స్టార్టప్ ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ ఎఫ్ ఎస్) ఏర్పాటు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎస్ ఇ బి ఐ.. ‘సెబి’) వద్ద నమోదు అయిన వివిధ ఆల్టర్ నేటివ్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్స్ ఇందులో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా ఎఫ్ ఎఫ్ ఎస్ ను చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్ ఐ డి బి ఐ.. ‘సిడ్బి’) నిర్వహణలో ఉంచుతారు. దీని వల్ల స్టార్టప్ లకు నిధుల కొరత తీరుతుంది. 2016 జనవరిలో ప్రభుత్వం ఆవిష్కరించిన స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు.
ఈ నిధికి ప్రారంభ మూలధనం రూ.10,000 కోట్లు. 14వ,15వ ఆర్థిక సంఘాల కాలంలో ఈ నిధులను స్కీమ్ పురోగతి, ప్రభుత్వం వద్ద నిధుల లభ్యత ఆధారంగా అందజేస్తారు. ఎఫ్ ఎఫ్ ఎస్ మూలధనానికి ఇప్పటికే 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.600 కోట్లు అందజేశారు. ఈ నిధి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే సమయానికి 18 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించవచ్చని భావిస్తున్నారు.
స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళికను పర్యవేక్షించే పారిశ్రామిక విధానం, ప్రోత్సహక శాఖ (డి ఐ పి పి) బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఈ నిధికి అవసరం అయిన అదనపు వనరులను గ్రాంటుగా అందిస్తారు.
డి ఐ పి పి చేపట్టిన స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళిక నుంచి ఎఫ్ ఎఫ్ ఎస్ ఆవిర్బవించింది. దీని రోజువారీ నిర్వహణకు సిడ్బి నైపుణ్యాలను వినియోగించుకుంటారు. నిర్దిష్ట కాలపరిమితి, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా స్కీమ్ అమలు జరుగుతున్నదా లేదా అన్న అంశం ఆధారంగా స్కీమ్ పనితీరును పర్యవేక్షిస్తూ ఉంటారు.
ఈ నిధిలోకి రూ.60,000 కోట్ల మేరకు ఈక్విటీ నిధులు, అంతకు రెండు రెట్లు డెట్ నిధులు ఆకర్షించడానికి ఈ రూ.10,000 కోట్ల కేటాయింపు కీలక సాధనంగా నిలుస్తుంది. స్టార్టప్ పరిశ్రమలకు ఆధారనీయమైన నిధులు అందుబాటులో ఉంచడం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుంది.
పూర్వ రంగం:
దేశంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలంటే నవకల్పనల ఆధారిత పారిశ్రామిక కార్యకలాపాలను, వ్యాపారాలను ప్రోత్సహించడం, వేగం పెంచడం అవసరం. రానున్న పదేళ్ళ కాలంలో 2500 అధిక సామర్థ్యం గల వ్యాపారాల అభివృద్ధి సామర్థ్యం భారతదేశానికి ఉందని, అయితే ఇందుకోసం కనీసం 10,000 స్టార్టప్ లను ప్రోత్సహించాల్సి ఉంటుందని వెంచర్ కాపిటల్ నిపుణుల సంఘమొకటి సిఫారసు చేసింది.
రిస్క్ కేపిటల్ తగినంతగా అందుబాటులో లేకపోవడం, సాంప్రదాయక బ్యాంక్ ఫైనాన్స్ అందడంలోని అవరోధాలు, చేయిపట్టి ముందుకు నడిపే విశ్వసనీయ సంస్థలు లేకపోవడం వంటి ఎన్నో సవాళ్ళు దేశంలో స్టార్టప్ లు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు విజయవంతమైన స్టార్టప్ లకు వెంచర్ కేపిటల్ నిధులే ఆధారం అయ్యాయి. కాని ఈ వి సి సంస్థలన్నీ దేశం వెలుపలే ఉన్నాయి.
ఫండ్ ఆఫ్ ఫండ్స్ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. దీని వల్ల నవకల్పనలతో ముందుకు వస్తున్న స్టార్టప్ లకు ఆర్థిక సహాయం అందుబాటులోకి వచ్చి, అవి పూర్తి స్థాయి వ్యాపారాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడుతుంది. సీడ్ స్థాయి, ప్రారంభ స్థాయి, అభివృద్ధి స్థాయి అన్నింటికీ ఈ చర్య మద్దతుగా నిలుస్తుంది. ఒక ఇన్వెస్టర్ గా ఈ నిధిలో ప్రభుత్వం కూడా వాటాదారు కావడం వల్ల ప్రైవేటు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించి, వారు కూడా ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తారు. దీని వల్ల భారీ ఎత్తున నిధులను ప్రభుత్వం సమీకరించగలుగుతుంది.