1. రెండు పవిత్ర మసీదుల సంరక్షుడైన రాజు శ్రీ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ ఆహ్వానించిన మీదట భారత గణతంత్రపు మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు.. 2016 ఏప్రిల్ 2, 3వ తేదీలలో.. ద కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా లో అధికారికంగా పర్యటించారు.
2. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఏప్రిల్ 3న ద రాయల్ కోర్టు వద్ద స్వాగతం పలికారు. ఇరు దేశాలు, వాటి ప్రజల మధ్య నెలకొన్న బలమైన స్నేహం అందిస్తున్న స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ప్రధాన మంత్రి పర్యటనలో భాగంగా రాకుమారుడు శ్రీ మొహమ్మద్ బిన్ నయీఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తోను, యువ రాజు, డిప్యూటీ ప్రీమియర్, మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ శ్రీ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తోను, సెకండ్ డిప్యూటీ ప్రీమియర్, మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ తోను భేటీ అయ్యారు. ప్రధాన మంత్రి ఇంకా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని, అలాగే ఆరోగ్య శాఖ మంత్రిని, సౌదీ అరామ్ కో ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్‌ను కూడా కలుసుకొన్నారు.
3. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడైన రాజు శ్రీ సల్మాన్ బిన్ అబ్దులజీజ్, మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలతో పాటు పరస్పరం ఆసక్తి ఇమిడిన బహుళ పక్ష అంశాల పైన ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకొన్నారు. రెండు దేశాల మధ్య గల సన్నిహిత, స్నేహ సంబంధాలు, రెండు దేశాల మధ్య లోతుగా వేళ్లూనుకొన్న చరిత్ర, నిలకడగా వర్ధిల్లుతూ వస్తున్న ఆర్థిక భాగస్వామ్యం, బహుముఖీన సహకారం, ప్రజల మధ్య తొణికిసలాడే సంబంధాలు ఇరువురు నేతల చర్చలలో ప్రస్తావనకు వచ్చాయి. పలు అంశాలపై హార్దిక వాతావరణంలో నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. తద్వారా ఇరు దేశాల నేతలు వారి మధ్య తమ ఆందోళనలను, దృష్టి కోణాలను మెరుగ్గా అవగాహన చేసుకోగలిగారు. గల్ఫ్ ప్రాంతంతో పాటు భారత ఉపఖండ స్థిరత్వం, భద్రత ఎంతో సన్నిహితంగా ముడిపడి ఉన్నాయని, ఈ ప్రాంతంలోని దేశాల అభివృద్ధికిగాను భద్రతాపూర్వకమైన శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇద్దరు నేతలూ ఈ సందర్భంగా గుర్తించారు.
4. ఇటీవల కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నతీకరించేలా ఇరు దేశాల మధ్య రాజకీయంగా, ఆర్ధికంగా, భద్రతాపరంగా, రక్షణ పరంగా, మానవవనరులపరంగా, ఇరు వైపుల ప్రజల రాకపోకల రీత్యా చోటు చేసుకొన్న విజయవంతమైన మార్పు పట్ల ఇరువురు నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య తరచుగా కొనసాగుతున్న ఉన్నత స్థాయి సందర్శనల పట్ల ఇరువురు నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. తద్వారా జరిగిన ఢిల్లీ డిక్లరేషన్-2006, రియాద్ డిక్లరేషన్ – 2010 అనేవి పరస్పర లబ్ధిని చేకూర్చే ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక భాగస్వామ్య’ స్థాయికి ఇనుమడింపచేసినట్లు కూడా ఇరువురు నేతలు గుర్తించారు.
5. తమ ప్రాంతాల శాంతి, సుస్థిరత, భద్రతల తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా వీటిని కాపాడటంలో తమకు ఉన్న భాద్యత పట్ల ఇరువురు నేతలు ఎరుకతో వ్యవహరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక బంధాన్ని సుదృఢం చేసుకోవాలని, భద్రత, రక్షణ సహకారం రంగాలతో సహా ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పనిని నిర్వర్తించాలని వారు భావించారు.
6. రాజు శ్రీ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ 2014 ఫ్రిబవరి నెలలో అప్పటి ద కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ ప్రీమియర్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ హోదాలలో భారతదేశంలో పర్యటించిన వేళ రక్షణ సహకార రంగంలో కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. మిలటరీ సిబ్బంది, నిపుణులు ఇరు దేశాలను సందర్శించడం ద్వారాను, ఉమ్మడిగా మిలిటరీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారాను, ఇరు దేశాల యుద్ధ నౌకలు, విమానాలతో ఇరు దేశాల్లోపర్యటనలు చేయడం ద్వారాను, యుద్ధ పరికరాలు, మందుగుండు సామగ్రిని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారాను, ఇలాంటి పనుల ఉమ్మడి అభివృద్ధి ద్వారా రక్షణరంగ సహకారాన్ని మెరుగుపరుచుకోవాలని ఇరు దేశాల నేతలు భావించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా సందర్శనను పురస్కరించుకొని ఇరు దేశాల రక్షణ సహకార సంయుక్త సంఘం తన రెండో సమావేశాన్ని రియాద్ లో ఏర్పాటు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు.
7. గల్ఫ్ , హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సముద్ర భద్రతను పటిష్టం చేయడానికిగాను సహకారాన్ని మరింత పెంచాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ ప్రాంతాల్లో సముద్ర భద్రత ఇరు దేశాల భద్రతకు, సౌభాగ్యానికి కీలకమైనది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు మానవతాపూర్వక సహాయ చర్యల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు.
8. ఉగ్రవాదం అనేది ఏ రూపాల్లో ఉన్నా దాన్ని తీవ్రంగా ఖండించాలని ఇరు దేశాల నేతలు భావించారు. ఉగ్రవాద కార్యకలాపాలు ఎవరు చేపట్టినా, వారి సంకల్పాలు, లక్ష్యాలు ఏవైనప్పటికీ ఉగ్రవాదాన్ని తప్పకుండా ఖండించాలని అంగీకరించారు.
9. తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాలు ప్రపంచంలోని అన్ని దేశాలకు, అన్ని సమాజాలకు ప్రమాదకారిగా మారాయి. వారు వీరు అని కాకుండా అందరినీ ఉగ్రవాదం భయపెడుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఇరువురు నేతలు ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోన్న దుష్పరిణామమని.. దానిని ఒక జాతికి, మతానికి, సంస్కృతికి ముడిపెట్టడం సరి కాదని అంగీకరించారు. అలా ముడిపెట్టే ధోరణులను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇతర దేశాలపైన కక్ష సాధించడానికి ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోవద్దని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. ఏ దేశంలోనైనా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన మౌలిక వసతులు ఉంటే వాటిని వెంటనే కూల్చి వేయాలని, ఉగ్రవాదులకు ఎలాంటి సహకారం అందించవద్దని ఇరువురు నేతలు ఆయా దేశాలను కోరారు. ముఖ్యంగా ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం నిలిపివేయాలని, తమ తమ భూభాగాలలో వారి కార్యకలాపాలు జరగకుండా చూడాలని, ఉగ్రవాదానికి కారణమయిన వాళ్లను న్యాయస్థానాలకు ఈడ్చి తగిన శిక్షపడేలా చూడాలని కోరారు.
10. ఉగ్రవాదంపై చేసే పోరులో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఈ పోరును ద్వైపాక్షిక స్థాయిలోను, ఐక్య రాజ్య సమితి వేదిక ద్వారా బహుళ పక్ష స్థాయిలోను చేయాలని నిర్ణయించారు. ఉగ్రవాదం రువ్వుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా అంతర్జాతీయ సమాజం కృషి చేయాల్సి ఉందని, ఇందుకుగాను బహుళ పక్ష సంస్థలను పటిష్టం చేయాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఉగ్రవాదం పైన సమగ్రమైన సమావేశాన్ని ఐక్య రాజ్య సమితిలో నిర్వహించడానికిగాను భారతదేశం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం పొందడానికి వీలుగా ఇరు దేశాలు కృషి చేయాలని అంగీకరించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని విధాలుగా సౌదీ అరేబియా చేస్తున్న పోరాటాన్ని, కృషిని ఉగ్రవాద అంతానికిగాను అంతర్జాతీయ స్థాయిలో సౌదీ అరేబియా అందిస్తున్న భాగస్వామ్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాల వేదికను తయారు చేయడానికి సౌదీ అరేబియా చేస్తున్న కృషిని ఈ సందర్భంగా భారతదేశానికి సౌదీ అరేబియా సంక్షిప్తంగా వివరించడం జరిగింది.
11. ఇరు దేశాల మధ్య గల ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని ప్రస్తావిస్తూ, దాని ప్రాధాన్యాన్ని ఇరువురు నేతలు ప్రశంసించారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యకాలాపాల్లో సహకారాన్ని పెంచాలని నిర్ణయించారు. ఇందుకుగాను అవసరమయ్యే రహస్య సమాచారాన్ని ఒకరికి మరొకరు ఇచ్చి పుచ్చుకోవడం, సామర్థ్యాలను పెంపొందించుకోవడం, చట్టాల అమలులో సహకారం, మనీ లాండరింగ్ కార్యకలాపాలను అడ్డుకోవడం, మత్తుమందుల రవాణా కార్యకలాపాలను నిరోధించడం మొదలైన అన్ని అంశాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. మనీ లాండరింగ్, సంబంధిత నేరాలు, ఉగ్రవాదులకు ఆర్ధిక సాయ నేరం లాంటి అంశాలలో రహస్య సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకొనే సహకారానికి సంబంధించిన ఎమ్ ఒ యు పైన సంతకాలను ఇరువురు నేతలు స్వాగతించారు. డబ్బు అక్రమ రవాణాపైన చర్యలు చేపట్టాలని ఇరు దేశాల నేతలు అంగీకరించారు.
12. సైబర్ సెక్యూరిటీ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ఉగ్రవాద కార్యకాలపాల కోసం, ప్రజల్ని భయకంపితుల్ని చేయడానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి సైబర్ ప్రపంచాన్ని వాడుకోవడాన్ని అడ్డుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సైబర్ ప్రపంచాన్ని ఉపయోగించుకొని మతాన్ని దుర్వినియోగం చేస్తున్న సంస్థల, దేశాల కార్యకలాపాలను అడ్డుకోవడానికిగాను ఇరు దేశాల సంస్థలు సహకరించుకోవడానికి వీలుగా ఉభయ దేశాల నేతలు తమ దేశాల సంబంధిత ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు. ద్వేషాలను రెచ్చగొట్టడం, ఉగ్రవాద కార్యకాలాపాలకు పాల్పడడమే కాకుండా రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికిగాను ఉగ్రవాదాన్ని ఉపయోగించుకోవడాన్ని సమర్థించుకొనే వారిని అడ్డుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఇరు దేశాలకు చెందిన ఆధ్యాత్మిక వేత్తలు, మేధావులకు మధ్య చర్చలను ఇరువురు నేతలు స్వాగతించారు. ఇందుకుగాను సమావేశాలను ఏర్పాటు చేసుకొని శాంతిని, సహనాన్ని, అందరినీ భాగస్వాములను చేసేలా సంక్షేమాన్నిచేపట్టి, ప్రోత్సహిస్తున్న తీరును ప్రశంసించారు.
13. ఇరు దేశాల మధ్య తరచుగా ద్వైపాక్షిక చర్చల ప్రాధాన్యాన్ని ఇరువురు నేతలు మరోసారి ప్రస్తావించారు. వీటి ద్వారా ద్వైపాక్షిక సహకారం మరింత వేగవంతం అవుతుందని భావించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయిలో సందర్శనలు పెరగడం పట్ల ఇరువురు నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రుల స్థాయిలోను, సీనియర్ అధికారుల స్థాయిలో ఇరు దేశాల సందర్శనల ప్రాధాన్యాన్ని ఇరువురు నేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
14. వాణిజ్యం, పెట్టుబడులు, శక్తి, రక్షణ, మానవ వనరుల రంగాలలో ద్వైపాక్షిక సంస్థాగత వ్యవస్థల పని తీరును ఇరువురు నేతలు ప్రశంసించారు. ఈ వ్యవస్థల సారథ్యంలో జరిగిన సమావేశాల సమయంలో సహకారానికి వీలైన రంగాలను గుర్తించడం జరిగిందని ,తద్వారా ఇరు దేశాల ద్వైపాక్షిక బంధాల విస్తరణపైన నిర్మాణాత్మక ప్రభావం పడిందని ఇరువురు నేతలు గుర్తించారు. ఈ వ్యవస్థల విధి విధానాల వ్యవస్థ ప్రకారం తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
15. న్యూఢిల్లీలో 2015 మే నెలలో జరిగిన జాయింట్ కమిషన్ మీటింగ్ 11వ సెషన్, దానికి సంబంధించి రియాద్ లో 2015 డిసెంబర్‌లో జరిగిన సమీక్ష సమావేశం సానుకూల ఫలితాలను ఇవ్వడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. అత్యున్నత స్థాయిల్లో తీసుకున్న నిర్ణయాల అమలుకుగాను కృషి చేయడానికి వీలుగా సౌదీ ఇండియా సంయుక్త సంఘానికి ఇరువురు నేతలు మద్దతు తెలిపారు. తద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టం అవుతుందని ఇరువురు నేతలు భావంచారు.
16. భారతదేశం, సౌదీ అరేబియాల ఆర్ధిక వ్యవస్థల్లో వస్తున్న సానుకూల మార్పును ఇరువురు నేతలు ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు మరింత ముందుకు వెళ్లడానికి వీలుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల రంగాలలో బంధాల విస్తరణ ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇరువురు నేతలు తమ దేశాల ఆర్ధిక, వాణిజ్య శాఖల మంత్రులకు ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తూ ద్వైపాక్షిక పెట్టుబడులు, వాణిజ్య బంధాలు గణనీయంగా పెరగడానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
17. గత కొన్ని సంవత్సరాలుగా ద్వైపాక్షిక వాణిజ్యం నిలకగడగా పెరుగుతున్న విషయాన్ని ఇరువురు నేతలు ప్రస్తావించారు. 2014-15 సంవత్సరంలో 39 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన వాణిజ్యం జరగడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరంగా, ఆర్ధికపరంగా బంధాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని, ఇరు దేశాలు వాణిజ్య భాగస్వామ్యంలో పరస్పరం ఉన్నత స్థాయిలో ఉన్నాయని ఇరువురు నేతలు గుర్తించారు. ఈ బంధాలను మరింత పటిష్టం చేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ముఖ్యంగా చమురేతర వాణిజ్య రంగాలలో బంధాలను పటిష్టం చేయాలని భావించారు.
18. ఇరు దేశాలలోని మార్కెట్లలో భారతదేశం, సౌదీ కంపెనీల పాత్ర పట్ల ఇరు దేశాల నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. వాణిజ్య ప్రదర్శనలు, సమావేశాల ద్వారా ఇరు దేశాల కంపెనీల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించాలని అంగీకరించారు.
2015 డిసెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన సౌదీ ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశ ఫలితాలను ఇరువురు నేతలు స్వాగతించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం,ఆర్థిక సహకారం పెంపొందడానికిగాను ఈ బిజినెస్ కౌన్సిల్ ఉపయోగకరమైన వేదికగా నిలుస్తుందని ఇరువురు నేతలు అంగీకరించారు.
19. జెద్దా లోని కింగ్ అబ్దుల్లా ఎకనమిక్ సిటీలో 2015 నవంబర్ నెలలో జరిగిన ఇండియా జి సి సి ఇండస్ట్రియల్ ఫోరమ్ నాలుగో సమావేశం పట్ల ఇరు పక్షాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. రియాద్, జెద్దా లలో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలలో భారతీయ కంపెనీలు భారీ సంఖ్యలో పాల్గొన్నందుకు సౌదీ అరేబియా కృతజ్ఞతలు తెలిపింది.
20. భారతదేశ ఆర్ధిక రంగం చక్కటి వృద్ధిని సాధిస్తుండటాన్ని రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడైన రాజు శ్రీ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ ప్రశంసించారు. భారతదేశ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రదర్శిస్తున్న ముందుచూపును మెచ్చుకున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ”స్టార్టప్ ఇండియా”, ”మేకిన్ ఇండియా”, ”స్మార్ట్ సిటీ”, ”క్లీన్ ఇండియా” లాంటి కార్యక్రమాలు భారతదేశ ఆర్ధిక రంగానికి చక్కటి వేగాన్ని అందజేయగలుగుతాయంటూ ఆయన ప్రశంసించారు.
21. భారతదేశంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను చాలా సులువుగా చేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. కఠినమైన నియమ నిబంధనలను సరళీకరించినట్లు.. రైల్వేలు, రక్షణ రంగం, జీవిత బీమా వంటి కీలక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడానికి వీలుగా చర్యలు చేపట్టినట్లు భారతదేశం తెలిపింది. భారతదేశ అభివృద్ధిలో సౌదీ అరేబియా భాగం కావాలని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం పలికారు. సౌదీ అరామ్ కో, ఎస్ ఎ బి ఐ సి తదితర కంపెనీలు భారతదేశంలోని మౌలిక రంగాలలో పెట్టుబడులు పెట్టాలని భారీ పారిశ్రామిక తయారీ కార్యకలాపాలలో పాల్గొనాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ”స్మార్ట్ సిటీస్, ”డిజిటల్ ఇండియా”, ”స్టార్టప్ ఇండియా” కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరారు.
22. భారతదేశంలో మౌలిక వసతుల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడానికి సౌదీ సుముఖతను వ్యక్తం చేసింది. ముఖ్యంగా రైల్వేలు, రహదారులు, నౌకాశ్రయాలు, నౌకా రవాణా రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టాన్ని ప్రదర్శించింది. సౌదీ అరేబియా ఆర్ధిక, పారిశ్రామిక నగరాలు అందిస్తున్న పోటాపోటీ పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి భారతదేశం చూపుతున్న చొరవను సౌదీ అరేబియా స్వాగతించింది.
23. ఇరు దేశాల్లో ప్రైవేటు రంగాల పెట్టుబడులకు ఊతమివ్వడానికి వీలుగా సౌదీ అరేబియా జనరల్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఇన్వెస్ట్ ఇండియాల మధ్య ఒప్పందానికి సంబంధించిన విధి విధానాలపైన సంతకాల కార్యక్రమాన్ని ఉభయ దేశాల నేతలు స్వాగతించారు.
24. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఇంధన భద్రత. దీని ప్రాముఖ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంధన రంగంలో పెరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యం పట్ల ఇరువురు నేతలు సంతృప్తిని వ్యక్తం చేశారు. భారతదేశానికి అత్యధికంగా ముడి చమురును సరఫరా చేస్తున్నది సౌదీ అరేబియానే అనే విషయాన్ని ఇరువురు నేతలు ప్రస్తావించారు.
25. అమ్మడం, కొనడం అన్నట్టుగా ఇంతవరకు ఇంధన రంగంలో వున్న సంబంధ బాంధవ్యాల్లో మార్పును తీసుకురావాలని ఇరువురు నేతలు అంగీకరించారు. పెట్రోకెమికల్ కాంప్లెక్సుల నిర్మాణంలోను, భారతదేశం, సౌదీ అరేబియాలతో పాటు ఇంకా ఇతర దేశాలలో ఉమ్మడిగా ఇంధన అన్వేషణ చేపట్టడం ద్వారాను ఈ మార్పు తేవాలని ఇరువురు నేతలు భావించారు. ఇంధన రంగంలో శిక్షణ, మానవ వనరుల అభివృద్ధి, పరిశోధన సహకారం మొదలైన అంశాలపైన దృష్టి పెట్టాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇండియా సౌదీ అరేబియా మినిస్టీరియల్ ఎనర్జీ డైలాగ్ కార్యక్రమం కింద క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఇరు నేతలు వ్యక్తం చేశారు.
26. ఇరు దేశాలలోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నత పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని పటిష్టం చేయాలని ఇరువురు నేతలు అంగకరించారు.
27. ఇరు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో వుండాల్సిన ఉమ్మడి సహకార ప్రాధాన్యాన్ని ఇరువురు నేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పునర్నవీకరణ యోగ్య శక్తి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, సుస్థిర అభివృద్ధి, మెట్ట వ్యవసాయం, ఎడారిప్రాంత జీవవైవిధ్యం, పట్టణాభివృద్ధి, ఆరోగ్యరంగం, బయోటెక్నాలజీ రంగాలలో సహకారాన్ని క్రమం తప్పకుండా ప్రోత్సహించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆహార భద్రత విషయంలో ఉమ్మడిగా పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
28. అంతర్జాతీయ సౌర వేదిక ఏర్పాటుకుగాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీసుకున్న చొరవను సౌదీ అరేబియా ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా నూతన సౌర సాంకేతికతలు విస్తరించడానికి ఈ వేదిక చాలా అవసరమని ఇరు నేతలు గుర్తించారు.
29. ఇరు దేశాల మధ్య దృఢమైన బంధాలు నెలకొల్పడానికి ఇరు దేశాల ప్రజల మధ్య ఉండే బంధాల ప్రాధాన్యాన్ని ఇరువురు నేతలు ప్రస్తావించారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులు పోషిస్తున్న విలువైన భూమికను ఇరువురు నేతలు ప్రశింసించారు. సౌదీలోని భారతీయులు రెండు దేశాల ప్రగతి కోసం చేస్తున్న కృషి చేస్తున్నారని ఇరు దేశాల నేతలు అన్నారు. జనరల్ కేటగిరీ కిందకు వచ్చే శ్రామికులను ఉద్యోగాలలో నియమించుకోవడానికి సంబంధించిన కార్మిక సహకార ఒప్పందంపైన సంతకాలు జరగడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. దౌత్య సంబంధమైన సమస్యల పరిష్కారం కోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకోవడాన్ని ఇరు దేశాలు స్వాగతించాయి. ఇండియా సౌదీ అరేబియా జాయింట్ కమిషన్ పరిధిలో ఈ గ్రూప్ పని చేస్తుంది. క్రమం తప్పకుండా దౌత్య సమస్యలపైన చర్చిస్తుంది.
30. హజ్, ఉమ్రా యాత్రల కోసం సౌదీ అరేబియాకు వచ్చే భారతీయ యాత్రికుల సౌకర్యార్థం సౌదీ అధికారులు చేస్తున్న అత్యున్నత స్థాయి ఏర్పాట్ల పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేసి, ప్రశంసలు కురిపించారు.
31. చరిత్ర పరంగా చూసినప్పుడు ఇరు దేశాలు నాగరికతా పరమైన బంధాలను పరస్పరం ఇచ్చి పుచ్చుకొన్నాయని ఇరువురు నేతలు గుర్తించారు. ఈ బంధాలు బలోపేతం కావడానికి ఇరు దేశాలలోకి చేరిన వస్తువులు, ప్రజలు, ఆలోచనలు కారణమయ్యాయని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి వారసత్వం సాయంతో వర్తమానంలోని సవాళ్లను ఎదుర్కోవచ్చని ఇరు దేశాల నేతలు భావించారు. మానవత్వం, సహనంల విస్తృత పరిధి సాయంతో, మతపరమైన విశ్వాసాలు మనుషుల్ని ఐకమత్యంగా ఉంచుతాయి తప్ప విభజించవు అనే నమ్మకం ప్రస్తుతం అంతర్జాతీయ సంబంధాలలో కనిపిస్తున్న సానుకూలమైన మార్పు అని ఇరు దేశాలు గుర్తించాయి.
32. ఇరు దేశాలకు ప్రాధాన్యత గల ప్రాదేశిక, అంతర్జాతీయ సమస్యలపై నేతలు చర్చించారు. పశ్చిమ ఆసియా, మధ్య ప్రాచ్యం, దక్షిణ ఆసియాలో భద్రతా పరిస్థితి గురించి మాట్లాడుకున్నారు. ప్రాంతీయంగాను, అంతర్జాతీయంగాను శాంతి, భద్రత, సుస్థిరతలను కాపాడడంలో తమ వంతు బాధ్యతను పోషిస్తున్న దేశాలుగా భారతదేశం, సౌదీ అరేబియాలు ఈ చర్చలు చేశాయి. యెమెన్, సిరియా లలో పరిస్థితులకు సంబంధించి గతంలో చేసిన ప్రకటనలను పేర్కొంటూ ఐక్య రాజ్య సమితి భద్రతా సమితి తీర్మానాలను (2216, 2254, 2268) అమలు చేయాలని ఇరువురు నేతలు విజ్ఞప్తి చేశారు. లిబియా, ఇరాక్ లలో భద్రతా పరిస్థితి పట్ల ఇరువురు నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చర్చల ద్వారాను, రాజకీయ సంప్రదింపులద్వారాను శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు.
33. ప్రాంతీయ సమస్యల పరిష్కారంలో పాటించాల్సిన నియమాల గురించి ఇరువురు నేతలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి దేశం తమ ఇరుగు పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కలిగి ఉండాలని, దేశాలు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదని, ఇతర దేశాల స్వేచ్ఛకు, పాలనాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు గౌరవం ఇవ్వాలని, దేశాల మధ్య గల గొడవలకు శాంతియుత మార్గాల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఇరువురు నేతలు స్పష్టీకరించారు.
34. పాలస్తీనా ప్రజల న్యాయపరమైన హక్కులకు హామీని ఇవ్వగలిగేలా, వారి కోసం తూర్పు జెరూసలెమ్ రాజధానిగా స్వతంత్ర, ఐక్య దేశం ఏర్పడగలదనే ఆశాభావాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేశారు. న్యాయమైన, సమగ్రమైన, చిరకాల శాంతి పాలస్తీనా ప్రజలకు లభించాలని నేతలు భావించారు. అరబ్ శాంతి కార్యక్రమాలకు అనుగుణంగా అంతర్జాతీయ వారసత్వ తీర్మానాల ప్రకారం పాలస్తీనా దేశం ఏర్పడగలదని ఇరువురు నేతలు ఆకాంక్షించారు.
35. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనడానికి వీలుగా ప్రతిభావంతమైన బహుళ పక్ష వ్యవస్థ ప్రాముఖ్యతను ఇరువురు నేతలు ప్రస్తావించారు. వర్తమాన వాస్తవికతలను ప్రతిఫలించేలా ఐక్య రాజ్య సమితి స్థాయిలో ఇది ఉండాలని ఆకాంక్షించారు. ఐక్య రాజ్య సమితిలో వెంటనే సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఇరువురు నేతలు బలంగా పేర్కొన్నారు. భద్రతా సమితి లోని రెండు విభాగాల్లోని సభ్యత్వాన్ని విస్తరించాలని అప్పుడే భద్రతా సమితి అందరికీ ప్రాతినిధ్యం వహించగలుగుతుందని, దాని విశ్వసనీయత పెరిగి, మరింత ప్రతిభావంతంగా పని చేస్తుందని ఇరువురు నేతుల భావించారు.
36. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటన ద్వారా ఇరు దేశాలకు పలు ప్రయోజనాలు చేకూరుతాయని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పటిష్టమవుతుందని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అత్యున్నత స్థాయిలో వృద్ధి చెందుతాయని ఇరు దేశాల, ప్రజల ఉమ్మడి ప్రాధాన్యతలకు స్థానం లభిస్తుందని ఇరువురు నేతలు భావించారు.
37. సౌదీ అరేబియా రాజు సాదర స్వాగతాన్ని ఏర్పాటు చేసి చక్కటి ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాలకు పరస్పరం వీలయిన సమయంలో రాజు శ్రీ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ భారతదేశంలో అధికార పర్యటనకు తరలి రావాలని ప్రధాన మంత్రి ఆహ్వానం పలికారు. ఈ ఆహ్వానానికి రాజు సహర్షంగా సమ్మతిని తెలిపారు.