యువర్ ఎక్స్‌లెన్సీ ప్రైమ్ మినిస్టర్ శ్రీ చార్ల్ స్ మిచెల్,
లేడీస్ అండ్ జెంటిల్ మెన్,
మీ పరిశీలనకు ధన్యవాదాలు.
గత వారం బెల్జియానికి పెను విషాదాన్ని మిగిల్చింది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఈ ఎనిమిది రోజుల్లో బెల్జియం ప్రజలు అనుభవించిన దుఃఖాన్ని, ఆవేదనను భారతదేశం పూర్తిగా అర్థం చేసుకొని పంచుకున్నది. గత వారం బ్రసెల్స్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఉగ్రవాద దాడుల బీభత్సానికి ఎన్నోసార్లు బాధితురాలైన దేశంగా మాకు తెలుసు ఈ విషాదం ఎలాంటిదో. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో మొత్తం భారతదేశమంతా బెల్జియం ప్రజలకు తన పూర్తి స్థాయి మద్దతునిస్తూ స్నేహ సౌభ్రాతృత్వాలను ప్రకటిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు నా కోసం సమయం వెచ్చించి, నాకు స్వాగతం పలికినందుకు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. మీకు ఇవే నా కృతజ్ఞతలు. ఉగ్రవాదమనే సవాల్ ఉమ్మడిగా మనం ఎదుర్కొంటున్న సవాల్. దీని కోసం మనం పరస్పర న్యాయ సహాయ ఒప్పందంపైన తిరిగి మన చర్చలను పునరుద్ధరించాలి. నేరగాళ్ల బదిలీ ఒప్పందం, శిక్ష పడ్డ ఖైదీల పరస్పర అప్పగింత ఒప్పందాల పైన చర్చలను తక్షణమే ముగించాలి.
స్నేహితులారా,
మన రెండు దేశాల స్నేహ సంబంధాలకు దీర్ఘకాల చరిత్ర ఉంది. వంద సంవత్సరాల క్రితం 1,30,000 మందివరకు భారతీయ సైనికులు బెల్జియం దేశస్థులతో కలసి మొదటి ప్రపంచ యుద్ధంలో ఇదే గడ్డ మీద పోరాటం చేశారు. ఈ యుద్ధంలో 9,000 కు పైగా భారతీయ సైనికులు వీర మరణం పొందారు. భారతదేశం, బెల్జియంల మధ్య దౌత్య సంబంధాలకు వచ్చే సంవత్సరంతో 70 సంవత్సరాలు. మన స్నేహ సంబంధాలలో ముఖ్యమైన మైలురాయి లాంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బెల్జియం రాజు శ్రీ కింగ్ ఫిలిప్ ను వచ్చే సంవత్సరం భారతదేశాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అంతే కాదు, ఈ సందర్భంగా ఇరు దేశాలలో ఉమ్మడిగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుందాం. ఈ రోజు ప్రధాని శ్రీ చార్ల్ స్ మిచెల్‌తో నా సంభాషణంతా ఇరు దేశాల మధ్య గల మొత్తం సంబంధాలలోని అన్ని పార్శ్యాలపైన జరిగింది. ద్వైపాక్షిక విదేశీ విధాన సంప్రదింపుల వ్యవస్థ మన రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతమైన స్థాయికి చేర్చే నిర్దిష్ట మార్గాలను సూచించగలుగుతుంది.
స్నేహితులారా,
ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు అనేక ఉజ్జ్వలమైన ఆర్థికపరమైన అవకాశాలకు నెలవైన దేశాల సరసన భారతదేశం కూడా ఉంది. మా దేశానికి సంబంధించిన స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. 7 శాతానికి పైగా వృద్ధితో ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటిగా భారత దేశానికి గుర్తింపు లభించింది. బెల్జియం దేశ సామర్థ్యాలు, భారతదేశ ఆర్థిక వృద్ధి రెండు కలిస్తే ఇరు దేశాల్లోను వ్యాపార పరంగా అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని నేను నమ్ముతున్నాను. ఈ రోజు ఇంతకు ముందుగా బెల్జియం ప్రధాని, నేను కలసి బెల్జియం సిఇఒ ల తోను, ఇతర వ్యాపార వేత్తల తోను సమావేశమయ్యాము. భారతదేశం మొదలుపెట్టిన కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా భాగం కావాలని ఈ సందర్భంగా నేను బెల్జియం ప్రభుత్వానికి, ఇక్కడి కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాను. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా తదితర కార్యక్రమాల్లో భాగం కావాలని కోరుతున్నాను. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా బెల్జియం కంపెనీలు లబ్ధి పొందవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఆ కంపెనీలు తాము సరఫరా చేసే వస్తువులను మరింత తక్కువ ధరలకే సరఫరా చేసుకోవచ్చు. భారతదేశం ఇప్పుడు తన మౌలిక వసతులను ఆధునికీకరిస్తోంది. ముఖ్యంగా రైల్వేల రంగంలోను, నౌకాశ్రయాల రంగంలోను, వందకు పైగా స్మార్ట్ సిటీల నిర్మాణంలోను ఆధునికీకరణ కొనసాగుతోంది. ఇందులో బెల్జియం కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ప్రత్యేకమైన అవకాశాలున్నాయి. ఇలాంటి భాగస్వామ్యాల కారణంగా ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కుతుంది. బెల్జియం వ్యాపారవేత్తలతో కలసి భారత దేశంలో పర్యటించాలని, దేశంలో జరుగుతున్న ఆర్థిక ప్రగతిని, రాజకీయ వాతావరణాన్ని స్వయంగా గమనించాల్సిందిగా నేను ప్రధాని శ్రీ మిచెల్‌ను ఆహ్వానించాను. స్పష్టంగా చెప్పాలంటే కేవలం వజ్రాలు మాత్రమే ఇరు దేశాల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయలేవు. ప్రస్తుతం ప్రపంచ మానవాళి మందు ఉన్న అతి పెద్ద సవాళ్లలో ఒకటి వాతావరణ మార్పు. పునరుత్పాదక ఇంధన రంగంలో సహకారాన్ని మెరుగు పరుచుకోవాలని ప్రధాని, నేను అంగీకరించాం. వ్యర్థాల ద్వారా ఇంధన తయారీ, చిన్న తరహా పవన విద్యుత్ టర్బయిన్లు, శూన్య ఉద్గార భవనాల నిర్మాణ రంగాలలో ఇరు దేశాలు భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవవచ్చు. శాస్త్ర సాంకేతిక , హై- టెక్నాలజీ రంగాల్లో ప్రగతిని సాధించడం భారతదేశ అభివృద్ధి ప్రాధాన్యతలలో ముఖ్యమైనది. ఈ రంగాలలో బెల్జియం భాగస్వామ్యానికి ఇదే మా స్వాగతం. ప్రధాని శ్రీ మిచెల్, నేను కలసి ఇప్పుడే రిమోట్ ద్వారా భారతదేశ భారీ ఆప్టికల్ టెలిస్కోప్‌ను ప్రారంభించాం. బెల్జియమ్ తో కలసి భారత దేశంలో ఈ టెలిస్కోప్‌ను నిర్మించుకోవడం జరిగింది. ఇరు దేశాల భాగస్వామ్యం కారణంగా చేకూరే విజయానికి ఇది ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ. ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆడియో- విజువల్ ప్రొడక్షన్, టూరిజం, బయోటెక్నాలజీ, నౌకాశ్రయాలు మొదలైన రంగాల ఒప్పందాల విషయంలో కూడా పనులు జరుగుతున్నాయి.
స్నేహితులారా,
మరికొద్ది గంటల్లో 13వ ఇండియా-యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశంలో యూరోపియన్ యూనియన్ నాయకులను కలుసుకోబోతున్నాను. భారతదేశానికి గల బలమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఇయు ఒకటి. యూరోపియన్ యూనియన్ (ఇ యు)తో జరగబోతున్న చర్చలు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాలలో భారత దేశానికి, ఇ యు కు ఉండబోయే భాగస్వామ్యం పైనే జరుగుతాయి. ఇండియా- ఇ యు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అగ్రిమెంట్ కు సంబంధించిన ప్రగతి పథం, దానికి సంబంధించిన సృజనాత్మక ఆలోచనల కారణంగా బెల్జియంతో సహా యూరోపియన్ దేశాలన్నీ భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి ద్వారా లబ్ధి పొందుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. బెల్జియం ప్రధాని శ్రీ చార్ల్ స్ మిచెల్ సమయాన్ని కేటాయించి స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేసిందుకు మరో సారి నేను నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన భారత పర్యటన చేపట్టబోయే రోజు కోసం వేచి ఉంటాను.
మీకు ఇవే నా ధన్యవాదాలు.
***
Combination of Belgian capacities & India's economic growth can create wonderful opportunities & benefit the world. https://t.co/s9lDufn1Eh
— Narendra Modi (@narendramodi) March 30, 2016