Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఐటి ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి

హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఐటి ని ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి


మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జ‌నులారా,

వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ ని ప్రారంభిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్య‌క్ర‌మాన్ని మొట్టమొద‌టిసారిగా భార‌త‌దేశంలో జ‌రుపుకొంటున్నాం. తెలంగాణ ప్ర‌భుత్వం, డ‌బ్ల్యుఐటిఎస్ఎ, ఇంకా ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ ల భాగ‌స్వామ్యంతో దీనిని నిర్వ‌హిస్తున్నారు.

ఇది ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెట్టుబ‌డిదారులు, నూత‌న ఆవిష్క‌ర్త‌లు, ఆలోచ‌నాప‌రులు, ఇంకా సంబంధిత ఇత‌ర వ‌ర్గాల వారికి ప‌ర‌స్ప‌రం ప్ర‌యోజ‌న‌కారి కాగ‌ల‌ద‌ని నేను న‌మ్ముతున్నాను. ఈ స‌భ‌కు నేను స్వ‌యంగా హాజ‌రై ఉంటే అది నాకు మరింత బాగుండేది. ఏమైనప్పటికీ, దూర ప్రాంతం నుండయినా మిమ్మ‌ల్ని ఉద్దేశించి ప్ర‌సంగించేందుకు ఐటి యొక్క శ‌క్తి నాకు సహాయపడినందుకు నేను ఆనందిస్తున్నాను.

విదేశాల నుండి ఈ స‌ద‌స్సుకు వ‌చ్చేసిన ప్ర‌తినిధులంద‌రికీ నేను భార‌త‌దేశానికి స్వాగ‌తం ప‌లుకుతున్నాను. మీకంద‌రికీ హైద‌రాబాద్ తరఫున ఇదే నా సుస్వాగ‌తం.

ఈ స‌మావేశం సంద‌ర్భంగా మీరు హైద‌రాబాద్ కు చెందిన చైత‌న్య‌ భ‌రిత‌మైన చ‌రిత్ర‌ను గురించి తెలుసుకొనే అవ‌కాశాన్ని, హైద‌రాబాద్ కు చెందిన నోరు ఊరించే వంట‌కాల‌ను చ‌వి చూసే వీలు ను కొంతయినా క‌ల్పించుకొంటార‌ని నేను ఆశిస్తున్నాను. ఇది భార‌త‌దేశం లోని ఇత‌ర ప్రాంతాల‌ను సైతం సంద‌ర్శించేటట్టు మిమ్మ‌ల్ని తప్పక ప్రోత్స‌హించగ‌ల‌ద‌నే నేను న‌మ్ముతున్నాను.

వాస్త‌వానికి, భార‌త‌దేశం ప్రాచీన‌మైన‌, సుసంప‌న్న‌మైన ఇంకా వైవిధ్య‌ భ‌రిత‌మైన సంస్కృతుల‌కు పుట్టినిల్లు. ఏక‌త్వ భావ‌న భార‌త‌దేశంలో అంతర్నిహితమై ఉంది.

మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జ‌నులారా,

‘‘వ‌సుధైవ‌ కుటుంబ‌కమ్- ఈ ప్ర‌పంచ‌మంతా ఒకే ప‌రివారం’’ అనే భావ‌న భార‌తీయ తత్వంలో లోతుగా పాతుకుపోయింది. ఇది స‌మ్మిళితమైన మా సంప్ర‌దాయాల‌కు ప్ర‌తిబింబం. 21వ శ‌తాబ్దంలో ఈ భావ‌న‌ను మ‌రింత‌గా పెంచి పోషించ‌డంలో సాంకేతిక విజ్ఞానానిది కీల‌క‌మైన పాత్ర‌గా ఉంది. ఒక స‌మ్మిళిత‌మైన ప్ర‌పంచాన్ని, అంత‌రాయాలు లేన‌టువంటి ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించ‌డంలో మ‌న‌కు సాంకేతిక ప‌రిజ్ఞానం తోడ్ప‌డుతోంది.

మ‌రింత మెరుగైన భవిష్య‌త్తు కోసం స‌హ‌క‌రించుకోవ‌డంలో భౌగోళిక దూరాలు ఇక ఎంత మాత్రం ఒక అడ్డుగోడ‌గా నిల‌బ‌డ‌ని ప్ర‌పంచం మ‌న ముందు ఉంది. ప్ర‌స్తుతం భార‌త‌దేశం అన్ని రంగాల‌లో డిజిట‌ల్ ఇనవేశ‌న్ కు ఒక ప్రకాశవంతమైన కిరణం లాగా ఉంది.

మేము అంత‌కంత‌కు పెరుగుతున్న సృజ‌న‌శీలురైన న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో పాటు సాంకేతికంగా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఒక ప్రవర్ధమానమవుతున్న విపణిని కూడా కలిగివున్నాం. ప్రపంచంలో అత్యంత సాంకేతికత సంబంధమైన స్నేహపూర్వ‌క‌ జ‌నాభా ఇదివ‌ర‌కు, ఇప్పుడు కూడా నివ‌సిస్తున్న‌టువంటి దేశం భార‌త‌దేశ‌మే. ఈ దేశంలో ల‌క్ష‌కు పైగా ప‌ల్లెలు ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ తో ముడిప‌డి ఉన్నాయి. 121 కోట్ల మొబైల్ ఫోన్ వినియోగ‌దారులు ఇక్కడ ఉన్నారు, 50 కోట్ల ఇంట‌ర్ నెట్ వినియోగ‌దారులు ఉన్నారు. అలాగే, 120 కోట్ల ఆధార్ న‌మోదు దారులు ఉన్నది కూడా ఈ దేశంలోనే.

భార‌త‌దేశం ప్ర‌తి ఒక్క పౌరుడికి సాధికారతను క‌ల్పించ‌డంతో పాటు, సాంకేతిక విజ్ఞానం యొక్క శ‌క్తిని వినియోగించుకొంటూ, భ‌విష్య‌త్తులోకి ముందంజ వేసే అత్యుత్త‌మ దేశంగా విరాజిల్లుతోంది. డిజిట‌ల్ స‌ర్వీసుల అంద‌జేత కోసం ఉద్దేశించిన‌టువంటి డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల అండ‌దండ‌ల‌తో డిజిట‌ల్ సాధికార‌త కోసం లక్షించిన డిజిటల్ ఇంక్లూజన్ గమ్యం వైపునకు సాగుతున్న ప్ర‌యాణమే ‘డిజిట‌ల్ ఇండియా’. ఈ విధంగా టెక్నాల‌జీని సంపూర్ణంగా ఉప‌యోగించుకోవ‌డం అన్న‌ది కొన్ని సంవ‌త్స‌రాల క్రితం అయితే ఆలోచ‌న‌కు కూడా అంద‌నిది.

మేము గ‌త మూడున్న‌ర సంవ‌త్స‌రాల‌లో జీవ‌న చ‌క్ర‌ భ‌మ‌ణాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేశాం. ప్ర‌జల న‌డ‌వ‌డికలోను, ప్ర‌క్రియ‌ల‌లోను మార్పు రావ‌డం వ‌ల్లనే ఇది సాధ్య‌ప‌డింది. ‘డిజిట‌ల్ ఇండియా’ అనేది కేవ‌లం ఓ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంగానే మిగిలిపోలేదు.. అది ఓ జీవ‌న విధానంగా మారిపోయింది.

టెక్నాల‌జీ అనేది ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేశన్ ల స్థాయి నుండి ఎదిగి, ప్ర‌జా జీవ‌నంలో ఓ విడ‌దీయ‌రాని భాగం అయిపోయింది. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌లో అనేక కార్య‌క్ర‌మాలు స‌ర్కారు మ‌ద్దతు పైన ఆధార‌ప‌డి ఉన్న‌ప్ప‌టికీ, ‘డిజిట‌ల్ ఇండియా’ ప్ర‌జ‌ల ఆదరణ లభిస్తున్న కార‌ణంగా విజ‌య‌వంతం అవుతోంది.

320 మిలియ‌న్ పేద‌ల ‘జ‌న్ ధ‌న్’ బ్యాంకు ఖాతాల‌ను ‘ఆధార్’ తోను, ఇంకా ‘మొబైల్ ఫోను’ తోను అనుసంధానం చేయగా ఏర్పడ్డ జెఎఎమ్ త్రయం సంక్షేమ ప‌థ‌కాల తాలూకు ప్ర‌త్య‌క్ష ప్ర‌యోజ‌నాల‌ను ప్రత్యక్షంగా అందిస్తూ తద్వారా 57 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఆదా కు కారణమైంది.

భార‌త‌దేశంలోని 172 ఆసుప‌త్రుల‌లో సుమారు 22 మిలియ‌న్ డిజిట‌ల్ హాస్పిట‌ల్ లావాదేవాల రూపేణా రోగుల జీవితంలో సౌఖ్యం తొంగి చూసింది. ఉప‌కార వేత‌నాలను సుల‌భంగా అందించే ‘నేశనల్ స్కాలర్ శిప్ పోర్ట‌ల్’ లో ప్ర‌స్తుతం 14 మిలియ‌న్ విద్యార్థినీ విద్యార్థులు వారి పేర్లను నమోదు చేసుకొన్నారు.

వ్య‌వ‌సాయదారుల కోసం రూపొందించిన ఒక ఆన్‌లైన్ అగ్రిక‌ల్చ‌ర్ మార్కెట్ అయినటువంటి ఇనామ్‌ (eNAM) లో 6.6 మిలియ‌న్ రైతులు న‌మోదై ఉన్నారు. అంతేకాకుండా, 470 వ్య‌వ‌సాయ విప‌ణులు దీనికి అనుసంధానం అయ్యాయి. ఇనామ్ ఉత్తమమైన ధరలను అందిస్తోంది. బిహెచ్ఐఎమ్-యుపిఐ ద్వారా 2018 జ‌న‌వ‌రిలో 15 వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు న‌మోదిత లావాదేవీల‌లో డిజిట‌ల్ చెల్లింపులు జ‌రిగాయి.

మూడు నెల‌ల కింద‌టే ప్ర‌వేశ‌పెట్టిన విశిష్ట‌మైన ‘ఉమంగ్ యాప్’ ఈసరికే 185 ప్ర‌భుత్వ సేవ‌ల‌ను అందిస్తోంది.

ఇవాళ దేశంలోని వివిధ ప్రాంతాల‌లో మొత్తం 2.8 ల‌క్ష‌ల కామ‌న్ స‌ర్వీసెస్ సెంట‌ర్లు ప్ర‌జ‌ల‌కు అనేక డిజిట‌ల్ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఈ కేంద్రాల‌లో వేలాది మ‌హిళా న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌తో స‌హా దాదాపు 10 ల‌క్ష‌ల మంది పని చేస్తున్నారు. యువజ‌నుల ప్ర‌తిభ‌ను, ప్రావీణ్యాన్ని స‌ద్వినియోగ ప‌ర‌చుకొనేందుకు బిపిఒ లు ఈశాన్య భార‌త‌దేశంలోని ఇంఫాల్, ఇంకా కోహిమా ప‌ట్ట‌ణాల‌తో పాటు, జ‌మ్ము & క‌శ్మీర్ లోని ప‌ట్ట‌ణాల‌ నుండి కూడా ప‌ని చేయ‌డం మొద‌లుపెట్టాయి. 27 రాష్ట్రాలకు తోడు కేంద్ర‌ పాలిత ప్రాంతాల‌లో 86 యూనిట్లు ఇప్ప‌టికే విధులను నిర్వ‌హిస్తున్నాయి. వీటికి తోడు త్వ‌ర‌లోనే మ‌రిన్ని యూనిట్లు ఏర్పాటయ్యే అవ‌కాశం ఉంది.

ప్ర‌తి కుటుంబంలో డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త చోటుచేసుకొనేట‌ట్లుగా మేము ‘ప్ర‌ధాన మంత్రి రూర‌ల్‌ డిజిట‌ల్ లిట‌ర‌సీ మిశన్’ ను ప‌రిచ‌యం చేశాం. దీని ద్వారా భార‌త‌దేశంలోని గ్రామీణ ప్రాంతాల‌లో 60 మిలియ‌న్ వ‌యోజ‌నుల‌కు ‘డిజిట‌ల్ సాక్ష‌ర‌త‌’ను క‌ల్పించాలన్నదే ధ్యేయం. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టికే 10 మిలియ‌న్ మంది శిక్ష‌ణను పొందారు.

‘మేక్ ఇన్ ఇండియా’తో ‘డిజిట‌ల్ ఇండియా’ ను క‌ల‌బోసిన త‌రువాత మేము చాలా దూర‌మే ప్ర‌యాణించాం. 2014 లో భార‌త‌దేశంలో మొబైల్ త‌యారీ యూనిట్లు రెండంటే రెండే ఉండ‌గా, ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో- కొన్ని అత్యుత్త‌మ‌మైన ప్ర‌పంచ శ్రేణి బ్రాండుల‌తో క‌లుపుకొని- మొత్తం 118 యూనిట్లు ప‌ని చేస్తున్నాయి.

ప్ర‌భుత్వ ఇ-మార్కెట్ – ప్లేస్ ను ’నేష‌న‌ల్ ప్రొక్యూర్‌మెంట్ పోర్ట‌ల్ ఆఫ్ ఇండియా‘ గా అభివృద్ధిప‌రచాం. ఇది ప్ర‌భుత్వ కొనుగోలు అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో చిన్న మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా సంస్థ‌ల‌కు పోటీ ప‌డే అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. ఈ స‌ర‌ళ‌మైన ఐటి ఫ్రేమ్ వ‌ర్క్ ప్ర‌భుత్వ కొనుగోలు ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త్వానికి మెరుగులు దిద్దింది. ఇది కొనుగోలు ప్రక్రియ‌ల‌ను వేగవంతం చేసింది కూడా. అలాగే, వేల సంఖ్య‌లో చిన్న మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా సంస్థ‌ల‌కు సాధికార‌త‌ ను కూడా సంత‌రించింది.

నిన్ననే ముంబ‌యి యూనివ‌ర్సిటీలో నేను ‘వాధ్ వానీ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్’ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేసే అవ‌కాశం నాకు ల‌భించింది. ఇది ఒక స్వ‌తంత్ర‌మైన లాభాపేక్ష లేని ప‌రిశోధ‌న సంస్థ‌. అంతేకాదు, సామాజిక హితం కోసం సాగేట‌టువంటి ఒక కృత్రిమ మేథో సంబంధమైన ఉద్య‌మం.

కొద్ది రోజుల క్రితం దుబ‌య్ లో ‘వ‌ర‌ల్డ్ గ‌వ‌ర్న‌మెంట్ స‌మిట్’ కు వెళ్లిన నేను ఆ సంద‌ర్భంగా ‘మ్యూజియ‌మ్ ఆఫ్ ది ఫ్యూచ‌ర్‌’ పేరిట ఏర్పాటైన ఒక ప్ర‌ద‌ర్శ‌న‌ను తిల‌కించే అవ‌కాశాన్ని చేజిక్కించుకొన్నాను. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆలోచ‌న‌ల ఆవిర్భావ వేదిక‌గాను మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఒక చోద‌క శ‌క్తిగాను మ‌ల‌చారు. ఇవాళ శ్రోత‌ల మ‌ధ్య ఉన్న కొంత మంది సాంకేతిక విజ్ఞాన ప‌థ నిర్దేశ‌కుల‌ను వారు చేస్తున్న కృషికి గాను వారిని నేను ప్ర‌శంసిస్తున్నాను. వారు మాన‌వాళికి ఒక ఉత్త‌మ‌మైన మ‌రింత సౌక‌ర్య‌వంత‌మైన భ‌విష్య‌త్తును సంపాదించి పెట్ట‌డానికి తోడ్పాటును అందిస్తున్నారు.

ప్ర‌స్తుతం మ‌నం నాలుగో పారిశ్రామిక విప్ల‌వం ముంగిట నిల‌బ‌డి ఉన్నాం. సాంకేతిక విజ్ఞానాన్ని ప్ర‌జా హితం కోసం చ‌క్క‌గా వినియోగించిన‌ట్ల‌యితే అది మాన‌వ జాతికి చిర‌కాలం సమృద్ధిని అందించ‌ గ‌లుగుతుంది. అంతేకాదు మ‌న భూగోళానికి సుస్థిర‌మైన భ‌విష్య‌త్తును అందించ‌గ‌లుగుతుంది. మ‌రి ఈ కోణంలో నేను భార‌త‌దేశంలో ఇవాళ ‘వ‌ర‌ల్డ్ కాన్ఫ‌రెన్స్ ఆన్ ఇన్ఫర్మేశన్ టెక్నాల‌జీ’ ని కూడా చేరుస్తున్నాను.

ఈ స‌మావేశంలో కీల‌క‌మైన చ‌ర్చ‌నీయ అంశాలు మ‌న కోసం నిరీక్షిస్తున్న అవ‌కాశాల‌ను ప్ర‌తిఫ‌లిస్తున్నాయి. బ్లాక్ చైన్ మ‌రియు ఇంట‌ర్ నెట్ ఆఫ్ థింగ్స్ వంటి పెను మార్పున‌కు దోవను తీసే సాంకేతిక విజ్ఞానాలు మ‌నం జీవించే విధానంపైన మ‌రియు విధుల‌ను నిర్వ‌హించే విధానంపైన ప్ర‌గాఢ‌మైన ప్ర‌భావాన్ని చూపించ‌నున్నాయి. వీటిని మ‌న పని ప్ర‌దేశాల‌లో అత్యంత శీఘ్ర‌ంగా అనుస‌రించ‌వ‌ల‌సి ఉంటుంది.

భావి కాల‌పు ప‌ని ప్ర‌దేశాన్ని దృష్టిలో పెట్టుకొని పౌరుల‌కు నైపుణ్యాల‌ను అందించ‌డం ముఖ్యం. భార‌త‌దేశంలో మేము మా చిన్నారుల‌కు మ‌రియు యువ‌జ‌నుల‌కు ఒక ప్ర‌కాశ‌వంత‌మైన భవిత్యాన్ని అందించ‌డం కోసం ‘నేష‌న‌ల్ స్కిల్ డివెల‌ప్‌మెంట్ మిశన్’ ను ప్రారంభించాం. అంతేకాకుండా ప్ర‌స్తుతమున్న మా శ్రామిక శ‌క్తికి సైతం ఎప్ప‌టిక‌ప్పుడు ఆవిర్భ‌విస్తున్న కొత్త కొత్త సాంకేతిక విజ్ఞానాలకు అనుగుణంగా వారి యొక్క ప్ర‌తిభ‌కు మెరుగులు పెట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం కూడా మాకు ఉంది.

ఈ కార్య‌క్ర‌మానికి వ‌క్త‌లుగా ఆహ్వానించిన‌ వారిలో సోఫియా అనే మ‌ర మ‌నిషి నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం తాలూకు సామ‌ర్ధ్యాన్ని చాటి చెబుతోంది. ఇంటెలిజెంట్ ఆటోమేశన్ సంబంధిత ప్రస్తుత యుగంలో ఉద్యోగాల యొక్క మారుతున్న స్వభావాన్ని మ‌నం అందిపుచ్చుకోవల‌సిన అవ‌స‌రం ఉంది. ‘‘స్కిల్స్ ఆఫ్ ది ఫ్యూచ‌ర్’’ వేదిక‌ను అభివృద్ధిప‌ర‌చినందుకు ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ (NASSCOM)ను నేను అభినందిస్తున్నాను.

ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ ముఖ్య‌మైన ఎనిమిది టెక్నాల‌జీల‌ను గుర్తించిన‌ సంగతిని నా దృష్టికి తీసుకు వ‌చ్చారు. వాటిలో.. ఆర్టిఫిశియ‌ల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేశన్‌, ఇంట‌ర్‌ నెట్ ఆఫ్ థింగ్స్‌, బిగ్ డేటా ఎన‌లిటిక్స్‌, 3డి ముద్ర‌ణ‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, సోశియల్ అండ్ మొబైల్‌.. లు ఉన్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గిరాకీ పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న 55 రకాల కొలువులను కూడా ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ గుర్తించింది.

భార‌త‌దేశం స్ప‌ర్ధాత్మ‌కమైన తన పురోగ‌మ‌నాన్ని కొనసాగించడానికి ‘‘స్కిల్స్ ఆఫ్ ఫ్యూచ‌ర్‌’’ వేదిక ఎంత‌గానో స‌హాయ‌ప‌డగలదని నేను న‌మ్ముతున్నాను. ఇవాళ ప్ర‌తి వ్యాపారానికీ డిజిట‌ల్ టెక్నాల‌జీ గుండె కాయ‌ లాగా మారిపోయింది.

ఒక వ్యాపార సంస్థ తాలూకు వేరు వేరు ప్ర‌క్రియ‌ల‌లో, కార్య‌క‌లాపాల‌లో నూత‌న సాంకేతిక‌త‌లు అంత‌ర్భాగంగా మారి తీరాలి.

చాలా త‌క్కువ కాలంలో ఈ విధ‌మైన ప‌రివ‌ర్త‌న‌కు తుల‌తూగే విధంగా మ‌న చిన్న మ‌రియు మ‌ధ్య‌త‌ర‌హా వ్యాపార సంస్థ‌ల‌ను మ‌నం ఎలా సంసిద్ధం చేయ‌గ‌లం ? ఆర్థిక వ్య‌వ‌స్థ భ‌విష్య‌త్తును, వ్యాపార రంగ భ‌విష్య‌త్తును మ‌రియు నూత‌న ఆవిష్కారాల ప్రాముఖ్యాన్ని భార‌త ప్ర‌భుత్వం దృష్టిలో పెట్టుకొని ‘స్టార్ట్ -అప్ ఇండియా’ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది.

.
వివిధ రంగాలలోను, విభాగాల‌లోను ఆచ‌ర‌ణ సాధ్య‌మైన మరియు ఆర్థిక ప‌ర‌మైన ప‌రిష్కార మార్గాల‌ను అన్వేషించ‌డంలో మా ‘స్టార్ట్‌-అప్’ లు కీల‌క పాత్ర‌ను పోషించ‌గ‌లవనే మేం నమ్ముతున్నాం.

‘అట‌ల్ ఇనవేశన్ మిశన్’ లో భాగంగా మేము భార‌త‌దేశం అంత‌టా పాఠ‌శాల‌ల్లో ‘అట‌ల్ టింక‌రింగ్ లాబ్స్’ ను నిర్మిస్తున్నాం. తెలుసుకోవాల‌నే ఆరాటాన్ని, సృజ‌నాత్మ‌క‌త‌ను మ‌రియు ఊహ‌ల‌ను యువ మ‌స్తిష్కాల‌లో వ‌ర్ధిల్లజేయ‌డ‌మే ఈ ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం.

మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జనులారా,

మీరు స‌మాచార సాంకేతిక‌త తాలూకు వేరు వేరు అంశాల‌పై చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని, స‌గ‌టు మ‌నిషి యొక్క ప్ర‌యోజ‌నాల‌కు మీ ఆలోచనలలో పెద్ద పీట వేస్తార‌ని నేను విశ్వ‌సిస్తున్నాను. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి విచ్చేసిన ప్ర‌ముఖ ప్ర‌తినిధుల‌కు నేను మరొక్క మారు భార‌త‌దేశానికి స్వాగతం పలుకుతున్నాను.

మీ వాద వివాదాలు నిర్మాణాత్మ‌కం అగుగాక‌.

ఈ స‌మావేశ ఫ‌లితాలు ప్ర‌పంచం లోని పేద‌లకు మ‌రియు అట్టడుగు వర్గాల వారికి లబ్ధిని చేకూర్చుగాక‌.

మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

***