నేను మరోసారి ఆఫ్గనిస్తాన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ యుగంలో సాహసానికి ప్రమాణాలు నిర్దేశించిన ప్రజల మధ్యన నిలవడం ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నాను. భారత్ పట్ల విశేషమైన ప్రేమాభిమానాలు కనబరిచే మహాసముద్రంలో ఒక అలను చూడడం నాకు ప్రత్యేక గౌరవం. ఆఫ్గనిస్తాన్ అభివృద్ధి దిశగా వేసే అడుగులో అది మరో మైలు రాయి అవుతుందన్నది నా అభిప్రాయం. భారత, ఆఫ్గనిస్తాన్ సంబంధాల్లో ఒక గర్వకారణమైన, భావోద్వేగపూరితమైన చారిత్రక ఘట్టం ఇది.
అధ్యక్ష మహోదయా…
నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, భారత-ఆఫ్గనిస్తాన్ స్నేహబంధానికి గుర్తుగా ఈ డామ్ కు స్నేహ వారధిగా నామకరణం చేసినందుకు ధన్యవాదాలు. ఆఫ్గన్ల ఉదారపూరితమైన స్ఫూర్తికి మేం చాలా ఆనందిస్తున్నాం. నదులు ప్రపంచ నాగరికతలకు వాహికలుగా నిలుస్తాయి. మానవ పురోగతి నదుల ప్రవాహంతోనే ఆధారపడి ఉంది. పవిత్ర ఖురాన్ లో కూడా నదులే స్వర్గ చిత్రంలో కేంద్రీయ స్థానంలో నిలుస్తాయి. ప్రాచీన భారత గ్రంథాలు కూడా నదులే జాతి జీవనానికి ఆధారమని నిర్వచిస్తాయి. ప్రాణికోటికి జీవం పోసేవిగా నదులను ఆరాధిస్తాం. ఒక ఆఫ్గన్ సామెత కూడా కాబూల్ బంగారం లేకుండా అయినా ఉండవచ్చు కానీ మంచు లేకుండా ఉండకూడదని ఉద్ఘోషిస్తోంది. జన జీవనానికి, వ్యవసాయానికి ఆధారమైన నదులకు నీరందించేది ఈ మంచు కావడం విశేషం. మనం ఈ రోజు వ్యవసాయ భూములకు నీరందించి గృహాలకు విద్యుత్ అందించడం కోసమే ఈ ప్రాజెక్టును ప్రారంభించడంలేదు. ఇది ఈ ప్రాంతం మొత్తాన్ని పునరుత్తేజితం చేస్తుంది, ఆశలను చిగురింపచేస్తుంది. జీవితాల్లో కొత్త వెలుగులు నింపడంతో పాటు ఆఫ్గన్ భవిష్యత్తును పునర్ నిర్వచిస్తుంది. ఈ డామ్ విద్యుత్తునే కాకుండా ఆశల్ని, ఆఫ్గన్ భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని ఉద్దీపింపచేస్తుంది.
ఈ ప్రాజెక్టు వల్ల చిష్తే, ఒబే, పాస్తున్ జర్ఘమ్, కారోఖ్, గొజారా, ఇంజిల్, జింద్ జాన్, కోహ్సన్, ఘోర్యాన్ ప్రాంతాల్లోని 240 గ్రామాలకు నీటిపారుదల వసతి కల్పించడమే కాక ఈ ప్రాంతాల్లోని రెండున్నర లక్షలకు పైగా ఇళ్ళలో వెలుగులు నింపుతుంది. గత డిసెంబరులో కాబూల్ లో ఆఫ్గన్ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన సమయంలో నేను చలించిపోయాను. తుపాకీ, దౌర్జన్యకాండ ద్వారా కాకుండా ఆరోగ్యవంతమైన చర్చ, ఓటు ఆయుధంగా తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకునేందుకు ఆఫ్గన్ ప్రజలు సాగించిన నిరంతర పోరాటానికి నివాళిగా నిలిచే చిహ్నం అది. మళ్ళీ ఇప్పుడు ఈ వేసవిలో ఆఫ్గన్ సుసంపన్నత కాంక్షకు చిహ్నంగా నిర్మించుకున్న ఈ డామ్ ప్రారంభించేందుకు మనం హెరాత్ లో సమావేశమయ్యాం. 1970 దశకంలోనే భారత, ఆఫ్గన్ ప్రజలు ఈ ప్రాజెక్టు కోసం కలలు గన్నారు. సాయుధ పోరాటం దీర్ఘకాలంలో ఎంత నష్టాన్ని మిగులుస్తుందో గత దశాబ్ది మనకి చాటి చెబుతుంది. ఆఫ్గన్ నిర్మాణానికే కాదు…మొత్తం రానున్న తరాల భవిష్యత్తును కూడా ఆ సాయుధ పోరాటం హరించివేసింది. 2001లో ఆఫ్గన్ లో కొత్త శకానికి తెర లేచిన తర్వాత మేం ఈ ప్రాజెక్టును పునః ప్రారంభించాం.
ఒక కట్టుబాటు, సహనం, సాహసం, విశ్వాసంతో ఉభయ దేశాలు దూరాన్ని, అవరోధాలను, బెదిరింపులు, దౌర్జన్యకాండను అధిగమిస్తూ ఒక్కటిగా నిలిచాయి. విచ్ఛిన్నకర ధోరణులు, హత్యాకాండ, అసమ్మతి, ఆధిపత్య శక్తులు మనుగడ సాగించలేవన్న గట్టి సందేశాన్ని ఆఫ్గన్ ప్రజలు వారికి పంపారు. ఆఫ్గన్ ప్రజల ఆశలు, కలలు సాకారం చేసుకునే మార్గంలో ఈ శక్తులు అవరోధం కాలేవని హెచ్చరించారు. చక్కని ఫలాలు, ఆహారం అందించే పంట భూములు మరోసారి ఈ స్వచ్ఛమైన నదీ జలాలతో తిరిగి ప్రాణం పోసుకుంటాయి. భయంకరమైన చీకటి రాత్రులు గడిపిన ప్రజలకు కొత్త ఆశలతో కూడిన వెలుగులు అందిస్తాయి. శాంతి, భద్రతల నడుమ పొలాల్లో కష్టపడి పని చేసుకుంటూ శ్రమైక జీవన సౌందర్యాన్ని ఈ ప్రాంత ప్రజలు తిరిగి ఆస్వాదించగలుగుతారు. ఒకప్పుడు కరకు తుపాకులు మోసిన భుజాలపై మరోసారి నాగళ్లు లేచి ఈ ప్రాంత భూములను పచ్చగా మారుస్తాయి. బాలబాలికలందరికీ చక్కని విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయి.
మరో యువ కవయిత్రి బాధాపూరితమైన జీవనాన్ని సాగించాల్సిన అవసరం ఉండదు. ఆశలన్నీ అడియాసలైన స్థితి అలాంటి వారికి ఎదురు కాదు. చరిత్రలో ఎన్నో ఉత్కృష్టమైన ఉత్థానాలు, భరింపలేని పతనాలు హెరాత్ చవి చూసింది. ఒకప్పుడు జలాలుద్దీన్ వంటి వారికి పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతం మరోసారి ఉన్నతికి పరుగులు తీస్తుంది. పశ్చిమ, దక్షిణ, మధ్య ఆసియాలకు ముఖద్వారంగా నిలిచే ఈ నగరం, ఈ ప్రాంతాన్ని శాంతి, సుసంపన్నతలకు నిలయంగా చేసే కేంద్ర బిందువుగా మారుతుంది. మాపై ఉంచిన విశ్వాసానికి, ఎంతో సహనంతోను, అవగాహనతోను వ్యవహరించి మాకు మద్దతు ఇచ్చినందుకు హెరాత్ ప్రజలకు, ప్రభుత్వానికి, ఆఫ్గన్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
ఈ డామ్ ను ఇటుకలు, సున్నంతో నిర్మించారనే కన్నా భారత, ఆఫ్గన్ ప్రజల స్నేహభావం పట్ల విశ్వాసం, సాహసంతో నిర్మించారంటే అతిశయోక్తి కాదు. గతంలో జరిగిన పోరాటాల్లో ప్రాణాలు ఫణంగా పెట్టిన వారికి ఇదే సందర్బంగా మనం నివాళి అర్పించాలి. వారి త్యాగాల ఫలంగానే ఆఫ్గన్ ప్రజలు వారు కోరుకున్న భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతున్నారు. వారు చిందించిన రక్తం, స్వేదం, కన్నీళ్ళు ఈ భూమిలో ఇంకిపోయి మన మధ్య బలమైన బంధానికి కారణమయ్యాయి. భారత, ఆఫ్గన్ల మధ్య ప్రాచీన బంధాన్ని ఇవి గుర్తు చేస్తున్నాయి. ప్రాచీన వేద కాలం నుంచి హరిరుద్ నది మన చరిత్రలను కలిపింది. భవిష్యత్తులోకి పురోగమించేందుకు మన కట్టుబాటుకు హరిరుద్ నదిని ఒక చిహ్నంగా ప్రస్తుత ప్రపంచం చూస్తోంది. శతాబ్దాల క్రితమే చిష్తి షరీఫ్ మన మధ్య ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరచినట్టుగానే ఈ ఫ్రెండ్ షిప్ డామ్ ఇప్పుడు మన మధ్య సంఘీభావానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఇక్కడ నుంచే చిష్తి సాంప్రదాయం భారత్ కు వచ్చింది. అజ్మీర్, ఢిల్లీ, ఫతేపూర్ సిక్రీ దర్గాల్లో ఈ సాంప్రదాయమే కనిపిస్తూ ఉంటుంది. బోధనలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి వినిపించే చక్కని ప్రేమ, కరుణ, సామరస్య సందేశం అన్ని విశ్వాసాలకు చెందిన ప్రజలను ఆకర్షిస్తుంది. ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవించుకుని, మానవతాపూరితమైన సేవ చేసేందుకు ఉత్తేజం ఇస్తుంది. ఉగ్రవాదం, దౌర్జన్యకాండలకు అతీతంగా ఆఫ్గన్, బారత దేశాల ప్రజలకు ఈ విలువలు బాగా తెలుసు. ఆఫ్గనిస్తాన్ కు శాంతి సుస్థిరతలు, ప్రేమ, ఆధ్యాత్మికతలతో కూడిన ఒక సుసంపన్నమైన సాంప్రదాయం ఉంది. ఈ విలువలే ఆఫ్గన్ ప్రజలకు సహనాన్ని, శాంతి కోసం వేచి ఉండగల నిలకడను అందించాయి.
తమ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోగల శక్తి ఆఫ్గన్లకు ప్రపంచంలోని ఏ ఇతర ప్రాంతాల ప్రజల కన్నా ఎక్కువగానే ఉంది. భారతీయులు, ఆఫ్గన్లు పరస్పరం సహకరించుకునేందుకు ఈ విలువలే ప్రాణంగా నిలిచాయి. భారత్ లో మొదటి చిష్తీ సన్యాసి అయిన ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ మానవాళి అంతా సూర్యుని పట్ల ఆరాధనా భావం, నదుల పట్ల ఔదార్యం, భూమితో ఆతిథ్య భావం కలిగి ఉండాలని బోధించాడు. ఆయన ఆఫ్గన్ ప్రజల భావాలకు ప్రతీక. అందుకే డిసెంబరులో నేను కాబూల్ వచ్చినప్పుడు మీ ఆహ్వానంలో అదే వెచ్చదనాన్ని అనుభవించాను. మీ హృదయాల్లో దయాభావాన్ని గమనించాను. మీ కళ్ళలో భారత్ పట్ల అభిమానం చూశాను. మీ నవ్వుల్లో మన బాంధవ్యం పట్ల ఉన్న ఆనందం గమనించాను. మీరు హృదయానికి హత్తుకోవడంలో స్నేహం పట్ల విశ్వాసం కనిపించింది. ఆ క్షణంలో మీ ప్రజల ఆప్యాయతానురాగాలతో పాటు ఈ భూమిలోని స్నేహభావం అనుభవించాను. 1.25 కోట్ల మంది ప్రజల కృతజ్ఞత, ఆరాధనా భావాలతోను, మన భాగస్వామ్యం పట్ల సరికొత్త కట్టుబాటుతోను నేను ఇప్పుడు ఇక్కడకు తిరిగి వచ్చాను.
మన భాగస్వామ్యం కలిసికట్టుగా గ్రామీణ సమాజం కోసం పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, నీటి పారుదల వసతులు నిర్మించింది. ఆఫ్గన్ భవిష్యత్తును నిర్మించే బాధ్యత గల మహిళలను సాధికారం చేసింది. యువతకు విద్యావకాశాలు అందించింది. జరాంగ్, దెలారంల నుంచి దూరాన్ని తగ్గించే రహదారులు మనం నిర్మించుకున్నాం. ఇళ్ళకు విద్యుత్ వెలుగులు అందించే ట్రాన్స్ మిషన్ లైన్లు నిర్మించాం. ఇప్పుడు ఇరాన్ లోని చాబహార్ పోర్టు నిర్మాణంలో భారత్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆఫ్గన్ కు బయట ప్రపంచంతో అనుసంధానానికి మరో కొత్త మార్గం అందుబాటులోకి రానుంది. ఈ చర్య సుసంపన్నతకు బాట వేస్తుంది. ఆ కల సాకారం చేసుకునేందుకు వీలు కల్పించే చాబహార్ వాణిజ్య, రవాణా ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో నేను, ఇరాన్ అధ్యక్షుడు రోహనితో, ఆఫ్గన్ అధ్యక్షుడు ఘనీ పాల్గొన్నాం.
ఈ స్నేహఫలాలు కాబూల్, కాందహార్, మజార్, హెరాత్ లకే పరిమితం కాదు. మన సహకారం ఆఫ్గన్ లోని ప్రతీ ఒక్క ప్రాంతానికి విస్తరిస్తుంది. ఆఫ్గన్ సమాజంలోని ప్రతీ ఒక్క విభాగానికి ప్రయోజనం చేకూరుతుంది. భౌగోళిక సంక్లిష్టతలు, సమాజంలోని భిన్నత్వాలు, పుష్తూన్లు, తజక్ లు, ఉజ్బెక్ లు, హజారాలు వంటి భిన్నవర్గాలున్నప్పటికీ వాటన్నింటికీ అతీతంగా ఆఫ్గన్ ఒక్కటిగా జీవించాలి, ఒక్కటిగానే సుసంపన్నం కావాలి. ఆఫ్గన్లలో విభేదాల వల్ల దేశం వెలుపల శక్తులు దేశంపై ఆధిపత్యం వహించేందుకు అవకాశం కల్పించినట్టవుతుంది, మనం కలిసికట్టుగా పని చేసినట్టయితే మరింత బలం, విశ్వాసం పుంజుకుని ఇతరుల కుట్రల నుంచి రక్షణ పొందడం సాధ్యమవుతుంది.
మా దేశ పౌరుల పై దాడి జరిగినప్పుడు సాహసవంతులైన ఆఫ్గన్ గార్డులు తమ సొంత ప్రజలను రక్షించినట్టుగా వారిని రక్షించారు. వారు ఓ అగ్నివలయంలా ఏర్పడి తమ భారతీయ స్నేహితులను కాపాడారు. మీ హృదయాల్లోని వివేకం, మీ స్నేహంలోని బలం అంతటిది. నేను అధికార బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ఈ బాంధవ్యాన్ని స్వయంగా అనుభవిస్తున్నాను. హెరాత్ లోని మా కాన్సులేట్ పై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు సాహసానికి మారుపేరైన ఆఫ్గన్ సైనికులు, మా సిబ్బంది, ఉగ్రవాదులని దీటుగా ఎదుర్కొని ఎందరి ప్రాణాలనో కాపాడారు. పెద్ద విషాదాన్ని నివారించగలిగారు.
అధ్యక్ష మహోదయా, మిత్రులారా…
ఆఫ్గన్ విజయం మా భారతీయుల్లో ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఆశను, సరికొత్త కోర్కెలను నింపింది. ఆఫ్గన్ల పట్ల మాలో ఉన్న ప్రేమాభిమానాలే ఇందుకు కారణం. మీ ప్రజాస్వామ్యం లోతుగా వేళ్ళూనుకోవాలని, మీ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, మీరు ఆర్థికంగా సుసంపన్నంగా ఉండాలని మేం కోరుతున్నాం. మీ కళలు, సంస్కృతి, కవిత్వం మరింత ఉజ్వలంగా వెలుగొందాలని మేం ఆశిస్తున్నాం. మీ క్రికెటర్లు టెస్ట్ క్రీడాకారులుగా ఎదగాలని, ఐపిఎల్ మ్యాచ్ ల్లో సైతం పాల్గొని తమ సత్తా చూపాలన్నది మా ఆకాంక్ష.
ఆఫ్గన్లు విజయం సాధిస్తే ప్రపంచం మొత్తం సురక్షితంగా, మరింత అందంగా ఉంటుందన్నది మా విశ్వాసం. ఆఫ్గన్లు నిర్వచించిన విలువలు కలకాలం వర్థిల్లినట్టయితే ఉగ్రవాదం, తీవ్రవాదం తోక ముడుస్తాయనడంలో సందేహం లేదు. ఉగ్రవాదం, తీవ్రవాదానికి హద్దులనేవి లేవు. ఈ చర్యలు మీ సరిహద్దులోనో, మా సరిహద్దులోనో ఆగిపోవన్నది మాకు తెలుసు.
అశాంతి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న ప్రస్తుత రోజుల్లో సాహసవంతులైన ఆఫ్గన్లు తమ కోసం, ప్రపంచం కోసం చేసిన పోరాటం గుర్తుకు వస్తుంది. దాన్ని భారత్ ఎప్పటికీ మరిచిపోదు. నేను అప్పుడూ చెప్పాను..ఇప్పుడూ మళ్ళీ చెబుతున్నాను, మీ స్నేహమే మా గౌరవం, మా కల, మా విధి. మా సామర్థ్యాలకు పరిమితి ఉండవచ్చు గాని మా కట్టుబాటుకు మాత్రం ఎలాంటి పరిమితులు లేవు. మా వనరులు పరిమితం కావచ్చు కాని మా ఆకాంక్షకు హద్దులు లేవు. ఇతరుల కట్టుబాట్లకు కాలపరిమితి ఉండవచ్చు గాని, మన బాంధవ్యానికి కాలం చెల్లిపోవడం అనేది లేనే లేదు. మనకి భౌగోళిక, రాజకీయ అవరోధాలుండవచ్చు గాని మేం నడిచే బాటపై మాత్రం స్పష్టత ఉంది. మాకు ప్రతిబంధకాలు, అనుమానాలు ఎదురు కావచ్చు గాని, మా కట్టుబాటు మాత్రం బలీయమైనది. మీ నమ్మకం, విశ్వాసాలే మమ్మల్ని నడిపిస్తాయి.
ఎవరికైనా మీ భవిష్యత్తుపై అనుమానాలుండవచ్చు గాని, మీరు ఎంచుకున్న బాట ఎంత సుదూరమైనది, క్లిష్టమైనది అయినా దాన్ని చేరడాన్ని ఏ శక్తీ ఆపలేదన్నది మా విశ్వాసం. అందుకే శాంతియుతంగాను, సుసంపన్నంగాను, ఐక్యంగాను, సమ్మిళితంగాను, ప్రజాస్వామ్యయుతంగాను జీవించడంలో ఆఫ్గన్లకు గల హక్కు గురించి అంతర్జాతీయ, ప్రాంతీయ వేదికలపై మేం గొంతెత్తి నినదిస్తున్నాం. అంతటి సుసంపన్నమైన భవిష్యత్తును ఆఫ్గన్ కు అందించడానికి పంటపొలాలు, గ్రామాలు, నగరాలు అన్నింటిలోనూ మేం కలిసి పని చేస్తాం.
హెరాత్ కు చెందిన ప్రముఖ సూఫీ కవి హకీం జమి చెప్పినట్టుగా వెలుగులో ఉన్నా, అంథకారంలో ఉన్నా తాజా స్నేహ వీచికలు ఎప్పటికీ వీస్తూనే ఉంటాయి.
నా పట్ల మీరు చూపిన ఆదరణకు, గౌరవానికి, స్నేహభావానికి కృతజ్ఞతలు.
ధన్యవాదాలు
Inauguration of the Afghan India Friendship Dam is a historic moment of emotion & pride in the relations between Afghanistan and India.
— Narendra Modi (@narendramodi) June 4, 2016
This is a project that will irrigate lands & light up homes. The dam is a generator of optimism & belief in the future of Afghanistan.
— Narendra Modi (@narendramodi) June 4, 2016
The brave Afghan people are sending a strong message that the forces of destruction & death, denial and domination, shall not prevail.
— Narendra Modi (@narendramodi) June 4, 2016
India cherishes the friendship with Afghanistan. In Afghanistan, we want to see democracy strike deep roots, people unite & economy prosper.
— Narendra Modi (@narendramodi) June 4, 2016
Today, we are reviving a region, restoring hope, renewing life and redefining Afghanistan’s future. https://t.co/GKy6K7JeK8
— Narendra Modi (@narendramodi) June 4, 2016