Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 సెప్టెంబర్ 30వ తేదీ నాడు ‘మన్ కీ బాత్ ’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 48వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం


 

నా ప్రియమైన దేశప్రజలారా నమస్కారం! మన సైనిక బలగాలను, మన సాయుధ దళాలను చూసి గర్వపడని భారతీయుడు ఎవరూ ఉండరు. ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ మతం, లేదా ఏ భాషకు చెందిన వారైనా కూడా ప్రతి భారతీయుడూ మన సైనికుల పట్ల, తమ సంతోషాన్నీ, మద్దతునీ తెలపడానికి ఎల్లప్పుడూ తయారుగా ఉంటాడు. నిన్న 125కోట్ల భారతీయులందరూ పరాక్రమ పర్వాన్ని జరుపుకున్నారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ ను గుర్తుచేసుకున్నారు. టెర్రరిజం ముసుగులో మన దేశంపై పరోక్ష యుధ్ధం జరిగినప్పుడు, వారి నిర్లజ్జకర ప్రవర్తనకు దీటైన జవాబుని మన సైనికులు సర్జికల్ స్ట్రైక్ రూపంలో అందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో మన సాయుధదళాలు ప్రదర్శనలను ఏర్పాటుచేసాయి. ఈ ప్రదర్శనల ముఖ్య ఉద్దేశ్యం – మన దేశ ప్రజలకు, ఎక్కువగా మన యువతరానికి, మన దేశానికి ఉన్న శక్తిని పరిచయం చేయడమే. మనలో ఎంత సామర్ధ్యం దాగి ఉందో, మన సైనికులు ఏ విధంగా తమ ప్రాణాలకు తెగించి దేశాన్నీ,మనల్ని రక్షిస్తూ ఉంటారో తెలపడానికి. పరాక్రమ్ పర్వ్ లాంటి ముఖ్యమైన రోజులు మన దేశ యువతలో మన సైనికుల పట్ల గౌరవపూర్వకంగా ఎలా ఉండాలో తెలిపేలాంటి వారసత్వ సంప్రదాయాల్ని గుర్తు చేస్తాయి. తద్వారా మన దేశ సమైక్యత ను, నైతికతను సదా నిలిపి ఉంచడానికి ఇలాంటి దినోత్సవాలు మనల్ని ప్రోత్సహిస్తాయి. వీరుల భూమి అయిన రాజస్థాన్ లోని జోధ్పూర్ లో ఒక కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. మన దేశ శాంతి, సామరస్యాలను నష్టపరచాలనే ప్రయత్నం ఎవరు చేసినా సరే, వారికి చెంపపెట్టు లాంటి సమాధానాన్ని మన సైనికులు ఇవ్వగలరన్న సంగతి ఇప్పుడు నిశ్చయంగా అందరికీ అర్ధమైంది. మనం శాంతికాముకులం. దేశంలో శాంతిని పెంచాలనే నిబధ్ధతతో ఉంటాం. కానీ అది దేశ గౌరవంతో రాజీ పడో, లేదా దేశ సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టో మాత్రం జరగదు. భారతదేశం నిరంతరం శాంతి పట్ల అంకితభావంతో, కట్టుబడి ఉంది. ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచయుధ్ధాలలోనూ మన దేశ సైనికులు ఒక లక్ష కంటే ఎక్కువమంది శాంతి కోసం స్వచ్ఛంద బలిదానాలను ఇచ్చారు. ఆ యుధ్ధాలతో మనకు ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ కూడా. మన దృష్టి ఎన్నడూ మనది కాని భూమిపై పడలేదు. ఇది శాంతి పట్ల మనకున్న నిబధ్ధత. కొన్ని రోజుల క్రితం సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన ఇజ్రాయిల్ లో హైఫా యుధ్ధం జరిగి వందేళ్ళు పూర్తయిన సందర్భంలో, మైసూర్, హైదరాబాద్, జోధ్పూర్ లకు చెందిన ఈటెగాళ్ళైన మన వీర సైనికులను జ్ఞాపకం చేసుకున్నాం. వారిపై దండెత్తి వచ్చినవారితో మన వీర సైనికులు పోరాడి హైఫా కు ముక్తిని ప్రసాదించారు. శాంతిబాటలో పయనించాలనే ఉద్దేశంతో మన దేశ సైనికులు చేసిన ఒక సాహసం అది. ఐక్య రాజ్య సమితికి చెందిన రకరకాల శాంతి భద్రతా దళాలకు అత్యధిక సంఖ్యలో సైనికులను పంపే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. దశాబ్దాలుగా మన వీర సైనికులు నీలి హెల్మెట్ ధరించి ప్రపంచంలో శాంతిని స్థాపించడంలో కీలక పాత్రను వహిస్తున్నారు.

నా ప్రియమైన దేశప్రజలారా, ఆకాశం కబుర్లు విచిత్రమైనవి. ఆకాశానికి కూడా తమ శక్తిని పరిచయం చేసిన మన వైమానిక దళం దేశప్రజలందరి దృష్టినీ తన వైపుకి ఆకర్షించుకుంది. మనకు రక్షణను అందిస్తుందనే నమ్మకాన్ని కుదిర్చింది. గణతంత్ర దినోత్సవ ఉత్సవ సమయంలో జరిగే పెరేడ్ లో  ఏ భాగం కోసం ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తారో, వాటిల్లో ఒకటి ఫ్లై పాస్ట్(fly past) . అందులో మన వైమానిక దళం ఆశ్చర్యకరమైన పనులతో తన శక్తిని ప్రదర్శిస్తుంది. అక్టోబర్ 8వ తేదీన మనం వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటాం. 1932లో ఆరుగురు పైలట్లు , 19 మంది సైనికులతో మొదలైన అతి చిన్న వైమానిక దళం పెరిగి పెద్దయ్యింది. ఇవాళ మన దళం ఇరవై ఒకటవ శతాబ్దంలోకెల్లా సాహసవంతమైన, శక్తివంతమైన వైమానిక దళాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం.  దేశం కోసం తమ సేవను అందించే ఈ వాయు యోధులకు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు. 
1947 లో పాకిస్తాన్ వారు ఆకస్మిక దాడి మొదలుపెట్టినప్పుడు, శ్రీనగర్ ను ఆక్రమణదారుల నుండి భారత                                                                                                                                                                                                                                                                            వైమానిక దళాలవారే రక్షించారు. భారతీయ సైనికులు, వారి సాధనాలు, యుధ్ధ సమయంలో సరిగ్గా సమయానికల్లా చేరేలా ఖచ్చితమైన ప్రణాళిక చేసింది మన వైమానిక దళాలవారే. 1965లో శత్రువుల మొహం పగిలేలా జవాబునిచ్చింది  కూడా మన వైమానిక దళమే. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం గురించి ఎవరికి తెలీదు? 1999 లో కార్గిల్ ను చొరబాటుదారుల వశం నుండి విడిపించడంలో కూడా వైమానిక దళం ముఖ్య పాత్రను వహించింది. టైగర్ హిల్స్ లో శత్రువుల స్థావరాలపై రాత్రింబవళ్ళూ బాంబుదాడి చేసి వారిని మట్టి కరిపించింది కూడా మన వైమానిక దళమే. సహాయ పునరావాసాలు అయినా, విపత్తు నిర్వహణ అయినా సరే మన వాయుసేనా యోధులు చేసే మెచ్చుకోలు పనుల వల్ల దేశానికి వారి పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉంది. తుఫాను, గాలివాన, వరదలు నుండి అడవిలో కార్చిచ్చుల వరకూ ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ ఎదుర్కొని, దేశప్రజలకు సహాయం చెయ్యడంలో వారు చూపే తెగువ అద్భుతమైనది. దేశంలో gender equality అంటే స్త్రీ, పురుష సమానత్వాన్ని నిరూపించడంలో వైమానికదళం వారు ఒక ఉదాహరణగా నిలిచారు. ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని మన దేశ ఆడపడుచుల కోసం ఏర్పాటు చేసారు. ఇప్పుడైతే మన వైమానిక దళం స్త్రీల కోసం short service commission తో పాటూ permanent commissionను కూడా ప్రత్యామ్నాయంగా ఇస్తోంది. ఆగస్టు15 న ఎర్రకోట వేదిక నుండి నేను ఈ ప్రకటనను చేసాను. భారత సైన్యంలో సాయుధ బలగాలలో పురుష శక్తి తో పాటూ స్త్రీ శక్తి సహకారం కూడా సమానంగా ఉందని  ఇప్పుడు భారతదేశం గర్వంగా చెప్పగలదు. శక్తిస్వరూపమైన స్త్రీ ఇప్పుడు సాయుధురాలు కూడా అవుతోంది.

నా ప్రియమైన దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం మన నౌకా దళానికి చెందిన అభిలాష్ టోమీ అనే అధికారి తన జీవితం కోసం మృత్యువుతో పోరాటం చేశారు. యావత్ దేశం ఆయనను ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన పడింది. మీకు తెలుసు కదా అభిలాష్ టోమీ చాలా సాహసవంతుడైన అధికారి. ఏ రకమైన ఆధునిక సాంకేతికతనూ ఉపయోగించుకోకుండా, కేవలం ఒక చిన్న నావ సహాయంతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. దక్షిణ హిందూ మహా సముద్రంలో Golden Globe Raceలో పాల్గోవడానికి ఆయన గత ఎనభై రోజులుగా సముద్రంలో తన వేగాన్ని అదుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ భయంకరమైన సముద్రపు తుఫాను ఆయనకు ఇబ్బందులను తెచ్చింది. కానీ భారత నౌకా దళానికి చెందిన ఈ వీరుడు సముద్రంలో అనేక రోజుల పాటు పోరాడుతూ గడిపాడు. ఆ సముద్రపు నీటిలో తిండితిప్పలు లేకుండా నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు కానీ ఓటమిని ఒప్పుకోలేదు. సాహసం, సంకల్పబలం, పరాక్రమాలకు అతి పెద్ద ఉదాహరణ అతను. కొద్ది రోజుల క్రితం అతడిని సముద్రంలోంచి రక్షించి బయతకు తీసుకువచ్చిన తరువాత నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడాను. ఇంతకు మునుపు కూడా నేనతన్ని కలిసాను. ఇంతటి ఆపద నుండి బయటకు వచ్చిన తరువాత కూడా అతడిలోని ధైర్యం, పోరాట పటిమ, మరోసారి ఇటువంటి సాహసం చెయ్యాలనే కోరిక ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దేశ యువతకు ప్రేరణాత్మకమైనవి. అభిలాష్ టోమీ ఆరోగ్యం మెరుగవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన సాహసం, ఆయన పరాక్రమం, ఆయన సంకల్పబలం, పోరాట పటిమ, గెలవాలనే సంకల్పం మన దేశ యువతకు తప్పకుండా ప్రేరణను అందిస్తాయి.

నా ప్రియమైన దెశప్రజలారా, అక్టోబర్ రెండవ తేదీ మన దేశానికి ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అక్టోబర్ రెండుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి నుండీ మొదలుకొని ఒక రెండేళ్ళ వరకూ మనందరము మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా జరుపుకోబోతున్నాం. మహాత్మా గాంధీ ఆలోచనలు యావత్ ప్రపంచానికీ ప్రేరణను అందించాయి. Dr. Martin Luther King Junior , Nelson Mandela లాంటి గొప్ప నాయకులు కూడా తమ ప్రజలకు సమానత్వం, గౌరవం తాలూకూ హక్కులను అందించడానికి జరిపిన పోరాటాలకు మహాత్మా గాంధీ ఆలోచనల నుండి శక్తిని పొందినవారే. ఇవాళ్టి మన్ కీ బాత్ కార్యక్రమంలో నేను పూజ్య బాపూ జరిపిన మరొక ముఖ్యమైన పనిని గురించి మీతో చర్చించాలనుకుంటున్నాను. దీని గురించి వీలయినంత ఎక్కువమంది దేశప్రజలందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. 1941లో గాంధీ గారు constructive programme అంటేరచనాత్మక కార్యక్రమ రూపంలో కొన్ని ఆలోచనలను రాయడం మొదలుపెట్టారు. తర్వాత 1945లో స్వతంత్ర పోరాటం ఊపందుకొన్నప్పుడు ఆయన తన ఆలోచనల సవరణా ప్రతి ని తయారుచేసారు. పూజ్య బాపూ రైతులు, పల్లెలు, శ్రామికుల అధికారాలను రక్షించడం కోసం, పరిశుభ్రత, విద్య లాంటి అనేక విషయాలపై తన ఆలోచనలను దేశప్రజల ముందర పెట్టారు. దానిని గాంధీ చార్టర్(Gandhi Charter) అని కూడా అంటారు. పూజ్య బాపు ప్రజా సంగ్రాహకుడు.  ప్రజలతో కలిసిపోవడం, వారిని తనతో కలుపుకోవడం అనేది బాపూ ప్రత్యేకత. అది ఆయన స్వభావం. ఇది ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకతగా అందరూ గుర్తించారు. ఇది దేశానికి ఎంతో అవసరమైన, ముఖ్యమైన ఆవస్యకత అని బాపూ అందరికీ అర్థమయ్యేలా చేశారు. స్వతంత్ర పోరాటం జరిగిన సమయంలో ఆయన వహించిన ముఖ్య పాత్ర ఏమిటంటే ఆ పోరాటాన్ని ఒక ప్రజా-ఉద్యమంగా మార్చడం. మహాత్మా గాంధీ గారి ఆహ్వానంపై సమాజంలోని ప్రతి వర్గానికీ, ప్రతి ప్రాంతానికీ సంబంధించిన ప్రజలందరూ కూడా స్వతంత్ర పోరాట ఉద్యమానికి తమను తాము అంకితం చేసుకున్నారు. బాపు మనందరికీ ఒక ప్రేరణాత్మక మంత్రాన్ని ఇచ్చారు. అది గాంధీగారి తాయత్తు అనే పేరుతో పసిధ్ధి చెందింది.అందులో గాంధీ గారు ఏం చెప్పారంటే, “నేను మీ అందరికీ ఒక తాయొత్తు ని ఇస్తాను. మీకు ఎప్పుడైనా ఏదైనా సందేహం కలిగినా, లేదా మీ అహం మీపై అధికారాన్ని చూపెట్టినా సరే ఒక పరీక్షను పెట్టుకోండి. మీరు చూసిన వ్యక్తుల్లో అతి పేద, బలహీన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతడి మొహాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు వేయబోయే అడుగు ఆ వ్యక్తికి ఎలాంటి సహాయాన్ని అందించగలదు? అని ఆలోచించండి . ఆ పేద వ్యక్తికి నా నిర్ణయం సహాయపడగలదా? దానివల్ల అతడికి ఏదైనా లాభం చేకూరగలదా? దీనివల్ల అతడు తన జీవితమ్లో ఏవైనా మార్పులు చేసుకోగలడా? నా నిర్ణయం వల్ల ఆకలితో అలమటిస్తున్న కోట్ల కొద్దీ ప్రజల ఆకలి తీరగలదా? వారి ఆత్మ సంతృప్తి చెందగలదా? అని ప్రశ్నించుకోండి. అప్పుడు నీ సందేహ నివృత్తి జరుగుతున్నట్లు, నీ అహం కరిగిపోతున్నట్లు నీకు అనిపిస్తుంది” అని చెప్పారు బాపూ.

నా ప్రియమైన దేశప్రజలారా, గాంధీ గారు చెప్పిన ఈ మంత్రం ఇప్పటికీ ముఖ్యమైనదే. నేడు దేశంలో  మధ్యవర్గం పెరుగుతోంది, వారి ఆర్థిక శక్తి పెరుగుతోంది, కొనుగోలు శక్తి పెరుగుతోంది. మనం ఏదన్న కొనేందుకు వెళ్ళినప్పుడు ఒక్క క్షణం పూజ్య బాపూ ని గుర్తు చేసుకుని, ఆయన చెప్పిన ఈ మంత్రాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ వస్తువు కొనుగోలు చెయ్యడం వల్ల నేను దేశంలో ఏ పౌరుడికి లాభం ఇస్తున్నాను?ఎవరి మొహంలో సంతోషాన్ని వెలిగిస్తున్నాను? నా కొనుగోలు వల్ల ఎవరికి నేరుగా కానీ పరోక్షంగా గానీ లాభం కలగబోతోంది? దీని వల్ల నిరుపేద వ్యక్తికి లాభం కలిగితే నా కొనుగోలు వల్ల నేను చాలా సంతోషాన్ని పొందుతాను. భవిష్యత్తులో మీ ప్రతి కొనుగోలు ముందరా,  గాంధీ గారు చెప్పిన ఈ మంత్రాన్ని గనుక మీరు గుర్తు ఉంచుకోవాలి. గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ఇది గనుక గుర్తు పెట్టుకుంటే మన కొనుగొలు వల్ల ఎవరో ఒక నిరుపేదకు ఉపయోగం కలుగుతుంది, అతడు చిందించిన చమటకు, పడిన కష్టానికీ, అతడి పెట్టుబడి పెట్టిన ప్రతిభకూ అన్నింటికీ ఏదో ఒక లాభం చేకూరుతుంది అని ఆలోచించాలి. ఇదే గాంధీ గారి తాయత్తు. ఇదే ఆయన సందేశం. అందరి కంటే పేదవాడు, బలహీనుడు అయిన వ్యక్తి జీవితంలో మీరు వేసే అడుగు వల్ల గొప్ప మార్పు రాగలదు అని నాకు నమ్మకం ఉంది.

నా ప్రియమైన దేశప్రజలారా, పరిశుభ్రత పాటిస్తే స్వాతంత్ర్యం లభిస్తుంది అని గాంధీగారు చెప్పారు. ఎలాగో ఆయనకూ తెలిసి ఉండదు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలానే ఇవాళ మీరు చేసే ఈ చిన్న పని వల్ల కూడా నా దేశ ఆర్థిక అభివృధ్ధి, ఆర్థిక సాధికారత, పేదవాడికి పేదరికంతో పోరాడే శక్తిని ఇవ్వడానికి నా సహకారం ఉంటుందా అని మీకు అనిపించవచ్చు. కానీ నేటి యుగంలో ఇదే నిజమైన దేశభక్తి, ఇదే గాంధీ గారికి మనం ఇచ్చే కార్యాంజలి. ఉదాహరణకి, ప్రత్యేక సందర్భాల్లో ఖాదీ, చేనేత ఉత్పాదక కొనుగోళ్ళ వల్ల అనేకమంది చేనేత కర్మికులకి సహాయాన్ని అందించినవాళ్ళమౌతాము. లాల్ బహదూర్ శాస్త్రి గారు పాతబడిన, చిరిగిన చేనేత వస్త్రాలను కూడా దాచిపెట్టి వాడుకునేవారట. అందులో ఎవరి కష్టం ఉందో కదా అనే ఆలోచనతో అలా చేసేవారుట. ఈ ఖాదీ వస్త్రాలన్నీ కూడా ఎంతో కష్టపడితే గాని తయారవ్వవు, వీటి ఒక్కొక్క దారం ఉపయోగపడాలి అనేవారుట. దేశం పట్ల అభిమానం, దేశప్రజల పట్ల ప్రేమ కనబడే ఇటువంటి గొప్ప భావనలు అతి చిన్న అడుగులు వేసే ఆ మహామనీషి నరనరాల్లోనూ నిండి ఉన్నాయి. రెండు రోజుల్లో పూజ్య బాపు తో పాటూ మనం శాస్త్రి గారి జయంతిని కూడా జరుపుకోబోతున్నాం. శాస్త్రి గారి పేరు వినగానే మన భారతీయుల మనసుల్లో ఒక అనంతమైన భక్తిశ్రధ్ధలు ఎగసిపడతాయి. వారి సౌమ్య వ్యక్తిత్వం ప్రతి పౌరుడినీ ఎప్పటికీ గర్వంతో  నింపేస్తుంది.

బయట నుంచి అతి వినమ్రంగా కనబడి, లోపలి నుండి మాత్రం పర్వతం లాంటి ధృఢ నిశ్చయం కలిగి ఉండేవారు  లాల్ బహదూర్ శాస్త్రి గారు. “జయ్ జవాన్ జయ్ కిసాన్” అన్న నినాదం శాస్త్రి గారి గొప్ప వ్యక్తిత్వానికి ఒక చక్కని నిదర్శనం. ఏదాదిన్నర కాలం పాటు సాగిన ఆయన సంక్షిప్త పదవీ కాలంలో, ఆయన దేశ సైనికులకు, రైతులకు విజయశిఖరాలను అందుకునే మంత్రం ఇచ్చారు. ఇది దేశం పట్ల ఆయనకు ఉన్న నిస్వార్థ ప్రేమకు నిదర్శనం.

నా ప్రియమైన దేశప్రజలారా, ఇవాళ మనం పూజ్యులైన బాపుని గుర్తు చేసుకుంటున్నప్పుడు పరిశుభ్రత గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణమే. సెప్టెంబర్ పదిహేను నుండీ “పరిశుభ్రతే సేవ” అనే ఒక ఉద్యమం మొదలైంది. కోట్ల కొద్దీ ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. నాకు కూడా ఢిల్లీలోని అంబేద్కర్ పాఠశాల లో పిల్లలతో పరిశుభ్రత శ్రమదానం చేసే అవకాశం లభించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఆ పాఠశాలకు పునాది వేశారుట. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలూ ఈ సెప్టెంబర్ పదిహేను వ తేదీన జరిగిన శ్రమదానంలో పాల్గొన్నారు. అనేక సంస్థలు ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నాయి. స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, యువజన సంఘాలు, మీడియా గ్రూపులు, కార్పరేట్ ప్రపంచంలోనివారందరూ కూడా పెద్ద ఎత్తున పరిశుభ్రతకై శ్రమదానం చేశారు. ఇందుమూలంగా ఈ పరిశుభ్రతా ప్రేమికులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుయచేస్తున్నాను. రండి ఒక ఫోన్ కాల్ విందాం –
“నమస్కారం! నా పేరు షైతాన్ సింగ్. పూగల్ తాలూకా, బికనేర్ జిల్లా, రాజస్థాన్ నుండి మాట్లాడుతున్నాను. నేనొక అంధుడిని. నా రెండు కళ్ళు కనబడవు. నేను పూర్తి గుడ్డివాడిని. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ’మన్ కీ బాత్ కార్యక్రమం’ ద్వారా మోదీ గారు చేపట్టిన పరిశుభ్ర భారతదేశాన్ని తయారుచేసే పని చాలా గొప్పది. నాలాంటి అంధులు మరుగుదొడ్ల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంట్లోనే  మరుగుదొడ్ల నిర్మాణం జరిగడం వల్ల మాకు చాలా ఉపయోగం జరిగింది. ఇది చాలా గొప్ప అడుగు. ఈ పని ఇలానే ముందుకు సాగాలి”

అనేకానేక ధన్యవాదాలు.  మీరు చాలా మంచి మాట చెప్పారు. ప్రతివారి జీవితంలోనూ పరిశుభ్రతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వచ్ఛ భారత ఉద్యమం ద్వారా మీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మణం జరిగడం వల్ల అది మీకు బాగా ఉపయోగపడుతోంది. ఇంతకు మించిన ఆనందం మా అందరికీ ఇంకేముంటుంది? మీకు కనబడదు కాబట్టి చూడలేకపోతున్నారు కానీ ఈ ఉద్యమం ద్వారా కలిగిన ప్రయోజనం ఇందులో పాల్గొన్న వారికి కూడా అంచనా ఉండి ఉండదు . మరుగుదొడ్డి నిర్మాణం జరగక ముందు మీరెన్ని  ఇబ్బందులతో జీవితాన్ని గడిపేవారో, మరుగుదొడ్డి నిర్మాణం జరిగిన తర్వాత అది మీ పాలిట ఎలా వరంగా మారిందో అన్న విషయం మీరు ఫోన్ చేయకపోయి ఉంటే మాకు తెలిసేది కాదు. పరిశుభ్రతా ఉద్యమంలో పాలుపంచుకున్నవారందరి దృష్టికీ ఈ సున్నితమైన అంశం వచ్చేది కాదు. మీ ఫోన్ కాల్ కి గానూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, “స్వఛ్ఛ భారత్ మిషన్” కేవలం మన దేశం లోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక విజయవంతమైన కథ అయ్యింది. దీని గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. చరిత్రలో నిలిచిపోయేలాంటి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పరిశుభ్రతా సదస్సు ని ఈసారి భారతదేశం నిర్వహించబోతోంది.  ‘Mahatma Gandhi International Sanitation Convention’ అంటే “మహాత్మా గాంధీ అంతర్జాతీయ పరిశుభ్రతా సదస్సు” ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుభ్రతా మంత్రులు, ఈ రంగంలోని నిపుణులు ఒకటిగా వచ్చి ఈ పరిశుభ్రతా సదస్సులో తమతమ ప్రయోగాలు, అనుభవాలు పంచుకుంటారు.  2018 అక్టోబర్ రెండవ తేదీన బాపూ 150వ జయంతి ఉత్సవాల ప్రారంభం తో పాటూ ఈ ‘Mahatma Gandhi International Sanitation Convention’ పూర్తవుతుంది. 

నా ప్రియమైన దేశప్రజలారా, సంస్కృతంలో ఒక మాట ఉంది – “న్యాయమూలం స్వరాజ్యం స్యాత్”. అంటే స్వరాజ్య మూలంలోనే న్యాయం ఉంటుంది. న్యాయాన్ని గురించిన చర్చ జరిగినప్పుడు మానవ అధికారాల భావంలోనే పూర్తిగా అది అంతర్గతమై ఉంటుంది. శోషిత,పీడిత, వంచిత ప్రజలకు స్వతంత్రం, శాంతి, న్యాయం అందించాలంటే, అది ప్రత్యేకంగా అనివార్యమైన సంగతి. బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా నిర్మితమైన రాజ్యాంగంలో పేదల ప్రాధమిక హక్కుల కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. వాటి దృష్టితో ప్రేరణ పొంది, 1993 అక్టోబర్ 12, న “జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే “‘National Human Rights Commission’ (NHRC)  స్థాపించబడింది. కొద్ది రోజుల్లో NHRC పాతికేళ్ళు పూర్తిచేసుకోబోతోంది. NHRC  కేవలం మానవ హక్కులను మాత్రమే రక్షించలేదు. మనవత గౌరవాన్ని కూడా పెంచే పని చేసింది ఈ కమీషన్. మన మాజీ ప్రధానీ, మన ప్రాణ ప్రియ నేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయ్ గారు స్పష్టంగా చెప్పారు – మానవ హక్కులనేవి మనకి పరాయివేమీ కాదు. మన జాతీయ మానవ హక్కుల కమిషన్ చిహ్నాంలో వైదిక కాలం నాటి ఆదర్శ సూత్రం “సర్వే భవంతు సుఖిన:” అంకితమై ఉంది. మానవ హక్కుల కోసం NHRC   విస్తృతమైన అవగాహనని కల్పించింది. దానితో పాటూ ఇందులో ఆ హక్కుల దురుపయోగాన్ని అడ్డుకునేందుకు కూడా మెచ్చుకోదగ్గ పాత్రను వహించింది. పాతికేళ్ల ఈ ప్రయాణంలో దేశప్రజల్లో NHRC   ఒక ఆశనీ, ఒక నమ్మకపు వాతావరణాన్నీ ఏర్పరిచింది. ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం , ఉత్తమ ప్రజాస్వామ్య విలువల కోసం ఇదొక పెద్ద ఆశాపూర్వకమైన ఘటన అని నా నమ్మకం. ఇవాళ జాతీయ స్థాయిలో మానవ హక్కుల పనితో పాటూ ఇరవై ఆరు దేశాల మానవ హక్కుల కమిషన్ కూడా స్థాపించబడింది. ఒక సమాజ రూపంలో మానవ హక్కులను అర్థం చేసుకుని, ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాల్సి ఉంది. ఇదే “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” – ’అందరి సహకారంతో -అందరికీ అభివృధ్ధి ’ అనే ఆలోచనకి ఆధారం.

నా ప్రియమైన దేశప్రజలారా, అక్టోబర్ నెలలో జయ ప్రకాశ్ నారాయణ్ గారి జయంతి ఉంది. ఇదే నెలలో రాజమాత విజయరాజే సింధియా గారి శతాబ్ది జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ మహా పురుషులందరూ మనకి ప్రేరణాత్మకమైనవారు.  వారికి నా నమస్సులు. అక్టోబర్ 31 వ తేదీన సర్దార్ సాహెబ్ జయంతి ఉంది. వీరి గురించి రాబోయే మన్ కీ బాత్ లో నేను వివరంగా చెప్తాను కానీ ఇవాళ మాత్రం నేను తప్పకుండా ఈ ప్రస్తావన చెయ్యలనుకున్నాను. గత కొన్నేళ్ళ నుండీ సర్దార్ సాహెబ్ జయంతి అయిన అక్టోబర్ 31 నాడు “రన్ ఫర్ యూనిటీ” అని భారతదేశంలో ప్రతి చిన్న- పెద్ద పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో “రన్ ఫర్ యూనిటీ” ఏర్పాటుచేయడం జరుగుతోంది. ఈసారి కూడా మనం ప్రయత్నపూర్వకంగా ప్రతి చిన్న- పెద్ద పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో ఈ “రన్ ఫర్ యూనిటీ”ని ఏర్పాటుచేద్దాం. “రన్ ఫర్ యూనిటీ” అనే కార్యక్రమం సర్దార్ సాహెబ్ ను గుర్తుచేసుకుందుకు ఉత్తమ మార్గం. ఎందుకంటే ఈయన జీవితమంతా భారతదేశ సమైక్యత కోసం పాటుపడ్డారు. అక్టోబర్ 31 న “రన్ ఫర్ యూనిటీ” ద్వారా సమాజంలో ప్రతి వర్గాన్నీ, దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ సమైక్యతాభావంతో ముడిపెట్టేందుకు మనం చేసే ప్రయత్నాలన్నింటికీ మనం బలాన్నిద్దాం. ఇదే ఆయనకు మనం ఇచ్చే చక్కని శ్రధ్ధాంజలి.

నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి , దుర్గా పూజ లేదా విజయదశమి ఏ పేరైనా ఈ పవిత్ర పండుగల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.