సౌర ఇంధన సహకారంపై భారత్, జర్మనీల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం భారత్, జర్మనీల మధ్య 2015 అక్టోబరులో జరిగింది. సౌర ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకోవటం, సాంకేతికంగా, ఆర్థికంగా సాయం అందించటం ద్వారా భారత్లో సౌర ఇంధన వినియోగం పెరిగేలా చేయటం ఈ ఒప్పందం ఉద్దేశం. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతమవుతుంది. ఈ ఒప్పందం కింద వచ్చే ఐదేళ్ళలో జర్మనీ క్రెడిటాన్స్టాల్ట్ ఫర్ వైడరఫ్బా (కెఎఫ్డబ్ల్యూ) ద్వారా బిలియన్ యూరోల దాకా సులభరుణాలను ఇస్తుంది. ఈ కెఎఫ్డబ్ల్యూ నిధులను అంతిమ వినియోగదారులకు భాగస్వామ్య బ్యాంకుల ద్వారా సాఫ్ట్రుణాలుగా కూడా అందజేస్తారు.
ఈ ఒప్పందం ద్వారా సౌర పైకప్పుల రంగంలో సహకారం అందుతుంది. సౌర పార్కులు, సౌర మండలాలు (వీలైతే భారత్-జర్మనీ ఆర్థిక సహకారం కింద కెఎఫ్డబ్ల్యూ ద్వారా ఏర్పాటయ్యే గ్రీన్ ఎనర్జీ కారిడార్లకు దగ్గరగా) అభివృద్ధి జరుగుతుంది. స్వచ్ఛ, సుస్థిర ఇంధనం అందేలా సోలార్ ఆఫ్ గ్రిడ్ చర్యలు చేపడతారు.