హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ ఎఫ్ సి ఎల్) ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థకు ఇచ్చిన రూ.1,916.14 కోట్ల రుణాన్ని (31.3.2015 నాటికి) మాఫీ చేయాలన్న ప్రతిపాదనను, ఆ రుణంపై బకాయిగా ఉన్న వడ్డీని (ఇది 31.3.2015 నాటికి రూ.7,163.35 కోట్లకు చేరింది) కూడా మాఫీ చేయాలన్న ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. బరౌని యూనిట్ కు చెందిన 56 ఎకరాల యాష్ డైక్ భూమిని బిహార్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ (బి ఎస్ పి జి సి ఎల్) కు బదలాయించాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హెచ్ ఎఫ్ సి ఎల్ బకాయిలను సర్దుబాటు చేయడం కోసం, తద్వారా బరౌని యూనిట్ ను త్వరితగతిన పునరుద్ధరించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంత్రిమండలి ఆమోదం హెచ్ ఎఫ్ సి ఎల్ నికర విలువను సకారాత్మకంగా మార్చి, తత్పర్యవసానంగా బి ఐ ఎఫ్ ఆర్ నుంచి హెచ్ ఎఫ్ సి ఎల్ డి-రిజిస్టర్ కావడానికి వీలు కల్పిస్తుంది. హెచ్ ఎఫ్ సి ఎల్ బరౌని యూనిట్ శీఘ్ర పునరుద్ధరణకు కూడా ఇది మార్గాన్ని సుగమం చేయగలదు. ఈ యూనిట్ వ్యాపారం చాలించి, 1999 జనవరి నుంచి పనిచేయడం లేదు. కాబట్టి, ఈ యూనిట్ తో పాటు దీనితో అనుబంధం ఉన్న ఇతర సదుపాయాలు కూడా నిరుపయోగంగానే ఉంటున్నాయి. నామ్ రూప్ (అస్సాం)లో రెండు చిన్న యూనిట్ లు మినహా దేశ ఈశాన్య ప్రాంతంలో ప్రస్తుతం ఏ యూరియా యూనిట్ కూడా పనిచేయడం లేదు.
దేశంలో యూరియా వినియోగం సంవత్సరానికి ఇంచుమించుగా 320 ఎల్ ఎమ్ టి గా ఉంది. అందులో నుండి 245 ఎల్ ఎమ్ టి దేశంలోనే ఉత్పత్తి అవుతుంటే, మిగతాది దిగుమతి అవుతోంది. బరౌనిలో ఒక కొత్త యూనిట్ ను ఏర్పాటు చేస్తే బిహార్, పశ్చిమ బెంగాల్, ఝార్ ఖండ్ లలో పెచ్చుపెరుగుతున్న యూరియా అవసరాలను తీర్చగలుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం పశ్చిమ, మధ్య ప్రాంతాల నుండి రైలు మార్గాలు, రహదారి మార్గాల ద్వారా సుదూరానికి యూరియాను రవాణా చేయవలసి వస్తున్న ఒత్తిడిని కూడా ఇది తగ్గించగలదు. ఈ యూరియా రవాణా సుంకంలో ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని కూడా ఆదా చేయవచ్చు. ఈ యూనిట్ 400 మందికి ప్రత్యక్ష ఉపాధిని, 1200 మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తుంది.
బరౌని యూనిట్ – గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (జి ఎ ఐ ఎల్.. ‘గెయిల్’) వేసిన జగ్ దీశ్ పూర్-హల్దియా గ్యాస్ గొట్టపు మార్గానికి యాంకర్ యూనిట్ గా కూడా ఉపయోగపడుతుంది. ఈశాన్య భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఈ గ్యాస్ పైప్ లైన్ ఎంతో కీలకం.
One thought on “హిందుస్తాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ ఎఫ్ సి ఎల్) బరౌని యూనిట్ శీఘ్ర పునరుద్దరణ కోసం హెచ్ ఎఫ్ సి ఎల్ ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం”