Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 ఫిబ్రవరి 15వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం

2018 ఫిబ్రవరి 15వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం

2018 ఫిబ్రవరి 15వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం

2018 ఫిబ్రవరి 15వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం


పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చిన నా సోదరులు మరియు సోదరీమణులారా,

భారతదేశం ఎప్పుడు సూర్యోదయాన్ని దర్శించాలన్నా; ఎప్పుడు సూర్యోదయాన్ని చూడవలసిన అవసరం వచ్చినా, దేశం మొత్తం ముందుగా అరుణాచల్ వైపు తమ దృష్టి మరల్చవలసిందే. మన దేశం మొత్తంలోని 125 కోట్ల మంది ప్రజలు సూర్యోదయాన్ని చూడాలనుకుంటే, వారు అరుణాచల్ వైపు చూడకుండా సూర్యోదయాన్ని చూడలేరు. అదే అరుణాచల్ నుండి అంధకారం అంతమై వెలుగు విస్తరిస్తుంది; రానున్న రోజుల్లో ఈ ప్రదేశం నుండి అభివృద్ధి అనే కాంతి భారతదేశంలో వెలుగులు విరజిమ్మడానికి ఉపయోగపడుతుంది.

అరుణాచల్ ని అనేక సార్లు దర్శించడం నా అదృష్టం. నేను సంస్థకు పనిచేస్తున్నప్పుడు ఇక్కడకు వచ్చాను. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇక్కడకు వచ్చాను. ప్రధానమంత్రి అయ్యాక ఇక్కడకు వచ్చి ఇలా మీ అందరితో కలిసే అవకాశం రావడం ఇది రెండోసారి.

వారం రోజులపాటు మొత్తం హిందూదేశాన్నంతా చూసి, అరుణాచల్ లో ఒక్క రోజు గడపడానికి వస్తే – ఆ ఒక్క రోజులోనే ” జై హింద్” అనే పదాన్ని అనేక సార్లు వింటాం. వారం రోజుల్లో దేశం మొత్తం మీద జై హింద్ అనే పదాన్ని వింటామో – అంతకంటే ఎక్కువగా ఆ ఒక్క రోజులో అరుణాచల్ లో వింటాము. ఈ రకంగా ఒకరినొకరు జై హింద్ అని పలకరించుకునే సాంప్రదాయాన్నీ, జై హింద్ తో ప్రారంభమై, జై హింద్ తో ముడిపడి ఉన్న ఇటువంటి సామాజిక జీవనాన్నీ భారతదేశంలో ఒక్క అరుణాచల్ ప్రదేశ్ లోనే మనం చూస్తాము. దేశభక్తి, దేశంపై ప్రేమ అనేవి ఇక్కడ ప్రతి వ్యక్తి నరనరాన్నా ప్రవహిస్తుంది; కష్టపడి పనిచేయడం ద్వారా అరుణాచల్ ప్రజలు దీన్ని తమ దేహంలో, తమ జీవితంలో ఒక భాగంగా మలచుకున్నారు .

ఈశాన్య భారతదేశంలో హిందీ ఎక్కువగా ఉపయోగించి, అర్ధం చేసుకుంటున్నరాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది నా అరుణాచల్ ప్రదేశ్. ఈమధ్య నేను ఈశాన్య ప్రాంతంలో ఎక్కువగా పర్యటించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే, సమయాభావం వల్ల గత ప్రధానమంత్రులెవరూ ఇక్కడకు రాలేకపోయారన్న సంగతి మీకు తెలిసినదే. కానీ మీలో ఒకరిగా నేను ఇక్కడకు రాకుండా ఉండలేక పోతున్నాను. ఈశాన్య భారతంలో నేను ఎక్కడకు వెళ్లినా, అక్కడ యువత తమకు హిందీ నేర్చుకోవాలని ఉందంటూ ప్లకార్దులు ప్రదర్శిస్తున్నారు. వారికి హిందీ బోధించాలి. ఇది ఒక భారీ విప్లవం. దేశప్రజలతో వారి భాషలో మాట్లాడాలనే ఈ కోరిక, యువతరంలో ఉన్న ఈ కోరిక, దానంతట అదే ఒక పెద్ద శక్తిగా నిలిచింది.

ఈ రోజు, మూడు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. భారత ప్రభుత్వ బడ్జెట్ నుండి అరుణాచల్ ప్రజలకు ఈ భారీ బహుమతి ఇవ్వడం జరిగింది. భారత ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా దీన్ని అందించడం జరిగింది. ఇది ఈశాన్య ప్రాంత మంత్రిత్వ శాఖ ( DoNER) ద్వారా జరిగింది. ఈ పని ఇప్పటికే సచివాలయంలో ప్రారంభమైంది. వంతెన నిర్మాణం పూర్తి అయినప్పటికీ, ఒక రాజకీయ నాయకునికి సమయం లేకపోవడం వల్ల ఆ వంతెన ప్రారంభానికి నోచుకోలేదనీ, నెలల తరబడి అది నిరుపయోగంగా ఉందనీ, వార్తా పత్రికల్లో మనం చూస్తూనే ఉంటాము. ఒక రహదారి నిర్మాణం పూర్తయినప్పటికీ, రాజకీయ నాయకునికి సమయం లేకపోవడం వల్ల, ఆ రహదారి అలాగే ఉండిపోతోంది.

ప్రభుత్వం ఏర్పాటయ్యాక మేము ఒక కొత్త సంస్కృతిని ప్రారంభించాము. మేము ప్రారంభించిన ఈ కొత్త సంస్కృతి ప్రకారం మీరు ఒక నాయకుని కోసం వేచి చూడవలసిన అవసరం లేదు; ప్రధానమంత్రి కోసం కూడా వేచి ఉండవలసిన పని లేదు. ఒక సదుపాయం లేదా సౌకర్యం నిర్మాణం పూర్తయితే, మీరు దాన్ని ఉపయోగించడం ప్రారంభించాలి. మాకు సమయం చిక్కినప్పుడు దాన్ని దేశానికి అంకితం చేస్తాము. పని నిలిచిపోకూడదు. దీన్ని ఉపయోగించడం ప్రారంభించినందుకు నేను పేమాజీ ని అభినందిస్తున్నాను. దాన్ని దేశానికి అంకితం చేసే పని ఈ రోజు జరుగుతోంది. ధనాన్ని ఏ విధంగా ఆదా చేయాలి ? ఆ ధనాన్ని ఎలా సద్వినియోగం చేయాలి ? ఈ చిన్న ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోవచ్చు.

ప్రభుత్వానికి చెందిన శాఖలు చెల్లాచెదురుగా విసిరేసినట్లు ఉంటే, ఒకరు ఇక్కడ కూర్చుంటే, మరొకరు మరోచోట కూర్చుంటారు. భవనం కూడా పురాతనమైందిగా ఉంటే, అక్కడ పనిచేసే అధికారి తొందరగా ఇంటికి వెళ్లాలని యోచిస్తాడు. వాతావరణం సక్రమంగా ఉంటే, కార్యాలయం పరిసరాలు చక్కగా ఉంటే, అది పని సంస్కృతిపై సానుకూల ప్రభావం చూపుతుంది. అది ఎక్కువగా శుభ్రంగా ఉండి, దస్త్రాలన్నీ సక్రమంగా అమరిస్తే, ఒక్కొక్కప్పుడు ఏమి జరుగుతుందంటే – ఒక అధికారి కార్యాలయానికి రాగానే ముందుగా ఆయన కుర్చీలో కూర్చునే ముందు దానిపై ఉన్న దుమ్మును తొలగిస్తాడు. ఒక వేళ దుమ్ము తొలగించినా అది తిరిగి అదే ప్రదేశంలో పడుతుందన్న విషయం అతనికి తెలియదు. అయినా అది ఒక మంచి కార్యాలయం అయితే దానికి సంబంధించిన అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉన్నట్లయితే, ఒక గ్రామం నుండి ఎవరైనా ఒక పని మీద సచివాలయానికి వచ్చినట్లైతే, ఆ పని ఇక్కడ చేసేది కాదు, రెండు కిలోమీటర్ల అవతల మరో ప్రాంతానికి వెళ్ళాలి అని ఎవరూ అతనికి చెప్పరు. అతను అక్కడికి వెళ్తే, అప్పుడు అక్కడ కాదు, రెండు కిలోమీటర్ల అవతల మరో కార్యాలయానికి వెళ్లాలని ఎవరైనా చెబుతారు. ఇప్పుడైతే, ఎవరైనా పొరపాటున వేరే శాఖకు వెళ్లినా – ” బాబూజీ మీరు ఇక్కడకు వచ్చారు బాగానే ఉంది. కానీ మీరు దయచేసి పక్కన ఉన్న గదికి వెళ్ళండి.” అని అక్కడివాళ్లు చెబుతారు. దీనివల్ల సామాన్య ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

రెండోది, ప్రభుత్వం ఏక పక్షంగా ఏపనీ చేయలేదు. ప్రజలందరూ కలిసి ఒకే మార్గంలో ముందుకు నడిస్తేనే ప్రభుత్వం మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఒకవేళ ఆ సమన్వయం సాంకేతికమైనదైతే, అప్పుడు అది కొంచెం తక్కువ శక్తివంతంగా ఉంటుంది, కానీ ఆ సమన్వయం సహజసిద్దమైనదైతే, అప్పుడు అది చాలా శక్తివంతంగా ఉంటుంది. అధికారులందరూ ఒకే ప్రాంగణంలో పనిచేస్తున్నట్లైతే, అప్పుడు వారి మధ్య ఒక సహజమైన పరిచయాలు ఉంటాయి. అధికారులందరూ కలిసి క్యాంటీన్ కు వెళ్తారు. అప్పుడు వారు ఒకరితో ఒకరు నిరంతర చర్చల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. అంటే, పని లోనూ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోనూ సమన్వయం పెరుగుతుంది. పనుల వేగంగా పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ సులభతరమవుతుంది. అందుకే, ఈటానగర్ లోని శ్రీమాన్ డోర్జీ ఖండూ రాష్ట్ర కన్వెన్షన్ సెంటర్ ను జాతికి అంకితం చేసే ముఖ్యమైన పని చేస్తున్నందుకు నేను ఈ రోజు గర్వపడుతున్నాను. ఈ కొత్త సచివాలయం అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన సామాన్య ప్రజల ఆశలు, అంచనాలను తీర్చే విధంగా ఉంది. ఇది కేవలం ఒక భవనాన్ని అంకితం చేయడం మాత్రమే కాదు. భవిష్యత్తులో ఇది అరుణాచల్ ప్రజల కలలను సాకారం చేసే సజీవ శక్తి కేంద్రంగా నిలుస్తుంది. ఈ కేంద్రంలో సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే సౌకర్యం ఉంది. ఒకవేళ అరుణాచల్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించుకోవాలని అనుకుంటే – ఇక్కడ ఒక సమావేశ మందిరం అందుబాటులో ఉందని, భారత ప్రభుత్వానికి చెందిన వివిధ కంపెనీలకు నేను తెలియజేస్తాను. అప్పుడు వారు తమ సంస్థల సర్వ సభ్య సమావేశాలను అరుణాచల్ లో నిర్వహించుకోవచ్చు. “మీరింతవరకు ఢిల్లీ, ముంబాయి పట్టణాలలో అనేక సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు దయచేసి ఒక్కసారి నా అరుణాచల్ సందర్శించండి. ఇది ఎంతో మనోహరమైన రాష్ట్రం. అక్కడ పర్యటించి సూర్యోదయాన్ని తిలకించండి”. అని – ప్రయివేటు రంగంలోని వారికి కూడా నేను చెబుతాను. నేను ప్రజలను ప్రోత్సహిస్తాను. పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగినప్పుడు, పర్యాటక రంగం ముఖ్యంగా “కాన్ఫరెన్స్ టూరిజం” అభివృద్ధి చెందుతుంది. అటువంటి విధానాన్ని రూపొందించినప్పుడు, సహజంగానే ప్రజలందరూ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

మేము ప్రభుత్వంలో ఒక కొత్త ప్రయోగాన్ని కూడా ప్రారంభించాము. గత 70 ఏళ్లుగా ప్రభుత్వం ఢిల్లీ నుండి పనిచేస్తోంది, ప్రజలు ఢిల్లీ వైపు చూస్తూ ఉండేవారు. అధికారం స్వీకరించిన అనంతరం, దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికీ ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళడానికి మాకు మేముగా చర్యలు చేపట్టాము. ఇప్పుడు తమ తోనే ప్రభుత్వం నడుస్తోందనీ, ఢిల్లీ నుండి కాదనీ, ప్రతి మారుమూల ప్రాంతం భావించాలి.

మేము ఒక వ్యవసాయ సమ్మేళనం నిర్వహించవలసి వచ్చినప్పుడు, దాన్ని మేము సిక్కిం లో ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా మంత్రులందరినీ ఆహ్వానించాము. సేంద్రీయ వ్యవసాయ రంగంలో సిక్కిం ఎంత కృషి చేసిందో చూడవలసిందిగా మేము వారికి చెప్పాము. భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు భవిష్యత్తులో నిర్వహించే భారీ సమావేశాలను వరుసగా వివిధ ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నాము. బహుశా, ఈశాన్య మండలి సమావేశంలో పాల్గొన్న చివరి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కావచ్చు. ఆ తర్వాత బహుశా ఏ ప్రధాన మంత్రికీ, ఇక్కడకు రావడానికి తగిన సమయం చిక్కలేదు. కానీ నేను మీకోసం వచ్చాను, నేను ఇక్కడకి మీ అందరి కోసమే వచ్చాను.

అనుదువల్లనే నేను ఈ ఈశాన్య మండలి సమావేశానికి హాజరై చాలా విస్తృతంగా చర్చలు జరిపాను. ఢిల్లీ లో కేంద్రప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ ఒకరి తర్వాత ఒకరుగా వారి సిబ్బందితో కలిసి ఈశాన్య ప్రాంతంలోని వివిధ రాష్ట్రాలలో పర్యటించాలని నేను ఆదేశించాను. నెలలో ఒక్క వారం కూడా ఎవరో ఒక మంత్రి ఎదో ఒక రాష్ట్రంలో పర్యటించకుండా ఉండకూడదు. గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా ఈ విధానం కొనసాగుతూనే ఉంది.

ఢిల్లీ నుండి ఈశాన్య ప్రాంతం కోసం మంచిగా పనిచేస్తున్న ఈశాన్య ప్రాంత మంత్రిత్వ శాఖ ను ఇప్పుడు మరో పని చేయవలసిందిగా కోరడమైనది. మొత్తం ఈశాన్య ప్రాంత మంత్రిత్వశాఖ తో పాటు మొత్తం సచివాలయం ప్రతీ నెలా ఈశాన్య ప్రాంతంలో పర్యటిస్తుంది. ఇది వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడే బస చేసి, చర్చా కార్యక్రమం నిర్వహించిన అనంతరం కలిసి కూర్చుని విధానాలు రూపొందించి, వాటిని సమీక్షించడం జరుగుతుంది. వాటి అమలును పర్యవేక్షించడం జరుగుతుంది. దీనివల్ల పనిలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎంత పని జరిగినదీ మనకు కనబడుతుంది. ఈ విధంగా ఒక కొత్త సౌకర్యం కల్పనలో భాగంగా ఈ సమావేశమందిరం నిర్మించడం జరిగింది. భారత ప్రభుత్వం తరఫున అనేక సమావేశాలు నిర్వహించుకోడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది, తద్వారా ఇది కూడా ప్రయోజనం పొందుతుంది.

ఈ రోజు ఇక్కడ ఒక ఆసుపత్రికి మరియు ఒక వైద్య కళాశాలకు శంకుస్థాపన చేసే అవకాశం నాకు కలిగింది. మన దేశంలో ఆరోగ్య రంగంలో ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉందని మనకు తెలుసు. అందులో ఒకటి మానవ వనరుల అభివృద్ధి, రెండోది మౌలికసదుపాయాలు, మూడోది అత్యంత ఆధునిక సాంకేతిక పరికారాలు. ఈ మూడు దిశల్లోనూ ఆరోగ్యరంగాన్ని పటిష్ట పరిచే దిశగా మనం కృషి చేస్తున్నాము.

మూడు పార్లమెంటు నియోజకవర్గాలను కలిపే ఈ ప్రాంతంలో ఒక పెద్ద ఆసుపత్రినీ మరియు ఒక మంచి వైద్య కళాశాలనూ సాధ్యమైనంత తొందరలో ఏర్పాటుచేయాలన్నది మా సంకల్పం. భారతదేశంలో పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే, ఆ వైద్య కళాశాలల్లో ఒక స్థానిక విద్యార్థి చదువుకుంటే, అప్పుడు అతనికి ఆ ప్రాంతంలో ఉన్న వ్యాధుల గురించీ, ఆ ప్రాంతంలో సహజంగా వచ్చే వ్యాధుల గురించి అవగాహన ఉంటుంది.

ఢిల్లీలో చదువు పూర్తి చేసుకుని తిరిగి వస్తే, అతను చదువుకున్నది ఒకటి, ఇక్కడ అరుణాచల్ లో ఉన్న వ్యాధి మరొకటి అవుతుంది. అదే ఆటను అరుణాచల్ లో చదువుకుంటే, ఇక్కడ స్థానిక ప్రజలకు వచ్చే నాలుగైదు వ్యాధులపై సహజంగా అతను అవగాహన కలిగి ఉంటాడు. దీనివల్ల చికిత్సలో నాణ్యమైన మెరుగుదల ఉంటుంది. ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధిలో స్థానికత కనబడుతుంది. అందువల్లనే వైద్య విద్యను మారుమూల ప్రాంతాలకు, అంతర్గత ప్రాంతాలకూ తీసుకువెళ్లాలని మేము కోరుకుంటున్నాము. రెండోది, విద్య పూర్తిచేసుకున్న అనంతరం ఉతీర్ణుడై బయటకు వచ్చిన విద్యార్థి , అక్కడే ఉండటానికి ఆసక్తి చూపిస్తాడు. అక్కడ ఉన్న ప్రజల బాగోగులు చూడాలని అనుకుంటాడు. ఎందుకంటే అతనికి జీవనోపాధి లభిస్తుంది. ప్రజలు కూడా ఆరోగ్య సేవలు పొందుతారు. అందువల్ల, అరుణాచల్ లో ఈ విధమైన సౌకర్యానికి శంకుస్థాపన చేసే అవకాశం నాకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇది ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది.

ప్రతీ గ్రామంలో సరైన ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో, మారుమూల ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండాలి . ప్రతి ఒక్కరికీ పెద్ద పెద్ద వ్యాధులు రాకపోయినప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలను వారు అశ్రద్ధ చేస్తారు. కొద్దీ రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుందని వారు భావిస్తారు. ఎదో ఒకటి చేసి వారు కొన్ని రోజులు ఆ బాధను భరిస్తారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ వారు మరింత అనారోగ్యం పాలౌతారు. ఒక్కోసారి అది తీవ్ర స్థాయికి చేరుకునేదాకా వారు తెలుసుకోలేరు. అందువల్ల భారతదేశంలోని 22,000 గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు (వెల్ నెస్ సెంటర్లు) ఏర్పాటు చేయనున్నాము. ఈ సంఖ్య సరైనది కాదు. బహుశా 1.5 లేదా 2 లక్షల గ్రామాలలో ఈ వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాము. దానివల్ల పొరుగున ఉన్న రెండు, మూడు గ్రామాల ప్రజలు ఈ ఆరోగ్య కేంద్రాల ప్రయోజనాన్ని పొందుతారు.

ఈ ఆరోగ్య కేంద్రాలలో నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా కనీస సదుపాయాలూ, సిబ్బంది అందుబాటులో ఉంటారు. గ్రామీణ ఆరోగ్య రంగంలో అతి ముఖ్యమైన ఈ భారీ కార్యక్రమం గురించి ఈ ఏడాది బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది. భారతదేశంలోని దాదాపు అన్ని గ్రామ పంచాయితీల్లో ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పాలన్నది మా ప్రయత్నం.

ఇంతకు ముందు నేను ప్రస్తావించిన 22,000 సంఖ్య రైతు బజార్లకు సంబంధించినది. దేశంలో ఆధునిక బజార్లను నెలకొల్పే పనిలో ఉన్నాము. దీనివల్ల సమీపంలోని 12-15-20 గ్రామాలలోని రైతులు ఆ మార్కెట్టుకు వచ్చి వారి ఉత్పత్తులను విక్రయించవచ్చు. తద్వారా గ్రామీణ ప్రజలకు సౌకర్యాలు కల్పించే ఈ రెండింటిపైనా మేము పనిచేస్తున్నాము – ప్రతి గ్రామ పంచాయితీ లోనూ ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా ప్రతీ బ్లాకులోనూ రైతుల కోసం రెండు లేదా మూడు క్రయ విక్రయ కేంద్రాలు, సుమారు 22,000 అటువంటి కేంద్రాలు నెలకొల్పడం జరుగుతుంది.

ఒక పెద్ద పధకం ద్వారా మేము ఇంతకంటే ఎక్కువగా పని చేయాలని ఆలోచిస్తున్నాము. ఈ దిశగా పలు చర్యలు తీసుకున్నాము. మన దేశంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఎంతో కొంత చేసి చేతులు దులుపుకునే విధంగా కాకుండా సంపూర్ణ వైద్య సహాయం అందించడానికి కృషి చేస్తున్నాము. ఉదాహరణకు, ఒక పక్క మానవవనరుల అభివృద్ధికి కృషి చేస్తూనే, మరో పక్క ఆసుపత్రులు, వైద్య కళాశాలల భవనాల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు; మూడోది ఒక పేద వ్యక్తి అనారోగ్యానికి గురైతే, లేదా ఒక మధ్య తరగతి కుటుంబంలో వారి కుమార్తెకు వివాహం లేదా ఒక కారు కొనుక్కోవాలన్నా, ఉదాహరణకు వచ్చే దీపావళి పండుగకు కారు కొనుక్కోవాలని నిర్ణయించుకున్న సమయంలో కుటుంబంలో ఎవరికైనా అకస్మాత్తుగా ఏదైనా వ్యాధి సోకినట్లు తెలిస్తే, కుమార్తె వివాహం నిలిచిపోతుంది. దీంతో మధ్యతరగతి వ్యక్తి తను కారు కొనుక్కోవాలన్న కలకు స్వస్తి పలికి తిరిగి సైకిల్ తో తృప్తి పడి, చివరికి అతను తమ కుటుంబ సభ్యుని చికిత్సకే అధిక ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తుంది. ఈ విధంగా ఖరీదైన మందులు, ఖరీదైన శస్త్ర చికిత్స లను మధ్య తరగతి ప్రజలు సైతం భరించలేని పరిస్థితి నెలకొని ఉంది.

ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రత్యేకంగా అనేక ప్రయోజనకరమైన పధకాలు రూపొందించింది. అయితే మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో ఎవరైనా గుండె సంబంధమైన అనారోగ్యానికి గురైతే, ఆ రోగికి స్టెంట్ వేయవలసి వస్తే, దానికి రూ. 1.25 లక్షలు లేదా రూ. 1.50 లక్షలు ఖర్చు అయ్యేది. పాపం ఆ వ్యక్తి వైద్యుని దగ్గరకు వెళ్లి స్టెంట్ గురించి అడిగితే – అప్పుడు ఆ డాక్టరు ఇదైతే రూ. 1.50 లక్షలు, అదైతే రూ. 1.00 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతారు. అప్పుడు ఆ రోగి, ఈ రెండింటికీ తేడా ఏమిటి అని డాక్టరు ను అడుగుతాడు. లక్ష రూపాయలు ఖరీదు చేసే స్టెంట్ వేసుకుంటే ఐదేళ్లు పనిచేస్తుంది, లక్షా యాభై వేల రూపాయలు ఖరీదు చేసే స్టెంట్ వాడితే జీవితాంతం ఆందోళన చెందవలసిన అవసరం ఉండదని ఆ డాక్టర్ వివరిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఐదేళ్లు జీవిస్తారా? లేక జీవితాంతం వరకు జీవిస్తారా అనేది ఎవరు చెప్పగలరు ?

వీటికి ఇంత ఎక్కువ ఖర్చు ఎందుకు అని మేము అడిగాము. మా ప్రభుత్వం సమావేశాలు నిర్వహించింది, వీటికి అసలు ఎంత ఖర్చు అవుతుందీ అనే విషయంపై మేము చర్చించాము. నా ప్రియమైన దెస ప్రజలారా, అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, స్టెంట్స్ ధరను 70 నుండి 80 శాతం మేర మేము తగ్గించాము. లక్ష, లక్షన్నర రూపాయలు ఖరీదు చేసే వాటిని, ఈ రోజు 15, 20 లేదా 25 వేల రూపాయలకే అందుబాటులోకి తెచ్చాము. ఈ రోజున ఎవరైనా సరైన చికిత్స పొందగలిగే పరిస్థితి ఏర్పడింది.

ఇక మందుల విషయానికి వస్తే ! తరచుగా అవసరమయ్యే సుమారు 800 ఔషధాలు సరసమైన ధరల్లో అందుబాటులో ఉండే విధంగా దాదాపు 3,000 ఆసుపత్రులలో దుకాణాలు ప్రారంభించాము. ప్రధానమంత్రి భారతీయ జన్-ఔషధీ పరియోజన – పిఎంబిజెపి. వీటిలో ఇప్పుడు దాదాపు 800 మందులు అందుబాటులో ఉన్నాయి. గతంలో 150 రూపాయలకు లభించే మందు ఇప్పుడు ఆదే పరిమాణంలో, అదే నాణ్యతలో 15 రూపాయలకే అందుబాటులో ఉండే విధంగా ఈ పధకం క్రింద ఏర్పాటు చేశాము.

ఇప్పుడు మేము పేద ప్రజల కోసం మరొక పని చేశాము. దేశంలో దాదాపు పది కోట్ల కుటుంబాలు అనారోగ్యంతో ఉన్నా వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. వారు కనీసం మందులు కూడా కొనుగోలు చేయలేరు. అంతే కాదు, పేదవారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, వారు తమ జీవనోపాధిని సైతం సంపాదించలేరు. కుటుంబం మొత్తం అనారోగ్యం పాలైతే, మొత్తం సమాజం కూడా అనారోగ్యానికి గురౌతుంది. తద్వారా దేశం మొత్తం అనారోగ్యానికి గురౌతుంది. అది దేశ ఆర్ధిక పురోగతి స్తంభించిపోయే పరిస్థితికి దారి తీస్తుంది.

అందువల్లనే ప్రభుత్వం ఈ దిశగా ఒక భారీ చర్య చేపట్టింది. ఆయుష్మాన్ భారత్ పధకాన్ని ప్రారంభించాము. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పధకం కింద ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఆ కుటుంబంలో ఎవరైనా ఆనారోగ్యం పాలైతే – ఒక ఏడాదిలో ఐదు లక్షల రూపాయల వరకు చికిత్సకయ్యే ఖర్చును ఆరోగ్య బీమా ద్వారా చెల్లిస్తారు. వారు తమ చేతి నుండి ఒక్క రూపాయి కూడా ఆసుపత్రికి చెల్లించవలసిన అవసరం లేదు.

ఈ ఏర్పాటు వల్ల ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆసుపత్రులు నెలకొల్పడానికి ముందుకు వస్తారు. అందువల్ల తమ తమ రాష్ట్రాల్లో ఆరోగ్యరంగంలో ఒక నూతన విధానాన్ని రూపొందించవలసిందిగా నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాను. ఈ నేపథ్యంలో – ఆసుపత్రులు నెలకొల్పడానికి ప్రయివేటు వ్యక్తులు ముందుకు వస్తే, వారికి స్థలం ఎలా కేటాయించాలి, దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ రకమైన ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యాన్ని రూపొందించుకోవాలి మొదలైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. దయచేసి వారిని ప్రోత్సహించండి. తమ తమ రాష్ట్రాల్లో 50-100 కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేసే దిశగా పెద్ద రాష్ట్రాలు కృషి చేయాలి.

దేశ వైద్య రంగంలో ఒక భారీ విప్లవాన్ని తీసుకురాగల సామర్ధ్యం ఈ ఆయుష్మాన్ భారత్ పధకానికి ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తమ పనిని వేగవంతం చేస్తాయి. ప్రయివేటు ఆసుపత్రులు కూడా వీటితో కలుస్తాయి. ఒక వ్యక్తికి శస్త్రచికిత్స అవసరమైన పక్షంలో నిరుపేద వ్యక్తి వ్యక్తికి కూడా ఏడాదికీ ఐదు లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. భారత ప్రభుత్వం ఒక ప్రత్యేక మిషన్ తరహాలో చేపట్టిన ఈ పధకం రానున్న రోజుల్లో మరింత ప్రయోజనం చేకూర్చగలదు.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ రోజు, నేను మీ మధ్యకు వచ్చాను. మూడు కార్యక్రమాల గురించి మీకు తెలుసు, కానీ నేను మీ కోసం నాలుగో బహుమతి కూడా తెచ్చాను. దాన్ని నేను ప్రకటించనా? ఆ నాలుగో బహుమతి ఏమిటంటే, వారానికి రెండు సార్లు ఇప్పుడు ఢిల్లీ నుండి నడిచే నహర్లగన్ ఎక్స్ ప్రెస్ కు అరుణాచల్ ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టడం జరిగింది.

మన ముఖ్యమంత్రి కొద్ది సేపటి క్రితం తెలియజేసినట్లు – అనుసంధానం, అది డిజిటల్ అనుసంధానం లేదా వాయు మార్గం లేదా రైలు లేదా రహదారి అనుసంధానం, ఇవి అన్నీ ఉంటే ఈశాన్య ప్రాంత ప్రజలు శక్తివంతులు, సమర్థులు అవుతారు. మొత్తం భారతదేశమంతా ఇక్కడే ఉన్నంత బలశాలురు, ప్రతిభావంతులు అవుతారు. అటువంటి సామర్ధ్యం ఇక్కడ ఉంది.

మన మంత్రి, మన గడ్కరీ జీ ప్రశంసించినట్లు, కేవలం అరుణాచల్ ప్రదేశ్ కి మాత్రమే 18,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్రాజెక్టులు అమలౌతున్నాయి. అవి రహదారుల వెడల్పు లేదా నాలుగు లైన్ల రహదారులు లేదా గ్రామీణ రహదారుల నిర్మాణం లేదా జాతీయ రహదారుల నిర్మాణం లాంటివి ఏదైనా కావచ్చు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ ప్రాజెక్టులు 18000 కోట్ల రూపాయల వ్యయంతో అమలులో ఉన్నాయి. డిజిటల్ అనుసంధానం రంగంలో కూడా ఒక మిషన్ తరహాలో ఒక గొప్ప ముందడుగు వేశాము.

ముఖ్యమంత్రిని నేను అభినందిస్తున్నాను. ఆయన ఇటువంటి అనేక పనులు చేశారు. అరుణాచల్ ఢిల్లీకి ఆనుకుని ఉన్నట్లైతే పేమా ఖండూ ప్రతీ రోజూ టెలివిజన్ వార్తల్లో కనబడుతూ ఉండేవారు. అన్ని వార్తా పత్రికల్లో ఆయన గురించి ప్రచురితమౌతూ ఉండేది. అయితే ఇది చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు ఆయనపై దృష్టి పెట్టడం లేదు.

ఆయన దేశవ్యాప్తంగా ఉన్న అనుభవజ్ఞులను ఆహ్వానించారు, కేవలం ప్రభుత్వ రంగంలో వారినే కాక, గతంలో బాగా అనుభవం ఉన్న వారినీ ఆహ్వానించారు. వచ్చే పదేళ్లలో అరుణాచల్ ఏమి సాధించాలీ అనే విషయాన్ని వారితో చర్చించారు. 2017 నాటికి అరుణాచల్ ఏమి సాధించాలి, దాని ఏ విధంగా సాధించాలి. ఆయన ఒక ప్రణాళికను తయారు చేశారు. ఆ మార్గంలో ముందుకు పోయి 2027 నాటికి అరుణాచల్ ను ఉన్నత శిఖరాలకు చేర్చాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రిని నేను అభినందిస్తున్నాను, సుపరిపాలన విషయంలో కూడా ఆయన గణనీయమైన కృషి చేసినందుకు నేను ఆయన్ని ప్రశంసిస్తున్నాను .

ఇక రెండో విషయం, అవినీతికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం పోరాటం చేస్తోంది. ఈ దిశగా నాకు పేమా ఖండూజీ నుండి పూర్తి సహకారం లభిస్తున్నందుకు ఆనందంగా ఉంది. పారదర్సకత, జవాబుదారీతనం; ఇక్కడ వనరులకు లోటు లేదు, దేశంలో ధనానికి కొరత లేదు, ఏ బక్కెట్టును నీటితో నింపినా, ఆ బక్కెట్టు అడుగున రంధ్రాలు ఉంటే అది ఎప్పటికైనా నిండుతుందా? మన దేశంలో ఇది ఒక నానుడిగా ఉండేది. గతంలో ఇది ఒక సామెతగా ఉండేది.

ఆధార్ కార్డు ఉపయోగించడం ప్రారంభించాము, ప్రయోజనాన్ని నేరుగా బదిలీ చేయడం ప్రారంభించాము. భారత ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా ఆర్ధిక సహాయం పొందుతున్న దేశంలోని వితంతువుల జాబితాలో అసలు జన్మించని బాలికల పేర్లు కూడా ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రభుత్వ రికార్డులలో వారిని వితతంతువులుగా చూపించారు. వారి పేరు మీద డబ్బు పంపించేవారు. ఇప్పుడు చెప్పండి, ఈ నిధులు ఎక్కడికి మళ్ళించబడుతున్నాయి? అంటే, ఈ డబ్బును కాజేసేవారు ఎవరో ఒకరు తప్పక ఉన్నారు.

ప్రయోజనాలను నేరుగా బదిలీ చేయడం ద్వారా ఇప్పుడు మేము వీటన్నింటికీ స్వస్తి పలికాము. ఈ పథకాలలో దేశానికి చెందిన దాదాపు 57 వేల కోట్ల రూపాయలను ఆదా చేశాము. 57 వేల కోట్ల రూపాయలు. అంటే గతంలో ఎవరో అక్రమంగా తరలించిన ఈ నిధులు ఇప్పుడు దేశాభివృద్ధికి వినియోగించబడుతున్నాయి. ఇవి అరుణాచల్ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. ఇటువంటి అనేక చర్యలు తీసుకున్నాము, ఇటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టాము.

అందువల్ల, సోదరులు మరియు సోదరీమణులారా, ఈ రోజు మీరు నాకు స్వాగతం పలికిన తీరు, మీరు నన్ను గౌరవించిన విధానం, నన్ను కూడా అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన వానిగా చేశాయి. ఇది నా అదృష్టం. భారతదేశంలో సూర్యకిరణాలు ఎక్కడ ప్రారంభమౌతాయో, అక్కడ అభివృద్ధి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అభివృద్ధి సూర్యోదయం తన అభివృద్ధి కాంతితో మొత్తం దేశాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ విశ్వాసంతో, నేను మీ అందరినీ అభినందిస్తున్నాను. మీ అందిరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

“జయ్ హింద్” అని – నాతో కలిసి నినాదం చేయండి.

“జయ్ హింద్ ” అని – మనం అరుణాచల్ ప్రదేశ్ లో చేసిన నినాదం భారతదేశ వ్యాప్తంగా వినబడాలి.

జయ్ హింద్ – జయ్ హింద్

జయ్ హింద్ – జయ్ హింద్

జయ్ హింద్ – జయ్ హింద్

***