సైబర్ స్పేస్ రంగంలో మరియు సైబర్ క్రైం పై పోరాటంలో సాంకేతిక సహకారం కోసం భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు ఎ ఇ) కి మధ్య ఓ అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు)పై కిందటి నెలలో జరిగిన సంతకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఈ ఒప్పందం రెండు దేశాల లోను సైబర్ క్రైంకు సంబంధించిన అంశాలను పరిష్కరించటంలో తోడ్పడనుంది. సైబర్ స్పేస్ రంగంలో, ఇంకా అన్ని విధాలైన సైబర్ నేరాలపైన పోరు సలపటంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఒక దేశానికి మరొక దేశం ఇచ్చి పుచ్చుకోవడం,సైబర్ నేరాల పరిశోధనలో సహకరించుకోవడానికి, శిక్షణ కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడానికి ఈ ఒప్పందం భారతదేశానికి, యు ఎ ఇ కి దోహదం చేస్తుంది. భారతదేశం పక్షం నుంచి దేశీయాంగ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండి ఈ ఒప్పందాన్ని అమలు చేసే బాధ్యతను భుజాన వేసుకొంటుంది. అలాగే, యు ఎ ఇ తరఫున నోడల్ ఏజన్సీగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండ్ ద స్టేట్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్రిమినల్ సెక్యూరిటీ వ్వవహరించనున్నారు.
సైబర్ క్రైం నుంచి ప్రజల భద్రతకు, ప్రయోజనాలకు,రక్షణకు తీవ్రమైన ముప్పు ఎదురవుతున్న నేపథ్యంలో సైబర్ స్పేస్ తో పాటు,సైబర్ నేరాలతో పోరుకు భారతదేశం,యు ఎ ఇ ల మధ్య పరస్పర ద్వైపాక్షిక సాంకేతిక సహకారాన్ని ఈ ఒప్పందం పెంపొందించగలదు.