ఈ కింది పేర్కొన్న భారీ పరిశ్రమల విభాగం ప్రతిపాదనలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
i. బెంగళూరు, తుమకూరు లలో హెచ్ ఎమ్ టి వాచెస్ లిమిటెడ్ కు ఉన్న 208.35 ఎకరాల భూమిని రూ. 1194.21 కోట్లు మరియు వర్తించే పన్నులు, సుంకాలు దీనికి అదనంగా చెల్లించే పద్ధతిపై భారత అంతరిక్ష సంస్థ ఐఎస్ఆర్ఒ:ఇస్రో కు బదిలీ చేయడం.
ii. ఒక ఎకరం మేర ఉన్న హెచ్ ఎమ్ టి లిమిటెడ్ యొక్క బెంగళూరు గ్లోబల్ వేర్ హౌస్ భూమిని రూ. 34.30 కోట్లు మరియు వర్తించే పన్నులు, సుంకాలు దీనికి అదనంగా చెల్లించే పద్ధతిపై గ్యాస్ అథారటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గేల్) కు బదిలీ చేయడం.
భూమి విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును – ఈ లావాదేవీలో ఇమిడి ఉన్న పన్నులు ఇతరత్రా బాధ్యతలను నెరవేర్చిన తరువాత – కంపెనీ తాను తీసుకున్న రుణాలకు సంబంధించి ప్రభుత్వ ఖాతాలలో డిపాజిట్ చేస్తుంది.
పూర్వరంగం:
భారతదేశంలో సామాన్య పౌరుల కోసం గడియారాలను తయారు చేయడంలో హెచ్ ఎమ్ టి వాచెస్ లిమిటెడ్ అగ్రగామిగా ఉండేది. భారతదేశానికి సమయ నిర్ణేత అనే పేరు ఈ కంపెనీకి ఒకప్పుడు ఉండేది. నష్టాలు పెచ్చు పెరుగుతూ ఉండడం, వర్తమాన స్పర్థాత్మక, ఆర్థిక వాతావరణంలో ఈ సంస్థ పునరుద్ధరణకు అవకాశం లేకపోవడంతో ఈ కంపెనీ తన కార్యకలాపాలను ఆపివేయవలసి వచ్చింది. ఉద్యోగులందరికీ ఆకర్షణీయమైన విఆర్ఎస్/విఎస్ఎస్ ఇవ్వజూపడం ద్వారా 2016 జనవరిలో ఈ కంపెనీని మూసివేయాలని నిర్ణయించడమైంది. భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిన గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాన్ని కంపెనీకి చెందిన బెంగళూరు మరియు తుమకూరు శాఖల ఉద్యోగులు వినియోగించుకొని సంతోషంగా ఇంటి బాట పట్టారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయినటువంటి హెచ్ ఎమ్ టి వాచెస్ లిమిటెడ్ కు బెంగళూరు మరియు తుమకూరులలో ఉన్న భూమిని ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇస్రోకు, గేల్ కు విక్రయించడం/బదిలీ చేయడం ద్వారా నిర్మాణాత్మక వనరులను స్వేచ్ఛాయుత వినియోగంలోకి తేవడంతో పాటు తక్కువగా ఉన్న భూమి వనరులను విశాలమైన ప్రజల ప్రయోజనాల కోసం మరింత ఉత్తమమైన రీతిలో ఉపయోగించినట్లు అవుతుంది.