Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018-19 కేంద్ర బ‌డ్జెట్ స‌మ‌ర్ప‌ణ అనంత‌రం ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం


 

“ఈ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టిన ఆర్థిక మంత్రి శ్రీ అరుణ్ జైట్లీ ని నేను అభినందిస్తున్నాను.  ‘న్యూ ఇండియా’ పునాది రాయిని ఈ బ‌డ్జెట్ బ‌ల‌ప‌రుస్తుంది.  ఈ బ‌డ్జెట్ వ్య‌వ‌సాయం మొద‌లుకొని మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న వ‌ర‌కు ప‌లు అంశాల పైన శ్ర‌ద్ధ వ‌హించింది.  ఒక ప‌క్క పేద‌ల మ‌రియు మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం ఆరోగ్య ప్ర‌ణాళిక‌ల వంటి అంశాల‌ను, మ‌రొక ప‌క్క దేశంలోని చిన్న ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల సంప‌ద‌ను పెంచే ప్ర‌ణాళిక‌ల‌ను ఈ బ‌డ్జెట్ పరిగణన లోకి తీసుకొంది.  ఇక మిగ‌తా అంశాల‌ను బ‌ట్టి చూస్తే, వాటిలో.. ఫూడ్ ప్రాసెసింగ్ నుండి ఫైబ‌ర్ ఆప్టిక్స్ వ‌ర‌కు, ర‌హ‌దారుల నుండి షిప్పింగ్ వ‌ర‌కు, యువ‌త స‌మ‌స్య‌ల నుండి వ‌యో వృద్ధుల స‌మ‌స్య‌ల వ‌ర‌కు, గ్రామీణ భార‌తం నుండి ‘ఆయుష్మాన్ ఇండియా’ వ‌ర‌కు, ఇంకా ‘డిజిట‌ల్ ఇండియా’ నుండి ‘స్టార్ట్‌-అప్ ఇండియా’ వ‌ర‌కు.. ఈ బ‌డ్జెట్ యొక్క ప‌రిధి విస్త‌రించి ఉంది.

 

దేశంలోని 125 కోట్ల మంది ప్ర‌జ‌ల ఆశ‌లకు, ఆకాంక్ష‌లకు ఈ బ‌డ్జెట్ ఓ ఉత్తేజాన్ని ఇవ్వ‌గ‌ల‌ద‌ని భావించ‌వ‌చ్చు.  ఈ బ‌డ్జెట్ దేశంలో అభివృద్ధి ప్ర‌క్రియ వేగాన్ని పెంచ‌గ‌ల‌ద‌ని భావించ‌వ‌చ్చు.  ఇది రైతులు, సామాన్య మాన‌వుడు, వ్యాపార వాతావ‌ర‌ణం మ‌రియు అభివృద్ధి.. వీట‌న్నింటికీ స్నేహపూర్వ‌క‌మైనటువంటి బ‌డ్జెట్.  ఈ బ‌డ్జెట్ దృష్టి సారించిన అంశాల‌లో- వ్యాపారం చేయ‌డంలో సౌల‌భ్యంతో పాటు జీవించ‌డంలో స‌ర‌ళ‌త్వం- కలిసి ఉన్నాయి.  మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి మ‌రింత పొదుపు, 21వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశానికి అవ‌స‌ర‌మైన కొత్త త‌రం మౌలిక స‌దుపాయాలు, ఇంకా శ్రేష్ఠతరమైన ఆరోగ్య హామీ.. ఇవ‌న్నీ జీవ‌నాన్ని సులువుగా మ‌ల‌చే దిశ‌గా వేసిన అడుగులే.

 

మ‌న వ్య‌వ‌సాయ‌దారులు పండ్లు మ‌రియు కాయ‌గూర‌ల‌ను రికార్డు స్థాయిలో ఉత్ప‌త్తి చేసి దేశం పురోగ‌తి ప‌థంలో ప‌య‌నించేందుకు గ‌ణ‌నీయ‌మైన తోడ్పాటును అందించారు.  ఈ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ‌దారులకు ప్రేరణను ఇచ్చేందుకు, వారి ఆదాయాన్ని పెంచేందుకు అనేక చ‌ర్య‌ల‌ను ప్ర‌తిపాదించ‌డ‌మైంది.  వ్య‌వ‌సాయానికి, ఇంకా గ్రామీణాభివృద్ధికి రికార్డు స్థాయిలో 14.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించ‌డ‌ం జరిగింది.  51 ల‌క్ష‌ల నూత‌న గృహాలు, 3 ల‌క్ష‌ల కిలో మీట‌ర్ల‌కు పైగా ర‌హ‌దారులు, సుమారు 2 కోట్ల మ‌రుగుదొడ్లు, 1.75 కోట్ల కుటుంబాల‌కు విద్యుత్తు క‌నెక్ష‌న్ ల వంటి లాభాలు స‌మాజంలోని ద‌ళితులకు, అణ‌చివేత‌కు గురైన వ‌ర్గాల వారికి మ‌రియు ప్ర‌యోజ‌నాలకు నోచుకోకుండా దూరంగా ఉంటున్నటువంటి వ‌ర్గాల‌ వారికి మేలు చేస్తాయి.  ఈ కార్య‌క్ర‌మాలు ప్ర‌త్యేకించి ప‌ల్లె ప్రాంతాల‌లో కొత్త అవ‌కాశాల‌ను సృష్టిస్తాయి.  వ్య‌వ‌సాయ‌దారులు వారి ఫ‌ల‌సాయం కోసం పెట్టిన ఖ‌ర్చుకు ఒక‌టిన్న‌ర రెట్ల గిట్టుబాటు ధ‌రను అందించాల‌ని చేసిన నిర్ణ‌యాన్ని నేను మెచ్చుకొంటున్నాను.  ఈ నిర్ణ‌యం నుండి పూర్తి లాభాల‌ను వ్య‌వ‌సాయ‌దారులు అందుకొనేందుకు వీలుగా రాష్ట్రాల‌ను కేంద్రం సంప్ర‌దించి, ఒక ప‌క్క వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెడుతుంది.  ఈ దిశ‌గా ‘ఆప‌రేష‌న్ గ్రీన్స్’ ఒక స‌మ‌ర్ధ‌మైన సాధ‌నంగా ఉండ‌గ‌లదు.  మ‌రీ ముఖ్యంగా కాయ‌గూర‌లు మ‌రియు పండ్ల ఉత్ప‌త్తిలో నిమ‌గ్న‌మైన వ్య‌వ‌సాయ‌దారులు దీని తాలూకు ల‌బ్దిని పొంద‌గ‌లుగుతారు.  పాడి రంగంలో త‌ల‌మున‌క‌లైన వ్య‌వ‌సాయ‌దారుల‌కు స‌రి అయిన ధ‌ర ల‌భించేట‌ట్లు చేయ‌డంలో అమూల్ ఏ విధంగా  ఉప‌యోగ‌ప‌డిందీ మ‌నం గ‌మ‌నించాం.  మ‌న దేశంలో ప‌రిశ్ర‌మ అభివృద్ధి ప్ర‌స్థానంలో క్ల‌స్ట‌ర్ ఆధారిత  విధానం పోషించినటువంటి పాత్ర ఎటువంటిదో మ‌నకు తెలుసు.  ప్ర‌స్తుతం వివిధ జిల్లాల‌లోని వ్య‌సాయిక ఉత్ప‌త్తుల‌ను దృష్టిలో పెట్టుకొని దేశంలోని వేరు వేరు జిల్లాల‌లో అగ్రిక‌ల్చ‌ర‌ల్ క్ల‌స్ట‌ర్ విధానాన్ని అవలంబించ‌డం జ‌రుగుతుంది.  జిల్లాలను గుర్తించిన అనంత‌రం ఒక ఫ‌లానా వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తిని నిల్వ చేయ‌డం, ప్రాసెస్ చేయ‌డం మ‌రియు విక్ర‌యించ‌డం కోసం సంబంధిత సదుపాయాల‌ను అభివృద్ధిప‌ర‌చేందుకు ఉద్దేశించిన ప్ర‌ణాళిక‌ను నేను స్వాగ‌తిస్తున్నాను.

 

మ‌న దేశంలో స‌హ‌కార సంఘాల‌ను ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపు నుండి మిన‌హాయించడ‌మైంది.  అయితే, స‌హకార సంఘాలను పోలి ఉన్న ‘ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్ ’- ఎఫ్‌పిఒ కు ఈ ప్ర‌యోజ‌నం ల‌భించ‌డం లేదు.  ఇందువల్ల, వ్య‌వ‌సాయ‌దారుల సంక్షేమం కోసం న‌డుం బిగించిన ఎఫ్‌పిఒ కు ఆదాయ‌పు ప‌న్ను ను మిన‌హాయించ‌డం ఆహ్వానించ‌ద‌గిన చ‌ర్య‌.  సేంద్రియ సేద్యం, సుగంధ‌ భ‌రిత సేద్యం మ‌రియు మూలికా సేద్యం వంటి కార్య‌క‌లాపాల‌లో నిమ‌గ్న‌మైన మ‌హిళా స్వ‌యంస‌హాయ‌క బృందాలకు మ‌రియు ఎఫ్‌పిఒ ల‌కు మ‌ధ్య స‌మ‌న్వ‌యాన్ని నెల‌కొల్ప‌డం ద్వారా వ్య‌వ‌సాయ‌దారుల ఆదాయాన్ని పెంచ‌డం జ‌రుగుతుంది.  ఇదే విధంగా గోబ‌ర్- ధ‌న్ యోజ‌న ప‌శు పాల‌కుల మ‌రియు రైతుల ఆదాయాన్ని పెంచుతూనే ప‌ల్లెల‌ను శుభ్రంగా ఉంచ‌డంలో తోడ్ప‌డ‌గ‌ల‌దు.  మ‌న దేశంలో వ్య‌వ‌సాయ‌దారులు సాగు చేయ‌డంతో పాటు వేరు వేరు వృత్తుల‌ను కూడా అనుసరిస్తారు.  కొంత మంది చేప‌ల పెంప‌కంతో, ప‌శు పోష‌ణ‌తో, కోళ్ళ పెంప‌కం లేదా తేనెటీగ‌ల పెంప‌కం వంటి వాటితో అనుబంధం క‌లిగి ఉంటారు.  ఈ త‌ర‌హా అద‌న‌పు కార్య‌క‌లాపాల కోసం బ్యాంకుల నుండి రుణాల‌ను పొంద‌డంలో వ్య‌వ‌సాయ‌దారులు ఇక్క‌ట్ల‌ను ఎదుర్కొంటున్నారు.  చేప‌ల పెంప‌కానికి మ‌రియు ప‌శు పోష‌ణ‌కు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం పొంద‌డం చాలా ప్ర‌భావవంత‌మైన చ‌ర్య అవుతుంది.  భార‌త‌దేశంలో 700 ల‌కు పైగా జిల్లాల‌లో సుమారు 7000 బ్లాకులు ఉన్నాయి.  ఈ బ్లాకుల‌లో 22 వేల గ్రామీణ వ్యాపార కేంద్రాల‌లో మౌలిక స‌దుపాయాల ఆధునికీక‌ర‌ణ పైన, ప‌ల్లె ప్రాంతాల‌లో నూత‌న ఆవిష్కారం మ‌రియు అనుసంధానాన్ని పెంచ‌డానికి ప్ర‌త్యేక ప్రాధాన్యాన్ని ఇవ్వ‌డం జ‌రిగింది.  రానున్న రోజుల‌లో ఈ కేంద్రాలు వ్య‌వ‌సాయ‌దారులకు ఆదాయాన్ని పెంపొందించ‌డంలోనూ, ఉపాధి అవ‌కాశాల‌ను సృష్టించ‌డంలోనూ దోహ‌ద‌ప‌డి వ్య‌వ‌సాయాధారిత‌ గ్రామీణ మ‌రియు వ్య‌వ‌సాయ ప్ర‌ధానమైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో నూత‌న కేంద్రాలు కాగ‌ల‌వు.  ‘ప్ర‌ధాన మంత్రి గ్రామీణ స‌డ‌క్ యోజ‌న‌’లో భాగంగా ఇక ప‌ల్లెల‌ను గ్రామీణ విప‌ణుల‌తో, ఉన్న‌త విద్య కేంద్రాల‌తో మ‌రియు ఆసుప‌త్రుల‌తో జోడించ‌డం జ‌రుగుతుంది.  ఇది ప‌ల్లె ప్రాంతాల‌లో ప్ర‌జ‌ల జీవ‌నాన్ని సుల‌భ‌త‌రంగా మార్చ‌గ‌లుగుతుంది.

 

‘ఉజ్జ్వ‌ల యోజ‌న‌’ లో జీవన స‌ర‌ళ‌త్వం తాలూకు స్ఫూర్తి యొక్క వ్యాప్తిని మ‌నం గ‌మ‌నించాం.  ఈ ప‌థ‌కం పేద మ‌హిళ‌ల‌కు పొగ నుండి ఉప‌శ‌మ‌నాన్ని క‌ల్పించ‌డ‌మే కాకుండా వారి స‌శ‌క్తీక‌ర‌ణ‌కు ఒక ప్ర‌ధాన వ‌న‌రుగా కూడా మారింది.  ‘ఉజ్జ్వ‌ల’ ల‌క్ష్యాన్ని 5 కోట్ల కుటుంబాల నుండి 6 కోట్ల కుటుంబాల‌కు పెంచిన‌ట్లు తెలుసుకొని నేను సంతోషిస్తున్నాను.  ఈ ప‌థ‌కం నుండి ల‌బ్దిని ద‌ళిత‌, ఆదివాసీ, ఇంకా వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తి కుటుంబాలు పెద్ద సంఖ్య‌లో పొంద‌గ‌లిగాయి.  ఈ బ‌డ్జెట్ షెడ్యూల్డు కులాలు మ‌రియు షెడ్యూల్డు తెగ‌ల వారి సంక్షేమం కోసం దాదాపు ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌ల కేటాయింపున‌కు వీలు క‌ల్పించింది.

 

స‌మాజంలోని పేద‌లు మ‌రియు దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల వారికి వైద్య చికిత్స అన్నా, అందుకు అయ్యే ఖ‌ర్చుల‌న్నా ఎప్ప‌టికీ ఆందోళ‌నను కలిగించే విషయాలే.  ఈ బ‌డ్జెట్ లో ప్ర‌వేశ‌పెట్టిన ‘ఆయుష్మాన్ భార‌త్’ అనే కొత్త ప‌థ‌కం ఈ ఆందోళ‌నక‌ర‌ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించగలదు.  ఈ ప‌థ‌కం దేశంలోని పేద‌లు మ‌రియు దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన సుమారు 10 కోట్ల కుటుంబాలకు అందుబాటులో ఉండ‌గ‌ల‌దు. దీనికి అర్థం ఇది 45-50 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌ను అందించ‌గ‌లుగుతుంది అని.  ఈ ప‌థ‌కంలో భాగంగా ఆయా కుటుంబాలు గుర్తించిన ఆసుపత్రుల‌లో ఒక ఏడాదికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఉచిత చికిత్స‌ను పొంద‌గ‌లుగుతాయి.  ఇది ఇప్ప‌టి వ‌ర‌కు చూస్తే ప్ర‌పంచంలో కెల్లా అత్యంత భారీ ఆరోగ్య బీమా ప్ర‌ణాళిక‌.  ఇందుకోసం అయ్యే ఖ‌ర్చును ప్ర‌భుత్వం భ‌రిస్తుంది.  దేశంలో ప్ర‌ధాన పంచాయ‌తీల‌న్నింటా విస్త‌రించి ఉండేలా 1.5 ల‌క్ష‌ల హెల్త్ వెల్‌నెస్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న కొనియాడ‌ద‌గ్గ‌ది.  ఇది ప‌ల్లెల‌లో నివ‌సించే ప్ర‌జ‌లకు ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను సుల‌భంగా అందుబాటులోకి తీసుకొని రాగ‌లుగుతుంది.  దేశవ్యాప్తంగా 24 కొత్త వైద్య క‌ళాశాల‌ల‌ను ఏర్పాటు చేయ‌డం ప్ర‌జ‌ల చికిత్స స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చేదే కాకుండా, యువ‌తీ యువ‌కుల‌కు వైద్య విద్యను బోధించ‌డంలో స‌హాయ‌ప‌డేది కూడాను.  దేశ‌వ్యాప్తంగా 3 పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లకు క‌నీసం ఒక వైద్య క‌ళాశాల అందుబాటులో ఉండే దిశ‌గా మేం కృషి చేస్తాం.

 

వ‌యో వృద్ధుల స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ఈ బ‌డ్జెట్‌లో అనేక ముఖ్య‌మైన నిర్ణ‌యాలను తీసుకొన్నాం.  ఇక సీనియ‌ర్ సిటిజన్‌లు ‘ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న్ యోజ‌న’ లో భాగంగా 15 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు డ‌బ్బు పైన క‌నీసం 8 శాతం వ‌డ్డీని పొంద‌గ‌లుగుతారు.  వారి యొక్క బ్యాంకు డిపోజిట్ లు, మ‌రియు పోస్టాఫీస్ డిపోజిట్ ల మీద 50,000 రూపాయ‌ల వ‌ర‌కు వ‌డ్డీ పైన ఎటువంటి ప‌న్నును విధించ‌డం జ‌ర‌గ‌దు.  50,000 రూపాయ‌ల విలువ క‌లిగిన ఆరోగ్య బీమా ప్రీమియ‌మ్ కు ఆదాయ‌పు ప‌న్ను నుండి మిన‌హాయింపు ల‌భిస్తుంది.  దీనికి తోడు తీవ్ర వ్యాధుల చికిత్స‌కు చేసిన ఖ‌ర్చులో ఒక ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు అయిన ఖ‌ర్చు మీద ఆదాయ‌పు ప‌న్ను నుండి ఉపశమనాన్ని కల్పించడమైంది.

 

చాలా కాలంగా మ‌న దేశంలోని చిన్న మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా సంస్థ‌లు లేదా ఎమ్ఎస్ఎమ్ఇ లు.. పెద్ద ప‌రిశ్ర‌మ‌ల క‌న్నా ఎక్కువ స్థాయిలో ప‌న్నుల‌ను చెల్లించ‌వ‌ల‌సిన ప‌రిస్థితి ఉంది.  ఈ బ‌డ్జెట్ లో ఎమ్ఎస్ఎమ్ఇ లకు ప‌న్ను రేటు ప్ర‌భుత్వం 5 శాతం వ‌ర‌కు త‌గ్గించి ఒక సాహ‌స‌మైన కార్యాన్ని త‌ల‌పెట్టింది.  అవి ఇప్పుడు 30 శాతానికి బ‌దులుగా 25 శాతం చెల్లించ‌వ‌చ్చు.  ఎమ్ఎస్ఎమ్ఇ ప‌రిశ్ర‌మ‌ల‌ వ‌ర్కింగ్ కేపిట‌ల్ అవ‌స‌రాల‌ను తీర్చ‌డం కోసం బ్యాంకులు మ‌రియు ఎన్‌బిఎఫ్‌సి ల నుండి రుణాన్ని కోరే స‌దుపాయాన్ని కూడా సుల‌భ‌త‌రంగా మార్చ‌డం జ‌రిగింది.  ఈ చ‌ర్య ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మానికి ఊతాన్ని అందించ‌గ‌లుగుతుంది.

 

పెద్ద ప‌రిశ్ర‌మ‌ల‌లో ఎన్‌పిఎ కార‌ణంగా ఎమ్ఎస్ఎమ్ఇ రంగం ఒత్తిడులకు లోన‌వుతోంది.  ఇత‌రుల త‌ప్పిదం కార‌ణంగా చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌దు.  ఈ కార‌ణంగా ఎమ్ఎస్ఎమ్ఇ రంగంలో ఎన్‌పిఎ మ‌రియు స్ట్రెస్‌డ్‌ అకౌంట్ ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం ప్ర‌భుత్వం త్వ‌ర‌లో దిద్దుబాటు చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించ‌నుంది.

 

ఉద్యోగుల‌కు సామాజిక భ‌ద్ర‌త‌ను అందించ‌డం కోసం మ‌రియు ఉద్యోగ క‌ల్ప‌న‌ను ప్రోత్స‌హించ‌డం కోసం ప్ర‌భుత్వం ఒక కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని తీసుకొంది.  ఇది అసాంప్ర‌దాయ‌క రంగం నుండి సాంప్ర‌దాయ‌క రంగానికి మారేందుకు ఉత్తేజాన్ని ఇస్తుంది.  అంతేకాకుండా ఇది కొత్త ఉద్యోగ అవ‌కాశాల‌ను సృష్టిస్తుంది కూడా.  ఇక‌పై కొత్త శ్రామికుల‌కు 3 సంవ‌త్స‌రాల పాటు ఇపిఎఫ్ ఖాతాలో 12 శాతం కాంట్రిబ్యూషన్ ను ప్ర‌భుత్వం స‌మ‌కూరుస్తుంది.  దీనికి తోడు కొత్త మ‌హిళా ఉద్యోగుల‌కు ఇపిఎఫ్ కాంట్రిబ్యూషన్ ను 3 సంవ‌త్స‌రాల కాలానికి గాను ప్ర‌స్తుతం ఉన్న 12 శాతం నుండి 8 శాతానికి త‌గ్గించ‌డం జ‌రుగుతుంది.  త‌ద్వారా వారు ఇంటికి తీసుకుపోయే జీతం పెరుగుతుంది.  అలాగే మ‌హిళ‌ల‌కు మ‌రిన్ని ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వ‌స్తాయి.  అయితే, యాజ‌మాన్యం కాంట్రిబ్యూష‌న్ ను 12 శాతంగానే కొన‌సాగించ‌డం జ‌రుగుతుంది.  ఇది ప‌ని చేసే మ‌హిళ‌ల స‌శ‌క్తీక‌ర‌ణ దిశ‌గా ఒక ప్ర‌ధాన‌మైన చ‌ర్య అవుతుంది.

 

ఆధునిక భార‌త‌దేశం అనే క‌ల‌ను పండించుకోవ‌డానికి సామాన్య మాన‌వుడి జీవ‌నాన్ని మ‌రింత స‌ర‌ళ‌త‌రంగా మార్చ‌డానికి అభివృద్ధిలో స్థిర‌త్వాన్ని కొన‌సాగించ‌డానికి భార‌త‌దేశం ఒక త‌దుప‌రి త‌నం మౌలిక స‌దుపాయాల‌ను స‌మ‌కూర్చుకోవ‌ల‌సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.  డిజిట‌ల్ ఇండియా కు సంబంధించిన అవ‌స్థాప‌న‌ను అభివృద్ధిప‌ర‌చ‌డానికి ప్ర‌త్యేక ప్రాధాన్యం ఇవ్వ‌డం జ‌రిగింది.  6 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను కేటాయించారు.  ఇది క్రితం సంవ‌త్స‌రం క‌న్నా ఒక ల‌క్ష కోట్ల రూపాయ‌లు అధికం.  ఈ ప‌థ‌కాలు దేశంలో ఉద్యోగ అవ‌కాశాలు మ‌రిన్ని రెట్ల మేర పెంచ‌గ‌లుగుతాయి.

 

వేత‌నాలు అందుకొనే వ‌ర్గాలు మ‌రియు మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ప‌న్ను రాయితీ ఇచ్చినందుకు ఆర్థిక మంత్రిని నేను అభినందిస్తున్నాను.

 

ఈ బ‌డ్జెట్ ప్ర‌తి ఒక్క పౌరుడి అంచ‌నాకు తుల‌తూగగ‌ల‌దు.  ఈ బ‌డ్జెట్ కింద పేర్కొన్న అంశాల‌ను నెర‌వేర్చింది – వ్య‌వ‌సాయ‌దారు కు అత‌డి పంట‌కు గిట్టుబాటు ధ‌ర, సంక్షేమ ప‌థ‌కాల ద్వారా పేద‌ల అభ్యున్న‌తి, ప‌న్ను చెల్లించే పౌరుడి నిజాయ‌తీని స‌మాద‌రించ‌డం, స‌రైన ప‌న్ను స్వ‌రూపంతో న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల స్ఫూర్తికి మ‌ద్ధ‌తును అందించ‌డం మరియు దేశంలోని సీనియ‌ర్ సిటిజ‌న్ ల తోడ్పాటును అభినందించ‌డం.

 

‘న్యూ ఇండియా’ కు ఒక బ‌ల‌మైన పునాదిని వేసినందుకు మ‌రియు జీవ‌నంలో స‌ర‌ళ‌త్వాన్ని పెంచే బడ్జెట్‌ను స‌మ‌ర్పించినందుకు ఆర్థిక మంత్రితో పాటు ఆయ‌న బృందాన్ని నేను మ‌రో సారి హృద‌యపూర్వ‌కంగా అభినందిస్తున్నాను”.

 

***