స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్) సదస్సు-2025 మొదటి సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు, భవిష్యత్తులో నాయకులుగా ఎదగబోతున్న యువతకు శ్రీ మోదీ స్వాగతం పలికారు. కొన్ని కార్యక్రమాలు మనసుకు దగ్గరగా ఉంటాయని ఈ రోజు జరుగుతున్న సదస్సు కూడా అలాంటిదే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘దేశ నిర్మాణానికి మెరుగైన పౌరులను తయారు చేయడం, ప్రతి రంగంలోనూ అద్భుతమైన నాయకులను తీర్చిదిద్దడం అవసరం’’ అని ప్రధాని అన్నారు. ప్రతి రంగంలోనూ గొప్ప నాయకులను తయారుచేయడం ప్రస్తుతం చాలా అవసరమని ఆయన తెలిపారు. ఈ దిశగా సాగుతున్న వికసిత్ భారత్ అభివృద్ధి ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ను ఓ ముఖ్యమైన మైలురాయిగా వర్ణించారు. ఈ సంస్థ పేరుకి తగినట్టుగానే తనలో భారతీయ సామాజిక జీవన ఆత్మను నిలుపుకొని, దానిని కొనసాగిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అనుభవ సారాన్ని సోల్ అందంగా ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. సోల్ సంస్థకు సంబంధించిన అన్ని విభాగాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థకు భవిష్యత్తులో గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీలో విస్తృతమైన క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సోల్ ఈ రోజే మొదటి అడుగు వేసిందని ప్రధానమంత్రి అన్నారు. సంస్థల భవిష్యత్తును రూపొందించడంలో సోల్ పోషించే కీలక పాత్రను భారత్ గుర్తుంచుకోవాలని సూచించారు. స్వామి వివేకానంద సూక్తిని ఉటంకిస్తూ.. కేవలం 100 మంది ప్రభావవంతమైన, సమర్థవంతమైన నాయకులతో భారతదేశానికి బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, అభివృద్ధి చేయాలని ఎల్లప్పుడూ ఆయన భావించేవారని శ్రీ మోదీ పేర్కొన్నారు. అదే ఉత్సాహంతో దేశం ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. 21వ శతాబ్దపు వికసిత్ భారత్‌ను సాధించడానికి ప్రతి పౌరుడూ 24 గంటలూ పనిచేస్తున్నారని ప్రశంసించారు. 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో అన్ని రంగాల్లో సమర్థవంతమైన నాయకత్వం అవసరాన్ని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. రాజకీయాలతో సహా అన్ని రంగాలకూ అవసరమైన నాయకులను తయారు చేసి స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ తనదైన ముద్ర వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ దేశాభివృద్ధిలో అయినా మానవ వనరులు, సహజ వనరులు పోషించే పాత్రను ప్రధానమంత్రి వివరించారు. సహజ వనరులు లేకపోయినప్పటికీ కేవలం మానవ వనరులపై ఆధారపడి గుజరాత్ అగ్ర రాష్ట్రంగా అభివృద్ధి చెందిన విధానాన్ని వివరించారు. ‘‘మానవ వనరులకు గొప్ప సామర్థ్యం ఉంది’’ అని పీఎం అన్నారు. ఆవిష్కరణలకు సారథ్యం వహించి, నైపుణ్యాలను వ్యవస్థీకృతం చేయగల నాయకత్వ వనరులను 21 వ శతాబ్దం కోరుకుంటోందని తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యాలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. శాస్త్రీయమైన, నిర్మాణాత్మక పద్ధతిలో కొత్త నైపుణ్యాలను స్వీకరించేందుకు గాను నాయకత్వ పటిమను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను శ్రీ మోదీ వివరించారు. ఈ ప్రక్రియలో సోల్ తరహా సంస్థలు పోషించే గణనీయమైన పాత్రను ప్రధాని వివరిస్తూ.. ఇప్పటికే ఈ దిశలో పని ప్రారంభమైందని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో అమల్లోకి వచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు రాష్ట్రాలకు చెందిన విద్యా కార్యదర్శులు, ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇతర అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. వీటికి అదనంగా గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి నాయకత్వ అభివృద్ధి శిక్షణ క్యాంపు సైతం నిర్వహించామని తెలిపారు. ఇది ఆరంభం మాత్రమే అన్న ప్రధాని, నాయకత్వ అభివృద్ధిలో అంతర్జాతీయ స్థాయి సంస్థగా ఎదగడమే లక్ష్యంగా సోల్ నిర్దేశించుకోవాలని సూచించారు.
‘‘ప్రస్తుతం భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది’’ అని ప్రధాని అన్నారు. అన్ని రంగాల్లోనూ ఈ వేగం ప్రతిఫలించాలంటే.. ప్రపంచ స్థాయి నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. సోల్ లాంటి నాయకత్వ నిర్మాణ సంస్థలు మార్పులకు నాంది పలుకుతాయని అన్నారు. ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు ఐచ్ఛికం కాదని, అవి అవసరం అని పేర్కొన్నారు. ‘‘అంతర్జాతీయ వేదికలపై జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూనే ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు వెతికే ఉత్సాహవంతులైన నాయకుల అవసరం ప్రతి రంగంలోనూ ఉంది’’ అని శ్రీమోదీ వెల్లడించారు. ఈ నాయకులు అంతర్జాతీయ విధానాలను అనుసరిస్తూనే ప్రాంతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. భారతీయ, అంతర్జాతీయ భావనలు రెండింటినీ అర్థం చేసుకోగలిగి, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి, సంక్షోభాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్న, ముందుచూపు కలిగిన వ్యక్తులను తయారుచేయాల్సిన ఆవశ్యకత గురించి ఆయన వివరించారు. ప్రపంచ స్థాయి మార్కెట్లు, సంస్థలతో పోటీ పడేందుకు అంతర్జాతీయ వ్యాపార విధానాలను అర్థం చేసుకోగలిగిన నాయకులు కావాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాంటి పెద్ద అంచనాలు ఉన్న నాయకులను ఎక్కువ మొత్తంలో తయారు చేయడంలో సోల్ సంస్థ పోషించాల్సిన పాత్ర గురించి వివరించారు.
భవిష్యత్తులో నాయకత్వం అంటే అధికారానికి మాత్రమే పరిమితం కాబోదన్న ప్రధాని, నాయకత్వ పాత్రను పోషించాలంటే ఆవిష్కరణలు చేపట్టగల, ప్రభావం చూపగలిగే సామర్థ్యాలు ఉండాలని తెలిపారు. అవసరానికి తగినట్టుగా దేశంలో వ్యక్తులు మారాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. విమర్శనాత్మక ఆలోచనను, సాహసాన్ని, పరిష్కారాన్ని వెతికే మనస్తత్వాన్ని సోల్ పెంపొందిస్తుందని తెలియజేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని ఈ సంస్థ తయారు చేయగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
నూతన ధోరణులు అనుసరించే వారికంటే వాటిని సృష్టించగలిగే నాయకులను తయారు చేయాల్సిన అవసరం గురించి ప్రధానమంత్రి వివరించారు. దౌత్యం నుంచి సాంకేతికత ఆవిష్కరణల వరకు వివిధ రంగాల్లో కొత్త నాయకులను తయారుచేయడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధాని తెలిపారు. దీని ప్రభావం అన్ని రంగాల్లోనూ సానుకూలంగా పెరుగుతోందని ఆయన అన్నారు. భారత్ లక్ష్యం, భవిష్యత్తు బలమైన నాయకత్వం పైనే ఆధారపడి ఉన్నాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆలోచనా విధానం, స్థానిక అభివృద్ధిని మేళవించి ముందుకు సాగాల్సిన ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. పరిపాలన, విధాన నిర్ణయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. విధాన రూపకర్తలు, ఉన్నతాధికారులు, ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలు విధానాలను రూపొందించడంలో ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను పొందుపరిచినప్పుడే అది సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ అంశంలో సోల్ లాంటి సంస్థలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.
వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం అన్ని రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి అవసరమని, గొప్పవారి అడుగుజాడల్లో నడవడం ఆ లక్షాన్ని చేరుకునేందుకు సహాయపడుతుందంటూ పురాణ శాస్త్రాల్లోని వాక్యాలను ఉటంకించారు. జాతీయ లక్ష్యాలకు అనుగుణమైన నాయకత్వం ఎంతో అవసరమని శ్రీ మోదీ అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం అవసరమైన స్ఫూర్తిని, శక్తిని అందించే లక్ష్యంతో సోల్ సంస్థ పనిచేయాలని పిలుపునిచ్చారు. బలమైన నాయకత్వం ఏర్పడితే, లక్ష్యానికి తగిన మార్పులు, సంస్కరణలు సహజంగానే సమకూరుతాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజాపాలన విధానాలు, సాంఘిక రంగాల బలోపేతం అవసరమన్న ప్రధాని, డీప్ టెక్, అంతరిక్షం, బయోటెక్, పునరుత్పాదక ఇంధనం వంటి నూతన రంగాలకు అవసరమైన నాయకులను సిద్ధం చేయాలని చెప్పారు. అదే విధంగా క్రీడలు, వ్యవసాయం, పరిశ్రమలు, సమాజ సేవ వంటి రంగాల్లో కూడా నాయకత్వం అవసరమేనని అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో ఉన్నత ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యమొక్కటే సరిపోదని, వాటి సాకారం ముఖ్యమని అన్నారు. “ప్రపంచ స్థాయి ఉన్నత ప్రమాణాల సంస్థలను ఏర్పాటు చేయగల సత్తా ఉన్న నాయకులు మనకు అవసరం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు ఇటువంటి గొప్ప సంస్థలు భారత దేశంలో విరివిగా ఉండేవని, ఆ స్ఫూర్తిని తిరిగి జాగృతం చేయవలసిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొంటున్న అనేకమంది ప్రతిభావంతులని, వారి కలలూ లక్ష్యాల సాకారం కోసం సోల్ సంస్థ ఒక ప్రయోగశాలగా నిలవాలని చెప్పారు. ఈరోజు వేస్తున్న పునాదిరాయి భవిష్య తరాలకు గర్వకారణం కావాలని, 25-50 ఏళ్ళ తరువాత వారు సంస్థను సగర్వంగా తలుచుకుంటారని అన్నారు.
కోట్లాది భారతీయుల ఆకాంక్షలు, కలల పట్ల సంస్థకు స్పష్టమైన అవగాహన ఉండాలని శ్రీ మోదీ అన్నారు. సవాళ్ళు, అవకాశాలు రెండింటినీ అందించే రంగాలు, అంశాల గురించి స్పష్టత అవసరమని వ్యాఖ్యానించారు. “మనం ఉమ్మడి లక్ష్యం, సమష్టి కృషితో ముందుకు సాగినప్పుడు, అసాధారణమైన ఫలితాలను అందుకోగలం” అని ప్రధానమంత్రి అన్నారు. ఉమ్మడి లక్ష్యంతో సాగే జట్టు సభ్యుల మధ్య బంధం రక్తసంబంధం కన్నా పటిష్టమైనదని, అది ఆలోచనల సంగమానికి దారి తీసి, స్ఫూర్తిని రగిలించి, కాలపరీక్షకు నిలబడుతుందని అన్నారు. ఉన్నతమైన సామూహిక లక్ష్యం నాయకత్వ కల్పన, బృందస్ఫూర్తికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు. లక్ష్యం కోసం పాటుపడేవారు తమను తాము ఆ ఆశయానికే అంకితం చేసుకుంటారని, ఆ క్రమంలో వారి అత్యుత్తమ సామర్థ్యాలు వెలికివస్తాయని, లక్ష్యానికి అనుగుణంగా ఆ సామర్థ్యాలు మెరుగవుతాయని చెప్పారు. ఉన్నత స్థాయికి చేరుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను సంపాదించుకునే నాయకులను ఈ ప్రక్రియ తయారు చేస్తుందని అన్నారు.
“ఉమ్మడి లక్ష్యం అసాధారణమైన బృంద స్ఫూర్తిని కలిగిస్తుంది” అని శ్రీ మోదీ అన్నారు. ఒకటే లక్ష్యంతో సాగే బాటసారుల మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుందని, బృందాన్ని ఏర్పరిచే ప్రక్రియ సైతం నాయకత్వం ఉద్భవించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఇందుకు భారత స్వాతంత్య్ర పోరాటం ఉత్తమమైన ఉదాహరణ అంటూ, సామూహిక లక్ష్యం కేవలం రాజకీయాల్లోనే కాక, అనేక ఇతర రంగాల్లో నాయకులు తయారయ్యేందుకు కారణమయ్యిందని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటాన్ని మరొకసారి గుర్తు చేసుకుని ఆ స్ఫూర్తితో ముందడుగులు వేయాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.
శ్రీ మోదీ ఒక సంస్కృత శ్లోకాన్ని ఉటంకిస్తూ, ప్రతి మాట మంత్రంగా మారగలదని, ప్రతి మూలిక ఔషధంగా పనిచేయగలదని, ప్రతి వ్యక్తి ఒక శక్తిగా మారగలడని అన్నారు. వ్యక్తులకు దిశానిర్దేశం చేసి వారి సామర్థ్యాలని సరైన రీతిలో వినియోగించుకోగలిగే నాయకుల అవసరం ఎంతైనా ఉందని ప్రధాని అన్నారు. సోల్ ఈ అవసరాన్ని పూరించగలదని అన్నారు. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న అనేకమంది నాయకులు తమ నాయకత్వ పటిమకు పదును పెట్టుకున్నవారేనన్నారు. అభివృద్ధిలోని వివిధ స్థాయుల గురించిన ఒక ఉదాహరణనిస్తూ, వ్యక్తిత్వ వికాస పద్ధతుల ద్వారా వ్యక్తిగత విజయాలు, బృంద నిర్మాణం ద్వారా సంస్థల ఉన్నతి, నాయకత్వ వికాసం ద్వారా అద్భుతమైన ప్రగతి సాధ్యపడుతుందని చెప్పారు. ఈ సూత్రాలు ప్రతి వారికీ వారి బాధ్యతలను గుర్తు చేయాలని అన్నారు.
దేశ సామాజిక క్రమంలో మార్పు సుస్పష్టమని, ఇందుకు 21వ శతాబ్దంలో పుట్టినవారు, గత దశాబ్దంలో పుట్టినవారు కారణమని ప్రధాని అన్నారు. వీరు ‘మొట్టమొదటి సంపూర్ణంగా అభివృద్ధి చెందిన తరం’గా గుర్తింపు పొందుతారని, వీరిని ‘అమృత్ పీఢీ’ (అమృత తరం)గా సంబోధించవచ్చని అన్నారు. ‘అమృత్ పీఢీ’ నాయకత్వాన్ని తయారుచేయడంలో సోల్ సంస్థ కీలక భూమిక పోషించగలదని ఆశిస్తున్నానన్న ప్రధాని, సంస్థకు చెందిన అందరికీ అభినందనలు తెలిపారు.
భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టోబ్గే, సోల్ సంస్థ ఛైర్మన్ సుధీర్ మెహతా, వైస్ ఛైర్మన్ హస్ముఖ్ అధియా, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీ టోబ్గే కీలకోపన్యాసం చేశారు. భూటాన్ రాజు పుట్టినరోజు వంటి ముఖ్యమైన సందర్భంలో కూడా కార్యక్రమానికి హాజరైనందుకు శ్రీ మోదీ శ్రీ టోబ్గేకు ధన్యవాదాలు తెలియజేశారు.
నేపథ్యం
ఫిబ్రవరి 21, 22 తేదీల్లో నిర్వహించే సోల్ నాయకత్వ సదస్సులో రాజకీయాలు, క్రీడలు, కళలు, మీడియా, ఆధ్యాత్మికం, ప్రజాపాలన, వాణిజ్యం, సాంఘిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని, నాయకత్వానికి సంబంధించి తమ దృక్కోణాలు, తమ జీవితాల్లోని స్ఫూర్తిదాయక అంశాలను పంచుకుంతున్నారు. సదస్సు సహకారానికి, నాయకత్వ ఆలోచనలకు పెద్దపీట వేస్తోంది. విజయాల నుంచే కాక, పరాజయాల నుంచీ పాఠాలు నేర్చుకోగలమన్న స్ఫూర్తిని ఈ సదస్సు యువతకు కల్పిస్తుంది.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే నిబద్ధత గల నాయకులను తయారుచేయాలన్న ఆశయంతో గుజరాత్ లోని స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్) ప్రారంభమవుతోంది. క్రమమైన శిక్షణ ద్వారా దేశ రాజకీయ నాయకత్వాన్ని తయారుచేయాలని, ఈ క్రమంలో కేవలం రాజకీయ వారసత్వం ఆధారంగా వచ్చే అభ్యర్థులకే కాక, ప్రతిభ, అంకితభావం, ప్రజా సేవపట్ల ఆసక్తి ఆధారంగా పైకొచ్చిన వారికి చేయూతనందించాలని సంస్థ ఆశిస్తోంది. నేటి సమాజంలోని సంక్లిష్టమైన సవాళ్ళను ఎదుర్కొనే నాయకత్వానికి అవసరమైన దృక్పథం, నైపుణ్యాలను సోల్ సంస్థ శిక్షితులకు అందిస్తుంది.
Addressing the SOUL Leadership Conclave in New Delhi. It is a wonderful forum to nurture future leaders. @LeadWithSoul
https://t.co/QI5RePeZnV— Narendra Modi (@narendramodi) February 21, 2025
The School of Ultimate Leadership (SOUL) will shape leaders who excel nationally and globally. pic.twitter.com/x8RWGSZsFl
— PMO India (@PMOIndia) February 21, 2025
Today, India is emerging as a global powerhouse. pic.twitter.com/RQWJIW1pRz
— PMO India (@PMOIndia) February 21, 2025
Leaders must set trends. pic.twitter.com/6mWAwNAWKX
— PMO India (@PMOIndia) February 21, 2025
Instilling steel and spirit in every sector. pic.twitter.com/EkOVPGc9MI
— PMO India (@PMOIndia) February 21, 2025
***
MJPS/SR/RT
Addressing the SOUL Leadership Conclave in New Delhi. It is a wonderful forum to nurture future leaders. @LeadWithSoul
— Narendra Modi (@narendramodi) February 21, 2025
https://t.co/QI5RePeZnV
The School of Ultimate Leadership (SOUL) will shape leaders who excel nationally and globally. pic.twitter.com/x8RWGSZsFl
— PMO India (@PMOIndia) February 21, 2025
Today, India is emerging as a global powerhouse. pic.twitter.com/RQWJIW1pRz
— PMO India (@PMOIndia) February 21, 2025
Leaders must set trends. pic.twitter.com/6mWAwNAWKX
— PMO India (@PMOIndia) February 21, 2025
Instilling steel and spirit in every sector. pic.twitter.com/EkOVPGc9MI
— PMO India (@PMOIndia) February 21, 2025
I commend SOUL for their endeavours to nurture a spirit of leadership among youngsters. pic.twitter.com/otSrbQ2Pdp
— Narendra Modi (@narendramodi) February 21, 2025
We in India must train our coming generations to become global trendsetters. pic.twitter.com/5L4AFfY3wF
— Narendra Modi (@narendramodi) February 21, 2025
With determined endeavours and collective efforts, the results of our quest for development will surely be fruitful. pic.twitter.com/s1lmEIGUMq
— Narendra Modi (@narendramodi) February 21, 2025