నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. ఈ రోజు, జూలై 26 వ తేదీ, ఇది ఒక చాలా ప్రత్యేకమైనటువంటి దినం. ‘కర్ గిల్ విజయ్ దివస్’ ఈనాడే. 21 సంవత్సరాల క్రితం ఇదే రోజు న, మన సైన్యం కర్ గిల్ యుద్ధం లో విజయ పతాక ను ఎగురవేసింది. మిత్రులారా, ఎటువంటి పరిస్థితుల లో కర్ గిల్ యుద్ధం చోటుచేసుకొందో భారతదేశం ఎన్నటికీ మరచిపోజాలదు. భారతదేశ భూ భాగాన్ని దురాక్రమణ చేయాలనే భ్రమల ను పాకిస్తాన్ మనస్సు లో ఉంచుకొని, అక్కడి అంతర్గత కలహాల నుండి ప్రజల దృష్టి ని మళ్ళించడానికి ఈ యొక్క దుస్సాహసాన్ని ఆరంభించింది. అప్పట్లో భారతదేశం పాకిస్తాన్‌తో సత్సంబంధాల ను పెంచుకొనే ప్రక్రియ లో నిమగ్నమైంది. అయితే
‘‘బయరూ అకారన్ సబ్ కాహూ సోం
జో కర్ హిత్ అనహిత్ తాహూ సోం’’
అని అన్నారు కదా.
ఈ మాటల కు – దుర్మార్గుల కు ప్రతి ఒక్కరి తో అకారణం గానే శత్రుత్వం ఏర్పరచుకోవడం స్వాభావికం గానే అబ్బుతుంది – అని భావం.
అటువంటి స్వభావం గల వ్యక్తులు వారి హితవు కోరే వారికి కూడా నష్టం కలిగించేందుకు ఆలోచిస్తారు. అందుకే భారత స్నేహాని కి ప్రతిస్పందన గా పాకిస్తాన్ దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ తరువాత భారతదేశ పరాక్రమాన్ని సైన్యం రుచి చూపించింది. మన సైన్య పరాక్రమాన్ని ప్రపంచం కూడా చూసింది. మీరు అనుకోవచ్చు – ఎత్తైన పర్వతాలపై కూర్చున్న శత్రువుల కు క్రింద నుండి పోరాడిన మన సైన్యాలు ఎలా జవాబు చెప్పగలిగాయి అని. అయితే విజయం పర్వత ఎత్తుల లో లేదు.. భారత సైనిక దళాల ధైర్యం, వాస్తవమైన శౌర్యం లో ఉంది. మిత్రులారా, ఆ సమయం లో నేను కర్ గిల్ కు వెళ్లి, మన సైనికుల శౌర్యాన్ని చూసే అదృష్టాన్ని కూడా పొందాను. ఆ రోజు నా జీవితం లో అత్యంత విలువైన క్షణాల్లో ఒకటి. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు కర్ గిల్ విజయాన్ని గుర్తుకు తెచ్చుకొంటున్నారు. సోశల్ మీడియా లో #courageinkargil అనే హ్యాష్‌ట్యాగ్ తో ప్రజలు వారి యొక్క కథానాయకుల కు నమస్కరిస్తూ, మరణించిన వారికి నివాళి అర్పిస్తున్నారు. నేను ఈ రోజు దేశం లోని ప్రజలందరి తరపున మన ఈ వీర సైనికులతో పాటు, భారత మాత నిజమైన కుమారులకు జన్మనిచ్చిన వీరనారీమణులైన వారి తల్లులకు కూడా నమస్కరిస్తున్నాను.
కర్ గిల్ విజయం తో సంబంధం ఉన్న మన వీర సైనికుల కథల తో పాటు వారి తల్లుల త్యాగాన్ని గురించి యువతీయువకులు ఒకరితో మరొకరు పంచుకోవాలని నేను కోరుతున్నాను. మిత్రులారా, ఈ రోజు న నేను మిమ్ములను ఒకటి అభ్యర్థిస్తున్నాను. www.gallantryawards.gov.in అనే వెబ్సైట్ ఉంది. మీరు ఆ వెబ్ సైట్ ను తప్పక సందర్శించాలి. మన ధైర్యవంతులైన మరియు శక్తివంతమైన యోధుల ను గురించి, వారి శక్తి ని గురించి అక్కడ మీకు చాలా సమాచారం లభిస్తుంది. ఆ సమాచారాన్ని మీరు మీ సహచరుల తో చర్చించినప్పుడు అది వారికి కూడాను ప్రేరణ లభించేందుకు ఒక కారణం అవుతుంది. మీరు ఈ వెబ్సైట్ ను తప్పక సందర్శించాలి. మళ్ళీ మళ్ళీ ఆ వెబ్ సైట్ ను దర్శించండి.
మిత్రులారా, కర్ గిల్ యుద్ధం కాలం లో అటల్ గారు ఎర్ర కోట నుండి ఇచ్చిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవడం ఈ రోజు న చాలా సందర్భోచితం. అటల్ జీ అప్పుడు గాంధీ గారు పేర్కొన్న సూత్రాలలో ఒక సూత్రాన్ని దేశాని కి గుర్తు చేశారు. మహాత్మ గాంధీ సూత్రం ఏమిటంటే ఎవరికైనా ఏదైనా పని చేయాలా వద్దా అనే విషయం లో ఎప్పుడైనా గందరగోళం ఉంటే అతను భారతదేశపు అత్యంత నిరు పేద నిస్సహాయ వ్యక్తి ని గురించి ఆలోచించాలి అనేదే. అతను చేయబోయే కార్యం ఆ వ్యక్తి కి మంచిది కాదా అని అతను అనుకోవాలి. గాంధీ జీ యొక్క ఈ ఆలోచన ను మించి కర్ గిల్ యుద్ధం మనకు రెండో సూత్రాన్ని కూడా చెప్తోందని అటల్ గారు అన్నారు. ఈ సూత్రం ఏమిటంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకొనే ముందు అటువంటి నిర్ణయం ఆ యొక్క దుర్గమమైన కొండల లో తన జీవితాన్ని త్యాగం చేసిన సైనికుడి గౌరవానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి అనేది అటల్ గారి అభిప్రాయం. అటల్ గారు పేర్కొన్న ఈ స్ఫూర్తి ని ఆయన స్వరం లోనే విందాం.
అటల్ జీ యొక్క సౌండ్ బైట్ –
‘‘గాంధీజీ ఒక సూత్రం పేర్కొన్నారని మనందరికీ గుర్తుంది. మహాత్మ గాంధీ సూత్రం ఏమిటంటే ఎవరికైనా ఏదైనా పని చేయాలా వద్దా అనే విషయం లో ఎప్పుడైనా గందరగోళం ఉంటే అతను భారతదేశపు అత్యంత నిరు పేద నిస్సహాయ వ్యక్తి ని గురించి ఆలోచించాలి. అతను చేయబోయే కార్యం ఆ వ్యక్తి కి మంచిది కాదా అని అతను అనుకోవాలి. కర్ గిల్ యుద్ధం మనకు రెండో సూత్రాన్ని కూడా చెప్తోంది. ఈ సూత్రం ఏమిటంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం దుర్గమమైన కొండలలో తన జీవితాన్ని త్యాగం చేసిన సైనికుడి గౌరవానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి..’’
మిత్రులారా, యుద్ధం జరిగినప్పుడు మనం చెప్పే విషయాలు, మన చర్యలు సరిహద్దు లోని సైనికుడి ధైర్యం పై, అతని కుటుంబ మనో బలం పై చాలా బలమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. దీనిని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. అందుకే మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన ప్రసంగాలు, మన ప్రకటనలు, మన గౌరవం, మన లక్ష్యాలు.. అన్నీ.. సైనికుల మనోధైర్యాన్ని పెంచేవిగా ఉండాలి. వారి గౌరవాన్ని పెంచాలి. అత్యున్నతమైన ఏకత బంధం లో కట్టుబడి ఉన్న దేశవాసులు మన సైనికుల బలాన్ని అనేక వేల రెట్లు పెంచుతారు. ఈ కాలం లో సంఘ శక్తే బలమన్న లోకోక్తి ఉంది కదా.
కొన్నిసర్లు మన దేశానికి చాలా హాని కలిగించే ఇటువంటి విషయాలను అర్థం చేసుకోకుండా సోశల్ మీడియా లో కొన్ని విషయాల ను ప్రోత్సహిస్తాం. కొన్నిసర్లు ఇటువంటి వాటిని ఫార్వర్డ్ చేస్తూంటాం. చేస్తూనే ఉంటాం. ఈ రోజులలో యుద్ధాలు కేవలం సరిహద్దులలో మాత్రమే జరగవు. అవి దేశం లోని వివిధ రంగాల లో ఒకేసారి జరుగుతాయి. ప్రతి పౌరుడు అందులో తన పాత్ర ను నిర్ణయించుకోవాలి. దేశ సరిహద్దుల లో క్లిష్ట పరిస్థితుల లో పోరాడుతున్న సైనికుల ను గుర్తు చేసుకుంటూ మన పాత్ర ను కూడా నిర్ణయించుకోవాలి.
నా ప్రియమైన దేశవాసులారా, గత కొన్ని నెలలు గా కరోనాతో యావత్తు దేశం ఐక్యం గా పోరాడిన విధానం చాలా భయాల ను తప్పు గా నిరూపించింది. ఈ రోజు న మన దేశంలో రోగనివృత్తి సూచి ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉంది. అలాగే, మన దేశం లో కరోనా మరణాల సూచి కూడా ప్రపంచం లోని చాలా దేశాల కంటే చాలా తక్కువ గా ఉంది. ఒక్క వ్యక్తి ని అయినా కోల్పోవడమన్నది విచారకరం. అయితే లక్షలాది దేశవాసుల ప్రాణాల ను రక్షించడం లో భారతదేశం విజయం సాధించింది. కానీ మిత్రులారా, కరోనా ముప్పు తొలగిపోలేదు. ఇది చాలా చోట్ల వేగం గా వ్యాపిస్తోంది. మనం చాలా అప్రమత్తం గా ఉండాలి. కరోనా మొదట్లో ఉన్నంత ఘోరం గానే ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మనం పూర్తి జాగ్రత్తల ను తీసుకోవాలి. ముఖానికి మాస్క్ ను ధరించడం, రెండు గజాల దూరం, తరచు గా చేతుల ను కడుక్కుంటూ ఉండడం, సర్వజనిక ప్రదేశాల లో ఉమ్మి వేయకపోవడం, శుభ్రత ను గురించి పూర్తి గా జాగ్రత్త వహించడం- ఇవి కరోనా బారి న పడకుండా మనలను మనం రక్షించుకోవడం లో మన యొక్క ఆయుధాలు గా పనిచేయగలవు. కొన్నిసర్లు మనకు మాస్క్ తో ఇబ్బంది ఉంటుంది; ముఖం నుండి మాస్కు ను తొలగించాలని అనిపిస్తుంది; అప్పుడే ముచ్చట్లు పెడుతూ ఉంటాము. మాస్క్ ను మరింత అవసరమైనప్పుడే తొలగిద్దాము. మాస్క్ కారణం గా మీకు ఇబ్బంది ఎదురైనప్పుడల్లా.. ఒక్క క్షణం.. ఆ వైద్యులను గుర్తు తెచ్చుకోండి; ఆ నర్సుల ను గుర్తు తెచ్చుకోండి; ఆ కరోనా వారియర్స్ ను గుర్తు తెచ్చుకోండి- గంటల తరబడి నిరంతరం మాస్క్ ను ధరించి, అందరి ప్రాణాల ను కాపాడడానికి వాళ్ళు చేసే కృషి ని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఎనిమిది నుండి పది గంటల పాటు మాస్క్ ను ధరిస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడడం లేదా? వారిని కొంచెం గుర్తు తెచ్చుకోండి. నాగరికులు గా మనం మాస్క్ ను తీసివేయకూడదు. మరొకరి ని తీసివేయనీయ కూడదు. ఒక ప్రక్కన మనం పూర్తి అప్రమత్తత తో కరోనా తో పోరాడాలి. మరో ప్రక్కన మనం చేసే వ్యవసాయం, ఉద్యోగం, చదువు.. మనం చేసే ఏ పని లో అయినా సరే, వేగాన్ని సాధించాలి. మిత్రులారా, కరోనా కాలం లో మన గ్రామీణ ప్రాంతాలు యావత్తు దేశాని కి దిశానిర్దేశం చేశాయి. పౌరులు, గ్రామ పంచాయతీ లు చేసిన కృషి వివరాలు, వారి ప్రయత్నాల వివరాలు గ్రామాల నుండి నిరంతరం వస్తున్నాయి. జమ్ము లో త్రేవా అనే గ్రామ పంచాయతీ ఉంది. బల్ బీర్ కౌర్ గారు అక్కడి సర్పంచ్. బల్ బీర్ కౌర్ గారు తన పంచాయతీ లో 30 పడకల క్వారన్టీన్ కేంద్రాన్ని నిర్మించారని నాకు తెలిసింది. పంచాయతీ కి వచ్చే మార్గాల లో నీటి కోసం ఏర్పాట్లు చేశారు. చేతులు కడుక్కోవడం లో ప్రజల కు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఏర్పాట్లు చేశారు. ఇది మాత్రమే కాదు, బల్ బీర్ కౌర్ గారు స్వయం గా, భుజం మీద వేలాడుతున్న స్ప్రే పంపు తో, స్వచ్ఛంద సేవకుల తో కలసి, మొత్తం పంచాయతీ లో, చుట్టుపక్కల ప్రాంతాల లో శానిటైజేషన్ కూడా చేస్తారు. అటువంటి మరో కశ్మీరీ మహిళ సర్పంచ్ విషయం కూడా చెప్తాను. గాందర్ బల్ లోని చౌంట్ లీవార్ గ్రామానికి చెందిన జైతూనా బేగమ్. తన పంచాయతీ కరోనా తో యుద్ధం చేయాలి, అలా యుద్ధం చేస్తూనే సంపాదించడానికి అవకాశాలను కూడా ఏర్పరచాలి అని జైతూనా బేగమ్ నిర్ణయించుకొన్నారు. ఆ ప్రాంతం అంతటా మాస్కుల ను, రేశన్ ను ఉచితం గా పంపిణీ చేశారు ఆవిడ. ప్రజల కు వివిధ పంటల కు సంబంధించిన విత్తనాలతో పాటు ఆపిల్ మొక్కల విత్తనాలను కూడా ఆమె ఇచ్చారు. తద్ద్వారా ప్రజలు వ్యవసాయం లో, తోటపనుల లో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూశారు.
మిత్రులారా, కశ్మీర్ నుండి వచ్చిన మరో ఉత్తేజకరమైన సంఘటన ను గురించి చెప్తాను. అనంతనాగ్ లోని మ్యూనిసిపల్ ప్రెసిడెంటు శ్రీ మొహమ్మద్ ఇక్ బాల్ గారి కి సంబంధించిన సంఘటన ఇది. ఆ ప్రాంతం లో శానిటైజేశన్ కోసం ఒక స్ప్రేయర్ అవసరం. యంత్రాన్ని మరొక నగరం నుండి తీసుకురావలసి ఉంటుందని, ఖర్చు ఆరు లక్షల రూపాయలు అవుతుందని ఆయన తెలుసుకున్నారు. అప్పుడు ఇక్ బాల్ గారు స్వయం గా ప్రయత్నించి, ఒక స్ప్రేయర్ యంత్రాన్ని తయారుచేశారు. అది కూడా కేవలం యాభై వేల రూపాయల డబ్బు తో . ఇటువంటి ఉదాహరణ లు ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి అనేక ఉత్తేజకరమైన సంఘటన లు ప్రతి రోజూ దేశం లోని ప్రతి మూల నుండీ ముందుకు వస్తున్నాయి. వారందరూ శుభాకాంక్షలు అందుకునేందుకు అర్హులు. సవాలు ఎదురైంది. కానీ ప్రజలు అంతే బలం తో దానిని ఎదుర్కొన్నారు.
నా ప్రియమైన దేశ వాసులారా, విపత్తు ను అవకాశం గా, విపత్తు ను అభివృద్ధి గా మార్చడం లో సరైన సానుకూల విధానం తో ఉండడం సహాయపడుతుంది. ప్రస్తుతం కరోనా సమయం లో మన దేశం లోని యువత, మహిళలు వారి వారి ప్రతిభ తోను, నైపుణ్య శక్తి తోను కొన్ని కొత్త ప్రయోగాల ను ఎలా ప్రారంభించారో కూడా చూస్తున్నాము. బిహార్ లోని చాలా మహిళా స్వయం సహాయక సమూహాలు మధుబనీ పెయింటింగ్ తో కూడిన మాస్కుల ను తయారు చేయడం ప్రారంభించాయి. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ మధుబనీ మాస్కులు తమ సంప్రదాయాన్ని ఒక విధం గా ప్రచారం చేస్తాయి. ప్రజల కు ఆరోగ్యం తో పాటు ఉపాధి ని కూడా అందజేస్తాయి. ఈశాన్యం లో వెదురు ఎంత సమృద్ధి గా లభిస్తుందో మీకు తెలుసు. ఇప్పుడు ఈ వెదురు నుండి త్రిపుర, మణిపుర్, అసమ్ ల కళాకారులు అధిక నాణ్యత కలిగినటువంటి నీటి సీసాల ను, టిఫిన్ డబ్బాల ను తయారు చేయడం మొదలుపెట్టారు. మీరు వాటి నాణ్యత ను చూస్తే ఆశ్చర్యపోతారు. వెదురు తో అంత చక్కటి సీసా లు తయారయ్యాయంటే మీరు నమ్మరు. ఈ సీసా లు పర్యావరణ పరంగా అనుకూలమైనవి. వాటి తయారీ లో వెదురు ను మొదట వేప మొక్కల తోను, ఇతర ఔషధ మొక్కల తోను ఉడకబెట్టడం జరుగుతుంది. దీని వల్ల ఔషధ గుణాలు కూడా వాటి కి వస్తాయి.
చిన్న చిన్న స్థానిక ఉత్పత్తులు గొప్ప విజయాన్ని ఎలా ఇస్తాయో చెప్పేందుకు ఝార్ ఖండ్ కూడా ఒక ఉదాహరణ గా నిలుస్తుంది. ఝార్ ఖండ్ లోని బిషున్ పుర్ లో 30 కి పైగా సమూహాలు ఉమ్మడి గా లెమన్ గ్రాస్ ను సాగు చేస్తున్నాయి. ఈ నిమ్మకాయ గడ్డి నాలుగు నెలల్లో తయారవుతుంది. దాని నూనె ను మంచి ధరల కు బజారు లో విక్రయిస్తారు. ఈ కాలం లో దీనికి చాలా డిమాండ్ ఉంది. నేను దేశం లోని మరో రెండు ప్రాంతాల ను గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రెండూ ఒకదానిరి మరొకటి వందల కిలోమీటర్ల దూరం లో ఉన్నాయి. భారతదేశాన్ని స్వావలంబన దిశ గా తీసుకుపోయేందుకు వివిధ మార్గాల లో కృషి చేస్తున్నాయి. వాటిలో ఒకటి లద్దాఖ్, మరొకటి కచ్ఛ్. లేహ్ మరియు లద్దాఖ్ ల పేర్లు వింటే అందమైన మైదానాలు, ఎత్తైన పర్వతాల దృశ్యాలు మన ముందు కనబడతాయి. స్వచ్ఛమైన గాలి అందించే శ్వాస ను అనుభూతి చెందుతాము. అదే సమయంలో కచ్ఛ్ పేరు చెప్తే సుదూరంగా ఉండే ఎడారి, కనుచూపు మేరలో చెట్లు, మొక్కలు కూడా కనబడని ప్రాంతం మన కళ్ల ముందు కనబడుతుంది. లద్దాఖ్ లో పండే ఎప్రికాట్ పండు ప్రత్యేకమైనది. ఈ పంట కు ఆ ప్రాంత ఆర్ధిక వ్యవస్థ ను మార్చే సామర్థ్యం ఉంది. కానీ, ఇది సరఫరా చేసే క్రమం లో అనేక సవాళ్ల తో ముడిపడి ఉంది. దాని సరఫరా లో వ్యర్థాల ను తగ్గించడానికి ఒక నూతన ఆవిష్కరణ ను ఉపయోగించడం ప్రారంభించారు. దాన్నే సోలర్ ఎప్రికాట్ డ్రయర్ ఎండ్ స్పేస్ హీటర్ అంటారు. ఇది ఎప్రికాట్ పండు తో పాటు ఇతర పండ్లను, కూరగాయల ను కూడా ఆరబెడుతుంది. ఇది చాలా పరిశుభ్రమైన పద్దతి. గతం లో పొలాల దగ్గర ఈ ఎప్రికాట్ లను ఎండబెట్టే పరిస్థితుల లో వృథా ఎక్కువ అయ్యేది. దుమ్ము, ధూళి, వర్షపు నీరు ల కారణం గా పండ్ల నాణ్యత కూడా ప్రభావితమయ్యేది. మరోవైపు, ఈ రోజుల్లో కచ్ఛ్ లోని రైతులు డ్రాగన్ ఫ్రూట్స్ ను పండించడానికి ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది విన్నప్పుడు ఆశ్చర్యపోతారు – కచ్ఛ్ లో డ్రాగన్ ఫ్రూట్స్ ను గురించి చెప్తే చాలా మంది ఆశ్చర్య పోతారు. కానీ, అక్కడ నేడు చాలా మంది రైతులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. పండ్ల నాణ్యత ను పెంచడం, తక్కువ భూమి లో ఎక్కువ పంట ను పండించడం మొదలుకొని అనేక ఆవిష్కరణ లు జరుగుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కు ప్రజాదరణ నిరంతరం పెరుగుతోందని నాకు చెప్పారు. ముఖ్యం గా అల్పాహారం లో దీని వాడకం గణనీయం గా పెరిగింది. దేశం డ్రాగన్ ఫ్రూట్స్ ను దిగుమతి చేసుకోకూడదని కచ్ఛ్ రైతులు సంకల్పించారు. ఇది స్వయం సమృద్ధి కి సంబంధించిన విషయం.
మిత్రులారా, మనం వినూత్నం గా ఆలోచించినప్పుడు ఎవరూ ఊహించని పనులు కూడా సాధ్యమవుతాయి, ఉదాహరణ కు బిహార్ లోని కొంతమంది యువకుల కృషి ని గమనిద్దాము. వారు అంతకుముందు సాధారణ ఉద్యోగాలు చేసే వారు. ఒక రోజు వారు ముత్యాల ను పండించాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రాంతం లో ప్రజల కు దీని గురించి పెద్ద గా తెలియదు. దాంతో వారు మొదట సమాచారాన్ని సేకరించారు. జయపుర్ కు, భువనేశ్వర్ కు వెళ్లి శిక్షణ తీసుకొన్నారు. తమ గ్రామంలోనే ముత్యాల సాగు ను ఆరంభించారు. నేడు వారు దీని నుండి చాలా సంపాదిస్తున్నారు. వారు ముజఫ్ఫర్ పుర్, బెగూసరాయ్, పట్ నా లో ఇతర రాష్ట్రాల నుండి తిరిగి వచ్చిన ప్రవాసీ శ్రమికుల కు శిక్షణ నివ్వడం మొదలుపెట్టారు. చాలా మందికి ఇది స్వావలంబన కు దారుల ను తెరచింది.
మిత్రులారా, కొద్ది రోజుల తరువాత రక్షాబంధన్ పర్వదినం వస్తోంది. చాలా మంది ప్రజలు, సంస్థలు ఈసారి రక్షాబంధన్ ను వైవిధ్యం గా జరుపుకోవాలని ప్రచారం చేయడాన్ని నేను గమనిస్తున్నాను. చాలా మంది దీనిని స్థానిక ఉత్పత్తుల ప్రచారానికి అనుసంధానిస్తున్నారు. ఇది నిజం. మన పండుగ, మన సమాజం. మన ఇంటికి సమీపంలో ఉన్న వ్యక్తి వ్యాపారం పెరగాలి. తద్వారా వారికి కూడా పండుగ సంతోషం గా ఉంటుంది. అప్పుడు, పండుగ ఆనందం విభిన్నం గా ఉంటుంది. దేశ రక్షా బంధన్ సందర్భం లో ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
మిత్రులారా, ఆగస్టు 7వ తేదీ న జాతీయ చేనేత దినోత్సవం. భారత హస్తకళ కు వందల సంవత్సరాల అద్భుతమైన చరిత్ర ఉంది. చేనేత ను, హస్తకళ ను భారతీయులు వీలైనంత ఎక్కువ గా ఉపయోగించాలని మనందరం ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా భారతదేశం యొక్క చేనేత గురించి, భారతదేశం యొక్క హస్తకళల ను గురించి మనం వీలైనంత ఎక్కువ మంది కి ప్రచారం చేయాలి. ఈ కళల్లో చాలా వైవిధ్యం ఉంది. ఈ విషయాన్ని ఎంతగా ప్రచారం చేస్తే మన స్థానిక చేతివృత్తుల వారు, చేనేత కార్మికులు అంతగా ప్రయోజనాలను పొందుతారు.
మిత్రులారా, ముఖ్యంగా నా యువ స్నేహితులారా, మన దేశం మారుతోంది. ఎలా మారుతోంది? ఎంత వేగం గా మారుతోంది? ఏ రంగాల లో ఎంత వేగం గా మార్పు చోటు చేసుకొంటోంది? దానిని సానుకూల దృష్టి తో చూస్తే, మనమే ఆశ్చర్యపోతాం. గతం లో క్రీడల తో పాటు ఇతర రంగాల ను పరిశీలిస్తే ఆ రంగాల లో చాలా మంది వ్యక్తులు పెద్ద నగరాల నుండి, పెద్ద కుటుంబాల నుండి లేదా ప్రసిద్ధ పాఠశాలల నుండి లేదా కళాశాలల నుండి వచ్చే వారు. ఇప్పుడు దేశం మారుతోంది. మన యువత గ్రామాల నుండి, చిన్న పట్టణాల నుండి, సాధారణ కుటుంబాల నుండి ముందుకు వస్తున్నారు. విజయాలు సాధిస్తున్నారు. తమ కొత్త కలల ను కొనసాగిస్తూ, సంక్షోభాల మధ్య ముందుకు సాగుతున్నారు. ఇటీవల వచ్చిన బోర్డు పరీక్షల ఫలితాలలో ఇటువంటిదే మనకు కనిపిస్తుంది. ఈ రోజు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం అటువంటి ప్రతిభావంతులైన పిల్లల తో మాట్లాడుతున్నాము. కృతికా నాందల్ అటువంటి ప్రతిభాశాలి పుత్రిక. కృతికా గారు హరియాణా లో పానీపత్ కు చెందిన వారు.
మోదీ గారు – హలో.. కృతికా గారు నమస్తే.
కృతికా- నమస్తే సర్.
మోదీ గారు – ఇంత మంచి ఫలితం వచ్చినందుకు మీకు చాలా అభినందనలు.
కృతికా – ధన్యవాదాలు సర్.
మోదీ గారు – ఈ రోజుల్లో టెలిఫోన్ కాల్స్ తో మీరు అలసి పోయి ఉంటారు. చాలా మంది నుండి ఫోన్లు వచ్చి ఉంటాయి.
కృతికా – అవును సర్.
మోదీ గారు – అభినందించే వారికి కూడాను, వారు సైతం గర్వపడుతూ ఉండి ఉంటారనుకుంటాను ఎందుకంటే వారు మిమ్ములను ఎరుగుదురు అని. మీకు ఎలా వుంది.
కృతికా – సర్.. చాలా బాగుంది. తల్లితండ్రులు గర్వపడేటట్టు చేయడం స్వయం గా నాకూ గర్వం గానే ఉంది.
మోదీ గారు – మంచిది, ఇది చెప్పండి మీకు ఎక్కువ ప్రేరణనిచ్చింది ఎవరంటారు
కృతికా – సర్! మా అమ్మయే క దా నాకు పెద్ద ప్రేరణ మూర్తి.
మోదీ గారు – భలే. సరే, మీరు మీ అమ్మ గారి వద్ద నుండి నేర్చుకొంటున్నదేమిటి?
కృతికా – సర్, ఆమె జీవితం లో చాలా ఇబ్బందుల ను చూశారు. అయినప్పటికీ ఆమె ఇంత ధైర్యం గాను, ఇంత బలం గాను ఉన్నారు, సర్. ఆమె ను చూసి చూసి ఎంత ప్రేరణ లభిస్తుంది అంటే నేను కూడా ఆమె లాగానే తయారు కావాలన్నంతగా.
మోదీ గారు – మీ అమ్మ గారు ఎంత వరకు చదువుకున్నారు.
కృతికా – సర్, బి.ఎ. చదివారు ఆమె.
మోదీ గారు – బిఎ చదివారా?
కృతికా – అవును సర్.
మోదీ గారు – సరే. మరి, మీ అమ్మగారు మీకు నేర్పిస్తారు కూడానా.
కృతికా – అవును సర్. నేర్పిస్తారు. లోకం పోకడ ను గురించిన ప్రతి విషయాన్ని ఆవిడ చెబుతుంటారు.
మోదీ గారు – ఆమె మందలిస్తూ ఉంటారు కూడా అనుకుంటాను.
కృతికా – అవును సర్.. ఆమె మందలిస్తారు కూడాను.
మోదీ గారు – మంచిదమ్మా.. మీరు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు?
కృతికా – సర్. నాకు డాక్టర్ అవ్వాలనుంది.
మోదీ గారు – ఓహ్.. !
కృతికా – ఎమ్ బిబిఎస్ చదవాలని.
మోదీ గారు – చూడండి.. డాక్టర్ అవ్వడం అంత తేలికైన పని కాదు!
కృతికా – అవును సర్.
మోదీ గారు – మీరు చాలా చురుకైన వారు కాబట్టి డిగ్రీ అయితే సంపాదించేయగలుగుతారు. కానీ తల్లీ, డాక్టర్ యొక్క జీవనం అది, సమాజం కోసం సమర్పణ కావలసివుంటుంది.
కృతికా – అవును సర్.
మోదీ గారు – ఒక డాక్టరు ఒక్కొక్క సారి రాత్రి పూట ప్రశాంతం గా నిదురించనైనే లేరు. ఒక్కొక్క సారి రోగి వద్ద నుండి ఫోన్ వచ్చేస్తుంది. మరొక్క మారు ఆసుపత్రి నుండి ఫోన్ చేస్తారు. మరి పరుగెత్తవలసివస్తుంది. అంటే ఒక విధం గా ప్రతి రోజూ 24 గంటలూ.. మూడు వందల అరవై ఐదు రోజులూ విధి నిర్వహణే నన్నమాట. ఒక డాక్టర్ యొక్క జీవనం ప్రజల సేవలోనే గడపవలసి ఉంటుంది.
కృతికా – యస్ సర్.
మోదీ గారు – మరి ప్రమాదమూ ఉంటుంది. ఎందుకంటే.. ఒక్కొక్క సారి తెలియదు, ఇవాళ రేపు ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి అంటే డాక్టర్ల ముందు కూడా చాలా పెద్ద సంకటం వచ్చి నిల్చుంటుంది.
కృతికా – మరే, సర్.
మోదీ గారు – సరి కృతికా, హరియాణా అయితే ఆటపాటల్లో యావత్తు భారతదేశానికే ఎల్లప్పుడూ ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చే రాష్ట్రం గా ఉంది కద.
కృతికా – అవును సర్.
మోదీ గారు – అయితే మరి మీరు కూడా ఏదైనా క్రీడల లో పాల్గొంటూ ఉంటారా?, ఏవైనా ఆటలంటే మీకు ఇష్టమా?
కృతికా – సర్.. బాస్కెట్‌బాల్ ఆడేదాన్ని, బడి లో.
మోదీ గారు – అలాగా.. మీ ఎత్తు ఎంత? ఎక్కువ ఎత్తు ఉంటారా మీరు?
కృతికా – లేదు సర్. ఐదు అడుగుల రెండు అంగుళాలు ఉంటాను.
మోదీ గారు – అలాగా.. ఆట మీకు బాగా ఇష్టమా?
కృతికా – సర్.. అదంటే ఉద్వేగంగా ఉంటుంది, ఆడేస్తుంటాను.
మోదీ గారు – మంచిది, మంచిది. సరే, కృతికా గారు.. మీ అమ్మగారి కి నా తరఫు న ప్రణామాలు పలకండి. వారు మిమ్ములను ఈ విధమైనటువంటి యోగ్యురాలు గా చేశారు. మీ యొక్క జీవనాన్ని తీర్చిదిద్దారు. మీ అమ్మ గారికి నమస్సులు మరియు అనేకానేక శుభాకాంక్షలూను. ఇంకా, మీకు కూడాను అభినందనలు. అనేకానేక శుభాకాంక్షలు.
కృతికా – ధన్యవాదాలు సర్.
రండి! ఇప్పుడు మనం కేరళ లోని ఎర్నాకులం కు పోదాము. కేరళ యొక్క నవ యువకుని తో మాట్లాడదాము.
మోదీ గారు – హెలో.
వినాయక్ – హెలో సర్. నమస్కారం.
మోదీ గారు – వినాయక్.. అభినందనలు.
వినాయక్ – ధన్యవాదాలు సర్,
మోదీ గారు – శభాశ్ వినాయక్.. శభాశ్
వినాయక్ – ధన్యవాదాలు సర్,
మోదీ గారు – జోశ్ ఎలా ఉంది
వినాయక్ – అధికం గా ఉంది సర్..
మోదీ గారు – మీరు ఏదైనా ఆట ఆడుతారా?
వినాయక్ – బాడ్ మింటన్ ఆట.
మోదీ గారు – బాడ్ మింటన్..
వినాయక్ – అవును సర్.
మోదీ గారు – ఒక బడి లో లేదా మరెక్కడైనా మీకు శిక్షణ తీసుకునే అవకాశం ఉందా?
వినాయక్ – లేదు సర్ .. బడి లో ఇప్పటికే మేము కొంత శిక్షణ ను పొందాము.
మోదీ గారు – ఊఁ.
వినాయక్ – మా ఉపాధ్యాయుల నుండి శిక్షణ ను స్వీకరించాము సర్.
మోదీ గారు – ఆహాఁ, అలాగా.
వినాయక్ – తద్ద్వారా మాకు బయట పాల్గొనే అవకాశం లభిస్తుంది సర్
మోదీ గారు – వావ్
వినాయక్ – పాఠశాల నుండే సర్.
మోదీ గారు – మీరు ఎన్ని రాష్ట్రాల ను సందర్శించారు?
వినాయక్ – నేను కేరళ ను, ఇంకా తమిళ నాడు ను మాత్రమే సందర్శించాను సర్.
మోదీ గారు – కేరళ, ఇంకా తమిళ నాడు మాత్రమేనా.
వినాయక్ – అవును సర్.
మోదీ గారు – మరి, మీరు దిల్లీ ని సందర్శించాలనుకుంటున్నారా?
వినాయక్ – అవును సర్. ఇప్పుడు, పై చదువుల కోసం దిల్లీ విశ్వవిద్యాలయం లో దరఖాస్తు చేస్తున్నాను.
మోదీ గారు – బలే. అంటే మీరు దిల్లీ కి వస్తున్నారన్నమాట.
వినాయక్ – మరే.. అవును సర్.
మోదీ గారు – చెప్పండి.. భవిష్యత్తు లో బోర్డ్ పరీక్షలు వ్రాసే తోటి విద్యార్థుల కోసం ఏదైనా సందేశం ఇస్తారా?
వినాయక్ – కఠోరం గా శ్రమించడం, ఇంకా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం సర్.
మోదీ గారు – అంటే పరిపూర్ణ కాల నిర్వహణ అనేదే మీ సందేశమా
వినాయక్ – అవును సర్.
మోదీ గారు – వినాయక్.. నేను మీ అలవాటుల ను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను.
వినాయక్ – ……… బ్యాడ్మింటన్ మరియు రోయింగ్ సర్.
మోదీ గారు – మీరు సోశల్ మీడియా లో క్రియాశీలం గా ఉన్నారా
వినాయక్ – లేదు సర్.. ఎటువంటి ఇలెక్ట్రానిక్ సాధనాలను గానీ లేదా గాడ్జెట్ లను గానీ ఉపయోగించడానికి స్కూల్ లో మాకు అనుమతి ఇవ్వరు.
మోదీ గారు – అంటే మీరు అదృష్టవంతులన్నమాట
వినాయక్ – అవును సర్.
మోదీ గారు – సరే.. వినాయక్.. మరో మారు అభినందనలు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్.
వినాయక్ – ధన్యవాదాలు సర్.
రండి! మనం ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్దాము. ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్ రోహా కు చెందిన ఉస్మాన్ సైఫీ తో మాట్లాడదాము..
మోదీ గారు – హెలో ఉస్మాన్. మీకు అనేకానేక అభినందనలు.
ఉస్మాన్ – ధన్యవాదాలు సర్.
మోదీ గారు – సరే ఉస్మాన్.. మాకు చెప్పండి.. మీరు కోరుకున్నన్ని మార్కులు వచ్చాయా.. తక్కువ గా వచ్చాయా?
ఉస్మాన్ – లేదు. నేను కోరుకున్నన్నే వచ్చాయి.. నా తల్లితండ్రులు కూడా చాలా సంతోషం గా ఉన్నారు.
మోదీ గారు – వాహ్, మంచి కుటుంబం. ఇంట్లో మీరు మాత్రమే ఇంత చురుకు గా ఉన్నారా?
ఉస్మాన్ – నేను మాత్రమే సర్. నా సోదరుడు కొంచెం కొంటె వాడు.
మోదీ గారు – అలాగా..
ఉస్మాన్ – మిగతా వారు నా గురించి చాలా సంతోషం గా ఉన్నారు.
మోదీ గారు – సరే.. బాగుంది. బాగా మీరు చదువుతున్నప్పుడు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి?
ఉస్మాన్ – గణితం.
మోదీ గారు – వాహ్.. ! గణితశాస్త్రం లో ఆసక్తి ఎలా ఉండేది ? ఏ మాస్టారు మీకు స్ఫూర్తి ని ఇచ్చారంటారు?
ఉస్మాన్ – మా సబ్జెక్ట్ టీచర్ లలో రజత్ సర్ అని ఒకరు ఉన్నారు. నాకు ప్రేరణనిచ్చింది ఆయనే. మరి వారు చాలా బాగా చదువు చెప్తారు. నాకు మొదటి నుండి నాకు గణితం అంటేనే మక్కువ గా ఉంటూ వచ్చింది. మరి అది చాలా ఆసక్తిదాయకమైన సబ్జెక్టు కూడాను.
మోదీ గారు – ఊఁ.
ఉస్మాన్ – ఎంత ఎక్కువ గా లెక్కలు చేస్తే అంత గా ఆసక్తి వస్తుంది. అందుకే గణితం నా అభిమాన పాత్రమైనటువంటి సబ్జెక్టు.
మోదీ గారు – ఊఁ. ఊఁ.. ఆన్లైన్ వేద గణితం తరగతులు జరుగుతాయి అనే సంగతి మీకు తెలుసా?
ఉస్మాన్ – అవును సర్.
మోదీ గారు – మరి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా?
ఉస్మాన్ – లేదు సర్. ఇంకా చేయలేదు.
మోదీ గారు – వాటిలో మీరు చేరితే.. మీ మిత్రులందరూ మిమ్మల్ని ఒక ఇంద్రజాలికుడిగా చూస్తారు.. ఎందుకంటే కంప్యూటర్ యొక్క స్పీడ్ తో మీరు వేద గణితం లెక్కలు చేయవచ్చు. ఎంతో సరళమైనటువంటి టెక్నిక్ లు ఉన్నాయి. ఇంకా ఈ రోజులలో అవి ఆన్లైన్ లో కూడా అందుబాటు లో ఉన్నాయి.
ఉస్మాన్ – చెప్పండి సర్.
మోదీ గారు – గణితం అంటే మీకు ఆసక్తి ఉన్నందు వల్ల, కొత్త విషయాల ను కూడా మీరు చెప్పవచ్చు.
ఉస్మాన్ – సర్.
మోదీ గారు – సరే ఉస్మాన్.. ఖాళీ సమయం లో మీరు ఏం చేస్తారు?
ఉస్మాన్ – సర్, నేను ఖాళీ సమయం లో ఏదో ఒకటి వ్రాస్తూ నే ఉంటాను సర్. వ్రాయడం అంటే నాకు చాలా ఆసక్తి ఉంది.
మోదీ గారు – బాగుంది.. ! మీరు గణితం పై కూడా ఆసక్తి చూపుతారు. సాహిత్యం అన్నా కూడా మీకు ఆసక్తి ఉంది.
ఉస్మాన్ – అవును సర్.
మోదీ గారు – మీరు ఏమి వ్రాస్తారు? కవితలు వ్రాస్తారా.. శాయరీలా..
ఉస్మాన్ – కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ఏదైనా అంశంపై నేను వ్రాస్తూ ఉంటాను.
మోదీ గారు – ఓహ్.. అలాగా.
ఉస్మాన్ – కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి సర్.. జిఎస్ టి, పెద్ద నోట్ల రద్దు.. ఇలా.. అన్ని విషయాలు.
మోదీ గారు – ఓహ్! మీరు కళాశాల లో పై చదువులు చదువుకోవడానికి తదుపరి ప్రణాళిక ఏం చేస్తున్నారు?
ఉస్మాన్ – కళాశాల లో చదువుకుంటున్నా సర్.. జెఇఇ మెయిన్స్ మొదటి ప్రయత్నం లో క్లియర్ చేశాను. రెండో ప్రయత్నం లో ఇప్పుడు సెప్టెంబర్ లో రాస్తాను. నా ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. నేను మొదట ఐఐటి నుండి బ్యాచిలర్ డిగ్రీ ని పొందాలి. ఆ తరువాత సివిల్ సర్వీసెస్ కు వెళ్లి ఐఎఎస్ అవ్వాలి.
మోదీ గారు – ఓహ్! మీరు టెక్నాలజీ పైన కూడా ఆసక్తి ని చూపుతున్నారా?
ఉస్మాన్ – అవును సర్. అందుకే నేను ఐఐటి లో ఐ. టి. ని ఎంచుకున్నాను
మోదీ గారు – అలాగే ఉస్మాన్.. మీకు నా శుభాకాంక్షలు. మీ సోదరుడు కొంటె గా ఉంటే మీకు సమయం కూడా బాగా గడుస్తుంది. మీ అమ్మానాన్నల కు నా నమస్కారాలు చెప్పండి. వారు మీకు ఈ విధంగా ఒక అవకాశాన్ని ఇచ్చారు. ప్రోత్సహిస్తున్నారు. మీరు చదువు తో పాటు ప్రస్తుత సమస్యల ను అధ్యయనం చేయడం, వ్రాస్తూ ఉండడం నాకు నచ్చాయి. చూడండి.. వ్రాయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీ ఆలోచన లు పదును గా అవుతాయి. అభినందనలు..
ఉస్మాన్ – ధన్యవాదాలు సర్.
రండి! దక్షిణం వైపునకు వెళ్దాం. తమిళ నాడు లోని నామక్కల్ నుండి పుత్రిక కనిగా తో మాట్లాడదాం .. కనిగా తో సంభాషణ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
మోదీ గారు- కనిగా గారూ.. వణక్కమ్.
కనిగా- వణక్కమ్ సర్..
మోదీ గారు- ఎలా ఉన్నారు మీరు
కనిగా- బావున్నాను సర్
మోదీ గారు- మొదట గొప్ప విజయం సాధించిన మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను.
కనిగా- ధన్యవాదాలు సర్.
మోదీ గారు- నామక్కల్ ను గురించి విన్నప్పుడు, నాకు ఆంజనేయర్ దేవాలయం గుర్తుకు వస్తుంది.
కనిగా- అవును సర్.
మోదీ గారు- ఇప్పుడు నేను మీతో నా సంభాషణ ను కూడా గుర్తుంచుకొంటాను.
కనిగా- అలాగే సర్.
మోదీ గారు- కాబట్టి.. మళ్ళీ అభినందనలు.
కనిగ్గ- ధన్యవాదాలు సర్.
మోదీ గారు- మీరు పరీక్షల కోసం చాలా కష్టపడ్డారు. పరీక్షల కు సిద్ధమవుతున్నప్పుడు మీ అనుభవం ఎలా ఉంది?
కనిగా- సర్… మేము మొదటి నుండి చాలా కష్టపడుతున్నాము. ఈ ఫలితం ఊహించలేదు. కానీ పరీక్ష బాగా వ్రాసినందువల్ల , మంచి ఫలితం వచ్చింది.
మోదీ గారు- మీరు ఎన్ని మార్కులు వస్తాయని ఊహించారు?
కనిగా- 485 లేదా 486 .. అలా వస్తాయి అనుకున్నాను
మోదీ గారు- ఇప్పుడు ఎన్ని వచ్చాయి?
కనిగా- 490.
మోదీ గారు- మీ కుటుంబ సభ్యులు, మీ ఉపాధ్యాయుల స్పందన ఏమిటి ?
కనిగా- వారు చాలా సంతోషం గా ఉన్నారు. వారికి చాలా గర్వం గా ఉంది సర్.
మోదీ గారు- మీకు ఇష్టమైన విషయం ఏది?
కనిగా- గణితం.
మోదీ గారు- ఓ! మీ భవిష్యత్తు ప్రణాళిక లు ఏమిటి?
కనిగా- నేను డాక్టర్ అవుతాను సర్.. వీలయితే ఎఎఫ్ ఎమ్ సి నుండి..
మోదీ గారు- మీ కుటుంబ సభ్యులు వైద్య వృత్తి లో ఉన్నారా.. లేదా వేరే ఏదైనా వృత్తి లో ఉన్నారా?
కనిగా- లేదు సర్. నాన్న డ్రైవర్. అయితే నా సోదరి ఎమ్ బిబిఎస్ చదువుతోంది సర్.
మోదీ గారు- వావ్! కాబట్టి మొదట నేను మీ నాన్న కు నమస్కారాలు చేస్తాను. మీ సోదరి గురించి, మీ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న తండ్రి ఆయన. ఆయన చేసేది గొప్ప సేవ.
కనిగా- అవును సర్.
మోదీ గారు- ఆయన అందరికీ ప్రేరణ.
కనిగా- అవును సర్.
మోదీ గారు- మీకు, మీ సోదరి కి, మీ నాన్న కు , మీ కుటుంబాని కి అభినందనలు.
కనిగా- ధన్యవాదాలు సర్.
మిత్రులారా, క్లిష్ట పరిస్థితుల లో కూడా ఉత్సాహం ప్రదర్శించే అలాంటి యువ స్నేహితుల విజయ గాథ లు మనకు స్ఫూర్తిని ఇస్తాయి. వీలైనంత ఎక్కువ మంది యువ మిత్రుల తో మాట్లాడే అవకాశం ఉండాలని నా మనసు లో ఉంటుంది. అయితే సమయానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. దేశాని కి స్ఫూర్తి ని ఇచ్చే వారి విజయ గాథల ను, అందరితో పంచుకోవాలని నేను యువ సహచరులందరినీ కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా, ఏడు సముద్రాలు దాటిన తరువాత.. భారతదేశం నుండి వేల మైళ్ళ దూరం లో ‘సురినామ్’ అనే చిన్న దేశం ఉంది. సురినామ్ తో భారతదేశానికి చాలా సన్నిహిత సంబధాలు ఉన్నాయి. వంద సంవత్సరాల కంటే ముందు భారతదేశం నుండి ప్రజలు అక్కడికి వెళ్లి దానిని తమ నివాసం గా చేసుకున్నారు. నేడు అక్కడ నాలుగో-ఐదో తరం భారతీయ సంతతి వారు ఉన్నారు. ఈ రోజు, సురినామ్ లో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది భారతీయ సంతతి కి చెందిన వారు. మీకు తెలుసా.. అక్కడి సాధారణ భాషల లో ఒకటైన ‘సర్ నామీ’ కూడా ‘భోజ్‌పురి’ భాష లో మాండలికం. ఈ సాంస్కృతిక సంబంధాల వల్ల భారతీయులైన మనం చాలా గర్వం గా భావిస్తున్నాం..
ఇటీవల శ్రీ చంద్రిక ప్రసాద్ సంతోఖీ సురినామ్ యొక్క నూతన అధ్యక్షుడు అయ్యారు. ఆయన భారతదేశానికి మిత్రుడు. 2018 వ సంవత్సరం లో జరిగిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పిఐఒ) పార్లమెంటరీ సమావేశాని కి కూడా హాజరయ్యారు. శ్రీ చంద్రికా ప్రసాద్ సంతోఖీ గారు వేద మంత్రాల తో ప్రమాణ స్వీకారం ప్రారంభించారు. ఆయన సంస్కృతం లో మాట్లాడారు. వేదాల ను ప్రస్తావించారు. ‘‘ఓమ్ శాంతి: శాంతి: శాంతి’’ తో ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. తన చేతి లో వేదాల ను తీసుకొని ఆయన ఇలా అన్నారు.. “నేను, చంద్రికా ప్రసాద్ సంతోఖీ” అని.. మరి ఆనక ప్రమాణ స్వీకారం లో ఆయనేం చెప్పారు? ఆయన వేదాల లోని ఒక మంత్రాన్ని జపించారు. ఆయన ఇలా అన్నారు..
“ఓమ్ అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్ఛకేయం తన్మే రాధ్యతామ్..
ఇదమహమనృతాత్ సత్యముపైమి” అని.
ఈ మాటల కు- అగ్ని సంకల్ప దేవుడు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దీని కోసం అగ్ని నాకు శక్తి ని మరియు సామర్థ్యాన్ని ప్రదానం చేయుగాక.. అసత్యానికి దూరం గా ఉండి సత్యం వైపు వెళ్ళవలసింది అని నన్ను ఆశీర్వదించు గాక.. – అని భావం.
నిజం గా, ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం.
నేను శ్రీ చంద్రిక ప్రసాద్ సంతోఖీ ని అభినందిస్తున్నాను. దేశసేవ చేయడం కోసం 130 కోట్ల మంది భారతీయుల పక్షాన ఆయన కు శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా, ఇది వర్షాల కాలం కూడా. వర్షం నుండి దుమ్ము, ధూళి, వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇంతకుముందు సారి కూడా నేను మీకు చెప్పాను. వైద్యశాలల లో రద్దీ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ధ వహించాలి. వ్యాధి నిరోధక శక్తి ని పెంచే విషయాలు.. ఆయుర్వేద కషాయాల ను తీసుకోవడం మొదలైనవి పాటించాలి. కరోనా వ్యాప్తి కాలం లో మనం ఇతర వ్యాధుల నుండి దూరంగా ఉండాలి. ఆసుపత్రి ని సందర్శించాల్సిన అవసరం లేకుండా జాగ్రత్త పడాలి.
మిత్రులారా, వర్షాకాలంలో దేశం లో అధిక భూ భాగం వరదల ను ఎదుర్కొంటోంది. బిహార్, అసమ్ ల వంటి రాష్ట్రాల లో చాలా ప్రాంతాల లో వరదలు అనేక ఇబ్బందులను సృష్టించాయి. అంటే ఒక వైపు కరోనా ఉంది.. మరొక వైపు ఇది మరొక సవాలు. అన్ని ప్రభుత్వాలు, ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు నియంత్రణ బృందాలు , స్వచ్ఛంద సంస్థలు.. అన్నీ కలసి ఉపశమన చర్యలను, సహాయక చర్యల ను నిర్వహిస్తున్నాయి. ఈ విపత్తు తో బాధపడుతున్న ప్రజలందరికీ సహాయం గా యావత్తు దేశం నిలుస్తుంది.
మిత్రులారా, మరుసటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం కలిసే కన్నా ముందుగానే ఆగస్టు 15 కూడా వస్తోంది. ఈసారి ఆగస్టు 15 కూడా భిన్నమైన పరిస్థితుల లో ఉంటుంది. కరోనా మహమ్మారి పరిస్థితుల లో ఈ ఉత్సవం జరుగుతుంది. మహమ్మారి నుండి స్వాతంత్రం పొందుతామని స్వాతంత్ర్య దినోత్సవం రోజు న ప్రతిజ్ఞ చేయాలని యువత ను, దేశవాసులను నేను కోరుతున్నాను. స్వావలంబన కలిగిన భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను. కొత్త విషయాలను నేర్చుకోవాలని, నేర్పాలని సంకల్పించాలని, కర్తవ్యాలను నెరవేర్చడానికి సంకల్పించాలని యువత ను, దేశ ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఈ రోజు మన దేశం ఉన్నత స్థాయి లో ఉండడానికి దేశ నిర్మాణానికి తమ జీవితాలను అంకితం చేసిన ఎంతో మంది గొప్ప వ్యక్తులే కారణం. ఆ గొప్ప వ్యక్తుల లో ఒకరు ‘లోక మాన్య తిలక్’. 2020 ఆగష్టు 1వ తేదీ న లోక మాన్య తిలక్ గారి 100 వ వర్ధంతి. లోక మాన్య తిలక్ గారి జీవితం మనందరికీ పెద్ద ప్రేరణ. మనకు చాలా విషయాలు నేర్పుతుంది.
ఈ సారి మనం కలుసుకొన్నప్పుడు మనం చాలా విషయాలను గురించి మాట్లాడుకుందాము. కొత్త విషయాల ను కలసి నేర్చుకుందాము. అందరితోనూ పంచుకుందాము. మీరందరూ మిమ్మల్ని మీరు జాగ్రత్త గా చూసుకోండి. మీ కుటుంబాన్ని జాగ్రత్త గా చూసుకోండి. ఆరోగ్యం గా ఉండండి. రాబోయే అన్ని పండుగ ల సందర్భం లో దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.
Today, 26th July is a very special day for every Indian. #CourageInKargil pic.twitter.com/pSXmuddxjt
— PMO India (@PMOIndia) July 26, 2020
Thanks to the courage of our armed forces, India showed great strength in Kargil. #CourageInKargil pic.twitter.com/O0IWO7BThL
— PMO India (@PMOIndia) July 26, 2020
PM @narendramodi recalls his own visit to Kargil.
— PMO India (@PMOIndia) July 26, 2020
He also highlights how people have been talking about the courage of the Indian forces. #CourageInKargil #MannKiBaat pic.twitter.com/sS3SJ1iUe5
An appeal to every Indian... #CourageInKargil #MannKiBaat pic.twitter.com/SiLzgVEAw9
— PMO India (@PMOIndia) July 26, 2020
Recalling the noble thoughts of Bapu and the words of beloved Atal Ji during his Red Fort address in 1999. #MannKiBaat pic.twitter.com/7pZIvvDLcX
— PMO India (@PMOIndia) July 26, 2020
Let us do everything to further national unity. #MannKiBaat pic.twitter.com/dNFkvyoQp1
— PMO India (@PMOIndia) July 26, 2020
We have to keep fighting the COVID-19 global pandemic. #MannKiBaat pic.twitter.com/U7fIV45yk7
— PMO India (@PMOIndia) July 26, 2020
Social distancing.
— PMO India (@PMOIndia) July 26, 2020
Wearing masks.
The focus on these must continue. #MannKiBaat pic.twitter.com/vhzJOjGtCs
Sometimes, do you feel tired of wearing a mask?
— PMO India (@PMOIndia) July 26, 2020
When you do, think of our COVID warriors and their exemplary efforts. #MannKiBaat pic.twitter.com/u4oFgwfiGe
We are seeing how Madhubani masks are becoming increasingly popular across India. #MannKiBaat pic.twitter.com/iyXvJ3GQd4
— PMO India (@PMOIndia) July 26, 2020
Inspiring efforts in the Northeast. #MannKiBaat pic.twitter.com/9hTinMyZPp
— PMO India (@PMOIndia) July 26, 2020
Ladakh and Kutch are making commendable efforts towards building an Aatmanirbhar Bharat. #MannKiBaat pic.twitter.com/aC5HZj5cAg
— PMO India (@PMOIndia) July 26, 2020
Being vocal for local. #MannKiBaat pic.twitter.com/Auxy4GxZTK
— PMO India (@PMOIndia) July 26, 2020
India is changing.
— PMO India (@PMOIndia) July 26, 2020
There was a time, when whether in sports or other sectors, most people were either from big cities or from famous families or from well-known schools or colleges.
Now, it is very different: PM @narendramodi #MannKiBaat
Our youth are coming forward from villages, from small towns and from ordinary families. New heights of success are being scaled. These people are moving forward in the midst of crises, fostering new dreams. We see this in the results of the board exams too: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 26, 2020
Here is something interesting from Suriname... #MannKiBaat pic.twitter.com/NVcQJtiq4r
— PMO India (@PMOIndia) July 26, 2020
Our solidarity with all those affected by floods and heavy rainfall across India.
— PMO India (@PMOIndia) July 26, 2020
Centre, State Governments, local administrations, NDRF and social organisations are working to provide all possible assistance to those affected. #MannKiBaat pic.twitter.com/zwtXIpIfoi