Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 ఏప్రిల్ 10వ తేదీన బిహార్ లోని మోతిహారీ లో నిర్వహించిన చంపారణ్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం


నేను ‘‘మహాత్మ గాంధీ’’ అని అంటాను,

మరి మీరు ‘‘వర్ధిల్లాలి, వర్ధిల్లాలి’’ అని అనాలి.

మహాత్మ గాంధీ.. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.

మహాత్మ గాంధీ.. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.

మహాత్మ గాంధీ.. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.

దేశం నలుమూలల నుండి ఈ పవిత్రమైనటువంటి చంపారణ్ గడ్డకు తరలివచ్చిన స్వచ్ఛాగ్రహి సోదరీమణులు మరియు సోదరులారా, గౌరవనీయులైన, ప్రేమమూర్తులైన మీ అందరికీ నేను శిరస్సును వంచి నమస్కరిస్తున్నాను. బాపు తన సాత్విక నిరోధం ఉద్యమాన్ని ఈ పవిత్రమైనటువంటి చంపారణ్ నుండే ప్రారంభించారన్న సంగతి అందరికీ తెలిసిందే. సత్యాగ్రహం రూపంలో ఉన్న ఈ శక్తిమంతమైన ఆయుధం ద్వారానే మనం బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ ను సాధించుకొన్నాం. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభమై ఒక శతాబ్దం గడచిన తరువాత ఇప్పటికీ ఇది చాలా సమర్ధమైందిగా ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇది సమర్ధంగా కొనసాగుతుంది ? ఆధునిక యుగంలో మనం సత్యాగ్రహం నుండి స్వచ్ఛాగ్రహం వైపు కదలవలసిన అవసరం ఉంది.

చంపారణ్ ఉద్యమం సమయంలో – స్వచ్ఛత, శుభ్రత కోసం మహాత్మాగాంధీ తన ఉద్యమాన్ని చంపారణ్ కు చెందిన బాదాహ్వలాఖంసేన్ నుంచి ప్రారంభించారు. బాపు చేపట్టిన ఈ శుభ్రతా ఉద్యమాన్ని ఈ రోజు మనం సత్యాగ్రహం నుండి స్వచ్ఛాగ్రహం వైపు తీసుకువెళ్తున్నాము. రావ సమంకే సోఝా బని వేదికను అలంకరించిన బిహార్ గవర్నర్ శ్రీమాన్ సత్పాల్ మాలిక్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ నీతీశ్ కుమార్ గారు, నా మంత్రివర్గ సహచరులు రవిశంకర్ ప్రసాద్ గారు, రాంవిలాస్ పాశ్వాన్ గారు, ఉమాభారతి గారు, రాధా మోహన్ సింగ్ గారు, గిరిజా సింహ్ గారు, శ్రీ రాం కృపాల్ యాదవ్ గారు, శ్రీ ఎస్.ఎస్. అహ్లువాలియా గారు, శ్రీ అశ్విని కుమార్ చౌబే గారు, బిహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీమాన్ సుశీల్ కుమార్ మోదీ గారు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు శ్రీ శ్రావణ్ కుమార్ గారు, శ్రీ నారాయణ్ ఝా గారు, శ్రీ ప్రమోద్ కుమార్ గారు, ఇక్కడకు విచ్చేసిన వేలాది సత్యాగ్రహులారా, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమానికి అనుసంధానమైన ప్రజలారా, సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

చరిత్ర పునరావృరత్తం కాదని చెప్పే వారు ఇక్కడకు వచ్చి, తమకు తాము చూడవచ్చు. వంద సంవత్సరాల క్రితం చరిత్ర ఇక్కడ మన ముందు ఇంకా సజీవంగా ఉంది. నా ముందు కూర్చొని వున్న ఈ స్వచ్ఛాగ్రహులు- గాంధీ ఆశయాలను, గాంధీ ఆలోచనలను తమలో సజీవంగా ఉంచుకొని- గాంధీ ఆలోచనలకు ప్రతిరూపంగా దర్శనమిస్తున్నారు.

ఈ స్వచ్ఛాగ్రహుల రూపంలో ఉన్న మహాత్మాగాంధీ కి నేను శిరస్సును వంచి నమస్కరిస్తున్నాను. వంద సంవత్సరాల క్రితం ఈ పవిత్ర చంపారణ్ భూమిపై నిర్వహించిన ప్రజా ఉద్యమాన్ని ప్రపంచం ఇదే విధంగా గుర్తించింది. మళ్లీ ఈ రోజున ఇక్కడ దృశ్యాన్ని చూస్తున్న ప్రపంచం ఆనాటి బాపూ ను మరోసారి స్మరించుకుంటోంది.

వందేళ్ల క్రితం, దేశం నలుమూలల నుండీ ప్రజలు చంపారణ్ కు చేరుకొన్నారు. వీధి వీధీ తిరిగి వారు గాంధీ గారి నాయకత్వంలో పనిచేశారు. ఈ రోజు, వంద సంవత్సరాల అనంతరం, దేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కష్టపడి పనిచేశారు. యువ స్వచ్ఛాగ్రహులతో భుజం భుజం కలిపి, పగలు రాత్రి అనే తేడా లేకుండా ఉత్సాహంగా పనిచేశారు. ఈ రోజు, ఈ భారీ ప్రజా సమూహంలో, ఒకరు కస్తూర్బా, ఒకరు రాజ్ కుమార్ శుక్లా, ఒకరు గోరఖ్ ప్రసాద్, ఒకరు షేక్ గులాబ్, ఒకరు లోమరాజ్ సింగ్, ఒకరు హరివంశ్ రాజ్, ఒకరు శీతల్ రాయ్, ఒకరు బిన్ ముహమ్మద్ మునీశ్, ఒకరు డాక్టర్ రాజేంద్రబాబు, ఒకరు ధర్తీధర్ బాబు, ఒకరు రామ్ నవమి బాబు, ఒకరు జె.పి. కృపాల్ గారి లాగా ఉన్నారు.
అటువంటి గొప్ప ప్రముఖులందరికీ, వందేళ్ల నాటి సత్యాగ్రహం ఒక కొత్త దిశా నిర్దేశం చేస్తే, ఈ నాటి స్వచ్ఛాగ్రహం ఈ దేశం లోని కోట్లాది ప్రజలకు ఒక కొత్త దిశా నిర్దేశం చేసింది. ఈ నినాదాన్ని అనుసరిస్తూ, ఈ రోజున దేశం లోని వివిధ ప్రాంతాల నుండీ వేలాది స్వచ్ఛాగ్రహులు చంపారణ్ కు చేరుకొన్నారు. మీ ఉత్సాహానికి, మీ శక్తికి, దేశం కోసం పని చేయాలన్న ఆసక్తికి మరియు బిహార్ ప్రజల ఆకాక్షలకు నేను శిరస్సును వంచి నమస్కరిస్తున్నాను.

వేదిక మీదకు వచ్చే ముందు, పరిశుభ్రతపై ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను కూడా నేను తిలకించాను. నూతన సాంకేతికతలు, నూతన పరిశ్రమల గురించి ఈ ప్రదర్శనలో వివరంగా తెలియజేశారు. చంపారణ్ సత్యాగ్రహం చేపట్టి వంద సంవత్సరాలు గడచిన సందర్భంగా ప్రారంభించిన కార్యక్రమాలను పూర్తి చేయవలసిన సమయం కూడా ఇదే. అయితే, ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోవడానికి బదులు, పరిశుభ్రతపై మరింత దృష్టి పెట్టవలసిందిగా ప్రజలను ఈ సందర్భంగా కోరవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, గడచిన వంద సంవత్సరాల కాలంలో, ఇదే బిహార్, మూడు వేరు వేరు సందర్భాలలో దేశానికి మార్గనిర్దేశం చేసింది. దేశం బానిసత్వపు సంకెళ్ళలో మగ్గుతున్న సమయంలో, మోహన్ దాస్ కరం చంద్ గాంధీ అనే గొప్ప వ్యక్తిని ఈ దేశానికి బిహార్ అందించింది. ఆయనను జాతిపితగా చేసింది.

స్వాతంత్య్రం వచ్చాక లక్షలాది రైతులు భూములను కోల్పోతామేమో అనే భయంతో ఉన్నప్పుడు వినోబా గారు భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారు. మూడో సారి, దేశంలో ప్రజాస్వామ్యం బెదిరింపులకు గురైనప్పుడు, దానికి సమాధానంగా ఈ ప్రాంతానికి చెందిన నాయకుడు బాబు జయప్రకాశ్ గారు ముందుకు వచ్చి, ప్రజాస్వామ్యాన్ని ఆదుకున్నారు.

బిహార్ ప్రజలు మరోసారి తమ నాయకత్వ సామర్ధ్యాలను ప్రదర్శించి నిరూపణ చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. బిహార్ లో పరిశుభ్రత పరిస్థితి బాగో లేకపోయినప్పటికీ మోదీ గారు ఇలా మాట్లాడుతున్నారేమిటి ? అని కొంత మంది ప్రజలు ప్రశ్నిస్తారన్న విషయం నాకు తెలుసును. దాని వెనుక ఒక కారణం ఉంది. నీతీశ్ గారు మరియు సుశీల్ మోదీ గారుల నేతృత్వంలో గత కొంత కాలంగా జరిగిన పనులు ప్రతి ఒక్కరిలో ధైర్యాన్ని, ఉత్సాహాన్నిపెంచాయి.

మిత్రులారా, దేశం మొత్తంలో కేవలం బిహార్ రాష్ట్రంలోనే పరిశుభ్రత 50 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే, వారం రోజుల స్వచ్ఛాగ్రహ అభియాన్ (పరిశుభ్రత ఉద్యమం) అనంతరం బిహార్ ఈ పరిధిని అధిగమించగలదని, మన కార్యదర్శి శ్రీ పరమేశ్వర్ జీ ఈ రోజు నాకు చెప్పారు. కేవలం గత వారం రోజులలోనే, బిహార్, 8 లక్షల 50 వేల మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఈ వేగం, ఈ పురోగతి సాధారణమైనవేం కాదు. పరిశుభ్రతను పాటించడంలో బిహార్ అతి త్వరలో జాతీయ సరాసరిని చేరుకుంటుందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.

ఈ విధంగా ఎంతో సవాలుగా చేపట్టిన బిహార్ ప్రభుత్వ కృషిని, చొరవను, నాయకత్వానోని- బిహార్ ప్రజలను, మరీ ముఖ్యంగా సైనికుల వలె పనిచేస్తున్న పరిశుభ్రత కార్యకర్తలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

కొద్ది సేపటి క్రితం, కొంతమంది సత్యాగ్రహీ సహచరులను (పరిశుభ్రత యోధులను) సన్మానించే అవకాశం నాకు కూడా కలిగింది. వారు చేసిన కృషి ని నేను అభినందిస్తున్నాను. వారికి ఇవే నా శుభాకాంక్షలు. ఈ పనిలో హృదయపూర్వకంగా పాల్గొన్నవారిలో మహిళల సంఖ్య అధికంగా ఉండడం నేను గమనించాను. మన మాతృమూర్తులకు, సోదరీమణులకు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యం గురించి ఎక్కువగా తెలుసు. ఒక వ్యక్తిగా నాకు ఈ రోజు సరైన అవకాశం లభించలేదు. అయితే, నాకు ఉన్నటువంటి పరిపాలన సంబంధ పరిధులు దాటి ఈ విషయమై మరింత వివరంగా చర్చించాలని నేను గట్టిగా భావిస్తున్నాను.

ప్రభుత్వం కోసం పనిచేస్తున్న అధికారులు అజ్ఞాతంగా మిగిలిపోతున్నారు. వారి పేర్లకు, వారి పనికి ఏ విధమైన గుర్తింపు రాదు. వారు ఎప్పుడూ తెర పైకి రారు. అయితే, నేను కొన్ని విషయాలు వారితో పంచుకోవాలని అనుకుంటున్నాను.

ఇప్పుడు, మన భారత ప్రభుత్వ కార్యదర్శి శ్రీ పరమేశ్వర్ జీ అయ్యర్; ఆయన ఇక్కడ ఉన్నారా ? లేరా ? ఆయన తప్పకుండా వేదిక ముందు ఉంటారు; ఆయనే ఈ ప్రాజెక్టు వ్యవహారాలను చూస్తున్నారు. ఆయన తన ఐఎఎస్ ఉద్యోగాన్ని విడచిపెట్టి అమెరికా కు వెళ్లారు. అమెరికా లో ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత మేం ఒక విజ్ఞప్తి చేశాం. మేము చాలా మందికి విజ్ఞప్తి చేశాం. ఆ ఆకర్షణీయమైన జీవితాన్ని వదలిపెట్టుకొని ఆయన భారతదేశానికి తిరిగి వచ్చినందుకు నేను సంతోషించాను. ఆయన చాలా సంవత్సరాలు ఐఎఎస్ అధికారిగా పనిచేశారు. తరువాత ఆ ఉద్యోగాన్ని వదలి వెళ్లారు. మీరు ఇప్పుడే ఆయనను టెలివిజన్ తెర మీద చూశారు, టీవీ చానల్స్ లో ఆయనను ఇప్పుడే చూపించారు. టీవీ చానల్స్ కొద్ది సేపటి క్రితం తమ కామరా లతో ఆయనను చూపించాయి, మళ్ళీ దయచేసి మీ కామరా లను ఒకసారి ఆయనవైపు త్రిప్పండి. అవును. ఆయనే. ఆయన తిరిగి వస్తే ఆయనను నేను ప్రభుత్వంలో చేర్చుకొన్నాను, ఈ బాధ్యతను ఆయనకు అప్పగించాం.

ఆయన స్వయంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఈ రోజున నాకు పరమేశ్వర్ గారి వంటి సహోద్యోగి ఉంటే, దేశం నలుమూలల నుండి వచ్చిన వేలాది పరిశుభ్రత కార్యకర్తలు ఉంటే బాపూ గారి 150వ జయంతి ఉత్సవాల నాటికి ఆయన కన్న కలలను మనం సాకారం చేయగలుగుతామన్న నా విశ్వాసానికి బలం చేకూరినట్లయింది.

పూర్వకాలంలో భగవంతునికి వేలాది చేతులు ఉంటాయని మనం వినే వాళ్ళం. భగవంతునికి వేలాదిగా చేతులు ఉంటాయి వంటి విషయాలు మనం ఇప్పటికీ వింటూనే ఉన్నాము. అయితే, ప్రధాన మంత్రి కి వేలాది చేతులు ఉంటాయని మనం ఎప్పడూ వినలేదు. నా ముందు వేలాది పరిశుభ్రత కార్యకర్తలు ఆసీనులై ఉండడంతో, దేశ ప్రధాన మంత్రి కూడా వేలాదిగా చేతులు ఉన్న వ్యక్తిగా తయారయ్యారని నేను ఎంతో వినయంతో చెబుతున్నాను

మీ నిబద్దత, మీ కృషి, మీ మద్దతు; తమ గ్రామాలను విడచి, బిహార్ లోని వీధులను శుభ్రం చేసే పని కోసం వచ్చిన ఈ పరిశుభ్రత కార్యకర్తలు, తమ స్వంత ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కట్టుబడి ఉండేలా చేశాయి. తద్వారా ఈ స్వచ్ఛాగ్రహులు ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. బాపూ సత్యాగ్రహ ఉద్యమాన్ని – స్వచ్ఛాగ్రహ ఉద్యమంగా మార్చడానికి అవసరమైన ఒక కొత్త శక్తిని, ఒక కొత్త జీవితాన్ని కల్పించడానికి వీరు కృషి చేస్తున్నారు. అందువల్ల మీ అందరినీ నేను మరోసారి అభినందిస్తున్నాను.

మిత్రులారా, ఇది- పరిశుభ్రత కార్యక్రమం లేదా నల్లధనానికి వ్యతిరేకంగా పోరాటం లేదా సాధారణ ప్రజలకు సంబంధించిన సౌకర్యాల అభివృద్ధి కార్యక్రమం- ఏదైనప్పటికీ నీతీశ్ గారు మరియు ఆయన బృందానికి తోడుగా కేంద్రప్రభుత్వం భుజం భుజం కలిపి ముందుకు సాగుతుంది. బిహార్ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్ధికాభివృద్ధికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, వ్యూహాలు ఒకదానితో మరొకటి కలిసి పనిచేస్తాయి.

బిహార్ అభివృద్ధి సంబంధించిన 6,600 కోట్ల రూపాయల విలువైన పథకాలను ఈ వేదికపై నుండి ప్రజలకు అంకితం చేయడం లేదా శంకుస్థాపన చేసే అవకాశం నాకు లభించింది. అవి జల వనరులు లేదా రైల్వేలు లేదా రహదారులు లేదా పెట్రోలియమ్ మొదలైన పలు పధకాలు బిహార్ మరియు ముఖ్యంగా చంపారణ్ ప్రాధాన్యాన్ని ఇనుమడింపజేస్తాయి. అంతేకాదు, వీటిని పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పథకాలుగా కూడా మనం భావించవచ్చు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఈ రోజు శంకుస్థాపన చేయనున్న ప్రోజెక్టులలో మోతిహారీ సరస్సు పునరుద్దరణ కూడా ఉంది. మన మోతిహారీ జిల్లా కు ఆ సరస్సు పేరునే పెట్టారు. ఈ సరస్సు బిహార్ చరిత్రలో ఒక భాగం. ఈ సరస్సు పునరుద్ధరణ పనులు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. సత్యాగ్రహం సమయంలో గాంధీ గారు ఇక్కడ చంపారణ్ లో ఉన్నప్పుడు సాయంకాలం ఈ సరస్సు పరిసరాలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని ఆయన చెప్పారు. ఈ సరస్సు వల్ల ఈ నగరానికి అందం వచ్చింది. అయితే, గాంధీ గారు ఆస్వాదించిన ఈ మోతీ సరస్సు సౌందర్యం కాలక్రమేణా నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది.

ఈ సరస్సును పరిరక్షించుకోవడానికి ఈ ప్రాంతానికి చెందిన విజ్ఞులైన పౌరులు వారికి చేతనైన సహాయాన్ని అందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల నుండి రహదారుల దాకా అవగాహన ప్రచారం కొనసాగుతోంది. ప్రజలు చేస్తున్న ఈ కృషికి తోడ్పాటును అందిస్తే సరస్సు పునరుద్ధరణతో పాటు పర్యటకులను ఆకర్షించే విధంగా వివిధ సదుపాయాలు కూడా అభివృద్ధి చెందగలుగుతాయి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, పరిశుభ్రత అనేది నీటితో అనుసంధానమై ఉంది. అమ్రిత్ పథకం లో భాగంగా సుమారు వంద కోట్ల రూపాయల వ్యయంతో నీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనివల్ల పరిశుభ్రమైన నీటి కోసం కుమార్తెలు ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. దీని వల్ల లక్షా 50 వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారు.

ప్రజల జీవనాడి అయినటువంటి గంగా నది జలాలను శుభ్రం చేసే పథకానికి సంబంధించి మరో ప్రోజెక్టు ను చేపట్టడం జరిగింది. గంగోత్రి నుండి గంగా సాగర్ వరకు గంగానది జలాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో బిహార్ ఒక ముఖ్యమైన భాగం. గృహాల నుండి, కర్మాగారాల నుండి బయటకు వచ్చే మురుగునీటి పారుదలను అరికట్టేందుకు మూడు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన పదకొండు ప్రాజెక్టులకు ఇప్పడు అనుమతి మంజూరుచేయడం జరిగింది. ఆ నిధులతో 1,100 కిలోమీటర్ల పొడవునా గొట్టపు మార్గం వెయ్యాలని ఒక ప్రణాళిక ఉంది. వీటిలో నాలుగు ప్రోజెక్టులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది.

గత ఏడాది నేను మోకామా పర్యటనకు వచ్చినప్పుడు శంకుస్థాపన చేసిన ఆ నాలుగు ప్రోజెక్టు లలో పని చురుకుగా సాగుతోంది. మిగిలిన ప్రోజెక్టుల పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. గంగానది తీరంలో ఉన్న గ్రామాలను ప్రాధాన్య క్రమంలో బహిరంగ మల మూత్రాదుల విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది.

గంగానది ప్రవహిస్తున్న ఐదు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో గంగానది ఒడ్డున ఉన్న చాలా గ్రామాలలో ఈ ప్రోజెక్టు విజయవంతం అయింది. గంగా నది తీరంలో ఉన్న ఆ గ్రామాలలో వ్యర్ధ పదార్థాల నిర్వహణ సమర్ధంగా అమలు అవుతోంది. అందువల్ల ఆయా గ్రామాలలో సేకరించిన చెత్తను నదిలో పారవేయడం లేదు. త్వరలో గంగానది తీరాలు బహిరంగ మల ముత్రాదుల విసర్జన కు తావు లేకుండా పరిశుభ్రంగా ఉంటాయని నేను భావిస్తున్నాను.

కొద్ది రోజుల క్రితం బనారస్ లో ‘‘వ్యర్ధ పదార్థాల ఉత్సవం’’ జరిగింది. వ్యర్ధ పదార్థాల ఉత్సవాలను నిర్వహించి చెత్త ద్వారా సంపదను ఎలా సృష్టించుకోవచ్చో అందరికీ తెలియజేయాలని గంగానది ఒడ్డున ఉన్న నగరాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేశాను. వ్యర్ధ పదార్ధాల నుండి ఎంత విలువైన, ముఖ్యమైన పనులు చేయవచ్చో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

దేశంలో ప్రారంభించిన స్వ‌చ్ఛ బార‌త్ కార్య‌క్ర‌మం లో పరిశుభ్రమైన ఇంధ‌నం కూడా ఒక భాగ‌ం. ఉజ్జ్వల ప‌థ‌కం కార‌ణంగా దేశంలో ప్ర‌తి పేద మాతృమూర్తి కి, ప్ర‌తి పేద సోదరి కి మేలు జ‌రగాల‌ని ప్ర‌భుత్వం పూర్తి స్థాయి లో అంకిత‌ భావంతో ప‌ని చేస్తోంది. ఈ ప‌థ‌కం వ‌ల్ల వారు విష‌పూరిత‌మైన పొగ‌ బారి నుండి బయట ప‌డుతున్నారు. ఇంత‌వ‌ర‌కు దేశంలో 3.5 కోట్ల కుటుంబాల‌కు ఉచిత గ్యాస్ క‌నెక్ష‌న్ ను అందించ‌డం జ‌రిగింది. బిహార్ లోనూ సుమారు 50 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు, 50 ల‌క్ష‌ల కుటుంబాలు ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధి ని పొందారు.

స్నేహితులారా, పరిశుభ్ర ఇంధ‌నానికి ప్రాధాన్య‌ాన్ని ఇవ్వ‌డం వ‌ల్ల, ఉజ్జ్వల ప‌థ‌కం విజ‌య‌వంతం కావ‌డంవ‌ల్ల దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ లకు గిరాకీ పెరిగింది. అందువ‌ల్ల‌నే ఈ రోజున మోతిహారీ లో, స‌గోలి లో ఎల్ పి జి కేంద్రాల ఏర్పాటు కు పునాదులను వేయ‌డం జ‌రిగింది. త‌ద్వారా చంపార‌ణ్ తో పాటు చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు గ్యాస్ సిలిండ‌ర్ ల కొర‌త స‌మ‌స్య‌ ను అధిగ‌మించ‌గ‌లుగుతాయి. ఈ రెండు ప్లాంటులు ప‌ని చేయ‌డం మొద‌లైతే ప్ర‌తి రోజూ సుమారు 90 వేల గ్యాస్ సిలిండ‌ర్ లను తిరిగి నింప‌డానికి వీల‌వుతుంది.

వీటితో పాటు ఈ రోజు మోతిహారీ లో పెట్రోలియ‌మ్ ఆయిల్ ల్యూబ్ టెర్మిన‌ల్ నిర్మాణం కోసం పునాది రాయి వేయ‌డం జ‌రిగింది. ఇది ప‌ని చేయ‌డం మొద‌లైన త‌ర్వాత చంపార‌ణ్ తో పాటు చుట్టుప‌క్క‌ల గ‌ల జిల్లాల‌ పెట్రోల్, డీజిల్ అవ‌స‌రాలు తీరుతాయి. అంతే కాదు నేపాల్ కు చేసే స‌ర‌ఫ‌రాను కూడా ఈ టెర్మిన‌ల్ క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తుంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

దేశాభివృద్ధిలో తూర్పు భార‌త‌దేశం ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్ర ప్ర‌భుత్వం ఇందులో భాగంగా చేప‌డుతున్న అభివృద్ధి పనుల విస్త‌ర‌ణ‌లో భాగంగానే ఈ ప్రోజెక్టు ల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింది. తూర్పు ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నుండి బిహార్ దాకా అక్క‌డ‌ నుండి ప‌శ్చిమ బెంగాల్ దాకా ఆ త‌రువాత ఒడిశా వ‌ర‌కు, అంతే కాదు ఈశాన్య భార‌త రాష్ట్రాలలోనూ ప్రాథమిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌ కోసం మా ప్ర‌భుత్వం కృషి చేసింది. ఈ ప‌నుల‌ను గ‌త ప్ర‌భుత్వాలు చేయ‌లేదు.

బిహార్ తో పాటు తూర్పు భార‌త‌దేశం యొక్క అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌ లోకి తీసుకొని మా ప్ర‌భుత్వం ప‌లు ప‌థ‌కాల‌ను ఎలా రూపొందాయో అనే దానికి నీతీశ్ గారు కూడా ఒక సాక్షే. కొత్త ప్రోజెక్టులను ఆరంభించడమైంది. ప్రత్యేకించి, మా ప్రభుత్వం ఈ ప్రాంతాలలో అనుసంధానాన్ని మెరుగుపరచడంపై ఇతోధిక శ్రద్ధను వహిస్తోంది.

21వ‌ శ‌తాబ్ది అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌ధాన ర‌హ‌దారులను, నీటి ర‌వాణా మార్గాలను, స‌మాచార రంగ మార్గాల‌ను అభివృద్ధి చేసే ప‌నుల‌ను చాలా వేగ‌వంతం చేయ‌డం జ‌రుగుతోంది. ఈ రోజున జాతీయ ర‌హ‌దారుల‌కు సంబంధించి 900 కోట్ల విలువైన ప్రోజెక్టుల‌ కోసం పునాది రాళ్లు వేయ‌డం జ‌రిగింది. ఔరంగాబాద్ నుండి చౌర్దా వ‌ర‌కు నాలుగు దోవల ర‌హ‌దారి ఉంది. దీనిని 6 దోవల ప్ర‌ధాన ర‌హ‌దారిగా మార్చ‌డానికి ఈ రోజున ప‌ని ప్రారంభ‌మైంది. ఈ ప్రోజెక్టు బిహార్‌, ఝార్ ఖండ్ ల ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి ని చేకూరుస్తుంది.

అదేవిధంగా, చంపార‌ణ్ కోసం నిర్మించాల‌నుకున్న రెండు రైల్వే ప్రోజెక్టుల‌ కోసం ఈ రోజున పునాది రాళ్లు వేయ‌డం జ‌రిగింది. ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ నుండి స‌గోలి వ‌ర‌కు, స‌గోలి నుండి వాల్మీకిన‌గ‌ర్ వ‌ర‌కు గ‌ల రైల్వే ట్రాక్‌ను డ‌బుల్ లేన్ ట్రాక్‌గా మార్చ‌డం జ‌రుగుతుంది. ఇది చంపార‌ణ్ ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే ప్రయోజనాన్ని చేకూర్చ‌దు; ఉత్త‌ర్ ప్ర‌దేశ్ నుండి నేపాల్ వ‌ర‌కు గ‌ల ప్ర‌జ‌లు సులువుగా ప్ర‌యాణం చేయ‌డానికి వ్యాపార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకోవ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది.

స్నేహితులారా, చంపార‌ణ్ ఉద్య‌మ శ‌తాబ్ది కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా ఒక కొత్త రైలును ప్రారంభించే అదృష్టం నాకు దక్కింది. ఈ రైలు కతియార్, పాత ఢిల్లీ ల మ‌ధ్య‌న తిరుగుతుంది. ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఈ రైలుకు చంపార‌ణ్ హ‌మ్ స‌ఫ‌ర్ ఎక్స్ ప్రెస్ అనే పేరును పెట్టింది. ఈ రైలు లో అనేక ఆధునిక సౌక‌ర్యాలు ఉన్నాయి. మీరు ఢిల్లీ కి ప్ర‌యాణం చేయ‌డానికి, తిరిగి రావ‌డానికి ఈ రైలు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

మ‌ధేపురా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్ట‌రీ ఒకటో ద‌శ‌ ను ఈ రోజున ప్ర‌జల‌కు అంకితం చేయ‌డం జ‌రిగింది. రెండు కార‌ణాల‌ వ‌ల్ల ఈ కర్మాగారం చాలా ప్రాధాన్య‌ాన్ని సంత‌రించుకొంది. మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మానికి ఇది అత్యుత్త‌మ‌మైన ఉదాహ‌ర‌ణ‌. రెండోది ఈ ప్రాంతంలో ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పించ‌డానికి ఇది భారీ స్థాయి లో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ప్రోజెక్టు ను సాకారం చేయ‌డానికి భార‌త‌దేశ రైల్వేల శాఖ చాలా కాలం నుండి ఫ్రెంచి కంపెనీ తో క‌లిసి పని చేస్తోంది. ఈ కార్ఖానా చాలా శ‌క్తిమంత‌మైన రైలు ఇంజ‌ిన్ లను త‌యారు చేస్తుంది. ఈ ఆధునిక ఫ్యాక్ట‌రీ లో త‌యారైన 12 వేల హార్స్ ప‌వ‌ర్ ఇంజిన్ కు ప‌చ్చ‌ జెండా ను చూపించే అదృష్టం ఇప్పుడే నాకు ల‌భించింది.

స్నేహితులారా, వ‌స్తువుల ర‌వాణా కోసం ఇంత‌టి శ‌క్తిమంత‌మైన ఇంజిన్ ను ఉప‌యోగించే దేశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఈ ఇంజిన్ ల కార‌ణంగా గూడ్స్ రైళ్ల వేగం రెండింత‌ల‌ కంటే ఎక్కువ‌ అవుతుంది.

మ‌రో కార‌ణం కూడా ఉంది. దీని వ‌ల్ల‌నే నేను ఈ ప్రోజెక్టు ను గురించి ఇంత వివ‌రంగా మీకు వివరించాలనుకొంటున్నాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, ఈ ప్రోజెక్టుకు 2007లో ఆమోదం ల‌భించింది. ఆమోదం ల‌భించిన 8 సంవ‌త్స‌రాలైన‌ప్ప‌టికీ దీనికి సంబంధించిన ఫైళ్లకు మోక్షం ల‌భించ‌లేదు. అవి శిథిలమ‌యిపోవ‌డం మొద‌లైంది. మూడు సంవ‌త్స‌రాల క్రితం ఎన్డీయే ప్ర‌భుత్వం ఈ ప్రోజెక్టును బయట‌కు తీసింది. దాంతో ఇప్పుడు ఈ ప్రోజెక్టు ఒకటో ద‌శ పూర్త‌ి అయ్య అందుబాటు లోకి వ‌చ్చింది.

ఆయుష్మాన్ భార‌త్‌: మ‌న దేశంలో పేద‌రికం పోవాలంటే పారిశుధ్యం త‌రువాత‌ ఆరోగ్య సేవ‌లు చాలా ముఖ్యం. పేద కుంటుంబంలో ఎవ‌రైనా జ‌బ్బు ప‌డ్డారంటే వారికి 5 ల‌క్ష‌ల‌ రూపాయల వ‌ర‌కు ప్ర‌భుత్వం సహాయం చేస్తుంది. దీనిని సంవత్సరానికి ఒక‌ పర్యాయం వినియోగించుకోవ‌చ్చు. బీమా ప‌థ‌కం ద్వారా ఈ ల‌బ్ధి ని పొంద‌వ‌చ్చును. డ‌బ్బు లేని కార‌ణంగా చికిత్స ఆగిపోవ‌డ‌ం అనే స‌మ‌స్య ఇక కుటుంబానికి ఉండ‌బోదు. ఆయుష్మాన్ భార‌త్ అనేటటువంటి ఈ కొత్త ప‌థకాన్ని కేంద్ర‌ ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌నున్నది.

కొన్ని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల‌ను అన‌స‌రిస్తూ మా ప్ర‌భుత్వం ముందుకు పోతోంది. ప‌నులను ఆప‌డం, ప్రాధాన్య‌ాన్ని ఇవ్వ‌క‌పోవ‌డం, త‌ప్పుడు మార్గాలలో వెళ్ల‌డం వంటి విధానాలకు స్వస్తి ప‌ల‌క‌డం జ‌రిగింది. ఫైళ్ల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డ‌మ‌నే ప‌ని సంస్కృతి కి భరతవాక్యం ప‌లికాం. ప్ర‌భుత్వం తాను చేప‌ట్టిన ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని, ప్రతి నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌ల స‌హ‌కారంతో అమ‌లు చేస్తోంది.

అయితే ఈ మార్పుల‌ను అంగీక‌రించ‌లేని వారు ఈ ధోరణి కార‌ణంగా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ప్ర‌జ‌ల‌కు సాధికారిత రావ‌డాన్ని వారు స‌హించ‌డం లేదు. పేద ప్ర‌జ‌లు బ‌ల‌ప‌డితే వారికి అబద్ధాలను చెప్ప‌డం, త‌ప్పుడు మార్గాల‌ను సూచించ‌డం కుద‌ర‌దేమోన‌ని వారు భావిస్తున్నారు. అందుకే వారు పాల‌నకు అడ్డంకులను సృష్టిస్తున్నారు. రహదారుల ద‌గ్గ‌ర‌ నుండి పార్ల‌మెంటు దాకా పాల‌న‌ను అడ్డుకొంటున్నారు.

స్నేహితులారా, ప్ర‌జ‌ల మ‌ధ్య‌ సామ‌ర‌స్యం విల‌సిల్ల‌డానికి మా ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. అయితే అదే స‌మ‌యంలో కొంత మంది ప్ర‌త్య‌ర్థులు ప్ర‌జ‌ల మ‌ధ్య‌న సామ‌ర‌స్యం లేకుండా చేయ‌డానికి ప్ర‌యత్నిస్తున్నారు.

స్నేహితులారా, నీతీశ్ గారి ప‌రిపాల‌న‌ను, ఆయ‌న‌ లోని ఓపిక‌ను ప్ర‌త్యేకంగా అభినందించాల‌ని అనుకుంటున్నాను. బిహార్ లోని అసాంఘిక శ‌క్తుల‌కు, అవినీతిప‌రుల‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న సాగిస్తున్నటువంటి సమరం అంత సులువైంది కాదు. అవినీతికి వ్య‌తిరేకంగా ఆయన చేపట్టిన స్వచ్ఛత ఉద్యమానికి కేంద్ర‌ ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో మ‌ద్దతు ప‌లుకుతోంది. రాష్ట్రంలో సామాజిక మార్పులు తీసుకురావడానికి ఆయ‌న చేస్తున్న కృషిని కేంద్రం పూర్తిగా బలపరుస్తుంది.

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సూత్రాన్ని అనుసరించడం ద్వారా ఒక పవిత్ర సంకల్పంతో ఎన్ డిఎ ప్ర‌భుత్వం ప‌నుల‌ను కాల బద్ధ పద్ధతిలో పూర్తి చేస్తోంది. స‌కాలంలో ప‌నులు పూర్తి చేయ‌డానికి ఉన్న ప్రాధాన్య‌ాన్ని గ‌త ప్ర‌భుత్వం అర్థం చేసుకోలేదు. అయితే స‌త్యాగ్ర‌హం, స్వ‌చ్ఛ‌భార‌త్‌ లతో పాటు ఇత‌ర‌ ప‌నులను స‌కాలంలో పూర్తి చేయాల‌ని గాంధీ గారు ప‌దే ప‌దే చెప్పే వారు. ఇందుకోసం ఆయ‌న ఎల్ల‌ప్పుడూ త‌న‌తో పాటు ఓ జేబు గ‌డియారాన్ని అట్టేపెట్టుకొనే వారు. బియ్య‌పు గింజ‌ ను, కాగితం ముక్క‌ ను వృథా చేయ‌ని వారే వారి యొక్క జీవితంలో ఒక నిమిషాన్ని కూడా వ్యర్థం చేయ‌రు అని అందరితోనూ ఆయ‌న అంటూ ఉండే వారు. ఇది మ‌న స‌మ‌యం కాదు. ఇది జాతికి చెందినటువంటి కాలం. దీనిని మ‌నం దేశం కోసమే వినియోగించాలి. ః

గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి ని అందుకొని 1.25 బిలియ‌న్ భార‌తీయులు యుద్ధ ప్రాతిప‌దిక‌న కృషి చేస్తున్నారు. ప్ర‌జ‌లు గ‌ట్టిగా కోరుకొంటున్నారు కాబ‌ట్టే దేశవ్యాప్తంగా స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం 2014 లో 40 శాతం ప్రాంతం వ‌ర‌కు విస్త‌రించి ఉన్నది కాస్తా ఇప్ప‌టికి 80 శాతం ప్రాంతానికి విస్త‌రించింది. అంటే, దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చిన అనంతరం గత 67 సంవ‌త్స‌రాలలో సాధించిన స్వ‌చ్ఛత ప‌రిస్థితుల‌ను ఈ ప్ర‌భుత్వం త‌న హ‌యాంలో సాధించింది అని దీనికి అర్థం.

స్నేహితులారా, గ‌త మూడున్న‌ర సంవ‌త్స‌రాల‌లో దేశంలోని 350 జిల్లాలు, 3.5 ల‌క్ష‌ల‌కు పైగా గ్రామాలను బ‌హిరంగ మ‌లమూత్రాదుల విస‌ర్జ‌న ర‌హిత జిల్లాలుగా, గ్రామాలుగా ప్ర‌క‌టించ‌డమైంది. గ‌త మూడున్నర సంవ‌త్స‌రాలలో దాదాపుగా 7 కోట్ల మరుగుదొడ్లను నిర్మించ‌డం జ‌రిగింది. ప్ర‌జ‌ల సంక‌ల్ప‌ శక్తి వ‌ల్ల‌నే ఇది అంతా కూడాను సాధ్య‌పడింది. ఈ బ‌లం వ‌ల్ల‌నే గ‌త వారంలో అంటే ఏప్రిల్ 4 త‌రువాత స‌త్యాగ్ర‌హ‌, స్వ‌చ్ఛ భార‌త్ వారోత్స‌వాలను జ‌రుపుకొంటున్న స‌మ‌యంలో బిహార్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఒడిశా, జ‌మ్ము & క‌శ్మీర్ ల‌లో సుమారు 26 ల‌క్ష‌ల మ‌రుగుదొడ్ల‌ను నిర్మించ‌డం జ‌రిగింది. స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మాన్ని చాలా వేగంగా విస్త‌రిస్తామ‌ని ఈ నాలుగు రాష్ట్రాలు తీర్మానించుకొన్నాయి.

స్నేహితులారా, దేశంలోని ల‌క్ష‌లాది మ‌హిళ‌ల జీవితాలలో స్వ‌చ్ఛ భారత్ కార్య‌క్ర‌మం పెను మార్పులను తీసుకువచ్చింది. ఈ విష‌యం మీకు బాగా తెలుసు. ఒక మరుగుదొడ్డిని నిర్మించుకోవ‌డం వ‌ల్ల ఆ ఇంట్లోని మ‌హిళ‌ల మ‌ర్యాద‌ ను, భ‌ద్ర‌త‌ ను, ఆరోగ్యాన్ని కాపాడుకోగ‌లుగుతాం. బిహార్ ప్ర‌జ‌లు మరుగుదొడ్లను ఇజ్జత్ ఘర్ లు (గౌర‌వాన్ని పెంపొందించే గ‌దులు) గా ప‌రిగ‌ణిస్తున్నార‌న్న సంగతి నాకు తెలిసింది. మ‌రుగుదొడ్డిని నిర్మించుకోవ‌డం వ‌ల్ల సామాజిక అస‌మాన‌త‌లు కూడా తొల‌గిపోతున్నాయి. అంతే కాదు దీనివ‌ల్ల దేశంలో ఆర్ధిక‌, సామాజిక సాధికారిత విస్త‌రిస్తుంది.

గ‌త సంవత్సరంలో ఐక్య‌ రాజ్య‌ స‌మితి ఒక అధ్య‌యనాన్ని ప్ర‌క‌టించింది. ఈ అధ్యయనం ప్ర‌కారం ఏ ఇంటికైనా మ‌రుగుదొడ్డి ఉందంటే ఆ కుటుంబం ప్ర‌తి ఏడాది 50 వేల రూపాయ‌ల‌ను ఆదా చేసిన‌ట్టేన‌నేది ఈ అధ్య‌య‌న సారాంశం. లేదంటే అంతే మొత్తాన్ని ఆ కుటుంబం చికిత్స‌ల‌కు, ఆసుప‌త్రుల సంద‌ర్శ‌న‌కు ఉప‌యోగించవలసివుంటుంది.

బ‌హిరంగ మ‌ల మూత్రాదుల విస‌ర్జ‌న లేని గ్రామాల‌ పైన మ‌రొక అంత‌ర్జాతీయ సంస్థ అధ్య‌య‌నం చేసింది. దీని ప్ర‌కారం ఇలాంటి గ్రామాల్లో అతిసారంతో బాధ‌ప‌డే పిల్ల‌లే లేరు. అంతే కాదు వారి శారీరిక‌ ఎదుగుదల, మాన‌సిక ఎదుగుద‌ల స‌క్ర‌మంగా కొన‌సాగుతున్నట్టు ఈ అధ్య‌య‌నంలో వెల్ల‌డి అయింది. స్వ‌చ్ఛ వాతావ‌ర‌ణం లేక‌పోతే పిల్ల‌లు త‌ర‌చుగా అనారోగ్యం పాల‌బడుతుంటారు. అంతే కాదు, వారు త‌ర‌చుగా త‌మ పాఠ‌శాల‌ నుండి సెల‌వులను తీసుకొంటూ ఉంటారు కూడాను. బ‌హిరంగ మ‌ల‌ విస‌ర్జ‌న ర‌హిత గ్రామాలలో బడి పిల్లలు చ‌దువులో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

స్నేహితులారా, నేడు దేశంలో స్వ‌చ్ఛ భార‌త్ ఉద్య‌మం మూల మూలకు విస్త‌రిస్తోంది. ఇది ప్ర‌జ‌ల ఉద్య‌మంగా రూపొందింది. ప్ర‌పంచం లోని ముఖ్య‌మైన విశ్వ‌విద్యాల‌యాలు ఈ ఉద్య‌మాన్ని అధ్యయనాంశంగా తీసుకొని అధ్య‌య‌నం చేయ‌వ‌చ్చు. ఈ 21 వ శ‌తాబ్దంలో ఇంత‌వ‌ర‌కు ప్ర‌పంచంలో మ‌రే దేశంలో మాన‌వ స్వ‌భావాన్ని మార్చాడానికి ఇలాంటి ప్ర‌జా ఉద్య‌మం జ‌ర‌గ‌లేదు. నిజంగానే భార‌త‌దేశంలో మార్పు వ‌స్తోంది. ప్ర‌జ‌ల అల‌వాట్లు, ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు క‌నిపిస్తోంది.

ఏది ఏమైన‌ప్ప‌టికీ, ఇప్పుడు ఇక్క‌డ ఈ గాంధీ మైదానానికి విచ్చేసిన ప్ర‌తి స్వ‌చ్ఛాగ్ర‌హీ- చిన్న‌ పిల్ల‌ల ద‌గ్గ‌ర‌ నుండి వృద్ధుల‌ వ‌ర‌కూ- అంద‌రూ అస‌లైన స‌వాలును ఎదుర్కోవలసి వుంటుంది. రహదారుల నుండి రైల్వే స్టేష‌న్ లు, బ‌స్ స్టేష‌న్ ల వ‌ర‌కు, ఇళ్ల మందు, దుకాణాల ముందు, పాఠశాలల ముందు, కళాశాలల ముందు, అంగళ్లలో, సందులలో, వీధి చివ‌రల్లో, మనం నివ‌సిస్తున్న ప్రాంతాలలో స్వ‌చ్ఛతను కాపాడుకొంటూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిరంత‌ర ప్రాతిపదికన నిర్వ‌హించాలి. దేశం లోని ప్ర‌తి పౌరుడు త‌న స్థాయిలో స్వ‌చ్ఛత‌ కోసం పాటుప‌డితేనే గాని స్వ‌చ్ఛ భార‌త ఉద్య‌మం పూర్తి కాదు. దేశం లోని ప్ర‌తి పౌరుని జీవితంలో స్వ‌చ్ఛ‌త అనేది భాగ‌మైతేనే గాని ఈ ఉద్య‌మం సంపూర్ణం కాదు. ఆ విధంగా చేస్తే 2019 కల్లా స్వ‌చ్ఛ భార‌త ఉద్య‌మం స‌ఫ‌లం అవుతుంది. అంత‌వ‌ర‌కూ మ‌నం స్వ‌చ్ఛ‌త కోసం డిమాండ్‌ చేస్తూనే ఉంటాం. ఆ విధంగా చేస్తే వ‌చ్చే సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 2న బాపూ జ‌యంతి నాటికి మ‌నం ప‌విత్ర‌మైన బాపూ ఆత్మ‌కు మ‌న‌సారా నివాళి ని ఘ‌టించ‌గ‌లుగుతాం.

స్నేహితులారా, ఇక్క‌డ చంపార‌ణ్ లో రైతుల‌ను, కార్మికుల‌ను, ఉపాధ్యాయుల‌ను, న్యాయ‌వాదుల‌ను, వైద్యుల‌ను, ఇంజినీర్ లను.. ఇలా స‌మాజం లోని అన్ని వ‌ర్గాల వారిని గాంధీ గారు ఏకం చేశారు. అందుకే ఆయ‌న చేప‌ట్టిన సత్యాగ్ర‌హం విజ‌య‌వంత‌ం అయింది. స్వ‌చ్ఛ భార‌త్ కోసం పాటుప‌డుతున్న స్వ‌చ్ఛాగ్రాహుల‌మైన మ‌నంకూడా గాంధీ గారు చూపిన మార్గంలో ముందుకు సాగాలి. స‌మాజం లోని ప్ర‌తివ‌ర్గానికి, ప్ర‌తి పౌరునికి స్వ‌చ్ఛ‌తా సందేశం చేరడానికి నిత్యం కృషి చేయాలి.

అందుకే మరి ఇక్క‌డ స‌మావేశ‌మైన ప్ర‌తి స్వ‌చ్ఛాగ్రాహికి నేను విజ్ఞ‌ప్తి చేయదలచాను. మీకు అంద‌జేసిన చిన్న‌ పుస్త‌కం లోని ప్ర‌తి అంశానికి ఎంత వీలయితే అంత ప్ర‌చారాన్ని క‌ల్పించ‌ండి. మీరు ఎంత ఎక్కువ‌ మందిని చైత‌న్య‌వంతుల‌ను చేస్తే అంత ఎక్కువ‌గా ఈ స్వ‌చ్ఛ భార‌త్ ఉద్య‌మం విజ‌య‌వంతం అవుతుంది. ప్ర‌తి పల్లెలో క‌నీసం ఒక స్వ‌చ్ఛ‌ భార‌త్ విజేత ఉండేటట్టు ప్ర‌భుత్వం అన్ని విధాలా చ‌ర్యలు తీసుకుంటోంది. దేశం లోని ప్ర‌తి మూల‌నా నివ‌సించే ప్ర‌జ‌లు స్వ‌చ్ఛ‌తా కార్య‌క్ర‌మాన్ని వారి జీవితాల్లో భాగం చేసుకునేందుకు వీలుగా 6.5 ల‌క్ష‌ల‌ మందికి పైగా స్వ‌చ్ఛ‌తా విజేత‌లు ప‌ని చేస్తున్నారు. ఈ ప‌నిలో వాళ్లు త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తారు.

ప్ర‌ధాన‌ మంత్రి ఆవాస యోజ‌న లో భాగంగా దేశంలో పేద ప్ర‌జ‌ల‌కు నివాస గృహాల‌ను అంద‌జేయాల‌నే కార్య‌క్ర‌మం వేగంగా ప్ర‌గ‌తిని సాధిస్తోంది. రాష్ట్రంలో మ‌రుగుదొడ్ల‌ను నిర్మించ‌డానికి బిహార్ ప్ర‌భుత్వం ఎంత వేగంగా ప‌నిచేస్తున్న‌దో అంతే వేగంగా రాష్ట్రం లోని పేద ప్ర‌జ‌ల‌కు ఇళ్ల‌ను నిర్మించి ఇస్తుంద‌ని నేను భావిస్తున్నాను.
మ‌నంద‌రం మ‌రో ప‌నిని కూడా చేయ‌గ‌లం. ఈ రోజునుండి వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ 2 వ‌ర‌కూ వ‌చ్చే ప‌లు జ‌యంతులు, వ‌ర్ధంతుల సంద‌ర్భంగాను, పండుగ‌ల సంద‌ర్భంగాను మ‌నం ప్ర‌త్యేకంగా స్వ‌చ్ఛ భార‌త్ ఉద్య‌మ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి ప్ర‌జలలో ప్ర‌త్యేకంగా స్ఫూర్తి ని ర‌గిలిద్దాం. ఉదాహ‌ర‌ణ‌కు రాబోయే ఏప్రిల్ 11న ప్ర‌ఖ్యాత సాంఘిక సంస్క‌ర్త జ్యోతిబా ఫులే గారి జ‌యంతి. అలాగే ఏప్రిల్ 14న బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ జ‌యంతి. ఈ జ‌యంతి కార్య‌క్ర‌మాల సంద‌ర్భంగా మ‌హానుభావుల‌ను స్మ‌రించుకొంటూనే ప్ర‌జ‌లు స్వ‌చ్ఛ‌తా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌వ‌చ్చు.

ఇంకో ముఖ్య విష‌యాన్ని మీకు చెప్పాల‌నుకొంటున్నాను. ఏప్రిల్ 14 నుండి కేంద్ర ప్ర‌భుత్వం గ్రామ్ స్వ‌రాజ్ అభియాన్ ను మొదలుపెడుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా మ‌న పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఇంకా ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు.. వారు ఎవ‌రైనా కావ‌చ్చు; గ్రామీణ‌ స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు కావ‌చ్చు, లేదా మునిసిప‌ల్ స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు కావ‌చ్చు; వారు వారి వారి ప్రాంతాలలో స్వ‌చ్ఛ భార‌త్ ఉద్య‌మ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాలి. వారు ఇత‌రులలో స్వ‌చ్ఛ‌త‌ పైన అవ‌గాహ‌న ను క‌ల్పించాలి. ఇంటింటికి తిరిగి, ప్ర‌తి తలుపును త‌ట్టి పరిసర ప్రాంతాలు స్వ‌చ్ఛంగా, ఆరోగ్య‌క‌రంగా ఉండేటట్టు చూడాలి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

జాతి నిర్మాణంలో మీరు చేస్తున్న కృషిని ముందు త‌రాలు గుర్తు పెట్టుకొంటాయి. దేశం లోని ప్ర‌తి స‌త్యాగ్రాహి ఆరోగ్య‌క‌ర‌మైన‌, ప‌రిశుభ్ర‌మైన‌, సౌభాగ్య‌వంత‌మైన దేశం కోసం ప‌ని చేస్తున్నారు. చంపార‌ణ్ స‌త్యాగ్ర‌హ‌ ఉద్య‌మం మొద‌లైన‌ప్పుడు అందులో పాల్గొన‌డానికి మ‌నం లేము. ఆ స‌మ‌యానికి అస‌లు మ‌నం జ‌న్మించ‌నే లేదు. మ‌న‌లో ఎవ‌రూ ఆ ఉద్య‌మంలో పాల్గొన‌లేదు. అయిన‌ప్ప‌టికీ చంపార‌ణ్ స్వచ్ఛాగ్ర‌హం సఫలం అయ్యేటట్లు రాత్రి, ప‌గ‌లు అనే తేడా లేకుండా మనం కృషి చేయాలి.

ఈ ప‌నిని చేప‌ట్ట‌డానికి చాలా ఓపిక కావాల‌నే విష‌యం నాకు తెలుసు. దేశంలో పరివర్తనను తీసుకురావాల‌నే బ‌ల‌మైన ఆకాంక్ష స్వ‌చ్ఛాగ్రాహులంద‌రిలో ఉంద‌నే సంగతిని నేను ఎరుగుదును. మీరు నిత్యం ఇందుకోసం ప‌ని చేస్తున్నార‌ని నాకు తెలుసు. చంపార‌ణ్ స్వ‌చ్ఛాగ్ర‌హ‌మ‌నేది నేటి యువ‌త‌కు జాతీయ గీత‌మైంది. దీని కార‌ణంగా వారు వారి ఎదుట ఉన్న స‌వాళ్ల‌ను అర్థం చేసుకోగ‌లుగుతున్నారు. వాటిని ఎదుర్కొని ప‌రిష్క‌రించుకొని విజ‌యం సాధించేవ‌ర‌కు అవిశ్రాంతమైనటువంటి కృషిని చేస్తారు. ప్ర‌జ‌లు ప్రారంభించిన ఈ ఉద్య‌మం భావి భార‌త‌దేశానికి అవ‌స‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌నం చేస్తుంది.

స్వ‌చ్ఛ‌ భారత్ కోసం మ‌నం చేస్తున్న కృషి కార‌ణంగా స్వ‌చ్ఛ‌మైన‌, అంద‌మైన‌, సౌభాగ్య‌వంత‌మైన నూత‌న భార‌త‌దేశంలో ఒక నూత‌న అధ్యాయం ప్రారంభ‌మ‌వుతుంద‌ని నాకు పూర్తి న‌మ్మ‌కంగా వుంది. ఈ భారీ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న స్వ‌చ్ఛాగ్రాహులంద‌రికీ నా శుభాభినంద‌న‌లు తెలియ‌జేసుకొంటున్నాను. దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 2022 వ సంవత్సరం నాటికి 75 ఏళ్లు అవుతుంది. ఈ ఏడాది అక్టోబ‌ర్ 2 నుండి వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు గాంధీ గారి 150వ జ‌యంతిని జ‌రుపుకోబోతున్నాం. న్యూ ఇండియా స్వప్నాన్ని సాకారం చేసుకొనేందుకుగాను దేశంలోని సాంఘిక రుగ్మ‌త‌ల‌ను రూపుమాపాలి. దేశానికి హాని చేస్తున్న, జాతిని బ‌ల‌హీనం చేస్తున్న‌ దురాచారాలను రూపుమాపాలి. దేశాన్ని అవినీతి ర‌హితంగా, మురికి లేని దేశంగా త‌యారు చేయాలి. దేశంలో కుల‌వాదాన్ని, అధికత న్యూనత భావాలను, అంట‌రానిత‌నాన్ని రూపుమాపాలి. దేశాన్ని మ‌త‌ ఘర్షణలకు తావు లేనటువంటిదిగాను, మ‌త‌త‌త్వరహితమైనటువంటి దిగాను చేయాలి.

ఇలాంటి నిర్ణ‌యాల‌ను తీసుకొని మ‌నంద‌రం ముందుకు క‌దలితేనే 2022 కల్లా మ‌న స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌కు ఘ‌న‌మైన నివాళిని ఘ‌టించ‌గ‌లుగుతాం. 2018-19 గాంధీ జీ 150 జ‌యంతి సంవ‌త్స‌రం. ఈ సంద‌ర్భంగా మ‌నం నిజ‌మైన నివాళి ఘ‌టించ‌గ‌లం. ఈ ఆలోచ‌న‌ల‌తో మీకంద‌రికీ విన‌మ్రంగా శిర‌స్సును వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను. దేశానికి ఎంతో ఘ‌న‌మైన సేవ చేస్తున్న యువ‌త‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. మ‌రో సారి మీకంద‌రికీ, దేశ ప్ర‌జ‌లంద‌రికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మ‌హాత్మ గాంధీ మ‌న‌కు చాలా చేశారు. ద‌య‌చేసి మీరంద‌రూ ముందుకు రావాలి. స్వ‌చ్చ భార‌తం కోసం గాంధీ గారు కన్న క‌ల‌ను సాకారం చేయ‌డానికి మీరంద‌రూ ముందుకు వ‌చ్చి కృషి చేయాల‌ని కోరుతున్నాను.

ఇది ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం ఏమీ కాదు. ఇది ప్ర‌ధాన‌ మంత్రి కి లేదా ముఖ్య‌మంత్రుల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల కార్య‌క్ర‌మం కాదు. ఇది ఈ దేశం లోని 1.25 బిలియ‌న్ ప్ర‌జ‌ల‌కు సంబంధించింది. ఇది ఈ దేశం లోని పేద ప్ర‌జ‌ల‌కు సంబంధించిన కార్య‌క్ర‌మ‌ం. దేశంలో సామాజిక న్యాయాన్ని సాధించ‌డానికి, మ‌న మాతృమూర్తుల, సోద‌రీమ‌ణుల గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు సంబంధించింది. అందుకే మ‌నంద‌రం హృద‌యపూర్వకంగా ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకోవాలి.

ఈ భావ‌న‌తో నేను మ‌రోసారి స్వచ్ఛాగ్ర‌హులంద‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తూ వారికి విన‌మ్రంగా న‌మ‌స్క‌రిస్తూ, మీకంద‌రికీ మ‌రోసారి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకొంటున్నాను.

ద‌య‌చేసి మ‌రోసారి నాతో క‌లిసి నిన‌దించండి.

నేను మ‌హాత్మ గాంధీ అని అంటాను, దానికి మీరేమో ‘వర్ధిల్లాలి- వర్ధిల్లాలి’ అని రెండు సార్లు నిన‌దించాలి.

మ‌హాత్మ గాంధీ .. వర్ధిల్లాలి- వర్ధిల్లాలి.

దయచేసి మీ లోపలి బ‌లాన్నంతా ఉప‌యోగించి మ‌రో మారు గ‌ట్టిగా అనండి.

మ‌హాత్మ గాంధీ.. వర్ధిల్లాలి- వర్ధిల్లాలి.

మ‌హాత్మ గాంధీ.. వర్ధిల్లాలి- వర్ధిల్లాలి.

మీకు అంద‌రికీ అనేకానేక ధన్యవాదాలు.

***