Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2022 జూన్ నెల 26 వ తేదీనాటి ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లోమాట ’) కార్యక్రమం 90  వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


 

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మన్ కీ బాత్కోసం మీ అందరి నుండి నాకు చాలా లేఖలు వచ్చాయి.సామాజిక మాధ్యమాల నుండి,నమో యాప్ ద్వారా కూడా నాకు చాలా సందేశాలు వచ్చాయి. మీ స్పందనకు  నేను మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలోపరస్పర  స్ఫూర్తిదాయక ప్రయత్నాలను చర్చించడం, ప్రజా చైతన్యం ద్వారా వచ్చిన  మార్పు గాథలను దేశం మొత్తానికి తెలియజేయడం మా ప్రయత్నం.దేశంలోని ప్రతి పౌరుడి జీవితంలో గొప్ప ప్రాముఖ్యత ఉన్న ప్రజా చైతన్య ఉద్యమం గురించి నేను ఈ రోజు మీతో చర్చించాలనుకుంటున్నాను. కానీ, అంతకు ముందు నేను నేటి తరం యువతను- 24-25 సంవత్సరాల యువతను- ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రశ్న చాలా గంభీరమైంది. నా ప్రశ్నకు సమాధానం  ఖచ్చితంగా ఆలోచించండి. మీ వయస్సులో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు  జీవించే హక్కు కూడా ఒకప్పుడు లేదని మీకు తెలుసా! ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇది అసాధ్యం. కానీ నా యువ మిత్రులారా! ఇది మన దేశంలో ఒకసారి జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట 1975 నాటి సంగతి ఇది. జూన్‌లో ఇదే సమయంలో అత్యవసర పరిస్థితి -ఎమర్జెన్సీ- విధించారు. అప్పుడు దేశ ప్రజలు అన్ని హక్కులూ కోల్పోయారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం భారతీయులందరికీ లభించిన జీవించే హక్కు,  వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆ హక్కులలో ఉన్నాయి. ఆ సమయంలో భారత ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగాయి. దేశంలోని న్యాయస్థానాలు, ప్రతి రాజ్యాంగ సంస్థ, పత్రికా రంగాలు అన్నీ నియంత్రణకు గురయ్యాయి. ఆమోదం లేకుండా ఏదీ ముద్రించకూడదని సెన్సార్‌షిప్ షరతు. నాకు గుర్తుంది- అప్పటి ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశంసించేందుకు నిరాకరించడంతో ఆయనపై నిషేధం విధించారు. రేడియోలోకి ఆయన ప్రవేశ అవకాశాన్ని తొలగించారు. అయితే ఎన్నో ప్రయత్నాలు, వేల సంఖ్యలో అరెస్టులు, లక్షలాది మందిపై దౌర్జన్యాలు జరిగినా ప్రజాస్వామ్యంపై భారత ప్రజల విశ్వాసం ఏమాత్రం సడలలేదు. భారతదేశ ప్రజల్లో శతాబ్దాలుగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య విలువలు, మన హృదయాల్లో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిచివరకు విజయం సాధించాయి. భారతదేశ ప్రజలు ఎమర్జెన్సీని తొలగించి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించారు. నియంతృత్వ మనస్తత్వాన్ని, నియంతృత్వ ధోరణిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించడం విషయంలో ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఉదాహరణ దొరకడం కష్టం. ఎమర్జెన్సీ సమయంలోదేశప్రజల పోరాటానికి సాక్షిగా, భాగస్వామిగా ఉండే అదృష్టం – ప్రజాస్వామ్య సైనికుడిగా నాకు లభించింది. నేడు-దేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా-అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఆ భయంకరమైన ఎమర్జెన్సీ కాలాన్ని మనం ఎన్నటికీ మరచిపోకూడదు.రాబోయే తరాలు కూడా మరిచిపోకూడదు. అమృత మహోత్సవం వందల సంవత్సరాల బానిసత్వం నుండి విముక్తి విజయ గాథను మాత్రమే కాకుండా, స్వాతంత్ర్యం తర్వాత 75 సంవత్సరాల ప్రయాణాన్ని కూడా ఇముడ్చుకుంటుంది.  చరిత్రలోని ప్రతి ముఖ్యమైన దశ నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం.

నా ప్రియమైన దేశప్రజలారా! జీవితంలో ఆకాశానికి సంబంధించిన ఊహలు లేని వారు మనలో ఎవ్వరూ ఉండరు. చిన్నతనంలో ఆకాశంలోని చంద్రుడు, నక్షత్రాల కథలు అందరినీ ఆకర్షిస్తాయి. యువతకుఆకాశాన్ని తాకడం కలలను నిజం చేయడానికి పర్యాయపదంగా ఉంటుంది. నేడు-మన భారతదేశం అనేక రంగాలలో విజయాల ఆకాశాన్ని తాకుతున్నప్పుడుఆకాశం లేదా అంతరిక్షం దాని నుండి దూరంగా ఎలా ఉండగలదు!  గత కొన్నేళ్లుగా మన దేశంలో అంతరిక్ష రంగానికి సంబంధించి ఎన్నో పెద్ద పనులు జరిగాయి. దేశం సాధించిన ఈ విజయాలలో ఒకటి ఇన్-స్పేస్ అనే ఏజెన్సీ ఏర్పాటు. భారతదేశఅంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను ప్రోత్సహిస్తున్న ఏజెన్సీ ఇది. ఈ ప్రారంభం మన దేశ యువతను విశేషంగా ఆకర్షించింది.నాకు చాలా మంది యువకుల నుంచి దీనికి సంబంధించిన సందేశాలు కూడా వచ్చాయి. కొన్ని రోజుల క్రితం నేను ఇన్-స్పేస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్ళినప్పుడుచాలా మంది యువ స్టార్టప్‌ వ్యవస్థాపకుల ఆలోచనలను, ఉత్సాహాన్ని చూశాను. నేను వారితో చాలా సేపు మాట్లాడాను. మీరువారి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఉదాహరణకు, స్పేస్ స్టార్ట్-అప్‌ల సంఖ్యను, వేగాన్ని మాత్రమే తీసుకోండి. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంలో అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల గురించి ఎవరూ ఆలోచించలేదు. నేడు వాటి సంఖ్య వందకు పైగా ఉంది. ఈ స్టార్టప్‌లన్నీ ఇంతకుముందు ఆలోచించని,  ప్రైవేట్ రంగానికి అసాధ్యమని భావించిన ఆలోచనలపై పనిచేస్తున్నాయి.ఉదాహరణకుచెన్నై, హైదరాబాద్‌లలోఅగ్నికుల్ , స్కైరూట్ అనే రెండు స్టార్టప్‌లు ఉన్నాయి. ఈ స్టార్టప్‌లు తక్కువ భారాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. దీని కారణంగా స్పేస్ లాంచింగ్ ఖర్చు చాలా తక్కువఅవుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన ధృవ స్పేస్ అనే మరో స్టార్టప్ కృత్రిమ ఉపగ్రహాల వినియోగం విషయంలో అత్యధిక సాంకేతికత ఉన్న సౌర ఫలకలతో పని చేస్తోంది. అంతరిక్ష వ్యర్థాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న మరో స్పేస్‌ స్టార్టప్‌ దిగంతరాకు చెందిన తన్వీర్‌ అహ్మద్‌ని కూడా కలిశాను.అంతరిక్ష వ్యర్థాలను నిర్మూలించే సాంకేతికతపై పని చేయాలనినేను వారికి ఒక సవాలు కూడా ఇచ్చాను. దిగంతరా, ధృవ స్పేస్ రెండూ జూన్ 30వ తేదీన ఇస్రో వాహక నౌక నుండి తమ మొదటి ప్రయోగాన్ని చేస్తున్నాయి. అదేవిధంగా బెంగుళూరుకు చెందిన స్పేస్ స్టార్టప్ ల  సంస్థ ఆస్ట్రోమ్ వ్యవస్థాపకురాలు నేహా కూడా ఒక అద్భుతమైన ఆలోచనతో పని చేస్తున్నారు.చిన్నవిగా ఉండి, తక్కువ ఖర్చు ఉండే ఫ్లాట్ యాంటినా లను ఈ స్టార్టప్‌లు  తయారు చేస్తున్నాయి. ఈ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది.

మిత్రులారా!ఇన్-స్పేస్ కార్యక్రమంలోనేను మెహసాణా  పాఠశాల విద్యార్థిని తన్వీ పటేల్‌ను కూడా కలిశాను. ఆమె చాలా చిన్న కృత్రిమ ఉపగ్రహం కోసం పని చేస్తోంది. దీన్ని రాబోయే కొద్ది నెలల్లో అంతరిక్షంలోకి పంపుతున్నారు. తన్వి తన పని గురించి గుజరాతీలో చాలా సరళంగా చెప్పింది.తన్విలాగేదేశంలోని దాదాపు ఏడున్నర వందల మంది పాఠశాల విద్యార్థులు అమృత మహోత్సవంలో ఇటువంటి 75 ఉపగ్రహాలపై పని చేస్తున్నారు. ఈ విద్యార్థులలో ఎక్కువ మంది దేశంలోని చిన్న పట్టణాలకు చెందినవారు కావడం కూడా సంతోషకరమైన విషయం.

మిత్రులారా!ఇదే యువతమదిలో కొన్ని సంవత్సరాల క్రితం అంతరిక్ష రంగం చిత్రం రహస్య మిషన్ లాగా ఉండేది. కానీదేశం అంతరిక్ష రంగంలో సంస్కరణలు చేపట్టింది. అదే యువత ఇప్పుడు వారి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.దేశంలోని యువత ఆకాశాన్ని తాకడానికి సిద్ధంగా ఉన్నప్పుడుమన దేశం ఎలా వెనుకబడి ఉంటుంది!

నా ప్రియమైన దేశప్రజలారా!మన్ కీ బాత్లోఇప్పుడు మీ మనస్సును ఆహ్లాదపరిచే, మీకు స్ఫూర్తినిచ్చే అంశం గురించి మాట్లాడుదాం.మన ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా ఇటీవలమళ్ళీ ముఖ్యాంశాలలో నిలిచారు. ఒలింపిక్స్‌ తర్వాత కూడా ఒకదాని తర్వాత ఒకటిగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు.ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్‌ రజత పతకం  సాధించారు. ఇది మాత్రమే కాదు- ఆయన తన సొంత జావెలిన్ త్రో రికార్డును కూడా బద్దలు కొట్టారు. కుర్టానే గేమ్స్‌లో స్వర్ణం సాధించి దేశం గర్వించేలా చేశారు నీరజ్. అక్కడ వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన  ఈ స్వర్ణం సాధించారు. ఈ ధైర్యమే నేటి యువతరానికి గుర్తింపు.స్టార్ట‌ప్‌ల నుంచి క్రీడా ప్రపంచం వ‌ర‌కు భార‌త యువ‌త కొత్త రికార్డులు సృష్టిస్తోంది.ఇటీవ‌ల జ‌రిగిన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో కూడా మ‌న క్రీడాకారులు  ఎన్నో రికార్డులు సృష్టించారు. ఈ గేమ్‌లలో మొత్తం 12 రికార్డులు బద్దలయ్యాయని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. అంతేకాదు-  11 రికార్డులను మహిళా క్రీడాకారులు నమోదు చేశారు. మణిపూర్ కు చెందిన ఎం. మార్టినా దేవి వెయిట్ లిఫ్టింగ్ లో ఎనిమిది రికార్డులు సృష్టించారు.

అలాగే సంజన, సోనాక్షి, భావన కూడా విభిన్న రికార్డులు సృష్టించారు. రానున్న కాలంలో అంతర్జాతీయ క్రీడల్లో భారత ఖ్యాతి ఎంతగా పెరుగుతుందో ఈ ఆటగాళ్లు తమ కఠోర శ్రమతో నిరూపించారు. నేను ఈ క్రీడాకారులందరినీ అభినందిస్తున్నాను. భవిష్యత్తు బాగుండాలని వారికి శుభాకాంక్షలు కూడా  తెలియజేస్తున్నాను.

స్నేహితులారా!ఖేలో ఇండియా యువజన క్రీడల్లో మరో ప్రత్యేకత ఉంది.ఈసారి కూడా ఇలాంటి ప్రతిభావంతులు చాలా మంది బయటి ప్రపంచానికి తెలిశారు. వారు చాలా సాధారణ కుటుంబాల నుండి వచ్చారు. ఈ క్రీడాకారులు తమ జీవితంలో చాలా కష్టపడి విజయాల స్థాయికి చేరుకున్నారు. వారి  విజయంలో వారి కుటుంబం, తల్లిదండ్రుల పాత్ర కూడా పెద్దది.

సైక్లింగ్‌70 కి.మీ విభాగంలో స్వర్ణం సాధించిన శ్రీనగర్‌కు చెందిన ఆదిల్ అల్తాఫ్ తండ్రి టైలరింగ్ పని చేస్తున్నారు. కానీ, తన కొడుకు కలలను నెరవేర్చడానికి ఆయన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆదిల్ తన తండ్రితో పాటు సమస్త జమ్మూ-కాశ్మీర్ గర్వంతో తలెత్తుకునేలా చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణం పొందిన చెన్నై కి చెందిన ఎల్.ధనుష్ తండ్రి కూడా సాధారణ కార్పెంటర్. సాంగ్లీకి చెందిన అమ్మాయి కాజోల్ సర్గర్ తండ్రి టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాజోల్ తన తండ్రి పనిలో సాయం చేయడంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ లోనూ కృషి చేసింది. ఆమె, ఆమె కుటుంబం  కృషి ఫలించింది. కాజోల్ వెయిట్ లిఫ్టింగ్‌లో చాలా ప్రశంసలు అందుకున్నారు. రోహ్‌తక్‌కి చెందిన తనూ కూడా ఇదే విధమైన కృషి చేసింది.తనూ తండ్రి రాజ్‌బీర్ సింగ్ రోహ్‌తక్‌లో స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తనూ రెజ్లింగ్‌లో బంగారు పతకం సాధించి, తన కలను, తన కుటుంబం కలను, తన తండ్రి కలను నిజం చేశారు.

మిత్రులారా!క్రీడా ప్రపంచంలో ఇప్పుడు భారతీయ క్రీడాకారుల ప్రాబల్యం పెరుగుతోంది. అదే సమయంలో భారతీయ క్రీడలకు కొత్త గుర్తింపు కూడా ఏర్పడుతోంది.ఈసారి ఖేలో ఇండియా యువజన క్రీడల్లో ఒలింపిక్స్ లో ఉండే క్రీడలతో పాటుదేశీయ క్రీడలను కూడా చేర్చారు.ఈ ఐదు క్రీడలు – గత్కా, థాంగ్ తా, యోగాసనాలు, కలరిపయట్టు, మల్లఖంబ్.

     మిత్రులారా! అంతర్జాతీయ టోర్నమెంటు జరిగే ఆ భారతీయ క్రీడ శతాబ్దాల క్రితం మనదేశంలో పుట్టింది. ఇది జులై 28 నుంచి ప్రారంభమయ్యే చెస్ ఒలింపియాడ్ ఈవెంట్. ఈసారి 180కి పైగా దేశాలు చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నాయి. మన నేటి క్రీడలు, ఫిట్‌నెస్‌ల చర్చ ఒక పేరు లేకుండా పూర్తి కాదు. ఆ పేరు – తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ గారిది.  ఏడు శిఖరాగ్రాల ఛాలెంజ్‌ని పూర్తి చేయడం ద్వారా ఆమె మరో ఘనత సాధించారు. ఏడు శిఖరాగ్రాల సవాలు అంటే ప్రపంచంలో అత్యంత కఠినమైన, ఎత్తైన పర్వతాల ఆరోహణ సవాలు. పూర్ణఉన్నతమైన స్ఫూర్తితోఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం మౌంట్ దెనాలి శిఖరారోహణ పూర్తి చేయడం ద్వారా దేశం గర్వించేలా చేశారు.ఆమే -కేవలం 13 ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి అద్భుతమైన సాహసకృత్యం చేసిన భారతదేశ అమ్మాయి పూర్ణ.

     స్నేహితులారా!క్రీడల విషయానికి వస్తే, ఈ రోజు నేను భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకరైన మిథాలీ రాజ్ గురించి కూడా చర్చించాలనుకుంటున్నాను.ఈ నెలలో ఆమె క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది చాలా మంది క్రీడాభిమానులను భావోద్వేగానికి గురి చేసింది.మిథాలీ అసాధారణ క్రీడాకారిణి మాత్రమే కాదు-చాలా మంది ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మిథాలీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా! మన్ కీ బాత్లో వ్యర్థాల నుండి సంపద సృష్టికి సంబంధించిన విజయవంతమైన ప్రయత్నాలను మనం చర్చిస్తున్నాం. అలాంటి ఒక ఉదాహరణ మిజోరాం రాజధాని ఐజ్వాల్ ది. ఐజ్వాల్‌లో చిటే లూయిఅనే అందమైన నది ఉంది. ఇది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల మురికిగా, చెత్త కుప్పగా మారింది. ఈ నదిని కాపాడేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయిఇందుకోసం స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు కలిసి సేవ్ చిటే లూయి కార్యాచరణ ప్రణాళికను కూడా అమలు చేస్తున్నారు. నదిని శుభ్రపరిచే ఈ ప్రచారం వ్యర్థాల నుండి సంపద సృష్టికి కూడా అవకాశం కల్పించింది.

       వాస్తవానికిఈ నది, దాని ఒడ్డు ప్లాస్టిక్, పాలిథిన్ వ్యర్థాలతో నిండి ఉంది. నదిని కాపాడేందుకు కృషి చేస్తున్న సంస్థ ఈ పాలిథిన్‌తో రోడ్డు వేయాలని నిర్ణయించింది.అంటే నది నుంచి వెలువడే వ్యర్థాలతో మిజోరాంలోని ఓ గ్రామంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్‌ రోడ్డు నిర్మించింది. అంటే స్వచ్ఛతతో పాటు వికాసం కూడా.

మిత్రులారా!పుదుచ్చేరి యువకులు కూడా తమ స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు. పుదుచ్చేరి సముద్రం ఒడ్డున ఉంది. అక్కడి బీచ్‌లు, సముద్ర అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కానీ, పుదుచ్చేరి సముద్ర తీరంలో కూడా ప్లాస్టిక్ వల్ల కాలుష్యం పెరుగుతోంది. అందుకే ఇక్కడి సముద్రాన్ని, బీచ్‌లను, జీవావరణాన్ని కాపాడేందుకు ఇక్కడి ప్రజలు రీసైక్లింగ్ ఫర్ లైఫ్అనే ప్రచారాన్ని ప్రారంభించారు. పుదుచ్చేరిలోని కరైకల్‌లో ఇప్పుడు ప్రతిరోజూ వేల కిలోల చెత్తను సేకరించి వేరు చేస్తున్నారు. అందులోని సేంద్రియ వ్యర్థాలను ఎరువుగా చేసి, మిగిలిన వాటిని వేరు చేసి రీసైకిల్ చేస్తారు. ఇటువంటి ప్రయత్నాలు స్ఫూర్తిదాయకమే కాకుండాసింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న ప్రచారానికి ఊపునిస్తాయి.

మిత్రులారా!నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలోహిమాచల్ ప్రదేశ్‌లో ఒక ప్రత్యేకమైన సైక్లింగ్ ర్యాలీ కూడా జరుగుతోంది. దీని గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సిమ్లా నుండి మండి వరకు సైక్లిస్టుల బృందం పరిశుభ్రత సందేశాన్ని తీసుకువెళ్ళడం ప్రారంభించింది. పర్వత రహదారులపై దాదాపు 175 కిలోమీటర్ల దూరాన్నివారు  సైక్లింగ్ ద్వారా మాత్రమే పూర్తి చేస్తారు. ఈ బృందంలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు.మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేమన పర్వతాలు, నదులు, మన సముద్రాలు శుభ్రంగా ఉంటే-మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాంటి ప్రయత్నాల గురించి మీరు నాకు రాస్తూ ఉండాలి.

నా ప్రియమైన దేశప్రజలారా!మన దేశంలో రుతుపవనాలు నిరంతరం విస్తరిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. నీరు,జల సంరక్షణదిశలో విశేష కృషి చేయాల్సిన సమయం కూడా ఇదే. మన దేశంలోశతాబ్దాలుగాఈ బాధ్యతను సమాజం తీసుకుంటోంది. మీకు గుర్తుండే ఉంటుంది-మన్ కీ బాత్లో మనం ఒకసారి దిగుడు బావుల వారసత్వ సంపద గురించి చర్చించాం.మెట్ల బావులు లేదా దిగుడు బావుల్లో మెట్లు దిగడం ద్వారా నీటిని  చేరుకుంటారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వందల సంవత్సరాల నాటి ఇలాంటి బావి ఉంది. దాన్ని సుల్తాన్ మెట్ల బావి అంటారు. దీన్ని  రావు సుల్తాన్ సింగ్ నిర్మించారు. కానీ నిర్లక్ష్యం కారణంగాఈ ప్రదేశం క్రమంగా నిర్జనమై చెత్త కుప్పగా మారింది. ఒకరోజు అక్కడ తిరుగుతున్న కొందరు యువకులు ఈ మెట్లబావి వద్దకు వచ్చి దాని పరిస్థితిని చూసి చాలా బాధపడ్డారు.ఈ యువకులు సుల్తాన్ మెట్ల బావి రూపురేఖలను, అదృష్టాన్ని మార్చాలనిఆ క్షణంలోనే సంకల్పించారు. వారు తమ  మిషన్‌కు సుల్తాన్ సే సుర్-తాన్ లేదా ‘సుల్తాన్ నుండి స్వర తాళాల వరకు’ అని పేరు పెట్టారు. ఈ సుర్-తాన్ లేదా స్వర తాళాలు  ఏమిటి అని మీరు ఆలోచిస్తుండవచ్చు. వాస్తవానికిఈ యువకులు తమ ప్రయత్నాలతో మెట్ల బావిని పునరుద్ధరించడమే కాకుండాసంగీత స్వరతాళాలతో దీన్ని అనుసంధానించారు.  సుల్తాన్ మెట్ల బావిని శుభ్రం చేసిన తరువాత, దానిని అలంకరించిన తరువాత, అక్కడ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఈ మార్పు గురించి ఎంతగా చర్చలు జరుగుతున్నాయంటే దీన్ని చూడటానికి విదేశాల నుండి కూడా చాలా మంది రావడం ప్రారంభించారు.ఈ విజయవంతమైన ప్రయత్నంలో ముఖ్యమైన విషయం ఏమిటంటేప్రచారాన్ని ప్రారంభించిన యువత చార్టర్డ్ అకౌంటెంట్లు. యాదృచ్ఛికంగాకొన్ని రోజుల తర్వాత జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవం. దేశంలోని సీఏలందరినీ ఈ సందర్భంగా ముందుగా అభినందిస్తున్నాను. నీటి వనరులను సంగీతం, ఇతర సామాజిక కార్యక్రమాలతో అనుసంధానించడం ద్వారా మనం వాటి గురించి ఇలాంటి చైతన్యాన్ని కలిగించవచ్చు. నీటి సంరక్షణ నిజంగా జీవన సంరక్షణ. ఈ రోజుల్లో ఎన్ని నదీ మహోత్సవాలుజరగడం ప్రారంభించాయో మీరు తప్పక చూసి ఉంటారు. మీ పట్టణాలలో అలాంటి నీటి వనరులు ఏవైనా ఉంటేమీరు తప్పనిసరిగా ఏదో ఒకకార్యక్రమం నిర్వహించాలి.

నా ప్రియమైన దేశప్రజలారా!మన ఉపనిషత్తుల జీవన మంత్రం ఉంది – చరైవేతి-చరైవేతి-చరైవేతి. మీరు కూడా ఈ మంత్రాన్ని విని ఉంటారు. దీని అర్థం – కొనసాగించు, కొనసాగించు. గతిశీలంగా ఉండడం మన స్వభావంలో భాగమే కాబట్టి ఈ మంత్రం మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఒక దేశంగావేల సంవత్సరాల పాటు సాగిన అభివృద్ధి ప్రయాణం ద్వారా మనం ఇంత దూరం వచ్చాం.ఒక సమాజంగా మనం ఎప్పుడూ కొత్త ఆలోచనలు, కొత్త మార్పులను స్వీకరిస్తూ ముందుకు సాగుతాం. మన సాంస్కృతిక చలనశీలత,యాత్రలు దీనికి  చాలా దోహదపడ్డాయి. అందుకే మన రుషులు, మునులు తీర్థయాత్ర వంటి ధార్మిక బాధ్యతలను మనకు అప్పగించారు. మనమందరం వేర్వేరు తీర్థయాత్రలకు వెళ్తాం. ఈసారి చార్ధామ్ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం మీరు చూశారు. మన దేశంలోఎప్పటికప్పుడువివిధ దైవిక యాత్రలు కూడా జరుగుతాయి. దైవిక యాత్రలు అంటే భక్తులే కాదు- మన దేవుళ్లు కూడా ప్రయాణం చేస్తారు.మరికొద్ది రోజుల్లో జూలై 1వ తేదీ నుంచి ప్రఖ్యాతిగాంచిన జగన్నాథ యాత్ర ప్రారంభం అవుతోంది. ఒరిస్సాలో జరిగే పూరీ యాత్ర ప్రతి దేశవాసికీ సుపరిచితం. ఈ సందర్భంగా పూరీకి వెళ్లే భాగ్యం కలగాలన్నది ప్రజల ఆకాంక్ష. ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్నాథ యాత్రను ఘనంగా నిర్వహిస్తారు.జగన్నాథ యాత్ర ఆషాఢ మాసం రెండవ రోజు ప్రారంభమవుతుంది. మన గ్రంథాలలో ఆషాఢస్య ద్వితీయ దివసే… రథయాత్ర అన్నారు. సంస్కృత శ్లోకాలలో ఈ వర్ణన కనిపిస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా ఆషాఢ ద్వితీయ నుంచి ప్రతి సంవత్సరం రథయాత్ర సాగుతుంది. నేను గుజరాత్‌లో ఉన్నానుకాబట్టి ప్రతి సంవత్సరం ఈ యాత్రలో సేవ చేసే అవకాశం కూడా నాకు లభించింది.ఆషాఢ ద్వితీయనుఆషాఢీ బిజ్ అని కూడా పిలుస్తారు. ఆ రోజు నుండి కచ్ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. నా కచ్ సోదర సోదరీమణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. నాకు గుర్తుంది-ఆషాఢ ద్వితీయకు ఒక రోజు ముందు-అంటే ఆషాఢమాసం మొదటిరోజున గుజరాత్‌లో సంస్కృత భాషలో పాటలు, సంగీత,సాంస్కృతిక కార్యక్రమాలతో సంస్కృత పండుగను జరపడం ప్రారంభించాం.ఈ కార్యక్రమం పేరు – ఆషాఢస్య ప్రథమ దివసే‘. ఈ పండుగకు ఈ ప్రత్యేక పేరు పెట్టడం వెనుక కూడా ఓ కారణం ఉంది. ఆషాఢ మాసం నుండి వర్ష ఆగమనంపై సుప్రసిద్ధ సంస్కృత కవి కాళిదాసు మేఘదూతం రచించాడు. మేఘదూతంలో ఒక శ్లోకం ఉంది – ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమ్ ఆశ్లిష్ట సానుమ్- అంటే ఆషాఢ మాసంలో తొలిరోజు పర్వత శిఖరాలతో కప్పబడిన మేఘాలు. ఈ శ్లోకం ఈ కార్యక్రమానికి ఆధారమైంది.

మిత్రులారా!అహ్మదాబాద్ కావచ్చు. లేదా పూరీ కావచ్చు. జగన్నాథ భగవానుడు ఈ యాత్ర ద్వారా మనకు చాలా లోతైన మానవీయ సందేశాలను అందిస్తాడు. జగన్నాథుడు జగత్తుకు ప్రభువు. అయితే ఆయన యాత్రలో పేదలకు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేక భాగస్వామ్యం ఉంటుంది. దేవుడు కూడా సమాజంలోని ప్రతి వర్గంతోనూ, ప్రతి వ్యక్తితోనూ కలిసి నడుస్తాడు. అలాగే మనదేశంలో జరిగే అన్ని యాత్రల్లోనూ పేద-ధనిక అనే భేదభావం  ఉండదు.అన్ని వివక్షలకు అతీతంగా యాత్రే ప్రధానమైంది. మహారాష్ట్రలోని పండరిపూర్ యాత్ర గురించి మీరు తప్పక విని ఉంటారు. పండరిపూర్ యాత్రలో ఒకరు పెద్ద, మరొకరు చిన్న అన్న భేదం ఉండదు. అందరూ భగవాన్ విఠలుడి సేవకులు. నాలుగు రోజుల తర్వాత అమర్‌నాథ్ యాత్ర కూడా జూన్ 30వ తేదీన ప్రారంభం అవుతోంది. అమర్‌నాథ్ యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూ కాశ్మీర్‌కు చేరుకుంటారు. జమ్మూ కాశ్మీర్‌లోని స్థానిక ప్రజలు ఈ యాత్ర బాధ్యతను తీసుకోవడంతో పాటు యాత్రికులకు సహకరిస్తారు.

మిత్రులారా!దక్షిణాదిలోశబరిమల యాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ మార్గం పూర్తిగా అడవులతో ఉన్న కాలం నుండి శబరిమల కొండలపై ఉన్న అయ్యప్ప దర్శనం కోసం ఈ యాత్ర కొనసాగుతోంది. నేటికీప్రజలు ఈ యాత్రలకు వెళ్లినప్పుడుధార్మిక ఆచారాల నిర్వహణ నుండి, బస ఏర్పాట్ల వరకు పేదలకుఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అంటేఈ యాత్రలు మనకు నేరుగా పేదలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.అందుకే ఇప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక యాత్రలో సౌకర్యాలు పెంచేందుకు దేశం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మీరు కూడా అలాంటి యాత్రలో వెళితే, ఆధ్యాత్మికతతో పాటు ఏక్ భారత్-శ్రేష్ట భారత్ దర్శనం కూడా కలుగుతుంది.

నా ప్రియమైన దేశప్రజలారా!ఎప్పటిలాగే ఈసారి కూడా మన్ కీ బాత్ద్వారా మీ అందరితో అనుసంధానం కావడం చాలా ఆహ్లాదకరమైన అనుభవం. మనం దేశప్రజల సాఫల్యాలు, విజయాల గురించి చర్చించాం. వీటన్నింటి మధ్యమనం కరోనా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.అయితేనేడు దేశంలో వ్యాక్సిన్‌కు సంబంధించిన సమగ్ర రక్షణ కవచం ఉండటం సంతృప్తిని కలిగించే విషయం. మనం దాదాపు 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల స్థాయికి  చేరుకున్నాం. దేశంలో ప్రి కాషన్ డోసులను ఇవ్వడం  కూడా వేగవంతం చేస్తున్నారు. మీ రెండవ డోసు తర్వాత ప్రి కాషన్ డోసు తీసుకునే సమయం వస్తే మీరు ఈ మూడవ డోసుతప్పక తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులకు-ముఖ్యంగా వృద్ధులకు- ప్రి కాషన్ డోసు వేయించండి. చేతుల పరిశుభ్రత, మాస్కుల వంటి అవసరమైన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. వర్షాకాలంలో మన చుట్టూ ఉండే మురికి వల్ల వచ్చే వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త గా ఉండాలి. మీరందరూ అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి.  అలాంటి శక్తితో ముందుకు సాగండి. వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం.  అప్పటి వరకు.. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!

*****