Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సూరత్‌ సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం

సూరత్‌ సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సూరత్‌లోని లింబాయత్‌లో ‘సూరత్ సంతృప్త  ఆహార భద్రత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలో అర్హులైన 2.3 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు సహా వివిధ వస్తువులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- నిరంతర కృషి, దాతృత్వ స్ఫూర్తి బలమైన పునాదిగాగల సూరత్ నగరం విశిష్టతను ప్రధాని కొనియాడారు.  సమష్టి మద్దతు, సర్వజన ప్రగతికి నిర్వచనంగా రూపొందిన నగరం స్వభావాన్ని విస్మరించజాలమని వ్యాఖ్యానించారు.

   పరస్పర చేయూత, పురోగమన సంస్కృతికి సూరత్‌ నగరం పేరొందిందని ఇక్కడి ప్రజలంతా సమష్టి ప్రయోజనం కోసం భుజం కలిపి పనిచేస్తారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ స్ఫూర్తి సూరత్‌లో మూలమూలలా కనిపిస్తుందని చెప్పారు. దీన్ని మరింత ప్రోత్సహించి, బలోపేతం చేయడంతోపాటు నగరవాసుల మధ్య ఐక్యతను ప్రోదిచేసి, వృద్ధికి ప్రేరణనివ్వడమే నేటి కార్యక్రమ లక్ష్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. “గుజరాత్‌లోనే కాకుండా యావద్భారతంలో ఓ ప్రముఖ నగరంగా సూరత్ పేరు పొందింది. ఇక ఇవాళ పేదలు, అణగారిన వర్గాల ఆహార-పౌష్టికత భద్రతకు భరోసా ఇవ్వడంలోనూ ముందంజ వేసింది. ఈ నగరం చేపట్టిన సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమం దేశంలోని ఇతర జిల్లాలకు ప్రేరణ కాగలదు” అని శ్రీ మోదీ అన్నారు.

   ఈ భరోసా పొందడంలో ఏ ఒక్కరూ వెనుకబడరాదన్నది కార్యక్రమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఏ ఒక్కరిపైనా వివక్షకు, మోసానికి తావులేకుండా చూస్తుందన్నారు. అలాగే  బుజ్జగింపు పద్ధతులకు అతీతంగా ముందంజ వేస్తూ అందరికీ సంతృప్తినివ్వడమనే స్ఫూర్తిపైనే దృష్టి సారిస్తుందన్నారు. “ప్రభుత్వం లబ్ధిదారు ముంగిటకు చేరువైనపుడు ఏ ఒక్కరూ వెనుకబాటుకు గురికాబోరు. ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలనే నిబద్ధతతో వ్యవస్థను దోచుకునే శక్తులను దూరంగా ఉంచుతుంది” అన్నారు.

   ఈ నేపథ్యంలో సంతృప్త ఆహార భద్రత విధానం కింద సూరత్ యంత్రాంగం 2.5 లక్షల మందికిపైగా కొత్త లబ్ధిదారులను గుర్తించిందని ప్రధాని వివరించారు. కాగా, వీరిలో చాలామంది వృద్ధ మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు ఉన్నారు. ఈ కొత్త కుటుంబ సభ్యులకు ఇకపై ఉచిత రేషన్‌, పోషకాహారం అందుతాయి. ఈ కీలక కార్యక్రమం ద్వారా  ప్రయోజనం పొందుతున్న కొత్త లబ్ధిదారులందరినీ ప్రధాని అభినందించారు.

   ఆహారం విషయంలో పేదల ఆందోళన, ఆవేదన తాను పుస్తకాల నుంచి తెలుసుకున్నది కాదని, అది తన అనుభవంలో భాగమని ఆయన తెలిపారు. “అందుకే గడచిన కొన్నేళ్లుగా పేదల ఆహార అవసరాలను గుర్తించి, ఆహార భద్రత కల్పించడం ద్వారా వారి ఆవేదనను రూపుమాపడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ మేరకు పేదలకు నిజమైన తోడూనీడగా, సేవకుడుగా అండదండలు అందించింది” అని శ్రీ మోదీ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి విరుచుపడగా, నిరుపేదలకు నిరంతర మద్దతు అవసరమైనపుడు వారికి ఆకలి బాధ తెలియకుండా ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ను ప్రారంభించాం. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేక, భారీ స్థాయిలో ప్రారంభమైన ఈ పథకం నేటికీ కొనసాగుతోంది. దీనికింద మరింత మందికి లబ్ధి చేకూరే వీలు కల్పిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం ఆదాయ పరిమితిని పెంచడం అభినందనీయమని ప్రధాని కొనియాడారు. పేదల వంటిల్లు సదా వెలిగేలా ప్రభుత్వం ఏటా దాదాపు రూ.2.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది.

   భారత్‌ ప్రగతి పయనంలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అందుకే దేశంలోని ప్రతి కుటుంబానికీ తగినంత పోషకాహారం అందించడం, తద్వారా పౌష్టికత లోపం, రక్తహీనత వంటి సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఇందులో భాగంగా “ప్రధానమంత్రి పోషణ్ పథకం కింద దాదాపు 12 కోట్ల మంది పాఠశాల బాలలకు పోషకాహారం అందిస్తున్నాం. సక్షమ్ అంగన్‌వాడీ కార్యక్రమం కింద బాలలు, బాలింతలు, గర్భిణుల పోషకాహారంపై దృష్టి సారిస్తోంది. అలాగే ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్భిణులకు పౌష్టికాహారం కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నాం” అని శ్రీ మోదీ గుర్తుచేశారు.

   పౌష్టికత అంటే ఆకలి తీర్చే ఆహారానికి అతీతమైనదని, పరిశుభ్రతకూ ఇందులో కీలక ప్రాధాన్యం ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిశుభ్రత పరిరక్షణపై సూరత్ శ్రద్ధను, అవిరళ కృషిని ఆయన కొనియాడారు. “దేశంలో ప్రతి నగరం, గ్రామం మురికిని వదిలించుకునే దిశగా కృషిచేసేలా చూడాలన్నదే ప్రభుత్వ నిరంతర తపన. కాబట్టే, స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో తోడ్పడిందని అంతర్జాతీయ సంస్థలు కూడా గుర్తించాయి” అని శ్రీ మోదీ చెప్పారు. ఇంటింటికీ పరిశుభ్ర తాగునీటి సరఫరా లక్ష్యంగా శ్రీ సి.ఆర్.పాటిల్ నేతృత్వంలో కొనసాగుతున్న “హర్ ఘర్ జల్” కార్యక్రమం ప్రాముఖ్యాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ, వివిధ వ్యాధులను అరికట్టడంలో ఇది కూడా ఎంతగానో దోహదం చేసిందని తెలిపారు.

   లక్షలాది పేదలకు జీవన సౌలభ్యం కల్పించిన ఉచిత రేషన్ పథకం గణనీయ ప్రభావం గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ పథకం కింద నేడు వాస్తవ లబ్ధిదారులు పూర్తి ప్రయోజనం పొందుతున్నారని, పదేళ్ల కిందట మాత్రం ఈ అవకాశం ప్రజలకు లభించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం 5 కోట్లకుపైగా నకిలీ రేషన్ కార్డులను తొలగించి, యావత్‌ పంపిణీ వ్యవస్థను ఆధార్‌తో అనుసంధానించిందని ఆయన వివరించారు. దీంతో పేదలకు, ముఖ్యంగా వలస కార్మికులకు ఎనలేని ప్రయోజనం చేకూరిందని తెలిపారు. సూరత్‌లోని వలస కార్మికులకు ఇతర రాష్ట్రాల్లో తమ రేషన్ కార్డు వాడుకునే వీలుండేది కాదని ఆయన గుర్తుచేశారు. ఈ దుస్థితిని తప్పిస్తూ “దేశంలో ఎక్కడైనా రేషన్‌” పొందగలిగేలా “ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు” పథకాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. దీనివల్ల నేడు సూరత్‌లోని చాలామంది వలస కార్మికులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. “సదుద్దేశంతో రూపొందించే విధానాలు పేదలకు ప్రయోజనకరం కాగలవనడానికి ఇదే నిదర్శనం” అని ఆయన వ్యాఖ్యానించారు.

   దశాబ్ద కాలం నుంచీ ఉద్యమ తరహా విధానాలతో పేదల సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధానమంత్రి వివరించారు. పేదల చుట్టూ భద్రత వలయం సృష్టించి, వారికి సదా సాయం కోసం వేడుకునే దురవస్థ తప్పించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే కాంక్రీట్ ఇళ్లు, వాటిలో మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు గ్యాస్ కనెక్షన్‌, కొళాయిలతో నీటి సరఫరా వంటి సదుపాయాల ద్వారా వారిలో కొత్త విశ్వాసాన్ని నింపామని చెప్పారు. దేశంలో దాదాపు 60 కోట్ల మంది ప్రజలకు రూ.5 లక్షలదాకా ఉచిత వైద్యం అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం బీమా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. “లోగడ పేద కుటుంబాలు కలలో కూడా ఊహించలేని జీవిత-ప్రమాద బీమా సౌకర్యాలు ఇప్పుడు సాకారమయ్యాయి. నేడు 36 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రభుత్వ బీమా పథకాలతో రక్షణ పొందుతున్నారు. కష్ట సమయంలో వారి కుటుంబాలకు చేయూతనిస్తూ రూ.16,000 కోట్లకుపైగా విలువైన అభ్యర్థనలు పరిష్కారం అయ్యాయి” అని శ్రీ మోదీ ప్రకటించారు.

   గతంలో పేదలు సొంత వ్యాపారం ప్రారంభించాలంటే ఎన్నో అగచాట్లు పడాల్సి వచ్చేదని శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేశారు. రుణ మంజూరుకు బ్యాంకుల నిరాకరణతో వారు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి, ఎన్నో కష్టనష్టాలకు గురయ్యేవారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘ముద్ర’ యోజన ప్రారంభం ద్వారా పేదలకు రుణహామీ ఇచ్చే బాధ్యతను తాను వ్యక్తిగతంగా తీసుకున్నానని చెప్పారు. ఈ మేరకు “ముద్ర యోజన కింద దాదాపు రూ.32 లక్షల కోట్ల మేర పూచీకత్తులేని రుణాలిచ్చాం. దీనివల్ల పేదలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరింది. అంత భారీ మొత్తం పరిమాణం ఏమిటో ప్రతిపక్షాలకు అర్థం కాకపోయినా, ఈ కార్యక్రమం లక్షలాది మందికి చేయూతనిచ్చింది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   వీధి వ్యాపారులతోపాటు గతంలో ఆర్థిక సహాయం లభించని కార్మికుల ఇబ్బందులను ప్రస్తావిస్తూ- వీరంతా తరచూ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవారని గుర్తుచేశారు. అయితే, అధికవడ్డీలతో అప్పులు తీర్చలేక, రుణభారం మోయలేక నానా అగచాట్లూ పడేవారని పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం ‘ప్రధానమంత్రి స్వానిధి యోజన’కు శ్రీకారం చుట్టడంతో ఇలాంటి వారికి రుణాలందించే వీలు కలిగిందని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇలాంటి కార్మికుల కోసం ప్రత్యేక క్రెడిట్ కార్డును కూడా ప్రవేశపెట్టామని ప్రకటించారు. “సంప్రదాయ హస్తకళాకారులకు శిక్షణతోపాటు ఆధునిక ఉపకరణాల పంపిణీ ద్వారా వారి నైపుణ్యం మెరుగు, విస్తరణకు ఆర్థిక సహాయం అందించడం కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ను ప్రవేశపెట్టాం. సమ్మిళిత వృద్ధితో దేశ ప్రగతికి ఈ కృషి దోహదం చేసింది. గత పదేళ్లలో 25 కోట్ల మందికిపైగా ప్రజలు పేదరిక విముక్తులు కూడా అయ్యారు” అని శ్రీ మోదీ అన్నారు.

   దేశాభివృద్ధిలో… ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు పెద్ద సంఖ్యలో నివసించే సూరత్‌లో వారి గణనీయ పాత్రను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఉపశమనం సహా, మధ్యతరగతి సాధికారతకు గత దశాబ్దంలో ప్రభుత్వం చేసిన కృషిని ఆయన వివరించారు. “పన్ను ఉపశమనం… ముఖ్యంగా రూ.12 లక్షలదాకా ఆదాయంపై పూర్తిగా పన్ను మినహాయింపు ఎవరూ ఊహించని మలుప”ని ప్రధాని పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులు ఇకపై రూ.12.87 లక్షల దాకా ఆదాయంపై పన్ను మినహాయింపు పొందుతారని చెప్పారు. అన్నిరకాల పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా కొత్త పన్ను శ్లాబులు కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తద్వారా గుజరాత్‌లోని సూరత్ నగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మధ్యతరగతి కుటుంబాలు తమ సంపాదనలో అధికశాతం ఆదా చేసుకునే వీలుంటుందని చెప్పారు. ఇలా ఆదా అయిన సొమ్మును తమ అవసరాల కోసం లేదా పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వెచ్చించవచ్చు” అని ప్రధాని స్పష్టం చేశారు.

   సూరత్‌ నగరం వ్యవస్థాపనకు కూడలిగా రూపొందిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇక్కడి లఘు-మధ్యతరహా పరిశ్రమలు లక్షలాదిగా ఉపాధి అవకాశాలు కల్పించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సూక్ష్మ-చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు మద్దతు ద్వారా స్థానిక సరఫరా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. “బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, దళిత, గిరిజన, మహిళా వ్యవస్థాపకులకు రూ.2 కోట్ల వరకూ హామీలేని రుణాలపై ప్రకటన చేశాం. ఆ వర్గాలవారు ‘ఎంఎస్‌ఎంఇ’ రంగంలో రాణించేందుకు ఈ రుణాలు దోహదం చేస్తాయి. ఈ అవకాశాన్ని సూరత్, గుజరాత్ యువత సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా వారికి అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది” అని శ్రీ మోదీ అన్నారు.

   భారత్‌ అభివృద్ధిలో… ముఖ్యంగా వస్త్ర, రసాయన, ఇంజనీరింగ్ రంగాల్లో సూరత్ పోషించిన కీలక పాత్రను శ్రీ మోదీ ప్రశంసించారు. నగరంలో ఈ పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన విశదీకరించారు. “సూరత్ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవనం, పశ్చిమ ప్రత్యేక రవాణా కారిడార్‌, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే, త్వరలో రానున్న బుల్లెట్ ట్రైన్, సూరత్ మెట్రో ప్రాజెక్ట్ వంటివి నగర అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇది దేశంలో అత్యంత ఎక్కువ అనుసంధానంగల నగరాల్లో ఒకటిగా మారుతుందన్నారు. “ఈ కార్యక్రమాలు సూరత్ వాసుల జీవన నాణ్యత, సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

   దేశంలోని మహిళలు ‘నమో యాప్‌’ ద్వారా తమ స్ఫూర్తిదాయక విజయగాథలను ప్రజలతో పంచుకోవాలని శ్రీ నరేంద్ర మోదీ కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో దేశ ప్రగతికి, సమాజం ముందంజకు గణనీయంగా దోహదం చేసిన స్ఫూర్తిదాయక మహిళలకు తన సామాజిక మాధ్యమాలను అప్పగించినట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ మేరకు వివిధ రంగాల్లో.. ప్రత్యేకించి గుజరాత్‌లో మహిళల పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో మహిళల విజయోత్సవాలకు ఇదొక అవకాశమని ఆయన స్పష్టం చేశారు. మహిళా సాధికారతకు అంకితమైన నవ్‌సారిలో నిర్వహించబోయే ఓ ప్రధాన కార్యక్రమానికి తాను హాజరుకానున్నట్లు ప్రధాని వెల్లడించారు. సూరత్‌లో కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరు కావడాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుత కార్యక్రమం ద్వారా వారెంతో ప్రయోజనం పొందగలరని ప్రధానమంత్రి సూచించారు.

   సూరత్‌ను ఒక ‘సూక్ష్మ భారతం’గా నిలపడంలో, ప్రపంచ వేదికపై అద్భుత నగరంగా రూపొందించడంలో తన నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు. “సూరత్‌ వంటి ప్రదేశంలోని శక్తిమంతులు, చైతన్యవంతులైన ప్రజలకు ప్రతిదీ అసాధారణంగా ఉండాలి. ఆ మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల లబ్ధిదారులందరికీ నా అభినందనలు. వారు నిరంతర విజయాలు, శరవేగంగా పురోగమనం కోరుకుంటున్నారు.

నేపథ్యం

   సూరత్‌లోని లింబాయత్‌లో ప్రధానమంత్రి ‘సూరత్ సంతృప్త ఆహార భద్రత ప్రచార కార్యక్రమా’న్ని ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద వివిధ ప్రయోజనాలను 2.3 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

   ప్రభుత్వం ఇప్పటిదాకా చేసిన కృషికి మహిళా సాధికారత ఓ మూలస్తంభంగా ఉంటూ వచ్చింది. ప్రధానమంత్రి దార్శనిక మార్గనిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం వారి సర్వతోముఖాభివృద్ధికి చర్యలు తీసుకోవడంపై తన కట్టుబాటును పునరుద్ఘాటించింది.

****