Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ – టెలిక‌మ్ సెక్ట‌ర్ లో విప్ల‌వాత్మ‌క‌మైన‌ సంస్క‌ర‌ణ


స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ మార్గ‌ద‌ర్శకాల‌పై టెలిక‌మ్యూనికేష‌న్స్ డిపార్ట్ మెంట్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్‌పై టెలిక‌మ్ రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా చేసిన సూచ‌న‌ల ఆధారంగా టెలికమ్యూనికేష‌న్స్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రతిపాద‌న‌ను రూపొందించింది. గ‌తంలో స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్‌పై తీసుకున్న నిర్ణ‌యాల‌తోపాటుగా ఈ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌లులోకి వ‌స్తాయి. వీటి వ‌ల్ల టెలిక‌మ్యూనికేష‌న్స్ రంగంలో స్పెక్ట్ర‌మ్ వినియోగం పూర్తిగా కొత్త రూపును సంత‌రించుకోనున్న‌ది.

స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ విధివిధానాల్లోని ముఖ్య‌మైన అంశాలు

1. ఇద్ద‌రు యాక్సెస్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల మ‌ధ్య మాత్ర‌మే స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ ను అనుమ‌తిస్తారు. స్పెక్ట్ర‌మ్ వినియోగ హ‌క్కు విష‌యంలో అమ్మేవాళ్లు, కొనేవాళ్ల మ‌ధ్య‌న పార‌ద‌ర్శ‌క‌మైన బ‌ద‌లాయింపు ఉంటేనే ట్రేడింగుకు అనుమ‌తిస్తారు.

2. స్పెక్ట్ర‌మ్ బ్లాక్ ట్రేడింగ్ లో వ‌ర్తించిన‌ట్టుగానే స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ తో స్పెక్ట్ర‌మ్ అసైన్‌మెంట్ వాలిడిటీ పీరియ‌డ్ మార‌దు.

3. స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ కు సంబంధించి ఒప్పందం చేసుకునే ముందు అమ్మేవాళ్లు త‌మ బ‌కాయిల‌ను చెల్లించాలి. ఈ ఒప్పందం త‌ర్వాత స్పెక్ట్ర‌మ్ బ‌ద‌లాయింపు జ‌రిగే తేదీ వ‌రకు ఏవైనా బ‌కాయిలుంటే వాటిని స్పెక్ట్ర‌మ్ ను కొనేవాళ్లు చెల్లించాల్సి ఉంటుంది. స్పెక్ట్ర‌మ్ బ‌ద‌లాయింపు జ‌రిగే తేదీలోపు ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన డ‌బ్బు ఏదైనా ఉంటే దాన్ని ప్ర‌భుత్వం త‌న విచ‌క్ష‌ణాధికారం ప్ర‌కారం వ‌సూలు చేస్తుంది. స్పెక్ట్ర‌మ్ బ‌ద‌లాయింపు తేదీ వ‌ర‌కు ఈ డ‌బ్బుగురించి అమ్మేవాళ్ల‌కు, కొనేవాళ్ల‌కు తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఈ పని చేస్తుంది. ఈ డ‌బ్బును స్పెక్ట్ర‌మ్‌ను అమ్మేవాళ్ల ద‌గ్గ‌రు నుంచి, కొనేవాళ్ల ద‌గ్గ‌ర నుంచి ఉమ్మ‌డిగాగానీ, విడిగాగానీ వ‌సూలు చేసే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఉంటుంది.

4. స్పెక్ట్ర‌మ్ లైసెన్స్ క‌లిగిన‌వాళ్లు నియ‌మ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించార‌నే విష‌యం తేలితే వారు త‌మ స్పెక్ట్ర‌మ్‌ను అమ్ముకోవ‌డానికి వీలుండ‌దు. వారి లైసెన్స్‌ను ర‌ద్దుచేయ‌డం జ‌రుగుతుంది.

5. లైసెన్స్ డ్ స‌ర్వీస్ ఏరియా (ఎల్ ఎస్ ఏ) ఆధారంగానే స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ చేయ‌డానికి అనుమ‌తినిస్తారు. అమ్మేవారి ద‌గ్గ‌ర ఉన్న స్పెక్ట్ర‌మ్‌కు సంబంధించి దాని ఎల్.ఎస్. ఏ.లో కొంత భాగం మాత్రమే వారు వినియోగించాల‌నే నిబంధ‌న ఉంటే ఆ స్పెక్ట్ర‌మ్‌ను అమ్మిన త‌ర్వాత కొన్న‌వాళ్ల‌కు అవే హ‌క్కులు, బాధ్య‌త‌లు బ‌ద‌లాయించ‌డం జ‌రుగుతుంది. స్పెక్ట్ర‌మ్ అసైన్‌మెంట్ స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తులు కోరుతూ విడుద‌ల చేసిన నోటీసులో ఉన్న ప్రొవిజ‌న్లు స్పెక్ట్ర‌మ్‌ను కొనేవారికి కూడా వ‌ర్తిస్తాయి.

6. యాక్సెస్ స‌ర్వీసులందించ‌డానికిగాను లైసెన్స‌ర్ ఉద్దేశించిన స్పెక్ట్ర‌మ్ బ్యాండ్లన్నీ క్ర‌య‌విక్ర‌యాల స్పెక్ట్ర‌మ్ బ్యాండ్లే.

7. నిర్దేశించిన బ్యాండ్ల‌లోని స్పెక్ట్ర‌మ్‌ను మాత్ర‌మే ట్రేడ్ చేయాలి. 2010లోను ఆ త‌ర్వాత వేలం ద్వారా కేటాయించిన‌దై ఉండాలి. లేదా మార్కెట్ విలువ ప్ర‌కారం ప్ర‌భుత్వానికి చెల్లింపులు చేసిన‌ టెలీక‌మ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ద‌గ్గ‌ర గ‌ల స్పెక్ట్ర‌మ్ అయి ఉండాలి. 2013 మార్చి నెల‌లో జ‌రిగిన వేలంలో కేటాయించిన 800 ఎంహెచ్‌జెడ్ లోని స్పెక్ట్ర‌మ్ ట్రేడ్‌ను అనుమ‌తించాలంటే తాజా వేలంలోని ధ‌ర‌కు 2013 మార్చి వేలం ధ‌ర‌కు మ‌ధ్య‌గ‌ల తేడాను లెక్కించి బ్యాలెన్స్‌ను ప్ర‌భుత్వానికి చెల్లించాలి. స్పెక్ట్ర‌మ్‌ను కొనేవారు దాన్ని ఉప‌యోగించుకునే హ‌క్కువారికి వ‌చ్చే లోపు ఉన్న స‌మ‌యాన్ని లెక్క‌లోకి తీసుకొని ప్రో రాటా ఆధారంగా ఈ చెల్లింపును లెక్కిస్తారు. దీన్ని స్పెక్ట్ర‌మ్‌ను అమ్మేవాళ్లు ప్ర‌భుత్వానికి చెల్లిస్తేనే స్పెక్ట్ర‌మ్ ట్రేడ్‌కు వీలుంటుంది.

8. 800 ఎంహెచ్ జెడ్ 1800 ఎంహెచ్ జెడ్ లోని స్పెక్ట్ర‌మ్ ను కొనుగోలు చేయాల‌నుకునే వారు కింది విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌చ్చు. కొత్త‌గా కొన్న స్పెక్ట్ర‌మ్ ను ఏదైనా సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి ఇది వ‌ర‌కే త‌మ ద‌గ్గ‌ర‌గ‌ల స్పెక్ట్ర‌మ్ కు క‌లుపుకోవ‌చ్చు. త‌ద్వారా వారు మొత్తం స్పెక్ట్రాన్ని స‌ర‌ళీక‌రించిన స్పెక్ట్ర‌మ్‌గా ఆ బ్యాండ్‌లో మార్చుకోవచ్చు. అయితే ఇదంతా అప్ప‌టికిగ‌ల నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే చేయాలి.

9. మార్గ‌ద‌ర్శ‌కాల‌లో ప్ర‌త్యేకంగా సూచించ‌క‌పోతే…స్పెక్ట్ర‌మ్ బ‌ద‌లాయింపు త‌ర్వాత కూడా గ‌తంలో ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తూ ఇచ్చిన నోటీసులోవి, వాటికి త‌ర్వాత వ‌చ్చి చేరిన‌ ప్రొవిజ‌న్లు అమ‌ల‌వుతాయి.

10. ఒక బ్యాండులోని స్పెక్ట్ర‌మ్‌లో కొంత వ‌ర‌కు మాత్ర‌మే టెలిక‌మ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ అమ్మాల‌నుకుంటే ఈ కింది విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ప్రొవైడర్ త‌న స్పెక్ట్ర‌మ్‌ను వేలంలో కొని ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన సొమ్మును త‌ర్వాత చెల్లించాల్సివ‌చ్చిన‌ప్పుడు… త‌న స్పెక్ట్ర‌మ్ లోని కొంత భాగాన్ని అమ్ముతుంటే కొనేవాళ్ల,అమ్మేవాళ్ల ద‌గ్గ‌ర గ‌ల స్పెక్ట్ర‌మ్ ప‌రిమాణాన్ని బ‌ట్టి వారి ద‌గ్గ‌ర అది ఉన్న కాలం ఆధారంగా ఇరువురికీ ధ‌ర‌ను పంచ‌డం జ‌రుగుతుంది.

11. స్పెక్ట్ర‌మ్‌ను కొనుగోలు చేసేవాళ్లు నిర్దేశించిన స్పెక్ట్ర‌మ్ క్యాప్స్ ప్ర‌కారం న‌డుచుకోవాలి. ట్రేడింగ్ ద్వారా పొందిన స్పెక్ట్రం విష‌యంలో దాని క్యాప్‌ను లెక్కించ‌డానికి అమ్మిన‌వారి ద‌గ్గ‌ర‌గ‌ల స్పెక్ట్రాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంది.

12. అమ్మేవాళ్లు స్పెక్ట్ర‌మ్ వినియోగ ఛార్జీల‌ను, తాము ప్ర‌భుత్వానికి చెల్లించాల్సిన వాయిదాల‌ను (వేలంలో కొన్న‌ప్పుడు ధ‌ర చెల్లించ‌డానికి వాయిదా కోరి ఉంటే) ట్రేడ్ జ‌రిగేలోపు చెల్లించాలి.

13. బ‌ద‌లాయించాల్సిన స్పెక్ట్ర‌మ్‌కు సంబంధించిన వివాదాలేమైనా కోర్టులో ఉంటే హ‌క్కుల‌తోపాటు వాటిని కూడా స్పెక్ట్ర‌మ్‌ను కొనేవాళ్ల‌కు బ‌దలాయింపు జ‌రిగేలా అమ్మేవాళ్లు జాగ్ర‌త్త తీసుకోవాలి. ఇది చ‌ట్ట‌ప‌రిధిలో మాత్ర‌మే ఉండాలి. లైసెన్స్ ఇచ్చిన వాళ్లకు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గకుండా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఇలాంటి బ‌ద‌లాయింపు జ‌ర‌గాలి.

14. వేలంలో స్పెక్ట్ర‌మ్‌ను పొందిన టెలిక‌మ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ దాన్ని అమ్ముకోవాలంటే రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత‌ మాత్ర‌మే ఆ ప‌ని చేయాలి. ఇదే నియ‌మం ట్రేడింగ్ ద్వారా కొన్న స్పెక్ట్రానికీ, అడ్మినిస్ట్రేటివ్ స్పెక్ట్రానికీ కూడా వ‌ర్తిస్తుంది. అడ్మ‌నిస్ట్రేటివ్ స్పెక్ట్రాన్ని అమ్ముకోవాలంటే దానికి చెల్లించిన మార్కెట్ వాల్యూ చెల్లించిన త‌ర్వాతనే సాధ్య‌మ‌వుతుంది. ఈ స్పెక్ట్రాన్ని కేటాయించిన తేదీనుంచి రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత మాత్ర‌మే దాన్ని అమ్ముకోవ‌డానికి వీల‌వుతుంది.

15. ట్రేడింగులో స్పెక్ట్రాన్ని కొన్న‌వాళ్లు అమ్మిన‌వాళ్ల‌కు చెల్లించిన ధ‌ర‌నుగానీ, అప్ప‌టికి నిర్దేశించిన మార్కెట్ విలునుగానీ ఏది ఎక్కువైతే దాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ దానిపైన ఒక శాతం ట్రాన్స్‌ఫ‌ర్ ఫీజును ప్ర‌భుత్వం వ‌సూలు చేస్తుంది. దీన్ని తిరిగివ్వ‌డం కుద‌రదు. ట్రేడ్ స‌ర్వీసులో భాగంగా ప్ర‌భుత్వం ఈ ఫీజును తీసుకుంటుంది. ట్రాన్స్‌ఫ‌ర్ ఫీజును స్పెక్ట్ర‌మ్‌ను అమ్మేవాళ్లు చెల్లించాలి.

16. స్పెక్ట్ర‌మ్‌ను క‌లిగిన‌వాళ్లు త‌మ ఫ్రీక్వెన్సీని ఒక‌రికొకరు ఇచ్చిపుచ్చుకోవ‌డం, లేదా దానిలో మార్పులు చేర్పులు చేసుకోవ‌డం ట్రేడింగ్ కింద‌కు రాదు. ఫ్రీక్వెన్సీ స్వాపింగ్‌, రీ కాన్ఫిగ‌రేష‌న్ అనేది మొద‌ట్లో ద‌ర‌ఖాస్తులు కోరుతు ఇచ్చిన నోటీసు ప్రొవిజ‌న్ల ప్ర‌కార‌మే జ‌ర‌గాలి.

17. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం నిర్దేశించిన స్పెక్ట్ర‌మ్ వినియోగ ఛార్జీలనే స్పెక్ట్ర‌మ్‌ను ట్రేడింగ్ ద్వారా కొన్న‌వాళ్లు కూడా చెల్లించాలి. ట్రేడింగ్ ద్వారా స్పెక్ట్ర‌మ్‌ను కొన్న‌వారు, వేలం ద్వారా స్పెక్ట్ర‌మ్‌ను కొన్న‌వారు ఇద్ద‌రినీ ప్ర‌భుత్వం ఒకే విధంగా ప‌రిగ‌ణిస్తుంది.

18. ట్రేడింగ్ జ‌ర‌గ‌డానికి 45 రోజుల ముందు స్పెక్ట్ర‌మ్‌ను కొనేవాళ్లు, అమ్మేవాళ్లు ఉమ్మ‌డిగా ప్రభుత్వానికి తెలియ‌జేయాలి. అమ్మేవాళ్లు, కొనేవాళ్లు ట్రేడింగ్‌కు సంబంధించిన అన్ని నియ‌మ నిబంధ‌న‌ల్ని అనుస‌రిస్తామ‌ని ప్ర‌మాణ‌పూర్వ‌కంగా తెలియ‌జేయాలి. ఈ విష‌యంలో ఏ విధ‌మైన అతిక్ర‌మ‌ణ‌లు జ‌రిగినా, ట్రేడింగ్ చేస్తామ‌ని ప్ర‌భుత్వానికి తెలియ‌జేసిన‌ప్పుడు లైసెన్సుదారుల్లో ఎవ‌రికైనా నియ‌మ‌నిబంధ‌న‌లు తెలియ‌క‌పోయినా దానిపైన త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి ప్ర‌భుత్వానికి హ‌క్కు ఉంటుంది. ఒప్పందాన్ని ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌వ‌చ్చు.

2013 డిసెంబ‌ర్ నెల‌లో అప్ప‌టి ప్ర‌భుత్వం చూఛాయ‌గా స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్‌కు అనుమ‌తివ్వాల‌ని నిర్ణ‌యించింది. అయితే మార్గ‌ద‌ర్శకాల‌ను రూపొందించ‌లేదు. దాంతో స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ విధానం అమ‌లు కాలేదు..

టెలిక‌మ్యూనికేష‌న్ల‌రంగంలో సర్వీస్ ప్రొవైడ‌ర్ల మ‌ధ్య‌న‌ మ‌రింత పోటీ నెల‌కొన‌డానికి అవ‌కాశ‌ముండ‌డంతో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం స్పెక్ట్రమ్ ట్రేడింగ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. దీనివ‌ల్ల ఈ రంగంలో కొత్త కొత్త మార్పులు, స‌రైన డాటా సేవ‌లు, కొత్త కొత్త సాంకేతిక‌త‌లు, త‌క్కువ ధ‌ర‌కే వినియోగ‌దారుల‌కు సేవ‌లందించ‌డం జ‌రుగుతుంది. వినియోగ‌దారుల ముందు ఛాయిస్ ఉంటుంది. భార‌త‌దేశంలో వ్యాపారం చేయ‌డం సులభ‌త‌ర‌మ‌వుతుంది. వ‌న‌రుల‌ను సమ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. డిజిట‌ల్ ఇండియా క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ మార్గ‌ద‌ర్శ‌కాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

నేప‌థ్యం

టెలిక‌మ్ సెక్ట‌ర్ విష‌యంలో ఇత‌ర దేశాలు అనుస‌రిస్తున్న విధానాల‌ను చూస్తే చాలా దేశాల్లో ఇది పూర్తిగా ప్ర‌భుత్వం చేతిలో ఉంది. స్పెక్ట్ర‌మ్ కేటాయింపుల విధానాన్ని అక్క‌డి ప్ర‌భుత్వాలే నిర్ణ‌యిస్తున్నాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా టెలిక‌మ్యూనికేష‌న్ సౌక‌ర్యాల క‌ల్ప‌నతో వ‌చ్చే ఉప‌యోగాలు పెరిగాయి. స్పెక్ట్ర‌మ్ డిమాండ్ గ‌ణ‌నీయంగా పెరుగుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో చూసిన‌ప్పుడు స్పెక్ట్ర‌మ్ కేటాయింపుల‌కుగాను ఇప్పుడున్న వ్య‌వ‌స్థ స‌మ‌ర్థ‌వంతంగా లేదు. మార్కెట్ డిమాండ్‌, ఆధునిక సాంకేతిక‌త‌ను అందుకోవ‌డానికిగాను లైసెన్సు క‌లిగిన స‌ర్వీసు ప్రొవైడ‌ర్లకు ప్లెక్సిబిలిటీ కావాలి. స్పెక్ట్రాన్ని నియంత్రించ‌డానికి గాను మ‌న దేశంలో కూడా కొత్త విధానం కావాలనే డిమాండ్ పెరుగుతూ వ‌చ్చింది. అది సులువుగా ఉంటూనే మార్కెట్ ప్ర‌కారం స‌మ‌ర్థ‌వంతంగా ఉంటూ స్పెక్ట్ర‌మ్ వినియోగంలో కొత్త కొత్త అవ‌కాశాల‌కు తెర‌లేపేలా ఉండాలి. అప్పుడే వినియోగ‌దారుల‌కు మేలైన సేవ‌లందించ‌గ‌లం.

భార‌త‌దేశంలో 20 సంవ‌త్స‌రాల‌కాలానికి స్పెక్ట్రాన్ని కేటాయిస్తారు. ఈ స‌మ‌యంలో కొంత‌మంది ఆప‌రేట‌ర్లు ఎక్కువ‌మంది వినియోగ‌దారుల‌ను సంపాదించుకొని వేగంగా అభివృద్ధ‌వుతుంటారు. మ‌రికొంత‌మంది పెద్ద‌గా అభివృద్ధి చెంద‌లేరు. ఈ ప‌రిస్థితిలో కొంత‌మంది ఆపరేట‌ర్లు స్పెక్ట్ర‌మ్ కొర‌త‌తో ఇబ్బందిప‌డుతుంటారు. మ‌రికొంత‌మంది ద‌గ్గ‌ర స్పెక్ట్ర‌మ్ పెద్ద‌గా వినియోగంలో లేకుండా ఉంటుంది. ఇత‌ర దేశాల‌తో పోల్చిన‌ప్పుడు భార‌త‌దేశంలో స్పెక్ట్ర‌మ్ ల‌భ్య‌త చాలా త‌క్కువ‌. కాబ‌ట్టి స్పెక్ట్ర‌మ్ ను పంచుకోవ‌డంగానీ, ట్రేడింగ్ చేయ‌డంగానీ ఇప్పుడు చాలా ముఖ్యం. అలా చేస్తేనే స్పెక్ట్ర‌మ్ కొర‌త‌తో వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. ఇలా చేస్తే టెలిక‌మ్యూనికేష‌న్ సేవ‌ల క్వాలిటీ పెరుగుతుంది. అంతే కాదు ఫోన్ల వినియోగ‌దారుల‌కు ఎలాంటి అడ్డంకులు ఉండ‌వు.

స్పెక్ట్ర‌మ్ ట్రేడింగ్ ద్వారా అమ్మేవాళ్లు కొనేవాళ్ల మ‌ధ్య‌న హ‌క్కులు, బాధ్య‌త‌ల బ‌ద‌లాయింపు సులువుగా జ‌రుగుతుంది. దీనివ‌ల్ల స్పెక్ట్ర‌మ్ వినియోగం స‌మ‌ర్థ‌వంతంగా జ‌రుగుతుంది. ఇంత‌కాలం నిరుప‌యోగం ఉన్న స్పెక్ట్ర‌మ్ అది అవ‌స‌ర‌మ‌య్యేవారికి వెంట‌నే అందుబాటులోకి వ‌స్తుంది. దీనివ‌ల్ల వినియోగ‌దారులు స‌రైన సేవ‌లు పొంది మ‌రింత‌గా సంతృప్తి చెందుతారు. స్పెక్ట్ర‌మ్ ను పొందిన స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ సేవ‌లు మెరుగ‌వుతాయి.