సర్వోన్నత న్యాయస్థానం మరియు ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులతో పాటు సర్వోన్నత న్యాయస్థానం, ఇంకా ఉన్నత న్యాయస్థానాల విశ్రాంత న్యాయమూర్తుల జీతాలు, గ్రాట్యుటీ, అలవెన్సులు, పెన్షన్ తదితర అంశాలలో సవరణ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇది ప్రభుత్వ అధికారుల విషయంలో 7వ కేంద్రీయ వేతన సంఘం సిఫారసుల అమలు తదనంతర చర్యలలో ఒక భాగం.
ఈ ఆమోదంతో రెండు చట్టాలలో అవసరమైన సవరణలు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఆ రెండు చట్టాలలో ఒకటి సుప్రీం కోర్ట్ జడ్జెస్ (శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్) యాక్ట్, 1958; కాగా, రెండోది హైకోర్ట్ జడ్జెస్ (శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్) యాక్ట్, 1954. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ), భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు, ఉన్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులు మరియు అందరు న్యాయమూర్తుల జీతాలు ఈ రెండు చట్టాలలో పేర్కొన్న ప్రకారం ఉంటాయి.
జీతం మరియు అలవెన్సులు తదితర అంశాలలో పెరుగుదల భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన 31 మంది న్యాయమూర్తులు (సిజెఐ తో కలుపుకొని) మరియు ఉన్నత న్యాయస్థానాలకు చెందిన 1079 మంది న్యాయమూర్తులకు (ప్రధాన న్యాయమూర్తులను కూడా కలుపుకొని) ప్రయోజనం చేకూర్చుతుంది. దీనికి తోడు, పింఛను/గ్రాట్యుటీ తదితర అంశాల సవరణ కారణంగా దాదాపుగా 2500 మంది రిటైర్డ్ జడ్జీలు కూడా లాభపడతారు.
సవరించిన జీతాలు, గ్రాట్యుటీ, పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ తాలూకు బకాయిలను 01.01.2016 నాటి నుండి వర్తించే విధంగా.. ఒకేసారి ఏక మొత్తం చెల్లింపు పద్ధతిలో.. చెల్లించనున్నారు.
పూర్వరంగం:
సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తులకు సంబంధించిన జీతాలు, గ్రాట్యుటీ, పింఛను, అలవెన్సులు వంటివి సుప్రీం కోర్ట్ జడ్జెస్ (శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్) యాక్ట్, 1958 ప్రకారం ఉంటాయి. ఇక ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల జీతాలు హైకోర్ట్ జడ్జెస్ (శాలరీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్) యాక్ట్, 1954 ప్రకారం ఉంటాయి. సర్వోన్నత న్యాయస్థానం మరియు ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల జీతాలు/పెన్షన్, గ్రాట్యుటీ, అలవెన్సులు వంటి అంశాలలో సవరణ కోసం ఏదైనా ప్రతిపాదన వచ్చినప్పుడల్లా పైన పేర్కొన్న చట్టాలలో ఒక సవరణను పొందుపరచడం అవసరమవుతుంది. ఈ కారణంగా, సదరు జీతాలు మరియు భత్యాలలో సవరణను వర్తింప జేయడానికి సంబంధిత చట్టాలలో సవరణకు గాను ఒక బిల్లును పార్లమెంటు తదుపరి సమావేశాలలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
***