‘కనీస స్థాయి ప్రభుత్వం, గరిష్ఠ స్థాయి పాలన’’ కు తావు ఇవ్వాలి అంటూ ప్రధాన మంత్రి చేసిన సూచన ను అమలు చేసే దిశ లో ముందుకు సాగుతూ, వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని పెంచేందుకు, ప్రభుత్వ రంగ సంస్థల లో ప్రైవేటు రంగం తాలూకు దక్షత ను ఉపయోగించుకొనేందుకు ఉద్దేశించిన మరొక చర్య లో భాగం గా, ‘సెంట్రల్ రైల్ సైడ్ వేర్ హౌస్ కంపెనీ లిమిటెడ్’ (సిఆర్‌డబ్ల్యుసి) ను ఆ సంస్థ యొక్క హోల్డింగ్ ఎంటర్‌ప్రైజ్ అయినటువంటి ‘సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేశన్’ (సిడబ్ల్యుసి) తో విలీనం చేయడానికి, అలాగే సిఆర్‌డబ్ల్యుసి తాలూకు అన్ని ఆస్తుల ను, అప్పుల ను, హక్కుల ను, బాధ్యత లను సిడబ్ల్యుసి కి బదలాయించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిఆర్‌డబ్ల్యుసి ఒక మిని-రత్న రెండో కేటగిరీ కి చెందిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ. సిఆర్‌డబ్ల్యుసి ని 1956 నాటి కంపెనీల చట్టం ప్రకారం 2007వ సంవత్సరం లో ఏర్పాటు చేయడమైంది. ఈ విలీనం రెండు కంపెనీ లు నిర్వహిస్తున్నటువంటి వేర్ హౌసింగ్, హ్యాండ్ లింగ్, రవాణా ల వంటి సమానమైన విధుల ను కలిపివేయడం తో పాటు వాటి దక్షత ను పెంచడం, సామర్ధ్యాన్ని వీలైనంత ఎక్కువ స్థాయి లో వినియోగించుకోవడం, పారదర్శకత్వాని కి పెద్దపీట వేయడం, జవాబుదారుతనాన్ని పెంపొందించడం, ఆర్థిక పరమైన మిగులు కు పూచీ పడటానికి తోడు గా కొత్త వేర్ హౌసింగ్ సదుపాయాల ను ఏర్పాటు చేయడానికి రైల్వే సైడింగు ను ఉపయోగించుకోవడానికి కూడా తోడ్పడనుంది.
కార్పొరేట్ కార్యాలయం కిరాయి, ఉద్యోగుల జీతం, ఇతర పాలన సంబంధిత వ్యయాల లో ఆదా వల్ల రైల్ సైడ్ వేర్ హౌస్ కాంప్లెక్సు (ఆర్‌డబ్ల్యుసి)ల నిర్వహణ వ్యయం 5 కోట్ల రూపాయల మేరకు తగ్గిపోగలదన్న అంచనా ఉంది. ఆర్‌డబ్ల్యుసి ల సామర్ధ్య వినియోగం సైతం మెరుగు పడనుంది. ఎలాగంటే సిడబ్ల్యుసి కి ప్రస్తుతం ఆ సంస్థ నిలవ చేస్తున్న సిమెంటు, ఎరువులు, చక్కెర, ఉప్పు, సోడా ల వంటి వస్తువులే కాకుండా వేరే సరకుల ను కూడా దాచి ఉంచే సామర్థ్యం లోనూ వృద్ధి కి వీలు ఏర్పడుతుంది. గూడ్స్-శెడ్ ఉన్న ప్రదేశాల కు దగ్గర లో కనీసం మరొక 50 రైల్ సైడ్ వేర్ హౌసుల ను ఏర్పాటు చేసేందుకు ఈ విలీనం తోడ్పడనుంది. దీని తో నైపుణ్యం కలిగిన శ్రామికుల విషయం లో అయితే 36,500 పని దినాల కు సమానమైన ఉద్యోగ అవకాశాల ను, నైపుణ్యం లేని శ్రామికుల విషయం లో అయితే 9,12,500 పని దినాల కు సమానమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న అంచనా ఉంది. నిర్ణయం జరిగిన నాటి నుంచి 8 నెలల లోపల ఈ విలీనం తాలూకు మొత్తం ప్రక్రియ పూర్తి అవుతుందన్న ఆశ ఉంది.
వ్యవసాయ ఉత్పత్తుల ను, తత్సంబంధమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని ఇతర వస్తువుల ను భండాగారం లో ఉంచాలన్న ఉద్దేశం తోను, వేర్ హౌసింగ్ కార్పొరేశన్ లను క్రమబద్ధీకరించాలన్న ఉద్దేశం తోను 1957వ సంవత్సరం లో సిడబ్ల్యుసి ని స్థాపించడం జరిగింది. ఇది ఒక మిని రత్న కేటగిరి-I కు చెందిన సిపిఎస్ఇ. లాభాలను ఆర్జిస్తున్న పిఎస్ఇ అయిన సిడబ్ల్యుసి ని 100 కోట్ల రూపాయల అధీకృత మూలధనం తో, 68.02 కోట్ల రూపాయల చెల్లించిన మూలధనం తో నెలకొల్పడమైంది. రైల్ సైడ్ వేర్ హౌసింగ్ కాంప్లెక్సు లు / టెర్మినల్స్ / రైల్వే ల నుంచి కౌలు కు తీసుకున్న స్థలాల లోనో లేదా ఇతరత్రా గా పొందిన స్థలాల లోనో మల్టిమోడల్ లాజిస్టిక్స్ హబ్స్ ను రూపొందించాలని, వాటిని అభివృద్ధిపరచాలని ‘రైల్ సైడ్ వేర్ హౌస్ కంపెనీ లిమిటెడ్’ (సిఆర్ డబ్ల్యుసి) పేరు తో 2007వ సంవత్సరం లో జులై 10 న సిడబ్ల్యుసి ని ఒక వేరే అనుబంధ కంపెనీ గా ఏర్పాటు చేశారు. సిఆర్ డబ్ల్యుసి కొద్ది మంది తో పనిచేస్తున్న చిన్నపాటి సంస్థ. దీనిలో ఉద్యోగులు 50 మంది, అవుట్ సోర్సింగ్ పద్ధతి లో పనిచేస్తున్న సిబ్బంది 48 మంది ఉన్నారు. ప్రస్తుతానికి, ఇది దేశవ్యాప్తం గా 20 ల్ సైడ్ వేర్ హౌస్ లను నడుపుతోంది. 2020 వ సంవత్సరం మార్చి 31 నాటికి ఈ కంపెనీ నికర విలువ (చెల్లించిన మూలధనం, ఫ్రీ రిజర్వు లు కలుపుకొని) 137.94 కోట్ల రూపాయలుగా ఉంది. ఆర్ డబ్ల్యుసి లను దిద్ది తీర్చడంలోను, వాటి ని నిర్వహించడం లోను సిఆర్ డబ్ల్యుసి ప్రావీణ్యాన్ని సాధించి మంచి పేరు ను తెచ్చుకొంది. అయితే తగినంత మూలధనం లేకపోవడం తోను, రైల్వే మంత్రిత్వ శాఖ తో దీని అవగాహనపూర్వక ఒప్పంద పత్రం లో కొన్ని ప్రతిబంధకభరిత షరతులు ఉన్న కారణం గాను దీని వృద్ధి గతి ఆశించిన స్థాయి లో లేదు.
సిఆర్ డబ్ల్యుసి లో సిడబ్ల్యుసి ఏకైక వాటాదారు గా ఉంది. ఈ కారణం గా అన్ని ఆస్తులను, అప్పులను, హక్కులను, బాధ్యతల ను సిడబ్ల్యుసి కి బదలాయిస్తే రెండు కంపెనీల కు ఎలాంటి ఆర్థికపరమైన నష్టం ఉండదు, పైపెచ్చు ఈ నిర్ణయం వల్ల రెండు సంస్థల మధ్య ఒక మెరుగైనటువంటి కలయిక ఏర్పడగలదు. ఆర్ డబ్ల్యుసి ల కార్యకలాపాల నిర్వహణ ను, మార్కెటింగు ను నిభాయించడానికి గాను సిడబ్ల్యుసి ద్వారా ‘ఆర్ డబ్ల్యుసి విభాగం’ పేరు తో ఒక వేరే విభాగాన్ని రూపొందించడం జరుగుతుంది.
***