‘స్థిరాస్తి (క్రమబద్దీకరణ, అభివృధ్ధి) బిల్లు 2015’ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేదిగా, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పారదర్శకతను పెంపొందించేదిగా ఉండటంతో పాటు ప్రాజెక్టులు సరైన సమయంలో పూర్తయ్యేలా భరోసాను కూడా ఇస్తుంది. ఈ బిల్లు వల్ల రియల్ ఎస్టేట్ రంగం సమాంతర అభివృద్ధి, ఈ రంగంలో నెలకొన్న వివాదాల వేగవంతమైన పరిష్కారానికి ఏకీకృత నిబంధనల అమలుకు అనువైన వాతావరణం నిర్మితమవుతుంది. దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులు ఊపందుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అందరికీ ఇళ్లు’ పథకానికి ప్రైవేటు భాగస్వామ్యం పెరగటానికి ఈ బిల్లు ఎంతగానో తోడ్పడుతుంది.‘రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ’ ద్వారా వినియోగదారులకు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలోనే ప్రమోటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అన్ని పత్రాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచటం ద్వారా వినియోగదారుల్లో ఈ రంగంపై నమ్మకం పెరిగేందుకు దోహదపడుతుంది. తద్వారా ఆర్థిక మార్కెట్లు, పెట్టుబడులు పెరిగేందుకు మార్గం సుగమం అవుతుంది. సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వహణ, నైపుణ్యం, ప్రమాణీకరమైన పనుల వల్ల రియల్ ఎస్టేట్ రంగం సమాంతరంగా అభివృద్ధి చెందటానికి ఈ బిల్లు తోడ్పడుతుంది.
ఈ బిల్లులోని విశేషాంశాలు కింది విధంగా ఉన్నాయి:
1. వాణిజ్య, గృహ సంబంధ ప్రాజెక్టులకు ఇది వర్తిస్తుంది.
2. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రంగంలోని లావాదేవీలను నియంత్రించేందుకు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు
3. అథారిటీతో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఏజెంట్ల రిజిస్ట్రేషన్
4. రిజిస్టర్ అయిన ప్రాజెక్టులు, ప్రమోటర్లు/రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వివరాలు, ప్రాజెక్టు లేఔట్ ప్లాన్, భూ స్థితి, ప్రభుత్వ ఆమోదం, ఒప్పందాలతోపాటు కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్టులు, నిర్మాణ ఇంజనీర్లు మొదలైన వివరాలు తప్పనిసరిగా వెల్లడి చేయవలసి ఉంటుంది.
5. ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తయ్యేందుకు వినియోగదారులు డిపాజిట్ చేసిన సొమ్ము వినియోగానికి ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటును తీసుకోవాలి. దీని ద్వారానే అన్ని నిర్మాణ పనులు జరగాలి.
6. అప్పిలేట్ ట్రైబ్యునళ్ల ఏర్పాటు, న్యాయ అధికారుల నియామకం ద్వారా స్థిరాస్తి రంగంలోని వివాదాలకు త్వరితగతిన పరిష్కారం.
7. స్థిరాస్తి వివాదాలను సివిల్ కోర్టుల పరిధి నుంచి తప్పించి.. వినియోగదారుల కోర్టు పరిధిలోకి తీసుకురావటం.
8. వినియోగదారుల అనుమతి లేకుండా ప్రమోటర్లు నిర్మాణం ప్లాన్లు, డిజైన్ మార్చరాదు.
9. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లులో మార్పులు చేసుకోవటం, రెగ్యులేటరీ అథారిటీ నిబంధనల్లో మార్పులు చేసుకోవచ్చు.