Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్వామిత్వ లబ్దిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో అనుసంధానం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమంలో 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 230కి పైగా జిల్లాల్లో గల 50వేలకి పైగా గ్రామాల ప్రజలకు స్వామిత్వ (SVAMITVA) పథకం కింద 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఈ పథకం గురించి లబ్దిదారుల అనుభవాలను తెలుసుకోవడానికి ఆయన ఐదుగురు లబ్ధిదారులతో సంభాషించారు.

 మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌కు చెందిన లబ్ధిదారుడు శ్రీ మనోహర్ మేవాడతో సంభాషించిన ప్రధానమంత్రి, పథకానికి సంబంధించి తన అనుభవాన్ని పంచుకోవాలని కోరారు. ఆస్తి పత్రాలతో రుణం పొందడం గురించి అలాగే తన జీవితంలో దానివల్ల కలిగిన ప్రయోజనాలను శ్రీ మనోహర్‌ను ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. తన డెయిరీ ఫామ్ కోసం 10 లక్షల రుణం తీసుకున్నాననీ, అది వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఎంతగానో సహాయపడిందని శ్రీ మనోహర్ వివరించారు. తాను, తన పిల్లలు, తన భార్య కూడా డెయిరీ ఫామ్‌లో పనిచేయడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఆస్తి పత్రాలు ఉండటం వల్లే బ్యాంకు రుణం పొందడం సులభతరమైందని శ్రీ మనోహర్ సంతోషంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజల జీవితాల్లో కష్టాలు తగ్గాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వామిత్వ యోజన లక్షలాది కుటుంబాల ఆదాయాన్ని పెంచిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు గర్వంగా తల ఎత్తుకుని, జీవితంలో సుఖాన్ని అనుభవించేలా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. స్వామిత్వ యోజనను ఈ దార్శనికతకు కొనసాగింపుగా ప్రధానమంత్రి అభివర్ణించారు.

ఆ తర్వాత ప్రధానమంత్రి రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన లబ్ధిదారు శ్రీమతి రచనతో సంభాషించారు. ఈ పథకం గురించి తన అనుభవం చెప్పాలని ప్రధానమంత్రి అడిగినప్పుడు, తాను 20 సంవత్సరాలుగా ఆస్తి పత్రాలు లేకుండా ఈ చిన్న ఇంట్లో నివసిస్తున్నానని ఆమె చెప్పారు. స్వామిత్వ యోజన కింద ఇంటి పత్రాలు లభించడంతో తాను 7.45 లక్షల రూపాయల రుణం తీసుకొని ఒక దుకాణాన్ని ప్రారంభించానని, ఇప్పుడు అదనపు ఆదాయం పొందుతున్నానని ఆమె పేర్కొన్నారు. ఇదే ఇంట్లో 20 ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ ఆస్తి పత్రాలు లభిస్తాయనీ ఎప్పుడూ ఊహించలేదని ఆమె సంతోషంగా చెప్పారు. స్వామిత్వ పథకం ద్వారా పొందే ఇతర ప్రయోజనాలను వివరించమని అడిగినప్పుడు, తాను స్వచ్ఛ భారత్ పథకంలో లబ్ధిదారుగా ఉన్నానని, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రూ. 8 లక్షల రుణం తీసుకున్నాననీ, అలాగే ఆజీవిక పథకం కింద కూడా పనిచేస్తున్నానని, ఆయుష్మాన్ పథకం ద్వారా కూడా తన కుటుంబం ప్రయోజనం పొందిందని ఆమె ప్రధానమంత్రికి వివరించారు. తన కూతురిని ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు పంపాలనే కోరికను ఆమె వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, ఆమె కూతురి కలలు నెరవేరాలని ఆకాంక్షించారు. స్వామిత్వ  యోజన కేవలం ప్రాథమిక అవసరాలను తీర్చడమే కాకుండా పౌరుల ఆకాంక్షలకు అండగా ఉంటూ వారికి సాధికారత కల్పించడం మంచి విషయమని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఏ పథకం విజయమైనా నిజానికి ప్రజలతో అనుసంధానమవ్వడం అలాగే వారిని బలోపేతం చేయడంలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తన కథను పంచుకున్నందుకు శ్రీమతి రచనకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అలాగే ప్రభుత్వం అందించే అవకాశాల నుంచి గ్రామ ప్రజలంతా ప్రయోజనం పొందాలన్నారు.

ఆ తరువాత శ్రీ మోదీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన లబ్ధిదారుడు శ్రీ రోషన్ సాంభా పాటిల్‌తో సంభాషించారు. ఈ కార్డు తనకు ఎలా వచ్చింది, అది తనకు ఎలా సహాయపడింది, దాని వల్ల తనకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయో వివరించమని శ్రీ రోషన్‌ను ఆయన కోరారు. గ్రామంలో తనకు ఒక పెద్ద, పాత ఇల్లు ఉందని, దాని కోసం ఈ ఆస్తి కార్డు లభించడంతో దాని వల్ల 9 లక్షల రుణం పొందగలిగాననీ, దానిని తన ఇంటి పునర్నిర్మాణం కోసం అలాగే వ్యవసాయానికి సాగునీటి వసతిని మెరుగుపరచడానికి ఉపయోగించానని శ్రీ రోషన్ ప్రధానమంత్రికి వివరించారు. దీనివల్ల పంట దిగుబడితో పాటు తన ఆదాయం సైతం గణనీయంగా పెరిగిందన్న ఆయన, తన జీవితంపై SWAMITHVA  యోజన సానుకూల ప్రభావాన్ని సంతోషంగా తెలియజేశారు. స్వామిత్వ కార్డుతో రుణం పొందడంలో సౌలభ్యం గురించి ప్రధానమంత్రి అడిగినప్పుడు, గతంలో అనేక పత్రాలతో చాలా ఇబ్బందులు ఉండేవని, రుణం పొందడం చాలా కష్టమైన పనిగా ఉండేదని శ్రీ రోషన్ అన్నారు. ఇప్పుడు ఇతర పత్రాల అవసరం లేకుండా కేవలం స్వామిత్వ కార్డుతోనే రుణం పొందుతున్నామని తెలిపారు. స్వామిత్వ పథకం పట్ల శ్రీ మోదీకి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ రోషన్, తాను యేటా మూడు పంటలతో పాటు కూరగాయలు పండిస్తూ మంచి లాభం పొందుతున్నాని, సులభంగా రుణం చెల్లించగలుగుతున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఇతర పథకాల ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి అడిగినప్పుడు, శ్రీ రోషన్ తాను పీఎమ్ ఉజ్వల యోజన, పీఎమ్ సమ్మాన్ నిధి పథకం అలాగే పీఎమ్ పంట బీమా పథకాల లబ్ధిదారుగా ఉన్నానని చెప్పారు. తన గ్రామంలో చాలా మంది స్వామిత్వ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని అలాగే వారు సొంతంగా చిన్న వ్యాపారాలు, వ్యవసాయం చేసుకునేందుకు సులభంగా రుణాలు పొందుతున్నారని ఆయన వివరించారు. స్వామిత్వ యోజన ప్రజలకు ఇంతగా సహాయపడడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రుణం ద్వారా పొందిన డబ్బుతో ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకుంటున్నారని అలాగే వ్యవసాయం కోసం దానిని ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు. ప్రజలు ఇప్పుడు వారి వ్యక్తిగత, సామాజిక, జాతీయ శ్రేయస్సుపై దృష్టి పెట్టవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ చింతల నుంచి వారు విముక్తి పొందడం దేశానికి చాలా ప్రయోజనకరమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఒడిశాలోని రాయ్‌గఢ్‌కు చెందిన స్వామిత్వ లబ్ధిదారు శ్రీమతి గజేంద్ర సంగీతతో ప్రధానమంత్రి సంభాషిస్తూ, ఈ పథకానికి సంబంధించి అనుభవాన్ని పంచుకోవాలని ఆమెను కోరారు. గత 60 ఏళ్లుగా సరైన పత్రాలు లేక చాలా ఇబ్బందిపడ్డామని, ఇప్పుడు ఆ పరిస్థితిలో పెద్ద మార్పు వచ్చిందని, స్వామిత్వ కార్డులతో తమ విశ్వాసం పెరిగిందని ఆమె సంతోషంగా చెప్పారు. రుణం తీసుకొని తన దర్జీ వ్యాపారాన్ని విస్తరించాలని కోరుకుంటున్నట్లు చెప్పిన ఆమె, ఈ సందర్భంగా ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తన ఉపాధి మార్గాన్ని, ఇంటిని విస్తరించుకుంటున్న ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామిత్వ యోజన ఆస్తి పత్రాలను అందించడం ద్వారా ప్రజలకు ఒక పెద్ద ఇబ్బంది నుంచి విముక్తి లభించినట్లయిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆమె స్వయం సహాయక బృందం (SHG)లో కూడా సభ్యురాలిగా ఉన్నారని తెలుసుకున్న ప్రధానమంత్రి, తమ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు మద్దతు కొనసాగిస్తున్నదని తెలిపారు. స్వామిత్వ యోజన మొత్తం గ్రామాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం జమ్మూ కాశ్మీర్‌లోని సాంభాకు చెందిన లబ్ధిదారుడు శ్రీ వరీందర్ కుమార్‌తో ప్రధానమంత్రి సంభాషించారు. ఈ పథకం గురించి అనుభవాన్ని చెప్పాలని ప్రధానమంత్రి అడిగినప్పుడు, తాను ఒక రైతునని, తానూ అలాగే తన కుటుంబం ఆస్తి కార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు. అనేక తరాలుగా తమ భూమిలో నివసిస్తున్నా ఆస్తి పత్రాలు లేక ఇబ్బందిపడిన తాము, ఇప్పుడు తమ ఆస్తి పత్రాలు తాము కలిగి ఉండటం గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. 100 సంవత్సరాలకు పైగా గ్రామంలో నివసిస్తున్నా తన గ్రామంలో ఎవరికీ ఎటువంటి పత్రాలు  లేవని, ఈ పథకం కింద తమకు ఆస్తి పత్రాలు అందించినందుకు ప్రధానమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు వచ్చిన ఆస్తి కార్డు తన భూ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సహాయపడిందని, ఇప్పుడు తాను భూమిని తనఖా పెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చని, ఇది ఇంటి మరమ్మతులకు అలాగే తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. స్వామిత్వ యోజన ద్వారా కలిగిన సానుకూల మార్పుల గురించి విచారించినప్పుడు, తన గ్రామానికి వచ్చిన ఆస్తి కార్డుల ద్వారా అందరూ స్పష్టమైన యాజమాన్య హక్కులు పొందారని అలాగే భూమి, ఆస్తి సంబంధమైన అనేక వివాదాలు చాలా వరకు పరిష్కారమైనట్లు ఆయన వివరించారు. అందువల్ల, గ్రామస్తులు రుణాలు తీసుకోవడానికి తమ భూమిని, ఆస్తులను తాకట్టు పెట్టుకోగలుగుతున్నారని ఆయన అన్నారు. గ్రామస్తుల తరపున ప్రధానమంత్రికి ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. లబ్దిదారులతో మాట్లాడటం ఆనందం కలిగించిందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్వమిత్వ యోజన కార్డును ప్రజలు కేవలం ఒక పత్రంగా పరిగణించడమే కాకుండా, దానిని పురోగతికి మార్గంగా కూడా ఉపయోగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. స్వమిత్వ కార్యక్రమం వారి అభివృద్ధికి మార్గం సుగమం చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు.

 

********

MJPS/SR