ్ కూడా అలాంటి విజయాన్ని నమోదు చేసింది. దేశంలోని ఈ అథ్లెట్లు, వారి తల్లిదండ్రులు, కోచ్‌ల కృషికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా!అంతర్జాతీయ ఈవెంట్లలో దేశం సాధించిన ఈ విజయం వెనుక జాతీయ స్థాయిలో మన క్రీడాకారుల కృషి ఉంది. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొత్త ఉత్సాహంతో క్రీడలు నిర్వహిస్తున్నారు. ఆడేందుకు, గెలిచేందుకు, ఓటమి నుండి నేర్చుకునేందుకు ఈ క్రీడలలో ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది.  ఉదాహరణకుఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు ఇప్పుడే ఉత్తరప్రదేశ్‌లో జరిగాయి. యువతలో ఎంతో ఉత్సాహం, అభిరుచి కనిపించాయి. ఈ క్రీడల్లో మన యువత పదకొండు రికార్డులను బద్దలు కొట్టింది. పంజాబ్ యూనివర్సిటీ, అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ, కర్ణాటకలోని జైన్ యూనివర్సిటీ పతకాల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

మిత్రులారా!ఇటువంటి టోర్నమెంట్‌లలో ఒక ప్రధాన అంశం ఏమిటంటే, యువ ఆటగాళ్లకు సంబంధించిన అనేక స్ఫూర్తిదాయకమైన కథలు తెరపైకి వస్తాయి. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో రోయింగ్ ఈవెంట్‌లోఅస్సాంలోని కాటన్ యూనివర్సిటీకి చెందిన రాజ్‌కుమార్ ఇందులో పాల్గొన్న మొదటి దివ్యాంగ అథ్లెట్‌గా నిలిచారు. బర్కతుల్లా యూనివర్సిటీకి చెందిన నిధి పవయ్య మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ షాట్‌పుట్‌లో స్వర్ణ పతకం సాధించారు. చీలమండ గాయం కారణంగా గత ఏడాది బెంగళూరులో నిరాశకు గురైన సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీకి చెందిన శుభం భండారే ఈసారి స్టీపుల్‌చేజ్‌లో బంగారు పతక విజేతగా నిలిచారు. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయానికి చెందిన సరస్వతి కుండూ కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో కష్టాలను దాటుకుని ఆమె ఈ దశకు చేరుకున్నారు. చాలా మంది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులు కూడా TOPS పథకం నుండి చాలా సహాయాన్ని పొందుతున్నారు. మన ఆటగాళ్లు ఎంత ఎక్కువగా ఆడితే అంతగా వికసిస్తారు.

 

నా ప్రియమైన దేశవాసులారా!జూన్ 21 కూడా వచ్చింది. ఈసారి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రపంచంలోని నలుమూలలా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం యోగా దినోత్సవం  థీమ్ – ‘వసుధైవ కుటుంబానికి యోగా’.  అంటే ‘ఒకే ప్రపంచం-ఒకే కుటుంబం’ రూపంలో అందరి సంక్షేమం కోసం యోగా. అందరినీ ఏకం చేసి, ముందుకు తీసుకువెళ్ళడమనే యోగా స్ఫూర్తిని ఇది వ్యక్తపరుస్తుంది. ప్రతిసారీలాగే ఈసారి కూడా దేశంలోని నలుమూలలా యోగాకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తారు. 

మిత్రులారా!ఈసారి న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. సామాజిక మాధ్యమాల్లో కూడా యోగా దినోత్సవంపై అద్భుతమైన ఉత్సాహం కనిపించడం నేను చూస్తున్నాను.

మిత్రులారా!యోగాను మీ జీవితంలో తప్పనిసరిగా పాటించాలని, దాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీరు ఇప్పటికీ యోగాతో అనుసంధానం కాకపోతేజూన్ 21వ తేదీ ఈ తీర్మానానికి ఒక గొప్ప అవకాశం. యోగాలో పెద్దగా శ్రమ అవసరం లేదు. చూడండి…మీరు యోగాలో చేరినప్పుడుమీ జీవితంలో ఎంతో పెద్ద మార్పు వస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా!ఎల్లుండి అంటే జూన్ 20వ తేదీ చరిత్రాత్మక రథయాత్ర జరిగే రోజు. ప్రపంచ వ్యాప్తంగా రథయాత్రకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జగన్నాథుని రథయాత్ర దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అట్టహాసంగా జరుగుతుంది. ఒడిషాలోని పూరిలో జరిగే రథయాత్ర అద్భుతం. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో జరిగే భారీ రథయాత్రకు హాజరయ్యే అవకాశం వచ్చేది. ఈ రథయాత్రల్లో దేశం నలుమూలల నుంచిప్రతి సమాజం, ప్రతి వర్గానికి చెందిన  ప్రజలు తరలివస్తున్న తీరు ఆదర్శప్రాయం. ఈ విశ్వాసంతో పాటుఇది ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ కు  ప్రతిబింబం కూడా. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. జగన్నాథ భగవానుడు దేశప్రజలందరికీ మంచి ఆరోగ్యం, సుఖ సమృద్ధులను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.

మిత్రులారా!భారతీయ సంప్రదాయం, సంస్కృతికి సంబంధించిన పండుగల గురించి చర్చిస్తున్నప్పుడుదేశంలోని రాజ్ భవన్‌లలో జరిగే ఆసక్తికరమైన కార్యక్రమాలను కూడా నేను ప్రస్తావించాలి. ఇప్పుడు దేశంలోని రాజ్‌భవన్‌లు సామాజిక, అభివృద్ధి పనులతో గుర్తింపు పొందుతున్నాయి. ఈరోజు మన రాజ్ భవన్ లు టి.బి. ముక్త భారత్ ప్రచారానికి, ప్రాకృతిక వ్యవసాయానికి సంబంధించిన ప్రచారానికి మార్గదర్శనం వహిస్తున్నాయి. గతంలో గుజరాత్, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, సిక్కిం మొదలైన వివిధ రాజ్‌భవన్‌లు తమ స్థాపన దినోత్సవాలను జరుపుకున్న ఉత్సాహమే ఇందుకు ఉదాహరణ. ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని శక్తిమంతం చేసే అద్భుతమైన అడుగు ఇది.

మిత్రులారా! భారతదేశం ప్రజాస్వామ్యానికి జనని. మనం ప్రజాస్వామ్య ఆదర్శాలను ప్రధానమైనవిగా పరిగణిస్తాం. మన రాజ్యాంగాన్ని ప్రధానమైందిగా పరిగణిస్తాం. కాబట్టి, జూన్ 25 ను మనం ఎప్పటికీ మరచిపోలేం. మన దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజు అది. భారతదేశ చరిత్రలో అదొక చీకటి కాలం. లక్షలాది మంది ప్రజలు ఎమర్జెన్సీని గట్టిగా వ్యతిరేకించారు. ఆ సమయంలో ప్రజాస్వామ్య మద్దతుదారులను ఎంతగా హింసించారో, ఎన్ని వేదనలకు గురిచేశారో తలుచుకుంటే ఈనాటికీ నా మనసు కంపిస్తుంది. ఈ అఘాయిత్యాలపై;  పోలీసులు, పరిపాలకులు విధించిన శిక్షలపై ఎన్నో పుస్తకాల్లో రచయితలు రాశారు. అప్పట్లో ‘సంఘర్ష్ మే గుజరాత్’ అనే పుస్తకం రాసే అవకాశం కూడా నాకు లభించింది. ఎమర్జెన్సీపై రాసిన ‘టార్చర్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా’ అనే మరో పుస్తకం కొద్ది రోజుల కిందట నా ముందుకు వచ్చింది. అప్పటి ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షకుల పట్ల అత్యంత క్రూరంగా ఎలా వ్యవహరించిందో ఎమర్జెన్సీ కాలంలో ప్రచురితమైన ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకంలో చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. చాలా చిత్రాలు ఉన్నాయి. ఈ రోజు మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను జరుపుకుంటున్నప్పుడుదేశ స్వేచ్ఛను ప్రమాదంలో పడేసిన ఇలాంటి అపరాధాలను కూడా తప్పకుండా గమనించాలని నేను కోరుకుంటున్నాను. దీని వల్ల ప్రజాస్వామ్యం అర్థం, ప్రాముఖ్యత అవగాహన చేసుకోవడం నేటి యువతరానికి సులభతరమవుతుంది.

నా ప్రియమైన దేశవాసులారా! ‘మన్ కీ బాత్’ రంగురంగుల ముత్యాలతో అలంకృతమైన ఒక అందమైన దండ. ప్రతి ముత్యం దానికదే ప్రత్యేకమైంది.  అమూల్యమైంది. ఈ కార్యక్రమంలోని ప్రతి ఎపిసోడ్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. సామూహిక భావనతో పాటుసమాజం పట్ల కర్తవ్యాన్ని, సేవా భావాన్ని మనలో నింపుతుంది. మనం సాధారణంగా చదవడం, వినడం తక్కువగా ఉండే  విషయాలపై ఇక్కడ బహిరంగంగా చర్చ జరుగుతుంది. ‘మన్ కీ బాత్’లో ఒక అంశాన్ని ప్రస్తావించిన తర్వాత ఎంత మంది దేశస్థులు కొత్త స్ఫూర్తిని పొందారో మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇటీవలే నాకు దేశంలోని ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి ఆనందా శంకర్ జయంత్ గారి నుండి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో మనం కథలు చెప్పడం గురించి చర్చించిన ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్ గురించి రాశారు. ఆ రంగానికి సంబంధించిన వ్యక్తుల ప్రతిభను మనం ఆ కార్యక్రమంలో పేర్కొన్నాం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం స్ఫూర్తితో ఆనందా శంకర్ జయంత్ గారు ‘కుట్టి కహానీ’ని సిద్ధం చేశారు. ఇది వివిధ భాషలలో పిల్లల కోసం గొప్ప కథల సేకరణ. మన పిల్లలకు వారి సంస్కృతి పట్ల ఉన్న అనుబంధాన్ని మరింతగా పెంచే ఈ ప్రయత్నం చాలా బాగుంది. ఈ కథలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వీడియోలను కూడా ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. దేశ ప్రజల మంచి పనులు ఇతరులకు కూడా ఎలా స్ఫూర్తినిస్తున్నాయో చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకే ఆనందా శంకర్ జయంత్ గారు  చేసిన ఈ ప్రయత్నాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఎందుకంటే దీని నుంచి నేర్చుకుని తమ నైపుణ్యాలతో దేశానికి, సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఇతరులు కూడా ప్రయత్నిస్తారు. ఇది భారతదేశ ప్రజల సమష్టి శక్తి. ఇది దేశ పురోగతిలో కొత్త శక్తిని నింపుతోంది.

నా ప్రియమైన దేశప్రజలారా!ఈసారి నాతో ‘మన్ కీ బాత్’ ఇంతే! వచ్చేసారి కొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఇది వర్షాకాలం. కాబట్టిఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంతులిత ఆహారం తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. అవును! యోగా తప్పక చేయండి. ఇప్పుడు చాలా పాఠశాలల్లో వేసవి సెలవులు కూడా ముగుస్తున్నాయి. చివరి రోజు వరకు హోంవర్క్ పెండింగ్‌లో ఉంచవద్దని పిల్లలకు కూడా చెప్తాను. పనిని పూర్తి చేయండి. నిశ్చింతగా ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు

      

***