ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన 18వ వార్షిక భారత-రష్యా శిఖరాగ్ర సదస్సులో ప్రెసిడెంట్ శ్రీ పుతిన్ తో భేటీ అయ్యారు.
శిఖరాగ్ర సదస్సు ముగింపులో ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రి గా తాను తొలిసారి సెయింట్ పీటర్స్ బర్గ్ లో పర్యటించిన సంగతిని గుర్తుకు తెచ్చుకొన్నారు. భారతదేశానికి, రష్యాకు మధ్య ఉన్న సంబంధాలు సంస్కృతి నుండి రక్షణ వరకు విస్తరించాయని ఆయన అన్నారు.
ఇరు దేశాలకు మధ్య 70 సంవత్సరాల తరబడి నెలకొన్న దౌత్య సంబంధాలు వేరు వేరు ద్వైపాక్షిక మరియు ప్రపంచ అంశాలలో మేలు కలయికను ప్రతిబింబించాయని ప్రధాన మంత్రి వివరించారు.
ఈ రోజు విడుదల చేసిన సెయింట్ పీటర్స్ బర్గ్ డిక్లరేషన్ ను పరస్పర ఆధారితమైన, పరస్పరం అనుసంధానమైవున్న, కల్లోల భరిత ప్రపంచంలో స్థిరత్వానికి ఒక ప్రమాణంగా ఉందని ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఎస్ పిఐఇఎఫ్ లో ఒక అతిథి దేశంగా భారతదేశం పాల్గొననుండడం, అక్కడ రేపు తాను ప్రసంగించబోవడం ఈ రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరింపచేయగలదని ఆయన అన్నారు.
భారతదేశం మరియు రష్యాల మధ్య సంబంధాలలో రూపుదిద్దుకొన్నటువంటి మైలురాళ్లలో శక్తి రంగంలోని సహకారం ఒక మైలురాయి అని ప్రధాన మంత్రి వర్ణించారు. పరమాణు శక్తి, హైడ్రోకార్బన్ రంగం, నవీకరణ యోగ్య శక్తి రంగాలలో ఈ విధమైన సహకారం ఈ రోజు చోటు చేసుకొన్న చర్చలు, నిర్ణయాలతో మరింత విస్తృతం అయిందని ఆయన అన్నారు. ఈ సందర్భంలో కుడన్ కుళమ్ పరమాణు విద్యుత్తు కేంద్రం యొక్క అయిదో, ఆరో యూనిట్ల కు సంబంధించిన ఒప్పందాన్ని గురించి ఆయన ప్రస్తావించారు.
ఉభయ దేశాల మధ్య వ్యాపారం మరియు వాణిజ్య సంబంధాలను పెంచి పోషించడంలో ప్రైవేటు రంగం పాత్ర ముఖ్యమైందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. 2025 సంవత్సరం కల్లా 30 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన పెట్టుబడులను సాధించాలని నిర్దేశించుకొన్న లక్ష్యాన్ని చేరుకొనే స్థితిలో భారతదేశం, రష్యా లు ఉన్నట్లు పేర్కొన్నారు.
అనుసంధానం అంశాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇంటర్ నేషనల్ నార్త్ సౌత్ కారిడార్ లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని ప్రస్తావించారు. ఇతర కార్యక్రమాలను గురించి చెబుతూ, స్టార్ట్ అప్ లు, పారిశ్రామిక తత్వాన్ని ప్రోత్సహించేందుకు ‘నూతన ఆవిష్కరణల సేతువు’ను గురించి, ఇంకా యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ తో స్వేచ్ఛా వ్యాపార ఒప్పందంపై త్వరలో జరుగనున్న చర్చలను గురించి తెలియజేశారు.
కాలపరీక్షను ఎదుర్కొని నిలచిన భారత, రష్యా సంబంధాల లోని వ్యూహాత్మక పార్శ్వపు ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి విశదీకరిస్తూ, త్వరలో రెండు దేశాల తొలి త్రివిధ దళాల విన్యాసం ‘ఐఎన్ డిఆర్ఎ 2017’ జరుగనుందని చెప్పారు. కమోవ్ 226 హెలికాప్టర్లు మరియు యుద్ధ నావల నిర్మాణం కోసం రక్షణ రంగంలో జాయింట్ వెంచర్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీమాంతర ఉగ్రవాదం విషయంలో భారతదేశానికి రష్యా బేషరతుగా మద్దతు ఇవ్వడాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు.
సాంస్కృతిక పార్శ్వాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, రష్యా సంస్కృతి పట్ల భారతదేశం లోను, యోగా మరియు ఆయుర్వేదం పట్ల రష్యా లోను లోతైన అవగాహన నెలకొనడం అమిత సంతృప్తిని ఇచ్చే విషయమన్నారు.
భారత- రష్యా సంబంధాలు వర్ధిల్లడంలో ప్రెసిడెంట్ శ్రీ పుతిన్ నాయకత్వం పోషించిన పాత్రను ప్రధాన మంత్రి స్వాగతించడంతో పాటు ప్రశంసించారు కూడా.
ఢిల్లీ లో ఒక రహదారికి రాయబారి శ్రీ అలెగ్జాండర్ కదకిన్ పేరును పెట్టినట్లు శ్రీ మోదీ ప్రకటించారు. ఇటీవలే కన్నుమూసిన శ్రీ కదకిన్ ను ‘భారతదేశపు మిత్రుడి’గా శ్రీ మోదీ వర్ణించారు.
అంతక్రితం, రెండు దేశాల సిఇఒ లను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రంగాలలో పెట్టుబడులు పెట్టవలసిందంటూ రష్యన్ కంపెనీలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక రంగంలోని అవకాశాలను గురించి ఆయన ప్రత్యేకించి ప్రస్తావించారు.
భారతదేశం మరియు రష్యా ఈ రోజు అయిదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటిలో- పరమాణు శక్తి, రైల్వేలు, రత్నాలు మరియు ఆభరణాలు, సంప్రదాయ విజ్ఞాన రంగంతో పాటు, సాంస్కృతిక బృందాల రాకపోకలు వంటివి ఉన్నాయి.
అంతకు ముందు, ప్రధాన మంత్రి శ్రీ మోదీ పిస్కరొవ్ స్కయ్ సమాధి స్థలాన్ని సందర్శించారు. అక్కడ లెనిన్ గ్రాడ్ సమరంలో వీరోచితంగా పోరాడిన వారికి, సాహసులైన జవానులకు ఆయన శ్రద్ధాంజలిని ఘటించారు.
***
Trade, commerce, innovation and engineering are of immense importance in this era: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 1, 2017
Companies from Russia should explore the opportunities in India and collaborate with Indian industry: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 1, 2017
Defence is a key area where India and Russia can cooperate. I appreciate President Putin's role in enhancing India-Russia ties: PM
— PMO India (@PMOIndia) June 1, 2017