ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 అక్టోబరు 17న ఉదయం 11:30 గంటలకు ‘పీఎం కిసాన్ సమ్మేళనం-2022’ను ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఈ సదస్సును రెండు రోజులపాటు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి 13,500 మంది రైతులతోపాటు దాదాపు 1500 వ్యవసాయ అంకుర సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. వీరే కాకుండా వివిధ సంస్థల నుంచి కోటి మందికిపైగా రైతులు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా ఇందులో పాలుపంచుకుంటారని అంచనా. పరిశోధకులు, విధాన రూపకర్తలు, భాగస్వాములు కూడా పాల్గొనబోతున్నారు.
ఈ ప్రారంభోత్సవంలో భాగంగా కేంద్ర రసాయనాలు-ఎరువుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన నడిచే 600 ‘ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల’ (పీఎం-కేఎస్కే)కు ప్రధానమంత్రి శ్రీకారం చుడతారు. ఈ పథకం కింద దేశంలోని రైతుల వివిధ అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఎరువుల చిల్లర దుకాణాలన్నీ దశలవారీగా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చబడతాయి. వీటిద్వారా పంటల సాగుకోసం రైతులకు అవసరమైన సకల సామగ్రి అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు వ్యవసాయ ఉత్పాదకాలు (విత్తనాలు, ఎరువులు, ఇతర పరికరాలు); భూసార-విత్తన, ఎరువుల పరీక్ష సౌకర్యాలు రైతులకు చేరువవుతాయి. వివిధ అంశాలపై రైతులలో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వివిధ ప్రభుత్వ పథకాల సంబంధిత సమాచారం లభిస్తుంది. బ్లాక్/జిల్లా స్థాయి కేంద్రాల్లో రిటైలర్ల సామర్థ్యం క్రమబద్ధంగా పెంచడానికి కృషి చేస్తారు. మొత్తంమీద 3.3 లక్షలకుపైగా చిల్లర ఎరువుల దుకాణాలను ‘పీఎం-కేఎస్కే’లుగా మార్చడానికి ప్రణాళిక సిద్ధమైంది. సదస్సుకు శ్రీకారం చుట్టడంలో భాగంగా ‘ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన’ పేరిట ఒకే దేశం-ఒకే ఎరువులు పథకాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఆయన ‘భారత్ యూరియా బ్యాగ్’లను విడుదల చేస్తారు. వివిధ కంపెనీలు “భారత్” అనే ఒకే బ్రాండ్ పేరుతో ఎరువులు విక్రయించేందుకు దోహదం చేస్తుంది.
రైతు సంక్షేమంపై ప్రధాని నిరంతర నిబద్ధతకు ప్రతీకగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద రూ.16,000 కోట్ల మేర 12వ విడత నిధులను ప్రధాని మోదీ ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో రైతుల ఖాతాలకు జమచేస్తారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రభుత్వం ఏటా రూ.2,000వంతున మూడు సమాన వాయిదాలలో రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. తదనుగుణంగా ఇప్పటిదాకా రైతులు ‘పీఎం-కిసాన్(పథకం కింద రూ.2 లక్షల కోట్లదాకా లబ్ధి పొందారు.
ప్రధానమంత్రి వ్యవసాయ అంకుర సంస్థల సదస్సు-ప్రదర్శనను కూడా ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. కచ్చితత్వంలో కూడిన పంటల సాగు, పంట అనంతర/విలువ జోడింపు పద్ధతులు, అనుబంధ వ్యవసాయం, వర్థం నుంచి అర్థం, చిన్నరైతుల కోసం యంత్రీకరణ, సరఫరా ప్రక్రియ నిర్వహణ, వ్యవసాయోత్పత్తుల రవాణా వగైరాలపై దాదాపు 300 అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. రైతులు, ఎఫ్పిఓలు, వ్యవసాయ నిపుణులు, కార్పొరేట్ సంస్థలతో అంకుర సంస్థల అనుసంధానానికి ఈ వేదిక వీలు కల్పిస్తుంది. అలాగే అంకుర సంస్థలు తమ అనుభవాలను వారితో పంచుకోవడంతోపాటు ఇతర భాగస్వాములతో సాంకేతిక అంశాలపై చర్చల్లో పాలుపంచుకుంటాయి.
ఈ సందర్భంగా ‘ఇండియన్ ఎడ్జ్’ పేరిట ఎరువులపై ఇ-మ్యాగజైన్‌ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. తాజా పరిణామాలు, ధరల ధోరణిపై విశ్లేషణ, లభ్యత-వాడకం, రైతుల విజయ గాథలు సహా దేశీయ-అంతర్జాతీయ ఎరువుల నేపథ్యాలపై ఇది సమాచారం అందిస్తుంది.
***