Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సూఫీ సంగీతోత్సవం ‘జహాన్-ఎ-ఖుస్రో-2025’కు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

సూఫీ సంగీతోత్సవం ‘జహాన్-ఎ-ఖుస్రో-2025’కు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూఫీ సంగీతోత్సవం “జహాన్-ఎ-ఖుస్రో-2025”లో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో ఇవాళ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ- హజ్రత్ అమీర్ ఖుస్రో సుసంపన్న వారసత్వానికి ప్రతీక అయిన ఈ వేడుకలో మానసిక ఉల్లాసం ఉప్పొంగడం అత్యంత సహజమన్నారు. ఖుస్రోకు ఎంతో ఇష్టమైన వసంత రుతు సుగంధం కాలానికి మాత్రమే పరిమితం కాదని, నేడిక్కడ జహాన్-ఎ-ఖుస్రో కార్యక్రమ ప్రాంగణంలో వీచే గాలిలోనూ అది వ్యాపించిందని అభివర్ణించారు.

   దేశంలోని కళాసంస్కృతుల ప్రాధాన్యాన్ని, ప్రశాంతతను జహాన్-ఎ-ఖుస్రో వంటి కార్యక్రమాలు చాటిచెబుతాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నేడు 25 ఏళ్లు పూర్తి చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయడం ద్వారా గొప్ప  విజయంగా గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ కరణ్ సింగ్, ముజఫర్ అలీ, మీరా అలీ తదితరులు తమ వంతు పాత్ర పోషించారని ప్రధాని అభినందించారు. రూమీ  ఫౌండేషన్తో, జహాన్-ఎ-ఖుస్రోతో ముడిపడిన వారందరికీ ఈ విజయ పరంపర సదా కొనసాగాలని ఆకాంక్షించారు. అలాగే పవిత్ర రంజాన్‌ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో కార్యక్రమంలో పాల్గొన్నవారు సహా దేశ పౌరులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది ఔత్సాహిక కళాకారులకు వేదికగా మారిన సుందర్ నర్సరీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంలో యువరాజు కరీం అగాఖాన్ కృషిని శ్రీ మోదీ గుర్తు చేశారు.

   గుజరాత్ సూఫీ సంప్రదాయంలో సర్ఖేజ్ రోజా పాత్ర ఎంతో గొప్పదని ప్రధాని అన్నారు. ఈ ప్రదేశం ఒకనాడు శిథిల స్థితిలో ఉండేదని ప్రస్తావిస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాని పునరుద్ధరణపై తాను దృష్టి సారించానని తెలిపారు. అలాగే సర్ఖేజ్ రోజా ప్రాంగణంలో నిర్వహించిన కృష్ణ ఉత్సవాల వైభవాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ వేడుకలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యవారని చెప్పారు. అక్కడి వాతావరణంలో కృష్ణ భక్తి సారం నేటికీ పరిమళిస్తూంటుందని ఆయన పేర్కొన్నారు. “సర్ఖేజ్ రోజాలో ఏటా నిర్వహించే సూఫీ సంగీతోత్సవంలో నేను క్రమం తప్పకుండా పాల్గొనేవాడిని” అని శ్రీ మోదీ అన్నారు. “అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఏకం చేసే సూఫీ సంగీతంతోపాటు నజ్రే కృష్ణ ప్రదర్శన కూడా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

   జహాన్-ఎ-ఖుస్రో కార్యక్రమ సౌరభం ఎంతో విశిష్టమని, భారతదేశ మట్టి పరిమళానికి చిహ్నమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భరత భూమిని సాక్షాత్తూ స్వర్గంతో పోల్చిన హజ్రత్ అమీర్‌ ఖుస్రో, ఈ నేలను ప్రతి సంస్కృతీ పుష్ప వికాసానికి నెలవైన నాగరికతా ఉద్యానమని కూడా అభివర్ణించారని గుర్తుచేశారు. “భారత గడ్డకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది.. సూఫీ సంప్రదాయం ఈ నేలపై పాదం మోపినపుడు ఈ సీమతో తనకుగల బంధాన్ని అది కనుగొంది. బాబా ఫరీద్ ఆధ్యాత్మిక బోధనలు, హజ్రత్ నిజాముద్దీన్ భక్తి సమావేశాలతో మొగ్గ తొడిగిన ప్రేమ, హజ్రత్ అమీర్ ఖుస్రో ద్విపదలతో రూపొందిన సరికొత్త ఆణిముత్యాలు వంటివన్నీ భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వ సారంతో కూడుకున్నవే” అని శ్రీ మోదీ వివరించారు.

   మన దేశంలో సూఫీ సంప్రదాయానికిగల ప్రత్యేక గుర్తింపును ప్రముఖంగా ప్రస్తావిస్తూ- నాటి సూఫీ సాధువులు ఖురాన్ బోధనలను వేద సూత్రాలు, భక్తి సంగీతంతో మిళితం చేశారని ప్రధాని పేర్కొన్నారు. హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా తన సూఫీ పాటల ద్వారా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిఫలింపజేశారంటూ ప్రస్తుతించారు. “ఈ సుసంపన్న, సార్వజనీన సంప్రదాయానికి నేడు జహాన్-ఎ-ఖుస్రో ఆధునిక ప్రతిబింబంగా రూపొందింది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

   ఏ దేశ నాగరికత-సంస్కృతికైనా సంగీతం-గానమే గళమిస్తాయని ప్రధాని వ్యాఖ్యానించారు. “సూఫీ, శాస్త్రీయ సంగీత సంప్రదాయాల సమ్మేళనం ప్రేమ, భక్తి సహిత సరికొత్త వ్యక్తీకరణలకు ఊపిరిపోసింది. ఇది హజ్రత్ ఖుస్రో ఖవ్వాలీ; బాబా ఫరీద్ పద్యాలతోపాటు బుల్లా షా, మీర్, కబీర్, రహీమ్, రస్ ఖాన్ తదితరుల కవిత్వంలో ప్రస్ఫుటమవుతాయి. ఈ సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ విధంగా భక్తికి కొత్త కోణాన్ని జోడించారు” అన్నారు.

   సూరదాస్, రహీమ్, రస్ ఖాన్‌ల రచనలు చదివినా, హజ్రత్ ఖుస్రో గీతాలు విన్నా, అవన్నీ ఒకే విధమైన ఆధ్యాత్మిక ప్రేమ భావనకు దారితీస్తాయని శ్రీ మోదీ పేర్కొన్నారు. అప్పుడు మానవ పరిమితుల అవధులు దాటి, జీవాత్మ-పరమాత్మల ఐక్యతానుభూతి మనను నిలువెల్లా ఆవహిస్తుందని చెప్పారు. “రస్ ఖాన్ ముస్లిం అయినప్పటికీ, శ్రీకృష్ణ భక్తికి అంకితమయ్యాడు. ఆయన కవిత్వంలో విశ్వజనీన ప్రేమ, భక్తి స్వభావం వ్యక్తమవుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన భారీ ప్రదర్శన కూడా ఆ లోతైన ఆధ్యాత్మిక ప్రేమ భావనను ప్రతిబింబించింది” అని శ్రీ మోదీ వివరించారు.

   మానవాళి మధ్య ఆధ్యాత్మిక అంతరాన్ని సూఫీ సంప్రదాయం తగ్గించిందని, దేశాల మధ్య అగాధాలకు వారధి కట్టిందని ప్రధాని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని బాల్ఖ్‌లో ఎనిమిది శతాబ్దాల కిందట జన్మించిన రూమీ గురించి ఆ దేశంలో 2015నాటి తన పర్యటన సందర్భంగా అక్కడి చట్టసభలో భావోద్వేగంతో ప్రసంగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు “నేను తూర్పు లేదా పశ్చిమ దిక్కులకు చెందినవాడిని కాను… నేను సముద్రం లేదా భూమి నుంచి పుట్టలేదు.. నాదంటూ ఏ ప్రదేశమూ లేదు.. దిక్కులన్నీ నావే.. ప్రతిచోటా నేనే” అని భౌగోళిక సరిహద్దులకు అతీతంగా ప్రకటించిన రూమీ ఆలోచనలను పంచుకున్నారు. “వసుధైవ కుటుంబకం” (యావత్‌ ప్రపంచం ఒకే కుటుంబం) అనే ప్రాచీన భారత విశ్వాసానికి ఈ తాత్త్వికతను జోడిస్తూ- ప్రపంచ పర్యటనలలో తనకెంతో మనోబలన్నిచ్చేది ఈ దృక్పథమేనని ప్రధాని చెప్పారు. ఇరాన్‌లో సంయుక్త విలేకరుల సమావేశం సందర్భంగా భారత విశ్వజనీన, సార్వత్రిక విలువలను ప్రతిబింబిస్తూ తాను మీర్జా గాలిబ్ ద్విపదను పఠించానని శ్రీ మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

   ‘తుతి-ఎ-హింద్’గా ప్రసిద్ధుడైన హజ్రత్ అమీర్ ఖుస్రో గురించి మాట్లాడుతూ- ‘నుహ్-సిఫర్‌’ వంటి తన రచనలలో భారత్‌ గొప్పదనాన్ని, సౌందర్యాన్ని ప్రశంసించారని శ్రీ మోదీ ప్రస్తావించారు. ఆ కాలంలో ప్రపంచ దేశాలకు భారత్‌ తలమానికమని హజ్రత్ ఖుస్రో అభివర్ణించారని, సంస్కృతాన్ని ప్రపంచ అత్యుత్తమ భాషగా ఆయన పరిగణించారని పేర్కొన్నారు. భారతీయులను మహా పండితులలో అగ్రగణ్యులుగా ఖుస్రో గౌరవించారని శ్రీ మోదీ వెల్లడించారు. “గణిత, విజ్ఞాన, తత్త్వశాస్త్రాలు సహా శూన్యాంకం (సున్నా) గురించి భారతీయ విజ్ఞానం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఎలా విస్తరించిందో.. ముఖ్యంగా భారతీయ గణితం అరబ్బులకు ఎలా చేరిందో, “హింద్సా”గా అది ఎలా ప్రసిద్ధికెక్కిందో కూడా ఖుస్రో సగర్వంగా చాటారని వివరించారు. సుదీర్ఘ వలస పాలన, తదుపరి విధ్వంసాల నేపథ్యంలో భారత్‌ ఉజ్వల చరిత్ర పరిరక్షణతోపాటు ఆ వారసత్వాన్ని సజీవంగా ఉంచడంలో హజ్రత్ ఖుస్రో రచనలు గణనీయ పాత్ర పోషించాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   చివరగా- భారత సాంస్కృతిక వారసత్వాన్ని 25 ఏళ్ల నుంచీ విజయవంతంగా ప్రోత్సహిస్తూ, సుసంపన్నం చేయడంలో జహాన్-ఎ-ఖుస్రో కృషిపై ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని పావు శతాబ్దం నుంచీ అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తుండటం అసాధారణమని శ్రీ ప్రశంసించారు. ఈ వేడుకను ఆస్వాదించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో శ్రీ మోదీ తన ప్రసంగం  ముగించారు.

నేపథ్యం

   దేశంలో విభిన్న కళాసంస్కృతులను ప్రోత్సహించడంలో ప్రధాని శ్రీ మోదీ అగ్రగణ్యులు. ఇందులో భాగంగానే సూఫీ సంగీత-కవిత్వ-నృత్యరీతుల సంబంధిత అంతర్జాతీయ వేడుక ‘జహాన్-ఎ-ఖుస్రో’లో ఆయన పాల్గొన్నారు. అమీర్ ఖుస్రో వారసత్వ సంస్మరణ దిశగా ప్రపంచవ్యాప్త కళాకారులను ఈ వేదిక ఒకచోటకు చేర్చింది. రూమీ ఫౌండేషన్ నిర్వహించిన ఈ ఉత్సవానికి 2001లో ప్రసిద్ధ చిత్రనిర్మాత, కళాకారుడు ముజఫర్ అలీ శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్వహిస్తున్న 25వ వార్షికోత్సవం ఫిబ్రవరి 28న ప్రారంభం కాగా, మార్చి 2 వరకు కొనసాగుతుంది.

 

****