సరిహద్దు భద్రత దళం (బి ఎస్ ఎఫ్) గ్రూప్ ‘ఎ’ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల కాడర్ సమీక్షకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. తద్వారా అసిస్టెంట్ కమాండెంట్ నుండి అడిషనల్ డిజి వరకు గల పలు ర్యాంకులకు సంబంధించి 74 పోస్టులు కొత్తగా ఏర్పడడం జరుగుతుంది. దీనితో బి ఎస్ ఎఫ్ పనివిధాన సామర్థ్యం, కార్యనిర్వహణ సామర్ధ్యం పెంపొందుతాయి.
అమలులో వున్న గ్రూప్ ‘ఎ’ పోస్టుల నిర్మాణంలో పెంపుదల 4109 నుండి 4183 వరకు కింది విధంగా ఉంటుంది:
1. అదనపు డిజి పోస్టు (హెచ్ ఎ జి స్థాయి) ఒకటి కొత్తగా ఏర్పడుతుంది.
2. ఇన్ స్సెక్టర్ జనరల్ ( ఎస్ ఎ జి స్థాయి) పోస్టులు మొత్తం మీద 19 కొత్తగా ఏర్పడతాయి
3. డిఐజి / కమాండెంట్ / 2 ఐసి ( జె ఎ జి స్థాయి) ల పోస్టులు మొత్తం మీద 370 పెంపుదల.
4. అసిస్టెంట్ కమాండెంట్ (జెటిఎస్ స్థాయి) పోస్టులు మొత్తం మీద 14 పెంపుదల.
5. డిప్యూటీ కమాండెంట్ (ఎస్ టి ఎస్ స్థాయి) పోస్టులను మొత్తం మీద 330 తగ్గింపు.
పూర్వ రంగం:
దేశ సరిహద్దులలో రక్షణ కార్యకలాపాలు నిర్వహించడానికి గాను 1965లో బి ఎస్ ఎఫ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం బి ఎస్ ఎఫ్ లో 2,57,025 మంది 186 బెటాలియన్ ల కింద పని చేస్తున్నారు. మూడు ఎన్ డి ఆర్ ఎఫ్ బెటాలియన్ లు ఇందులోనే ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ గ్రూప్ ‘ఎ’ కాడర్ లో 4065 మంది అధికారులు ఉన్నారు. (ఐ పి ఎస్ కోటాతో కలిపితే ఈ సంఖ్య 4109). బి ఎస్ ఎఫ్ బలగాలలో 90 శాతం ఇండో- పాకిస్థాన్ సరిహద్దులలోను, ఇండో- బంగ్లాదేశ్ ( ఈశాన్య ప్రాంతాన్నికలుపుకుని) సరిహద్దులలోను, వామపక్ష ఉగ్రవాద రాష్ట్రాలలోను విధులు నిర్వహిస్తున్నాయి. బి ఎస్ ఎఫ్ కాడర్ లో కడపటి సమీక్ష ను 1990లో చేపట్టారు.