Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2022 జనవరి 30 వ తేదీ నాటి ‘ మన్ కీబాత్ ’ (‘ మనసు లో మాట ’) కార్యక్రమం 85 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం ‘మన్ కీ బాత్’  మరో  ఎపిసోడ్‌లో కలుసుకుంటున్నాం. 2022లో ఇది మొదటి ‘మన్ కీ బాత్’. ఈ రోజు మనం మన దేశం, దేశప్రజల సానుకూల ప్రేరణలు, సమిష్టి ప్రయత్నాలకు సంబంధించిన చర్చలను మళ్లీ ముందుకు తీసుకెళదాం. ఈరోజు మన పూజ్య బాపు మహాత్మా గాంధీ గారి వర్ధంతి కూడా. ఈ జనవరి 30వ తేదీ మనకు బాపు బోధనలను గుర్తు చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే రిపబ్లిక్ డే జరుపుకున్నాం. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మనం చూసిన దేశ  శౌర్య సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో గర్వం, ఉత్సాహాన్ని నింపాయి. మీరు తప్పక చూడవలసిన మార్పులుఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనవరి 23వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంత్యుత్సవం నాడు ప్రారంభమై  జనవరి 30 వరకు అంటే గాంధీజీ వర్ధంతి వరకు కొనసాగుతాయి. ఇండియా గేట్ వద్ద నేతాజీ డిజిటల్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని దేశం స్వాగతించిన తీరును, దేశంలోని నలుమూలల నుంచి వెల్లువెత్తిన ఆనందోత్సాహాలను, ప్రతి దేశస్థుడు వ్యక్తం చేసిన భావాలను మనం ఎప్పటికీ మరచిపోలేం.

మిత్రులారా! ఈ ప్రయత్నాల ద్వారా దేశం తన జాతీయ చిహ్నాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో పున: ప్రతిష్టించుకుంటుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న ‘అమర్ జవాన్ జ్యోతి’ని, సమీపంలోని ‘నేషనల్ వార్ మెమోరియల్’ వద్ద వెలిగించిన జ్యోతినిఏకం చేశాం. ఈ ఉద్వేగభరితమైన సంఘటన సందర్భంగా పలువురు దేశప్రజలు, అమరవీరుల కుటుంబాల కళ్లలో నీళ్లు తిరిగాయి.’నేషనల్ వార్ మెమోరియల్’లోస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఅమరులైన  దేశంలోని వీరులందరి పేర్లను చెక్కారు. ‘అమర జవాన్ల స్మృతి చిహ్నం ముందు వెలిగించే ‘అమర్‌ జవాన్‌ జ్యోతి’ అమరవీరుల అమరత్వానికి ప్రతీక’ అని కొందరు మాజీ సైనికులు నాకు లేఖ రాశారు. నిజంగా ‘అమర్ జవాన్ జ్యోతి’ లాగా మన అమరవీరులు, వారి స్ఫూర్తి, వారి త్యాగం కూడా అజరామరం.మీకు అవకాశం దొరికినప్పుడల్లా ‘నేషనల్ వార్ మెమోరియల్’ని తప్పక సందర్శించండని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ కుటుంబాన్ని, పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఇక్కడ మీరు భిన్నమైన శక్తిని, స్ఫూర్తిని అనుభవిస్తారు.

మిత్రులారా!ఈ అమృత్ మహోత్సవ్ వేడుకల  మధ్య దేశంలో చాలా ముఖ్యమైన జాతీయ అవార్డుల ప్రదానం కూడా జరిగింది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం. చిన్నవయసులో సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన పనులు చేసిన పిల్లలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఈ పిల్లల గురించి మనమందరం మన ఇళ్లలో చెప్పాలి. ఇవి మన పిల్లలకు కూడా స్ఫూర్తినిస్తాయి.   దేశానికి పేరు తేవాలనే ఉత్సాహాన్ని వారిలో నింపుతాయి. దేశంలో పద్మ అవార్డులను కూడా ప్రకటించారు. పద్మ అవార్డుల గ్రహీతలలోచాలా తక్కువ మందికి తెలిసిన వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు వెలుగులోకి రాని ఈ  వీరులు సాధారణ పరిస్థితులలో అసాధారణమైన పనులు చేశారు.  ఉదాహరణకుఉత్తరాఖండ్‌కు చెందిన బసంతీ దేవి గారికి పద్మశ్రీ ప్రకటించారు. బసంతీ దేవి గారు తన జీవితమంతా పోరాటాల మధ్యనే గడిపారు. చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో ఆశ్రమంలో నివసించారు.అక్కడే ఉంటూ నదిని కాపాడేందుకు పోరాడి పర్యావరణానికి విశేష కృషి చేశారు. మహిళా సాధికారత కోసం కూడా ఆమె చాలా కృషి చేశారు. అదేవిధంగామణిపూర్‌కు చెందిన 77 ఏళ్ల లౌ రెంబమ్ బీనో దేవిగారు దశాబ్దాలుగా మణిపూర్‌లోని లిబా వస్త్ర కళను సంరక్షిస్తున్నారు. ఆమెకుకూడాపద్మశ్రీ అవార్డు లభించింది.బైగా గిరిజన నృత్య కళకు ప్రాచుర్యం కల్పించినందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన అర్జున్ సింగ్ గారు పద్మ అవార్డును పొందారు. పద్మ పురస్కారం పొందిన మరొకరు  అమాయ్ మహాలింగ నాయక్గారు.ఆయన కర్నాటకకు చెందిన రైతు. కొంతమంది ఆయనను టన్నెల్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. అందరూ ఆశ్చర్యపోయేవిధంగా వ్యవసాయంలో ఆయన ఆవిష్కరణలు చేశారు. ఆయన యత్నాల వల్లచిన్న రైతులు పెద్ద ఎత్తున లబ్ది పొందుతున్నారు.  ఇలా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని వీరులు ఇంకా ఎందరో ఉన్నారు. వారు చేసిన కృషిని దేశం గౌరవించింది.  మీరు వారి  గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వారి నుండి మనం జీవితంలో చాలా నేర్చుకోవచ్చు.

నా ప్రియమైన దేశప్రజలారా! అమృత్ మహోత్సవ్‌లో మీరందరూ నాకు చాలా ఉత్తరాలు, సందేశాలు పంపుతున్నారు. చాలా సలహాలు కూడా ఇస్తున్నారు.  ఈ సిరీస్‌లో ఎన్నో మరిచిపోలేని విషయాలు జరిగాయి. కోటి మందికి పైగా పిల్లలు తమ ‘మన్ కీ బాత్’ను పోస్ట్ కార్డ్‌ల ద్వారా నాకు రాసి  పంపారు. ఈ కోటి పోస్ట్ కార్డులు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుండి కూడా వచ్చాయి. నేను ఈ పోస్ట్‌కార్డులలో చాలా వరకు చదవడానికి సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నించాను.ఈ పోస్ట్‌కార్డులు దేశ భవిష్యత్తు పట్ల మన కొత్త తరం దృష్టి ఎంత విశాలంగా ఉందో చూపిస్తాయి. ‘మన్ కీ బాత్’ శ్రోతల కోసంనేను మీతో పంచుకోవాలనుకుంటున్న కొన్ని పోస్ట్‌కార్డ్‌ల జాబితా రూపొందించాను. వీటిలో ఒకటి అస్సాంలోని గౌహతికి చెందిన రిద్ధిమా స్వర్గియారి రాసిన పోస్ట్‌కార్డు. రిద్ధిమా 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని. స్వాతంత్ర్యం వచ్చిన 100వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశంగా, ఉగ్రవాదం నుండి పూర్తిగా విముక్తి పొందిన దేశంగా, 100 శాతం అక్షరాస్యత కలిగిన దేశంగా, ప్రమాదాలు అసలే లేని దేశంగా, స్థిరమైన సాంకేతికతతో పూర్తి ఆహార భద్రతాసామర్థ్యం ఉన్నదేశంగా భారతదేశాన్ని చూడాలన్న కోరిక ఉందని ఆమె రాసింది.రిద్ధిమాతో పాటు మన బిడ్డలు ఏమనుకుంటున్నారో అవి నెరవేరతాయి.అందరి ప్రయత్నాలు ఏకమైనప్పుడుదేశం కోసం వారి కలలు నిజమవుతాయి.మీ యువ తరం ఈ లక్ష్యం కోసం పని చేసినప్పుడు మీరు ఖచ్చితంగా భారతదేశాన్ని మీరు కోరుకున్న విధంగా తయారు చేస్తారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన నవ్య వర్మ పోస్ట్ కార్డ్ కూడా నా దగ్గర ఉంది. 2047లో ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, రైతులు సుసంపన్నంగా ఉండే, అవినీతికి తావులేని భారతదేశం తన కల అని నవ్య రాశారు. నవ్యా! దేశం కోసం మీ కల చాలా అభినందనీయం. దేశం కూడా ఈ దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది.అవినీతి రహిత భారత్ గురించి మీరు మాట్లాడారు. అవినీతి దేశాన్ని చెదపురుగులాగా గుల్లగా చేస్తుంది. దాన్ని వదిలించుకోవడానికి 2047 వరకు ఎందుకు వేచి ఉండాలి? మనమందరం దేశవాసులం, నేటి యువత కలిసి ఈ పనిని వీలైనంత త్వరగా చేయాలి. దీని కోసం మనం మన విధులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. కర్తవ్యం ప్రధానంగా ఉండే చోట అవినీతి జరగదు.

మిత్రులారా! నా ముందు చెన్నైకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం రాసిన  మరొక పోస్ట్‌కార్డ్ ఉంది. 2047లో రక్షణ రంగంలో భారత్‌ను ప్రధాన శక్తిగా చూడాలని ఇబ్రహీం కోరుకుంటున్నారు. చంద్రునిపై భారతదేశం తన స్వంత పరిశోధనా స్థావరాన్ని కలిగి ఉండాలని , అంగారక గ్రహంపైమానవ జనాభాను స్థిరపరిచే పనిని భారతదేశం ప్రారంభించాలని వారు కోరుతున్నారు. అలాగే, భూమిని కాలుష్య రహితంగా చేయడంలో భారతదేశం పోషించే ప్రధాన పాత్రను ఇబ్రాహీం చూస్తారు. ఇబ్రహీం! మీలాంటి యువత ఉన్న దేశానికి అసాధ్యమైంది  ఏదీ లేదు.

మిత్రులారా! మన ముందు మరో ఉత్తరం ఉంది. మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లోని సరస్వతి విద్యా మందిర్‌లో 10వ తరగతి చదువుతున్న భావన రాసిన ఉత్తరమిది. ముందుగామీరు మీ పోస్టు కార్డును త్రివర్ణ పతాకంతో అలంకరించిన విధానం నాకు బాగా నచ్చిందని నేను భావనతో చెబుతాను. విప్లవకారుడు శిరీష్ కుమార్ గురించి భావన రాశారు.

మిత్రులారా! నేను గోవా నుండి లారెన్సియో పరేరా పోస్టు కార్డును కూడా అందుకున్నాను. పరేరా12వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఆ లేఖలోని అంశం కూడా బయటి ప్రపంచానికి తెలియని వీరులు. దాని హిందీ అర్థాన్ని నేను మీకు చెబుతున్నాను. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ధైర్యవంతులైన మహిళల్లో ప్రముఖులైన భికాజీ కామా గురించి పరేరా రాశారు. బాలికలకు సాధికారత కల్పించేందుకుభికాజీ కామా దేశ విదేశాల్లో ఎన్నో ప్రచారాలు చేశారు.అనేక ప్రదర్శనలు నిర్వహించారు. ఖచ్చితంగా భికాజీ కామా స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత సాహసోపేతమైన మహిళల్లో ఒకరు. 1907లో జర్మనీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించడంలో ఆమెకు సహకరించిన వ్యక్తి శ్రీ శ్యామ్‌జీ కృష్ణ వర్మ. శ్రీ శ్యామ్‌జీ కృష్ణవర్మ గారు 1930లో జెనీవాలో మరణించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతతన  చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకురావాలని ఆయన చివరి కోరిక.1947లో స్వాతంత్య్రం వచ్చిన రెండో రోజునే ఆయన చితాభస్మాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగలేదు. బహుశా భగవంతుడు నన్ను ఈ పని చేయమని కోరుకున్నాడేమో-నాకు ఈ పని చేసే అదృష్టం వచ్చింది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఆయన చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. శ్యామ్‌జీ కృష్ణ వర్మ గారి జ్ఞాపకార్థం కచ్‌లోని మాండ్విలో ఆయన జన్మస్థలం వద్ద ఒక స్మారక చిహ్న నిర్మాణం కూడా జరిగింది.

మిత్రులారా!భారత దేశ స్వాతంత్ర్య అమృతోత్సవ ఉత్సాహం మన దేశంలోనే కాదు. భారతదేశ  స్నేహపూర్వక దేశమైన క్రొయేషియా నుండి కూడా నాకు 75 పోస్ట్‌కార్డ్‌లు వచ్చాయి. క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో ఉన్న స్కూల్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ విద్యార్థులు ఈ 75 కార్డులను భారతదేశ ప్రజలకు పంపారు. అమృతోత్సవసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మన దేశవాసులందరి తరపుననేను క్రొయేషియాకు, ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా!భారతదేశం విద్య, విజ్ఞాన తపో భూమి. మనం విద్యను పుస్తక విజ్ఞానానికి పరిమితం చేయలేదు. కానీ దాన్ని జీవిత సంపూర్ణ అనుభవంగా చూశాం. మన దేశంలోని గొప్ప వ్యక్తులు కూడా విద్యారంగంతో లోతైన సంబంధం కలిగి ఉన్నారు. పండిట్ మదన్ మోహన్ మాలవ్య బనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించారు. గుజరాత్ విద్యాపీఠం నిర్మాణంలో మహాత్మా గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారు.గుజరాత్‌లోని ఆనంద్‌లో వల్లభ్ విద్యానగర్  అనే చాలా సుందరమైన ప్రదేశం ఉంది.  సర్దార్ పటేల్ అభ్యర్థనతో ఆయన సహచరులు భాయ్ కాకా, భిఖా భాయ్ అక్కడ యువత కోసం విద్యా కేంద్రాలను స్థాపించారు. అదేవిధంగాపశ్చిమ బెంగాల్‌లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌ను స్థాపించారు.మహారాజా గైక్వాడ్ కూడా విద్యారంగాన్ని ప్రోత్సహించే వారిలో ఒకరు. ఆయన అనేక విద్యా సంస్థలను నిర్మించారు. డాక్టర్ అంబేద్కర్, శ్రీ అరబిందోతో సహా అనేక మంది వ్యక్తులను ఉన్నత విద్యారంగంలో ప్రేరేపించారు. అలాంటి మహానుభావుల జాబితాలో రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరు కూడా ఉంది.రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ గారు తన ఇంటిని సాంకేతిక పాఠశాల స్థాపన కోసం అప్పగించారు. అలీగఢ్, మధురలో విద్యా కేంద్రాల నిర్మాణానికి ఆయన చాలా ఆర్థిక సహాయం చేశారు. కొంతకాలం క్రితం అలీగఢ్లో ఆయన పేరు మీద యూనివర్సిటీకి శంకుస్థాపన చేసే అవకాశం కూడా నాకు లభించింది. విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే చైతన్యవంతమైన స్ఫూర్తి నేటికీ భారతదేశంలో కొనసాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.ఈ భావనలోని అత్యంత అందమైన విషయం ఏమిటో మీకు తెలుసా? అంటేవిద్య పట్ల ఈ అవగాహన సమాజంలో ప్రతి స్థాయిలో కనిపిస్తుంది. తమిళనాడులోని త్రిప్పూర్ జిల్లా ఉదుమల్‌పేట్ బ్లాక్‌లో నివసిస్తున్న తాయమ్మళ్ గారి ఉదాహరణ చాలా స్ఫూర్తిదాయకం.తాయమ్మళ్ గారికి సొంతంగా భూమి లేదు. కొన్నేళ్లుగా వారి  కుటుంబం కొబ్బరినీళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తాయమ్మళ్ గారు  తన కొడుకును, కుమార్తెను చదివించడానికి ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. వారి పిల్లలు చిన్నవీరంపట్టి పంచాయతీ మాధ్యమిక పాఠశాలలో చదివారు.ఒకరోజు పాఠశాలలో తల్లిదండ్రులతో జరిగిన సమావేశంలో తరగతి గదులు, పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఆ సమావేశంలో తాయమ్మళ్ గారు  కూడా ఉన్నారు. తాయమ్మళ్ గారు  అంతా విన్నారు.  ఇదే సమావేశంలో ఈ పనులకు డబ్బుల కొరతపై మళ్లీ చర్చ వచ్చింది.దీని తర్వాత తాయమ్మళ్ గారు  ఏం చేశారో ఎవరూ ఊహించలేరు. కొబ్బరి నీళ్లు అమ్మి కొంత మూలధనాన్ని కూడబెట్టిన తాయమ్మళ్ గారు   పాఠశాల కోసం లక్ష రూపాయలను విరాళంగా అందించారు. నిజానికి ఇలా చేయడానికి విశాల హృదయం, సేవా భావం కావాలి.

ప్రస్తుతం పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకోవచ్చని తాయమ్మళ్ గారుచెప్పారు. ఇప్పుడు పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పుడు అక్కడ  ఉన్నత మాధ్యమిక విద్య ప్రారంభమవుతుంది. మన దేశంలో విద్య గురించి నేను మాట్లాడిన భావన ఇదే. IIT BHU పూర్వ విద్యార్థి చేసిన ఇలాంటి విరాళం గురించి కూడా నేను తెలుసుకున్నాను.BHU పూర్వ విద్యార్థి జయ్  చౌదరి IIT BHU ఫౌండేషన్‌కి ఒక మిలియన్ డాలర్లు అంటే సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

మిత్రులారా!మన దేశంలో చాలా మంది వివిధ రంగాలకు చెందిన వారుఇతరులకు సహాయం చేస్తూ సమాజం పట్ల తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ముఖ్యంగా మన వివిధ IITలలో ఇటువంటి ప్రయత్నాలు నిరంతరంగా కనిపిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కేంద్రీయ విశ్వవిద్యాలయాలలోనూ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలకు కొదవలేదు.ఇలాంటి ప్రయత్నాలను మరింత పెంచేందుకు గతేడాది సెప్టెంబర్ నుంచి దేశంలో విద్యాంజలి అభియాన్ కూడా ప్రారంభమైంది. వివిధ సంస్థలు, CSR, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం. విద్యాంజలి సామాజిక భాగస్వామ్యాన్ని,విద్యాసంస్థ తమదే అన్న స్ఫూర్తిని ప్రోత్సహిస్తోంది. మీ పాఠశాల, కళాశాలతో నిరంతరం అనుసంధానం అయ్యేందుకు వీలవుతుంది. మీ సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా అందించడంలో ఉన్న సంతృప్తిని, ఆనందాన్ని స్వీయ అనుభవం ద్వారా మాత్రమే పొందగలం.

నా ప్రియమైన దేశప్రజలారా!ప్రకృతిపై ప్రేమ, ప్రతి జీవిపై కరుణ- ఇది మన సంస్కృతి. మన సహజ స్వభావం. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ఒక పులి మరణించినపుడు మన ఈ ఆచారాల సంగ్రహావలోకనం కనిపించింది. ప్రజలు ఈ పులిని కాలర్ టైగ్రెస్ అని పిలిచేవారు. అటవీ శాఖ దీనికి టీ-15 అని పేరు పెట్టింది. ఈ పులి మరణంతో ప్రజలు తమ సంబంధీకులు ఈ  లోకాన్ని విడిచి వెళ్లిపోయినట్టు భావోద్వేగానికి గురయ్యారు.ప్రజలు ఆ పులికి  అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పూర్తి గౌరవం, ఆప్యాయతతో వీడ్కోలు పలికారు. సోషల్ మీడియాలో మీరు కూడా ఈ చిత్రాలను చూసి ఉంటారు. ప్రకృతిపై, జంతువులపై భారతీయులమైన మనకున్న ఈ ప్రేమ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు పొందింది. కాలర్ పులి తన జీవితకాలంలో 29 పిల్లలకు జన్మనిచ్చింది. 25 పిల్లలను పెంచి, పెద్ద చేసింది. మనం ఈ T-15 జీవితాన్ని కూడా ఉత్సవంగా జరుపుకున్నాం. ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఆ పులికి భావోద్వేగ వీడ్కోలు కూడా ఇచ్చాం. ఇది భారతదేశ ప్రజల ప్రత్యేకత. ప్రతి జీవితో మనం ప్రేమ సంబంధాన్ని ఏర్పరుచుకుంటాం. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. ఈ కవాతులోరాష్ట్రపతి అంగరక్షక బృందంలోని ఛార్జర్ గుర్రంవిరాట్ తన చివరి పరేడ్‌లో పాల్గొంది. ఈ గుర్రం విరాట్ 2003లో రాష్ట్రపతి భవన్‌కు వచ్చింది. కమాండెంట్ ఛార్జర్‌గా ప్రతిసారీ రిపబ్లిక్ డే పరేడ్‌కు నాయకత్వం వహించేది. రాష్ట్రపతి భవన్‌లో విదేశీ దేశాధినేతలెవరికైనా  స్వాగతం పలికినప్పుడు కూడా ఆ గుర్రం ఈ పాత్రను పోషించేది. ఈ ఏడాది ఆర్మీ డే రోజున గుర్రం విరాట్‌కు సైనిక దళాల ప్రధానాధిపతి COAS కమెండేషన్ కార్డ్ కూడా ఇచ్చారు. విరాట్  అపారమైన సేవలను దృష్టిలో ఉంచుకుని ఆ గుర్రం పదవీ విరమణ తర్వాతఘనంగా వీడ్కోలు జరిగింది.

నా ప్రియమైన దేశప్రజలారా!చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు, ఉన్నతమైన లక్ష్యంతో పని చేసినప్పుడుదాని ఫలితాలు కూడా కనిపిస్తాయి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ అస్సాం నుండి వచ్చింది. అస్సాం పేరు చెప్పగానే తేయాకు తోటలు, అనేక జాతీయ పార్కులు గుర్తొస్తాయి. వీటితో పాటుఒంటి కొమ్ము ఖడ్గమృగం అంటే one horn Rhino చిత్రం కూడా మన మనస్సులోకి వస్తుంది. ఒక కొమ్ము ఉన్న ఖడ్గమృగం అస్సామీ సంస్కృతిలో భాగమని మీ అందరికీ తెలుసు. భారతరత్న భూపేన్ హజారికా పాట ప్రతి చెవిలో ప్రతిధ్వనిస్తుంది.

##పాట (ఒక ప్రత్యేక ఆడియో ఫైల్ WhatsAppలో షేర్ చేస్తారు)

మిత్రులారా! ఈ పాట  అర్థం చాలా సందర్భోచితంగా ఉంది. ఏనుగులు, పులులకు నిలయమైన కాజిరంగా పచ్చటి పరిసరాల్లో ఒంటి కొమ్మున్న ఖడ్గమృగాన్ని భూమి చూస్తుందని, పక్షుల కిలకిలరావాలు వినిపిస్తాయని ఈ పాట పేర్కొంటోంది. అస్సాంలోని ప్రపంచ ప్రసిద్ధ చేనేత వస్త్రాలపై నేసిన పగడపు అలంకరణలో కూడా ఖడ్గమృగం కనిపిస్తుంది. అస్సాం సంస్కృతిలో ఇంత గొప్ప వైభవం ఉన్న ఖడ్గమృగం కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.2013లో 37, 2014లో 32 ఖడ్గమృగాలను స్మగ్లర్లు చంపేశారు. ఈ సవాలును పరిష్కరించడానికిఅస్సాం ప్రభుత్వం  ప్రత్యేక ప్రయత్నాలతో గత ఏడేళ్లలో ఖడ్గమృగంపై భారీ ప్రచారాన్ని నిర్వహించింది. సెప్టెంబర్ 22న ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2400కు పైగా కొమ్ములను దహనం చేశారు.స్మగ్లర్లకు ఇది గట్టి హెచ్చరిక. అలాంటి ప్రయత్నాల ఫలితంగానే ఇప్పుడు అస్సాంలో ఖడ్గమృగాల వేట క్రమంగా తగ్గుతోంది. 2013లో 37 ఖడ్గమృగాలను చంపేయగా 2020లో 2, 2021లో 1 మాత్రమే వేటలో మరణించినట్టుగా నమోదైంది. ఖడ్గమృగాలను రక్షించాలన్న అస్సాం ప్రజల సంకల్పాన్ని నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా!భారతీయ సంస్కృతిలోని వైవిధ్యం, ఆధ్యాత్మిక శక్తి ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తాయి. అమెరికా, కెనడా, దుబాయ్, సింగపూర్, పశ్చిమ యూరప్, జపాన్‌లలో భారతీయ సంస్కృతి బాగా ప్రాచుర్యం పొందిందని నేను మీతో చెప్తే మీరు ఈ విషయాన్ని చాలా సాధారణమైందిగా భావిస్తారు. ఆశ్చర్యపోరు. కానీలాటిన్ అమెరికా, దక్షిణ అమెరికాలలో కూడా భారతీయ సంస్కృతి అంటే ఆకర్షణ బాగా ఉందని నేను చెప్తే మీరు ఖచ్చితంగా ఒకసారి ఆలోచనలో పడతారు. మెక్సికోలో ఖాదీని ప్రమోట్ చేయాలనే విషయమైనా లేదా బ్రెజిల్‌లో భారతీయ సంప్రదాయాలను ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నమైనా ఈ విషయాలపై ఇంతకుముందు మన్ కీ బాత్లో చర్చించాం. అర్జెంటీనాలో రెపరెపలాడుతున్న భారతీయ సంస్కృతి గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అర్జెంటీనాలో మన సంస్కృతి అంటే చాలా ఇష్టం.2018లోనేను అర్జెంటీనా పర్యటన సందర్భంగా శాంతి కోసం యోగా అనే యోగా కార్యక్రమంలో పాల్గొన్నాను.  అర్జెంటీనాలో హస్తినాపూర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది. ఎక్కడి అర్జెంటీనా! – అక్కడ కూడా హస్తినాపూర్ ఫౌండేషన్ అని వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఫౌండేషన్ అర్జెంటీనాలో భారతీయ వైదిక సంప్రదాయాల వ్యాప్తిలో పాలుపంచుకుంది.దీన్ని 40 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ ఏడా ఎల్ బ్రెక్ట్ అనే మహిళా ప్రొఫెసర్ స్థాపించారు. ప్రొఫెసర్ ఏడా ఎల్ బ్రెక్ట్ ఈరోజు 90వ ఏట అడుగుపెట్టబోతున్నారు. భారత్‌తో ఆమె అనుబంధం కూడా చాలా ఆసక్తికరం.. ఆమె 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడుభారతీయ సంస్కృతి  శక్తి తొలిసారిగా ఆమెకు పరిచయమైంది. ఆమె  భారతదేశంలో కూడా చాలా కాలం  గడిపారు. భగవద్గీత, ఉపనిషత్తుల గురించి లోతుగా తెలుసుకున్నారు. హస్తినాపూర్ ఫౌండేషన్ లో 40,000 మందికి పైగా సభ్యులున్నారు. అర్జెంటీనా, ఇతర లాటిన్ అమెరికా దేశాలలో ఈ సంస్థకు దాదాపు 30 శాఖలున్నాయి. హస్తినాపూర్ ఫౌండేషన్ స్పానిష్ భాషలో 100 కంటే ఎక్కువ వైదిక, తాత్త్విక గ్రంథాలను ప్రచురించింది. వారి ఆశ్రమం కూడా చాలా మనోహరంగా ఉంటుంది. ఆశ్రమంలో పన్నెండు ఆలయాలను నిర్మించారు. వాటిలో అనేక దేవుళ్ళ , దేవతల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటి మధ్యలో అద్వైతవాద ధ్యానం కోసం నిర్మించిన  ఆలయం కూడా ఉంది.

మిత్రులారా!మన సంస్కృతి మనకే కాదు-ప్రపంచం మొత్తానికి అమూల్యమైన వారసత్వ సంపద. ఇలాంటి వందలాది ఉదాహరణలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ సంస్కృతిని  తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని, దీని ప్రకారం జీవించాలని కోరుకుంటారు. మనం కూడా పూర్తి బాధ్యతతో మన సాంస్కృతిక వారసత్వాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రజలందరికీ చేరవేయాలి.

నా ప్రియమైన దేశప్రజలారా!ఇప్పుడు నేను మిమ్మలని-  ముఖ్యంగా మన యువతను- ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఒకేసారి ఎన్ని పుష్-అప్‌లు చేయగలరో ఊహించండి. నేను మీకు చెప్పబోయేది తప్పకుండా మీలో ఆశ్చర్యాన్ని నింపుతుంది. మణిపూర్‌లో 24 ఏళ్ల థౌనా ఓజం నిరంజాయ్ సింగ్ ఒక్క నిమిషంలో 109 పుష్-అప్‌లు చేసి రికార్డు సృష్టించారు.నిరంజాయ్ సింగ్‌కు రికార్డును బద్దలు కొట్టడం కొత్త కాదు-అంతకు ముందు కూడాఒక నిమిషంలో ఒక పిడికిలితో అత్యధిక పుష్-అప్‌లు చేసిన రికార్డు సాధించారు. మీరు నిరంజాయ్ సింగ్ నుండి ప్రేరణ పొంది, శారీరక దృఢత్వాన్ని మీ జీవితంలో భాగం చేసుకుంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.

మిత్రులారా!మీరు గర్వంగా భావించే ఒక అంశాన్ని ఈ రోజు నేను లడఖ్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. లడఖ్ లో త్వరలో ఆకర్షణీయమైన  ఓపెన్ సింథటిక్ ట్రాక్, ఆస్ట్రో టర్ఫ్ ఫుట్‌బాల్ స్టేడియం ప్రారంభం కానున్నాయి. 10,000 అడుగులకు పైగా ఎత్తులో నిర్మిస్తున్న ఈ స్టేడియం నిర్మాణం త్వరలో పూర్తి అవుతుంది. లడఖ్‌లో 30,000 మంది ప్రేక్షకులు కూర్చునే అతిపెద్ద ఓపెన్ స్టేడియం ఇదే. లడఖ్‌లోని ఈ ఆధునిక ఫుట్‌బాల్ స్టేడియంలో 8 లేన్‌లతో కూడిన సింథటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. దీంతోపాటు వెయ్యి పడకలతో హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది.ఈ స్టేడియం ఫుట్‌బాల్‌లో అతిపెద్ద సంస్థ అయిన FIFA కూడా ధృవీకరించింది. ఇంత పెద్ద స్థాయిలో క్రీడల మౌలిక సదుపాయాలు దేశంలోని యువతకు గొప్ప అవకాశాలను తెస్తాయి. అదే సమయంలోఈ ఏర్పాటు జరిగే చోటికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తారు, వెళతారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ స్టేడియం లడఖ్‌లోని మన యువతలో చాలా మందికి ప్రయోజనం కల్పిస్తుంది.

నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి మన్ కీ బాత్లో కూడా మనం అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. ఈ సమయంలో అందరి మదిలో మెదులుతున్న మరో అంశం కరోనా. కొత్త కరోనా వేవ్ తో భారతదేశం గొప్ప విజయం సాధిస్తూ  పోరాడుతోంది. ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర కోట్ల మంది పిల్లలు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడం గర్వించదగ్గ విషయం.అంటే 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల యువతలో దాదాపు 60% మంది మూడు నుండి నాలుగు వారాల్లోనే టీకాలు వేయించుకున్నారు. ఇది మన యువతను రక్షించడమే కాకుండా వారి చదువును కొనసాగించడానికి కూడా సహాయపడుతుంది.మరో విశేషం ఏమిటంటే 20 రోజుల్లోనే కోటి మంది ముందుజాగ్రత్త డోసు కూడా తీసుకున్నారు.మన దేశ వ్యాక్సిన్‌పై మన దేశప్రజలకున్న ఈ నమ్మకమే మనకు గొప్ప బలం. ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు కూడా తగ్గడం ప్రారంభించాయి. ఇది చాలా సానుకూల సంకేతం. ప్రజలు సురక్షితంగా ఉండాలి. దేశ ఆర్థిక కార్యకలాపాల వేగం కొనసాగాలి. ఇది ప్రతి దేశవాసి కోరిక.

మీకు తెలుసు-మన్ కీ బాత్లోకొన్ని విషయాలునేను చెప్పకుండా ఉండలేను.  ‘స్వచ్ఛతా అభియాన్మనం మరచిపోనవసరం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని వేగవంతం చేయాలి. ఇది ముఖ్యమైంది. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం అనే మంత్రం మన బాధ్యత. స్వావలంబన భారతదేశ ప్రచారం కోసం మనం హృదయపూర్వకంగా పని చేయాలి. మనందరి కృషితో దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ఈ కోరికతోనేను మీకు వీడ్కోలు చెప్తున్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.

*****