సమాచార సాంకేతిక విజ్ఞానం మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకుగాను భారతదేశం, శ్రీ లంక ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది. చట్టం & న్యాయం, ఇంకా ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక విజ్ఞానం శాఖ కేంద్ర మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ శ్రీ లంక పర్యటనకు వెళ్లిన సందర్భంగా 2018 జనవరి 15 వ తేదీన ఈ ఎమ్ఒయు పై సంతకాలయ్యాయి.
ఇ- గవర్నెన్స్, ఎమ్- గవర్నెన్స్, ఇ- పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు, స్టార్ట్- అప్ ఇకో సిస్టమ్ తదితరాలకు సంబంధించి సన్నిహిత సహకారాన్ని పెంపొందించుకొనేందుకు ఈ ఎమ్ఒయు ను ఉద్దేశించారు.
ఉభయ పక్షాలకు చెందిన ప్రతినిధులతో కూడిన ఐటి & ఇ కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఎమ్ఒయు ను అమలు చేయనున్నారు. ఐసిటి డమేన్ లో B2B మరియు G2G లు రెండింటిలోనూ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరింపచేస్తారు.
పూర్వరంగం:
ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారం కింద ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) రంగంలో అంతర్జాతీయ సహకారాన్నిపెంపొందించేందుకు ఎలక్ట్రానిక్స్ ,ఐటి మంత్రిత్వ శాఖ (MeitY) కు అధికారం ఇవ్వబడింది.
ఐసిటి రంగంలో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి, సన్నిహిత సహకారానికి వివిధ దేశాలకు చెందిన సమాన హోదా గల సంస్థలు, ఏజెన్సీలతో ఎమ్ఒయు లు / ఒప్పందాలను MeitY కుదుర్చుకొంది. వివిధ దేశాలతో సహకారాన్ని ఇనుమడింపచేసుకోవడానికి , ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల కారణంగా సాంకేతిక రంగంలో వ్యాపార అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం పెరిగింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 లో శ్రీ లంకలో జరిపిన పర్యటన, భారతదేశానికి పొరుగున ఉన్న దేశాలకు ప్రథమ ప్రాధాన్యమిచ్చే విధానంలో భాగంగానే చూడవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు, కొలంబో లొని భారతదేశ దౌత్య కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , చురుకైన సహకారానికి సంబంధించి ఒక ఫ్రేమ్‌వర్క్ ఏర్పాటు ఆవశ్యకతను నొక్కిచెప్పాయి. దీనితో ICT రంగంపై ప్రధాన దృష్టితో.. ముఖ్యంగా ఇ- గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, B2B భాగస్వామ్యం, ఐటి విద్య, పరిశోధన, ఆవిష్కరణ లకు సంబంధించి.. పరస్పర సహకారానికి ఉద్దేశించినటువంటి ఒక సమగ్రమైన అవగాహనపూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకొనేందుకు MeitY సంప్రదింపులు జరిపింది.
***