Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2020 వ సంవత్సరం లో జూన్ 28 వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ 2.0’ (మనసు లో మాట 2.0) కార్యక్రమం యొక్క 13 వ భాగం ‌లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం


 

నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం.

‘‘మన్ కీ బాత్’’ (మనసు లో మాట) ఇప్పుడు 2020 వ సంవత్సరం లో తన ప్రయాణం లో సగం మార్కు ను సాధించింది.  ఈ కాలం లో, మనం అనేకానేక విషయాల గురించి మాట్లాడుకున్నాము.  సహజంగానే, మన సంభాషణల లో ఎక్కువ భాగం ప్రపంచ మహమ్మారి చుట్టూ తిరిగింది;  ఇది మానవ జాతి ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు. అయితే, ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను, “ఈ సంవత్సరం ఎప్పుడు గడుస్తుంది !” అనేది  ప్రజలలో అంతులేని చర్చనీయాంశం గా ఉంది.  ‘‘ఈ సంవత్సరం ఎందుకు ఇంత మందకొడిగా సాగుతోంది?’’ అనే ప్రశ్నతోనే మన ఫోను సంభాషణ లు ప్రారంభం అవుతున్నాయి.  సంవత్సరం ఎందుకు మంచి గా లేదని ప్రజలు వ్రాస్తున్నారు, స్నేహితుల తో సంభాషిస్తున్నారు.  వారిలో కొందరు 2020 వ సంవత్సరం శుభప్రదమైంది కాదని పేర్కొంటున్నారు.  ఈ సంవత్సరం ఎలాగో అలాగా తొందర గా గడిస్తే చాలని ప్రజలు కోరుకుంటున్నారు. 

మిత్రులారా, ఇలా ఎందుకు జరుగుతోంది అని కొన్ని సార్లు ఆలోచిస్తుంటాను.  అటువంటి చర్చల కు కొన్ని కారణాలు ఉండవచ్చు.  కేవలం 6-7 నెలల క్రితం, కరోనా అనే విపత్తు ను గురించి మనకు అసలు తెలియదు, లేదా పోరాటం ఇంత సుదీర్ఘ కాలం సాగుతుందని ఊహించలేదు.  ఒక విపత్తు ఇళ్ల ఉండగా, ఇది సరిపోదన్నట్టు, దేశం లో  రోజురోజు కు అంతులేని సవాళ్లు ఎదురుపడుతూనే ఉన్నాయి.   కొన్ని రోజుల క్రితం, మన తూర్పు తీరం లో అమ్ఫాన్ తుఫాను, పశ్చిమ తీరంలో నిసర్గ్ తుఫాను లు వచ్చాయి.  ఇంకా అనేక రాష్ట్రాల లో, మన రైతు సోదరులు, మన రైతు సోదరీమణులు మిడతల దండు ల భారాన్ని భరించాల్సి వచ్చింది…. ఇవేమీ కాకపోతే, దేశం లోని అనేక ప్రాంతాల లో అడపాదడపా భూకంపాలు సంభవించాయి.  వీటన్నిటి మధ్య, మన పొరుగు దేశాల తో కూడా మన దేశం కొన్ని సవాళ్ళ ను ఎదుర్కోవలసి వచ్చింది.  వాస్తవానికి, ఈ రకమైన ప్రతికూలతలు అన్నిటినీ ఒకే సారి విన్న సందర్భాలు చాలా అరుదు.   ఏదైనా చిన్న సంఘటన జరిగినా ప్రజలు ఆ సంఘటనల ను ఈ సవాళ్ళ తో అనుసంధానం చేసి చూస్తున్న దశ లో మనం ఉన్నాము.     

మిత్రులారా, కష్టాలు మన మీదకు వస్తాయి; విపత్తు లు మనల ను ఎదుర్కొంటాయి…. కానీ ప్రశ్న ఏమిటి అంటే – 2020 వ సంవత్సరం మంచిది కాదనే విస్వాశాన్ని మనం కొనసాగించాలా?   మొదటి ఆరు నెలల్లో పరిస్థితి ఆధారం గా మొత్తం సంవత్సరం అలాగే ఉంటుందని ఊహించడం ఎంతవరకు సరైంది?  నా ప్రియమైన దేశవాసులారా, ఖచ్చితం గా ఇది సరి కాదు.  ఏదైనా ఒక సంవత్సరం లో, సవాళ్లు ఒకటి నుండి  యాభై మధ్య ఉండవచ్చు, ఆ సంఖ్య ఆధారం గా ఆ సంవత్సరం మంచిదనీ లేదా చెడ్డదనీ నిర్ణయించకూడదు.  చరిత్ర ఆధారం గా చూస్తే, భారతదేశం ఎల్లప్పుడూ ప్రకాశవంతం గా మరియు బలం గా నిలబడింది, అన్ని రకాల విపత్తు లు మరియు సవాళ్ళపై విజయాన్ని సాధించింది.  శతాబ్దాలు గా, అనేక మంది దౌర్జన్యం గా భారతదేశం పై దాడి చేశారు.  కష్టాల అగాధం అంచు కు నెట్టి వేశారు.  ఒకానొక కాలం లో భారతదేశం తుడిచిపెట్టుకుపోతుందనీ, భారతీయ సంస్కృతి సర్వనాశనమవుతుందనీ భావించారు.  కానీ, భారతదేశం, ఈ సంక్షోభాల కారణం గా, మరింత మహిమాన్వితం గా మారింది.  

మిత్రులారా, మన వాళ్లు ఈ మాటలు అంటాప్తారు.. ‘సృజన శాశ్వతంగా ఉంటుంది, సృజన నిరంతరాయం గా ఉంటుంది’ అని.  నాకు ఒక పాట లోని కొన్ని పంక్తులు ఈ సందర్భం లో గుర్తు కు వస్తున్నాయి. 

యహ్ కల్- కల్  ఛల్-ఛల్ బహ్ తీ, క్యా కహ్ తీ  గంగా ధారా ?

యుగ్ యుగ్ సే బహ్ తా ఆతా, యహ్ పుణ్య్  ప్రవాహ్ హమారా.  

గల గల మనే , గంగా నది  అల లు ఏమంటున్నాయి ?

రాళ్లు, రప్పలు ఆపలేనిది,  మన శక్తివంతమైన దైవిక ప్రవాహం.

అదే పాట లో ఆ తరువాతి పంక్తులు ఇలా ఉంటాయి ..

క్యా ఉస్ కో రోక్  సకేంగే , మిట్ నే వాలే  మిట్ జాయేఁ, 

కంకడ్ -పత్థర్  కీ హస్తీ, క్యా బాధా బన్ కర్ ఆయేఁ . 

స్థిరమైన ప్రవాహాన్ని నిరోధించే శక్తి ఎవరి కి ఉంది….

జాడ లేకుండా చాలా మునిగిపోయాయి!

గులకరాళ్ళు అయినా, రాళ్ళు అయినా ఏమి చేయగలవు,

దైవ కృప కు ఎప్పుడైనా అడ్డు ఉందా?

భారతదేశం కూడా, ఒక వైపు, భారీ ప్రతికూలతల ను ఎదుర్కొంటూనే ఉంది, మరో వైపు, అనేక రకాల పరిష్కారాలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, అడ్డంకుల ను అధిగమిస్తూనే ఉంది.  సాహిత్యం పునరుజ్జీవం చూసింది, కొత్త పరిశోధనలు వెలువడ్డాయి, కొత్త అంశాలు పుట్టుకొచ్చాయి.  దీని అర్థం, క్లిష్ట కాలాల లో కూడా, ప్రతి రంగం లో సృష్టి ప్రక్రియ నిరాకంటం గా సాగి, మన సంస్కృతి ని సుసంపన్నం చేసి, మన దేశం యొక్క పురోగతి కి దారితీసింది.  భారతదేశం ఎప్పుడూ కష్టాలను విజయాని కి మెట్టు గా మార్చుకొంది.  అదే మనోబలం తో, నేటి కష్ట కాలాల లో సైతం మనం ముందుకు సాగాలి.  మీరు ముందుకు సాగితే, 130 కోట్ల మంది దేశ ప్రజలు ముందుకు సాగుతారు, అప్పుడు, ఈ సంవత్సరం, దేశాని కి కీర్తి ని సాధించే ఏడాది గా రుజువు అవుతుంది.  ఈ సంవత్సరం దేశం నవీన లక్ష్యాల ను సాధిస్తుంది, అన్ని క్రొత్త రెక్కల తో నూతన శిఖరాల కు చేరుకొంటుంది.  130 కోట్ల మంది దేశవాసుల సామూహిక శక్తి ని నేను గట్టిగా నమ్ముతున్నాను… అందులో మీ అందరూ ఉన్నారు. …… అద్భుతమైన ఈ దేశ వారసత్వం పైన నాకు గట్టి నమ్మకం ఉంది.

నా ప్రియమైన దేశవాసులారా, మనకు ఎదురయ్యే విపత్తు తో సంబంధం లేకుండా, భారతదేశం యొక్క సంస్కారం … జీవన విధానం మనలో ప్రతి ఒక్కరి ని నిస్వార్థం గా సేవ చేయడానికి ప్రేరేపిస్తుంది.  క్లిష్ట సమయాల లో భారతదేశం ప్రపంచాని కి సహాయం అందించిన విధానం, శాంతి మరియు అభివృద్ధి లో భారతదేశం యొక్క పాత్ర ను మరింత బలపరిచింది.  భారతదేశం యొక్క విశ్వవ్యాప్త సోదర స్ఫూర్తి ని ప్రపంచం గ్రహించింది… అదే సమయంలో భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు ప్రాదేశిక సమగ్రత ను కాపాడటాని కి భారత ప్రజల నిబద్ధత మరియు శక్తి ని కూడా గమనించింది.  లద్దాఖ్‌ లోని భారతీయ గడ్డ పైకి, కన్నెత్తి చూసే వారికి తగిన జవాబే దొరికింది.  భారతదేశం, మిత్రత్వం యొక్క స్ఫూర్తి ని గౌరవిస్తుంది.. అలాగే ఏ విరోధికైనా, జంకకుండా దీటైన జవాబు ను కూడా ఇవ్వగలదు. కళ్ల లోకి కళ్లు పెట్టి చూడడం, ఇంకా తగ్గ జవాబు ఇవ్వడం కూడా భారతదేశాని కి తెలుసును. మన వీర సైనికులు భరత మాత యొక్క గౌరవానికి ఎట్టి పరిస్థితుల లోను, ఎటువంటి భంగాన్ని కూడాను కలగనివ్వబోమని రుజువు చేశారు.

మిత్రులారా, లద్దాఖ్‌ లో అమరులైన మన సైనికుల ధైర్యాని కి నివాళుల ను అర్పించడంలో దేశం మొత్తం కలిసి వస్తోంది. దేశం మొత్తం వారికి గౌరవంగా, కృతజ్ఞత తో నివాళులు అర్పిస్తోంది.  వారి కుటుంబ సభ్యుల మాదిరి గానే, జరిగిన నష్టాని కి ప్రతి భారతీయుడు వేదన ను వ్యక్తపరుస్తున్నారు.  కుటుంబాలు తమ ధైర్యవంతులైన పుత్రుల అత్యున్నత త్యాగంపై అనుభూతి చెందే అంతర్గత భావన… దేశం పట్ల వారి మనోభావం, నిజమైన శక్తి ని, దేశ శక్తి ని కలిగి ఉంది.  అమరవీరుల తల్లిదండ్రులు తమ ఇతర కుమారుల ను, ఇతర యువ కుటుంబ సభ్యుల ను కూడా సైన్యం లో చేరవలసిందని సూచించడాన్ని మీరు గమనించే ఉంటారు.  బిహార్‌ కు చెందిన శహీద్ కుందన్ కుమార్ తండ్రి గారి మాట లు అయితే ఇంకా చెవి లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.  దేశ రక్షణ కోసం,  తన మనవళ్లను కూడా సైన్యాని కి పంపడానికి సిద్ధం గా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.  ఇదే విధమైన భావన ప్రతి అమరవీరుని కుటుంబం లోనూ కనిపించింది.  నిజంగా, ఈ కుటుంబ సభ్యులు ప్రదర్శించే త్యాగం చాలా గౌరవప్రదమైంది.  మన భారత మాత భద్రత కోసం మన జవాను లు అత్యున్నత త్యాగం చేసిన సంకల్పం మన జీవిత లక్ష్యం గా ఉండాలి… ఇది మనలో ప్రతి ఒక్కరి కి వర్తిస్తుంది.  మన ప్రయత్నాలు అన్నీ కూడాను ఒకే దిశ లో ఉండాలి… మన సరిహద్దుల ను పరిరక్షించడం లో దేశం యొక్క సామర్థ్యాల ను మరింత గా పెంచే దిశ గా మనం కృషి చేయాలి.  ఒక స్వావలంబనయుత భారతదేశం కోసం మనందరం కృషి చేయాలి, అదే అమరవీరుల కు అర్పించే నిజమైన శ్రద్దాంజలి అవుతుంది.  అసమ్ నుండి రజనీ గారు నాకు లేఖ ను వ్రాశారు.  తూర్పు లద్దాఖ్‌ లో ఏమి జరిగిందో చూసిన తరువాత, ఆమె ప్రతిజ్ఞ ను స్వీకరించారు అని… మరి ఆ ప్రతిజ్ఞ ఏమిటి అంటే, ఆమె ‘లోకల్’ మాత్రమే కొనుగోలు చేస్తారని… అలాగే ‘లోకల్’ కోసం ‘వోకల్’.. అంటే ఆమె యొక్క గొంతు ను కలపడానికి కూడా సిద్ధం గా ఉంది అని ఆ  లేఖ సారాంశం.  ఈ విధమైన సందేశాలు నాకు దేశం నలుమూలల నుండి వస్తున్నాయి.  చాలా మంది తమ లేఖ ల ద్వారా తాము కూడా ఈ మార్గాన్ని అవలంబించామని తెలిపారు.  ఇదే విధం గా, భారతదేశం రక్షణ రంగం లో స్వయంసమృద్ధిని సాధించాలని కోరుకొంటున్నాను అంటూ మదురై కి చెందిన మోహన్ రామమూర్తి, వ్రాశారు. 

మిత్రులారా, స్వాతంత్య్రాని కి ముందు, రక్షణ రంగం లో, మన దేశం ప్రపంచం లోని అనేక దేశాల కంటే ముందుంది.  ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లు చాలా ఉన్నాయి.  అప్పట్లో మన కంటే వెనుకబడి ఉన్న చాలా దేశాలు, ఇప్పుడు మన కంటే ముందున్నాయి.  స్వాతంత్య్రం తరువాత, మన ముందు అనుభవాన్ని పరిగణన లోకి తీసుకొని రక్షణ రంగం లో తగిన కృషి ని జరపవలసి ఉంది……  అయితే, ఆ ప్రయత్నాల ను మనం చేయలేదు. కానీ, ఈ రోజు న, రక్షణ మరియు సాంకేతిక రంగాల లో, భారతదేశం ఆ రంగాల లో ముందుకు సాగడానికి అవిశ్రాంతం గా ప్రయత్నిస్తోంది…. భారతదేశం స్వావలంబన వైపు అడుగు లు వేస్తోంది.

మిత్రులారా, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ లక్ష్యాన్ని విజయవంతం గా సాధించలేము.  అందుకే, స్వయంసమృద్ధియుత భారతదేశాన్ని సాధించే దిశ గా, పౌరుని గా, మన సమష్టి సంకల్పం, నిబద్ధత మరియు మద్దతు లు అవసరం; నిజాని కి అత్యవసరం.  మీరు ‘లోకల్’ కొన్నప్పుడు, ప్రతి ఒక్కరూ లోకల్ కొనే విధం గా నలుగురి కి ప్రచారం చేస్తే, మీరు దేశాన్ని బలోపేతం చేయడం లో పాత్ర ను పోషించినట్లు అవుతుంది.  ఇది కూడా, మన స్వంత విధానం లో, మన దేశాని కి సేవ చేసినట్లే అవుతుంది.  మీ వృత్తి ఏదైనా, అది ఎక్కడైనా, దేశాని కి సేవ చేసేందుకు, అవకాశాలు అనేకం గా ఉన్నాయి.  దేశ అవసరాన్ని దృష్టి లో పెట్టుకొని, మీరు ఏ సహాయాన్ని చేసినా, అది, సేవా స్ఫూర్తి కి లోబడి ఉంటుంది.  మీ వైపు నుండి మీరు చేసే ఈ సహాయం, దేశాని కి ఏదో ఒక రకం గా బలాన్ని చేకూరుస్తుంది.  మన దేశం ఎంత బలం గా ఉంటే, ప్రపంచం లో శాంతి యొక్క అవకాశాలు అంత బలపడతాయని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి.

విద్యా వివాదాయ ధనం మదాయ,  శక్తి: పరేషాం  పరిపీడనాయ |  

ఖలస్య  సాధో: విపరీతం ఏతత్, జ్ఞానాయ దానాయ చ రక్షనాయ||  అని అన్నారు.  

ఈ మాటల కు – స్వభావ రీత్యా చెడ్డవాడు, వ్యక్తుల తో వివాదం కోసం తన విద్య ను, దర్పాన్ని ప్రదర్శించుకొనేందుకు ధనాన్ని, మరియు ఇతరుల ను బాధపెట్టేందుకు తన శక్తి ని ఉపయోగిస్తాడు.  కానీ సజ్జనుడు,  జ్ఞానం కోసం విద్య ను, ఇతరుల కు సహాయపడేందుకు ధనాన్ని, రక్షణ కోసం శక్తి ని ఉపయోగిస్తాడు – అని భావం.  భారతదేశం ఎప్పుడూ తన శక్తి ని ఉపయోగించుకొంటుంది, అదే భావన ను ప్రతిధ్వనిస్తుంది.   దేశ గౌరవాన్ని మరియు సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడమే భారతదేశం యొక్క గంభీరమైన సంకల్పం.  భారతదేశం యొక్క లక్ష్యం- స్వయంసమృద్ధియుతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించడమే.   భారతదేశం యొక్క నిర్మాణం- విశ్వాసం మరియు స్నేహం.  భారతదేశం యొక్క భావన సోదరభావం.  మనం ఈ సూత్రాల కు కట్టుబడి ముందుకు పోతున్నాము. 

నా ప్రియమైన దేశవాసులారా, ప్రస్తుత కరోనా సంకట కాలం లో, దేశం లాక్ డౌన్ దశ నుండి బయటపడి అన్ లాక్ దశ కు చేరుకొంది.  ఈ అన్ లాక్ కాలం లో, ఎవరైనా రెండు అంశాల మీద శ్రద్ధ వహించవలసివుంటుంది.  అవి- కరోనా ను ఓడించడం మరియు దేశ ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేసి దానికి శక్తి ని ఇవ్వడమూను.  మిత్రులారా, అన్ లాక్ కాలం లో, మనం లాక్ డౌన్ కాలం తో పోలిస్తే మరింత అప్రమత్తం గా ఉండి తీరాలి.  మన జాగరూకతే మనలను కరోనా బారి నుండి కాపాడగలుగుతుంది.  ఎప్పటికీ, గుర్తు పెట్టుకోండి, మీరు మాస్క్ ను ధరించకపోయినట్లయితే, ఒక మనిషి కి మరొక మనిషి కి నడుమ న రెండు గజాత సామాజిక దూరం తాలూకు నియమాల ను పాటించకపోతే, లేదా ఇతర ముందుజాగ్రత్తల ను తీసుకోకపోతే, మీరు మీ తో పాటుగా ఇతరుల ను, మరీ ముఖ్యం గా ఇంటిలోని బాలల ను మరియు వయోధికుల ను అపాయం లోకి నెట్టుతున్నారన్న మాటే.  అందుకని, నేను దేశ ప్రజల ను అందరి కి విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే.. మరి నేను పదే పదే ఇలాగ కోరేది ఏమిటి అంటే.. అజాగ్రత్త గా ఉండవద్దు.. స్వయంగా మీ పట్ల, అలాగే ఇతరుల పట్ల కూడా శ్రద్ధ తీసుకోండి అనే.

మిత్రులారా, ఈ అన్ లాక్ దశ లో, మరెన్నో విషయాలు కూడా- ఏవయితే ఇంత వరకు దేశాన్ని బంధించి ఉంచాయో- మరి వాటి బంధనాల యొక్క  తాళాల ను కూడా తెరచుకొంటున్నాయి.  సంవత్సరాల తరబడి మన గనుల త్రవ్వకం  రంగం లాక్ డౌన్ దశ లో ఉంటూ వచ్చింది.  వాణిజ్య సరళి వేలంపాట పద్ధతి ని అనుమతించాలన్న నిర్ణయం ఈ స్థితి ని సమూలం గా మార్చివేసింది.  కేవలం కొన్ని రోజుల క్రితం, అంతరిక్ష రంగం  లో చరిత్రాత్మకమైనటువంటి మార్పుల ను ప్రవేశపెట్టడమైంది.  ఈ సంస్కరణ ల ద్వారా, ఏళ్ల తరబడి లాక్ డౌన్ స్థితి లో ఉంటూ వచ్చిన రంగాని కి విముక్తి ని ఇవ్వడం జరిగింది.  ఇది స్వయంసమృద్ధియుతమైన భారతదేశం దిశ గా పయనాన్ని వేగవంతం చేయడమే కాకుండా , ఇది భారతదేశం లో సాంకేతిక విజ్ఞానం యొక్క పురోగతి ని ప్రోత్సహిస్తుంది కూడాను.  మీరు గనక మన వ్యవసాయ రంగానికేసి ఒకసారి దృష్టి ని సారించారా అంటే, ఈ రంగం లోని అనేక విషయాలు సైతం దశాబ్దాల పాటు లాక్ డౌన్ స్థితి లో ఉండిపోయాయని మీరు గమనించగలుగుతారు. ఈ రంగాన్ని కూడా ప్రస్తుతం అన్ లాక్ చేయడమైంది. ఇది, ఒక ప్రక్క న, రైతుల కు వారి యొక్క ఫలసాయాన్ని ఎక్కడైనా సరే, వారికి నచ్చిన వారి కి విక్రయించుకొనేందుకు స్వతంత్రాన్ని ఇస్తుంది; మరో ప్రక్క న, ఇది అధిక రుణాల కు కూడాను బాట ను పరచింది.  అటువంటి అనేక రంగాలు ఉన్నాయి, వేటిలోనయితే, మన దేశం ఇన్ని అన్ని సంక్షోభాల నడమ న, చరిత్రాత్మక నిర్ణయాల ను తీసుకొంటూ,  అభివృద్ధి తాలూకు నూతన మార్గాల ను తెరుస్తోంది.

నా ప్రియమైన దేశవాసులారా, ప్రతి మాసం, మనం మన హృద‌యాల ను స్పర్శించేటటువంటి వార్తల ను చదువుతున్నాం, ఇంకా చూస్తున్నాము.  అవి భారతదేశం లో ప్రతి ఒక్కరు మరొక మనిషి కి ఒకరి స్తోమత మేరకు చేతనైనంత వరకు సాయపడటానికి చిత్తశుద్ది తో సంసిద్ధంగా ఉన్నారన్న సంగతి ని మనకు గుర్తు కు తెస్తున్నాయి. 

అటువంటి ఒక ప్రేరణాత్మకమైన గాథ ను ప్రసార మాధ్యమాల ద్వారా చదివే అవకాశం నాకు చిక్కింది. అది అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన గాథ.  సియాంగ్ జిల్లా మిరెమ్ అనే పల్లె ఒక విశిష్ట కార్యానికి పూనుకొంది; అది భారతదేశాని కి అంతటి కి ఒక ప్రేరణ గా నిలచింది.  ఆ గ్రామస్థుల లో చాలా మంది వారి యొక్క జీవనోపాధి కై బయట వేర వేరు చోటుల లో ఉంటున్నారు.  కరోనా విశ్వమారి కాలం లో, వారు తిరిగి తమ ఊరి కి తిరిగి వస్తున్నారు.  పల్లెవాసులు ఈ విషయాన్ని గమనించి, వారి సంఘావరోధాని కై గ్రామాని కి వెలుపల, ముందస్తు గానే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.  వారంతా కలసికట్టు గా ఊరికి కాస్తంత దూరం లో 
14 తాత్కాలిక గుడిసెల ను తయారు చేశారు.  ఆ వ్యక్తులు ఎవరైతే గ్రామాని కి తిరిగి చేరుకొంటారో, వారు మొదట ఈ గుడిసె ల లో కొన్ని రోజులు ఏకాంతవాసం లో ఉండాలన్నది గ్రామీణుల నిర్ణయం.  ఆ గుడిసెల లో టాయిలెట్ లను, నీటి ని, ఇంకా విద్యుత్తు ను, రోజువారీ అవసరపడే వస్తువుల తో సహా సిద్ధం గా  ఉంచారు. మిరెమ్ గ్రామీణుల వంతు గా వారిలో  వ్యక్తం అయినటువంటి ఈ చైతన్యం మరియు వారి యొక్క ఈ సామూహిక ప్రయాస అందరి సావధానత ను మరి అలాగే ప్రశంసల ను తన వైపు నకు తిప్పుకొన్నాయి. 

మిత్రులారా, ఈ శ్లోకం మన గ్రంథాల లో ఉంది –

స్వభావం న జహాతి ఏవ, సాధుః ఆపద్రతోపి సన్ l
కర్పూరః పావక్ స్పృష్టః  సౌరభం లభ్‌తేతరామ్ ||
 
ఈ మాటల కు – కర్పూరం అగ్ని లో మండుతూ ఉన్నప్పుడు కూడా దాని సుగంధాన్ని వదలిపెట్టదు- అని భావం.  అలాగే ధర్మవంతులు విపత్తుల్లోనూ వారి లక్షణాల ను లేదా నిజ స్వభావాన్ని వదులుకోరు.  నేడు, మన దేశ కార్మిక సోదరులు ఈ మంత్రాని కి ప్రతిరూపాలు గా ఉన్నారు.  ప్రస్తుతం మన ప్రవాసీ శ్రామికుల కథ లు చాలా వినిపిస్తున్నాయి.  యావత్తు దేశాని కి ప్రేరణ ను అందిస్తున్నాయి.  ఉత్తర్ ప్రదేశ్‌ లోని బారాబంకీ గ్రామాని కి తిరిగి వచ్చిన ప్రవాసీ శ్రామికులు, కల్యాణి నది ని ప్రక్షాళన చేశారు.  నది కి సహజ రూపాన్ని తెచ్చారు.  దీని ని చూసి, సమీప ప్రాంత రైతులు, ప్రజలు స్ఫూర్తి ని పొందారు. కార్మికులు స్వగ్రామాల కు తిరిగి వచ్చిన తరువాత, క్వారన్టీన్ సెంటర్ లో గడిపినప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితుల ను మార్చడానికి వారి నైపుణ్యాల ను ఉపయోగించిన విధానం అద్భుతం.  మన దేశం లోని లక్షలాది గ్రామాలలో ఇటువంటి కథ లు చాలా ఉన్నాయి.  అవి ఇంకా మన దాకా రాలేదు.

మన దేశ స్వభావం లాగే, మీ ఊరిలో లేదా మీ సమీపం లో ఇటువంటి సంఘటన లు జరిగి ఉండాలని నేను గట్టి గా నమ్ముతున్నాను.  అటువంటి ఉత్తేజకర సంఘటన లు మీ దృష్టి కి వస్తే, వాటి ని గురించి వ్రాసి, నాకు పంపండి.  ఈ విపత్తు కాలం లో, ఈ సానుకూల ఘటనలు ఇతరుల లో స్ఫూర్తి ని నింపుతాయి. 
 
నా ప్రియమైన దేశవాసులారా, కరోనా వైరస్ మన జీవన విధానాన్ని మార్చివేసింది.  నేను, లండన్‌ నుండి అచ్చయిన ‘ఫైనాన్షియల్ టైమ్స్’ లో ఒక చాలా ఆసక్తిదాయకమైనటువంటి ఒక కథనాన్ని చదివాను.  ప్రస్తుత కరోనా కాలం లో, అల్లం, పసుపు సహా ఇతర సుగంధ ద్రవ్యాల కు ఆసియాలోనే కాక అమెరికాలోనూ డిమాండ్‌ పెరిగిందని ఆ కథనం లో వ్రాశారు.  వ్యాధినిరోధక శక్తి ని పెంచుకోవడంపై యావత్తు ప్రపంచం దృష్టి ని సారించింది. ఈ శక్తి ని పెంచే పదార్థాలు మన దేశం తో ముడిపడి ఉన్నాయి.  వాటి ప్రత్యేకత ను గురించి ప్రపంచ ప్రజల కు తేలికైన భాష లో మనం చెప్పగలగాలి.  విదేశీయులు దానిని సులభం గా అర్ధం చేసుకోగలుగుతారు.  ఆరోగ్యకరమైన భూమి ని సృష్టించడానికి మనం మన సహకారాన్ని అందిద్దాము.
 
కరోనా సంక్షోభం ఏర్పడకపోతే.., జీవితం అంటే ఏమిటి?, జీవితం ఎందుకు ఉంది?, మన జీవనం ఎలా ఉంది? వంటి విషయాలు, బహుశా, ఇవి గుర్తు కు వచ్చేవే కాదు.  చాలా మంది మానసిక ఒత్తిడి కి ఇదే కారణం.  మరోవైపు, లాక్‌ డౌన్ కాలం లో జీవనానందంలోని చిన్న కోణాల ను ఎలా తిరిగి పొందారో ప్రజలు నాతో పంచుకున్నారు.  సాంప్రదాయకమైనటువంటి ఆటలు ఆడడం, కుటుంబం తో కలిసి గడపడం వంటి అనుభవాల ను చాలామంది వ్రాసి, నాకు పంపారు.

మిత్రులారా, మన దేశం లో గొప్ప వారసత్వ సాంప్రదాయక క్రీడ లు ఉన్నాయి. ఉదాహరణ కు, “పచీసీ” అనే ఆట ను గురించి మీరు విని ఉండవచ్చు.  దీని ని తమిళ నాడు లో ‘‘పల్లాన్గులీ’’ అని, కర్నాటక లో ‘‘అలి గులి మణె’’ అని, ఆంధ్ర ప్రదేశ్‌ లో ‘‘వామనగుంటలు’’ అనే పేరుల తో ఆడడం జరుగుతుంది.  ఇది ఒక రకమైన వ్యూహాత్మాక ఆట.  ఆట లో భాగం గా అనేక గుంట  లు ఉంటాయి. ఆ గుంటల లో దాచిన గుళిక లేదా విత్తనాన్ని ఆటగాళ్లు కనిపెట్టాలి.  ఈ ఆట దక్షిణ భారతదేశం నుండి ఆగ్నేయాసియా వరకు, తరువాత మిగిలిన ప్రపంచాని కి చేరిందని చెబుతారు.
 
మిత్రులారా, ఈ రోజు ప్రతి చిన్నారి కి ‘స్నేక్‌ అండ్‌ లాడర్‌’ ఆట ను గురించి తెలుసును.  కానీ, ఇది “మోక్షపథం” లేదా “పరమపదం” అని పిలిచే మరొక సాంప్రదాయకమైన భారతీయ ఆట అని మీకు తెలుసా?.  మన దేశం లో “గుట్టా” అని పిలువబడే మరొక సాంప్రదాయక క్రీడ కూడా ఉంది.  ఇది చిన్నాపెద్దా, అందరి లో, సమానం గా ఆదరణ ను పొందింది.  ఒకే పరిమాణం లో ఐదు చిన్న రాళ్ల ను పట్టుకోవడమే ఈ ఆట. ఒక రాయి ని గాలి లోకి విసరి, ఆ రాయి గాలి లో ఉన్నప్పుడే, నేల మీదున్న మిగిలిన రాళ్ల ను మీరు పట్టుకోవాలి.  సాధారణం గా మన దేశం లో ఇంటి ఆటల కు పెద్ద హంగామా అవసరం లేదు.  ఎవరో ఒకరు ఒక సుద్దముక్క ను గాని, లేదా రాయి ని గాని తీసుకు వస్తారు.  దానితో కొన్ని గీతల ను నేల మీద గీస్తారు.  ఇక ఆట ను ఆడడాని కి సిద్ధం గా ఉంది.  పాచిక లు అవసరమయ్యే ఈ తరహా ఆటల ను కాస్త సరళీకరించి, గవ్వల తోనో లేదా చింతపిక్కల తోనో ఆడుతున్నారు.
 
మిత్రులారా, ఈ రోజు న నేను ఈ ఆటల ను గురించి చెబుతున్నప్పుడు, మీలో చాలా మంది వారి బాల్య స్మృతుల లోకి వెళ్లారని నాకు తెలుసు.  మీరు ఆ రోజుల ను, ఆ ఆటల ను ఎందుకు మరచిపోయారు?  తాత, అమ్మమ్మ ల వంటి కుటుంబ పెద్దల కు నాదొక అభ్యర్థన.  అది- మీరు ఈ ఆటలను కొత్త తరానికి అప్పగించాలి- అనేదే.  మీరు కాకపోతే ఎవరు దీని ని చేస్తారు?.  ఇప్పుడు ఆన్‌ లైన్ అభ్యాస కాలం వచ్చింది. సమతౌల్యాన్ని సాధించడానికి, ఆన్‌ లైన్ ఆటల ను వదలించుకోవడానికి మన పిల్లల కోసం మనమే ముందుకు రావాలి.  ఇక్కడ స్టార్ట్- అప్ లకు, యువతరాని కి విభిన్నమైనటువంటి, బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి.

భారతీయ సంప్రదాయం ఇంటి ఆటల ను కొత్త రూపాల లో, ఆకర్షణీయమైన రూపాలలో, ఆవిష్కరిద్దాము. ఈ ఆటల కు వనరుల ను సమీకరించే వారు, పంపిణీదారులు, స్టార్టప్‌ రూపకర్తలు బాగా ప్రాచుర్యం పొందారు.  మన భారతీయ క్రీడ లు కూడా స్థానికమే అని గుర్తు పెట్టుకోవాలి.  మనం ఇప్పటికే ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అంటూ ప్రతిజ్ఞ చేశాము.  నా చిన్న, యువ స్నేహితులైన ప్రతి ఇంటి పిల్లల కు ఈ రోజు న నేను ఒక ప్రత్యేక అభ్యర్థన ను చేస్తున్నాను.  మీకు వీలు చిక్కినప్పుడు మీ తల్లిదండ్రుల ను మొబైల్‌ అడిగి తీసుకొని, మీ తాత, అవ్వ లు లేదా ఇంట్లో పెద్దవారి  ఇంటర్వ్యూ ను రికార్డ్ చేయండి. జర్నలిస్టు లు టీవీ చానల్స్ లో ఇంటర్వ్యూ లు చేసినట్లుగా, మీరు కూడా అటువంటి ఇంటర్వ్యూ చేసి, దానిని మొబైల్‌ లో రికార్డ్ చేయండి. పెద్దవారి ని ఎటువంటి ప్రశ్నల ను అడగాలో నేను కొన్ని సూచన లు ఇస్తాను.  చిన్నపిల్లలు గా ఉన్నప్పుడు వారి జీవనశైలి ఎలా ఉండేదీ అని అడగండి.  వారు ఏ ఆటల ను ఆడారు?, సినిమాల కు వెళ్ళారా?, సెలవుల్లో బంధువుల ఇంటి కి వెళ్లి ఉంటే, పొలాన్ని గాని లేదా గాదె ను గాని చూశారా?, పండుగల ను ఎలా జరుపుకొన్నారు?.. అడగడానికి ఇటువంటి ప్రశ్న లు చాలానే ఉన్నాయి.  పెద్దవారు కూడా 40, 50, 60 ఏళ్ల జీవితాన్ని గుర్తు చేసుకోవడాన్ని ఇష్టపడతారు.  ఆనాటి భారతదేశాన్ని గురించి తెలుసుకోవడం మీకు కూడా సంతోషాన్ని ఇస్తుంది.  ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతం అప్పట్లో ఎలా ఉంది?, సమీప ప్రాంతాలు ఎలా ఉన్నాయి?, అప్పటి ప్రజల ఆలోచన లు, ఆచారాలు ఏమేమిటి?.. ఈ విషయాల ను గురించి చాలా సులభం గా నేర్చుకోవచ్చును, తెలుసుకోవచ్చును.  ఈ ఇంటర్వ్యూ మంచి వీడియో ఆల్బమ్ గాను, కుటుంబాని కి అమూల్యమైన నిధి గాను మిగలవచ్చు.

మిత్రులారా, చరిత్ర యొక్క ఖచ్చితత్వాన్ని దగ్గర గా తెలుసుకోవడానికి ఆత్మకథ లేదా జీవిత చరిత్ర చాలా ఉపయోగకరమైన సాధనం.  మీరు మీ పెద్దల తో మాట్లాడుతున్నప్పుడు- వారి కాలం, వారి బాల్యం, మరి వారి యవ్వనంలోని పరిస్థితుల గురించి- అర్ధం చేసుకోగలుగుతారు.  వారి యొక్క పసితనం గురించి, వారి యొక్క కాలం గురించి ఇంట్లో పిల్లల కు వివరించడానికి పెద్దల కు ఇది ఒక అద్భుత అవకాశం.

మిత్రులారా, రుతుపవనాలు దేశం లోని చాలా ప్రాంతాల కు విస్తరించాయి.  వర్షాలు బాగా ఉంటే, మన రైతు లు అద్భుతమైన దిగుబడి ని పొందుతారు; మరి, ప్రకృతి కూడాను పచ్చ గా ఉంటుంది.  వర్ష కాలం లో ప్రకృతి తనను తాను చైతన్య పరుచుకొంటుంది.  మానవులు సహజ వనరుల ను దోపిడి చేస్తూవుంటే, వర్షాల సమయం లో ప్రకృతి వాటి ని తిరిగి సమకూర్చుతుంది.  మన మాతృభూమి కి రుణపడి, మన బాధ్యతల ను నిర్వర్తిస్తేనే పునఃసమీకరణ సాధ్యమవుతుంది. మనం చేసే చిన్న ప్రయత్నం, ప్రకృతి కి చాలా సాయపడుతుంది.  చాలా మంది భారతీయులు ఈ దిశ గా అసాధారణ ప్రయత్నాల ను చేస్తున్నారు.
 
కర్నాటక లోని మండావలీ లో 80-85 ఏళ్ల కామెగౌడ అనే వ్యక్తి ఉన్నారు.  కామెగౌడ ఒక సాధారణ రైతు.  అసాధారణ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.  కామెగౌడ తన పశువుల ను మేత కోసం తీసుకుపోతారు.  అవి గడ్డి ని తింటున్నప్పడు, ఆ ప్రాంతం లో కొత్త చెరువుల ను నిర్మించేందుకు ఆయన పూనుకున్నారు.  తన ప్రాంతం లో నీటి కొరత ను అధిగమించాలన్నది 85 ఏళ్ల కామెగౌడ లక్ష్యం.  అందుకే, నీటి నిల్వ కోసం చిన్న చెరువుల ను తవ్వే పనిలో పడ్డారు.  ఇప్పటివరకు, ఆయన 16 చెరువుల ను తవ్వేశారు.  ఆయన నిర్మించిన చెరువులు పెద్ద- పెద్ద వి కాకపోవచ్చు.  కానీ, ఆయన ప్రయత్నాలు చాలా పెద్ద వి.  ప్రస్తుతం, ఆ చెరువుల కారణం గా ఆ ప్రాంతానికి అంతటి కితా నవ జీవనం లభించింది.

మిత్రులారా, గుజరాత్‌ లోని వడోదరా కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉదాహరణ.  ఇక్కడ, జిల్లా యంత్రాంగం, స్థానికులు కలసి ఒక ఆసక్తికరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమం కారణం గా, నేడు వడోదరా లోని ఒక వేయి పాఠశాలల్లో వర్షపు నీటి సంరక్షణ జరుగుతోంది.  ఏటా సగటు న 100 మిలియన్ లీటర్ ల నీటి ని సంరక్షిస్తున్నారని అంచనా.

మిత్రులారా, ఈ వర్ష కాలం లో ప్రకృతి ని పరిరక్షించడానికి మనం కూడా చొరవ తీసుకోవాలి.  ఇక గణేశ్ చతుర్థి కి సన్నాహాలు మొదలవువుతాయి.  పర్యావరణ అనుకూల గణపతి విగ్రహాలను తయారుచేసి, వాటిని మాత్రమే పూజించడానికి ఈసారి మనం ప్రయత్నించగలమా?  నదుల లో, చెరువుల లో నిమజ్జనం అనంతరం నీటి కి, జలచరాల కు ప్రమాదకరం గా మారే విగ్రహాల ఆరాధన ను మనం వదులుకుందామా?  నా పిలుపునకు మీరు స్పందిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను.  రుతుపవనాల తో వచ్చే వ్యాధుల నుండి మనం జాగ్రత్త గా ఉండాలి.  కరోనా మహమ్మారి కాలం లో, ఈ వ్యాధుల బారి నుండి కూడా మనల్ని మనం రక్షించుకోవాలి.  ఆరోగ్యం గా ఉండడానికి ఆయుర్వేద మందుల ను, మూలిక కషాయాలను, వేడి నీటి ని తీసుకోవాలి.
 
నా ప్రియమైన దేశవాసులారా, ఈ రోజు జూన్ 28 వ తేదీ న, క్లిష్ట కాలం లో దేశాన్ని గట్టెక్కించిన పూర్వ ప్రధానుల లో ఒకరికి భారతదేశం శ్రద్ధాంజలి ని ఘటించింది.  ఈ రోజు మన మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు గారి శత జయంతి సంవత్సరం ప్రారంభమైంది.  శ్రీ పి.వి.నరసింహారావు గారి గురించి మనం మాట్లాడేటప్పుడు, సహజంగానే మనకు కనిపించే ఆయన చిత్రం ఒక రాజకీయ నాయకుడి ది.  కానీ ఆయన బహుభాషా కోవిదుడు అన్నది కూడా నిజం.  ఆయన అనేక భారతీయ భాషల ను, విదేశీ భాషల ను మాట్లాడే వారు.  భారతీయ విలువల ను ఆయన జీర్ణించుకున్నారు.  వారి కి పాశ్చాత్య సాహిత్యం లో, విజ్ఞాన శాస్త్రంపైనా పరిజ్ఞానం ఉంది.  పి.వి. నరసింహా రావు భారతదేశం లోని అత్యంత అనుభవజ్ఞ నాయకుల లో ఒకరు.  ఆయన జీవితం లో మనం తెలుసుకోవలసిన మరో గొప్ప కోణం కూడా ఉంది.  మిత్రులారా, నరసింహా రావు వారి యొక్క యవ్వన దశ లోనే స్వాతంత్ర్య ఉద్యమం లో చేరిపోయారు.  వందే మాతరమ్ పాడటానికి హైదరాబాద్ నిజాం నవాబు అనుమతి ని నిరాకరించినప్పుడు, నిజాంకు వ్యతిరేకం గా సాగిన ఉద్యమం లో చురుకు గా పాల్గొన్నారు.  ఆ కాలం లో పి.వి. గారి వయస్సు 17 ఏళ్లే.  అన్యాయాని కి వ్యతిరేకం గా గొంతెత్తడానికి  చిన్నప్పటి శ్రీమాన్ నరసింహా రావు ఎప్పుడూ ముందున్నారు.  నరసింహారావు గారు చరిత్ర ను కూడా బాగా అర్ధం చేసుకున్నారు.  చాలా సాధారణమైన నేపథ్యం నుండి ఆయన ఎదిగారు.  విద్య పై ఆయనకు ఉన్న ప్రేమ, నేర్చుకోవాలనే తాపత్రయం, నాయకత్వ సామర్థ్యం.. ఇవి అన్నీ కూడాను చిరస్మరణీయమైనవి. నరసింహా రావు గారి శత జయంతి సంవత్సరం లో మనందరం ఉన్నాము.  ఆయన జీవితాన్ని గురించి మరియు ఆయన యొక్క ఆలోచన ల ను గురించి వీలయినంత ఎక్కువ గా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని నేను మిమ్ములను అభ్యర్థిస్తున్నాను.  నేను, మరొక్క సారి ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను.

నా ప్రియమైన దేశవాసులారా, ఈ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) లో చాలా విషయాలపైన చర్చించాము.  వచ్చే ‘మన్‌ కీ బాత్‌’ (మనసు లో మాట) లో మరిన్ని కొత్త విషయాల పై సాగుతుంది.  మీరు, మీ యొక్క సందేశాలను, వినూత్న మైనటువంటి ఆలోచనల ను నాకు పంపడాన్ని కొనసాగించాలి. మనమందరం కలసి ముందుకు సాగుదాము.  నేను ప్రారంభం లో చెప్పినట్లుగా, రాబోయే రోజులు మరింత సానుకూలం గా ఉంటాయి.  ఈ ఒక్క సంవత్సరం లో మాత్రమే మనం మెరుగ్గా రాణించడం కాదు, అదే స్థాయి ని ఆ తరువాత కూడా కొనసాగించాలి.  దీనివల్ల దేశం అత్యున్నత శిఖరాల కు చేరుకొంటుంది.  ఈ దశాబ్దం లోనే, 2020 వ సంవత్సరం, భారతదేశాని కి కొత్త మార్గాన్ని చూపుతుందన్న నమ్మకం నాలో ఉంది.  ఈ భరోసా తో, మీరు కూడా ముందంజ వేయండి; ఆరోగ్యం గా ఉండండి; సానుకూలం గా ఆలోచించండి.  ఈ శుభకామనల తో, మీకు అందరికి అనేకానేక ధన్యవాదములు. 

నమస్కారం.

**