ప్రధానమంత్రి: ఆఁ, అయితే మీకు ఇల్లు దొరికిందన్న మాటేగా?
లబ్ధిదారు: అవును సర్, దొరికింది. మీకు మేం చాలా కృతజ్ఞులమై ఉంటాం. గుడిసెలో నుంచి మంచి చోటుకు మమ్మల్ని తీసుకువచ్చారు మీరు. ఇంత మంచి చోటు దొరుకుతుందని మేం ఎన్నడూ అనుకోలేదు, మా కలను మీరు నిజం చేశారు.. అవును, సర్.
ప్రధానమంత్రి: మంచిది, ఇది నాదేమీ కాదు, మీకు ఇల్లు దొరికినందుకు నేను సంతోషిస్తున్నాను.
లబ్ధిదారు: అలా కాదు సర్, మేం మీ కుటుంబ సభ్యులం.
ప్రధానమంత్రి: ఆ మాటయితే నిజం.
లబ్ధిదారు: మీరు దీన్ని సాధ్యం చేసి, చూపెట్టారు.
ప్రధానమంత్రి: మొత్తానికి, మేం చేశామన్నమాట. మేం చేశామా, లేదా?
లబ్ధిదారు: అవును, సర్. మీ జెండా ఎత్తున ఎగురుతూ ఉండాలి, మీరు గెలుస్తూనే ఉండాలి మరి.
ప్రధానమంత్రి: మా జెండాని ఎత్తున రెపరెపలాడుతూ ఉంచాలంటే, అందుకు సాయపడాల్సింది మీరే.
లబ్ధిదారు: మీ చేతిని కాస్త మా నెత్తిన ఉంచి (మమ్మల్ని) ఆశీర్వదించండి, సర్.
ప్రధానమంత్రి: నా తల్లులు, అక్కచెల్లెళ్లు.. మీ చేతుల్ని నా తలమీద ఉంచాలని నేను కోరుతున్నా.
లబ్ధిదారు: భగవాన్ రాముని కోసం మేం చాలా ఏళ్లు వేచి ఉన్నాం, అలాగే, మీ కోసం కూడా మేం ఎదురుచూశాం. మురికివాడల్లో నుంచి ఇక్కడికి, ఈ భవనంలోకి వచ్చాం, మరేదీ మాకు ఇంతకన్నా ఎక్కువ ఆనందాన్నివ్వదు. మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం మేం చేసుకొన్న అదృష్టం.
ప్రధానమంత్రి: మిగతా వాళ్లు కూడా ఇది నమ్మాలి, కలిసికట్టుగా మనముంటే, ఈ దేశంలో ఎంతో సాధించగలం అని.
లబ్ధిదారు: అది నిజమేనండీ.
ప్రధానమంత్రి: మీరు పూనుకొన్నారా అంటే దేన్నైనా సరే సాధించగలుగుతారు. చూడండీ, ఈ కాలంలో, కొందరు అనుకుంటారు, ‘‘నేను మురికివాడలో పుట్టాను, జీవితంలో నేను సాధించేది ఏముంటుంది?’’ అని. అయితే మీరు ఇది స్వయంగా చూశారు, మరి మీ పిల్లలు కూడా దీన్ని చూస్తారు – ఆటపాటల్లో రాణిస్తూ, ప్రపంచమంతటా పేరుప్రతిష్టల్ని తెచ్చుకొంటున్న వాళ్లలో చాలా మంది పేద కుటుంబాల్లో నుంచే వచ్చారు అన్న సంగతిని.
ప్రధానమంత్రి: సరే, మీరు మీ కొత్త ఇంట్లో ఏం చేయబోతున్నారు?
లబ్ధిదారు: సర్, నేను చదువుకుంటాను.
ప్రధానమంత్రి: ఆహా, మీరు చదువుకుంటారన్నమాట.
లబ్ధిదారు: అవునండీ.
ప్రధానమంత్రి: అలాగయితే, ఇంతకు ముందు ఎందుకని చదువుకోలేదు?
లబ్ధిదారు: అది కాదు, సర్. ఇక్కడికి వచ్చాక, నేను మరింత చక్కగా చదువుకుంటాను.
ప్రధానమంత్రి: నిజంగానా? మరి మీ మనసులో ఏమాలోచిస్తున్నారు? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు?
లబ్ధిదారు: మేడమ్.
ప్రధానమంత్రి: ‘‘మేడమ్’’ అవ్వాలనుందా? అంటే టీచరుగా కావాలని కోరుకుంటున్నారన్న మాట మీరు.
ప్రధానమంత్రి: మరి మీరో..?
లబ్ధిదారు: నేను సైనిక్‌నవుతాను.
ప్రధానమంత్రి: జవానా?
లబ్ధిదారు: అవును.
‘హమ్ భారత్ కే వీర్ జవాన్ ఊంచీ రహే హమారే శాన్ హమ్‌కో ప్యారా హిందుస్తాన్ గాయేఁ దేశ్ ప్రేం కే గాన్ హమేఁ తిరంగే పర్ అనుమాన్ అమర్ జవాన్ ఇస్ పర్ తన్- మన్-ధన్ కుర్‌బాన్..’
(ఈ హిందీ మాటలకు.. మేం భారత వీర జవాన్లం, మన ఖ్యాతి ఉవ్వెత్తుకు ఎగబాకాలి, మాకు హిందుస్తాన్ అంటే ప్రియం, దేశ ప్రేమ పాటల్ని పాడుతాం, మేం అమర జవాన్ల ఉత్సాహాన్ని గౌరవిస్తాం, మేం దేశం కోసం తనువును, మనసును, ధనాన్ని త్యజించడానికి సిద్ధం.. అని భావం.)
ప్రధానమంత్రి: మరి, మీ స్నేహితులంతా ఇక్కడున్నారా? వారిలో ఎవరినైనా మిస్సవుతున్నారా, లేక మీరు మీ పాత స్నేహితుల్ని మళ్లీమళ్లీ కలుస్తూ ఉంటారా?
లబ్ధిదారులు: వాళ్లు అదుగో సర్. వీళ్లు, వీళ్లు కూడాను.
ప్రధానమంత్రి: ఓ, వీళ్లంతా నీ పాత దోస్తులన్నమాట.
లబ్ధిదారు: అవును, సర్.
ప్రధానమంత్రి: మరి వాళ్లు కూడా ఇక్కడికి వస్తున్నారా?
లబ్ధిదారు: అవును, సర్.
ప్రధానమంత్రి: ఇప్పుడు ఈ ఇల్లు మీకు దక్కింది కదా, మరి మీకు ఏమనిపిస్తోంది?
లబ్ధిదారు: నాకు చాలా బాగా అనిపిస్తోంది, సర్. నేను ఒక మురికివాడలో నుంచి ఈ ఇంటికి వచ్చాను, ఇది ఎంత బావుందో.
ప్రధానమంత్రి: కానీ ఇప్పుడు, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి చాలా మంది అతిథులు వస్తారుగా ఇక్కడికి? మీకు ఖర్చులు పెరిగిపోవూ?
లబ్ధిదారు: అలా ఎవరూ లేరు, సర్.
ప్రధానమంత్రి: మీరు ఈ ఇంటిని కూడా స్వచ్ఛంగా అట్టిపెడతారా?
లబ్ధిదారు: అవును, సర్. దీనిని చక్కగా చూసుకొంటాం.
ప్రధానమంత్రి: మీకు ఆటమైదానం కూడా అందుబాటులోకి వస్తుంది కదూ.
లబ్ధిదారు: అవును, సర్.
ప్రధానమంత్రి: మరక్కడ మీరేం చేస్తారు?
లబ్ధిదారు: నేను ఆడుకుంటాను.
ప్రధానమంత్రి: మీరు ఆడతారా? అయితే అప్పుడు, చదివేదెవరు?
లబ్ధిదారు: చదువుకుంటా కూడా, సర్.
ప్రధానమంత్రి: మీలో ఎంతమంది ఉత్తర్‌ప్రదేశ్ వాళ్లున్నారు? బిహార్ వాళ్లు ఎంతమందున్నారు? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు?
లబ్ధిదారు: నేను బిహార్ ప్రాంతాన్నుంచి వచ్చాను, సర్.
ప్రధానమంత్రి: అలాగా. మీరు ఏం పని చేస్తారు?, మురికివాడల్లో ఉండే వారు, వాళ్లు చేసే పనులు.. ఏమేమిటి?
లబ్ధిదారు: సర్, మాలో చాలా మందిమి శ్రామికులం.
ప్రధానమంత్రి: శ్రామికులూ, ఆటో రిక్షా డ్రైవర్లూనా?
లబ్ధిదారు: అవును, సర్. మాలో కొంత మందిమి రాత్రిపూట అంగళ్లలో కూడా పనిచేస్తాం.
ప్రధానమంత్రి: మండీలలో పనిచేసే వారు, ఛఠ్ పూజ కాలంలో ఏం చేస్తారు?, ఈ యమున నదినేమో ఈ స్థితికి తెచ్చేశారు!.
లబ్ధిదారు: మేం ఇక్కడే పూజ చేస్తాం, సర్.
ప్రధానమంత్రి: ఓహ్, ఇక్కడా మీరు పూజ చేసుకొనేది? అరె, రె, రే. అంటే మీకు యమున జీ తో ప్రయోజనం ఉండట్లేదనుకుంటా?
లబ్ధిదారు: లేదు, సర్.
ప్రధానమంత్రి: అలాంటప్పుడు, ఇక్కడ మీరు ఏంచేస్తారు? మీరు పండుగలు కలిసికట్టుగా చేసుకొంటారా?
లబ్ధిదారు: అవును, సర్.
ప్రధానమంత్రి: మకర సంక్రాంతిని ఇక్కడ చేసుకొంటారా మీరు?
లబ్ధిదారు: అవును, సర్.
ప్రధానమంత్రి: ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ స్వాభిమాన్ (ఆత్మగౌరవ) గృహాల్ని వారి కళ్లారా చూడడానికి, మీరు ఏం చేయబోతున్నారు?
లబ్ధిదారు: మేం ప్రతి ఒక్కరికీ ఎల్లవేళలా మనసారా స్వాగతం పలుకుతాం. వారికి అతిథి మర్యాదల్లో లోటు రానివ్వం. ఎవ్వరిమీదా ద్వేషభావం మాకుండదు, అందరి పైనా మేం ప్రేమాదరాలను చూపిస్తూ బతుకుతాం.
ప్రధానమంత్రి: మీరందరూ కలిసి. పండుగలను చేసుకొంటూ ఉండాలి. చూడండి, ప్రతి ఒక్కరికి మీరు ఏం చెబుతారంటే – మోదీ గారు వచ్చారు, ఇళ్ల కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్న వారు కూడా వాటిని అందుకొంటారని ఆయన హామీని ఇచ్చారూ అని- చెప్పండి. ఈ దేశంలో నిరుపేద వ్యక్తి సైతం తల దాచుకోవడానికొక పక్కా ఆశ్రయాన్ని పొందేటట్టుగా చేయాలి అని మేం నిర్ణయించుకొన్నాం.
గమనిక: ఇది ప్రధానమంత్రి ప్రసంగానికి దగ్గరి అనువాదం. ఆయన హిందీలో మాట్లాడారు.
***