Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

2018 అక్టోబర్ 28వ తేదీ నాడు ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం 48వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం


నా ప్రియమైన దేశప్రజలారా, అందరికీ నమస్కారం! అక్టోబర్ 31వ తేదీన మనందరికీ ప్రియమైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి. ప్రతి సంవత్సరంలో లాగనే ఆ రోజున కూడా ఐక్యత కోసం నిర్వహించే పరుగు ‘Run for Unity’ లో పాలుపంచుకోవడానికి దేశ యువత తయారుగా ఉన్నారు. ఇప్పుడు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి వాతావరణం ‘Run for Unity’ పరుగులో పాలుపంచుకునేవారి ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది. మీ అందరూ కూడా ఐక్యత కోసం జరిగే ఈ పరుగు – ‘Run for Unity’ లో చాలా పెద్ద సంఖ్యలో పాల్గోవాలని అభ్యర్థిస్తున్నాను. స్వాతంత్ర్యం రావడానికి ఆరున్నర నెలల ముందు, 1947 జనవరి 27న ప్రపంచ ప్రసిధ్ధిగాంచిన అంతర్జాతీయ పత్రిక “టైమ్ మ్యాగజైన్” ఒక సంస్కరణ ను ప్రచురించింది. పత్రిక కవర్ పేజీ మీద సర్దార్ పటేల్ గారి చిత్రాన్ని వేశారు. తమ లీడ్ స్టోరీలో ఆ పత్రిక ఒక భారతదేశ పటాన్ని ఇచ్చింది. కానీ అది ఇవాళ మనం చూస్తున్న భారతదేశ పటం లాంటిది కాదు.  చాలా భాగాలుగా విభజితమైపోయిన భారతదేశ పటం అది. అప్పట్లో దేశంలో దాదాపు 550 దేశీయ సంస్థానాలు ఉండేవి. భారతదేశం పట్ల ఆంగ్లేయుల ఆసక్తి తగ్గిపోయింది కానీ వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వెళ్ళీ పోవాలనుకున్నారు. “ఆ సమయంలో భారతదేశానికి విభజన, హింస, ఆహార పదార్థాల కొరత, ధరల పెరుగుదల, అధికారం కొరకై జరిగే రాజకీయాలు.. మొదలైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి ” అని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. వీటన్నింటి మధ్యా దేశాన్ని ఐక్యంగా ఉంచి, గాయాలను మాన్పే సామర్థ్యం ఎవరికైనా ఉందీ అంటే అది కేవలం వల్లభ్ భాయ్ పటేల్ కు మాత్రమే ఉంది అని ఆ పత్రిక రాసింది. టైమ్ మ్యాగజైన్ తన వ్యాసంలో ఉక్కు మనిషి జీవితంలోని ఇతర అంశాలను కూడా బహిర్గతం చేసింది. 1920లో అహ్మదాబాద్ లో వచ్చిన వరదల్లో ఆయన ఎలా సహాయ కార్యక్రమాల ఏర్పాటు చేసారు, ఎలా బార్దోలీ సత్యాగ్రహానికి మార్గదర్శకత్వం వహించారో తెలిపింది. దేశం పట్ల ఆయనకు గల నిజాయితీ, నిబధ్ధత ఎటువంటివంటే రైతులు, కూలీవారు మొదలుకొని ఉద్యోగస్తుల వరకూ అందరికీ ఆయనపై నమ్మకం ఉండేది. “రాష్ట్రాల మధ్య సమస్యలు బాగా పెరిగిపోయాయి. వీటిని కేవలం మీరు మాత్రమే పరిష్కరించగలరు” అని గాంధీగారు కూడా ఆయనతో అన్నారుట. సర్దార్ పటేల్ గారు ఒక్కొక్క సమస్యనూ పరిష్కరించి, దేశాన్ని సమైక్యంగా చేసే అసంభవమైన పనిని పూర్తిచేసి చూపెట్టారు.

విడి విడిగా ఉన్న జూనా గఢ్, హైదరాబాద్, ట్రావెన్కూర్, రాజస్థాన్ లోని సంస్థానాలు.. మొదలైన అన్ని  రాజ సంస్థానాలనూ దేశంలో విలీనం చేశారు. ఇవాళ మనం భారతదేశ పటాన్ని ఇలా సమైక్యంగా చూడకలుగుతున్నాము అంటే అది సర్దార్ పటేల్ గారి తెలివి, రాజనీతిజ్ఞత వల్లనే. ఐక్యతా సూత్రంతో బంధించబడిన ఈ భారతదేశాన్నీ, మన భరతమాతను చూసుకుని మనం స్వాభావికంగానే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారిని చక్కగా స్మరించుకుంటాం. ఈ అక్టోబర్ 31వ తేదీన మనం జరుపుకోబోతున్న సర్దార్ పటేల్ గారి జయంతి ఎంతో ప్రత్యేకమైనది. ఆ రోజున సర్దార్ పటేల్ గారికి నిజమైన శ్రధ్ధాంజలిని అందిస్తూ Statue of Unity ని దేశానికి అంకితం చెయ్యబోతున్నాం మనం .గుజరాత్ లో నర్మదా నదిపై స్థాపించిన ఈ విగ్రహం ఎత్తు అమెరికా లోని statue of liberty కి రెండింతలు ఉంటుంది. ఇది ప్రపంచంలోకెల్లా అంబరాన్నంటే అతి పెద్ద విగ్రహం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎత్తైన ప్రతిమ మన దేశంలో ఉంది అని ప్రతి భారతీయుడూ ఇప్పుడు గర్వపడతాడు. ఇప్పటిదాకా భూమితో ముడిపడిఉన్న సర్దార్ పటేల్ గారు ఇప్పుడు ఆకాశపు శోభను కూడా పెంచుతారు. ప్రతి భారతీయుడూ కూడా ఈ గొప్ప విజయాన్ని చూసుకుని ప్రపంచం ముందర గర్వంగా నిలబడి, తల ఎత్తుకుని నిలబడి మన గొప్పదనాన్ని కీర్తిద్దాం. ప్రతి భారతీయుడికీ ఈ విగ్రహాన్ని చూడాలనిపించడం స్వాభావికమే. భారతదేశంలో ప్రతి మారుమూల ప్రాంతంలోని ప్రజలు ఈ ప్రతిమ ఉన్న ప్రదేశాన్ని అత్యంత ప్రియమైన సందర్శనా స్థలంగా భావిస్తారని నా నమ్మకం.

నా ప్రియమైన సోదర సోదరీమణులారా, నిన్ననే మన దేశవాసులందరమూ ‘infantry day’ జరుపుకున్నాం. భారతీయ సైన్యంలో భాగమైన వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. నేను మన సైనికుల కుటుంబాలకు కూడా వారి సాహసానికి గానూ సెల్యూట్ చేస్తున్నాను. కానీ మన దేశవాసులందరూ ఈ ‘infantry day’ ని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఇదే రోజున మన భారతీయ సైనికులు కాశ్మీరు గడ్డపై అడుగుపెట్టిన చొరబాటుదారుల నుండి కాశ్మీరులోయను రక్షించారు. ఈ చారిత్రాత్మక సంఘటనకు కూడా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తో నేరుగా సంబంధం ఉంది. Sam manekshaw అనే ఒక గొప్ప భారతదేశ సైన్యాధికారి తాలూకూ పాత ఇంటర్వ్యూ (సంభాషణ)ని నేనొకసారి చదివాను. ఆ సంభాషణలో ఫీల్డ్ మార్షల్ Sam manekshaw , తాను కల్నల్ గా ఉన్నప్పటి రోజుల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ సమయంలో 1947 అక్టోబర్ లో కాశ్మీరులో సైనిక పోరాటాలు మొదలయ్యాయి. కాశ్మీరుకు సైన్యాన్ని పంపించడం ఆలస్యం అవుతోందని ఒకానొక సమావేశంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కోపగించుకోవడాన్ని ఫీల్డ్ మార్షల్ Sam manekshaw జ్ఞాపకం చేసుకున్నారు. ఆ సమావేశంలో సర్దార్ పటేల్ తనదైన ప్రత్యేక రీతిలో తన వంక చూసి కాశ్మీరులోని సైనిక పోరాటానికి కాస్త కూడా ఆలస్యమవడానికి వీల్లేదు. వీలయినంత త్వరగా దానికి పరిష్కారం ఆలోచించాలి అన్నారు. ఆ తర్వాత మన సైన్యం జవానులు విమానయానం ద్వారా కాశ్మీరు చేరుకున్నారు. అప్పుడు ఏ విధంగా మనకు విజయం లభించిందో మనకు తెలిసిన విషయమే. అక్టోబర్ 31న మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి కూడా. ఇందిరగారికి కూడా గౌరవపూర్వక శ్రధ్దాంజలి.

నా ప్రియమైన దేశప్రజలారా, ఆటలంటే ఎవరికి ఇష్టం ఉండవు? క్రీడాప్రపంచంలో స్ఫూర్తి, బలం, నైపుణ్యం, సామర్థ్యం -ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఒక క్రీడాకారుడి సాఫల్యానికి గీటురాళ్లు. ఈ నాలుగు గుణాలూ ఏ దేశ నిర్మాణానికైనా ఎంతో ముఖ్యమైనవి. ఏ దేశపు యువతలో ఈ గుణాలన్నీ ఉంటాయో, ఆ దేశం కేవలం ఆర్ధిక, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో అభివృధ్ధిని సాధించడమే కాకుండా క్రీడారంగంలో కూడా తన విజయపతాకాన్ని ఎగురవేస్తుంది. ఇటీవలే నాకు రెండు మరపురాని సమావేశాలు జరిగాయి. మొదటిది జకార్తాలో జరిగిన Asian para Games2018లో మన para athlets ను కలిసే అవకాశం లభించింది. ఈ క్రీడల్లో భారతదేశం మొత్తం 72 పతకాలను సాధించి రికార్డు ని సృష్టించిన మన para athlets భారతదేశ గౌరవాన్ని పెంచారు. ఈ ప్రతిభావంతులైన para athlets ను స్వయంగా కలిసే అదృష్టం లభించింది. వారందరికీ నేను అభినందనలు తెలిపాను. వారందరి ధృఢమైన సంకల్పబలం, ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొని, పోరాడి, ముందుకు నడవాలనే వారి పట్టుదల, మన దేశప్రజలందరికీ ప్రేరణాత్మకం. ఇలానే, అర్జెంటీనా లో జరిగిన summer youth olympics 2018 విజేతలను కలిసే అవకాశం లభించింది. youth olympics 2018 లో మన యువత ఇదివరకటి కన్నా మిన్నగా తమ ప్రతిభను ప్రదర్శించారని తెలుసుకుని మీరు సంతోషిస్తారు. ఈ పోటీల్లో మన దేశం పదమూడు పతకాలతో పాటూ మిక్స్ ఈవెంట్ లో అదనంగా మరో మూడు పతకాలను గెలుచుకుంది. ఈసారి ఆసియాక్రీడల్లో కూడా మన దేశం తన ప్రతిభను చాటుకున్న సంగతి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కొద్ది నిమిషాల్లో నేను ఎన్నిసార్లు ఇదివరకటి కన్నాఎక్కువగా, ఇదివరకటి కంటే గొప్పగా, లాంటి పదాలను ఉపయోగించానో చూడండి. ఇది నేటి భారతీయ క్రీడారంగం కథ. ఇది రోజురోజుకీ కొత్త శిఖరాలను చేరుకుంటోంది. భారతదేశం కేవలం క్రీడారంగం లోనే కాదు, మనం ఎప్పుడూ ఊహించని రంగాల్లో కూడా భారతదేశం కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఉదాహరణకి, నేను మీకు para athlet నారాయణ్ ఠాకూర్ గురించి చెప్తాను. Asian para Games2018లో అథ్లెటిక్స్ లో ఈయన బంగారుపతకాన్ని సాధించారు. నారాయణ్ జన్మత: దివ్యాంగుడు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఇతడు, మరో ఎనిమిదేళ్ల పాటు అనాథశరణాలయంలో గడిపాడు. అనాథశరణాలయం నుండి బయటకు వచ్చాకా జీవితాన్ని గడుపుకోవడానికి అతడు DTC బస్సులను శుభ్రపరచడం, ఢిల్లీ లోని రోడ్ల పక్కన ఉండే ధాబాల్లో వెయిటర్ లాంటి పనులను చేశాడు. అదే నారాయణ్ ఇవాళ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని, భారతదేశానికి బంగారు పతకాలు గెలుచుకొస్తున్నాడు. ఇంతే కాదు, భారతదేశ క్రీడల్లో పెరుగుతున్న సామర్ధ్యాన్ని చూడండి. భారతదేశం ఎప్పుడూ జూడో లో, సీనియర్ లెవెల్ లోనూ, జూనియర్ లెవెల్ రెండింటిలోనూ ఏ ఒలెంపిక్ పతకాలనూ సాధించలేదు. కానీ యూత్ ఒలెంపిక్స్ లో తబాబీ దేవి వెండి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. పదహారేళ్ళ యువ క్రీడాకారిణి తబాబి దేవి మణిపూర్ లోని ఒక గ్రామంలో నివసిస్తూంటారు. తండ్రి కూలిపనికి వెళ్తే, తల్లి చేపలు అమ్మేది. చాలాసార్లు వారి ఇంట్లో భోజనానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇటువంటి పరిస్థితులలో కూడా తబాబి దేవి ధైర్యం ఏ మాత్రం తగ్గలేదు. దేశం కోసం మెడల్ సంపాదించి చరిత్రను సృష్టించింది.ఇటువంటివే లఖ్ఖలేనన్ని కథలు. ప్రతి జీవితమూ స్ఫూర్తిదాయకమైనదే. ప్రతి యువక్రీడాకారుడూ, అతడి స్ఫూర్తి – న్యూ ఇండియాకి గుర్తింపు.

నా ప్రియమైన దేశప్రజలారా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మనం 2017లో FIFA Under17 world cup ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాం. అత్యంత సఫలవంతమైన టోర్నమెంట్ గా దాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుంది. FIFA Under17 world cup లో ప్రేక్షకుల సంఖ్య విషయంలో కూడా ఒక కొత్త ఒరవడిని మనం సృష్టించాం. దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లోని స్టేడియంల నుండి పన్నెండు లక్షల కంటే ఎక్కువమంది ప్రేక్షకులు ఆ ఫుట్ బాల్ పోటీలను చూసి ఆనందించి, యువ క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సంవత్సరం భారతదేశానికి పురుషుల హాకీ ప్రపంచ కప్ 2018 ని భువనేశ్వర్ లో నిర్వహించే అదృష్టం లభించింది. హాకీ ప్రపంచ కప్ నవంబర్ 28 నుండీ ప్రారంభమై డిసెంబర్ 16 వరకూ నడుస్తుంది. ఏ రకమైన ఆట ఆడే భారతీయుడికైనా లేదా ఏదో ఒక ఆటపై ఆసక్తి ఉన్న భారతీయుడికైనా హాకీ అంటే ఆసక్తి తప్పకుండా ఉంటుంది. హాకీ ఆటలో భారతదేశానికి ఒక సువర్ణచరిత్ర ఉంది. గతంలో భారతదేశం ఎన్నో హాకీ పోటీల్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఒకసారైతే భారతదేశం ప్రపంచ కప్ ని కూడా సాధించింది. హాకీ ఆటకు ఎందరో గొప్ప ఆటగాళ్ళను భారతదేశం అందించింది. ప్రపంచంలో ఎక్కడ హాకీ ప్రస్తావన వచ్చినా, మన భారతదేశానికి చెందిన గొప్ప గొప్ప హాకీ క్రీడాకారులను తలవకుండా ఆ కథ పూర్తవ్వదు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానచంద్ గురించి యావత్ ప్రపంచానికీ తెలుసు. ఆ తరువాత బల్వీందర్ సింగ్ సీనియర్, లెస్లీ క్లాడియస్ (Leslie Claudius), మొహమ్మద్ షాహిద్, ఉద్దమ్ సింగ్ నుండి ధన్రాజ్ పిళ్ళై వరకూ హాకీ ఆట చాలా పెద్ద ప్రయాణాన్నే నిర్ణయం చేసింది. ఇవాళ్టికీ మన టీమ్ ఇండియా ఆటగాళ్ళు తమ పరిశ్రమతో, పట్టుదలతో సాధిస్తున్న విజయాలతో కొత్త తరాల హాకీ ఆటగాళ్ళకు ప్రేరణను అందిస్తున్నారు. ఉద్వేగభరితమైన పోటీలను చూడటం క్రీడాప్రేమికులకు ఒక మంచి అవకాశం. మీరంతా భువనేశ్వర్ వెళ్ళి హాకీ మ్యాచ్ లను చూసి, మన క్రీడాకారులను ఉత్సాహపరచండి . ఇతర జట్టు లను కూడా ప్రోత్సహించండి. తనకంటూ ఒక గౌరవపూర్వకమైన చరిత్ర ఉన్న రాష్ట్రం ఒరిస్సా. ఒరిస్సాకు ఒక సంపన్నమైన, సాంస్కృతిక వారసత్వం ఉంది. అక్కడి మనుషులు కూడా చాలా స్నేహపూర్వకమైనవారు.  క్రీడాప్రేమికులకి ఒరిస్సాని  సందర్శించే ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఈ రకంగా మీరు ఆటలను చూసి ఆనందించడంతో పాటుగా కోణార్క్ లోని సూర్య దేవాలయం, పూరీ లోని జగన్నాథ మందిరం, చిలకా సరస్సు మొదలైన విశ్వవిఖ్యాత ప్రదేశాలనూ, పవిత్ర స్థలాలనూ సందర్శించవచ్చు. ఈ పోటీలకు గానూ నేను మన భారతీయ పురుష హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 125 కోట్ల భారతదేశ ప్రజలందరూ వారి వెంట ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తూ ఉంటారని జట్టుకు నేను నమ్మకంగా చెప్తున్నాను. అలానే భారతదేశం రాబోతున్న హాకీ జట్టులన్నింటికీ నేను అనేకానేక శుభాకంక్షలు తెలియచేస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా దేశప్రజలందరికీ ప్రేరణాత్మకంగా నిలుస్తారు. వారు ప్రజలలో ఉత్సాహాన్ని నింపుతారు. అసలు సేవా పరమో ధర్మ:  అనేది మన భారతీయ వారసత్వం. వేల శతబ్దాల నుండీ వచ్చిన మన సంప్రదాయం. సమాజంలో ప్రతి చోటా, ప్రతి రంగంలోనూ ఈ వారసత్వ పరిమళాన్ని మనం ఇవాళ్టికీ చూడగలం. కానీ ఈ నవీన యుగంలో, కొత్త తరాలవాళ్ళు ఈ వారసత్వాన్ని నూతనంగా కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశలతో, కొత్త కలలతో ఈ పనులను చెయ్యడానికి ముందుకు వస్తున్నారు. ఒక పోర్టల్ ని లాంచ్ చేసే కార్యక్రమానికి కొద్దిరోజుల క్రితం నేను వెళ్లాను. దాని పేరు ‘self 4 society’. Mygov, ఇంకా దేశంలోని IT , electronic industry వారు తమ ఉద్యోగస్తులను సామాజిక కార్యక్రమాలు చేపట్టేలా మోటివేట్ చెయ్యడానికీ, అందుకు సరైన అవకాశాలను వారికి అందించడానికీ ఈ portal ని launch చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారంతా చూపెట్టిన ఉత్సాహం, శ్రధ్ధ లను చూస్తే భారతీయులందరూ గర్వపడతారు. IT నుండి సమాజం వరకూ , నేను కాదు మనం, అహం కాదు వయం, స్వ నుండి సమిష్టి దాకా నడిచే ప్రయాణం ఇందులో ఉంది. కొందరు పిల్లలను చదివిస్తుంటే, కొందరు పెద్దలను చదివిస్తున్నారు.కొందరు పరిశుభ్రతపై దృష్టి పెడితే, కొందరు రైతులకు సహాయం చేస్తున్నారు. వీటన్నింటి వెనుకా ఏ స్వలాభమూ లేదు. కేవలం సమర్పణా భావం, సంకల్పం మాత్రమే ఉన్న నిస్వార్థభావం మాత్రమే ఉంది. ఒక యువకుడు దివ్యాంగుల wheelchair basketball జట్టుకు సహాయపడడానికి స్వయంగా wheelchair basketball నేర్చుకున్నాడు. mission mode activity అంటే ఈ ఆసక్తి , ఈ సమర్పణా భావమే . ఇవన్నీ తెలిసిన ఏ భారతీయుడు గర్వపడకుండా ఉంటాడు? తప్పకుండా గర్వపడతాడు. ’నేను కాదు మనం’ అనే భావన మనందరికీ ప్రేరణను అందిస్తుంది.

నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈసారి నేను  ’మన్ కీ బాత్ ’ కోసం మీ అందరి సూచనలనూ చూస్తూంటే, పాండిచ్చెరీ నుండి శ్రీ మనీష మహాపాత్ర రాసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కనపడింది. ఆయన మై గౌ లో ఏమని రాసారంటే, “భారతీయ గిరిజన సంప్రదాయాలు, ఆచారాలూ, ప్రకృతితో పాటు సహజీవనానికి ఎంత గొప్ప ఉదాహరణలో మీరు మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పండి”  అని రాశారు. sustainable development కోసం అనేక సంప్రదాయాలను మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. వాటి నుండి నేర్చుకోవాల్సినది చాలా ఉంది. మనీష్ గారూ, ఇటువంటి విషయాన్ని మన్ కీ బాత్ శ్రోతల ముందు ప్రస్తావించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన గౌరవపూర్వకమైన సంస్కృతిని, గతాన్ని తిరిగి చూసుకోవడానికి మనల్ని ప్రేరేపించే మంచి అవకాశం ఈ విషయం. ఇవాళ యావత్ ప్రపంచం, ముఖ్యంగా పశ్చిమ దేశాలు పర్యావరణను రక్షించడానికి చర్చలు జరుపుతున్నారు. సమతుల జీవన విధానం కోసం మార్గాలు అన్వేషిస్తున్నారు. మన భారతదేశం కూడా ఈ సమస్యను ఎదుర్కుంటోంది. దీని పరిష్కారం కోసం మాత్రం మనలోకి మనం ఒకసారి తొంగిచూసుకోవాలి అంతే. మన చరిత్రను, సంప్రదయాలను ఒకసారి తిరిగి చూడాలి. ముఖ్యంగా మన ఆదివాసీల జీవన శైలిని తెలుసుకోవాలి. ప్రకృతితో సామరస్యంగా ఉండటం అనేది మన ఆదివాసీల సంస్కృతిలో ఉంది. మన ఆదివాసీ సోదర సోదరీమణులు చెట్లను,మొక్కలను, పళ్లను దేవతామూర్తులుగా భావించి పూజిస్తారు. మధ్య భారత దేశంలో ముఖ్యంగా మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ ప్రాంతంలో నివసించే భీల్ తెగకు చెందిన ఆదివాసులు రావి, అర్జున వృక్షాలను శ్రధ్ధగా పూజిస్తారు. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో విష్ణోయీ సమాజం వారు పర్యావరణ సంరక్షణ ఎలా చేయాలి అనే మార్గాన్ని మనకు చూపెట్టారు. ముఖ్యంగా వృక్షాలను సంరక్షించే విషయంలో వారు తమ జీవితాలను సైతం త్యాగం చెయ్యడానికి సిధ్దపడతారు కానీ ఒక్క చెట్టుకి కూడా నష్టం జరగనివ్వరు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిష్మీ తెగ వారు , పులులతో సంబంధం ఉందని నమ్ముతారు. పులులను తమ తోడపుట్టినవారిగా వాళ్ళు భావిస్తారు. నాగాలాండ్ లో కూడా పులులను అడవులను రక్షించే రక్షకులుగా పరిగణిస్తారు. మహారాష్ట్ర లో వర్లీ వర్గానికి చెందిన ప్రజలు పులిని అతిధిగా భావిస్తారు. వారికి పులుల సన్నిధి శ్రేయోదాయకం. మధ్య భారతదేశంలోని కోల్ తెగ వారు తమ అదృష్టం పులులతో ముడిపడి ఉందని నమ్ముతారు. పులికి గనుక ఆపూట ఆహారం దొరకకపోతే తాము కూడా ఆ పూట పస్తు ఉంటారు. ఇది వారి ఆచారం. మధ్య భారతదేశంలోని గోండ్ తెగవారు బ్రీడింగ్ సీజన్ లో కేథన్ నదిలోని కొన్ని ప్రాంతాల్లో చేపలు పట్టడం ఆపేస్తారు. ఆ ప్రాంతాల్లో చేపలు ఎక్కువగా ఉంటాయిట. ఇదే ఆచారాన్ని పాటిస్తూంటేనే వారికి ఆరోగ్యకరమైన, కావాల్సినన్ని మంచి చేపలు దొరుకుతాయి. ఆదివాసులు తమ ఇళ్ళను సహజపదార్థాలతో నిర్మించుకుంటారు. ఇవి ధృఢంగా ఉండడంతో పాటుగా ప్రర్యావరణకు కూడా మేలు చేస్తాయి. దక్షిణ భారతదేశంలో నీలగిరి పీఠభూమిలోని ఏకాంత ప్రాంతాల్లో నివశించే ధూమంతు అనే ఒక చిన్న తెగ తమ బస్తీలని సంప్రదాయకంగా స్థానీయంగా దొరికే చిన్న చిన్న వస్తువులతోనే తయారుచేసుకుంటారు.

నా ప్రియమైన సోదర సొదరీమణులారా, ఆదివాసీ తెగలవారు తమలో తాము కలిసిమెలసి, శాంతియుతంగా జీవించాలని నమ్ముతారన్న సంగతి నిజమే. కానీ ఎవరైనా తమ సహజ వనరులకు నష్టం కలిగిస్తుంటే ,తమ హక్కుల కోసం పోరాడటానికి వాళ్ళు భయపడరు . మన మొట్టమొదటి స్వాతంత్ర్యసమరయోధుల్లో కొందరు ఆదివాసి తెగల వారే ఉన్నారు. భగవాన్ బిర్సా ముండాను ఎవరు మర్చిపోగలరు? తన అడవిని రక్షించుకుందుకు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతో పెద్ద పోరాటమే చేశారయన. నేను చెప్పిన విషయాల జాబితా కాస్త పెద్దదే. ప్రకృతితో సామరస్యంగా ఎలా ఉండాలో చెప్పేందుకు ఆదివాసీ తెగల నుండి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ మన దగ్గర ఈమాత్రం అటవీ సంపద మిగిలి ఉండడానికి కారణమైన మన ఆదివాసులకి దేశం ఋణపడి ఉండాలి. వారి పట్ల మనం ఆదరంగా ఉండాలి.

నా ప్రియమైన దేశప్రజలారా, మన్ కీ బాత్ లో మనం సమాజం కోసం అసాధారణ పనులు చేసిన వ్యక్తుల గురించీ, సంస్థల గురించీ చెప్పుకుంటాం. చూడడానికి చిన్నవిగా కనిపించినా, ఆ పనుల వల్ల చాలా లోతైన ప్రభావమే పడుతుంది. ఆ మార్పులు మనలో మానసికంగానూ, సమాజం నడిచే తీరు మార్చేలాంటివీనూ. కొద్దిరోజుల క్రితం నేను పంజాబ్ కు చెందిన సొదరుడు గురుబచన్ సింగ్ గురించి చదివాను. కష్టపడి పనిచేసే ఒక సామాన్యమైన రైతు గురుబచన్ సింగ్ కొడుకు పెళ్ళి జరిగుతోంది. ఈ వివాహానికి ముందుగానే గురుబచన్ గారు పెళ్లికుమార్తె తల్లిదండ్రులకు పెళ్ళి నిరాడంబరంగా జరిపిద్దాం, కానీ నాదొక షరతు.. అని చెప్పారట. సాధారణంగా పెళ్ళివారు షరతు అన్నారంటే అదేదో పెద్ద కోరికే అని అనుకుంటాం. వీళ్ళేవో పెద్ద పెద్ద కోరికలే కోరబోతున్నారు అనుకుంటారు వియ్యాలవారు. కానీ ఒక సాధారణ రైత్రు అయిన సోదరుడు గురుబచన్ అడిగిన షరతు విని మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. అదే మన సమాజంలో ఉన్న నిజమైన బలం. గురుబచన్ ఏమని అడిగారంటే, పెళ్ళిలో మీరు ధాన్యం కోయగా మిగిలిన వరి దుబ్బులని పొలంలో కాల్చనని వియ్యాలవారిని మాటివ్వాల్సిందిగా ఆయన అడిగారు. ఎంతో పెద్ద సామాజిక శ్రేయస్సు ఇందులో ఉంది. గురుబచన్ సింగ్ గారు అడిగిన కోరిక చిన్నగానే ఉంది కానీ ఆయన హృదయం ఎంత విశాలమైనదో ఈ కోరిక తెలుపుతుంది. ఇలా వ్యక్తిగత విషయలను సమాజ శ్రేయస్సు తో కలిపే కుటుంబాలు మన సమాజంలో చాలానే ఉన్నాయి.  శ్రీ గురుబచన్ సింగ్ గారి కుటుంబం అలాంటి ఒక ఉదాహరణని మన ముందర ఉంచారు. పంజాబ్ లోని నాభా దగ్గర ఉన్న మరొక చిన్న గ్రామం కల్లర్ మాజ్రా గురించి చదివాను నేను. కల్లర్ మాజ్రా అనే ఈ గ్రామం ఎందుకు చర్చల్లోకి వచ్చిందంటే, అక్కడి ప్రజలు ధాన్యం కోయగా మిగిలిన వరి దుబ్బులని పొలంలో కాల్చే బదులు, వాటిని మట్టి తవ్వి లోపల కప్పిపెట్టేస్తారుట. దాని కోసం ఎంత సాంకేతికత అవసరం ఉంటుందో అంతటినీ సమకూర్చుకుంటారుట. సోదరుడు గురుబచన్ సింగ్ కి నా అభినందనలు. కల్లర్ మాజ్రా ప్రజలకు, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నించే ప్రజలందరికీ నా అభినందనలు. మీరంతా పరిశుభ్రమైన జీవనవిధానం అనే భారతీయ సంప్రదాయానికి నిజమైన ప్రతినిధులుగా ముందుకు నడుస్తున్నారు. చుక్క,చుక్కా కలిస్తేనే సాగరమైనట్లు, చిన్న చిన్న జాగ్రత్తలు, మంచి పనులు, సానుకూలమైన పనులు, ఎల్లప్పుడూ సానుకూల వాతావరణాన్ని తయారుచేయడంలో అతి పెద్ద పాత్రను వహిస్తాయి.

నా ప్రియమైన దేశప్రజలారా, మన గ్రంధాల్లో చెప్పారు –

ఓం దయౌ: శాంతి: అంతరిక్ష్యం శాంతి:

పృథ్వీ శాంతి: ఆప: శాంతి: ఔపథయ: శాంతి:

వనస్పతయ: శాంతి: విశ్వేదేవా: శాంతి: బ్రహ్మ శాంతి:

సర్వం శాంతి: శాంతరేవ శాంతి: సమా సమా శాంతిరేధి

ఓం  శాంతి:  శాంతి:  శాంతి: 

దీని అర్థం ఏమిటంటే, ముల్లోకాల్లోనూ నలుమూలలా శాంతి ఉండాలి. నీటిలో, భూమిపై, ఆకాశంలోనూ, అంతరిక్ష్యం లోనూ, అగ్ని లో, వాయువులో, ఔషధాలలో, వృక్షకోటి లో, ఉద్యానవనాలలో, అచేతనలో, సంపూర్ణ బ్రహ్మాండంలో శాంతి స్థాపన చేద్దాం. జీవంలో, హృదయంలో, నాలో, నీలో, జగత్తు లోని ప్రతి కణంలో, ప్రతి చోటా శాంతిని స్థాపిద్దాం.

ఓం శాంతి:  శాంతి:  శాంతి: 

ప్రపంచ శాంతి అనే మాట వచ్చినప్పుడల్లా భారతదేశం పేరు, ఇందుకు భారతదేశం అందించిన సహకారం సువర్ణాక్షరాలలో కనబడుతుంది. భారతదేశానికి వచ్చే నవంబర్ 11వ తేదీ ప్రత్యేకమైనది. ఎందుకంటే, వందేళ్ల క్రితం నవంబర్11న మొదటి ప్రపంచ యుధ్ధం పూర్తయ్యింది. యుధ్ధం సమాప్తమై వందేళ్ళు పూర్తయ్యాయంటే, అప్పుడు జరిగిన భారీవినాశనానికీ, జన నష్టం పూర్తయ్యి ఒక శతాబ్దం పూర్తవుతుంది. మొదటి ప్రపంచ యుధ్ధం భారతదేశానికి ఒక ముఖ్యమైన సంఘటన. సరిగ్గా చెప్పాలంటే అసలా యుధ్ధంతో మనకి సంబంధమే లేదు. అయినా కూడా మన సైనికులు ఎంతో వీరత్వంతో పోరాడారు, ఎంతో పెద్ద పాత్రను పోషించారు, అత్యధిక బలిదానాలను ఇచ్చారు. యుధ్ధం వచ్చినప్పుడు తాము ఎవరికీ తీసిపోమని భారతీయ సైనికులు ప్రపంచానికి చూపెట్టారు. దుర్లభమైన ప్రదేశాలలో, విషమ పరిస్థితుల్లో కూడా మన సైనికులు తమ శౌర్యప్రతాపాలను చూపెట్టారు. వీటాన్నింటి వెనుకా ఉన్న ఒకే ఉద్దేశ్యం – తిరిగి శాంతి స్థాపన చెయ్యడం. మొదటి ప్రపంచ యుధ్ధం లో ప్రపంచం వినాశతాండవాన్ని చూసింది. అంచనాల ప్రకారం దాదాపు ఒక కోటిమంది సైనికులు, మరో కోటి మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. దీనివల్ల శాంతి ఎంత ముఖ్యమైనదో ప్రపంచం తెలుసుకుంది. గత వందేళ్లలో శాంతి అనే పదానికి అర్థమే మారిపోయింది. ఇవాళ శాంతి, సద్భావం అంటే కేవలం యుధ్ధం జరగకపోవడం కాదు. తీవ్రవాదం మొదలుకొని వాతావరణంలో మార్పు, అర్థిక అభివృధ్ధి నుండీ సామాజిక న్యాయం వరకూ మార్పు జరగాల్సి ఉంది. వీటన్నింటి కోసం ప్రపంచం సహకారంతోనూ, సమన్వయంతోనూ పనిచేయాల్సి ఉంది. నిరుపేద వ్యక్తి అభివృధ్ధే శాంతికి నిజమైన సంకేతం. 

నా ప్రియమైన దేశప్రజలారా, మన ఈశాన్య రాష్ట్రాల విషయమే వేరు. ఈ ప్రాంతంలో ప్రాకృతిక సౌందర్యం అనుపమానమైనది. ఇక్కడి ప్రజలు అత్యంత ప్రతిభావంతులు. మన ఈశాన్యం ఇప్పుడు ఎన్నో మంచి పనులవల్ల కూడా గుర్తించబడుతోంది. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో ఎంతో అభివృధ్ధిని సాధించాయి. కొద్ది రోజుల క్రితం సిక్కిం లో sustainable food system ని ప్రోత్సహించడానికి స్థాపించిన Future Policy Gold Award 2018ని సిక్కిం గెలుచుకుంది. ఈ అవార్డు ని సంయుక్త రాష్ట్రాలతో కలిసిన F.A.O అంటే Food and Agriculture Organisation తరఫున ఇస్తారు. ఈ రంగంలో  best policy making కోసం ఇచ్చే ఈ అవార్డ్ ఆ రంగంలో ఆస్కార్ తో సమానం. ఇదే కాక మన సిక్కిం ఇరవై ఐదు దేశాల నుండి యాభై ఒక్క నామినేటెడ్ పాలసీలను దాటుకుని ఈ అవార్డుని గెలుచుకుంది. ఇందుకు గానూ నేను సిక్కిం ప్రజలకు అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, అక్టోబర్ అయిపోతోంది. వాతావరణంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. చలికాలం మొదలయ్యింది. దానితో పాటుగా పండుగల వాతావరణం కూడా వచ్చేసింది. ధన్ తెరస్, దీపావళి, భయ్యా దూజ్, ఛట్..ఒకరకంగా చెప్పాలంటే నవంబర్ నెలంతా పండుగల నెల.  దేశప్రజలందరికీ ఈ పండుగలన్నింటి తరఫునా అనేకానేక శుభాకాంక్షలు.

మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే, ఈ పండుగలలో మీ క్షేమాన్నే కాకుండా మీ అరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. సమాజ శ్రేయస్సుని కూడా దృష్టిలో పెట్టుకోండి. కొత్త సంకల్పాలను చేసుకునేందుకు ఈ పండుగలు సరైన అవకాశాన్ని ఇస్తాయని నా నమ్మకం. కొత్త నిర్ణయాలను చేసుకునేందుకు కూడా ఈ పండుగలు అవకాశాన్ని ఇస్తాయి. ఒక mission mode తో మీరు జీవితంలో ముందుకు నడవడానికీ, ధృఢ సంకల్పాన్ని చేసుకోవడానికీ ఈ పండుగలు ఒక అవకాశంగా మారాలని కోరుకుంటున్నాను. దేశ అభివృధ్ధిలో మీ అభివృధ్ధే ఒక ముఖ్యమైన భాగం. మీకు ఎంత అభివృధ్ధి జరిగితే దేశం అంతగా ప్రగతిని సాధిస్తుంది. మీ అందరికీ నా అనేకానేక శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.

***