సెంట్రల్ ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (సి ఐ డబ్ల్యు టి సి)ను రద్దుచేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. 2014, డిసెంబర్ 24వ తేదీన మంత్రి మండలి నిర్ణయించిన ప్రకారం సి ఐ డబ్ల్యు టి సి లో స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని 2015వ సంవత్సరంలో అమలుపరిచారు.
సి ఐ డబ్ల్యు టి సి ని భారత ప్రభుత్వం కంపెనీల చట్టం, 1956కు అనుగుణంగా 1967 ఫిబ్రవరి 22వ తేదీన ఒక కంపెనీగా నెలకొల్పడం జరిగింది. అప్పట్లో కలకత్తా ఉన్నత న్యాయస్థానం ఆమోదించిన ఒక పథకంలో భాగంగా మునుపటి రివర్ స్టీమ్ నేవిగేషన్ కంపెనీ లిమిటెడ్ ఆస్తులను, అప్పులను ఇది స్వాధీనం చేసుకొన్నది. అంతర్గ పరిమితులు, అవస్థాపన సంబంధ అవరోధాల కారణంగా సి ఐ డబ్ల్యు టి సి కార్యకలాపాలు ఎన్నటికీ ఆచరణీయం కాలేకపోయాయి. ఆరంభం నుంచే ఈ కంపెనీ నష్టాలలో చిక్కుకొంది. ప్రస్తుతం కంపెనీలో ఐదుగురు ఉద్యోగులు మాత్రమే ఉన్నారు.
సాధ్యమైన చోటల్లా ఖాయిలాపడిన సి పి ఎస్ యు లకు తిరిగి ప్రాణం పోయడంగాని లేదా పునరుద్ధరించడానికి వీలులేని సంస్థలను రద్దు చేయడంగాని జరగాలన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సి ఐ డబ్ల్యు టి సి కి చెందిన స్థిర, చర ఆస్తులను విక్రయించిన అనంతరం ఈ సంస్థ రద్దుకు చర్యలు ఆరంభిస్తారు. ఈ సంస్థకు చెందిన అనేక ఆస్తులను బ్రహ్మపుత్ర నది (ఎన్ డబ్ల్యు – 4)లో సేవలను అందించడం కోసం ఇన్లాండ్ వాటర్ వేస్ అథారటీ ఆఫ్ ఇండియా స్వీకరిస్తుంది.