Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిక్కిం ఆర్గానిక్ ఫెస్టివ‌ల్ 2016 ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి ; సుస్థిర వ్య‌వ‌సాయం, రైతాంగ సంక్షేమ జాతీయ స‌ద‌స్సు ప్లీన‌రీలో ప్ర‌సంగం

సిక్కిం ఆర్గానిక్ ఫెస్టివ‌ల్ 2016 ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి ; 
సుస్థిర వ్య‌వ‌సాయం, రైతాంగ సంక్షేమ జాతీయ స‌ద‌స్సు ప్లీన‌రీలో ప్ర‌సంగం

సిక్కిం ఆర్గానిక్ ఫెస్టివ‌ల్ 2016 ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి ; 
సుస్థిర వ్య‌వ‌సాయం, రైతాంగ సంక్షేమ జాతీయ స‌ద‌స్సు ప్లీన‌రీలో ప్ర‌సంగం

సిక్కిం ఆర్గానిక్ ఫెస్టివ‌ల్ 2016 ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి ; 
సుస్థిర వ్య‌వ‌సాయం, రైతాంగ సంక్షేమ జాతీయ స‌ద‌స్సు ప్లీన‌రీలో ప్ర‌సంగం


సిక్కిం రాజ‌ధాని గంగ్ టోక్ లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌ మోదీ ‘సిక్కిం ఆర్గానిక్ ఫెస్టివ‌ల్ 2016’ ని ప్రారంభించారు. ఆయన సుస్థిర వ్య‌వ‌సాయం, రైతాంగ సంక్షేమ జాతీయ స‌ద‌స్సు ప్లీన‌రీలో ప్ర‌సంగించారు కూడా.

ఈ సంద‌ర్భంగా రాష్ర్టాల వ్య‌వ‌సాయ మంత్రులు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల విభాగం క‌మిష‌న‌ర్లు, వ్య‌వ‌సాయ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు రూపొందించిన ఐదు నివేదిల‌కు ప్ర‌ధానికి నివేదించారు.

“సిక్కిం ఆర్గానిక్” లోగోను ప్ర‌ధాని డిజిట‌ల్‌ మాధ్యమం ద్వారా ఆవిష్క‌రించారు. సిక్కింలో అభివృద్ధి చేసిన మూడు ఆర్కిడ్ వంగ‌డాల‌ను కూడా ఆయ‌న ఆవిష్క‌రించారు.

పూర్తిగా ఆర్గానిక్ వ్య‌వ‌సాయం దిశ‌గా సిక్కిం రాష్ట్రం సాగించిన ప‌య‌నానికి గుర్తింపుగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ ప‌వ‌న్ చామ్లింగ్‌ కు రెండు ప్ర‌శంసాప‌త్రాలను ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రదానం చేశారు. అలాగే, సాయిల్ హెల్త్ కార్డుల‌ను 100 శాతం జారీ చేసినందుకు సిక్కింలోని రెండు జిల్లాల‌కు ప్ర‌శంసాప‌త్రాలను కూడా ప్ర‌ధాని అంద‌చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ముందుగా సిక్కిం పూర్వ గ‌వ‌ర్న‌ర్ స్వ‌ర్గీయ శ్రీ రామారావుకు నివాళి అర్పించారు.

రైతాంగం, గిరిజ‌నుల సంక్షేమం ప‌ట్ల సిక్కిం ముఖ్య‌మంత్రి శ్రీ ప‌వ‌న్ చామ్లింగ్ దృక్ప‌థాన్ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు. శ్రీ చామ్లింగ్ ముందుచూపుతో చేప‌డుతున్న చ‌ర్య‌ల వ‌ల్ల‌నే సిక్కిం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తున్న‌ద‌ని ప్ర‌ధాని అన్నారు. ముఖ్య‌మంత్రి ప్ర‌స్తావించిన సంక్షేమ‌, అభివృద్ధి అంశాల‌ను కేంద్ర‌ ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తుంద‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.

రైతుల అతిథిగానే తాను సిక్కిం కు వ‌చ్చాన‌ని ప్ర‌ధాని చెప్పారు. ఈ స‌ద‌స్సులో జ‌రిగిన చ‌ర్చ‌లు భార‌త వ్య‌వ‌సాయ రంగానికి ఒక కొత్త దిశ‌ను ఆవిష్క‌రించ‌నున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ స‌మావేశంలో స‌మ‌ర్పించిన నివేదిక‌లు “సిక్కిం డిక్ల‌రేష‌న్‌”గా చిర‌కాలం గుర్తుండిపోతాయంటూ, వాటి నుంచి అన్ని రాష్ర్టాలు త‌మ‌కు అనుకూల‌మైన అంశాలు ఆచ‌ర‌ణ కోసం తీసుకోవ‌చ్చున‌ని ప్ర‌ధాని సూచించారు.

తీవ్ర సంక్లిష్ట‌త‌లు, పోరాటం మ‌ధ్య కూడా సేంద్రియ వ్య‌వ‌సాయం కోసం తీసుకున్న చ‌ర్య‌ల ద్వారా సిక్కిం చిత్త‌శుద్ధికి ప్ర‌తీక‌గా నిలిచిపోతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. సిక్కిం రైతుల కృషిని ఈ రోజు యావ‌త్ ప్ర‌పంచం గుర్తించింద‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. సేంద్రియ వ్య‌వ‌సాయం విష‌యంలో సిక్కిం సృష్టించిన ప‌వ‌నాలు ఇప్పుడు యావ‌త్ దేశానికి విస్త‌రిస్తాయ‌ని ప్ర‌ధాని అన్నారు.

ఇటీవ‌ల పారిస్‌లో జ‌రిగిన సిఒపి- 21 స‌ద‌స్సులో “బ్యాక్ టు బేసిక్స్” సిద్ధాంతాన్ని బ‌ల‌వంతంగా ప్ర‌స్తావించ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని ప్ర‌ధాని చెప్పారు. ప్ర‌కృతితో సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా జీవించే ఒక అరుదైన విన్యాసాన్ని సిక్కిం ఇప్పటికే విజ‌య‌వంతంగా పూర్తి చేసిందని, కాబట్టి ప్ర‌కృతిని ప‌రిర‌క్షించుకుంటూనే అభివృద్ధి సాధించ‌వ‌చ్చున‌నేందుకు న‌మూనాగా సిక్కిం నిలిచింద‌ని ప్ర‌ధాని చెప్పారు.

కేంద్ర‌ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన స‌ర్వేలో దేశంలోని ప‌ద‌వ స్వ‌చ్ఛమైన న‌గ‌రంగా గంగ్ టోక్ ఎంపిక‌యినందుకు సిక్కిం ప్ర‌జ‌ల‌ను ప్ర‌ధాని ప్ర‌శంసించారు.

ప్ర‌తి రాష్ర్టం ఒక జిల్లాను లేదా ఒక బ్లాక్‌ను ప్ర‌త్యేకంగా గుర్తించి, 100 శాతం సేంద్రియ వ్య‌వ‌సాయాన్ని సాధించుకోవాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. దీని వ‌ల్ల దేశంలో అన్ని రాష్ర్టాల‌కు ఆర్గానిక్ వ్య‌వ‌సాయం విస్త‌రించ‌డంలో ఇది ఒక చోద‌క‌ శ‌క్తిగా నిలుస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

ఇటీవ‌ల ప్ర‌ధాన‌ మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న కింద కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప‌థ‌కం రైతాంగంలో విశ్వాసాన్ని పెంచిందంటూ, బీమా క‌వ‌రేజ్‌ని మ‌రింత‌గా పెంచేందుకు కృషి జ‌ర‌గాల‌ని ప్ర‌ధాని సూచించారు.

సాయిల్ హెల్త్ కార్డుల వంటి ప‌థ‌కాల్లో భాగ‌స్వాములయ్యేందుకు రైతాంగాన్ని ఉత్తేజితం చేయాల‌ని ప్రధాని అన్నారు. దేశ‌వ్యాప్తంగా సాయిల్ లేబ‌రేట‌రీలు ఏర్పాటు కావాలంటూ, వేస‌వి సెల‌వుల్లో పాఠ‌శాల‌ల్లోని ప్రయోగశాలల‌ను కూడా ఇందుకు వినియోగించుకోవ‌చ్చున‌ని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.

రైతాంగం ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు, అవ‌స‌రాలు తీర్చేందుకు కిసాన్ మొబైల్ ఫోన్ వంటి ప్ర‌త్యేక ఉత్ప‌త్తులు రావ‌ల‌సిన అవ‌స‌రం ఉందని ప్ర‌ధాని అన్నారు. ఈ దిశ‌గా స్టార్ట‌ప్‌లు కృషి చేయ‌వ‌చ్చున‌ని ఆయన చెప్పారు. మార్కెట్‌లొ విక్ర‌యించే వాయుపూరితమైన పానీయాల్లో కొంచెం ప‌ళ్ళ‌ ర‌సాన్ని క‌లిపి చూడాల‌న్న త‌న స‌ల‌హాను ఆయ‌న పున‌రుద్ఘాటించారు. సిక్కింలో విమానాశ్రయం ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల‌ ఆర్గానిక్ ఉత్ప‌త్తుల ఎగుమ‌తులు గ‌ణ‌నీయంగా పెరుగుతాయ‌ని ప్ర‌ధాని అన్నారు. గ్రామీణ రహదారుల కార్య‌క్ర‌మం వెనుక ప్ర‌ధాన ల‌క్ష్య‌ం వ్య‌వ‌సాయోత్ప‌త్తుల‌కు మార్కెట్ అనుసంధానం క‌ల్పించడం కూడా అని ఆయ‌న చెప్పారు. మొక్కల పెంప‌కం, ప‌శువుల పోష‌ణ కూడా వ్య‌వ‌సాయ కార్య‌క‌లాపాల్లో అంత‌ర్గ‌త భాగం కావాల‌ని ప్ర‌ధాని సూచించారు.

ప్ర‌తి రాష్ర్టంలో ప్ర‌గ‌తిశీలురైన రైత‌న్న‌లకు ఆన్‌లైన్ వేదిక‌గా నిలచే ఒక డిజిట‌ల్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేయాల‌ని ప్ర‌ధాని స‌ల‌హా ఇచ్చారు.

***